వాలెంటైన్స్ డేకు నిరసనగా తల నరికేశాడు!

  ఎవడి పిచ్చి వాడికానందం! ఇది చాలా పాత మాటైనా ప్రతీ రోజూ కొత్తగానే వాడుకోవచ్చు! అలాంటి పిచ్చి వాళ్లు భూమ్మీద పెరిగిపోతూ వున్నారు! ఫిబ్రవరీ 14 వస్తోందంటే నెల ముందు నుంచే హడావిడి మొదలవుతుంది! అసలు ప్రేమకి ఒక దినం ఎందుకు అని వాలెంటైన్స్ డేను సమర్థించే వారు ఆలోచించరు. మిగతా రోజుల్లో ఎవ్వరూ ప్రేమించుకోరా? ప్రపోజ్ చేసుకోరా? ఎందుకు మరీ కార్పోరేట్ల మాయలో పడి ఫిబ్రవరీ పద్నాలుగున కోట్ల రూపాయాల వ్యాపారం వారికి చేసి పెట్టడం? ఎందుకు పవిత్రమైన ప్రేమని గ్రీటింగ్ కార్డులు, చాక్లెట్లు, పబ్బుల్లో మందుపార్టీలతో సమానం చేయటం? ఇదంతా యూత్ ఆలోచించదు! అది వారి పిచ్చి...   ఒకవైపు లవ్వర్స్ డే నాడు పార్కుల్లో పొదల్లో దూరితేనే ప్రేమించుకున్నట్టు అనుకునే జనరేషన్ వుంటే... మరోవైపు మత సంస్థల హడావిడి! ఎక్కడ అమ్మాయి, అబ్బాయి కలిసి కనిపించినా పెళ్లి చేస్తామంటూ గోల. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. డెమోక్రసీ అంటే వ్యక్తిగత స్వేచ్ఛ. కాబట్టి దాన్ని హరించే హక్కు హిందూ, ముస్లిమ్, ఏ మతానికి చెందిన అతి వాద సంస్థకూ లేదు. కాకపోతే, ఇక్కడ వాలెంటైన్స్ డేను వారు విమర్శించటం మాత్రం తప్పు కాదు. దానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి దాడులు చేయటమే పొరపాటు. కాని, ఇలాంటి ప్రవర్తన ప్రపంచ వ్యాప్తంగా అతివాద మత సంస్థలు మానుకోవటం లేదు. ఇదీ వాలెంటైన్స్ డేలోని మరో రకం పిచ్చి!   వద్దనే వాళ్లు, కావాలనే వాళ్ల మధ్య వాలెంటైన్స్ డే వార్స్ ప్రతీ యేడు జరిగినట్టే ఈ సారీ జరుగుతున్నాయి! కాని, మతోన్మాదానికి మతిపోగొట్టే నిదర్శనమైన ఐఎస్ఐఎస్ సరికొ్త్తగా తన వాలెంటైన్స్ డే కసిని ప్రదర్శించింది. ఇరాక్ లోని మోసుల్ నగరంలో ఓ మసీద్ లో ఏం జరిగిందో తెలుసా? అక్కడున్న ఐసిస్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇస్లాం ప్రబోధకుడు ఓ మెడ తెగ నరికాడు! అయితే, ఐసిస్ ఉగ్రవాదులకి అలవాటున్నట్టుగా , ఎప్పటిలా మనిషి తల నరకలేదు! అదొక్కటే ఇక్కడ ఊపిరి పీల్చుకోవాల్సిన విషయం! ఒక ఎర్రటి టెడ్డీ బేర్ బొమ్మ తలని తెగ నరికి వాలెంటైన్స్ డే జరుపుకోవద్దని హెచ్చరించాడట! అతను మత ప్రబోధకుడు కావటంతో అలా చేశాడు. పూర్తి స్థాయి ఐఎస్ఐఎస్ మతోన్మాద జిహాదీ అయితే మనిసి తలే నరికావాడనుకుంటా! అలాంటి దారుణాలు గత కొన్నేళ్లలో ఎన్నో...   ప్రేమికుల రోజుని వ్యతిరేకించటం ఎవరైనా చేయవచ్చు. కాని, ఆ క్రమంలో యువతీ, యువకులు తప్పు చేస్తున్నారంటూ అంతకంటే దారుణమైన చర్యలకు పాల్పడటం ఎంత మాత్రం మంచిది కాదు. ఇరాక్ లో టెడ్డీ బేర్ తల నరికిన మత చాంసవాది మెంటాలిటి అలాంటిదే! నరికింది బొమ్మ తలే అయినా అతడి లాంటి వాళ్లలో గూడుకట్టుకున్న మతోన్మాదం, అసహనం, హింసాత్మక ధోరణి... ప్రపంచ శాంతికి చాలా ప్రమాదకరం! ఖచ్చితంగా వాలెంటైన్స్ డే సంస్కృతి కన్నా దారుణం...

మోదీ హీట్ తో... 'ఉడికిపోతోన్న' ఉద్ధవ్ థాక్రే!

  మహారాష్ట్రలో శివసేన పార్టీ పరిస్థితి... ఇష్టం లేని భర్తతో కాపురం చే్స్తోన్న భార్యలా తయారైంది! ఏదో ఒక కారణంతో కమలాన్ని తిట్టిపోయటమే పనిగా పెట్టుకున్నాడు ఆ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే! నిజానికి మహాలో శివసేన, బీజేపి మిత్ర పక్షాలు. కాని, గత కొన్ని నెలలుగా గమనించి చూస్తే కాంగ్రెస్ , ఎన్సీపీ లాంటి బీజేపి ప్రత్యర్థి పార్టీల కంటే ఎక్కువ శివసేననే విమర్శలు గుప్పిస్తోంది. ఓ వారం ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ను టార్గెట్ చేస్తే మరో వారమంతా మోదీని కార్నర్ చేస్తోంది. చివరకు, ఉద్ధవ్ చర్యలు ఆయన స్వంత పార్టీ అభిమానులకి కూడా అంతు చిక్కకుండా వుంటున్నాయి...   మోదీ బాత్రూంలలోకి తొంగి చూడటం మానేసి పాలనపై దృష్టి పెట్టాలి. ఈ మాటలు అన్నది ఎవరో కాంగ్రెస్ నేతలు కాదు. తమ అధికార పత్రిక సామ్నాలో ఉద్ధవ్ థాక్రే చేసిన వ్యాఖ్యలివి! మోదీ మన్మోహన్ గురించి రెయిన్ కోట్ కామెంట్ చేసినప్పటి నుంచీ దాన్ని వాడుకుని విమర్శించాలని శివసేన తెగ ఉబలాటపడుతోంది! అందులో భాగంగానే ఆ మధ్య మన్మోహన్ అద్భుతమైన ఆర్దికవేత్తని, నిజాయితీపరుడని కితాబులిచ్చాడు ఉద్ధవ్. అలాంటి వ్యక్తిని మోదీ విమర్శించవద్దని క్లాస్ తీసుకున్నాడు.   ఇంకా కోపం చల్లారక సామ్నా పత్రిక ఎడిటోరియల్ లో మరోసారి చెలరేగిపోయాడు. మోదీ ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో ప్రతిపక్షాల జాతకాలు తన వద్ద వున్నాయని బెదిరించటం సరికాదన్నాడు. బీజేపి ఓడిపోయినప్పుడు ఇతర పార్టీలు కూడా అలాగే బ్లాక్ మెయిల్ చేస్తాయని హితవు పలికాడు. అంతే కాదు, ఉద్ధవ్ థాక్రే ఉత్తర్ ప్రదేశ్ లో మహిళలు సాయంత్రం బయటకి రాలేపోతున్నారని మోదీ అనటాన్ని కూడా తప్పుబట్టాడు. అక్కడ డెబ్బై మంది బీజేపి ఎంపీలు వున్నారనీ, వారంతా సాయంత్రాలు ఏం చేస్తున్నారని అడిగాడు. మహిళల రక్షణ వారికి పట్టదా అన్నాడు!   శివసేన ఇలా బీజేపి విషయంలో రాద్ధాంతం చేయటం ఇదే మొదటిసారి కాదు. అసలు గుజరాత్ రాష్ట్ర శివసేన అధ్యక్షుడుగా మోదీ శత్రువు... హార్దిక్ పటేల్ ను ఉద్ధవ్ నియమించాడంటేనే... పరిస్థితి ఎంతదాకా వచ్చిందో తెలుసుకోవచ్చు! దీనికంతటికీ కారణం, మహారాష్ట్రలో బీజేపి బలం పుంజుకోవటమే. మోదీ మేనియాతో 2014 నుంచీ క్రమంగా మహారాష్ట్ర కమలం వికసిస్తూ పోతోంది. ఫడ్నవీస్ సీఎం అయ్యాక గత కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పార్టీల ప్రభుత్వాల కంటే మెరుగైన పాలన అందుతోంది. ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత పెల్లుబుకటం లేదు. ఇదే శివసేనకు మింగుపడటం లేదు. ఒకప్పుడు తమకు తోక పార్టీగా వున్న బీజేపి ఇప్పుడు తమనే శాసించటం ఉద్ధవ్ జీర్ణించుకోలేకపోతున్నాడు!   మహారాష్ట్రలో కమల వికసానికి కారణం కేవలం మోదీ మ్యాజిక్ మాత్రమే కాదు. శివసేన, ఎమ్ఎన్ఎస్ మహారాష్ట్ర సెంటిమెంట్ అడ్డుపెట్టుకుని అరాచక రాజకీయాలు చాలానే చేశాయి. బాల్ థాక్రే చనిపోయాక శివసేనకు ఒక ప్రజాకర్షణ గల లీడర్ కూడా లేకుండా పోయాడు. అందువల్లే ఆరెస్సెస్ మద్దతు కూడా వున్నా బీజేపి శివసేన ఓటు బ్యాంక్ తినేస్తూ వస్తోంది. కాని, ఉద్ధవ్ బీజేపిపై మండిపడటం తప్ప క్షేత్రస్థాయిలో ఏమీ చేయటం లేదు. పేద, మధ్యతరగతి మరాఠీల ఇబ్బందుల్ని పట్టించుకుని, ఉద్యమాలు చేయాల్సిన ఆ పార్టీ ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల మీద కామెంట్స్ చేస్తూ కాలం గడుపుతోంది.   తమ పతనానికి బీజేపి కన్నా పెద్ద కారణం తమ నిర్లక్ష్యమే అని ఉద్ధవ్ తెలుసుకోలేకపోతున్నాడు. అంతే కాదు, రాజ్ థాక్రే లాంటి నేత వేరు కుంపటి పెట్టుకోవటం కూడా శివసేన బలం తగ్గించింది. ఇవన్నీ ఆలోచించుకోకుండా అరివింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ లాగా ఉద్ధవ్ పొద్దస్తమానం మోదీని తిట్టిపోస్తున్నాడు. కాని, దాని వల్ల నష్టం కలిగితే కలగాలి తప్ప లాభం చేకూరే అవకాశం లేదు. ఎందుకంటే, మోదీ ప్రభావం అంతా జాతీయ రాజకీయాల్లో వుంటుంది. ఉద్ధవ్ తన పార్టీని బతికించుకోవాలంటే బలపడాల్సింది, తలపడాల్సింది మహారాష్ట్ర రాజకీయాల్లో! ఇది శివసేన అధినేతకి అంత తేలిగ్గా బోధపడుతుందని అనిపించటం లేదు...

దారి తప్పొచ్చిన చైనీస్, ఇండియన్ మనవడ్నెత్తుకుని ఇంటికెళ్లాడు!

