మూడు ముళ్లుండవ్... మూడొస్తే విడిపోవచ్చు!
posted on Nov 3, 2016 @ 4:54PM
గౌతమీ కమల్ హసన్ నుంచి విడిపోయింది! ఇది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్! కారణం ఏంటి? దీనిపై బోలెడన్ని విశ్లేషణలు! ఒకరు పాలిటిక్స్ లోకి ఎంట్రీ అంటే... మరొకరు శ్రుతీహసన్ కారణం అంటారు! కాదు కాదు నా కూతుర్ని చూసుకోటానికి నేను కమల్ కు దూరమయ్యానని గౌతమి అంటుంది. కమల్ హసన్ ఏమో నాకింకా గౌతమి అంటే బోలెడంతా ప్రేమ అంటాడు. ఆమెకు నేనున్నానని పబ్లిగ్గా భరోసా ఇస్తాడు! మధ్యలో శృతీ హసన్ కూడా నాకేం సంబంధం లేదని క్లారిటీ ఇస్తుంది! అసలేం అవుతోంది? మీడియాకి, జనాలకి ఎక్కడలేని ఆసక్తి. కాని, పెద్దగా తెలుసుకోగలిగిందేం లేదు!
గౌతమీ, కమల్ విడిపోవటం వాళ్ల పర్సనల్ ఇష్యూ. దానిపై ఆరా తీయటమే వృథా ప్రయాస. అయితే, వాళ్లు సెలబ్రిటీలు కాబట్టి కొంత ఇంట్రస్ట్ వుండటం సహజమే. కాని, అంతకంటే ఎక్కువ చర్చకు దారితీస్తున్న కారణం... సహజీవనం! గౌతమీ, కమల్ పెళ్లాడలేదు. జస్ట్ ఒకరికి ఒకరు నచ్చారు కాబట్టి కలిసి వుండిపోయారు. దీన్నే మనం సహజీవనం అంటున్నాం. అసలు ఇలా పెళ్లి లేకుండా ఇద్దరు ఒకే ఇంట్లో వుంటారని 30ఏళ్ల కింద ఎవరూ ఆలోచించి వుండరు. అంతకంటే ముందైతే ఊహించి కూడా వుండరు! కాని, ఇప్పుడు గౌతమీ , కమల్ లాంటి పెళ్లికాని భార్య, భర్తలు బోలెడుమంది! సెలబ్రిటీలైతే వారికి పబ్లిసిటీ కూడా ఎక్కువగానే వస్తుంటుంది! ఈ కోవలో మనం ఆసక్తిగా చెప్పుకోవాల్సిన జంట పవన్ , రేణు...
తెలుగు సినిమా హీరోలు తమ లవ్ గురించి బయట చెప్పుకోటానికే నానా ఇబ్బంది పడతారు. కాని, పవన్ కళ్యాణ్ డిఫరెంట్ స్టైల్లో ముందుకు పోయాడు. తాను లవ్ చేసిన రేణుదేశాయ్ ని పెళ్లి చేసుకోకుండానే ఇంట్లోకి ఆహ్వానించాడు. కుడి కాలు పెట్టిన ఆమె ఓ బాబు పుట్టాక తీరిగ్గా పెళ్లి చేసుకుంది. అదీ ప్రజా రాజ్యం పార్టీ పెట్టిన సందర్భంలో ఎదురైన రాజకీయ విమర్శల నేపథ్యంలో చేసుకోవాల్సి వచ్చింది. లేకుంటే పవన్, రేణు మూడు మూళ్లు, ఏడు అడుగుల స్ట్రెయిన్ తీసుకునే వారే కాదు. అయితే, విచిత్రంగా, పెళ్లి చేసుకోక ముందు బాగానే వున్న పవర్ స్టార్, రేణు అగ్ని సాక్షిగా ఒక్కటై అమాంతం విడిపోయారు. ఇప్పుడు పవన్ మరోసారి ఇంకో అమ్మాయితో సహజీవనమే చేస్తున్నాడు!
