రెండు గ్యాస్ కనెక్షన్లిస్తారట
posted on Oct 23, 2012 @ 10:39AM
ఒక ఇంటికి ఒక గ్యాస్ కనెక్షన్ మాత్రమే.. ఇది చాలాకాలంగా స్ట్రిక్ట్ గా అమలౌతున్న లేదా చమురు కంపెనీలు గట్టిగా అమలు చేయాలని చూస్తున్న పాలసీ.. ఒకే ఇంట్లో రెండు మూడు కుటుంబాలుంటే పరిస్థితేంటి అని చాలామంది చాలాకాలంగా ఆవేదన చెందుతున్నారు. ఒకే కుటుంబంలో తల్లీతండ్రీ, పెళ్లైన కొడుకూ కోడలూ విడివిడిగా ఉంటున్నా రెండు కనెక్షన్లు ఇవ్వలేమని గ్యాస్ కంపెనీలు తేల్చి చెప్పాయి. కేంద్ర తీసుకున్న కొత్త నిర్ణయంవల్ల చాలామందికి వంటగ్యాస్ అందుబాటులో ఉండే పరిస్థితి లేదు. కచ్చితంగా గ్యాస్ కావాలంటే అయినవాళ్లని వదులుకుని మరో చోట వేరే కాపురం పెట్టక తప్పనిపరిస్థితి. ఇకపై అలాంటి భయాలేవీ పెట్టుకోవాల్సిన అవసరం లేదని చమురు కంపెనీలు మార్కెటింగ్ శాఖలు సామాన్యులకు చిన్నపాటి భరోసా ఇస్తున్నాయి. ఒకే ఇంట్లో రెండు వంటగదుల్ని చూపిస్తే రెండు కనెక్షన్లకు ఢోకా లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నాయ్. ఇది నిజంగా నిజమైతే బాగుండని లక్షలాది కుటుంబాలు కోరుకుంటున్నాయ్. అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగితే ఒకే ఇంట్లో ఉంటున్న రెండు కుటుంబాలకు రెండు కనెక్షన్లు ఇవ్వాలన్న ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ రావొచ్చని అధికారులు చెబుతున్నారు. కాకపోతే రెండు వంటగదుల్ని తప్పని సరిగా చూపించాలన్న నిబంధనను మాత్రం కచ్చితంగా పాటించి తీరాలట.