  ఆయన మన దేశం వాడు కాదు! కాని, ఆయన భార్య మధ్యప్రదేశ్ లోని ఒక మారుమూల పల్లెకు చెందినావిడ! ఆయన ముగ్గురు పిల్లలు కూడా భారతీయులే. మనవలు, మనవరాళ్లు కూడా వున్నారాయనకి! ఇంతకీ మన దేశంలోనే గత 54ఏళ్లుగా వుండిపోయిన ఆ విదేశీ ఎవరు? వాంగ్ కీ, ఓ చైనీస్ సైనికుడు!   అయిదున్నర దశాబ్దాల తరువాత భారతదేశంలోని మధ్యప్రదేశ్ నుంచి తన స్వదేశానికి వెళ్లాడు వాంగ్. 1963లో ఇటు వచ్చేప్పుడు ఆయనకి 23ఏళ్లు. ఒంటరి. కాని, అటు వెళ్లేప్పుడు మాత్రం కొడుకు, కూతురు, కోడలు, మనవడితో వెళుతున్నాడు! అయితే, ఆయనేదో ఇష్టపడి భారతదేశానికి వచ్చి ఇక్కడే పెళ్లి చేసుకుని సెటిలైపోయాడనుకోకండి! మన దేశం అనివార్య పరిస్థితుల్లో బలవంతంగా వాంగ్ ను ఇక్కడ వుంచేసింది. ఎందుకంటే, ఆయన 1960ల నాటి విషమ పరిస్థితుల్లో చైనా సైనికుడు. మ్యాపులు గీసే సర్వేయర్. తన పనిలో భాగంగా ఇండియా సరిహద్దులో తిరగాడాడు. తెలిసో, తెలియకో హద్దు దాటి మన వైపు వచ్చేశాడు. ఆయుధాలు పట్టుకుని వచ్చిన నైనికుడు కానప్పటికీ ఆయన శత్రుదేశం వాడు కావటంతో అప్పటి మన భద్రతా దళాలు బంధించాయి. తరువాత ఏడేళ్లు వాంగ్ ని వివిధ జైళ్లలో వుంచారు అధికారులు. చివరకు, 1969లో ఆయనని వదిలేశారు. కాని, తిరిగి మాతృదేశానికి పంపలేదు. భద్రతా కారణాల దృష్ట్యా ఆయనని మధ్యప్రదేశ్ లోని మారుమూల తిరోడి గ్రామంలో విడిచిపెట్టి అక్కడ కొత్త జీవితం ప్రారంభించుకోమని చెప్పారు!   ఇండియా నుంచి చైనా తిరిగి వెళ్లటం సాధ్యం కాదని తేలిపోయిన వాంగ్ ముప్పై ఏళ్ల వయస్సులో స్థానిక భారతీయురాలినే పెళ్లి చేసుకున్నాడు. ముగ్గురు పిల్లలు పుట్టారు. మనవలు, మనవరాళ్లు కూడా కలిగారు! పూర్తిగా భారతీయ బంధాల్లో ఇమిడిపోయాడు చైనీస్ వాంగ్! కాని, ఎవరికైనా స్వంత దేశంపై మమకారం లోలోన వుంటుంది కదా? అదీ అక్కడ ఇరవై ఏళ్లు పెరిగి, పెద్దవాడైన వాడు కదా? అందుకే, వాంగ్ ఈ మధ్య చైనీస్ అధికారుల చేసిన విజ్ఞప్తులకి మన అధికారులు ఒప్పుకుంటే... వెంటనే చైనాకు వెళతానని అంగీకరించాడు! అక్కడికి వెళ్లి తన ఫేవరెట్ నూడుల్స్ తింటూ చైనాలో ఫేమస్ అయిన యెల్లో నదిని వీక్షించాలని ఆయన కోరిక! అది ఎట్టకేలకు ఇప్పుడు నిజం అయింది!   పిల్లలు, మనవడితో కలిసి చైనా వెళ్లిన వాంగ్ అక్కడే వుంటాడని భావించలేం. చైనా ఆ ఏర్పాట్లు కూడా చేసింది. కాని, వాంగ్ తిరిగి ఇండియా వచ్చే అవకాశాలే ఎక్కువ. అయితే, ఆయన లాగే తిరోడి గ్రామంలోనే మరో దారి తప్పి భారతదేశంలోకి వచ్చిన చైనీస్ సైనికుడు వున్నాడు! ఆయన పేరు ల్యూ షురాంగ్! అతను కూడా ఇక్కడి జీవితంతో మమేకం అయిపోయాడు. కాని, తిరిగి చైనా వెళ్లనని చెప్పేశాడు. అక్కడ తనకు కుటుంబం అంటూ ఏమీ లేదనీ, ఇక్కడే వుంటానని ఆయన అన్నాడు!    

మన అమరావతిని చూసి పాక్ ఎందుకు భయపడుతోంది?

  నవ్యాంధ్ర రాజధాని అమరావతి. సూటిగా మాట్లాడుకుంటే ఇంకా పూర్తి స్థాయిలో నిర్మాణమే ప్రారంభం కాలేదు! ఎప్పుడు పూర్తవుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి! కాని, అసలు ఇంకా అందుబాటులోకే రాని అమరావతి అంటే పాకిస్తాన్ ఎందుకు ఆమడ దూరం పరిగెడుతోంది? వింతగా వున్నా ఇది భారతీయులందరూ తెలుసుకోవాల్సిన విచిత్ర విషయం!   ఇండియా మీద ఏదో ఒక ఆరోపణ చేయటం దాయాది దేశానికి అలవాటే కదా... అలాగే, ఆ మధ్య మన అమరావతి గురించి ఏదేదో వాగింది పాకిస్తాన్! మోదీ ప్రభుత్వం ఏపీలో కడుతోన్న అమరావతి ప్రత్యేక అణు నగరం అంటూ ప్రచారం చేసింది. అక్కడ అణు రియాక్టర్లు కూడా నిర్మిస్తోందంటూ కొన్ని ఫోటోలు చూపించింది. అవన్నీ ఉట్టివే! అయితే, కొన్నాళ్లు తన ఆరోపణల్ని పక్కన పెట్టిన పాకిస్తాన్ గురువారం నాడు మరోసారి తన పిచ్చి వాగుడు మొదలు పెట్టింది. ఆ దేశ విదేశీ వ్యవహారాల కార్యదర్శి ఒకరు ఇండియా స్పెషల్ న్యూక్లియర్ సిటీ నిర్మిస్తోందని చెప్పుకొచ్చారు. మన దేశం పోగేసిన అత్యంత శక్తివంతమైన అణు బాంబుల్ని ఆ స్పెషల్ న్యూక్లియర్ సిటీలో భద్రపరచనున్నట్టు ఆయన ఆరోపించాడు! పాక్ చెబుతోన్న ఆ సీక్రెట్ సిటీ అమరావతే కావటం ఇక్కడ అతి పెద్ద విడ్డూరం!   ఇండియన్ అధికారులు పాక్ చేస్తోన్న ఆరోపణలు పిచ్చి మాటలని కొట్టిపారేశారు! ఎప్పటికప్పుడు ఉగ్రవాదుల్ని భారత్ లోకి ఎగతోసే పక్క దేశం తన ఆరాచకాల్ని కప్పి పెట్టేందుకు ఇలాంటి డ్రామాలు ఆడుతుంటుందని వారన్నారు. ప్రపంచం దృష్టిని మరల్చటానికి స్పెషల్ న్యూక్లియర్ సిటీ లాంటి అభూత కల్పనలు చేస్తుంటుందని వివరించారు!   ఏది ఏమైనా మన అమరావతి ఎలా వుండబోతోందో మనకే తెలియకపోయినా.. పాక్ దాని గురించి నానా తప్పుడు ప్రచారాలు చేస్తుండటం నిజంగా విడ్డూరమే!  

భూములు అప్పుడు లాక్కున్నారు... పాపం ఇప్పుడు పండింది!

  లక్షల సంవత్సరాల క్రితం సరస్వతీ నది వుండేదట! అది ఇప్పుడు అదశ్యమైపోయిందంటారు పెద్దలు! జగన్ తాను ప్రారంభిస్తానన్నా సరస్వతీ సిమెంట్స్ ఫ్యాక్టరీ కూడా అలాంటిదే! సరస్వతీ సిమెంట్స్ పేపర్ల మీదా, న్యూస్ పేపర్ల మీదా కనిపించిందే తప్ప ఏనాడూ నిజంగా అస్థిత్వంలోకి వచ్చిందీ లేదు.. ఉత్పత్తి జరిగిందీ లేదు! ఉద్యోగాలు ఇచ్చింది అయితే అసలే లేదు! ఇక తాజాగా సరస్వతీ పేరు చెప్పి ఇంతకాలంగా జగన్ బాబు ఖర్చీప్ వేసిన వందల ఎకరాల భూములన్నీ ఈడీ అటాచ్ చేసింది. ఈ పరిణామంతో ఏడేళ్లుగా భూములు కోల్పోయి భోరున విలపిస్తోన్న రైతుల కళ్లలో ఆనందం తొణికిసలాడుతోంది!   ఇంతకీ సరస్వతీ సిమెంట్స్ సినిమా ఏంటి? ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకున్న కొద్దీ మన ప్రతిపక్ష నేత ఏ రేంజు దర్శకుడో క్లియర్ గా అర్థం అవుతుంది! ఆయన తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో వుండగా నడిపిన అవినీతి రీళ్లలో ఇది కూడా ఒకటి. సరస్వతీ సిమెంట్స్ ఫ్యాక్టరీ పెట్టాలని జగన్ 2008 - 09 సంవత్సరాల్లో నిర్ణయించుకున్నారు. కాని, అంతకంటే ముందే గుట్టుచప్పుడు కాకుండా పల్నాడు ప్రాంతంలోని సున్నపు రాయి నిక్షేపాల్ని జల్లెడ పట్టించేశారు. ఎక్కడ ఎంత లోతున సున్నపు రాయి వున్నదీ ఒక అవగాహనకు వచ్చారు.   దాని ప్రకారం వేమవరం, చెన్నాయపాలెం, తంగెడ వంటి ఊళ్లలో వందల ఏకరాలు ఖరీదు చేశారు. చడీచప్పుడు కాకుండా సున్నపు రాయి వెలికీ తీసేందుకు మైనింగ్ పర్మిషన్ కూడా తెచ్చుకున్నారు. కాని, చివరి నిమిషంలో శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు అమాయక రైతుల తరుఫున పోరాటం చేయటంతో యువనేత వారు దిగిరాక తప్పలేదు. దాని ఫలితమే సరస్వతీ సిమెంట్స్ ఫ్యాక్టరీ నెలకొల్పాక ఇంటికో ఉద్యోగం ఇస్తానని అంగీకరించటం. ఆ మాటలు నమ్మిన ఆయా గ్రామాల రైతులు కారు చౌకగా భూములు అమ్మేశారు. ఎకరానికి లక్ష ఇరవై వేల నుంచి మూడు లక్షల వరకూ చెల్లించి జగన్ దాదాపు వెయ్యి ఎకరాలు స్వంతం చేసుకున్నారు. ఇక సరస్వతీ సిమెంట్స్ మొదలైతే భూములు ఇచ్చిన తమకు ఉద్యోగాలు వస్తాయని రైతులు ఆశగా ఎదురు చూశారు. కాని, ఇన్నేళ్లైనా ఆ కల నెరవేరలేదు!   ఏడేళ్ల కిందట భూములు స్వాధీనం చేసుకున్న సరస్వతీ సిమెంట్స్ యాజమాన్యం రైతులకి ఎంత మాత్రం ఉపాధి కల్పించలేదు. ఉత్పత్తి కూడా చేయలేదు. లక్షల రూపాయాల ఆదాయాన్నిచ్చే సాగుభూమిని మాత్రం కబ్జాలో వుంచుకుంది. చివరకు, ఆగ్రహించిన రైతులు తమ భూములు తాము మళ్లీ సాగు చేసుకుంటామని ఉద్యమానికి దిగేదాకా పరిస్థితి వచ్చింది. అయినా దౌర్జాన్యానికి దిగిన సరస్వతీ సిమెంట్స్ మ్యానేజ్మెంట్ 2014లో ఎన్నికల సమయంలో వేల కోట్లకు ఈ భూముల్ని అమ్ముకునే ప్రయత్నం కూడా చేసింది. కాని, జగన్ అధికారంలోకి రాకపోవటంతో ఎవ్వరూ ఈ భూములు కొనటానికి ముందు రాలేదు.   పచ్చటి పంటలతో కళకళలాడాల్సిన భూములు ఏళ్లుగా అలాగే వుండిపోతోంటే రైతులు ఉపాధి లేక విలవిలాడుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పై నడుస్తోన్న విచారణలో భాగంగా మొత్తం 903 ఎకరాల భూమిని ఈడీ అటాచ్ చేసింది. 318కోట్ల విలువైన ఈ నేలని అమ్మటం కాని, తనఖా పెట్టడం కాని ఏదీ చేయవద్దని ఆదేశాలు జారీ అయ్యాయి! ఈ పరిణామంతో తమ భూములు అమ్ముకుని ఇబ్బంది పడుతోన్న రైతులు సంతోషం వ్యక్తం చేశారు. కాని, సాధ్యమైనంత త్వరగా సరస్వతీ సిమెంట్స్ ఫ్యాక్టరీ ప్రారంభించి తమకు ఉద్యోగాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సమీప భవిష్యత్ లో జగన్ కు అలాంటి ఉద్దేశాలు ఏవీ వున్నట్టు మాత్రం కనిపించటం లేదు...

ట్రంప్, మోదీ vs పాక్, చైనా!

