సాయిబాబా దైవత్వం... మీడియా ఆరాటం!
posted on Oct 24, 2016 @ 3:00PM
ప్రపంచం ఇప్పుడు ఆరు ప్రధానమైన అవసరాలతో నడుస్తోంది! అవ్వి... నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, టీఆర్పీలు! అదేంటి పంచభూతాలతో పాటూ టీఆర్పీలు ఎందుకు వచ్చాయి అనుకుంటున్నారా? అవును... ఇండియాలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో టీఆర్పీలు పంచభూతాలకి తోడైన ఆరో భూతం అయిపోయాయి! అసలు నిజంగా చర్చ జరగాల్సిన అవసరం లేని విషయాలైనా సరే మన ఛానల్స్ పుణ్యామాని రచ్చైపోతున్నాయి! ద్వారకా పీఠాధిపతి వ్యాఖ్యలు, సాయిబాబా దేవుడు కాదు ... ఈ గోల అలాంటిదే!
నిజంగా సాయిబాబా దేవుడా? తాను దేవుడ్ని కాదని సాయిబాబాయే చాలా సార్లు చెప్పారు తమ జీవిత కాలంలో. ఆయన జీవిత చరిత్ర అయిన సాయి సచ్ఛరిత్రలో కూడా ఈ విషయం వుంది! నేను కేవలం దేవుడి సేవకుడ్ని అని మాత్రమే బాబా చెప్పేవారు. కాని, ఇప్పుడు మన మీడియాకి, దాంట్లో చర్చలకు వచ్చే మేధావులకి పదే పదే ఈ సందేహం వస్తోంది! వాదనలు చేయబుద్దేస్తోంది! కారణం... ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద స్వామివారు!
శంకరాచార్య స్థాపించిన నాలుగు ఆమ్నాయ పీఠాల్లో ద్వారక కూడా ఒకటి. దానికి సాక్షాత్ ఆదిశకరుల శిష్య పరంపరలో భాగంగా వచ్చిన ప్రస్తుత పీఠాధిపతి స్వరూపానంద. ఈయనలాగే దక్షిణాదిలో శృంగేరి పీఠానికి అధిపతి భారతీర్థ స్వామీ వారు. ఆయన ఏనాడూ ఎటువంటి వివాదంలో కలుగజేసుకోరు. కాని, కాంగ్రెస్ వారితో దగ్గరి సంబంధాలు వున్నాయని బీజేపి వారు ఆరోపించే స్వరూపానంద ... ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీలోనే వుంటూ వస్తున్నారు. ఓ సారి సాయిబాబా ముస్లిమ్ అని, ఆయన దేవుడు కాదని, ఆయన్ని పూజించవద్దని అంటారు. మరోసారి ఆడవాళ్లు శని సిగ్నాపూర్ మూల విగ్రహం దగ్గరికి వెళితే దేశంలో రేపులు పెరుగుతాయని అంటారు. ఇలా ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో అర్థం కాదు...
స్వరూపానంద స్వామీ సాయిబాబాను టార్గెట్ చేయటం ఇప్పుడు మొదటి సారి జరగలేదు. అయన తనకు వీలున్నప్పుడల్లా శిరీడినాథుడ్ని సాధారణ మానవుడని, పూజించవద్దని, వేద సమ్మతం కాదని చెబుతూనే వున్నారు. ఆయన నోరు తెరిచిన ప్రతీసారీ మన మీడియా నానా హంగామా చేసేస్తుంటుంది. అస్సలు ఒక్కసారి కూడా స్వరూపానంద స్వామి వ్యాఖ్యలకు ఎంత వరకూ ప్రభావం వుంటుందని ఆలోచించదు. నిజానికి 2015లో ఒకసారి ద్వారక పీఠాధిపతి కోర్టుకు లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చారు కూడా... సాయిబాబా పై వ్యాఖ్యలు తాను ఎవర్నీ నొప్పించాలని చేసినవి కావని! అయినా ఆయన మళ్లీ మళ్లీ వ్యాఖ్యలు చేస్తూనే వస్తున్నారు. ఛానల్స్ వాళ్లు దాన్ని హిందువుల అతి పెద్ద సంక్షోభంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు...
