సిరియా… ముందు అమెరికా నుయ్యి… వెనుక రష్యా గొయ్యి!

పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అంటారు! కాని, తాజాగా సిరియాలో జరుగుతోన్న పరిణామాలు చూస్తుంటే రెండు పిల్లుల చెలగాటం… ఒక ఎలుకకి ప్రాణ సంకటంగా మారిపోయింది! ఇంతకీ ఆ పిల్లులు ఎవరనా మీ అనుమానం? ఇంకెవరు, అమెరికా, రష్యా! ఒకప్పుడు వాల్డ్ వార్ తరువాత కోల్డ్ వార్ అంటూ నానా అరాచకం చేసిన రెండు సూపర్ పవర్స్ ఇప్పుడు మళ్లీ పవర్ ప్లే మొదలు పెట్టాయి! అదీ అంతర్యుద్ధంతో అతలాకుతలం అయిన సిరియాను అడ్డు పెట్టుకుని!   మధ్య ప్రాచ్యంలో ఈ మధ్య కాలంలో ఏదన్నా దేశం సర్వ నాశనమైందంటే అది సిరియానే! ఇరాక్ , లిబియా లాంటి దేశాలు కూడా సతమతం అవుతున్నా సిరియాది దయనీయ పరిస్థితి. ఒక వైపు మత ఛాందసవాదం, మరో వైపు ఐసిస్ లాంటి ఉగ్ర మూక చేస్తున్న ఘోరాలు, వాటికి తోడుగా సిరియాను ఏలుతున్న నియంత అసాద్ ఉన్మాద చర్యలు! అన్నీ కలిసి లక్షలాది మంది సిరియన్లు శరణార్థులుగా యూరప్ బాట పట్టేలా చేస్తున్నాయి!   సిరియాలో తాజాగా రసాయనిక దాడి జరిగింది. వందల మంది ప్రాణాలు కోల్పోయారు. చిన్న పిల్లలు మరీ ఎక్కువ మంది మరణించారు. కారణం ఎవరో ఉగ్రవాదులు కాదు! సిరియాను గుప్పిట్లో పెట్టుకున్న ఆ దేశ నియంత అసాదే! ఆయన అజ్ఞల మేరకే రెబెల్స్ నియంత్రణలో వున్న ప్రాంతంపై రసాయనిక దాడి జరిగిందని అందరికీ తెలిసిందే! వెంటనే, ఆగ్రహానికి గురైన అమెరికా ఇప్పుడు మిసైల్ దాడులు మొదలు పెట్టింది! ట్రంప్ తాను సిరియా సమస్యను దాడులతో పరిష్కరిస్తానని చెప్పలేదు. అయినా కూడా అమెరికన్ ప్రెసిడెంట్ కి సిరియా నియంతపై కన్నెర్ర చేయక తప్పలేదు!   సిరియాపై అమెరికా దాడి మిగతా మిడిల్ ఈస్ట్ దేశాల పై యుద్ధం లాంటి వ్యవహారం కాదు. ఎందుకంటే, ఇక్కడ రష్యా కూడా రంగంలో వుంది. పుతిన్ సిరియాలోని అసాద్ ప్రభుత్వాన్ని గట్టిగా సమర్థిస్తున్నాడు. అందుకు ఆయన చెప్పే కారణం… సిరియా కనీసం నియంత ఆధీనంలోనన్నా లేకపోతే… ఐసిస్ లాంటి ఉగ్రమూకకు వశమైపోతుంది. అప్పుడు సిరియన్ల పరిస్థితి మరీ దారుణంగా వుంటుంది. స్వేచ్ఛా, స్వాతంత్ర్యాల మాట పక్కన పెడితే ప్రాణ, మానాలకి కూడా కనీస రక్షణ వుండదు. అందుకే, అసాద్ ప్రభుత్వాన్ని రష్యా సమర్థిస్తోంది. అంతే కాదు, ఆ నెపంతో అమెరికాకు మధ్య ప్రాచ్యంలో చెక్ పెడుతోంది కూడా!   అమెరికా , రష్యాల మధ్య నలిగిపోతున్న సిరియాకు ట్రంప్ రావటం కొంత మేలు చేస్తుందనుకున్నారు అంతా! ఆయనకు, పుతిన్ కు మంచి రిలేషన్స్ వున్నాయి కాబట్టి అగ్ర రాజ్యం ఇక సిరియా వ్యవహారంలో వేలు పెట్టదనుకున్నారు. కాని, అత్యంత పాశవికంగా రసాయనిక దాడులు జరగటంతో ట్రంప్ తన సైన్యాన్ని పంపి బలప్రయోగం చేయక తప్పలేదు. ఈ పరిణామం రష్యాకి నచ్చకపోవచ్చు. తన గుప్పిట్లో వున్న సిరియా అమెరికా దాడులకి గురి కావటం పుతిన్ ఒప్పుకోకపోవచ్చు! ఇది ముందు ముందు అమెరికా, రష్యాల మధ్య పంతంగా, పందెంగా కూడా మారే అవకాశం వుంది! అలా ఏం జరిగినా… నష్టపోయేది అమెరికా కాదు! రష్యా కూడా కాదు! సిరియానే మరింత చితికిపోతుంది! చితికిపోక తప్పదు కూడా!

మంథని మధుకర్‌ మృతికి, టీఆర్‌ఎస్‌కి సంబంధమేంటి? ఆరోజు అసలేం జరిగింది?

మంథని మధుకర్‌ మృతి తెలంగాణలో ప్రకంపనలు పుట్టిస్తోంది. దళిత సంఘాల ఆందోళనలతో ప్రభుత్వం ఉలిక్కిపడుతోంది. విపక్షాలన్నీ ఏకమై ఆరోపణలు చేస్తుండటంతో టీఆర్‌ఎస్‌ నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దళిత సంఘాలు, విపక్షాలన్నీ కలిసి పెద్దఎత్తున ఆందోళనలు చేస్తుండటంతో ఇటు పోలీసులపైనా, అటు ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు మధుకర్‌ మృతి ప్రకంపనలు ఢిల్లీని కూడా తాకడంతో టీఆర్‌ఎస్‌ నేతలు కలవరపడుతున్నారు. ముఖ‌్యమంత్రి కేసీఆర్‌‌కి కూడా మధుకర్‌ కేసు ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తోంది. కేసీఆర్‌ టార్గెట్‌గా మూడెకరాలు పోయి ఆరడుగుల జాగనా అంటూ  దళిత సంఘాలు ప్లకార్డులతో ఆందోళనలు చేస్తుండటంతో టీఆర్‌ఎస్‌ దళిత నేతలు ఇరకాటంలో పడుతున్నారు.   మధుకర్‌‌కి చెందినవిగా చెబుతోన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో విస్తృతంగా సర్క్యులేట్‌ అవడం, పలువురు తమ పోస్టులతో అందరినీ ఆలోచింపజేయడంతో, ఇటు దళిత సంఘాలు, ఇతర వర్గాలు పెద్దఎత్తున స్పందిస్తున్నాయి. మధుకర్‌ను అత్యంత పాశవికంగా, అమానుషంగా మర్మాంగాలు కోసి, కాళ్లూచేతులు విరిచి, నోట్లో మట్టిపోసి, కళ్లు పీకేసి హత్య చేశారంటోన్న తల్లిదండ్రులకు సంఘీభావం తెలుపుతూ ఆందోళనల్లో పాల్గొంటున్నారు. అయితే పోలీసులు చెబుతున్నట్లుగా మధుకర్‌ ఆత్మహత్య చేసుకున్నాడా? లేక మధుకర్‌ తల్లిండ్రులు, దళిత సంఘాలు, విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా పెద్దింటి అమ్మాయి తల్లిదండ్రులే అత్యంత పాశవికంగా హత్య చేశారా అనేది సస్పెన్స్‌‌‌గా మారింది.    మార్చి 13న ఇంటి నుంచి బయటికెళ్లిన మధుకర్‌.... మరుసటి రోజు సాయంత్రానికి ఊరు శివార్లలో శవమై కనిపించాడు. అది కూడా మధుకర్‌ ప్రేమించిన అమ్మాయి... ఫోన్‌ చేసి చెప్పడంతో మృతదేహం ఎక్కడుందో తెలిసింది. మధుకర్‌ సోదరుడు సమ్మయ్యకి ప్రేమించిన యువతి చేసి, మధు ఇంటికొచ్చాడా అని అడిగిందని, రాలేదని చెప్పడంతో ఇంటి వెనుకాల కాలువ దగ్గర వెతకమని చెప్పిందని, అక్కడ వెతికితే కనిపించలేదని మధుకర్‌ బ్రదర్‌ సమ్మయ్య చెబుతున్నాడు. అయితే ఎవరైతే తమ ఇంటికొచ్చి మధుకర్‌ను బండి మీద తీసుకెళ్లాడో అతడిని గట్టిగా నిలదీస్తే, సబ్‌స్టేషన్‌ దగ్గర చూడమన్నాడని, అతను చెప్పిన స్థలంలోనే డెడ్‌బాడీ దొరికిందని పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. కొట్టిచంపేశారు కాబట్టే మధుకర్‌ మృతదేహం అక్కడుందని మధుకర్‌ కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. అంతేకాదు అమ్మాయి తండ్రి, మరో ఐదుగురితో కలిసి మధుకర్‌ను చంపేశారని తల్లి ఆరోపిస్తోంది. మధుకర్‌ ఒళ్లంతా గాయాలే ఉన్నాయని, మర్మావయాలు కోసి, నోట్లో మట్టి పోశారని, ఇవన్నీ పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని, పైగా బెదిరించి అంత్యక్రియలు చేయించారని మధుకర్‌ తల్లి ఆవేదన చెందుతోంది.   అయితే మధుకర్‌ ఆత్మహత్య చేసుకున్నాడని, ఘటనాస్థలంలో పురుగులమందు డబ్బా, కర్చీఫ్‌, చున్నీ దొరికాయని, అంతేకాదు మధుకర్‌ ఒంటిపై ఎలాంటి గాయాల్లేవని పోలీసులు చెబుతున్నారు. అయితే మధుకర్‌ ప్రేమించిన అమ్మాయి.... మంథని ఎమ్మెల్యే పుట్టా మధుకి బంధువులు కావడంతోనే, పోలీసులు కేసును తారుమారు చేశారని, దళిత సంఘాలు, మధుకర్‌ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రేమించి అమ్మాయి ఇంట్లో మధుకర్‌ ట్రాక్టర్‌ డ్రైవర్‌‌గా పనిచేసేవాడు. దాదాపు రెండేళ్లుగా ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు తెలుస్తోంది, అయితే మధుకర్‌ దళితుడు కావడంతో, అది నచ్చని అమ్మాయి తల్లిదండ్రులు... మొదట మధుకర్‌ను బెదిరించారని, ఆ తర్వాత  చంపేశారని తల్లిదండ్రులు అంటున్నారు. అగ్రకుల దురహంకారంతో అత్యంత పాశవికంగా హత్య చేశారంటున్నారు.    మధుకర్‌ మృతిపై మరో వాదన కూడా వినిపిస్తోంది. అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో.... ఇద్దరూ కలిసి వెంకటాపూర్‌ శివార్లలో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారని, ఇది గమనించిన యువతి కుటుంబ సభ్యులు.... అమ్మాయిని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేయించారని అంటున్నారు. ఆ యువతి నర్సు మొబైల్‌ తీసుకుని ఫోన్‌ చేయడంతోనే మధుకర్‌ మృతదేహం దొరికిందని చెబుతున్నారు. కానీ మధుకర్‌ మృతదేహం ముళ్ల కంపల్లో పడి ఉండటంతో ఆత్మహత్య చేసుకున్నాడనే వాదనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇది నిజమోకాదో తెలియాలంటే ఆ యువతి బయటికొచ్చి అసంలేం జరిగిందో చెబితే గానీ ఈ కేసు ఓ కొలిక్కిరాదు.    దాంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పుట్ట మధు నోరువిప్పారు. ఇదంతా కాంగ్రెస్‌ పార్టీ, మాజీ శ్రీధర్‌బాబు కుట్ర అన్న పుట్ట మధు.... మధుకర్‌ మృతితో తనకెలాంటి సంబంధం లేదంటూ వివరణ ఇచ్చుకున్నారు. దళిత సంఘాలతోపాటు కోదండరాం సహా విపక్షాలన్నీ ఏకమై ప్రభుత్వంపై విమర్శలు వర్షం కురిపిస్తుండటంతో... టీఆర్‌ఎస్‌ నేతలు ఇరకాటంలో పడ్డారు. మరోవైపు టీఆర్‌ఎస్‌ దళిత నేతలు స్పందించకపోవడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్‌. మరి ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