మోదీ అధికారంలోకి వచ్చాక అత్యంత ఉక్కిరిబిక్కిరి అవుతోంది ఎవరంటే పాకిస్తాన్ అనే చెప్పాలి! మనకి కళ్లకు కనిపించేంత లాభం కలగకపోవచ్చు. కాశ్మీర్ సమస్య అలాగే వుండి వుండవచ్చు. మరో వైపు పదే పదే పాక్ తన రక్త దాహంతో మన మీద దాడులు చేస్తూ వుండవచ్చు. అయినా కూడా పాక్ కి నిద్ర లేకుండా చేయటంలో మోదీ సక్సెస్ అవుతున్నారనే చెప్పాలి. అంతే కాదు, రాను రాను పాకిస్తాన్ ఆశలు పెట్టుకున్న అమెరికా దానికి కాశ్మీర్ విషయంలో దూరమవుతూ వస్తోంది. నమ్మకం పెట్టుకున్న చైనా కూడా చేతులు ఎత్తేసే పరిస్థితులు వస్తున్నాయి!   వాజ్ పేయ్ ప్రభుత్వ హయాంలో మన విమానం ఒకటి హైజాక్ అయింది. అప్పట్నుంచీ నిన్న మొన్నటి పఠాన్ కోట్ దాడి వరకూ అన్నిటి వెనుకా వున్న చీడపురుగు మసూద్ అజర్! జైషే మహ్మద్ అనే ఉగ్రవాద సంస్థ స్థాపించి అమాయకుల రక్తం తాగుతున్నాడు ఈ రాక్షసుడు. అందుకే, భారత్ పదే పదే వీడ్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితిని కోరుతోంది. కాని, ఇప్పటికి మూడు సార్లు చైనా అడ్డు పడింది. తన వీటో పవర్ ఉపయోగించి పాకిస్తాన్ ని, మసూద్ అజర్ ను కాపాడుతోంది! దీని వల్ల అంతర్జాతీయ సమాజంలో చైనాకు ఎక్కడలేని చెడ్డ పేరు వస్తోంది...   ఇప్పుడు పాకిస్తాన్ కు మిగిలిన ఏకైక నేస్తం డ్రాగనే. భారీగా పెట్టుబడులు పెడుతూ భారత్ మీద కక్ష్య సాధించటానికి చైనా పాక్ ను వాడుకుంటోంది. అది బాగా తెల్సిన ఇస్లామాబాద్ బీజింగ్ ను అంతకంటే ఎక్కువ వాడేసుకుంటోంది. యుద్ధం వస్తే చైనా మా తరుఫున గన్నులు పట్టుకుని వచ్చేస్తుందంటూ బెదిరించటం మొదలు మసూద్ అజర్ లాంటి ఉగ్రవాదుల్ని కాపాడుకోవటం వరకూ అన్నీ చేస్తోంది పాక్. అయితే, తాజాగా ట్రంప్ సారథ్యంలో సరికొత్త అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ కరుడుగట్టిన అజర్ పై కన్నేసింది. వాడ్ని యూఎన్ ఉగ్రవాదిగా ప్రకటించాలని త్వరలో కోరనుంది.     ఈ సారి కూడా చైనా వీటో చేసి అజర్ ని కాపాడాలని పాకిస్తాన్ కోరుకుంటోంది. కాని, చైనా అందుకు మరీ అంత ఉత్సాహంగా లేదని వార్తలు వస్తున్నాయి. కారణం అమెరికా లాంటి అగ్రదేశం రంగంలోకి దిగి ఒక ఉగ్రవాదిని టార్గెట్ చేస్తే చైనా తనకు ఏ లాభమూ లేకుండా ఇండియా, యూఎస్ కు శత్రువు కావటం అనవసరం అన్న ఫీలింగ్ తోనట! అందుకే, లోలోపల చైనా పాకిస్తాన్ కు మసూద్ అజర్ సంగతేంటో తేల్చుకోవాలని చెప్పేసిందంటున్నారు. ప్రతీ సారి తన పవర్ ఉపయోగించి ఐక్యరాజ్య సమితిలో కాపాడటం కుదరదని డ్రాగన్ అంటోందట!   మసూద్ అజర్ విషయంలోనే కాదు... ఈ మధ్య ట్రంప్ దెబ్బకి పాకిస్తాన్ హఫీజ్ సయీద్ ను కూడా హౌజ్ అరెస్ట్ చేసింది. ముంబై దాడులకి కారకుడైన ఆ హంతకుడ్ని అమెరికా భయంతోనే కాదు చైనా ఒత్తిడి మేరకు కూడా నవాజ్ షరీఫ్ నిర్భంధించాడని తాజా టాక్. ఇక హఫీజ్ సయీద్ అయితే స్వయంగా ట్రంప్, మోదీల జోడీనే తన నిర్భంధానికి కారణం అని చెప్పేశాడు కూడా! ఈ స్టేట్మెంట్ ఒక్కటి చాలు మోదీ వ్యూహం ఫలిస్తోందని చెప్పటానికి!   మోదీ వచ్చాక మొదలు పెట్టిన దూకుడు ఇండియా ఎప్పట్నుంచో ప్రారంభించాల్సింది. కాని, దురదృష్టవశాత్తూ అలా జరగలేదు. మన పాలకులు పాకిస్తాన్ను కావాల్సినంత గారాబం చేశారు. ఇప్పుడు ఆ తప్పు దిద్దుకున్నట్టు కనిపిస్తోంది. త్వరలోనే దాయాది దేశం దారికి వస్తుందని ఆశిద్దాం... 

శశికళ కాదు... శశి'కల'నేనా?

  శశికళ... శశికళగా కాకుండా శశి'కల'గా మిగిలిపోనుందా? గత కొన్ని రోజులుగా తమిళ రాజకీయాలు చూస్తుంటే అదే అనిపిస్తోంది! జయ మరణం తరువాత రెండు నెలలు కూడా కాక  ముందే శశికళ సీఎం పీఠంపై కళకళలాడిపోవాలని కోరుకుంది. అదే కలకలానికి కారణమైంది. అసలు ఆమె తొందరపడిందంటున్నారు విమర్శకులైతే. కాదు కాదు, ఇందులో చిన్నమ్మ లెక్కలు చిన్నమ్మకూ వుండే వుంటాయంటున్నారు మరి కొందరు! ఎవరి వాదన ఎలా వున్నా చెన్నై నుంచి ఢిల్లీ దాకా శశికళ కలకలం అందర్నీ ఆకర్షిస్తోంది!   భారతదేశ చరిత్రలోనే ఏనాడూ ఒక ముఖ్యమంత్రి చేత ప్రమాణ స్వీకారం చేయించటానికి గవర్నర్ లేకుండా పోవటం జరగలేదు. కాని, తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు హుటాహుటిన ఢిల్లీ వెళ్లి అక్కడే వుండిపోయారు. మీడియాలో చిన్నమ్మ పట్టాభిషేకం అంటూ బ్రేకింగ్ లు వచ్చినా, ఏర్పాట్లు చకచకా జరిగిపోయినా ఆయన హస్తిన వదిలి రాలేదు. అందుక్కారణం శశికళపై వేలాడుతోన్న సుప్రీమ్ కోర్టు తీర్పు తాలూకూ కత్తే! ఒక కేసులో ఏ2గా వున్న వ్యక్తిని ఎవరైనా సీఎంగా ఎలా ఒప్పుకుంటారు? కాని, మన రాజ్యాంగం ప్రకారం గవర్నర్ నిమిత్తమాత్రుడు మాత్రమే. అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు శశికళను తమ నేతగా ఎంచుకున్నాక విద్యాసాగర్ రావుకు పెద్దగా ఆప్షన్స్ ఏమీ లేవు. ఆయన చిన్నమ్మను గద్దె మీద కూర్చుండబెట్టాల్సిందే!   మొదట్నుంచీ శశికళపై అనుమానంగానే వున్న ప్రధాని మోదీ ఆమెను సీఎం అవ్వనిచ్చే ఉద్దేశంలో వున్నట్టు లేదు. ప్రజాస్వామ్యంలో ఆమెను నివారించటం తప్పే అయినా నైతికంగా మోదీ చేస్తున్నది కరెక్టే అనే వారు కూడా వున్నారు. నిజంగా తమిళనాడు జనంలో శశికళ సీఎం అవ్వాలన్న కోరిక ఎంత మాత్రం లేదు. ఆమె ఎన్నికల సమయంలోనే తన వారికి ఎమ్మెల్యే సీట్లు ఇప్పించుకుంది కాబట్టి వారు ఇప్పుడు ఆమెను సమర్థిస్తున్నారు. అంతే తప్ప తమిళ ప్రజలు జయలలిత సమానంగా చిన్నమ్మను అభిమానిస్తున్నారని భావించటం మూర్ఖత్వమే అవుతుంది. కాబట్టే, మోదీ రాజ్యాంగం ప్రకారం తప్పే అయినా విద్యాసాగర్ రావును చెన్నైవెళ్లకుండా ఆపేశారనుకోవాలి. కేవలం వారం రోజుల్లో దోషిగా తేలే అవకాశం వున్న శశికళ ఇంతలోనే సెక్రటేరియట్ లో కాలుమోపి సాధించేదేముంది? తీర్పు వచ్చాక ప్రమాణ స్వీకారం చేయవచ్చు కదా? ఇదే ప్రశ్న వేస్తున్నారు చాలా మంది! అందుకే, ముఖ్యమంత్రిగా శశికళ ప్రమాణ స్వీకారం చేస్తానన్నా గవర్నర్ రాకపోతే పెద్దగా నిరసనలు వెలువడలేదు. జనం రోడ్ల మీదకి రాలేదు. ఇలాగే జయ ప్రమాణానికి కేంద్రం అడ్డంకులు కల్పించి వుంటే జనాగ్రహం ఎలా వుండేది? ఈ ఒక్క అంశంలోనే శశికళ జనాకర్షణ తేలిపోతోంది!   తీర్పు వచ్చేలోగానే సీఎం పీఠం ఎక్కాలని శశికళ తొందరపడటంలో ఒకే ఒక్క లాజిక్ వుంది! సీఎంగా జైలుకి వెళ్లాల్సి వస్తే జనం, అన్నాడీఎంకే శ్రేణులు రోడ్లపైకి వచ్చే అవకాశం ఎక్కువ. అంతే కాదు సానుభూతి కూడా బాగానే వస్తుంది. మీడియా కూడా వీలైనంత ఎక్కువగా కవర్ చేస్తుంది. కాని, ఎలాంటి కుర్చీలో లేకుండా జైలుకెళితే తిరిగొచ్చేలోపు పుణ్యకాలం దాటిపోతుంది. పార్టీ తన చేతుల్లోంచి పూర్తిగా జారిపోతుంది. ఈ ఆలోచన చిన్నమ్మ మనసులో వుండి వుండాలి! అందుకే చకచకా పావులు కదిపింది. కాని,కేంద్రంలో పూర్తి మెజార్టీతో వుండీ, తమిళనాడులో పెద్దగా ఆశలేమీ లేని బీజేపి ఆమె ఆడమన్నట్టు ఆడే అవకాశాలు అస్సలు లేవు! అటు పోయి ఇటు పోయి స్టాలిన్ కోరినట్లు గవర్నర్ పాలన విధించాల్సి వస్తే అది కేంద్రానికి మరింత సౌకర్యం! రజినీకాంత్ లాంటి తిరుగులేని శక్తితో రాబోయే ఎన్నికల్లోకి దిగితే కమలానికి అధికారంలో వాటా గ్యారెంటీ!

శేఖర్ వల్ల... షేకైపోతోన్న బాలయ్య కంచుకోట!