సాయి దైవత్వం మీద ఎవరి అభిప్రాయాలు ఎలా వున్నా బాబా ఇప్పుడు అత్యంత ప్రజాదరణ వున్న దేవుడు. ఆయనకి హిందూ సంప్రదాయం ప్రకారమే పూజలు జరుగుతున్నాయి. జనం విపరీతంగా విశ్వసిస్తున్నారు. ఇటువంటి సమయంలో ఒక పీఠాధిపతి భిన్నమైన అభిప్రాయం వెలిబుచ్చటం మరీ తప్పేం కాదు. ఆయన తన వ్యక్తిగత అభిప్రాయం చెప్పారే తప్ప బలవంతంగా సాయి భక్తుల్ని పూజలు మానేయమని చెప్పటం లేదు. అలా చేసే స్థాయి, స్థితి కూడా ఆయనకు లేవు. అయితే, ఇక్కడ వస్తున్న సమస్యల్లా స్వరూపానంద వ్యాఖ్యల్ని మీడియా హైలైట్ చేయటం! ఊరికే ఒక వార్తగా ఇచ్చి ఊరుకోకుండా మన ఛానల్స్ వాళ్లు సాయి భక్తుల్ని , సాయి వ్యతిరేకుల్ని స్టూడియోల్లోకి పిలిచి కూర్చుండబెడతారు! ఇంకా అరుపులు కేకలతో అరాచకం బయలుదేరుతుంది! అసలు సాయి దేవుడని కోట్లాది మంది జనం నమ్మేశాక టీవీ స్టూడియోల్లో తేలేదేంటి? ద్వారక పీఠాధిపతి తన ముందు మైక్ పెట్టినప్పుడు చెప్పే ఒక్క వాఖ్యం వల్ల ముంచుకొచ్చిన ప్రమాదం ఏంటి? మీడియాకే తెలియాలి...
సాయిని ఎక్కువగా పూజించే మహారాష్ట్ర, తెలంగాణ, అంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ద్వారక పీఠాధిపతి చాలా మందికి తెలియదు. ఈ గొడవ మొత్తం అయ్యాకే ఆయన గురించి తెలిసింది. దీనికి కారణం టీవీలు, పేపర్లు ఆయన వాఖ్యల్ని, ఆయన ఫోటోల్ని విపరీతంగా ప్రచారం చేయటమే. ఆ ఫలితంగా ఎక్కడెక్కడో సాయి భక్తలు ఆవేశానికి, ఆందోళనకి లోనవుతున్నారు. చివరకు, టీవీల వాళ్ల కెమెరాలు పక్కాగా వుంటాయని తేలటంతో ధర్నాలకు దిగిపోతున్నారు. ఇదంతా అసలు ఎవరైనా ప్లాన్ చేసి చేపిస్తున్నారా అన్న అనుమానం కూడా వస్తుంది అప్పుడప్పుడూ!
ఒకవైపు ద్వారక పీఠాధిపతి ఎక్కడో స్టేట్మెంట్ ఇవ్వటం , దానికి వెంటనే సాయి భక్తులు స్పందించటం, మీడియా ఎంటరైపోయి హడావిడి చేసేయటం... ఇంత వ్యవహారం కోఆర్డినేషన్ లేకుండా ఎలా అవుతుంది? బీజేపి అభిమానులు కొందరన్నట్టు నిజంగానే తెర వెనుక ఎవరన్నా వుండి స్వామీజీ చేత మాటలు అనిపించి మీడియాలో తుఫాన్ రాజే్స్తున్నారా? అలా జరగొచ్చు, జరగకపోవచ్చు. కాని, ఒక్కటి మాత్రం నిజం. మరోసారి ద్వారక పీఠాధిపతి సాయి గురించి ఏమైనా మాట్లాడితే టీవీ ఛానల్స్ వారు చర్చలు పెట్టకుంటే చాలా బెటర్. ఎందుకంటే, సాయి దేవుడా కాదా అనే విషయం తేలకపోగా అనేక మంది సాయి భక్తుల హృదయాలు గాయపడుతున్నాయి. కాబట్టి పీఠాధిపతి వారి మాటల్ని ఓ వార్తగా ప్రసారం చేసి ఇతర ముఖ్యమైన అంశాలపై దృష్టి పెడితే చాలా బావుంటుంది. అదే మీడియా బాధ్యత కూడా! ఎవరు దేవుడు, ఎవరు కాదనే విషయం తేల్చాల్సింది ... ఎవరి విశ్వాసం వారిదే!