రామాయణంతో భారతీయులు, హిందువులు కాని వారికేం పని? ఇది చదివితే తెలుస్తుంది!

మనం ప్రతీ యేటా శ్రీరామనవమి జరుపుకుంటాం! ఆచారం, సంప్రదాయం ప్రకారం కళ్యాణం జరిపించి వడపప్పు, పానకం ప్రసాదంగా స్వీకరించి పండగ అయిందనిపిస్తాం. కాని, శ్రీరాముడు , శ్రీమద్రామాయణం… అంత వరకే పరిమితమా? కానే కాదు! రాముడు, రామాయణం మన జాతి గతానికి అతి గొప్ప సంకేతాలు! మనకు లభించిన అమూల్యమైన వారసత్వాలు! రాముడు దేవుడు అనుకునే వారితో ఎలాంటి ఇబ్బందీ లేదు. కాని, రాముడ్ని ఒక కల్పిత పాత్రగానో, చారిత్రక పాత్రగానో భావిస్తే మాత్రం… ఆయన ప్రభావం మన అయోధ్య నగరం నుంచీ మొదలు పెట్టి సుదూర తీరాల వరకూ వ్యాపించింది. అది తెలుసుకుంటే మనకే ఆశ్చర్యంగా వుంటుంది!   రాముడు జన్మించాడని చెప్పే అయోధ్యా నగరం, కోసల రాజ్యం, సరయూ నదీ అన్నీ మన దేశంలోనే వున్నాయి. కాని, విచిత్రంగా మన భారతదేశంలో శ్రీరామ నవమి నేషనల్ హాలి డే కూడా కాదు! అయితే, చైనా, తైవాన్, రష్యా లాంటి దేశాల్లో కూడా రాముడు, రామాయణం ప్రభావం వుందని మీకు తెలుసా? అక్కడ సామాన్య ప్రజలు మొదలు పాలకుల వరకూ అందరూ ఇప్పటికీ రామ శబ్దానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు! ఈ అంశంలో కొన్ని ఆశ్చర్యకర సత్యాలు తెలుసుకుంటే ఆనందం కలగక మానదు!   చైనా దేశంలో మన దగ్గరిలాగే చాలా పౌరాణిక, జానపద గాథలు ప్రచారంలో వుంటాయి. వాటిల్లో చాలా ఫేమస్ గా కనిపించే పాత్ర సన్ వుకాంగ్! ఈయన మంకీ కింగ్! అంటే వానర రాజన్నమాట! ఈ విషయం చెప్పగానే మనకు అమాంతం గుర్తుకు వచ్చేది ఎవరు? రామదూత హనుమంతుడే కదా! ఆయనలాగే సన్ వుకాంగ్ కూడా అపారమైన బలవంతుడు. చిరంజీవి! ఈ పాత్ర సృష్టికి మూలం మన రామాయణంలోని ఆంజనేయుడే! ఆయన ప్రేరణగానే సన్ వుకాంగ్ పుట్టి ఎన్నో వందల చైనీస్ బౌద్ధ గాథల్లో కథానాయకుడిగా నిలిచాడు! ఇక రామాయణాన్ని చైనా దేశం ప్రజలు ఏమంటారో తెలుసా? లంకా జీ అంటారు!   రష్యాలో రామాయణ గాథని నాటకంగా ప్రదర్శించటం సర్వ సాధారణం! అక్కడి వారు హిందూ మతస్థులు కాకపోయినా రామాయణ గాథని ఎంతో అభిమానంగా ఆదరిస్తూ వుంటారు. జీ. పెచ్నికోవ్ అనే రష్యన్ నటుడు ఎన్నో సార్లు రంగస్థలంపై రాముడివేషం వేశాడు! అందుకుగానూ, మన ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం కూడా ఇచ్చింది!   రష్యానే కాదు… పక్కనున్న మంగోలియాలో కూడా రామాయణం చాలా ఫేమస్! అక్కడి కాల్మిక్స్ అనే జాతి వారి జానపద కథల్లో బోలెడు సార్లు మన శ్రీరాముడు కనిపిస్తాడు. వారు రాముడ్ని గొప్ప హీరోగా వర్ణించుకుంటారు!   భారతదేశాన్ని ఆనుకొని వున్న దేశాల్లో ఒకటి మయన్మార్. గతంలో దీన్ని బర్మా అనేవారు. అంటే, బ్రహ్మ దేవుడి భూమి అని అర్థం. ఇప్పుడు ఇక్కడ వున్నది బౌద్ధం. అయినా కూడా బర్మా వారి అనధికారిక జాతీయ ఇతిహాసం ఏంటో తెలుసా? యామా జట్డా! ఇది మరేదో కాదు. మన రామాయణమే! రామ అనే శబ్దాన్నే యామా అంటారు!   రామాయణాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తోన్న మరో ఆసియా దేశం కాంబోడియా. ఇక్కడ మన రామాయాణాన్ని రీమ్కర్ అంటారు. పెద్ద ఎత్తున నృత్య రూపకంగా ప్రదర్శించటం కాంబోడియా రామాయణ విశిష్టత! రామాయణం ప్రదర్శించే ప్రత్యేక నృత్యాన్ని కాంబోడియా జనం లకోన్ అంటారు!   ఇక థాయ్ లాండ్ విషయానికి వస్తే … ఇప్పటికీ థాయ్ రాజుల పేర్లు రామా అనే వుంటాయి! వాళ్లు పాటించేది బౌద్ధం అయినప్పటికీ తమకి తాము రామా అనే వ్యవహరించుకుంటారు. ఇప్పుడున్న థాయ్ రాజు పేరు రామా X. గతంలో కూడా వరుసగా అనేక రాముళ్లు థాయ్ సింహాసనాన్ని అదిష్ఠించారు. అసలు ఒకప్పుడు థాయ్ రాజ్యాన్ని అయోథియా అంటే… అయోధ్యా అనే అనేవారు!   భారతదేశం చుట్టు పక్కల వున్న రాజ్యాలే కాదు.. కొంచెం దూరంగా వున్న జపాన్, కొరియా లాంటి దేశాలపైన కూడా రామాయణ ప్రభావం వుంది. రాముడి ఆరాధన వుంది. ఉదాహరణకి కొరియానే తీసుకుంటే… అక్కడి వారు వేల ఏళ్ల క్రితం అయోధ్య నగర యువరాణే తమ రాజును పెళ్లి చేసుకుందని నమ్ముతారు! వారిద్దరి సంతానం నుంచే కొరియా రాజవంశం , నాగరికత మొదలయ్యాయి! అందుకే, మన అయోధ్యా నగరాన్ని ప్రతీ సంవత్సరం వేల మంది కొరియన్లు సందర్శిస్తుంటారు!   ప్రపంచంలోని ఎన్నో దేశాలు, సంస్కృతులు, నాగరికతలు రామాయణాన్ని , రాముడ్ని నెత్తిన పెట్టుకుంటుంటే మనం మాత్రం తగినంత శ్రద్ధ చూపుతున్నట్టు కనిపించటం లేదు. కొందరు రామ నామాన్ని రాజకీయంగా వాడితే మరికొందరు రామ శబ్దాన్ని మతోన్మాదానికి సంకేతంగా దుష్ప్రచారం చేస్తున్నారు. అలా కాకుండా రాజకీయాలకు అతీతంగా శ్రీమద్రామాయణాన్ని మనం ఘనమైన వారసత్వంగా కాపాడుకోవాలి. 