శేఖర్ ... ఇప్పుడు ఈ పేరు ఆంధ్రప్రదేశ్ అంతటా వినిపిస్తోంది! మరీ ముఖ్యంగా, అనంతపురం జిల్లాలో, మీడియాలో తెగ సందడి చేస్తోంది! అలాగని, ఈ శేఖర్ ఎవరో సెలబ్రిటీ కాదు. ఒక టాప్ సెలబ్రిటీకి పీఏ! అంతే! కాని, అధికార టీడీపీకి ఎంతో కీలకమైన హిందూపురం నియోజకవర్గాన్ని సదరు శేఖర్ సారు అతలాకుతలం చేసేస్తున్నారు. అంతే కాదు, పార్టీలో చంద్రబాబు తరువాత అంతటి స్థాయి వున్న బాలకృష్ణను కూడా రొంపిలోకి లాగుతున్నాడు!    హిందూపురం ఎమ్మెల్యే హీరో బాలయ్య. ఈ విషయం అందరికీ తెలిసిందే. కాని, నిన్న మొన్నటి వరకూ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అక్కడ తనని తాను ఎమ్మెల్యేగా ఫీలైపోతున్నాడు బాలకృష్ణ పీఏ శేఖర్. ఆయన పెడుతోన్న టార్చర్ భరించలేక ఇప్పుడు నానా రభస జరుగుతోంది నియోజకవర్గంలో. ఎవరో ఒకరిద్దరు నేతలని కాకుండా చాలా మంది నాయకులే రోడ్లపైకి వచ్చేశారు. శేఖర్ ని అమాంతం వెనక్కి పిలిపించాలని డిమాండ్ చేస్తూ నిరసనలకు దిగుతున్నారు. అధికారుల్ని కూడా తన చెప్పుచేతల్లో పెట్టుకున్న ఎమ్మెల్యే పీఏ ఎవ్వర్నీ పట్టించుకోవటం లేదంటున్నారు. తన ఇష్టారాజ్యంగా ఆర్డర్లు వేస్తూ అవినీతికి పాల్పడుతున్నాడని సీరియెస్ ఆరోపణలే చేస్తున్నారు.    సినిమా షూటింగ్స్ లో బిజీగా వుండే బాలయ్య ప్రతీ రోజూ హిందూపురంలో వుండలేరు. అందుకే, శేఖర్ కి అన్ని అధికారాలూ ఇచ్చారు. వాటిని ఆయన దుర్వినియోగం చేస్తున్నారని ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. అదీ ఒకరిద్దరు కాదు. చాలా మందే చేస్తున్నారు. కాబట్టి ఎంత త్వరగా దీనిపై బాలకృష్ణ, చంద్రబాబు దృష్టి పెడితే అంత మంచిది. కాని, పరిస్థితి చూస్తుంటే అలా కనిపించటం లేదు. టాప్ లెవల్లో శేఖర్ గొడవని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించటం లేదు. కనీసం పార్టీ హైకమాండ్ తరుఫున శేఖర్ వ్యతిరేక వర్గాన్ని ఎవరూ పిలిచి మాట్లాడినట్టు కూడా సంకేతాలు లేవు.     దీని వల్ల గొడవ మరింత పెద్దదవుతోంది. మీడియాలో పార్టీ పరువుపోతోంది. అంతే కాదు, బాలకృష్ణ లాంటి కీలక నేత ప్రతిష్ఠ కూడా ఇందులో ముడిపడి వుంది. అందుకోసమైనా టీడీపీ అధిష్ఠానం త్వరగా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. నిజంగా, శేఖర్ అరాచకానికి పాల్పడ్డాడా లేదా అన్నది నిగ్గుతేల్చాలి. ఎందుకంటే, ఊరికే నియోజక వర్గంలోని నేతలు ఎమ్మేల్యే పీఏపై ఆరోపణలు చేస్తారని భావించలేం. అదీ ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణను కూడా గొడవలోకి లాగేటటువంటి ఆరోపణలు ఎవరూ కాలక్షేపం కోసం చేయరు కదా?    హిందూపురంలో శేఖర్ కలకలంపై ఇప్పటి వరకూ ఇటు బాలకృష్ణ కాని, అటు చంద్రబాబు కాని మాట్లాడలేదు. అలాగే, పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ కూడా దీనిపై దృష్టి పెట్టారని ఎలాంటి వార్తలు లేవు. మరి దీనికి అంతం ఎలా? శేఖర్ సంక్షోభం ఎంతగా ముదిరితే అంతగా పార్టీకి, బాలకృష్ణకు నష్టం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. హిందూపురం లాంటి టీడీపీ కంచుకోటలో ఇలాంటి పరిస్థితులు ఎక్కువ కాలం కొనసాగటం మంచిది కాదంటున్నారు. చూడాలి మరి, పార్టీ అధిష్టానం దీనిపై ఎలాంటి ప్లాన్ తో వుందో! ఇంత జరుగుతున్నా హైకమాండ్ కి ఏమీ తెలియదనుకోవటం పొరపాటే అవుతుంది!

ట్రంప్ కి సవాలు విసిరిన చంద్రబాబు

అమెరికా కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి తన ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. దీనిలో భాగంగా ఏడు ముస్లిం దేశాలకు చెందిన శరణార్థులు, పౌరులను అమెరికాలోకి అడుగుపెట్టకుండా ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా హెచ్‌1బీ వీసాల మీద పరిమితులు విధించారు. మొదటి దాని కంటే రెండవ నిర్ణయం మాత్రం అమెరికా వెళ్లాలని కలలు గంటున్న యువతకు శరాఘాతంగా మారింది.     మరీ ముఖ్యంగా భారతీయుల్లో అమెరికా అంటే విపరీతమైన మోజు...అక్కడికి వెళ్లి నాలుగు డాలర్లు సంపాదించాలని ఆశపడని భారతీయుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు అధ్యక్షుల వారి నిర్ణయం భారతీయులకు  ముఖ్యంగా తెలుగువారికి ఏమాత్రం మింగుడు పడటం లేదు. దేశం మొత్తం మీద తెలుగు రాష్ట్రాల నుంచే అత్యధిక సంఖ్యలో యువత అమెరికా వెళుతూ ఉంటారు. అందుకే శ్వేతాసౌధాధిపతి నిర్ణయం తెలుగువారిని కలవరపెడుతోంది. ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా..ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించే టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమస్యపైనా స్పందించారు.     ట్రంప్ నిర్ణయం ప్రపంచం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది, ప్రధానంగా అమెరికాలో పనిచేస్తున్న భారతీయులకి. అయితే, భారతీయులు, ముఖ్యంగా తెలుగు వాళ్ళు అస్సలు భయపడొద్దని చెప్తుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.     "ట్రంప్ అమెరికా నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి భారతీయుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ప్రధానంగా, తెలుగు ఎన్‌ఆర్‌ఐలు గందరగోళంలో ఉన్నారు. నేను చెప్తున్నా.. ట్రంప్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తా. తెలుగు వారందరికీ మంచి జరిగేలా చూస్తా," అని అన్నాడు చంద్రబాబు.     కొన్ని లక్షల మంది అమెరికాలో పనిచేస్తున్నారని, ఒకేసారి వెళ్లిపొమ్మంటే ఎక్కడికి వెళ్తారని చంద్రబాబు ప్రశ్నించారు. అమెరికాకి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం, అవసరమైతే భారత ప్రభుత్వ సహకారం కూడా తీసుకుంటాం అని చెప్పారు. అక్కడితో ఆగకుండా ఒక మంచి సలహా కూడా ఇచ్చారు బాబు గారు. అమెరికాకి గుణపాఠం చెప్పాలి అంటే మన ఉద్యోగాలు ఇక్కడే ఏర్పరచుకునే ప్రయత్నం చేయాలన్నారు.     ఇది నిజంగా జరిగే పనే అంటారా! జరిగితే మాత్రం ఒక విధంగా మంచిదే!

మన అత్యాశే "క్లిక్‌" మనిపించింది

డబ్బు..రెండక్షరాలే..కానీ ప్రపంచాన్ని చుట్టేస్తూనే ప్రపంచాన్నే గిరగిరా తిప్పేస్తోంది. మనిషి డబ్బు అనబడే మారకాన్ని తయారు చేసి మంచి పని చేశానని జెబ్బలు చరుచుకుంటున్నాడు..కానీ ఆ మంచితో పాటే అన్నీ జాడ్యాలు దాని వెంబడే ఉన్నాయని కనిపెట్టలేకపోయాడు. మనిషి డబ్బు కోసం ఎంతగా అర్రులు చాస్తే అంతే త్వరగా పతనమైపోతాడు. ఎంత వీలైతే అంత త్వరగా పక్కవాడి కన్నా ముందుగా కోటీశ్వరులైపోవాలి నేటీ తరం అంతా ఇలాగే ఆలోచిస్తుంది. ప్రపంచం సంగతి పక్కన బెడితే ఫ్రీ వస్తే ఫినాయిల్ ‌తాగే మనుషులున్న భారతదేశంలో ఇలాంటి వ్యక్తుల బలహీనతను ఆసరాగా తీసుకుని పుట్టగొడుగుల్లాగా సంస్థలు పుట్టుకొచ్చి జేబులు నింపుకుంటున్నాయి..   డిపాజిట్ కడితే రెండున్నర రెట్ల సొమ్ము..రోజువారీగా మన అకౌంట్లో జమ చేయడం..వినడానికి బాగానే ఉంటుంది కానీ, జేబు ఖాళీ అయ్యాక, నమ్ముకున్నాడే బిచాణా ఎత్తేస్తాడని తెలిశాక..అప్పుడు కానీ అది మోసమని..మనం నిండా మునిగామని అర్థం కాదు.  ఆకర్షణీయమైన స్కీములు..శ్లాబ్‌లు రూపొందించి కోట్లకు కోట్లు కొల్లగొడుతున్నారు కొందరు కేటుగాళ్లు.. ఇలాంటి ఎన్నో బాగోతాలు వెలుగులోకి వచ్చినప్పటికి భారతీయులకు డబ్బు పట్ల ఉన్న మక్కువ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. తాజాగా మరో భారీ ఆన్‌లైన్ మల్టీలెవల్ మార్కెటింగ్ మోసం గుట్టురట్టయ్యింది. ఇంట్లో కూర్చొని వెబ్‌సైట్ల లింకులు క్లిక్ చేయడం ద్వారా లక్షలు సంపాదించవచ్చని ఎరవేసి లక్షల మంది నుంచి డబ్బులు కొల్గగొట్టిన ఆన్‌లైన్ మోసాన్ని ఉత్తరప్రదేశ్‌ పోలీసులు ఛేదించారు.   2015లో అనుభవ్ మిట్టల్ అనే వ్యక్తి నోయిడాలో అబ్లేజ్ ఇన్ఫో సొల్యూషన్స్‌ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని ప్రారంభించి సోషల్ ట్రేడ్.బిజ్ అనే పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ మోసానికి తెరలేపింది. ఈ వెబ్‌సైట్‌లో రూ. 5,750, రూ. 11,500 రూ.28,750, రూ. 57,500 చెల్లించి సభ్యత్వం తీసుకోవాలి. అలా తీసుకున్న సభ్యత్వాన్ని బట్టి వెబ్‌సైట్ల లింక్స్ పంపుతారు. ఆ లింక్స్‌ను క్లిక్ చేసి ఓపెన్ చేస్తే ప్రతీ క్లిక్‌కు రూ.5 చొప్పున చెల్లిస్తారు. అంతేకాకుండా ఇతరులను సభ్యులుగా చేర్పిస్తే ఈ క్లిక్స్ రెట్టింపు అవుతాయి. దీనికి ఆశపడిన ఎంతో మంది తాము చేరడమే కాకుండా స్నేహితులను, బంధువులను సభ్యులుగా చేర్పించారు. ప్రారంభంలో వారికి డబ్బులు బాగానే రావడంతో మరిన్ని సభ్యత్వాలు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా 7 లక్షల మంది వీరి బుట్టలో పడ్డారంటే ఎంతగా మాయ చేశారో అర్థం చేసుకోవచ్చు..కానీ నిజాన్ని ఎంతోకాలం దాచలేరు కదా...! ఆ సమయం ఆసన్నమైంది.     గత 15 రోజుల నుంచి కొందరు ఖాతాదారులకు డబ్బులు రావడం లేదు..ఇదే విషయంపై ఈమెయిల్స్ ద్వారా వివరణ కోరగా..ఆర్‌బీఐ నిబంధనల కారణంగా వెబ్‌సైట్‌ పేరును ఫెండ్సప్‌గా మారుస్తున్నమని..త్వరలోనే ఖాతాల్లో డబ్బులు పడతాయని చెప్పారు.. దీనిపై అనుమానం కలిగిన కొంతమంది పోలీసులను ఆశ్రయించడంతో మొత్తం భండారం బయటపడింది. గురువారం నోయిడాలోని సంస్థ కార్యాలయాలపై దాడులు చేసిన పోలీసులు సంస్థ డైరెక్టర్ అనుభవ్ మిట్టల్, సీఈవో శ్రీధర్, టెక్నికల్ హెడ్ మహేశ్ దయాళ్‌ను అరెస్ట్ చేసి.. ఖాతాలను సీజ్ చేశారు..ఈ ఖాతాల్లో రూ.500 కోట్ల వరకు ఉన్నట్లు అంచనా. తదుపరి చర్యల కోసం భారత రిజర్వ్ బ్యాంక్, ఆదాయపు పన్ను విభాగం, సెబీకి సమాచారం అందించామని పోలీసులు తెలిపారు. మనిషిలో డబ్బు మీద ఆశ చావనంత కాలం..ఇలాంటి మోసాలకు..మోసం చేసే కంపెనీలకు కొదవ ఉండదు. డబ్బు అనే ఆశను చక్కగా నియంత్రించగలిగితే సర్వసుఖాలు కిందకి దిగి వస్తాయి..లేదంటే అంతే స్థాయిలో చుక్కలు కనిపిస్తాయి. 

పోలీస్ బాస్ ల న(యీమ్)య వంచన... 

