న్యాయం దక్కని... జాతీయ ఐక్యత సాధ్యమేనా?
posted on Oct 31, 2016 @ 2:20PM
అక్టోబర్ 31... జాతీయ ఐక్యతా దినం! ఎందుకో తెలుసా? ఇవాళ్ల సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి! అందుకే, జాతీయ ఐక్యత దినోత్సవంగా నిర్ణయించారు! కాని, ఇదే రోజు జాతీయ ఐక్యత గురించి మనకు పెద్ద గుణపాఠం కూడా ఎదురైంది. దాన్నుంచి మనం ఎంత నేర్చున్నాం అన్నది కాలమే నిర్ణయించాలి...
ఒక కాంగ్రస్ ఉప ప్రధాని పుట్టిన రోజే మరో కాంగ్రెస్ ప్రధాని నేలకొరిగిన రోజు కావటం నిజంగా విషాదమే! కాని, అక్టోబర్ 31న అదే జరిగింది. ఇందిరా గాంధీ ఆమె అంగరక్షకుల చేతిలో ఇవాళ్లే అంతమైంది. అలా సటేల్ జయంతి, ఇందిర వర్ధంతి రెండూ ఇవాళ్లే అయ్యాయి. కాని, అక్టోబర్ 31కి అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత వుంది. అది ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన రోజు కాదు. భారతదేశ జాతీయ ఐక్యత దినోత్సవం! కాని, 1984లో ఇందిర హత్యకు గురైన వెంటనే జరిగింది ఏంటో తెలుసా? దారుణమైన మారణకాండ! అదీ ఒక మైనార్టీ వర్గం మీద! వేల మంది కొన్ని గంటల్లో నేల రాలిపోయారు. అంతకంటే విషాదం, వాళ్లని కాపాడాల్సి వుండాల్సిన వ్యక్తే ... ఒక పెద్ద చెట్టు కూలినప్పుడు చుట్టూ వున్న భూమి కంపిస్తుంది... అనేశాడు దుర్మార్గంగా! ఆయనెవరో కాదు... ఇందిర తరువాత దేశ ప్రధాని అయిన ఆమె కొడుకు రాజీవ్ గాంధీ...
ఇందిరా గాంధీ పంజాబ్ రాజకీయాలకు స్పందించిన తీరు ఆమెకు ప్రాణ గండం తెచ్చిపెట్టింది. అక్కడి వేర్పాటు వాదుల్ని మొదట్లో కాంగ్రెస్ కొంత కాలం వెనకేసుకొచ్చిందంటారు విమర్శకులు. అకాలీదళ్ లాంటి పంజాబీ శక్తుల్ని ఎదుర్కోటానికి వేర్పాటు వాదులు అవసరం అయ్యారట. కాని, తరువాత అదే వేర్పాటువాదులు దేశం నుంచి విడిపోయి ఖలిస్తాన్ ఏర్పాటు చేసుకుంటామంటే ఇందిరా గాంధీకి హింస తప్ప మరో మార్గం లేకపోయింది. దాని ఫలితమే ఆపరేషన్ బ్లూ స్టార్. కాని, పంజాబ్ నుంచి దేశం నుంచి విడిపోకుండా కాపాడిన ఆమె తానే బుల్లెట్లకు బలవ్వాల్సి వచ్చింది. తన స్వంత సిక్కు బాడీ గార్డ్సే ఆమెను కాల్చేశారు.
ఇందిర చనిపోయిన కొన్ని గంటల తరువాత కాంగ్రెస్ కార్యకర్తలు, ఇతర గూండాలు, రౌడీలు తమ రాక్షస రూపం బయటకు తీసుకొచ్చారు. సిక్కుల వల్ల ఆమె చనిపోయారు కాబట్టి దేశ రాజధానిలోని వేలాది మంది సిక్కులకి మరణ శిక్ష వేసేశారు. సజీవంగా తగులబెట్టేశారు. అప్పటి కాంగ్రెస్ నేతలు సజ్జన్ కుమార్, జగదీశ్ టైట్లర్ దగ్గరుండి హత్యలు చేయించారంటారు. కాని, వాళ్లకి ఇంత వరకూ ఎలాంటి శిక్షలూ పడలేదు.
1984లో జరిగిన సిక్కుల ఊచకోతలో అనధికారికంగా 8వేల మంది చనిపోయుంటారని అంచన. కాని, గవర్నమెంట్ ఒప్పుకుంది 2500మంది అని మాత్రమే. అయినా కూడా ఒక మైనార్టీ వర్గమైన సిక్కుల పట్ల అంత హింస జరగటం దారుణమైన విషయం. పైగా గుజరాత్ అల్లర్ల గురించి ఎప్పుడూ మాట్లాడే సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ పాలనలో జరగటం ఇంకా దుర్మార్గం. కాని, ఇదే అక్టోబర్ 31న ఆ చారిత్రక హింస జరిగింది. 3 నవంబర్ వరకూ జరుగుతూనే వుండింది. ఇప్పటికీ తమ ఆప్తుల్ని పొగొట్టుకున్న ఆనాటి సిక్కులకి ఎక్కడా న్యాయం జరగలేదు. సుప్రీమ్ జోక్యం చేసుకున్నా న్యాయం ఇంకా పెండింగ్ లోనే వుంది!
జాతీయ ఐక్యత అంటే అన్ని వర్గాల వారూ పరస్పర విశ్వాసంతో కలిసి వుండటం. మరీ ముఖ్యంగా సిక్కులు, జైనులు, బౌద్ధుల లాగా అత్యల్ప సంఖ్యలో వుంటే వారి భద్రత మరింత ముఖ్యం. ఆ మైక్రో మైనార్టీల సంక్షేమం వల్లే జాతీయ ఐక్యత సాధ్యం అవుతుంది. అంతే తప్ప బీజేపి హిందూత్వ పాలిటిక్స్ చేస్తోంది కాబట్టి సెక్యులర్ పార్టీలన్నీ తాము ముస్లిమ్ , క్రిస్టియన్ల చుట్టూనే తిరుగుతాం అంటే కుదరదు. ఎక్కడ మత ఘర్షణలు జరిగినా ముస్లిమ్ లు చనిపోయారని నిరసనలు చేసే నాయకులు, పార్టీలు, ఉద్యమకారులు, సంఘాలు... సిక్కుల చారిత్రక ఊచకోత గురించి కూడా మాట్లాడాలి. దేశ రాజధానిలో పట్ట పగలు జరిగిన మారణకాండకి తగిన శిక్షలు కోర్టులో అనౌన్స్ అయినప్పుడే జాతీయ ఐక్యత , జాతీయ ఐక్యతా దినోత్సవాలకి ఏదైనా అర్థం వుంటుంది...