నోరేసుకుని పడిపోవడమే మంత్రి పదవికి అర్హతా? బోండాపై కార్యకర్తల ఫైర్‌

  2014 ఎన్నికలకు ముందు బోండా ఉమా ఎవరో కనీసం అతని నియోజకవర్గ ప్రజలకు కూడా తెలియదు. మూడేళ్ల క్రితం వరకూ బోండా సెకండ్‌ లీడర్‌ మాత్రమే. అలాంటి గల్లీ లీడర్‌ను చంద్రబాబు వెలుగులోకి తెచ్చారు, 2014లో టికెట్‌ ఇచ్చి ప్రోత్సహించడమే కాకుండా, విజయవాడ సెంట్రల్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. అంతేకాదు అనేక సమయాల్లో బోండాకి అండగా ఉంటూ వచ్చారు. అలాంటిది మంత్రి పదవి దక్కకపోయేసరికి అధినేతనే బ్లాక్‌‌మెయిల్‌ చేసే స్థితికి వచ్చాడు. ప్రతీదానికీ నోరేసుకుని పడిపోతూ గూండాయిజం చేసే బోండా ఉమా... ఎమ్మెల్యేగా గెలవడంతో, ఇదంతా తన బలమేనని అతిగా ఊహించుకున్నాడు. తెలుగుదేశం లేకపోతే తాను జీరో అనే సంగతి మరిచిపోయాడు. బ్రాహ్మణుల ఓట్లు అధికంగా ఉండే విజయవాడ సెంట్రల్‌‌లో పార్టీ బలంతో ఎమ్మెల్యేగా గెలిచి, పదవి రాకపోయేసరికి కాపు కులాన్ని తెరపైకి తెచ్చాడు.   తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఉంటూ, ఐదారుసార్లు ఎమ్మెల్యేలైన వాళ్లకే మంత్రి పదవులు రావడం లేదు. అలాంటిది ఫస్ట్‌ టైమ్‌ ఎమ్మెల్యే అయిన బోండా మంత్రి ఆశించడం ఎంతవరకు న్యాయం, ఒకవేళ ఆశపడ్డా, మంత్రి పదవి రాకపోతే పార్టీకి అధినేతకు ఇబ్బంది కలిగించేలా మాట్లాడటమేనా?. ప్రతీదానికీ కులాన్ని తెరపైకి తేవడం, ఆశించింది దక్కకపోతే తమ కులానికి అన్యాయం చేశారంటూ మాట్లాడటం కామన్‌ అయిపోయింది. ఫస్ట్‌ టైమ్‌ ఎమ్మెల్యే అయిన బోండా ఉమాకి మంత్రి పదవి ఇవ్వకపోతే... కాపు కులానికి  అన్యాయం జరిగినట్లేనా? నిన్నటివరకూ కాపులకు చంద్రబాబు న్యాయం చేస్తున్నారంటూ మాట్లాడిన నోటితోనే, కాపుల గొంతు కోశారంటే పోయేది బోండా ఉమ పరువే కానీ, పార్టీకి ఏమీకాదు. ప్రత్యర్ధి పార్టీలపై నోటికొచ్చినట్లు మాట్లాడితే సంతోషించారు కదా అని, సొంత పార్టీపైనే ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తే అధినేతే కాదు, కార్యకర్తలు కూడా సహించరు. బోండా ఉమా తన గూండాయిజం... పార్టీపైనే చూపిస్తే తోకలు కత్తిరించడం ఖాయం.   బోండా ఉమాకి మంత్రి పదవి ఇవ్వకపోతే కాపు కులానికే అన్యాయం చేసినట్లా? అయినా బోండా ఉమాకి ఏం అర్హతులున్నాయని మంత్రి పదవి ఇవ్వాలి. నోరేసుకుని పడిపోవడమే మంత్రి పదవికి అర్హతా? . కొడుకు కార్ రేసింగులతో స్నేహితుల ప్రాణాలు తీయడమే ఎలిజిబులిటీయా? గూండాయిజం, భూకబ్జాలు చేయడమే అర్హత. సీనియర్‌ ఐపీఎస్ అధికారులను ఇష్టమొచ్చినట్లు తిడుతూ, ఆర్టీఏ అధికారులపై దాడులు చేసినందుకు మంత్రి పదవి ఇవ్వాలా? విజయవాడ సెంట్రల్‌లో బ్రాహ్మణుల ఓట్లతో గెలిచి, చివరికి వాళ్లనే బెదిరిస్తూ, భూములు కబ్జా చేస్తున్నందుకు పదవి ఇవ్వాలా? కనీసం పదో తరగతి కూడా చదువుకోని నీకు... అందరిపై నోరేసుకుని పడిపోతున్నందుకు మంత్రి పదవి ఇవ్వాలా? లేక కులం పేరుతో బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నందుకు ఇవ్వాలా? అంటూ తెలుగుదేశం నేతలు, కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారు.   స్క్రాప్‌ బిజినెస్‌, చెత్త అమ్ముకునే బోండా ప్రవర్తన కూడా చెత్తగానే ఉందంటున్నారు కార్యకర్తలు. అతని మాటలు, బుద్ధి చెత్తగా, చీప్‌గా ఉన్నాయంటున్నారు. నోరుంది కదా అని అదే అర్హత అనుకుంటే ఎలా అంటున్నారు. కనీసం పక్క జిల్లా వాళ్లకు కూడా నువ్వు తెలియదు, ఆ మాటకొస్తే పక్క నియోజకవర్గం కాపులకు కూడా నువ్వెవరో తెలియదు, అలాంటి నీకు మంత్రి పదవి ఇవ్వకపోతే 13 జిల్లాల్లోని కాపులు బాధపడ్డారా? అనడానికైనా సిగ్గుండాలి అంటున్నారు. ఏదిపడితే అది మాట్లాడుతూ కులం పేరుతో చంద్రబాబునే బ్లాక్‌మెయిల్‌ చేస్తావా? అంటూ బోండా ఉమాపై కార్యకర్తలు మండిపడుతున్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వనందుకు 13 జిల్లాల్లో  కాపులు బాధపడ్డారని, చంద్రబాబు కాపుల గొంతు కోశారన్న బోండా మాటలు విని, కాపులే నవ్వుకుంటున్నారని, బోండా ఆ విషయం తెలుసుకోవాలని అంటున్నారు.   నోరేసుకుని పడిపోవడమే మంత్రి పదవికి అర్హత కాదని, సౌమ్యులు, సమర్ధులు, నాన్‌ కాంట్రవర్శియల్స్‌కి మంత్రి పదవులు దక్కుతాయనే సంగతి బోండా పోయినట్లున్నారు. చినరాజప్ప, నారాయణ, గంటా, మాణిక్యాలరావు కాపులు కాదా? వాళ్లు మంత్రులుగా లేరా? కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలతో సమానంగా కాపులకు మంత్రి పదవులు కట్టబెట్టలేదా? ఇవన్నీ వదిలేసి, తనకు మంత్రి పదవి రాకపోయేసరికి, కాపులకేదో అన్యాయం జరిగిపోతున్నట్లు విపక్షాలు విమర్శలు చేసినట్లు మాట్లాడితే, పోయేది బోండా ఉమా పరువే కానీ, తెలుగుదేశం పార్టీది కాదు.

మరోసారి తలెత్తిన… తరతరాల వివాదం… వందేమాతరం!

