ఫేక్ ఎన్ కౌంటర్స్ ని జనాలెందుకు వ్యతిరేకించటం లేదు?
posted on Nov 1, 2016 @ 2:37PM
మొన్న ఏఓబీ ఎన్ కౌంటర్. నిన్న సిమి ఉగ్రవాదుల ఎన్ కౌంటర్. దేశంలో ఎక్కడ చూసినా హింసే విలయ తాండవం చేస్తోంది! అసలు ఆ మధ్య ఉరీ ఉగ్రదాడితో మొదలైంది రక్తపు క్రీడ. పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరిస్టులు మన జవాన్లను పొట్టన బెట్టుకున్నారు. ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. ఆ తరువాత ఇక రోజూ సరిహద్దు దద్ధరిల్లిపోతూనే వుంది. పాక్ సైనికులు, ఉగ్రవాదులు ఎంత మంది హతం అవుతున్నారో నిర్ధిష్టంగా తెలియదుగాని మన జవాన్లు మాత్రం పదే పదే బలవుతున్నారు. గాయపడుతున్నారు. ఇది పెద్ద విషాదం...
ఢిల్లీలోని మోదీ ప్రభుత్వం ఉగ్రవాదుల్ని ఎదుర్కొంటుంటే రాష్ట్రాల్లోని భద్రతా దళాలు తీవ్రవాదుల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. వాళ్లు నక్సలైట్స్ కావొచ్చు, లేదా సిమి ఉగ్రవాదులు కావొచ్చు, ఎవరైనా కావొచ్చు. పోలీసులకి మాత్రం కంటి మీద కునుకు వుండటం లేదు. అయితే, ఇక్కడ సమస్యంతా సాటి భారతీయులైన మావోయిస్టుల్ని, సిమి మెంబర్స్ ని పాశవికంగా ఎన్ కౌంటర్ చేయవచ్చా అని! మన రాజ్యాంగం ప్రకారం మాట్లాడుకుంటే అది నిస్సందేహంగా అన్యాయమే. కాని, పోలీసులకి వారి వాదనలు వారికుంటాయి.
ఎప్పటిలాగే ఈ సారి కూడా మావోయిస్లులు హతమవగానే వరవర రావు లాంటి వాళ్లు మీడియా ముందుకొచ్చారు. బూటకపు ఎన్ కౌంటర్ అన్నారు. సామాన్య ప్రజల అభిప్రాయం ఎలా వున్నా మేధావులు, కొంత వర్గం మీడియా చనిపోయిన వారికి మద్దతుగా నిలిచింది. వాళ్లని పోలీసులు ఎలాంటి అరెస్టు, విచారణ వంటివి లేకుండా చంపటం దుర్మార్గం అన్నారు. కాని, ఎప్పటిలాగే పోలీసులు కూడా ఎదురు కాల్పుల వాదన వినిపించారు. మావోయిస్టులు కాల్పులు జరపటంతో తామూ జరిపామన్నది దాని సారాంశం.
ఇక మన ఆంధ్రా, ఒరిస్సా బార్డర్ నుంచి మధ్య ప్రదేశ్ కి వస్తే ... ఇక్కడ ఎనిమిది మంది సిమి ఉగ్రవాదులు జైలులో కాపలా వున్న ఒక పోలీస్ ని చంపి పారిపోయారు. గొంతుకోసి కిరాతకంగా చంపేశారు వారు. కాని, అంతే వేగంగా పోలీసులు వాళ్లని వెదికి పట్టుకుని చంపేశారు. ఇదీ బూటకపు ఎన్ కౌంటరే అంటున్నారు రాజ్యాంగవాదులు. ఓవైసీ మొదలు దిగ్విజయ్ వరకూ చాలా మందే వస్తారు రాజ్యాంగవాదుల కోవలోకి. వీళ్లంతా ఎన్ కౌంటర్ చేసి పోలీసులు ప్రాణం తీయటం చట్ట రిత్యా నేరమని వాదిస్తుంటారు. అది నిజమే కూడా...
చనిపోయింది ఉగ్రవాదులైనా, నక్సలైట్లైనా పోలీసుల కర్కశత్వాన్ని అందరూ ఖండించాల్సిందే. గవర్నమెంటే వెనుకుండి ఎన్ కౌంటర్లు చేయిస్తే అది కూడా తప్పు పట్టాల్సిన విషయమే. కాని, మన దేశంలో నిజంగా ఫేక్ ఎన్ కౌంటర్ జరిగినా ఒక్క సారి కూడా పోలీసులకి కోర్టుల్లో శిక్షలు పడ్డ పాపాన పోలేదు. అందుకే, ఏది నిజమైన ఎన్ కౌంటర్, ఏది ఫేక్ తెలియకుండా పోతోంది.
