పరిటాల కోటలో చంద్రబాబు పాదయాత్ర
posted on Oct 4, 2012 @ 5:02PM
వస్తున్నా మీకోసం పాదయాత్రకు ప్రజల నుండి వస్తున్న అనూహ్య స్పందన పార్టీ నేతలను, కార్యకర్తలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అనుకున్న దానికంటే ఎక్కువగా స్పందన వస్తుండటంతో 2014 సాధారణ ఎన్నికలే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. గురువారం మధ్యాహ్నం పెనుగొండ రోడ్డులోని శ్రీకృష్ణదేవరాయ విగ్రహం వద్ద చంద్రబాబు నాయుడు ఉప్పర్ల సంఘంతో సమావేశమయ్యారు. ఉప్పర్ల సంఘం సభ్యులు తమ సమస్యలను బాబు వద్ద మొరపెట్టుకున్నారు. కాగా 'వస్తున్నా... మీ కోసం' పాదయాత్ర సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు అనంతపురం జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గురువారం ఉదయం సోమందేపల్లి నుంచి యాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి వెంకటాపురం తాండి, రొద్దం దర్గా సర్కిల్, కోనాపురం క్రాస్‌రోడ్స్ మీదుగా మహదేవపురి వరకు యాత్ర సాగనుంది. సాయంత్రం ఎల్‌జీబీ నగర్ క్రాస్‌రోడ్సకు చేరుకుని రాత్రికి అక్కడే బసచేయనున్నారు. ఈరోజు దాదాపు 14 కిలోమీటర్ల వరకు పాదయాత్ర కొనసాగనుంది.