జనగణమన మన జాతీయ గీతం! మరి వందేమాతరం ఏంటి? ఈ అనుమానం అసలు చాలా వరకూ ఎవరికీ రాదు. కారణం… వందేమాతరం కూడా జనగణమనతో సమానమైన జాతీయ గేయమని అంతా అనుకుంటారు! మరి నిజం అదేనా? జాతీయ గీతం లాగే అందరూ, అంతటా వందేమాతరానికి కూడా గౌరవం ఇవ్వాలా? వందేమాతరం ఎవరైనా పాడకపోతే అది నేరమా? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు కాదు… స్వాతంత్ర్యం రాక మునుపు నుంచే వున్నాయి. జనగణమన , వందేమాతరాల్లో దేన్ని జాతీయ గీతం చేయాలన్న చర్చ నుంచే రెండు పాటల మధ్యా పోటీ మొదలైంది. ఇక ముస్లిమ్ లలో కొందరు వందేమాతరం వ్యతిరేకించటంతో వివాదం మరింత రాజకీయంగా, నాటకీయంగా మారిపోయింది!   ఈ మధ్య జరిగిన ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ మున్సిపల్ కార్పోరేషన్ సమావేశంలో పెద్ద రచ్చ ఒకటి చోటు చేసుకుంది. కారణం వందేమాతర గీతం ఆలపనే! సమావేశంలో పాల్గొన్న ఏడుగురు ముస్లిమ్ కౌన్సిలర్లు తాము వందేమాతరం పాడమని చెప్పారు. దాంతో వార్ని సభ నుంచి బయటకి పంపేశారు. మర్నాడు వార్ని ఏకంగా పదవుల్లోంచే తొలగించారు. ఇదంతా కేవలం ఆ ముస్లిమ్ కౌన్సిలర్లు వందేమాతరం పాడమని చెప్పినందుకే! కాని, మన దేశ రాజ్యాంగం ప్రకారం వందేమాతరం పాడాల్సిందేనా?   వందేమాతరం తప్పకుండా పాడాలని చట్టాల్లో ఎక్కడా లేదు. రాజ్యాంగం జాతీయ గీతానికి ఇచ్చినట్టుగా వందేమాతరానికి గౌరవం ఇవ్వాలని కూడా చెప్పలేదు. కాని, చాలా హిందూ సంస్థలు వందేమాతరానికి తగిన న్యాయం జరగలేదని భావిస్తుంటాయి. బీజేపి నాయకులు కూడా చాలా వరకూ వందేమాతరానికి తగిన గుర్తింపు రాలేదనే వాదిస్తుంటారు! నిజంగా కూడా రాజ్యాంగ రచన సమయంలో జాతీయ గీతంగా అవతరించేందుకు వందేమాతరమే జనగణమన కన్నా ఎక్కువ అర్హత , అవకాశం కలిగి వుండింది. బ్రిటీష్ వ్యతిరేక పోరాటంలో వందేమాతరం రగులుకొల్పిన ప్రేరణ అంతా ఇంతా కాదు. కాని, ఎప్పటికప్పుడు ముస్లిమ్ లీగ్ లాంటి పార్టీలు, ఇతర ముస్లిమ్ శక్తులు వందేమాతరానికి అడ్డు తగులుతూ వచ్చారు. అందులో దేశాన్ని తల్లిగా పోల్చటమే వారికి వున్న పెద్ద అభ్యంతరం. ఇస్లామ్ ప్రకారం అల్లాకి తప్ప మరెవ్వరికీ మొక్కరాదని నియమం!   మతం బోధించిన సంగతి ఎలా వున్నా భారతీయ ముస్లిమ్ నేతలు సామాన్య ముస్లిమ్ లని వందేమాతరం విషయంలో మెప్పించి, ఒప్పించాల్సింది. మెజార్టీ ప్రజలు వందేమాతరం జాతీయ గీతంగా కోరుకున్నప్పుడు దాన్ని మైనార్టీలు కూడా అంగీకరిస్తే బావుంటుంది. కాని, అలా జరగలేదు. కాంగ్రెస్ లాంటి పార్టీలు కూడా ముస్లిమ్ లని వందేమాతరం పాడేలా సరైన పద్దతిలో అంగీకరిపంజేయలేకపోయాయి. ఫలితంగా అదోక పెద్ద వివాదంగా మారిపోయింది.   హిందూ సంస్థలు, హిందూత్వ వినిపించే నాయకులు కూడా వందేమాతరం అందరూ పాడాల్సిందేనని ఒత్తిడి చేయటం అంత మంచిది కాదు. ప్రజాస్వామ్యం అంటేనే స్వేచ్ఛ. అలాంటప్పుడు రాజ్యాంగం తప్పనిసరి చేయని ఒక గీతాన్ని ఆలపించాల్సిందేనని పట్టుబట్టడం సబబు కాదు. లేదంటే, సామరస్య ధోరణిలో వందేమాతరాన్ని వ్యతిరేకిస్తున్న వారితో చర్చలు జరిపి ఒప్పించాలి. చట్టం చేయటం ద్వారా వందేమాతరాన్ని జనగణమనకు సమానంగా వుండేలా చూసుకోవాలి. అంతే తప్ప మున్సిపల్ కార్పోరేషన్లు మొదలు పార్లమెంట్ దాకా ఎక్కడ తమ బలం వుంటే అక్కడ వందేమాతరం బలవంతంగా రుద్దితే… దీర్ఘ కాలంలో అది చెడు ఫలితాలు ఇస్తుంది.   ఇప్పుడు మీరట్ మున్సిపల్ కార్పోరేషన్ నుంచి తొలగించబడ్డ కౌన్సిలర్లు కోర్టులో న్యాయపోరాటానికి దిగితే…. మరో సారి వందేమాతరం వార్తల్లోకి వచ్చే అవశాశం వుంది. అలాగే కోర్టు తీర్పు వందేమాతరం ఆలపన విషయంలో స్పష్టత కూడా ఇవ్వొచ్చు!

అసలు ఆరోజు ఏం జరిగింది?.... నిందితులను కాపాడిందెవరు?

ఆయేషా మీరా రేప్‌ అండ్ మర్డర్... పదేళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించింది కేసు... బెజవాడనైతే ఓ కుదుపు కుదిపింది. ఆయేషా మీరాది విజయవాడ... ఆరోపణలు ఎదుర్కొన్న ప్రముఖులది, పోలీసులు నిందితులుగా చూపించినవాళ్లదీ విజయవాడే. అందుకే ఆయేషా కేసు ఆనాడు బెజవాడలో పెను సంచలనం సృష్టించింది. కొన్ని నెలలపాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ కేసు నానింది. అసెంబ్లీలోనూ తీవ్ర చర్చ జరిగింది. ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబునాయుడు... వైఎస్‌ ప్రభుత్వంపై తీవ్రంగా పోరాడారు. అసలు దోషులను కాపాడుతున్నారని, ప్రముఖులను తప్పించడానికి అమాయకులను ఇరికించారని ఇటు చంద్రబాబు... అటు ప్రజాసంఘాలు పోరాటాలు చేశారు, చివరికి ఆయేషా మీరా తల్లిదండ్రులు సైతం ఇదే మాట చెప్పారు. ఇంతకీ ఆయేషా హత్య జరిగిన రోజు ఏం జరిగింది?   విజయవాడ ఇబ్రహీంపట్నంలో బీ-ఫార్మసీ చదువుతుండే ఆయేషా మీరా... కాలేజీకి సమీపంలోని దుర్గా హాస్టల్లో ఉండేది. అయితే క్రిస్మస్ సెలవుల తర్వాత హాస్టల్‌కి వచ్చిన ఆయేషా 2007 డిసెంబర్ 27న దారుణ హత్యకు గురైంది. హాస్టల్ బాత్ రూమ్‌లో నగ్నంగా రక్తపు మడుగులో ఉన్న ఆయేషాను గుర్తించిన సహా విద్యార్ధినులు... హాస్టల్‌ ఓనర్లకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. హాస్టల్‌లో ఆయేషా సీన్‌ ఆఫ్‌ మర్డర్‌ చూసి పోలీసులు సైతం హడలిపోయారు. ఆయేషాపై అత్యాచారం చేసిన దుండగులు... అతి క్రూరంగా మర్డర్‌ చేశారు. ఆయేషా డెడ్‌బాడీ పక్కనే ఓ లేఖ కూడా దొరికింది. తన ప్రేమను తిరస్కరించినందుకే ఆయేషాను అత్యాచారం చేసి చంపేసినట్లు నిందితుడు లేఖలో తెలిపాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టిన విజయవాడ పోలీసులు...కొన్ని నెలలపాటు ఆ హత్యకు అసలు కారణాలను, నిందితులను పట్టుకోలేకపోయారు.   ముందుగా హాస్టల్ పరిసరాల్లో ఉండేవాళ్లు, లేదా హతురాలికి తెలిసిన వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని భావించారు. హాస్టల్‌ ఓనర్‌ భర్తను కూడా అనుమానించారు... కానీ అందుకు తగిన ఆధారాలు పోలీసులకు దొరకలేదు. అయితే పోలీసులపై అనేక ఆరోపణలు వచ్చాయి.  అసలు నిందితులు ఎవరో తెలిసినప్పటికీ ఆనాటి వైఎస్‌ ప్రభుత్వం ఒత్తిడి మేరకు, ప్రముఖుల పిల్లలను తప్పించేందుకు ప్రయత్నించారని విమర్శలు ఎదుర్కొన్నారు. ఆయేషా ఘటనలో దాదాపు పది మంది కేసులు పెట్టారు. అందులో 8 తప్పుడు కేసులని అప్పుడే తేలింది. ముందుగా క్రిమినల్‌ గురివిందర్‌‌సింగ్‌ అలియాస్‌ లడ్డూని ఇరికించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఆ తర్వాత అతడ్ని వదిలేసి, చివరికి సత్యంబాబుని ఈ కేసులో ఇరికించారు. దాంతో పోలసుల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆయేషా తల్లిదండ్రులు కూడా సత్యంబాబుకి అసలు సంబంధమే లేదని, అన్యాయంగా ఇరికించారని నెత్తినోరు మొత్తుకున్నారు. అయినా అటు ప్రభుత్వం....ఇటు పోలీసులు తాము అనుకున్నదే చేసుకుంటూ పోయారు. ఆయేషా వ్యవహరంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌‌రెడ్డిపైనా తీవ్ర విమర్శలు వచ్చాయి. అసలు నిందితులను కాపాడేందుకు కేసును తారుమారుచేశారనే ఆరోపణలను వైఎస్‌ ఎదుర్కొన్నారు.   ముఖ్యంగా ఆయేషా రేప్‌ అండ్ మర్డర్‌లో రాజకీయ కోణం ఉందని తల్లిదండ్రులు ఆరోపిస్తూ వచ్చారు. అప్పటి రాష్ట్ర మంత్రి కోనేరు రంగారావు బంధువుల హస్తముందని... ఆయేషా పేరెంట్స్‌ ఆరోపించారు. ముఖ్యంగా కోనేరు రంగారావు మనవడికి ఈ హత్యతో సంబంధం ఉందని ఎన్నో ఆరోపణలొచ్చాయ్, అయితే ఆ ఆరోపణలను పోలీసులు కొట్టిపారేశారు. కోనేరు కుటుంబానికి అస్సలు సంబంధమే లేదని తేల్చేశారు. ఆ తర్వాత చిల్లర నేరగాడుని అరెస్టు చేసినా... అతగాడినీ నిర్దోషి అంటూ వదిలేశారు. ఆ తర్వాతే కథ కీలక మలుపు తిరిగింది. కొందరు పొలిటీషియన్ల ఒత్తిడితో కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం అనాసాగరం గ్రామానికి చెందిన సత్యంబాబును తెరపైకి తెచ్చారు. సత్యంబాబే ప్రధాన నిందితుడు అంటూ పోలీసులు అరెస్టు చేశారు. చిత్రహింసలు పెట్టారు, దాంతో సత్యంబాబు నడవలేని స్థితికి చేరుకున్నాడు. అయితే సత్యం బాబు నిర్దోషంటూ స్వయంగా హతురాలి కుటుంబ సభ్యులే గొంతు చించుకున్నా.... ఆనాటి వైఎస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదు. అంతేకాదు ఆయేషా కేసును కొలిక్కి తేబోయిన పోలీస్‌ అధికారులపైనా బదిలీ వేటేశారు. దాంతో అనుమానాలు మరింత బలపడ్డాయి.   ఆయేషా తల్లిదండ్రులు నెత్తీనోరూ మొత్తుకుని కోనేరు రంగారావు కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేసినా, ఆనాటి వైఎస్‌ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించలేదు, ఆ తర్వాత వచ్చిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి సైతం ఈ కేసును పెద్దగా పట్టించుకోలేదు. న్యాయం చేయాలంటూ ఆయేషా తల్లిదండ్రులు... కాళ్లరిగేలా ప్రభుత్వాలు చుట్టూ తిరిగినా అప్పటి ప్రభుత్వాలు కనికరించలేదు. అప్పటినుంచి ఈరోజు వరకూ ఆయేషా కేసు మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే ప్రభుత్వాలు తలుచుకుంటే, దోషులను పట్టుకోవడం కష్టమేమీ కాదు, అంతేకాదు ఆనాడు ఆయేషా కుటుంబం తరపున పోరాడిన చంద్రబాబు.... ఈరోజు అధికారంలో ఉన్నారు కనుక... కేసును తిరగదోడితే... అసలు దోషులెవరో తేలడం పెద్దకష్టమేమీ కాదు.

