కాశ్మీర్ లో విజయవాడ విద్యార్థి మృతి

విజయవాడ నుంచి జమ్మూకాశ్మీర్‌కు విహారయాత్రకు వెళ్లిన ఓ విద్యార్థి కాశ్మీర్‌లోని కుప్వారా వద్ద గుర్రంపై స్వారీ చేస్తూ ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. విజయవాడ పీబీ సిద్ధార్థ పబ్లిక్ స్కూలులోని విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ఈనెల 17న విహారయాత్రకు జమ్ము కాశ్మీర్‌లోని శ్రీనగర్ ప్రాంతానికి తీసుకొని వెళ్ళింది. శ్రీనగర్ నుంచి కుప్వారా ప్రాంతానికి విద్యార్ధులు గుర్రాలపై స్వారీ చేసేందుకు వెళ్ళారు. హేమంత్ ఎక్కి స్వారీ చేస్తున్న గుర్రం అదుపు తప్పి ప్రమాదవశాత్తు మంచుగడ్డలపై జారిపడి ఊపిరాడక అక్కడికక్కడే మరణించాడు. హేమంత్ బంధువులకు పాఠశాల యాజమాన్యం ఈ సమాచారాన్ని అందజేసింది. శ్రీనగర్‌లోని ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయిన తర్వాత మృతదేహాన్నినగరానికి తీసుకురానున్నట్టు చెప్పారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.