నరకచతుర్ది నాడు... కొత్త వాదనల నరకం!
posted on Oct 29, 2016 @ 12:59PM
దీపావళి అంటే అందరి ముఖాలు వెలిగిపోతాయి. ముఖాలే కాదు ఇళ్లు, ముంగిళ్లు కూడా ధగధగ వెలిగిపోతాయి. అంతటి అందమైన పండగ దీపావళి. అయితే, దీపావళికి ముందు రొజు వచ్చే నరకచతుర్ధశి మాత్రం పదే పదే వివాదాస్పదం అవుతోంది. దీనికి కారణం అర్థం పర్థం లేని అభ్యుదయవాదమే! నరకుడు మావాడంటూ కొందరు బయలుదేరి తమకు తోచింది మాట్లాడుతన్నారు. దానికి మరికొందరు స్పందిస్తున్నారు. మొత్తంగా పండగ చేసుకోవాల్సిన టైంలో సమయం దండగ చేసుకుంటున్నారు...
మన పురాణాల ప్రకారం, నరకచతుర్ధశి నాడు నరకుడ్ని శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై సంహరిస్తాడు. అతడి పీడ విరగడైనందుకు జనం సంతోషంగా దీపాలు వెలిగించి పండగ చేసుకుంటారు. ఇదే వందల ఏళ్లుగా చెప్పుకుంటూ వస్తున్నాం. కాని, ఈ మధ్య మీడియా విప్లవం వల్ల ఇతర విప్లవాలు కూడా చర్చల రూపంలో సామాన్య జనం లివింగ్ రూంల్లోకి చొరబడుతున్నాయి. పురాణాల్లో, ఇతిహాసాల్లో చెప్పిన దానికి వ్యతిరేకంగా మరో వాదం వినిపించే సమాంతర చరిత్ర గతంలోనూ ప్రచారంలో వుంది. అయితే, కేవలం కొందరు మేధావులు, కొన్ని పత్రికలు, గ్రంథాలు మాత్రానికే పరిమితం అయ్యేది! కాని, ఇప్పుడు 24గంటల న్యూస్ ఛానల్స్ వల్ల ఫేస్ టూ ఫేస్ చర్చలకు, రచ్చలకు దారి తీస్తోంది.
నరకాసురుడు నిజమైన భూమిపుత్రుడని, మూలవాసి అని కొందరు ఉద్యమకారుల వాదన. దీనికి పెద్దగా సైంటిపిక్ ప్రూఫ్ అంటూ ఏమీ వుండదు. ఎందుకంటే, నరకాసురుడే అసలు నిజమైన రాజని ఎక్కడా ఋజువులు లేవు. కల్పిత పాత్ర అయ్యి వుండవచ్చు. అటువంటి ఒక పురాణ పాత్ర రాక్షసుడు కాదు ఇక్కడి మూల వాసి, ఆటవిక రాజు వగైరా వగైరా అనటం అనవసర విజ్ఞానమే అవుతుంది. పైగా ఇలాంటి నరకాసురుడు, మహిషాసురుడు, రావణాసురుడు ... వీళ్లు మావాళ్లు, మీరంతా ఆర్యులు అనటం మరో దారుణం. ఎందుకంటే, ఇప్పటి వరకూ ఆర్యులు దండెత్తి వచ్చారన్న బ్రిటీషు వాళ్ల కాలం నాటి సిద్ధాంతం ఎక్కడా శాస్త్రియంగా నిరూపించబడలేదు. పోనీ అది నిజమే అని నమ్మినా... ఎప్పుడో క్రీస్తు పూర్వం వచ్చిన ఆర్యులు ఈనాటికీ ద్రవిడులు, మూల వాసులు లాంటి వాళ్లతో కలవకుండా అలాగే వుంటారా? ప్రస్తుత భారతదేశంలో ఎవరు ఆర్యులు? ఎవరు మూల వాసులు? ఎలా గుర్తించేది?
పురాణాల్లో నరకాసురుడి జన్మవృత్తాంతం స్పష్టంగానే వుంది. అతను శ్రీకృష్ణుడే మరో అవతారంలో వున్నప్పుడు... అంటే, వరాహ స్వామిగా వున్నప్పుడు భూదేవికి జన్మిస్తాడు. ఒక విధంగా విష్ణువు ఒక అవతారమైన వరాహ స్వామికి కొడుకు, మరో అవతారమైన కృష్ణుడికి శత్రువు... నరకాసురుడన్నమాట! పురాణాల్లో కథనం ఇలా వుంటే ఆధునిక అభ్యుదయవాదులు , చరిత్రకారులు నరకాసురుడ్ని ఈకాలపు దళితులు, గిరిజనులు, అణిచివేయబడ్డవారు... వీరికి ప్రతినిధిని చేయటం... కొంత కుట్రగానే కనిపిస్తోంది. నరకాసురుడిలానే మహిషాసురుడు, రావణాసురుడు కూడా వివాదాస్పదం అవుతున్నారు. మరి, శ్రీకృష్ణుడి చేతిలోనే చచ్చిన కంసుడు కూడా మూలవాసేనా ? అక్కడ లెక్క కుదరదు! ఎందుకంటే, కంసుడు స్వయంగా కృష్ణుడికి మేనమామ!
ఇస్లాం లాంటి మతాల్లో పవిత్ర గ్రంథాలు, వాటిలోని కథల గురించి ఇంత పబ్లిగ్గా చర్చించటమే కుదరదు. కాని, హిందూ మతంలో వున్న స్వేచ్ఛ కారణంగా నానా యాగీ జరిగినా ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. అయితే, నిజమో కాదో కూడా తెలియని రాక్షసుల్ని పట్టుకొచ్చి ఇప్పటి పేదలు, తక్కువ కులాల వారు, ఇంకా ఇతర దోపిడీకి గురవుతున్న వారు.... వీళ్లందరికీ అంటగట్టడం... అనవసర ప్రయాసే! దాని వల్ల బాధితులైన వారికి జరిగే మంచంటూ ఏం వుండదు. రాముడ్ని, కృష్ణుడ్ని ద్వేషించటం కన్నా ఆర్దికంగా ఎదగలేకపోతున్న, అంటరానితనానికి గురవుతోన్న వారికి నిజమైన చేయూత ఇవ్వటం ఇప్పుడు తక్షణ అవసరం! మీడియా, మేధావులు దానిపై దృష్టి పెట్టాలి...