ఓటింగ్ పూర్తి కాక ముందే… జ్యోతిష్యం చెప్పినా ఊరుకునేది లేదు : ఈసీ!

  ఎన్నికలు మొదలై… అన్ని దశలూ పూర్తి కాక ముందే… ఎవ్వరూ ఎగ్జిట్ పోల్స్ బయటపెట్టటానికి వీలు లేదు! చివరకు, జ్యోతిష్యులు, పేక ముక్కలతో భవిష్యత్ చెప్పే టారోట్ రీడర్స్, న్యూమరాలజిస్టులు అయినా సరే! ఇది చెప్పింది ఎవరో కాదు… భారత దేశంలో అన్ని ఎన్నికలకు బాధ్యత తీసుకునే కేంద్ర ఎన్నికల కమీషన్! అసలు అలా ఎందుకు వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చిందంటే ఈ మధ్య జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో వివిధ ఛానల్స్, పేపర్లు, వెబ్ సైట్లు తమ ఇష్టానుసారం ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. తరువాత వచ్చిన ఎగ్జాక్ట్ పోల్స్ అన్నిట్నీ తప్పని నిరూపించాయనుకోండి! అది వేరే విషయం. కాని, అసలు రూల్స్ కి విరుద్ధంగా మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ బయట పెట్టటం ఏంటని ఈసీ ప్రశ్నించింది!   సెక్షన్ 126A ప్రకారం ఎన్నికలు ఇంకా కొనసాగుతుండగానే ఛానల్స్, పేపర్లు, ఇతర మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ బయటపెట్టవద్దని ఈసీ సూచించింది. ఈ రూల్ అమలులో వున్నా కూడా మొన్న జరిగిన సుదీర్ఘ ఎన్నికల కాలంలో చాలా సంస్థలు నియమాన్ని పట్టించుకోలేదు. తమకు తోచిన పార్టీకి, తమకు నచ్చిన సంఖ్యలో సీట్లు ఇచ్చేస్తూ వచ్చారు. దీని వల్ల ఇంకా పోలింగ్ కు వెళ్లని నియోజక వర్గాల్లో జనం ప్రభావితం అయ్యే అవకాశం వుందని ఈసీ భావిస్తోంది. అలా జరుగుతుందని చెప్పే దానికి శాస్త్రీయమైన ఆధారాలు ఇప్పటికైతే లేవు. జనం చాలా సార్లు ఎగ్జిట్ పోల్స్ చెప్పిన పార్టీకి కాకుండా మరో పార్టీకే పట్టం కట్టారు. ఇది ఈ మధ్య జరిగిన అమెరికా ఎన్నికల దాకా ప్రపంచ వ్యాప్తంగా నడుస్తోన్న ట్రెండ్! చాలా తక్కువ ఓటర్లు వుండి, కేవలం ఇద్దరు అభ్యర్థుల మధ్య సాగే పోరులో కూడా అమెరికన్ మీడియా ఎగ్జిట్ పోల్స్ అన్నీ తప్పులో కాలేశాయి! అవ్వి చెప్పినట్టు హిల్లరీ కాక ట్రంప్ వైట్ హౌజ్ ని కొల్లగొట్టాడు! ఇక మన దేశం లాంటి అతి పెద్ద దేశంలో, కులాలు, మతాలు, ప్రాంతాల కూడికలు, తీసివేతలు, భాగాహారాల నేపథ్యంలో… ఎవరు గెలుస్తారో చెప్పటం ఏ ఎగ్జిట్ పోల్ కు సాధ్యం కాదు! అయినా కూడా ఈసీ చివరి ఓటరు ఓటు వేసేదాకా ఎగ్జిట్ పోల్స్ బయట పెట్టి గందరగోళం సృష్టించొద్దని తాజాగా హెచ్చరించింది!   ఈసీ నిబంధనలు ఉల్లిఘించి ఎగ్జిట్ పోల్స్ చెప్పేస్తే ఏం చేస్తుందో క్లారిటీ లేదు. ఇంత దాకా ఏ మీడియా సంస్థకి అలా చేసినందుకు జరిమానాలు పడ్డ దాఖలాలు లేవు. అయితే, మీడియా వారు కూడా వ్యవస్థని గౌరవించి ఎగ్జిట్ పోల్స్ లాస్ట్ ఓటు కూడా పోల్ అయ్యాక జనానికి అందిస్తే మంచిది! ఎందుకంటే, నూటికి తొంభై సార్లు తప్పే అయ్యే ఎగ్జిట్ పోల్స్ వల్ల  దేశానికి వచ్చిన లాభమేం లేదు. కేవలం ఛానల్స్ టీఆర్పీలు, పేపర్లు సర్క్యూలేషన్ పెరగటం తప్ప! ఇక ఈసీ దృష్టి పెట్టాల్సిన మరో విషయం… ఎగ్జిట్ పోల్స్ బ్యాన్ చేసినా చేయకున్నా సాధ్యమైనంత తక్కువ దశల్లో ఎన్నికలు పూర్తి చేస్తే బావుంటుంది. నెలల తరబడి ఎన్నికల ప్రక్రియ దశల వారీగా సాగుతూ వుంటే పాలన స్థంభించటంతో పాటూ ఓటర్ల ఎంపికని ప్రభావితం చేసే బోలెడు సంఘటనలు, సందర్భాలు చోటు చేసుకోవచ్చు! కాబట్టి, ఎన్నికలు తక్కువ వ్యవధిలో పూర్తి చేసి ఫలితాలు వెంటనే ఎలా ఇవ్వవచ్చో ఈసీ ఆలోచించటం తక్షణ అవసరం!

టీఎస్ అసెంబ్లీకి జనసేనని తీసుకుపోటానికి… ‘కార్’ రెడీనా?

  సినిమాల్లో… హీరో విలన్ని ఎన్ని సమస్యలు ఎదురైనా ఖచ్చితంగా ఓడిస్తాడు! ఓడించకుంటే అసలు హీరోనే కాడు! కాని, పాలిట్రిక్స్ లో అలా కుదరదు. ఇక్కడ ఒక్కో చోట, ఒక్కోసారి ఒకరు హీరో అయితే… మరోకరు విలన్! ఆ విలనే హీరో అయినప్పుడు … హీరో కాస్తా విలనైపోతాడు! అందుకే, పాలిటిక్స్ లో ఎవ్వరూ ఎవ్వరితోనూ శాశ్వతంగా కొట్టుకోరు. తిట్టుకోరు. అలాగని, దాడి చేసుకోకుండా కూడా వుండరు!   కాటమరాయుడు సినిమా చూసి సూపర్ అన్నాడు … టీఆర్ఎస్ పార్టీ చినరాయుడు! అవును… కేసీఆర్ తనయుడు, టీఆర్ఎస్ నెంబర్ టూ నేత… కేటీఆర్ పవన్ సినిమాని మెచ్చుకున్నాడు. అంతే కాదు, పంచెలు కట్టి పంచ్ లు విసిరిన పవన్ కళ్యాణ్ నేతన్నలకు కూడా మంచి చేశాడని కితాబునిచ్చాడు కేటీఆర్! ఇంత వరకూ పాలిటిక్స్ ఏం లేదు కానీ… అసలు మ్యాటర్ తెరపైన కాటమరాయుడు  చూడటంలో లేదనీ… తెర వెనుక జరుగుతోన్న తతంగంలో వుందనీ అంటున్నారు విశ్లేషకులు!   టీఆర్ఎస్ కి , వపన్ కళ్యాణ్ కి పెద్దగా పడదని ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన పని లేదు. గత ఎన్నికల్లో కేసీఆర్ ఘాటుగానే విమర్శించారు పవర్ స్టార్ ని. అయితే, గత కొంత కాలంగా టీఆర్ఎస్ పవన్ ని టార్గెట్ చేయటం మానేసింది. అలాగే, పవన్ కూడా ఏపీ మీద దృష్టి పెట్టి తెలంగాణను ప్రస్తావించటం లేదు. ఇక టీఆర్ఎస్ నైతే పల్లెత్తు మాటని చాలా రోజులే అయిపోయింది. ఇలాంటి గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ ఫార్ములా ఎందుకు అమలవుతోంది? తాజాగా కేటీఆర్ , పవన్ ల సెల్ఫీ ఫ్రెండ్ షిప్ చూస్తే ఆల్రెడీ అనుమానిస్తోన్న వారి డౌట్స్ మరింత బలపడతాయి! వచ్చే ఎన్నికల్లో జనసేన జెండాలు టీఆర్ఎస్ కారుపై రెపరెపలాడనున్నాయా? అలాంటి అవకాశాలు పుష్కలంగా వున్నాయని కొందరంటున్నారు!   కాటమరాయుడు సినిమా చూసిన కేటీఆర్… సినిమా టికెట్ల గురించే కాకుండా పొలిటికల్ టికెట్స్ గురించి కూడా మాట్లాడారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తమతో కలిసి పోటీ చేస్తే జనసేనకు తగినన్ని సీట్లు కేటాయిస్తామని ఆయన అన్నారట. తెలంగాణలో పవన్ పార్టీకి భారీగా సీట్లు గెలిచే అవకాశం ఎలాగూ లేదు కాబట్టి పొత్తు పెట్టుకుంటే టీఆర్ఎస్ క్యాడర్, బలం జనసేనకు కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. అలాగే, పవన్ గ్లామర్, ఫాలోయింగ్ గులాబీ పార్టీకి అదనపు ఆకర్షణ అవుతుంది!   2019 ఎన్నికలకి ఇంకా రెండేళ్లు మిగిలి వున్నాయి కాబట్టి ఇటు పవన్ , అటు టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడప్పుడే బయటపడే అవకాశం లేదు. పైగా అప్పటిలోగా ఇంకా బోలెడు మార్పులు రావచ్చు కూడా. నియోజకవర్గాల సంఖ్య పెరిగితే జనసేనతో పొత్తు టీఆర్ఎస్ కి మరింత ఈజీ అవుతుంది. కాబట్టి అంత వరకూ వెయిట్ అండ్ వాచ్ ఫార్ములానే ఇరు పార్టీలు వాడతాయి! అవసరమైతే వెయిట్ అండ్ వాచ్ పవన్ కళ్యాణ్ మూవీస్ అంటూ… కేటీఆర్ లాంటి నేతలు మళ్లీ మళ్లీ థియేటర్స్ కి కూడా రావచ్చు! ట్వీట్స్ కూడా చేయొచ్చు!

