ఆర్కే క్షేమమే... మావోయిస్టుల మార్గం క్షేమమేనా?
posted on Nov 4, 2016 @ 4:52PM
ఎన్ కౌంటర్, బూటకపు ఎన్ కౌంటర్... ఈ పదాలు మరోసారి మీడియాలో మార్మోగాయి. అందుక్కారణం ఈ మధ్య జరిగిన ఏవోబీ హింసే! అవును... జరిగింది ఎన్ కౌంటర్ అయినా, బూటకపు ఎన్ కౌంటర్ అయినా ఆంధ్రా, ఒడిషా సరిహద్దు మాత్రం హింసతో అల్లకల్లోలం అయింది! అలాగే, చనిపోయింది మావోలైనా, పోలీసులైనా సామాన్య జనం మాత్రం అయ్యో అనుకోవటం తప్ప చేయగలిగిందేం లేదు. ఎందుకంటే, ఈ అంతర్గత యుద్ధంలో ఏ వైపు వారు చనిపోయినా ప్రాణాలు పోయేది సాటి భారతీయులవే. అంతే తప్ప ఇక్కడెవరూ బద్ధ శత్రువులు లేరు. కేవలం స్వార్థాలు, ఆవేశాలు తెచ్చిపెట్టిన శత్రుత్వం తప్పా!
అసలు మావోయిస్టుల చరిత్రలోనే మొన్న జరిగిన ఎన్ కౌంటర్ అంత భారీ నష్టం ఎప్పుడూ జరగలేదంటున్నారు. 30మందికి పైగా ప్రాణ త్యాగం చేశారు. అందులో చాలా మంది కీలక నేతలు కూడా వున్నారు. అన్నిటికంటే మించీ భారత మావోయిస్టుల అధినాయకుడు ఆర్కే పోలీసులకి పట్టుబడాడని హడావిడి నడిచింది. కాని, అంతిమంగా ఆయన క్షేమంగా వున్నాడని వరవర రావు లాంటి వాళ్లు ప్రకటించారు. అయితే, ఇక్కడే మనం కొన్ని కీలకమైన విషయాలు మాట్లాడుకోవాలి!
ఏవోబీలో ఎన్ కౌంటర్ జరగగానే ఎప్పటిలానే హక్కుల సంఘాల వాళ్లు, మావోయిస్టు సానుభూతిపరులు రోడ్డెక్కారు. మీడియాలో కలకలం రేగింది. వెంటనే బూటకపు ఎన్ కౌంటర్ మాట కూడా రొటీన్ గా వినిపించింది. కాని, ఈసారి జరిగింది పూర్తిగా బూటకపు ఎన్ కౌంటర్ కాదు. స్వయంగా మావోయిస్టు పార్టీ ప్రతినిధి మీడియాతో ఫోన్ లో మాట్లాడిన దాని ప్రకారం... మావోలు సమావేశం అయిన చోటికి పోలీసులు వచ్చారు. కాల్పులు మొదలయ్యాయి. ఇరు వర్గాలు ఫైరింగ్ చేసుకోగా చాలా మంది చనిపోయారు. సహజంగానే, అత్యాధునిక ఆయుధాలు, శిక్షణ వున్న పోలీసులు పై చేయి సాధించారు... మొత్తానికి బూటకపు ఎన్ కౌంటర్ అనటానికి మాత్రం అస్కారం లేకుండా పోయింది. కాని, అదే సమయంలో, కొందరు మావోల్ని పట్టుబడ్డా కూడా పోలీసులు కాల్చి చంపేశారని ఆరోపిస్తున్నారు నక్సలైట్లు. అదే జరిగితే మానవహక్కుల ఉల్లంఘన కిందకే వస్తోంది.