పోలీసులకి , దొంగలకి మధ్య రిలేషన్ షిప్ ఎలా వుండాలి? వలకి, చేపకి మధ్య వున్న సంబంధంలా వుండాలి. కాని, అది ఫిష్ కి, అక్వేరియమ్ కి మధ్య వున్న రిలేషన్ లా వుంటే ఎలా వుంటుంది? నయీమ్ ఫోటోలు చూసిన చాలా మంది ఇప్పుడు ఇలాగే ప్రశ్నించుకుంటున్నారు! మరోసారి మన పోలీస్ వ్యవస్థపై అంతా ఆందోళనకి గురవుతున్నారు... కేసు పెట్టడానికి స్టేషన్ కి వెళితే బాధితుల్నే వేధించిన పోలీసులని మనం చాలా సార్లు వింటుంటాం. ఒక్కోసారి ఖాకీలు అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారా అని కూడా అనుమానపడుతుంటాం. కాని, పదే పదే బయటపడే పోలీస్ అరాచకాలు అన్నిట్నీ పటాపంచలు చేసేస్తుంటాయి. గ్యాంగస్టర్  నయీమ్ తో ఖాకీల చెట్టాపట్టాలు అలాంటివే! అసలు ఒక రౌడీ షీటర్ అంతలా నియంతలా ఎలా ఎదగగలిగాడు అని ప్రశ్నించుకుంటే మనకు తాజాగా బయటపడ్డ ఫోటోలే సమాధానంగా దొరుకుతాయి. నయీమ్ హఠాత్తుగా ఎన్ కౌంటరై టీవీల్లో కనిపించే వరకూ ఎవరూ అలా జరుగుతుందని ఊహించలేదు. అందుక్కారణం అతడికి వున్న పరపతే. ఒకప్పుడు మావోయిస్టులతో పని చేసిన నయీమ్ తరువాత బయటకొచ్చి ఎన్నో ఆకృత్యాలు చేశాడు. అందుకు రాజకీయ నేతలు, పోలీసుల అండదండలు పుష్కలంగా వుండేవని చాలా మంది చెబుతారు. కాని, ఎప్పుడూ ఎక్కడా ఖచ్చితంగా మాత్రం బయటపడలేదు. అయితే, ఎక్కడో ఏదో తేడా జరిగి నయీమ్ తాను విందులు, వినోదాలు చేసుకున్న పోలీసుల చేతిలోనే ఆశ్చర్యకరంగా అంతమయ్యాడు. కాని, అంత అవలీలగా ఎన్ కౌంటర్ చేసిన మన భద్రత దళాలు మరి అంత కాలం ఎందుకు స్వేచ్ఛగా వదిలేశాయి? ఇదే ప్రశ్న అతడి బాధితుల్ని, చాలా మంది సామాన్యుల్ని వేధించింది. అయితే, కారణం ఇప్పుడు ఫోటోల రూపంలో బయటపడింది...  ఈ మధ్యే నయీమ్ కు , పోలీసు ఉన్నతాధికారులకు సంబంధలు వున్నట్టు ఎలాంటి సాక్ష్యాలు లభ్యం కాలేదని కోర్టుకు చెప్పాయి దర్యాప్తు సంస్థలు. తరువాత లోలోన ఏం జరిగిందో కాని ఉన్నట్టుండీ పోలీస్ బాస్ లు నయీమ్ తో విందులు చేసుకుంటున్న ఫోటోలు బయటకొచ్చాయి. ఇది ఆ ఫోటోల్లోని అధికారులకి తీవ్రమైన కళంకమే. కాకపోతే, ఇప్పటికిప్పుడు కోర్టుల పరంగా వారికొచ్చే నష్టమేం లేదు. అలాగే, నయీమ్ ను పెంచి, పోషించింది పోలీసులు, రాజకీయ నేతలేనన్న వాదనకి కూడా ఈ ఫోటోలతో అమోద ముద్ర లభించింది! పోలీసులే లేకుంటే మన సమాజాన్ని అస్సలు ఊహించలేం. అరాచకం దారుణంగా ప్రబలిపోతుంది. కాబట్టి నిజాయితీగల పోలీసుల సేవలు, త్యాగాలు అస్సలు కాదనలేనివి. కాని, వారి మధ్యనే ఖాకీ డ్రస్సు వేసుకున్న రౌడీ ఇన్ స్పెక్టర్లు, గూండా అధికారులు వుండటం ఇక్కడ పెద్ద విషాదం. వృత్తిలోని ఒత్తిడి తట్టుకోలేక ఒకవైపు కింది స్థాయి పోలీసులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పై స్థాయి వారు సంఘ విద్రోహ శక్తులతో జల్సాలు చేయటం క్షమించరానిది. దీనిపై ప్రభుత్వం కఠినంగా స్పందించాలి. పోలీసు వ్యవస్థ ప్రజల నమ్మకం దృఢంగా వుండేలా చూడాలి...         

ఈ కారణాల వల్లే... ఈ బడ్జెట్ 'చరిత్ర'లో నిలిచిపోనుంది!

  బడ్జెట్ 2017 పార్లమెంట్లో ప్రవేశపెట్టారు జైట్లీ. ఎప్పటిలాగే ఆహా అనే వారూ, ఊహూ అనే వారూ ఇద్దరూ వున్నారు చర్చలో. ఇక సామాన్య జనం ఇంకా క్లారిటీకి రాలేదు తమకు లాభమా, నష్టమా అన్న విషయంలో! కాని, ఈ సారి మోదీ సర్కార్ బడ్జెట్ కొన్ని విషయాల్లో ఖచ్చితంగా స్పెషలే. పేదలు, పెద్దలు లాంటి పదాలు పక్కన పెడితే ఈ బడ్జెట్ నోట్ల రద్దు తరువాత ప్రవేశపెట్టిన తొలి పద్దు. అందుకే, ప్రధాని, ఆర్దిక మంత్రి తమ పై ఎలాంటి వరాల జల్లు కురిస్తారా అని అంతా ఎదురు చూశారు. మరి నిజంగా సామాన్యుల పంట పండిందా అంటే , నో క్లారిటీ! డీమానిటైజేషన్ తరువాత వచ్చిన బడ్జెట్ మాత్రమే కాదు ఈ సారి బడ్జెట్ రైల్వే బడ్జెట్ ను కూడా కలిపి తీసుకువచ్చింది. ఎప్పుడూ రైల్వేల కోసం వేరుగా బడ్జెట్ వుండేది. ఈ సంప్రదాయం 92 సంవత్సరాలుగా నడుస్తోంది. బ్రిటీష్ వారి కాలంలోనే భారత్ బడ్జెట్ తో కాకుండా రైల్వేల కు వేరుగా బడ్జెట్ ప్రవేశపెట్టేవారు. అందుక్కారణం అప్పట్లో 70 నుంచీ 80శాతం నిధులు రైల్వేలకు కేటాయించటమే. అంత పెద్ద ఎత్తున రైల్వే నిధులు వుండటంతో దాన్ని వేరుగా పరిగణిస్తే మంచిదని అభిప్రాయం వ్యక్తమైంది. అందుకే, 1924 నుంచీ రైల్వే బడ్జెట్ సాధారణ బడ్జెట్ కి ఒక రోజు ముందు ప్రవేశపెడుతూ వచ్చారు.  1924కి ఇప్పటికీ పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. ఇండియన్ బడ్జెట్ లో రైల్వే బడ్జెట్ ఇప్పుడు కేవలం 4శాతం మాత్రమే. అంతే కాదు, రైల్వేస్ వేరుగా వుండిపోవటంతో నష్టాల్ని కూడా స్వంతంగా భరించాల్సి వస్తోంది. అందుకే, బ్రిటీష్ కాలం నాటి పాత సంప్రదాయాన్ని మోదీ గవర్నమెంట్ పక్కన పెట్టింది. సాధారణ బడ్జెట్ ప్లాట్ ఫామ్ పైకే రైల్వే బడ్జెట్ ను కూడా తీసుకువచ్చింది. దీంతో ప్లానింగ్ కమీషన్ తీసేసి నీతి ఆయోగ్ తెచ్చిన మోదీ మరో చారిత్రక మార్పు చేసినట్టైంది. 2017-18 బడ్జెట్ లోని మరో స్పెషాలిటి ఈ సారి ప్రవేశపెట్టిన డేట్. ఎప్పుడూ ఫిబ్రవరీ 28న పార్లమెంట్ ముందుకొచ్చే బడ్జెట్ ఈ సారి ఫిబ్రవరీ ఒకటో తారీఖునే వచ్చేసింది! మధ్యతరగతి భారతీయ కుటుంబాల మాదిరిగానే పార్లమెంట్ కూడా ఒకటో తారీఖున లెక్కా, పద్దుల్లో మునిగిపోయింది. కేరళ ఎంపీ ఒకరు హఠాన్మరణం పాలయ్యే సరికి ఒక దశలో బడ్జెట్ ఫిబ్రవరీ ఒకటిన వుండదని ప్రచారం జరిగినా చివరకు అనుకున్నట్లుగానే వ్యవహారం నడిచింది.  బడ్జెట్ లో కొన్ని అంశాలు కొందరికి నచ్చవచ్చు. మరి కొన్ని కొందరికి నచ్చకపోవచ్చు. సహజంగానే బీజేపి అభిమానులకి ఏ ఇబ్బంది లేకపోవచ్చు. కాంగ్రెస్ , ఇతర పార్టీల ఓటర్లకి ఆరుణ్ జైట్లీదంతా జిమ్మిక్కులా కనిపించవచ్చు. ఇదంతా ఎప్పుడూ వుండేదే. కాని, ఈ సారి బడ్జెట్ మాత్రం దశాబ్దాల సంప్రదాయాలకి స్వస్తి పలికి రెండు, మూడు విధాలుగా చరిత్రలో నిలిచిపోయింది!        

భూ కం(ట్రం)పం మొదలైంది....

  ట్రంప్ అన్నంత పనీ చేశాడూ. ఏడు ఇస్లామిక్ దేశాల పౌరులు తమ గడ్డపైకి రావొద్దని తాత్కాలిక నిషేధం విధించాడు. కాని, ఆయన నిర్ణయం ఎఫెక్ట్ ప్రపంచ వ్యాప్తంగా పడుతోంది. ఉధృతంగా నిరసనాలు, ఖండనలు వస్తున్నాయి. అమెరికా లోపల కూడా జనం రోడ్లెక్కుతున్నారు. ట్రంప్ డౌన్ డౌన్ అంటూ హంగామా చేస్తున్నారు. కాని, పూర్తి మెజార్టీతో అధ్యక్షుడైన ఆయన ఇప్పుడు ఏం చేసినా అంత ఈజీగా ఆపగలిగే పరిస్థితి లేదు.  అమెరికన్ సెనేట్, కాంగ్రెస్ అన్నీ కొన్నాళ్ల పాటూ చూస్తూ కూర్చోవాల్సిందే! అదీగాక ఆయన సమర్థకుల వాదన ప్రకారం ట్రంప్ చేస్తోన్నది అనూహ్యమైందేమీ కాదు. ట్రంప్ ఎన్నికలకు ముందు ఏం చెప్పాడో అదే చేస్తున్నాడు.   మెక్సికో పొడవునా గోడ కట్టడం, ఉగ్రవాద ముప్పు వున్న దేశాల నుంచీ జనాన్ని రానీయకపోవటం ట్రంప్ చేసిన ప్రధాన రాజకీయ హామీలు. అందుకే, అమెరికన్లలో తన స్థానాన్ని పదిలం చేసుకోవటం కోసం వాటి మీదే దృష్టి పెట్టాడు కొత్త ప్రెసిడెంట్. ఇక మన ఇండియా లాంటి దేశాలతో సహా చాలా ప్రాంతాల్లో ట్రంప్ వ్యతిరేకతో జోరుగా బయటకొస్తోంది. కాని, ఆయన్ని సమర్థించే వారు చెబుతోన్న కోణం మాత్రం వేరుగా వుంది. అమెరికా ఉగ్రవాదం నుంచి తనని తాను కాపాడుకోవటం కోసం ఏం చేసినా తప్పు పట్టాల్సిన పని లేదంటున్నారు.   అంతే కాదు, ఏడు దేశాల పౌరుల ప్రవేశంపై నిషేధాన్ని యావత్ ముస్లిమ్ సమాజంపై యుద్ధంగా చూడొద్దంటున్నారు. ఉదాహరణకి ప్రధాన ఇస్లామిక్ దేశమైన సౌదీ అరేబియాపై ఎలాంటి నిషేధమూ విధించలేదు. అలాగే, ప్రపంచంలోని బోలెడు ముస్లిమ్ దేశాలు ట్రంప్ ఆర్డర్స్ వల్ల ఎలాంటి ప్రభావానికి లోను కావు. ఆయన మెక్సికో నుంచి వచ్చే వార్ని కూడా రావొద్దంటున్నాడు కాబట్టి మత కోణం ఏం లేదని చెబుతున్నారు ట్రంపిస్టులు!   ట్రంప్ చేసిన నిషేధం ఎలాంటి ప్రభావం చూపుతుందో చెప్పలేం కాని.... ఖచ్చితంగా మార్పులకైతే దారి తీస్తుంది. అమెరికా ఉగ్రవాదానికి అసలు కారణమైన పాకిస్తాన్ పై ఇంకా నిషేధం ఏం విధించలేదు. కాని, అప్పుడే మన పక్కనున్న టెర్రరిస్టు దేశంలో ఉలికిపాటు మొదలైంది. నిన్న మొన్నటి వరకూ తెగ వెనకేసుకొచ్చిన హఫీజ్ సయిజ్ ను పాక్ హౌజ్ అరెస్ట్ చేసింది. అతడి ఉగ్రవాద సంస్థ జమాతేను బ్యాన్ చేసే ఆలోచన కూడా చేస్తోంది. ఈ పరిణామం ఖచ్చితంగా ట్రంప్ ఎఫెక్టేనని చెప్పుకోవచ్చు!   ట్రంప్ ఇప్పుడు కొన్ని దేశాల వార్ని రానీయటం లేదు. ముందు ముందు మన భారతీయులకి కూడా నో ఎంట్రీ బోర్డ్ ఎదురవుతుందని కొందరు ఆందోళన చెందుతున్నారు. అందులో నిజం లేకపోలేదు. మన వారు కొందరు ఉద్యోగాలు ఊడి తిరిగి రావొచ్చు. కొత్త వారు అసలు వెళ్లలేక పోవచ్చు. కాని, అలా జరుగుతుందని కూడా గ్యారెంటీ లేదు. ఎందుకంటే, భారతీయులు కేవలం ప్రతిభ ఆధారంగానే అమెరికాలో స్థిరపడుతున్నారు. అక్కడున్న మన వార్ని పంపేస్తే ఆయా కంపెనీలకు అంతే టాలెంట్ వున్న వారు స్థానిక అమెరికన్స్ లో దొరకటం అంత తేలికైన విషయం కాదు. కాబట్టి అమాంతం ఇండియన్స్ ట్రంప్ వెళ్లగొట్టకపోవచ్చు. అలాగే, ఇండియన్ మార్కెట్స్ లో అమెరికాకు వున్న అవసరాలు కూడా అలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోకుండా చేస్తాయి.   అందుకే, ఎప్పుడూ యాంటీ అమెరికన్ వాదన వినిపించే వామపక్ష మేధావులు, మీడియా వారి మాటలు పెద్దగా పట్టించుకోవద్దని ట్రంప్ సమర్థకులు చెబుతున్నారు.చరిత్రలో అమెరికా ఎప్పుడూ శరణార్థుల్ని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ సాక్షిగా ఆహ్వానిస్తూనే వుంది. కాని, గత మూడు వందల సంవత్సరాల్లో తొలిసారి కొందరిపై తలుపులు వేసేసింది. ఇది ట్రంప్ చేస్తోన్న తెంపరి పనిగా మాత్రమే చూడకూడదు. స్థానిక అమెరికన్స్ గా వున్న వైట్ పీపుల్ లోని అభద్రతగా చూడాలి. మారుతున్న అమెరికా పరిస్థితిగా చూడాలి. ఎందరు వచ్చినా అతిథి మర్యాదలు చేసే స్థోమత, స్థాయి క్రమంగా అగ్రదేశానికి కూడా లేకుండా పోతున్నాయి. అదీ తమ అంతర్గత అభద్రత పణంగా పెట్టి చేయడం ... నిజంగా కూడా కష్టమే! అతి సాహసమే!