సారీ... ఒక్కసారి ఓకే! ప్రతీసారీ చెల్లదు...

  ఒకసారి అధికారంలోకి రావటం వేరు. ఆ అధికారాన్ని అయిదేళ్ల తరువాత కూడా నిలబెట్టుకోవటం వేరు! రెండో పని సర్కస్ లో  తాడు మీద నడవటం లాంటి సాహస కృత్యం! అందరి వల్లా కాదు. అందుకే, చాలా రాష్ట్రాల్లో , కేంద్రంలో కూడా ప్రతీ అయిదేళ్లకు అదికారం చేతులు మారిపోతుంటుంది. అందుకు కారణాలు బోలెడు! మరీ ముఖ్యంగా, భారతదేశంలో కేవలం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుంటేనే అధికారం కోల్పోతామని గ్యారెంటీ లేదు. ఒక్కోసారి హామీలు నెరవేర్చకపోయినా జనం అందలం ఎక్కిస్తారు. కాని, కొన్ని అత్యంత కీలకమైన విషయాలు మాత్రం ఫలితాల్ని తారుమారు చేసేస్తుంటాయి!   సమైక్యాంధ్రప్రదేశ్ ను అత్యంత సుదీర్ఘ కాలం పాలించిన సీఎంగా చంద్రబాబు రికార్డ్ సృష్టించారు. కాని, ఆయన 2004లో ఓడిపోయినప్పుడు కారణం ఏంటి? కరువు, రైతుల బాధలు వగైరా వగైరా వున్నప్పటికీ మరో ముఖ్య కారణం కూడా వుంది. అదే... ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకత. కారణాలు ఏమైనా చంద్రబాబు మీద అప్పట్లో ఉద్యోగులు, అధికారులు గుర్రుగా వుండేవారు. అది కూడా వైఎస్ విజయానికి దోహదం చేసిందని కొందరు రాజకీయ పండితులు విశ్లేషించారు! అది ఎంత వరకూ నిజమో చెప్పలేం...   గతంలో బాబుకి ఉద్యోగుల సెగ తగిలిందో లేదో మనకు తెలియదు కాని... ఇప్పుడు మాత్రం ఆయన జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే! ఎందుకంటే, కొత్తగా ఏర్పడ్డ ఏపీ కోసం గవర్నమెంట్ ఉద్యోగులు హైద్రాబాద్ వదిలి వచ్చారు. కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి విడిచి వచ్చి అమరావతిలో ఇక్కట్లు పడుతున్నామని వారి భావన. రాష్ట్రాభివృద్ధి కోసం వాళ్లు అలా చేయాల్సిందే. వేరే మార్గం లేదు. కాని,అదే సమయంలో చంద్రబాబు ప్రభుత్వం కూడా ఉద్యోగులు, అధికారులు చేస్తున్న శ్రమని గుర్తించి మసులు కోవాలి. అలా కాకుండా వారిపై అనవసర ఒత్తిడి పెంచితే ఎన్నికల సమయంలో అనూహ్య ఫలితాలు రావచ్చు. ఒక్కోసారి జనం మన వైపు వున్నా ప్రభుత్వానికి జవసత్వాల్లాంటి ఉద్యోగులు సహకరించకుంటే సీఎం, మంత్రులు చేయగలిగింది ఏం లేదు!   విజయవాడలో రవాణశాఖ కమీషనర్ తో టీడీపీ నేతల వాగ్వాదం ఎంత మాత్రం సరైంది కాదు.ఒక ఎంపీ, ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ మూకుమ్మడిగా అధికారిని టార్గెట్ చేయటం చాలా తప్పుడు సంకేతాల్ని పంపుతుంది ప్రభుత్వ యంత్రాంగానికి. నిజంగా అధికారి తప్పే వున్నా హ్యాండిల్ చేసే పద్ధతి అలా వుండకూడదు. రూల్స్ ప్రకారం ఆఫీసర్ లని ప్రశ్నించే హక్కు ప్రజాప్రతినిధులకి వుంటుంది. ఇక తాజాగా జరిగిన ఉదంతంలో అయితే టీడీపీ నేతలదే తప్పని చంద్రబాబు కూడా డిసైడ్ అయ్యారట. ఇంటలిజెన్స్ నివేదిక ప్రకారం టీడీపీ నేతల ప్రవర్తన సరిగ్గా లేదని నిర్ణయించుకున్నాకే వాళ్లని పిలిచి క్లాస్ తీసుకున్నారట సీఎం. ఆయన ఆదేశంలో టీడీపీ నాయకులు కమీషనర్ కి సారీ చెప్పటంతో సమస్య ఇప్పటికైతే సద్దుమణిగినట్టే!   రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఒక అధికారితో నాయకుల గొడవ పెద్ద విషయం కాకపోవచ్చు. కాని, అధికారంలో వున్నప్పుడు ఇలాంటి సంఘటనలు ఎక్కువైతే జనంలోకి తప్పుడు సంకేతాలు వెళతాయి. అదీ కాక ప్రతిపక్ష నేత జగన్ కూడా పలు సందర్బాల్లో అధికారులపై నోరు చేసుకుంటున్నారు. అలాంటి సమయంలో వాళ్లలో భరోసా కల్పించాల్సిన అధికార పక్షం దురుసుగా, దూకుడుగా ప్రవర్తిస్తే అసలుకే మోసం వస్తుంది. కాబట్టి, సీఎంగా, అధికార పార్టీ నాయకుడిగా రెండు బాధ్యతలు నిర్వర్తిస్తోన్న చంద్రబాబు ముందు ముందు మరింత అలెర్ట్ గా వుండాలి. నిప్పు రాజుకున్నాక ఫైర్ ఫైటింగ్ చేయటం కన్నా... ముందే ఫైర్ సేఫ్టీ పాటిస్తే మంచిది!

మంచిని చెడు పదాలతో చెబితే... ఫలితం చెడిపోతుంది!

