పర్యాటకులకు రక్షణ కరువు?
posted on Oct 5, 2012 8:49AM
రాష్ట్రంలో పర్యాటకులకు రక్షణ కల్పించలేని వాతావరణం నెలకొంది. ప్రత్యేకించి పూర్తిస్థాయి అభివృద్థి చెందిన టూరిస్టు ప్రాంతాలపైనే ప్రభుత్వం దృష్టిసారించింది. దీంతో కొత్తగా అభివృద్థి చెందాల్సిన పర్యాటక ప్రాంతాల గురించి అస్సలు ప్రణాళికే లేకుండా పోయింది. ప్రభుత్వమే ప్రణాళిక రూపొందించుకోకపోవటంతో ఇక్కడ పోలీసుల నుంచి తప్పించుకు తిరిగేవారు ఆశ్రయం పొందుతున్నారు. పర్యాటక ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందని జలపాతాల వద్ద అయితే అస్సలు రక్షణ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. తమిళనాడు వంటి పొరుగురాష్ట్రాలను పరిశీలిస్తే జలపాతాలు వంటి వాటి దగ్గర రక్షణచర్యలు గట్టిగా ఏర్పాటు చేశారు. అందువల్ల అక్కడ మరణాలు, ఇతర క్రైమ్ జరిగే అవకాశాలు తక్కువ. రాష్ట్రంలో మాత్రం నేరాలు జరిగే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. దీనికి తాజా ఉదాహరణ చిత్తూరు జిల్లా భైరెడ్డిపల్లి మండలం కైగల్ జలపాతం వద్ద ఓ ప్రేమజంటను గుర్తుతెలియని కొందరు వేధించారు. కర్నాటకలోని బంగారుపేటకు చెందిన ఆ జంటలోని యువతిపై అత్యాచారం చేశారు. ఈ జంటను చికిత్స నిమిత్తం వి.కోట ఆసుపత్రికి తరలించారు.