నిజంగా పోలీసుల మీద కూడా కాల్పులు జరిగి... తమని తాము ఆత్మ రక్షణ చేసుకునే క్రమంలో వాళ్లు కాల్పులు జరిపితే అది వేరే విషయం. ముంబైపైన ఉగ్రవాదుల దాడులు జరిగినప్పుడు అలాంటి ఎన్ కౌంటర్స్ అవుతుంటాయి. కాని, అడవుల్లో జరిగే ఎన్ కౌంటర్స్ లేదా మధ్యప్రదేశ్ లో జరిగిన సిమి ఉగ్రవాదుల ఎన్ కౌంటర్సే అనుమానాలకు తావిస్తుంటాయి. ఇందులో పోలీసులు అస్సలు నష్టపోక పోవటం, లేదంటే చాలా స్వల్ప గాయలు కావటం మాత్రమే వుంటాయి. హతమైన తీవ్రవాదులు మాత్రం దారుణంగా అంతం అవుతారు. ఇది మామూలుగా చూసినప్పుడు తప్పుగానే కనిపిస్తుంది కాని... ఎన్ కౌంటర్ న్యాయాన్ని సమర్థించే వారు కూడా మరో వాదన ముందుకు తీసుకొస్తున్నారు. ఉదాహరణకి అఫ్జల్ గురు కేసునే తీసుకోండి... సాక్షాత్తూ పార్లమెంట్ భవనంపై దాడికి అతను కుట్ర చేశాడని సుప్రీమ్ తీర్పునిచ్చింది. ఉరిశిక్ష వేసింది. అయినా దాన్ని అమలు పరిచినప్పుడు సో కాల్డ్ అభ్యుదయవాదుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. యాకుబ్ మెమన్ విషయంలో కూడా అంతే. కసబ్ కి కూడా ఉరి వద్దన్న వాళ్లు మన దేశంలో వున్నారు! ఇవన్నీ ఫేక్ ఎన్ కౌంటర్స్ కు ఒక విధంగా కారణం అవుతున్నాయి...
పోలీసులు తీవ్రవాదుల్ని ప్రాణాలకి తెగించి అరెస్ట్ చేస్తే మన కోర్టుల్లో సంవత్సరాల తరబడి విచారణ జరుగుతుంది. చివర్లో ఎంత శిక్ష పడుతుందో తెలియదు. పడ్డా జైళ్లో చివరి దాకా వుంటారా అంటే డౌటే! మసూద్ అజర్ ను వదిలేసినట్టు వదిలేయాల్సి రావచ్చు. ఇక అంతా పూర్తై విషయం ఉరి శిక్ష దాకా వచ్చాక బోలెడు మంది మరణ శిక్ష వద్దంటూ ఉద్యమాలకి తెర తీస్తారు. ఫైనల్ గా యాకుబ్ మెమన్ విషయంలో అయినట్టు... ఒక ఉగ్రవాది అంతిమ యాత్రకు కూడా వేలాది మంది తరలి వస్తారు! ఇలా ఒక ఉగ్రవాది, తీవ్రవాది పోలీస్ కస్టడీలో ఎంత ఎక్కువ కాలం వుంటే అంత పెద్ద హీరోని, రెబెల్ ని చేసే కుట్ర పూరిత సంస్కృతి కూడా మన దేశంలో వుంది. మీడియా, మేధావులు, నేతలు అందరూ దీనికి కారణమే! ఎవరి ఆదర్శం, ఎవరి స్వార్థం వారివి...
మన వ్యవస్థ కసబ్ కు బిర్యానీలు తినిపించి విచారణ జరపటంతోనే సామాన్య జనం కూడా ఎన్ కౌంటర్లు జరిగినప్పుడు పోలీసుల పక్షాన నిలుస్తున్నారు! సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న ఫేక్ ఎన్ కౌంటర్స్ కు సమర్థన వస్తోంది. ఈ ఉన్మాద స్థితి పోవాలంటే తీవ్రమైన నేరాలు చేసిన ఉగ్రవాదులు, తీవ్రవాదుల్ని వెంట వెంటనే శిక్షలు అనుభవించేలా చేయగలిగే సిస్టమ్ రావాలి. న్యాయ వ్యవస్థలో వేగం, సంస్కరణలు రావాలి. అప్పుడే ఎన్ కౌంటర్లు తగ్గుముఖం పట్టే అవకాశం వుంటుంది. లేదంటే, ఎన్ కౌంటర్ల రూపంలో బుల్లెట్ల న్యాయమే రాజ్యమేలుతుంది!