  వ్యక్తిగతంగా మనకు ఎన్నైనా అభిప్రాయాలుండవచ్చు. కాని, ఒక బాధ్యత గల పదవిలోకి వచ్చాక మనం ఏం మాట్లాడినా జనం అ పదవి నేపథ్యంలోనే చూస్తారు. ఇది కాదనలేని సత్యం. కాని, చాలా మంది ప్రముఖులు పదే పదే ఒకే తప్పు చేస్తుంటారు. సరైంది అయినా, కాకపోయినా తమ ఒపీనియన్ కుండబద్ధలు కొట్టినట్టు చెప్పేస్తుంటారు. ఆ పని సామాన్యులు చేస్తే బాగానే వుంటుంది. కాని, ఒక స్థాయి వచ్చాక కూడా అలా చేస్తూ పోతే అనవసరపు రాద్ధాంతం తప్పదు!   జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ అకునూరి మురళి ఏం మాట్లాడారో అందరికీ తెలిసిందే! నిజానికి ఆయన మాట్లాడినదంతా మన దేశంలో భావప్రకటనా స్వాతంత్ర్యం కిందకి వస్తుంది. కాని, అసలు సమస్య ఒక కలెక్టర్ అయ్యి వుండీ అలా పబ్లిగ్గా మాట్లాడటం సబబా? అదీ ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ బ్రాహ్మణిజం లాంటి పదాలు వాడటం, హిందూ మతాన్ని కించపరిచేలా పిచ్చి మాలాలు అనటం కరెక్టేనా? ఎవరో యూనివర్సిటీలో కూర్చుని మాట్లాడే మేధావి అయితే ఎవ్వరూ పెద్దగా ఆక్షేపణ పెట్టరు. కాని, మురళీ ఒక జిల్లాకి ప్రభుత్వం తరుఫున నియమింపబడ్డ కలెక్టర్. మరి ఆయన ఇలా ఒక వర్గం, ఒక మతం పట్ల అసహనంతో కూడిన మాటలు మాట్లాడితే ఎలా? వాటిలోని సారాంశం సరైందే అని ఒక క్షణం పాటూ భావించినా... చెప్పాల్సిన పద్ధతంటూ ఒకటి వుంటుంది కదా? పదాలు వాడేటప్పుడు ఆలోచించుకోవాలి కదా?   అసలు పెద్ద మాంసం తినండీ అని ఒక ప్రభుత్వ ప్రతినిధి అనవచ్చా? దాంట్లో వుండే లాభాలు ఎలా వున్నా మన దేశంలో రాజ్యాంగం ప్రకారం పశు సంపద ఖచ్చితంగా కాపాడబడాలి. గోవులు, బర్రెలు, ఎడ్లు వంటివి వదించటం కుదరదు. అయినా కూడా జనాల ఆహారపు అలవాట్ల ప్రకారం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో స్థాయిలో కబేళాలు నడుస్తూనే వుంటాయి. గో సంరక్షణ బీజేపియేతర పార్టీలు అధికారంలో వున్న చోట్ల పెద్దగా జరగదనే విషయం అందరికీ తెలిసిందే. ఇక బీజేపి అధికారంలో వున్నా గోవా లాంటి రాష్ట్రాల్లో బీఫ్ పుష్కలంగా లభిస్తూనే వుంది. కాబట్టి గోవు, ఎద్దు, బర్రె మాంసాలు జనం అస్సలు తినలేకపోతున్నారన్నది అబద్ధం. అలాగే, కలెక్టర్ గారు అడవి పందిని కూడా వేటాడి తినండని పిలుపునిచ్చారు. అందులో పోషకాలు పుష్కలంగా వుంటే వుండవచ్చు గాక... కాని, ప్రత్యేకంగా తినమని ప్రొత్సహించటం ఎందుకు? తినమని చెప్పేవారు చెప్పినప్పుడు... వద్దని చెప్పే వారు కూడా తమ పని తాము చేస్తారు కదా? ఆ విషయంలో మాత్రం బ్రాహ్మణిజం అన్న పదం వాడుతూ... బ్రాహ్మణుల మీద అసహనానికి గురైతే ఎట్లా ? పోనీ ఇప్పటి వరకూ బ్రహ్మణులు గో మాంసం తినవద్దని ఎక్కడైనా దాడులు చేశారా? అలాంటి దాఖలాలు ఎక్కడా లేవు!   మురళీ మాట్లాడిన మాటల్లో అత్యంత  ఆక్షేపనీయ వ్యాఖ్యలు పిచ్చి మాలలు అనటం! దేవుడ్ని పూజించటం, మాలలు వేసుకోవటం జనం తాలూకూ వ్యక్తిగత స్వేచ్ఛ! దాన్ని ఎవ్వరూ విమర్శించటానికి లేదు. అలాగే, ఆయన చెప్పిన మాంసాహారం మానేయటం కూడా మాలలు వేసుకోవటం వల్ల ఆగిపోవటం లేదు. ఏ మాలైనా 40రోజులు వేసుకుంటారు. సంవత్సరంలోని మిగతా రోజులన్నీ మాంసాహారం తినటానికే చాన్స్ వుంది. మరప్పుడు హిందువుల మనోభావాలకు సంబంధించిన మాలలపై పిచ్చి మాలలు అన్న పద ప్రయోగం సమంజసమేనా? అసలు ఇలా వేరే మతాల వారి ఆచారాల్ని, సంప్రదాయాల్ని, వ్రతాల్ని, దీక్షల్ని కలెక్టర్ స్థాయిలో వుండి టార్గెట్ చేయగలరా?   వ్యాఖ్యలు చేసిన కలెక్టర్ మురళీ వెంటనే క్షమాపణలు కూడా చెప్పారు. దాంతో సమస్య సద్దుమణిగిందనే చెప్పొచ్చు. కాని, ప్రభుత్వ ప్రతినిధులుగా వున్న వారు ఇక నుంచైనా బాధ్యతగా సరైన పదాలు ఎంపిక చేసుకుని తమ భావాలు వ్యక్తం చేస్తే బావుంటుంది! అదే వారి స్థాయికి హుందాగా వుంటుంది. సమాజానికి కూడా లాభదాయకంగా వుంటుంది!

60ఏళ్ల ముసలాయన్ని చెప్పుతో కొట్టాడు... పైగా అదో గొప్పగా చెప్పుకుంటున్నాడు!

మన దేశంలో అత్యంత అరుదుగా కనిపించే మంచి పొలిటీషన్స్ ని పక్కన పెడితే .. దుర్మార్గ రాజకీయ నతేలు రెండు రకాలు! మొదటి రకం బాగా చదువుకున్నట్టు కనిపిస్తూ వ్యవస్థని నిర్వీర్యం చేసే అవినీతిపరులు. ఇక రెండో రకం, ఖద్దర్ బట్టలు వేసుకుని చట్ట సభల్లోకి జొరబడ్డ రౌడీలు, గూండాలు! తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో రచ్చ రచ్చ చేశాడు ఈ రెండో రకం నాయకుడుగారు!   అసలు మన దేశంలో ఏదైనా పార్టీ చితక్కొట్టుడు రాజకీయం బాగా ఒంటబట్టించుకుందంటే... అది శివసేననే! ఒకప్పుడు బాలాసాహెబ్ థాక్రే వుండగా ఆ పార్టీ వారు ఉత్తరాది వార్ని ఉతికి ఆరేస్తూ వుండేవారు. అది ఖచ్చితంగా తప్పే అయినా మరాఠీల సంక్షేమం కోసం పోరాడుతోందని భావించి కొందరు చూసి చూడనట్టు సహించే వారు. కాని, రాను రాను శివసేన అరాచకాలు మరీ శృతీ మించిపోయాయి. దానికి తోడు మహారాష్ట్రాలో పుట్టుకొచ్చిన రాజ్ థాక్రే పార్టీ ఎంఎన్ఎస్ కూడా వీలున్నప్పుడల్లా వీపులు విమానం మోత మోగిస్తుంటుంది! అదీ ఎవరో అమాయకుల్ని చూసుకుని మాత్రమే! బలమైన రాజకీయ ప్రత్యర్థుల్ని ఈ శివసేన, ఎంఎన్ఎస్ నేతలు ఒక్కసారన్నా ఇరగొట్టిన పాపాన పోలేదు. వీరి ప్రతాపం అంతా పేద, మిడిల్ క్లాస్ జనాల మీదే!   శివసేన నుంచి ఎంపీగా ఎన్నికైన నాయకుడు రవీంద్ర గైక్వాడ్. ఈయన పూణే నుంచి ఢిల్లీ వచ్చాడు. అయితే, విమానంలో తనకు ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో సీట్ ఎందుకు ఇవ్వలేదని వాదన పెట్టకున్నాడు ఫ్లైట్ లోని స్టాఫ్ తో. ఆ వివాదంలో ఎవరి తప్పు వుందో దేవుడికే తెలియాలి కాని... అతి కష్టం మీద గైక్వాడ్ ని విమానం నుంచి కిందకు దించారు. తరువాత ఇందిరా గాంధీ ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వెళుతుండగా మరోసారి వాదన మొదలుపెట్టాడు ఎంపీ గైక్వాడ్. 61 ఏళ్ల కస్టమర్ సర్వీస్ అధికారితోటి మాటా మాటా పెరిగింది. ఇక మనోడు రెచ్చిపోయి... తన మరాఠా పాలిటిక్స్ స్టైల్లో చెప్పు తీసి ఆ ఉద్యోగిని కొట్టడం మొదలు పెట్టాడు. ఒక్కసారి కాదు... ఏకంగా పాతిక సార్లు చితక్కొట్టాడు! ఇదంతా ఏదో తప్పుడు ప్రచారం అనుకోటానికి కూడా లేదు. గైక్వాడ్ స్వయంగా ఒప్పుకున్నాడు కూడా!   రవీంద్ర గైక్వాడ్ తాను ఎయిర్ ఇండియా ఎంప్లాయిపై చెప్పుతో దాడి చేసిన సంగతి సగర్వంగా ఒప్పుకోవటమే కాదు.. ఎలాంటి పశ్చాత్తాపం ప్రదర్శించలేదు కూడా! మీడియా ముందు ఎలాంటి క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని ఢంకా బజాయించాడు! ఈయనగారు ఇలా చేయటం మొదటి సారి అనుకోకండి! గౌరవనీయ ఎంపీ గైక్వాడ్ గారు రెండ్రోజులు క్రితమే ఒక డీఎస్పీ మీద ఇష్టం వచ్చినట్టు మరాఠీలో కేకలు వేశాడు. ఆ వీడియో కూడా ఇప్పుడు నెట్ లో చక్కర్లు కొడుతోంది!    శివసేనలో గైక్వాడ్ లో లాంటి నాయకులు, కార్యకర్తలు బోలెడు మంది! ఇక మిగతా పార్టీల సంగతి కూడా బెటర్ గా ఏం లేదు. కాకపోతే , శివసేన, ఎంఎన్ఎస్ ల మాదిరిగా పబ్లిక్ గూండాగిరి చేయకపోవచ్చు. అంతే తప్ప మన దేశంలో ఈ రౌడీ కల్చర్ అన్ని పార్టీలకు, అన్ని ప్రాంతాలకు వ్యాపించింది. టోల్ గేట్ల వద్ద నుంచీ ఎయిర్ పోర్ట్ ల వరకూ ఎక్కడ పడితే అక్కడ మన నేతలు తమ స్థాయి మరిచి రచ్చ చేస్తుంటారు! ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యాక కూడా పూర్వాశ్రమం వాసనలు వీర్ని వదలటం లేదు! దీనికి సరైన పరిష్కారం చట్ట సభల్లో వీరికి తగిన శిక్షలు పడటమే. క్రమశిక్షణ సంఘాలు గైక్వాడ్ లాంటి నేతల్ని గట్టిగా శిక్షించాలి. అప్పుడైనా కొంత బుద్ది రావొచ్చు!   తమ ఎంప్లాయి పై దాడి చేసిన గైక్వాడ్ ను శాశ్వతంగా తమ సర్వీసుల్లో తిరగకుండా బ్యాన్ చేద్దామనుకుంటోంది ఎయిర్ ఇండియా. దాని వల్ల గైక్వాడ్ కు వచ్చే నష్టమేం లేదు కాబట్టి ఆయన ప్రవర్తన మారుతుందని ఆశించలేం. ఇక ఇప్పటికే ఆయన వివరణ కోరిన శివసేన పార్టీ కూడా ... సదరు రౌడీ ఎంపీపై తీవ్రమైన చర్యలు తీసుకుంటుందని ఆశించనక్కర్లేదు! 

