ఈ వజ్రాల వ్యాపారి... నిజంగా వజ్రమే!
posted on Oct 28, 2016 @ 1:14PM
వ్యాపారం అంటే ఏంటి? మనదగ్గర వున్నది అమ్మటం. డబ్బులు సంపాదించటం. ఇంతే! కాని, బిజినెస్ కి చాలా కోణాలుంటాయి. వ్యాపారం మంచిగా చేస్తే కళ. తప్పుగా చేస్తే పీడకల. కాని, దుర్మార్గంగా చేస్తే, వ్యాపారం రక్తపాతం కనిపించని యుద్ధం! అవును, చాలా మంది కార్పోరేట్ వ్యాపారులు అమానుషమైన వ్యాపారం చేస్తుంటారు. తమ లాభాల కోసం లక్షల జీవితాలు నాశనమైనా పట్టించుకోరు. కాలుష్యమైనా కేర్ చేయరు. సంస్కృతి ధ్వంసం అయినా వెనక్కి తగ్గరు. ఇలా బోలెడు అరాచకాలు నిత్యం బడాబడా బిజినెస్ మెన్ చేస్తూనే వుంటారు...
వ్యాపారం చేసే వారి గురించి నెగటివ్ గా చెప్పుకోవాలంటే చాలానే వుంటుంది. కాని, వాళ్ల గురించి పాజిటివ్ గా కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే, ఒక్క ధీరూ భాయ్ అంబానీనో, ఒక్క రతన్ టాటానో సృష్టించిన ఉద్యోగాలు దేశదేశాల ప్రభుత్వాలు కూడా సృష్టించలేవు. ఒక్క నిజాయితీ గల వ్యాపారవేత్త ఎన్నో జీవితాల్ని, కుటుంబాల్నీ వెలుగులమయం చేయగలుగుతాడు. ఆ కోణంలో వాళ్లది దేశానికి చేసే ఆర్దిక సేవ అనవచ్చు!
మంచి వ్యాపారస్థుడు కాదు... వెరీ వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్ అంటే మనం తప్పక చెప్పుకోవాల్సిన వ్యక్తి ... సావ్ జీ ధోలకియా! ఎవరీయన అంటారా? భారతీయ వ్యాపారానికి కాశీ లాంటి సూరత్ నగరంలో ఒక వజ్రాల వర్తకుడు. అయితే, విశేషం ఏంటంటే, గుజరాతీ బిజినెస్ మ్యాన్ కాబట్టి పరమ పిసినారి అనుకోకండి. మహాఆదర్శవంతమైన వ్యాపారి. ఈసారి దీపావళి సందర్భంగా తన ఉద్యోగుల ముఖాల్లో వెలుగులు నింపటానికి ఆయన ఏం చేశారో తెలుసా? అత్యుత్తమ ప్రతిభ, కృషి కనబరిచిన ఎంప్లాయిస్ కి 400ఫ్లాట్లు బోనస్ కింద ఇచ్చాడు. అంతే కాదు, 1260కార్లు కూడా ఇచ్చాడు! బోనస్ గా ఇంటి స్థలాలు, కార్లు అంటే నమ్మబుద్ధికావటం లేదా? అలాంటి నమ్మశక్యం కాని పండగ బహుమతే ఇచ్చాడు ధోలకియా!
సావ్ జీ ధోలకియాది ఖరీదైన వజ్రాల వ్యాపారం కాబట్టి ఇళ్లు, కార్లు బోనస్ గా ఇస్తాడు. అందరూ వ్యాపారస్థులు అలా ఇవ్వాలంటే కుదరదు కదా? కాని, ఎవరికి తగ్గట్టుగా వారు తమ వద్ద ఉద్యోగాలు చేస్తున్న వారి మనసులు ఆనందంగా వుండేలా పండుగ గిఫ్ట్ లు ఇస్తే బావుంటుంది కదా! కంపెనీ సీఈవో అయినా ఇంట్లో పని చేసే మెయిడ్ అయినా... ఊహించని బహుమతి ఒకటి వస్తే ఖచ్చితంగా మురిసిపోతారు. మరీ ముఖ్యంగా, చాలీ చాలనీ జీతాలు సంపాదించుకునే చిరు ఉద్యోగులు ఒక స్వీట్ బాక్స్, నాలుగు ఖరీదైన చాక్లెట్లు వస్తే కూడా జాగ్రత్తగా తమ పిల్లలకి పట్టుకెళతారు! వాళ్లకి ఆ సంతోషం ఇవ్వటమే అసలైన దీపావళి! దీన్ని బాగా అర్థం చేసుకున్నాడు సావ్ జీ ధోలకియా. ఈ యేడే కాదు గతంలోనూ ఆయన దీపావళి బోనస్ లు భారీగా ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నాడు...
పోయిన సంవత్సరం ధోలకియా తన హరే కృష్ణ ఎక్స్ పోర్ట్స్ తరుఫున 200ఫ్లాట్లు ఉద్యోగులకి ఇచ్చాడట! 491కార్లు కూడా ఇచ్చాడు! ఇవాళ్ల కోట్ల రూపాయల లాభాన్ని బోనస్ గా ఉద్యోగులకి పంచి పెడుతోన్న ధోలకియా ఒకప్పుడు సాదాసీదా వ్యాపారే. బంధువు వద్ద అప్పు తీసుకుని పెట్టిన పెట్టుబడితో ఏళ్ల తరబడీ కఠిన శ్రమ చేసి వ్యాపారాన్ని అభివృద్ధి చేశాడు. అంతే కాదు, ఈ మధ్యే తన స్వంత కొడుకుని కేవలం 7వేల రూపాయలు ఇచ్చి కేరళలోని కొచ్చీకి పంపాడు. అక్కడ మూడు జతల బట్టలతోనే నివాసముంటూ స్వయంగా ఉద్యోగం వెదుక్కుని జీవితం నెట్టుకొచ్చాడు. అలా చేస్తేనే లైఫ్ అంటే ఏంటో అర్థమవుతుందంటాడు ధోలకియా! ఇలాంటి తెలివే కాదు... మనసున్న వ్యాపారస్థులు ఎంత ఎక్కువైతే దేశం అంత గొప్పగా దీపావళి జరుపుకుంటుంది! అంతే కదా...