కమల్..గౌతమిల దారులు వేరయ్యాయి
posted on Nov 2, 2016 @ 3:49PM
అలనాటి అగ్రకథానాయిక గౌతమి నిన్న దక్షిణాది చిత్ర పరిశ్రమలో బాంబు పేల్చారు. ప్రముఖ కథానాయకుడు కమల్‌హాసన్‌తో తన 13 ఏళ్ల సహజీవన బంధాన్ని తెంచుకుంటున్నట్లు ప్రకటించి అందరిని షాక్‌లోకి నెట్టారు. "లైఫ్ అండ్ డెసిషన్స్" పేరుతో తను స్వయంగా రాసిన లేఖను ట్వీట్ చేశారు గౌతమి. నేను మిస్టర్ హాసన్ ఈ రోజు నుంచి విడిపోతున్నాం అనే విషయం చెప్పడానికి చాలా బాధగా ఉంది. మాది 13 ఏళ్ల ప్రయాణం. ఇప్పటి వరకు నా జీవితంలో తీసుకున్న అతి భయంకరమైన నిర్ణయం ఇది. ఒకరితో బంధాన్ని తెంచుకోవడం అంత సులవైన విషయం కాదు. కానీ ఇద్దరి ఆశయాలు, మార్గాలు వేరయినప్పుడు ఎవరికి నచ్చినట్లు వారు ఉండటమే మంచిది. నేను ఈ నిర్ణయానికి రావటానికి చాలా సమయం పట్టింది. ఒకరి సానుభూతి పొందాలనో, ఒకర్ని నిందించాలనో నేను ఈ పని చేయడం లేదు. నా జీవితంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా వెళ్లాలని నిర్ణయించుకున్నాను అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.
ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో మంచి నటిగా వెలుగొందిన గౌతమి మన తెలుగమ్మాయే. విజయ్ చందర్ దర్శకత్వంలో తెరకెక్కిన "దయామయుడు" అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన గౌతమి అనతికాలంలోనే మిగిలిన దక్షిణాది చిత్రాల్లోనూ అవకాశాలు చేజిక్కించుకుని స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగింది. సినిమాల్లో బిజీగా ఉండగానే 1998లో వ్యాపారవేత్త సందీప్ భాటియాను వివాహం చేసుకున్నారు గౌతమి. 1999లో ఈ దంపతులకు ఒక పాపపుట్టింది. ఆ తర్వాత మనస్పర్థల కారణంగా గౌతమి, సందీప్ భాటియా విడాకులు తీసుకున్నారు. అనంతరం పాప సుబ్బులక్ష్మీతో విడిగా ఉంటున్నారు గౌతమి.
ఇక కమల్ సంగతి చూస్తే..1978లో అలనాటి నృత్యకారిణీ వాణిగణపతిని ఆయన వివాహం చేసుకున్నారు ..పదేళ్లపాటు సజావుగా సాగిన వీరి సంసారంలో కొద్దిపాటి మనస్పర్థలు తలెత్తాయి. అవి చిలికి చిలికి గాలివానగా మారి విడిపోవడం వరకు వచ్చాయి. ఆ తర్వాత కమల్ హిందీ సినిమాల్లో బిజీగా ఉండటంతో ఆ సమయంలో నటి సారికకు బాగా దగ్గరయ్యారు..ఆ చనువు కాస్తా ప్రేమగా మారి వివాహనికి దారి తీసింది. ఈ దంపతులకు కొన్నాళ్లకు శ్రుతీహాసన్ పుట్టగా..1991లో అక్షరా హాసన్ కలిగారు..చివరికి ఈ వివాహం కూడా నిలబడలేదు..2002లో ఈ జంట చట్టపరంగా విడాకులు తీసుకుంది. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరినట్లు సంసార జీవితంలో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కోన్న కమల్, గౌతమిలు ఒకే చోటికి చేరారు. గౌతమికి కేన్సర్ సోకినప్పుడు కమల్ ఇంకా బాగా దగ్గరయ్యారు. చివరికి ఆ అనుబంధం సహజీవనానికి నాంది పలికింది.
చాలా సందర్భాల్లో తాను ఇలా మీకు కనిపించగలుగుతున్నానంటే అది కేవలం కమల్ గారి వల్లేనని చెప్పుకొచ్చింది గౌతమి. పెళ్లి చేసుకోకపోయినప్పటికి వీరిద్దరూ ఆదర్శవంతమైన జంటగా మెలిగారు. ఆడియో ఫంక్షన్లలోనూ, శుభాకార్యాల్లోనూ కమల్-గౌతమి సందడి చేసేవారు. అలాంటి జంట ఇప్పుడు విడిపోవడం సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. ఇంతకు ముందు ఎన్నో జంటలు విడిపోయినా అంతగా పట్టించుకోని వారు సైతం అరెరె..అంటున్నారు. అసలు ఈ జంట ఇంత హఠాత్తుగా విడిపోవడానికి కారణమేంటి..అంటే ప్రస్తుతానికి అందరి వేళ్లూ కమల్ గారాలపట్టి శృతిహాసన్ వైపే చూపెడుతున్నాయి.
శ్రుతికీ.. గౌతమికీ వచ్చిన విబేధాల వల్లే... కమల్ తో గౌతమి విడిపోయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కమల్ హాసన్ హీరోగా "శభాష్ నాయుడు" అనే సినిమా తెరకెక్కుతోంది. తన కెరీర్‌లోనే తొలిసారి నాన్నతో కలసి ఈ సినిమాలోనే నటిస్తోంది శృతి. ఇదే చిత్రానికి గౌతమి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తోంది. అయితే కాస్ట్యూమ్స్ విషయంలో వచ్చిన విబేధాలు చినికి చినికి గాలివానగా మారినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ విషయంలో శ్రుతి ఈగో బాగా హర్టయ్యిందని, అప్పటి నుంచీ కమల్, గౌతమిల జీవితంలో పుల్లలు పెట్టడం మొదలెట్టిందని తెలుస్తోంది. గౌతమి అంటే శ్రుతికి ముందు నుంచీ ఇష్టం లేదని, ఈ మధ్య ఆ వ్యతిరేకత బాగా పెరిగిందని చెన్నై వర్గాలు కూడా చెబుతున్నాయి.
కమల్ హాసన్, శ్రుతిహాసన్ ఇద్దరూ తండ్రీ కూతుర్లే అయినా.. పెద్దగా కలిసుండేవారు కాదు. ఈ మధ్య వాళ్లిద్దరి మధ్య రాపో బాగా పెరిగింది. ఇదే అలుసుగా తీసుకొని గౌతమిని దూరం పెట్టడం మొదలెట్టిందట శ్రుతి. అటు శ్రుతికీ, ఇటు గౌతమికీ ఏమీ చెప్పలేక కమల్ బాధ పడేవాడని, ఆ బాధని దూరం చేయడానికి అన్నట్టు గౌతమి కమల్ నుంచి విడిపోవాలని నిర్ణయించుకొన్నట్టు తెలుస్తోంది. అన్ని కలిసి గౌతమి-కమల్‌ల బంధానికి తూట్లు పొడిచాయి. సరిగ్గా పదమూడేళ్ల క్రితం ఉన్న సంధికాలంలోకి మళ్లీ కమల్, గౌతమి చేరుకున్నారు. ఇద్దరు ఇప్పుడు ఒంటరివారు. ఎంతగా పిల్లల తోడుగా ఉన్నా భాగస్వామి లేని జీవితం చుక్కాని లేని నావ వంటిది. క్షణికావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నా అతి త్వరలోనే అసలు విషయం బోధపడుతుంది.