జగన్ బెయిల్ పై తారాస్థాయి బెట్టింగులాట
posted on Oct 5, 2012 @ 10:57AM
జగన్ కి బెయిలొస్తుందా రాదా..? రాష్ట్రంలో ఇప్పుడిదే హాట్ టాపిక్. సామాన్యులకుకూడా దీనిమీదే ఆసక్తి. శుక్రవారం జరగబోయే విచారణలో జగన్ కి బెయిలొస్తుందని కొందరు, రాదని కొందరు పోటీలుపడి పందాలు కట్టుకుంటున్నారు. ఈ బెట్టింగుల స్థాయి కోట్లరూపాయల్లో జరుగుతోందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వరల్డ్ కప్ మ్యాచ్ మీదకూడా ఇంతపెద్దమొత్తంలో బెట్టింగులాట జరగలేదని బెట్టింగుల్లో ఆరితేరినవాళ్లుకూడా నోరెళ్లబెడుతున్నారని సమాచారం. జగన్ కి బెయిల్ మంజూరౌతుందని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి ఆశలతో ఉంది. జగన్ వ్యతిరేకవర్గంమాత్రం ఆరునూరైనా బెయిల్ దొరకనే దొరకదంటూ గట్టిగానే ప్రచారం మొదలుపెట్టేసింది. రెండింటిలో ఏదినిజమవుతుందో తెలియని ఉత్మంఠ పెరిగిపోవడంతో బెట్టింగు రాయుళ్ల పని మూడుపూలు ఆరుకాయలుగా సాగుతోందని వినికిడి. కొందరు కాస్త తెలివితేటల్ని ఉపయోగించి అయినవాళ్లతోనే రెండువైపులా పందేలుపెట్టి నో లాస్ నో ప్రాఫిట్ బేసిస్ కి కూడా సిద్ధపడి బెట్టింగులు కట్టుకుంటున్నారని గోదావరిజిల్లాల్లో ప్రచారం జరుగుతోంది. ఇంట్లో ఇద్దరుంటే చెరోపక్క బెట్టింగ్ భారీగా పెట్టేస్తే రెండిట్లో ఏదోఒకటి కచ్చితంగా నిజమవ్వాలిగనక దెబ్బతినకుండా జాగ్రత్తపడొచ్చని చాలామంది పార్టీలకతీతంగా ప్లాన్ చేస్తున్నారనికూడా వినికిడి.