గాంధీ... విగ్రహమైపోయిన విప్లవం!

  గాంధీ... మన సినిమా రచయిత ఒకాయన చెప్పినట్టుగా... గాంధీ నిజంగా ఒక ఇంటి పేరు కాదు. వీధికో విగ్రహమూ కాదు. ఇంకా కాదూ కూడదంటే... గాంధీ అంటే కరెన్సీ నోటు మీద ఓ బోసి నవ్వూ కాదు! మరి గాంధీ అంటే ఏంటి? ఆయన వర్ధంతి నాడు మనం తప్పక ఆలోచించాల్సిన విషయం ఇదీ... మనకు నచ్చినా నచ్చకపోయినా మానవ నాగరికతలో యుద్ధం కూడా అంతర్భాగం. తాను పుట్టినప్పటి నుంచీ మనిషి ప్రకృతితో యుద్ధం చేస్తున్నాడు. తరువాత ప్రకృతిలో భాగమైన జంతువుల్ని వేటాడి వాటితో యుద్ధం చేశాడు. చివరకు, ఇప్పుడు మనిషి సాటి మనిషితోనే యుద్ధం చేస్తున్నాడు! పులి, సింహం లాంటి క్రూర జంతువులు కూడా సాటి పులుల్ని, సింహాల్ని చంపుకోవు. ఒక్క మనిషి మాత్రమే తన జాతి వాడ్ని కూడా వదలేక వేటాడుతాడు! అంతటి హింసాత్మక జీవి! అందుకే, గాంధీ అవసరం కూడా ఎప్పుడూ వుంటుంది. బ్రిటీషు వాడు వెళ్లిపోయినంతా మాత్రాన, మనకు రాజకీయ స్వాతంత్ర్యం వచ్చినంత మాత్రాన గాంధీ అక్కర్లేదని కాదు. ఆయన అహింసా మార్గం మనిషిలో హింసాత్మక ఉన్మాదం వున్నంత కాలం అవసరమే. అవశ్యమే...  దేశ స్వతంత్ర సిద్ధికి ముందు, తరువాత మహాత్మ గాంధీ ఒక భావజాలం. ఆయనని అప్పటి వారు ఒక మామూలు మనబోటి మనిషిగా చూసే వారు కాదు. గాంధీ అంటే ఒక ఇజమ్. ఆయన ఒక సజీవ సిద్ధాంతం. హింసని హింసతోనే ఎదుర్కోవాలని చెప్పవారికి పూర్తి వ్యతిరేకం. బుద్ధుడి వైరాగ్యం, అశోకుడి నాయకత్వం రెండూ కలగలిసిన ఆధునిక గీతాసారం! గాంధీ గత కొన్ని దశాబ్దాలుగా భారతీయ స్మృతి పథంలోంచి క్రమక్రమంగా అదృశ్యమవుతున్నాడు. నెహ్రు మొదలు మోదీ వరకూ అందరూ ఆయన పేరుని వీలున్నప్పుడల్లా స్మరిస్తూనే వున్నా ... నిజంగా గాంధేయ మార్గం అవలంబిస్తున్న వారు తక్కువైపోతున్నారు. రాజకీయ నేతలే కాదు సామాన్యులు కూడా గాంధీ మార్గం పట్టించుకోవటం లేదు. అహింస అంతకంతకూ రక్తసిక్తమైపోయి నడ్డి రోడ్డు మీద కొట్టుమిట్టాడుతోంది. గాంధీ చెప్పిన గ్రామ స్వరాజ్యం కూడా కాలుష్య కోరల్లోని ఈనాటి మన నగరాల్లో మురికి కాలువల వెంట కుళ్లిపోతోంది. అసలు గాంధీ కలలుగన్న ఏ స్వప్పమూ మన పాలకులు, మనమూ నిజం చేయలేదనే చెప్పాలి. ఆయన బ్రిటీష్ వార్ని దేశం నుంచి పారద్రోలే మహా కార్యం మన కోసం పూర్తి చేసినప్పటికీ తరువాత పెద్దగా జరిగిందేమీ లేదు. హింసా, అశాంతి, మతోన్మాదం, పేదరికం... అన్నీ గాంధేయవాదాన్ని ధిక్కరించి ఇక్కడే తిష్ఠవేశాయి.  సరిగ్గా ఇదే రోజున గాడ్సే గాంధీని భౌతికంగా హత్య చేశాడు. ఆయన చేసింది తప్పే కావచ్చు. కాని, గాంధేయ వాదాన్ని ప్రతీ నిత్యం హత్య చేస్తోన్న హంతుకులు చాలా మంది మనలోనే వున్నారు. దాని ఫలితమే భారతదేశంలో ఇప్పుడు మనం అనుభవిస్తోన్న అరాచకం. గాంధీ నూలు ఒడికిన రాట్నం లాగే ఆయన సిద్ధాంతమూ ఆధునిక ఆర్భాటాల మధ్య మూలనపడిపోయింది. కేవలం ఒక నినాదంగా మిగిలిపోయింది. ఎప్పుడైతే భారతీయులు మళ్లీ అహింసా, శాంతి, సత్యం, సమానత్వం వెంట పయనిస్తారో అప్పుడే గాంధీకి నిజమైన నివాళి అందేది. అప్పటి వరకూ గాంధీ జయంతులు, వర్ధంతులు వస్తూ పోతుంటాయి కాని... ఆయన మాత్రం వీధిలో విగ్రహంగానే మిగిలిపోతాడు! రోడ్డు మీద తన వేషమే కట్టి అడుక్కునే అభాగ్య పిల్లల రూపంలో అధిక్షేపిస్తూనే వుంటాడు!   

రాజ్ భవన్లో తిష్టవేసిన మరో తివారీ!

  భారతదేశంలో రాష్ట్రపతి తరువాత ఆ స్థాయిలో గౌరవం, విలువ వుండేది గవర్నర్ కే. అయితే, రాష్ట్రపతిని దేశంలోని ప్రతీ ఒక్క ప్రజా ప్రతినిధీ తన ఓటు హక్కుతో మన తరుఫున ఎన్నుకొంటాడు. అంటే, పరోక్షంగా రాష్ట్రపతిని కూడా మనమే ఎన్నుకుంటున్నామని అర్థం. కాని, గవర్నర్ వ్యవస్థ అలా కాదు. ఢిల్లీలో అధికారంలో వున్న ప్రభుత్వం సిఫారసు మేరకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వార్ని రాష్ట్రాలకు పంపుతారు. ఇక్కడే అసలు సమస్యంతా వచ్చింది. ఇంచుమించూ పైరవీ చేయించుకుని సాధించుకున్న ప్రభుత్వ ఉద్యోగం లో మారిపోతోంది గౌరవప్రదమైన గవర్నర్ పోస్టు కూడా. రాను రాను బయటపడుతోన్న సెక్స్ స్కాండల్స్ మరింత దిగజారుస్తున్నాయి గవర్నర్ ల స్థానాన్ని...   ఆ మధ్య సమైక్యాంధ్ర రాష్ట్రానికి గవర్నర్ గా పని చేసిన ఎన్డీ తివారీ ఉదంతం గుర్తుంది కదా.. ఇప్పుడు మరో గవర్నర్ రాజ్ భవన్లో తివారీ చేష్టలే చేశాడు. ఒకరిద్దరు కాదు ఏకంగా వంద మంది దాకా గవర్నర్ ఆఫీస్ సిబ్బంది మోదీకి, ప్రణబ్ ముఖర్జీకీ అయ్యగారి రాసలీల గురించి లెటర్ రాయటంతో రచ్చ రచ్చ అయిపోయింది. ఇమీడియెట్ గా రాజీనామా చేశారు మేఘాలయా గవర్నర్ షణ్ముగనాథన్!   మేఘాలయా లాంటి చిరు రాష్ట్రం, అదీ ఈశాన్య భారతదేశంలోది కావటం వల్ల మనకు పెద్దగా తెలియరాలేదు షణ్ముగనాథన్ సిగ్గుమాలిన వ్యవహారం. కాని, ఢిల్లీలో మోదీ సర్కార్ కి ఇది కొంత తలవంపుగానే పరిణమించింది. అవినీతి కన్నా దారుణంగా సెక్స్ స్కాండల్ లో తాము అపాయింట్ చేసిన గవర్నర్ ఇరుక్కోవటం నిజంగా ఇబ్బందే. అయితే, రాజ్ భవన్ని అందమైన అమ్మాయిల కొలువుగా మార్చేసిన షణ్ముగనాథన్ మాత్రం అంతా కుట్రే అంటున్నారు. ఆయన మాట కూడా నిజం కావచ్చు. ఎందుకంటే, మేఘాలయాలో వున్నది కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ బీజేపి, ఆరెస్సెస్ లకి పెద్దగా పట్టు వున్నట్టు కనిపించదు. మరి షణ్ముగనాథన్ ఆరెస్సెస్ తో సంబంధాలున్న వ్యక్తి కాబట్టి ఆయన మీద కుట్ర జరిగి వుండవచ్చు. అయితే, గవర్నర్ స్థాయి వ్యక్తిపై దాదాపు వంద మంది ఉద్యోగులు ఊరికే ఆరోపణ చేస్తారని భావించటం కొంత మూర్ఖత్వమే అవుతుంది. నిప్పు లేకుండా పొగ రావటం అంత తేలిక కాదు.      మేఘాలయా మాజీ గవర్నర్ రాసలీల వ్యవహారంలో నిజం బయటకి రావాలంటే విచారణ ఒక్కటే మార్గం, విచారణ జరిపించి తప్పు ఎవరిదో నిగ్గు తేల్చాలి. కాని, అలా జరిగే సూచనలు తక్కువే. గతంలో తివారీ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం పదవి నుంచి తప్పించి ఊరుకుంది. అంతే తప్ప ఆయనకి శిక్షేం పడలేదు. గవర్నర్లుగా వున్న వారికి శిక్ష పడుతుందని ఆశించటం కూడా దురాశే.   అసలు కొందరి అభిప్రాయం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లుగా పని చేసే గవర్నర్లు వుండటమే అవసరం లేదు. వారి వల్ల రాష్ట్రానికి కలిగే ప్రత్యేక లాభాలంటూ ఏం లేవు. పైగా బోలెడు ప్రజాధనం వృథాయే కాక అప్పుడప్పుడూ ఇలాంటి అవమానకర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సెక్స్ స్కాండల్స్ కాకపోతే ఢిల్లీ ప్రభుత్వాల అదుపాజ్ఞలు పాటిస్తూ ప్రజలెన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాల్ని ఇబ్బంది పెట్టిన గవర్నర్లు కూడా చాలా మందే వున్నారు డెబ్బై ఏళ్లలో! ఈ నేపథ్యంలో ఆరో వేలు లాంటి గవర్నర్ వ్యవస్థ అవసరం లేదనే వారి మాటలోనూ ఆలోచించాల్సిన అంశం లేకపోలేదు. నీతి ఆయోగ్ ఏర్పాటు మొదలు నోట్ల రద్దు దాకా అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటోన్న మోదీయే గవర్నర్ల వ్యవస్థపై కూడా కన్నేస్తే ముందు ముందు ఇలాంటి రాజ్ భవన్ రాసలీలలు దేశాన్ని అప్రతిష్ఠపాలుజేయకుండా వుంటాయి...

