'చెత్త' రాజకీయాలకు చిత్తైపోతున్న ఢిల్లీ!
posted on Nov 7, 2016 @ 1:43PM
దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ కాలుష్యం వుంటుందని అందరికీ తెలుసు! కాని, ఇప్పుడు రాజకీయ కాలుష్యం కన్నా వాయు కాలుష్యం జనాలకి ఊపిరాడనివ్వటం లేదు. దీపావళి తరువాత నుంచీ పరిస్థితి దారుణంగా తయారైంది. ఎంతగా అంటే పాఠశాలలకు తుఫాన్ లు వచ్చినప్పుడు, ఎండలు విపరీతంగా వున్నప్పుడు ఇచ్చినట్లుగా సెలవులు ప్రకటించే దాకా వెళ్లింది! అసలు పిల్లలు స్కూల్స్ కి వెళ్లటం కాదు పెద్ద వాళ్లు ఆఫీసులకి వెళ్లటం కూడా ప్రమాదకరంగానే మారిపోయింది. స్వయంగా సీఎం కే్జ్రీవాల్ అవసరం వుంటే తప్ప బయటకి రాకండని సూచన చేసేశాడు. అదీ సిట్యుయేషన్!
దీపావళి తరువాత డిల్లీలో పొల్యూషన్ ఎక్కువైంది అంటే ... ఇదేదో టపాసుల వల్ల వచ్చిపడ్డ ప్రమాదం కాదు. నిజానికి దేశ రాజధానిలో కాలుష్యం అంతా ఇంతా కాదు. సంవత్సరం పొడవునా అక్కడి జనం విషమే పీలుస్తుంటారు. అందుకు కారణాలు బోలెడు. ఇక సంవత్సరానికి ఒక్కసారి వచ్చే క్రాకర్స్ ఫెస్టివల్స్ మరికొంత ఇబ్బంది పెంచుతుంది. కాని, అదే అసలు మూలం కాదు. మరి ఢిల్లీ కాలుష్యానికి అసలు కారణం ఏంటి? కొందరి వాదన ప్రకారం చెత్త! అవును, చెత్తను ఎక్కడికక్కడ కాల్చేయటమే తీవ్రమైన వాయు కాలుష్యానికి దారి తీస్తోందట!
మొత్తం వ్యవస్థని ఊడ్చేస్తానని అధికారంలోకి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ కనీసం చెత్త కూడా ఊడ్పించటం లేదు. అక్కడి మున్సిపల్ వర్కర్స్ ఇప్పటికే దఫదఫాలుగా ధర్నాలు చేశారు జీతాల కోసం. కాని, కేజ్రీవాల్ మాత్రం ఎక్కడ ఎన్నికలైతే అక్కడ వాలిపోయి బీజేపిని విమర్శిస్తూ కాలం గడుపుతున్నాడు. తనని తాను మోదీకి పోటీగా ఊహించుకుంటూ సీఎంగా బాధ్యతలు మర్చిపోతున్నాడు. ఏ విమర్శ ఎదురైనా కేంద్ర ప్రభుత్వం తనని పని చేయనీయటం లేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ కాలుష్యం విషయంలో కూడా ఢిల్లీ చుట్టూ వున్న హర్యానా, రాజస్థాన్, పంజాబ్ లు వదిలే కలుషిత వాయువుల వల్లే తన రాష్ట్రానికి ఇబ్బందని బాధ్యత రహితమైన కామెంట్ చేశాడు. పైగా చుట్టూ వున్న బీజేపి పాలిత రాష్ట్రాలు చెప్పి అఖిలేష్ పాలిస్తున్న ఉత్తర్ ప్రదేశ్ ఆయన చెప్పలేదు. కేజ్రీవాల్ చేస్తున్న ఈ యాంటీ మోదీ పాలిటిక్స్ ఢిల్లీ సామాన్య జనానికి ప్రాణాంతకంగా మారాయి. కనీసం చెత్త ఎక్కడికక్కడ కాల్చేయటం కాకుండా సిటీ వెలుపలికి తరలించే ఏర్పాట్లు కూడా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం చేయటం లేదు.
ఢిల్లీలో కాలుష్యం ఎంతగా వుందంటే ఒక మనిషి రోజంతా అక్కడి రోడ్ల మీద వుంటే 45సిగరెట్లు తాగిన దానితో సమానం అవుతుందట! అసలు హస్తినలో పది నిమిషాలు రద్దీ రోడ్డుపై వుంటే గొంతులో మంట మొదలైపోతుందట! ఇక పదేళ్లకు మించి వుంటే క్యాన్సర్ కొని తెచ్చుకున్నట్టే! ఇంత దారుణ పరిస్థితులు వున్నప్పుడు మరి అక్కడే వున్న కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? మొత్తం దేశం బాధ్యత మోదీదైనప్పుడు ఢిల్లీ కూడా అందులో భాగమే కదా? కేజ్రీవాల్ తో కయ్యమే ఎన్డీఏ ప్రభుత్వాన్ని వెనక్కి లాగుతోంది. మోదీ సర్కార్ ఏం చేసినా క్రెడిట్ కేజ్రీవాల్ కొట్టేయగలడని దేశ పాలకుల భావన. మొత్తానికి కేంద్రం, కేజ్రీల మధ్యన ఢిల్లీ జనాలు విషం పీల్చి పిప్పిగా మారిపోతున్నారు...
ఢిల్లీ కేవలం ఒక రాష్ట్రమే కాదు. అది దేశానికి రాజధాని. అంటే... ఢిల్లీ దిల్లీ కూడా! మరి అటువంటి గుండె కాయని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి? పైగా అక్కడే ఒక సీఎం, మరో పీఎం కూడా వుండి ఏమీ చేయకపోతే ఎలా? కనీసం చెత్తని తరలించే వ్యవస్థ కూడా ఏర్పాటు చేయని చెత్త పాలన చేస్తూ వుంటే ఎలా? ఈ ప్రశ్నలకి సమాధానాలు జనం ఖచ్చితంగా అడుగుతారు! వచ్చే ఎన్నికల్లో బీజేపి, అంతకంటే ఎక్కువగా ఆప్ జవాబు చెప్పుకోవాల్సి వుంటుంది...