రాజకీయ కబేళాలో... భారతీయ గోవు!
posted on Nov 8, 2016 @ 1:49PM
కొందరు మోదీ వ్యతిరేకులు, మరీ ముఖ్యంగా వామపక్ష భావజాలం వున్న వారూ ఈ మధ్య ఓ మాట అంటూ వస్తూన్నారు! ప్రస్తుత భారతదేశంలో మనిషిగా పుట్టటం కన్నా ఆవుగా పుట్టడం బెటర్ అంటున్నారు! దీని వెనుక నేపథ్యం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా? మోదీ ప్రధాని అయినప్పట్నుంచీ గోవుకి ఎక్కడ లేని రాజకీయ ప్రాముఖ్యం వచ్చేసింది. నిజానికి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గోవధ నిషేధాన్ని తీవ్రంగా అమలు పరుస్తున్న దాఖాలు ఏం లేవు. కాని, ఆవు చుట్టూ వివాదాలు మాత్రం అలుముకుంటున్నాయి. వాటి గో సంబంధమైన పండుగ జరుపుకుంటోన్న ఇవాళ్టి రోజు మనం మాట్లాడుకుని తీరాల్సిందే!
కార్తిక శుద్ధ అష్టమిని గోపాష్టమి అంటారు. ఇది మన పండుగల్లో ఒకటి. కాని, ప్రస్తుతం దీని గురించి తెలిసిన వారు చాలా తక్కువ. అసలింతకీ ఈ రోజు ఏమైందంటే, ద్వాపర యుగంలో... శ్రీకృష్ణుడు గోవుల్ని తీసుకుని యుమున తీర ప్రాంతాలకు వెళ్లాడు. అలా మొదటిసారి గోవిందుడు గోపాలుడై బయలుదేరిన రోజే కార్తీక శుద్ధ అష్టమి. దాన్నే గోపాష్టమి అంటారు.
గోపాష్టమి నాడు గోవుల్ని పూజించటం ఎప్పుట్నుంచో కొనసాగుతూ వస్తోంది. అయితే, రాజకీయంగా ఆవు కేంద్ర బిందువైన ఈ తరుణంలో గోపాష్టమి పండుగకి రాజకీయ ప్రాముఖ్యత కూడా ఏర్పడింది. వీహెచ్ పీ లాంటి హిందూ మత సంస్థలు గోపాష్టమిని తమకు వీలైన రీతిలో నిర్వహిస్తూ వస్తున్నాయి. ముందు ముందు ఈ రోజుకి మరింత ఆకర్షణ పెరిగే అవకాశాలే వున్నాయి. అందుకు కారణం సమస్త సనాతన గ్రంథాల్లో ఆవుకు, ఆవు పూజకు వున్న విశిష్టతే! అసలు గో మహిమ ఇప్పటిది కాదు. ఆరెస్సెస్, వీహెచ్ పీ లాంటి సంస్థలు ముస్లిమ్ లను, దళితుల్ని టార్గెట్ చేయటానికి ముందుకు తీసుకొచ్చిన ఎజెండా కూడా కాదు. యుగయుగాలుగా గోవు మనకు మహిమాన్విత జంతువే. అందుకే, గో వధ అన్నిటికంటే మహా పాపం అన్నారు పెద్దలు. కాని, అదే సమయంలో మన సమాజంలో కొందరు గో మాంసం తినటం వివాదాస్పదం అవుతూ వస్తోంది. మరీ ముఖ్యంగా, గో వధ నిషేధం తమ ఎజెండాలో వున్న బీజేపి అదికారంలోకి రావటంతో గోవు మరింత గోలకు కారణం అవుతోంది. అసలింతకీ రాజ్యాంగం ఏం చెబుతోంది?