ఈయన సేవకి... చేతులెత్తి 'మొక్క'వలసిందే!

మరోసారి జనవరి 26 వచ్చింది. పోయింది. గణతంత్రం ఘనంగా జరుపుకున్నాం. జెండా వందనం చేసుకున్నాం. కాని, ఒక్కసారి మన జెండా రెపరెపల మాటున  ఎజెండా ఏంటని ఆలోచించుకున్నామా? ఈ మధ్య పదే పదే వార్తల్లో వస్తోన్న విషయం ఏంటో గమనించారా? దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం! ఇక్కడ హైద్రాబాద్ లో వుండే మనకు అంతగా అర్థం కాకపోవచ్చుగాని దేశ ప్రధాన నగరంలో పరిస్థితి దారుణంగా వుంది. అస్తమా నుంచి క్యాన్సర్ వరకూ కాలుష్యం కారణంగా సోకని రొగమంటూ లేదు జనానికి. మిగతా నగరాలు, పట్టణాలు, ఆఖరుకి గ్రామాల్లో కూడా రోజు రోజుకి పరిస్థితి దిగజారిపోతూనే వుంది. ఢిల్లీ అంత కాలుష్యం అంతటా లేకున్నా ఎక్కడా స్వచ్ఛమైన గాలీ, చూడచక్కని ప్రకృతి కనిపించటం లేదు. పచ్చ నోట్ల ధ్యాసలో .. మనిషి పచ్చదనాన్ని పాతరేసేస్తున్నాడు! ఆత్మహత్యకి సిద్ధమవుతున్నాడు...      జనవరి 26న ఎప్పటి లాగే ఈ సారి కూడా పద్మా అవార్డులు ఇచ్చారు. మన తెలుగు వ్యక్తికి కూడా ఒకాయనకి పద్మ అవార్డు దక్కింది. ఇందులో సాధారణంగా అయితే విశేషం ఏం లేదు. కాని, వాతావరణ కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ఢిల్లీలోనే ఆయన తన పద్మ శ్రీ అందుకున్నాడు. ఆయన గత అయిదు దశాబ్దాలుగా చేస్తున్న పనే కాలుష్యానికి విరుగుడు. ఆయనకి మోదీ సర్కార్ సగౌరవంగా పద్మా అందజేసింది! ఇది భారతీయులుగా, తెలుగు వారిగా మనం సంతోషించాల్సిన విషయమే! కాని, ఖమ్మం జిల్లాల్లోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఆయన చెప్పేది ఆచరిస్తే మరింత గొప్పగా వుంటుంది. ఆయనకి అవార్డ్ ఇవ్వటం గొప్ప విషయమే కావచ్చు.. కాని, ఆయన చెప్పేది పట్టించుకోకపోవటం మన భవిష్యత్ ని మనమే చంపేసుకోవటం! అదే పెను విషాదం...      దరిపల్లి రామయ్య... తలకి హెల్మెట్ లాగా , టోపీ లాగా ఒక అట్టతో చేసిన చక్రం బిగించుకుంటాడు. అది అలంకారం మాత్రం కాదు. అదొక సందేశం లాంటి ఆదేశం! వృక్షో రక్షతి రక్షితః అన్నది దరిపల్లి రామయ్య అందరికీ చెప్పే జీవిత సత్యం! జీవాన్నిచ్చే సత్యం!      చెట్లు నాటమని చెప్పేవారు బోలెడు మంది వుంటారు భూమ్మీద. కాని, తీరా తాము ఇల్లు కట్టుకునే సమయం వస్తే నిర్ధాక్షిణ్యంగా ఎన్ని చెట్లైనా నరికేస్తారు. చివరకు, కార్ పార్కింగ్ చేసుకోవటం ఇబ్బంది అవుతోందని కూడా చెట్లు నరికేసే రాక్షసులు తయారయ్యారు ప్రపంచంలో. అలాంటి ఒట్టి మాటల మనిషి కాడు రామయ్య. ఆయన తన చిన్నప్పుడు ఎప్పుడో కొన్ని వేప చెట్లు గాలికి కూలిపోతే వాట్ని చూసి ప్రేరణ పొందాడు. ఎందుకంటే, అవ్వి ఇప్పుడు అరవై ఏళ్లున్న రామయ్య ముత్తాత నాటినవి.     వందల సంవత్సరాల కిందటి ఆ వేప చెట్లు రామయ్య చిన్నతనంలో కూలిపోయాయి. అవ్వి కూలిన నాడు రామయ్య ముత్తాత పేరు చెప్పి అవ్వి ఆయన చెట్లేనని అన్నారట గ్రామస్థులు! అప్పుట్నుంచీ చెట్లు నాటటం అంటే తరతరాల మీద తన ప్రభావం చూపటమేననే విషయం రామయ్యకి అర్థమైంది. అందుకే, బడికి పోయే వయస్సు నుంచే చెట్లు నాటటం మొదలు పెట్టాడు. ఇప్పటి వరకూ కోటి మొక్కలు నాటి, రెండు కోట్ల మొక్కలకు సరిపడా విత్తనాలు వెదజల్లి... ఈ భూమికి తన దైన పచ్చటి వారసత్వాన్ని బహుకరించాడు! చెట్లు నరకటమే అభివృద్ధిగా చెలామణి  అవుతున్న ప్రస్తుత తరుణంలో చెట్లు నాటుతూ, ఉచితంగా పంచుతూ, నాటమని జనం మనస్సుల్లో నాటుకునేలా చెబుతూ యావజ్జీవితం గడిపేశాడు! మొక్క కోసం మొక్కవోని కృషి చేస్తున్నాడు!     దరిపల్లి రామయ్య తన భార్యతో కలిసి దశాబ్దాలుగా చెట్లు నాటడమే జీవితంగా గడుపుతున్నాడు. అందరిలాగే ఆయనకు పిల్లలు, సంసారం అన్నీ వున్నా ప్రధాన వ్యాపకం పచ్చదనమే. పచ్చ నోట్ల వెంట పరుగులు తీసి జీవిత చరమాంకంలో ఏమీ సాధించలేకపోయేమే అన్న బాధ పడేవాళ్లలా కాదయన. భావి తరాలకి పచ్చటి వారసత్వం తన, పరా బేధం లేకుండా అందిస్తున్నాడు. మొదట్లో కాలినడకన ఉచితంగా చెట్లు అందిస్తూ తిరిగిన ఆయన తరువాత చంద్రబాబు అందించిన సైకిల్ పై మొక్కలు పంపిణీ చేశాడు. ఆ తరువాత రాజశేఖర్ రెడ్డి హయాంలో టీవీఎస్ అందుకుని దానిపై కూడా తన వృక్షాల వృత్తాంతాన్ని కొనసాగిస్తూనే వచ్చాడు.   ఇప్పుడు కేసీఆర్ శకంలో రాష్ట్ర ప్రభుత్వ సిఫారసు పై కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మ శ్రీ పురస్కారం అందుకున్నాడు. ముఖ్య మంత్రులు మారిన దరిపల్లి రామయ్య దారి మాత్రం మారలేదు. పచ్చటి మొక్కల వెంట ఆయన సాగిపోతూనే వున్నాడు. దేవుడికి మొక్కుకోవటం ఎంత ముఖ్యమో... అంతే ముఖ్యం, ఆ దేవుడికి పళ్లు, పూలు ఇచ్చే మొక్కల్ని నాటడం అంటాడయాన! యావత్ దేశం , ప్రపంచం కాలుష్యపు కొండ చిలువ నోటిలో చిక్కిన ప్రస్తుత తరుణంలో.. అంతకంటే గొప్ప సందేశం ఏం కావాలి? అందుకే, ఆయనని ఒకప్పుడు పిచ్చివాడని అనుకున్న జనం పద్మ శ్రీతో పాటూ అనేకానేక అవార్డులు అందుకుంటుంటే.... పిచ్చి ఎవరికి పట్టిందో గ్రహిస్తున్నారు! పచ్చదనాన్ని పచ్చి అభివృద్ధి మోజులో పడి పాడు చేసుకుంటోన్న అత్యధికులే పిచ్చి వాళ్లు! రామయ్య లాంటి ఒకరిద్దరు ప్రకృతి ఆరాధకులే అసలైన సంపన్నులు! 

68 వసంతాల 'ఘన'తంత్రం!

  68 సంవత్సరాలు! ఒక మనిషి జీవితంలో సుదీర్ఘమైనవి కావచ్చు. కానీ ఒక దేశ చరిత్రలో ఇవి తొలి అడుగులే! ఆ తొలి అడుగులలోనే తనదైన ముద్రను వేసుకున్న దేశం మనది. సరిగ్గా 68 సంవత్సరాల క్రితమే మన దేశం అతి పెద్ద ప్రజాస్వామ్యంగా అవతరించింది. స్వేచ్ఛ, సమానత్వాలకు పెద్ద పీట వేస్తూనే ప్రభుత్వం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా జరగాలి అన్న మౌలిక అంశాల మీద రాజ్యాంగాన్ని రూపొందించుకుంది. రాజ్యాంగాన్ని రూపొందించుకున్ననాటి నుంచీ ఇప్పటి వరకూ దేశం ఎన్నో ఆటుపోట్లను తట్టుకుంది. ఎన్నో వెన్నుపోట్లని ఎదుర్కొంది. అయినా దేశం చలించలేదు. దేశంలో పదుల కొద్దీ రాష్ట్రాలు ఉండవచ్చు, వందలకొద్దీ భాషలు ఉండవచ్చు, వేల కొద్దీ కులాలు ఉండవచ్చు… అయినా సందర్భం వస్తే అంతా ఒక్కటవుతామని నిరూపించేందుకు కార్గిల్‌ వంటి ఉదంతాలు చాలానే కనిపిస్తాయి.   ప్రతి గణతంత్రమూ మనకి ప్రత్యేకమే అయినా ఈ గణతంత్రపు సంబరాల్లో చీఫ్ గెస్ట్ గా పాల్గొంటోన్న అబుదాబీ యువరాజు మహ్మద్ బిన్ జాయేద్ ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నారు. ఆయన రాక కేవలం ఫార్మాలిటీగా మాత్రమే చూడకూడదు. మధ్య ప్రాచ్యంలోని చమురు ఉత్పత్తి దేశాలతో దశబ్దాలుగా భారత్ సత్సంబంధాలు కొనసాగిస్తోంది. మోదీ వచ్చాక మరింత శ్రద్ధ తీసుకుంటున్నారు. పాకిస్తాన్ తో, చైనాతో మనకున్న విభేదాల కారణంగా చమురు ఉత్పత్తి చేసే అబుదాబి లాంటి దేశాల మైత్రి ఎంతో అవసరం. అందుకే, ఆ దేశపు కాబోయే రాజు మన దేశానికి రావటం ఎంతో ప్రత్యేకం. అంతే కాదు, ఒక రాచరిక వ్యవస్థకు ప్రతినిధి అయిన యువరాజు ప్రపంచపు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశపు గణతంత్ర ఉత్సవాల్లో పాల్గొనటం నిజంగా విశేషమే!    ఒక్కసారి మనం గతంలోకి తొంగి చూస్తే ... భారతదేశం తన రాజ్యాంగాన్ని రాసుకునేనాటికి దేశంలో అయోమయం నెలకొని ఉంది. నిరంతరం వేధించే కరువులు, పరాయి పాలనలో దివాళా తీసిన పరిశ్రమలు, నిరుద్యోగం, నిరక్షరాస్యత… వీటన్నింటికీ తోడు సాంఘిక దురాచారాలు. ఇప్పటికీ ఈ సమస్యలు లేవని కావు! కానీ నెమ్మది నెమ్మదిగా వాటిని అధిగమిస్తూ దేశం సాధించిన పురోగతి కూడా ఏమంత సామాన్యమైనది కాదు.అగ్గిపెట్టి కోసం కూడా పరాయి దేశం మీద ఆధారపడే పరిస్థితి నుంచి అణువుని సైతం ఛేదించగలిగే సామర్థ్యాన్ని పొందగలిగాం. అణా కాసుల కోసం చేయి చాచే స్థితి నుంచి అమెరికాకే నిపుణులని అందించే స్థితికి ఎదిగాం. అంటరాని తనం నుంచి ఆనకట్టలను దేవాలయాలుగా భావించే ఔన్నత్యానికి చేరుకున్నాం. ప్రపంచమంతా అమెరికావైపా, రష్యావైపా అని కొట్టుకు చస్తుంటే అలీనోద్యమం పేరుతో లోకానికి ఒక కొత్త ఉనికినిచ్చాం.   నిజమే!ఇంకా మన దేశం సాధించాల్సింది చాలానే ఉంది. అసమానతలు ఉన్నాయి, అసహనమూ ఉంది. కులాల మౌఢ్యం, పేదరికపు జాడ్యం అలానే ఉన్నాయి. నిరక్షరాస్యత, నిరుద్యోగం మన తలరాతలను శాసిస్తేనే ఉన్నాయి. అయినా వెనుకడుగు వేసేది లేదు. ఇన్ని సాధించిన దేశం ఇప్పుడు బేలతనంతో ఊరుకునేదీ లేదు. ఒక్కో గణతంత్రం దినోత్సంతో మన దేశం మరో అడుగు ముందుకు వేస్తూనే ఉంటుంది. ఎప్పుడూ అడుగు ముందుకు వేస్తూనే ఉంటుంది. అందుకే ప్రపంచం చూపంతా ఇప్పుడు ఇండియా వైపే!  