అసలు పోలీసులు మావోయిస్టుల్ని చంపొచ్చా? కోర్టులు చంపటానికి వీలు లేదనే చెబుతన్నాయి. అయినా అనివార్యంగా జరిగే ఎన్ కౌంటర్లే కాక బూటకపు ఎన్ కౌంటర్లు కూడా ఇప్పటికే బోలెడు సార్లు జరిగాయి. కనుచూపు మేరలో ఆగే సూచనలు కూడా లేవు. ఇందుకు కారణం మావోయిస్టులకు విడుపు లేకపోవటం... పోలీసులు పట్టు వదలకపోవటం! అడవిలో అన్నలకి భూమి లోపలి ఖనిజాలు మొదలు భూమి ఏర్పాటు కావాల్సిన సమ సమాజం వరకూ అన్నీ సమస్యలే. మొత్తం అంతా మారిపోవాలంటారు వారు! అసలు కోట్లాది జనం ఓట్లు వేసి ఎన్నుకుంటున్న ప్రజాస్వామ్య ప్రభుత్వాలే దండగ అంటారు. అలా వారి డిమాండ్లు ఏ లెక్కన చూసినా కూడా ఇప్పటికిప్పుడు తీరేవీ కావు. తీర్చగలిగేవీ కావు. మరో వైపు పోలీసులు తమ డ్యూటీలో భాగంగా మావోల్ని అంతం చేస్తుంటారు. వాళ్ల చేతిలో బలవుతూ కూడా వుంటారు. కాని, వాళ్లకి అసలు ప్రభుత్వాలు ఎందుకని వామపక్ష ఉగ్రవాదుల్ని చంపిస్తున్నాయో తెలుసా? నూటికి నూరు శాతమైతే తెలియదనే చెప్పాలి. తమ బాస్ లు, వారి బాస్ లు చెప్పారు కాబట్టి వేటకి వెళతారు. వేటాడతారు. తామే వేటాడబడుతుంటారు కూడా!
మావోయిస్టుల్ని ప్రభుత్వాలు అంతం చేయటం చట్ట రిత్యా, రాజ్యాంగం ప్రకారం తప్పు కావొచ్చేమో కాని... వాటికి అంతకంటే ఎక్కువ అవకాశం వున్నట్లు కూడా కనిపించదు. హింసను నమ్మిన నక్సలైట్లపై నిషేధం ఎత్తి వేసి శాంతి చర్చలు జరిపితే వాళ్లు జనంలోకి దూసుకుపోయే వీలుంది. పేద వర్గాలు వారి హింసా మార్గానికి ఆకర్షితులయ్యే ప్రమాదం వుంది. ఒక విధంగా అడవిలో అన్నల్ని స్వేచ్ఛగా వదలటం అంటే పేదలు, ధనికులు మధ్య అంతర్యుద్ధం జరిగేలాంటి పరిస్థితులు కల్పించటమే. ఇది దేశ అస్థిత్వానికి పెద్ద సవాలు. పేదలు లబ్ధి పొందటం చాలా ముఖ్యమే అయినప్పటికీ హింస ద్వారా అది చేయాలని మావోయిస్టులు విశ్వసించటం అన్ని సమస్యలకి కారణం అవుతోంది. ప్రభుత్వాలు కూడా తమని తాము కాపాడుకుంటూ రాజ్యాంగ వ్యతిరేకమైన హింసకే తెగబడాల్సి వస్తోంది. ఇది ఇరువైపులా ఎవ్వరూ ఆపలేని హింసాత్మక వలయంగా మారిపోయింది...
ఆర్కే ఆచూకీ గురించి ఆందోళన చెందిన వారిలో ప్రముఖంగా వినిపించిన పేరు వరవర రావు. ఆయనకే అడవిలోని పార్టీ వారు ఆర్కే క్షేమ సమాచారం కూడా అందించారు. అలాంటి కమ్యూనికేషన్ వున్న కవులు, మేధావులు, మావోయిస్టు సానుభూతిపరులు అడవిలోని వారికి హింసను నివారిచగలిగే లేదంటే కనీసం తగ్గించగలిగే మార్గాలు సూచించాలి. ఎప్పుడో 1970లలో మొదలు పెట్టిన మావో జెడాంగ్ ప్రేరణ కలిగిన సాయుధ మార్గం ఎంత వరకూ ఫలితాలిచ్చింది? అసలింక మీదట దాని వల్ల ఉపయోగముంటుందా? వంటి ప్రశ్నలు వేసుకోవాలి. ఏ ఉద్యమం అయినా కాలానుగుణంగా పంథా మార్చుకోవటం తప్పు కాదు. అవసరం కూడా.