పవన్ రేణు దేశాయ్ లాంటి సినిమా జంటలు ఇంకా చాలా చెప్పుకోవచ్చు. జాన్ అబ్రహాం, బిపాషా మొదలు రణబీర్ , కత్రీనా వరకూ అందరూ హ్యాపీగా కాపురం పెట్టేసిన వారే! పైగా ఈ పెళ్లి కాని వైవ్స్ అండ్ హజ్బెండ్స్ ప్రౌడ్ గా మీడియాకి ఫోజులు, ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. ప్రభుదేవ , నయనతార లాంటి వాళ్ల సహజీవన కహానీలైతే నానా రచ్చ కూడా అయ్యాయి.
సెలబ్రిటీలు ఇంత దైర్యంగా లివిన్ రిలేషన్ షిప్పులకి ఓటు వేయటానికి కారణం ఏంటి? సహజీవనంలో వున్న లాభాలే! పెళ్లి అంటూ ఒక బాండ్ వుండదు కాబట్టి గౌతమీ, కమల్ హసన్ లా ఎన్ని ఏళ్లు అయ్యాక అయినా విడిపోవచ్చు. కోర్టులకు వెళ్లడాలు, జడ్జ్ లను ఒప్పించడాలు వగైరా వగైరా ఏమీ వుండవు. ఇద్దరూ పరస్పరం ఒప్పుకుని విడిపోవచ్చు. అలాగే, కులాలు, మతాలు, ఆస్తులు, అంతస్థులు లాంటి పట్టింపులు కూడా అడ్డురావు. నచ్చితే కలిసి నడవటమే. నచ్చని రోజు ఎవరి లగేజ్ వారు సర్దుకుని మరో ఇంటికి వెళ్లిపోవటమే. కాని, సహజీవనంలో ఎలాంటి సమస్యలుండవా? ఖచ్చితంగా వుంటాయి!
సహజీవనం అంటే సంప్రదాయవాదులు బెంబేలెత్తిపోతారు. వాళ్లు భయపడ్డంత భయపడకపోయినా సమాజంలో ఎదురయ్యే అనుభవాలకు మానసికంగా సిద్ధపడి వుండాలి. ఇప్పటికీ పెళ్లిని సీరియస్ గా తీసుకుని కట్న, కానుకులతో భారీగా చేసుకునే మన సమాజంలో సహజీవనం తప్పే. అలాంటి తప్పు చేశాక అందరూ అనుమానంగా చూసే ప్రమాదం లేకపోలేదు. మరో వైపు సహజీవనం సెలబ్రిటీలకు వర్కవుట్ అయినట్టు అందరికీ వర్కవుట్ అవుతుందని గ్యారెంటీ లేదు. లివిన్ రిలేషన్ షిప్ లో సంతానం కలిగితే వాళ్ల బాధ్యత తరువాత ఎవరిది? జీవితాంతం కలిసుండకుండా మూడ్ ఛేంజ్ కాగానే విడిపోయినప్పుడు పిల్లల్ని తల్లే చూడాలా? ఆర్దికంగా తండ్రి బాద్యత ఎంత? ఒకవేళ అతను పట్టించుకోకపోతే? మళ్లీ కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది! ఇలాంటి ప్రాక్టికల్ సమస్యలు చాలా వుంటాయి. పెళ్లిలో వున్న సామాజిక భద్రత స్త్రీకి సహజీవనంలో వుంటుందని గట్టిగా చెప్పలేం...
సహజీవనం వల్ల లాభాలు ఎక్కువున్నా, నష్టాలు ఎక్కువున్నా స్లోగా దాని క్రేజ్ పెరుగుతోందన్నది మాత్రం నిజం. బాగా చదువుకుని బారీ ఉద్యోగాలు చేస్తూ ఇంటికి దూరంగా వుంటోన్న యూత్ చాలా మంది కలిసి కాపురాలు పెట్టేస్తున్నారు. పెళ్లి సంగతి వీలున్పప్పుడు చూసుకుందాం అనుకుంటున్నారు. అమెరికా లాగా అభివృద్ధి కావాలంటే అమెరికా లాగే సంస్కృతిలో మార్పు కూడా అనివార్యం. ఇప్పుడు మనకిష్టం వున్నా లేకున్నా యాక్సెప్ట్ చేయాల్సిందే. కాని, ఈ సహజీవన సంస్కృతి వేల సంవత్సరాల మన కుటుంబ వ్యవస్థని ఎంత మేర దెబ్బతిస్తుందన్నదే పెద్ద ప్రశ్న! దానికి కాలమే సమాధానం...