ఆయన వైట్ హౌజ్లోకి... వాళ్లు రోడ్ల మీదకి! 

డొనాల్డ్ ట్రంప్... ఒకప్పుడు ఈ పేరు కామెడీ! కాని, తరువాత క్రమంగా సీరియస్ గా తీసుకున్నారు జనం! కొందరు వ్యతిరేకిస్తే , అంతకు మించి సమర్థించిన వారు వున్నారు. దాని ఫలితమే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలవటం. హిల్లరీని కాదని ఈ అల్లరినే ఎంచుకున్నారు అమెరికన్స్. కాని, ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ప్రెసిడెంట్ ట్రంప్ అనే సత్యాన్ని ఇంకా ఆయన వ్యతిరేక వర్గం జీర్ణించుకున్నట్టు కనిపించటం లేదు. అందుకే, అన్ని హద్దులు మీరి ప్రవర్తిస్తోంది. అత్యుత్సాహంతో కొంపలు మునిగేలా వున్నాయి...  అమెరికా అంటే స్వేఛ్ఛా. అమెరికా అంటే ప్రజాస్వామ్యం. అమెరికా అంటే సమానత్వం. అక్కడున్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ సాక్షిగా అందరూ భావించేది ఇదే. ఆ మాట నిజమేనన్నట్టు కొనసాగుతున్నాయి యాంటీ ట్రంప్ ర్యాలీలు. సాక్షాత్తూ దేశాధ్యక్షుడికే వ్యతిరేకంగా లక్షల మంది రోడ్లపైకి వస్తున్నారు. వాళ్లకి మీడియా కూడా వంత పాడుతోంది. మొత్తంగా ట్రంప్ పాలన అంత ఆషామాషీగా సాగనవ్విమని ఆందోళనకారులు సిగ్నల్స్ ఇస్తున్నారు!  ట్రంప్ ఎన్నికయ్యాక ఇంకా పెద్ద వివాదాస్పద నిర్ణయాలేం తీసుకోలేదు. ఆయన్ని దోషిగా చూపించేందుకు నిరసనకారుల వద్ద బలమైన కారణాలు కూడా లేవు. అయినా కూడా మీడియా, ఉద్యమకారులు అపొహల ఆధారంగానే రచ్చకి దిగుతున్నట్టు కనిపిస్తోంది. ఇది ప్రజల చేత న్యాయబద్ధంగా ఎన్నుకోబడ్డ అధ్యక్షుడికి నిజంగా అవమానమే. అతను గతంలో చేసిన కామెంట్స్,ప్రకటనలు ఎలా వున్నా ఇప్పుడు మాత్రం ప్రెసిడెంట్. ఆయన ఏం చేస్తాడో కొన్నాళ్లైనా వేచి చూడాలి. అంతే తప్ప ప్రమాణ స్వీకారోత్సవం నుంచే ప్రతీకారంతో రగిలిపోతే ఖచ్చితంగా అతే అనిపించుకుంటుంది. మన దగ్గర మోదీ ఎన్నిక తరువాత మీడియా ప్రవర్తించినట్టే అమెరికాలోనూ ప్రవర్తిస్తోంది. ట్రంప్ ప్రమాణానికి కేవలం 2లక్షల మంది వచ్చారంటూ అబద్ధాలు చెబుతోంది అమెరికన్ మీడియా. అంతే కాదు రోజుకో రకం విష ప్రచారం చేస్తోంది. ఇక్కడి అవార్డ్ వాప్సీ గ్యాంగ్ లాగా అమెరికాలోనూ ఒక వర్గం మేధావులు, జర్నలిస్టులు ట్రంప్ కు వ్యతిరేకంగా కంకణం కట్టుకుని కూర్చున్నారు. ఇదంతా నూతన అధ్యక్షుడికి చిర్రెత్తించే విషయమే. అందుకే, ఆయన  కూడా ప్రతి దాడి మొదలుపెట్టాడు. జర్నలిస్టులంత నీతి లేని వాళ్లు వుండరని తిట్టిపోశాడు. వైట్ హౌజ్ ప్రతినిధులు అయితే తమ కొత్త ప్రెసిడెంట్ తో మీడియా సరిగ్గా నడుచుకోకపోతే ఏం చేయాలో అది చేస్తామని బెదిరిస్తున్నారు. నిరసనలు అంటూ విధ్వంసానికి దిగిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. పదేళ్లు జైలులో వుంచేలా కేసులు పెట్టే ఆలోచనలో వున్నారు!  డొనాల్డ్ ట్రంప్ దెబ్బ బయటి ప్రపంచానికి ఎలా వుండబోతోందో కాని... అమెరికాలోని అంతర్గత శత్రువులకి మాత్రం గట్టిగానే పడేలా కనిపిస్తోంది. నాలుగేళ్ల సంఘర్షణకి తెర లేచినట్టే అనిపిస్తోంది!  

బోస్... హిస్టరీకి, మిస్టరీకి కేరాఫ్!

జనవరి 23... నేతాజీ సుభాష చంద్రబోస్ జయంతి! మరి వర్ధంతి ఎప్పుడు? ఏమో తెలియదు! ఇలాంటి పరిస్థితి ప్రపంచంలోనే మరే నేతకి వుండదనుకుంటా! బోస్ బతికుండగా ఎంత ప్రత్యేకంగా జీవించాడో... మరణంలోనూ అంతే విశిష్టంగా కొనసాగుతున్నాడు. అసలు ఆయన ఈ భూమ్మీద భౌతికంగా లేడంటే ఇప్పటికీ నమ్మేవారు లేరు! కాని, ఆయన 120వ జయంతి అయిన జనవరి 23, 2017న ఆయన మన మధ్య లేరని మనం అంగీకరించక తప్పుదు. నూటా ఇరవై ఏళ్లు పూర్తయ్యాయి కాబట్టి నేతాజీ తమ అవతారం చాలించే వుంటారు. కాని, ఈ విషయం ఖచ్చితంగా మాత్రం చెప్పలేం...   జనవరి 23, 1897న ఒడిషాలోని కటక్ లో పుట్టిన సుభాష్ చంద్రబోస్ బ్రిటీష్ కు వ్యతిరేకంగా సాగుతోన్న భారత స్వాతంత్ర్య సంగ్రామ హోమంలో హవిస్సులా పడ్డాడు! దాన్ని భగ్గున మండిచాడు! గాంధీ నేతృత్వంలో ఒకవైపు అహింసాయుత ఉద్యమం సాగుతోంటే తెల్లోడికి అసలు వేడి తగిలేలా సైనిక పంథా అనుసరించాడు బోస్. 1857లో తొలి స్వాతంత్ర్య సంగ్రామం చేసిన మంగళ్ పాండే, ఝాన్సీ లక్ష్మీభాయి, నానా సాహేబ్, తాంత్యా తోపే లాంటి వారి వారసత్వాన్ని ఆయన గర్వంగా అందుకున్నాడు. కురుక్షేత్రంలో గీతా బోధ చేసిన శ్రీకృష్ణుని యుద్ధోపదేశాన్ని ధైర్యంగా పాటించాడు. అంతిమ గెలుపు బోస్ కు దక్కినా దక్కకున్నా ఆయన చేసిన ప్రయత్నమే గొప్ప విజయం. ఎందుకంటే, ఆయన ప్రపంచాన్ని తన పిడికిట్లో బంధించిన సామ్రాజ్యవాద గ్రేట్ బ్రిటన్ని స్వదేశంలో ఎదుర్కోలేదు. జర్మనీ, జపాన్ లాంటి సుదూర దేశాల్లో ఎదుర్కొన్నాడు. ఆనాటి ప్రపంచ నేతలతో భారత్ తరుఫున మాట్లాడాడు! అంటే, నిజంగా చెప్పుకుంటే స్వతంత్రానికి ముందే ఇండియాకు ఆయన ప్రతినిధి అయ్యారు. బెర్లిన్ నుంచి సింగపూర్ దాకా మన త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాడు. అండమాన్ దీవుల్లో ఏర్పాటు చేసిన తన ప్రభుత్వం సాక్షిగా ఇప్పటికీ మార్మోగే జై హింద్ నినాదం ఇచ్చాడు!   రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో సాహసోపేతంగా బ్రిటీష్ కు వ్యతిరేక వర్గంతో చేతులు కలిపిన బోస్ వ్యూహం పలించి వుంటే ఇవాళ్ల భారత్ ముఖ చిత్రమే వేరుగా వుండేది. కాని, దురదృష్టవశాత్తూ అలా జరగలేదు. హిట్లర్ అరాచక నిర్ణయాల వల్ల, జపాన్ దుందుడుకు వ్యవహారం వల్లా అమెరికా, రష్యాల ప్రభావంతో అంతా తలకిందులైంది. అప్పుడే సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ విధి రాత కూడా వక్రీకరించింది.    చంద్రబోస్ మనకు స్వాతంత్ర్యం తేలేకపోయినా ఆయన మీద భారతీయుల్లో వున్న గౌరవం, అభిమానం, భక్తి మాత్రం చెక్కుచెదరలేదు. అందుకు, ఆయన చుట్టూ అల్లుకున్న కథనాలే సాక్ష్యం. 1945లో విమాన ప్రమాదంలో మరణించాడని చెప్పే కథనం మొదలు ఉత్తర్ ప్రదేశ్ లో, బెంగాల్లో సాధువుగా గడిపాడని చెప్పే ప్రచారాల వరకూ ఎన్నో వున్నాయి. వాటన్నటి సారాంశం ఒక్కటే. బోస్ కు మరణం లేదు. ఆయన విమాన ప్రమాదంలో చనిపోలేదు. రష్యాలో వుండి వచ్చ. చైనాలో గడిపి వుండవచ్చు. కాదంటే ఉత్తరాదిలో చాలా మంది విశ్వసించే విధంగా సుభాష్ చంద్రబోస్ ఉత్తర్ ప్రదేశ్ లో గుమ్నామి బాబాగా స్థిరపడి వుండవచ్చు. ఇక కొంత మంది బెంగాలీలు 1970లలో ప్రచారం చేసినట్టు ఆయన శ్రీమత్ శారదానందజీ అనే సాధువుగా సిద్ధి పొంది వుండవచ్చు...   సుభాష్ చంద్రబోస్ చుట్టు అల్లుకున్న కథనాల్లో ఏది నిజం అన్నది ఇప్పటికీ పెద్ద శేష ప్రశ్నే! అది ఎప్పటికి స్పష్టం అవుతుందో కూడా చెప్పలేం. మోదీ సర్కార్ వరుసగా బయటపెడుతోన్న రహస్య డాక్యుమెంట్లు కూడా ఇప్పటి దాకా సంచలన విషయాలేం వెల్లడి చేయలేదు. కాబట్టి మరింత కొంత కాలం బోస్ వర్ధంతి లేని మహానాయకుడిగానే కొనసాగుతాడు. లేదంటే శాశ్వతంగా ఆయన మరణం పెద్ద మర్మంగానే మిగిలిపోవచ్చు! అయినా కూడా నష్టమేం లేదు... ఎందుకంటే, జయంతి మాత్రమే వుండి వర్ధంతి లేని వారు దేవుళ్లే! బోస్ భారతీయులకి దేవుడు కాక మరేంటి?