అసోం అల్లర్ల వెనక పాకిస్తాన్ కుట్ర
posted on Aug 19, 2012 @ 12:28PM
అసోంలో చెలరేగిన హింసాకాండ వెనక పాకిస్తాన్ కుట్ర దాగి ఉందని భారత సర్కారు గుర్తించింది. ఆ దేశానికి చెందిన కొన్ని బ్లాగుల్లో ఉంచిన నకిలీ ఫోటోలే హింసకు కారణమయ్యాయని... హోంశాఖ విచారణలో తేలింది. దీనిపై పాకిస్తాన్‌ను నిలదీసేందుకు భారత్ సిద్ధమవుతోంది. మరోవైపు.. అల్లర్లు క్రమంగా మిగతా ప్రాంతాలకూ పాకుతుండడం ఆందోళన కలిగిస్తోంది..
అల్లర్ల వ్యవహారంపై విస్తృత స్థాయిలో దర్యాప్తు చేపట్టిన హోంశాఖ... వీటికి కారణమైన ఫోటోలు ఎలా వ్యాపించాయన్న దానిపై దృష్టి సారించింది. ఇంటర్‌నెట్‌లోని పలు సైట్లలో కనిపించిన ఈ నకిలీ ఫోటోలు.. పాకిస్తాన్ నుంచి అప్‌లోడ్ అయినట్లు.. హోంశాఖ కార్యదర్శి ఆర్ కే సింగ్ ప్రకటించారు. ఎక్కడో భూకంపం, తుఫాను వచ్చినప్పుడు చనిపోయిన వారి ఫోటోలను... అల్లర్లలో చనిపోయిన మైనార్టీలుగా చూపిస్తూ.. రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని.. వెల్లడించారు. ఇప్పటికే ఈ ఫోటోలు ఉన్న 76 సైట్లను నిలిపివేశామని చెప్పారు. ఈ విషయంపై వెంటనే పాకిస్తాన్‌ను వివరణ కోరుతామని.. అన్ని స్పష్టమైన ఆధారాలు ఉన్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఆ దేశం ఎలా స్పందిస్తుందో చూడాలని.. హోంశాఖ వర్గాలు అన్నాయి.