గో వధ నిషేధించాలన్నది హిందూ మత సంస్థలు, బీజేపి పార్టీ చేస్తున్న రాజకీయ నినాదం మాత్రమే కాదు. రాజ్యాంగం కూడా దేశీయ గో సంతతిని, ఇతర పశువుల్ని కాపాడాలని సూచించింది. కొన్ని రాష్ట్రాలు గో వధ నిషేధం బిల్లు కూడా పాస్ చేశాయి. కాని, అమలులో మాత్రం ఎక్కడా గట్టి ప్రయత్నం జరగటం లేదు. గోవుల అక్రమ రవాణ, దానికి వ్యతిరేకంగా గో సంరక్షకుల ఉద్యమాలు, దాడులు వగైరా వగైరా అన్నీ కలిసి పెద్ద రచ్చకి దారి తీస్తున్నాయి. దాద్రి సంఘటన తరువాత జరిగిన దుమారం ఇందుకు చక్కటి ఉదాహరణ...
గోవుల్ని రక్షించే నెపంతో హిందూ అతి వాదులు ఎవరి మీద చేయి చేసుకున్నా అది సమర్థనీయం కాదు. కాని, అదే సమయంలో అభ్యుదయవాదులు , వామపక్ష భావజాలం వున్న వారు ముస్లిమ్ లను, దళితుల్ని వివాదంలోకి లాగి జాతీయ శ్రేయస్సు దెబ్బ తీయటం కూడా సరి కాదు. గో వధ నిషేదాన్ని అత్యధిక శాతం హిందువుల విశ్వాసానికి సంబంధించిందిగా చూడాలి. అంతే తప్ప అగ్ర వర్ణ హిందువులు, బీసీలు దళితుల మీద చేస్తున్న దాడిగా చూడకూడదు. అలా చిత్రీకరించే కుట్రలు కూడా చేయకూడదు. చాలా దేశాల్లో చాలా విశ్వాసాల ఆధారంగా నిషేధాలు కొనసాగుతుంటాయి. అలాగే భారతదేశంలో ఆవుని చంపకుండా వుండేలా చర్యలు తీసుకుంటే ఉత్తమం. దాని వల్ల దళితులు, ముస్లిమ్ లు, క్రిస్టియన్ల వంటి వారు ఇబ్బంది పడితే వారి సమస్యలు పరిష్కరించాల్సిన బాద్యత ప్రభుత్వాలది. అంతే తప్ప మెజార్జీ ప్రజల మత విశ్వాసాన్ని వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో లెక్కచేయకపోవటం దురుసుతనమే అవుతుంది.
మత సంబంధమైన విశ్వాసం కారణంగానే గో వధ నిషేధం డిమాండ్ వినిపిస్తున్నప్పటికీ ఎన్నో సైంటిఫిక్ స్టడీస్ కూడా దాని అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి. గోవులు వాతావరణ సమతుల్యానికి ఉపయోగకరమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అందులో నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం కూడా గవర్నమెంట్స్ చేయాలి. అంతే కాక, గో మూత్రం, పేడ వంటి వాటికి కూడా ఆరోగ్య సంబంధమైన ప్రాముఖ్యత వుంది కాబట్టి వాటికి మార్కెటింగ్ కల్పించాలి. ఇవే కాక వేలాది హిందూ దేవాలయాల్ని తన ఆధీనంలో వుంచుకున్న దేవాదాయ ధర్మదాయ శాఖ బాధ్యతగా గోవుల్ని సంరక్షించాలి. దాని వల్ల హిందువుల మనో భావాలు కాపాడబడటమే కాక పురాణాల్లో చెప్పినట్లు సమాజానికి, దేశానికి కూడా హితం జరగవచ్చు.
శ్రీకృస్ణుడు ఈ దేశంలో దేవుడు. ఆ దేవుడే స్వయంగా గోవులకి కాపరి అయ్యాడు. ఆయన తొలిసారి గోవుల వెంట కదిలిన రోజే ఈ గోపాష్టమి. దీన్ని బట్టే ఇక్కడ యుగయుగాలుగా గోవుకు ఎంత ఉన్నత స్థానం వుందో తెలుస్తోంది. మరి అటువంటి సున్నితమైన అంశాన్ని రాజకీయ పార్టీలు, ఇతర సంఘాలు రాజకీయం చేయకుండా గో వధ నిషేధం అమలు దిశగా అడుగులు వేస్తే ఎంతో బావుంటుంది. అది ఇప్పుడే సాద్యమయ్యేలా కనిపించకున్నా ముందు ముందు జరగాలని కోరుకుందాం...