వాళ్ల ఉద్దేశం, సందేశం... అన్నీ దేశమే!

భారత్ లో అమరుల సంస్మరణ దినం జనవరి 30న జరుపుతారు. అధికారికంగా గాంధీజీ చనిపోయిన ఆ రోజు అమరుల త్యాగాలకు గుర్తుగా ఎంచుకున్నా మార్చ్ 23 మాత్రమే అందుకు సరైందని చాలా మంది భావిస్తుంటారు. ఉత్తరాదిలో షహీద్ దివస్ గా మార్చ్ 23ను పేర్కొంటారు. అందుకు కారణం... తల్లి భారతి దాస్య విముక్తి కోసం ముగ్గురు నవ యువకులు ప్రాణాలు త్యాగం చేసిన రోజు... మార్చ్ 23 కావటమే! 86 ఏళ్ల కింద వారి త్యాగంతో పావనమైన భూమి ఇవాళ్ల స్వతంత్ర దేశంగా వర్ధిల్లుతోందంటే అందులో వారు అందించిన ప్రేరణ ఖచ్చితంగా వుందని చెప్పాల్సిందే! ఇంతకీ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ఎవరు? వాళ్లు చేసిన పోరాటం ఏంటి? మీకు తెలుసా...    భగత్ సింగ్ 12ఏళ్ల వయస్సులోనే జలియన్ వాలా బాగ్ మారణకాండని చూసి చలించిపోయాడు. 1919వ సంవత్సరంలో వందలాది మందిని డయ్యర్ కాల్పులు జరిపించి పొట్టనబెట్టుకున్నాడు. అది చూసి కదిలిపోయిన భగత్ జలియన్ వాలా బాగ్ లోని రక్తంతో తడిసిన మట్టిని సీసాలో దాచుకుని దేశం కోసం తపించి పోయేవాడు!భగత్ సింగ్ చిన్నప్పట్నుంచే సాయుధ పోరాటం గురించి మాట్లాడేవాడు. ఇంకా లోక జ్ఞానం లేని సమయంలోనే పొలాల్లో గన్నులు పెంచి బ్రిటీష్ వాళ్లని ఎదుర్కోవాలని అనేవాడట! ఆ విప్లవ ఆలోచనలు తరువాతి కాలంలో సోషలిజమ్, సోషలిస్టు విప్లవం గురించిన సాహిత్యం చదివాక మరింత పదునెక్కాయి! క్రమక్రమంగా కమ్యూనిజం వైపు ఆకర్షితుడైన భగత్ సింగ్ అంతిమంగా నాస్తికుడు, హేతువాది అయ్యాడు. అయితే, తన ఏకైక దైవం దేశమే అనుకున్న ఆయన ప్రపంచ ప్రఖ్యాత ఇన్ క్విలాబ్ జిందాబాద్ నినాదం అందించాడు. ఇన్ క్విలాబ్ జిందాబాద్ అంటే ... విప్లవం వర్ధిల్లాలి అని అర్థం!   1929లో భగత్ సింగ్ తన తోటి యోధులతో కలిసి ఢిల్లీలోని సెంట్రల్ అసెంబ్లీలో బాంబులు పేల్చాడు. అది ఎవ్వర్నీ చంపటానికి ఉద్దేశించిన ప్రయత్నం కాదు. కేవలం తమ పోరాటం వైపు ప్రపంచ దృష్టిని ఆకర్షించటం కోసం మాత్రమే! తరువాత భగత్ సింగ్ జైల్లో చారిత్రక ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. ఖైదీలకు, స్వాతంత్ర్య సమర యోధులకు కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేసి ...సాధించాడు!   మార్చ్ 23న ఒకే రోజు దేశం కోసం ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లలో రాజ్ గురుయే చిన్నవాడు. ఆయన వయస్సు కేవలం 22 మాత్రమే. భగత్ 23ఏళ్ల వాడు కాగా సుఖ్ దేవ్ 24ఏళ్ల వయస్సు వాడు. ఈ ముగ్గురిలో రాజ్ గురు మహారాష్ట్రా వాసి. పుట్టుకతో బ్రాహ్మణుడైనా సాయుధ పోరాటమే జాతి విముక్తికి పరిష్కారమని నమ్మాడు. గాంధీ అహింసా మార్గం, సహాయ నిరాకరణ విశ్వసించే వాడు కాదు. ఇవాళ్ల రాజ్ గురు జన్మస్థానమైన పూణే దగ్గర్లోని ఖేద్ ను రాజ్ గురు నగర్ గా పిలుస్తున్నారు! ముగ్గురిలో మూడోవాడైన సుఖ్ దేవ్ పంజాబ్ లోని లుధియానాకు చెందినవాడు. ఆయన కూడా సాయుధ పోరాటమే బ్రిటీష్ వారికి బుద్ది చెబుతుంది నమ్మేవాడు. అంతే కాదు, సుఖ్ దేవ్ మహాత్మ గాంధీకి ఆయన చేపట్టిన అహింసాయుత ఉద్యమాన్ని తిరస్కరిస్తూ లేఖ కూడా రాశాడు. తాము చేస్తున్న హింసాత్మక పోరాటాన్ని గాంధీజీ గుర్తించకపోవటాన్ని సుఖ్ దేవ్ తప్పుబట్టాడు.   భగత్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లకు ఉరి శిక్ష పడటానికి కారణమైన హత్య జాన్ సాండర్స్ అనే బ్రిటీష్ పోలీస్ అధికారిది. నిజానికి వాళ్లు ముగ్గురూ ఆయన్ని చంపుదామని అనుకోలేదు. జేమ్స్ స్కాట్ అనే బ్రిటీష్ అధికారిని మట్టుబెడదామని భావించారు. కాని, పొరపాటున సాండర్స్ చనిపోయాడు. లాహార్లో భగత్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లు సాండర్స్ ను చంపిన కేసులోనే వారికి ఉరిశిక్ష పడింది.    ఉరిశిక్ష అమలు చేస్తే జనం నుంచి తీవ్ర వ్యతిరేకత రావచ్చనే ఉద్దేశంతో ముగ్గురు వీరుల్ని బ్రిటీష్ ప్రభుత్వం ప్రకటించిన సమయాని కంటే 11గంటల ముందే మృత్యు దేవతకు అర్పించింది. అలా మార్చ్ 23, 1931న రాత్రి 7.30కి భగత్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లు వీర స్వర్గం పొందారు. వారి పార్థివ దేహాల్ని రహస్యంగా జైలు గోడలకున్న కన్నాల్లోంచి బయటకు తరలించిన బ్రిటీష్ వారు అక్కడే దహనం చేసి... భస్మాన్ని సట్లెజ్ నదిలో కలిపేశారు! అలా వారి త్యాగం సింధూ నదికి ఉపనది అయిన సట్లెజ్ వున్నంత కాలం... భారతీయులు ఆ నది నీళ్లు తాగుతున్నంత కాలం చిరస్థాయిగా వుండిపోయింది!

గంగ కాదు... గంగమ్మ అని తేల్చేసిన హైకోర్ట్!

  గంగ మనకు నది మాత్రమే కాదు. గంగ మనకు గంగమ్మ! ఆమె పాపాల్ని కడిగేసే పరమ పావని! అందుకే, గంగోత్రిలో గంగ పుట్టింది మొదలు గంగా సాగర్ అనే ప్రాంతంలో సముద్రంలో చేరే వరకూ మనకు గంగా తీరమంతా పుణ్య  క్షేత్రాలే! మరీ ముఖ్యంగా, కాశీ లాంటి చోట శివుడ్ని పూజించటం ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం గంగలో మునగటం! ఇక గంగతో సమానంగా పూజలందుకునే యమున గురించి చెప్పేదేముంది? శ్రీకృష్ణుని రాసలీలలకు ప్రత్యక్ష సాక్షిగా భావిస్తారు యమునమ్మని! అయితే, ఇక మీదట గంగా, యమునలు భక్తులకు, ఆస్తికులకు మాత్రమే కాదు... లాయర్లకు, కోర్టులకు కూడా అమ్మలే! ఉత్తరాఖండ్ హై కోర్ట్ తాజా అభిప్రాయం ఇదే సంగతి చెబుతోంది! గంగా, యమునల గురించి ఉత్తరాఖండ్ హైకోర్ట్ మాట్లాడాల్సి రావటానికి కారణం... ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ మధ్య ఆస్తులు, అప్పుల పంపకాల గురించి దాఖలైన ఒక పిటీషన్! దాని పై విచారణ చేస్తున్న న్యాయమూర్తులు గంగ, యమున నదులు కేవలం నీటి ప్రవాహాలు కాదని అన్నారు. అవ్వి హిందువుల భక్తి, శ్రద్దలకి మూలమైనవి. అంటే,గంగ, యమున కూడా న్యాయస్థానం ముందు వ్యక్తులుగా అస్థిత్వం కలిగి వుంటాయి. వాటి తరుఫున బాధ్యత తీసుకున్న వ్యక్తులు వాదనలు వినిపించవచ్చు! అలాగే, వాటికి దేశంలోని అందరు పౌరులుకుండే హక్కులు కూడా వుంటాయి! ఈ విషయం చెబుతూ కోర్ట్ గంగా మయ్యా అంటారు అని కూడా తెల్పింది. అంటే, గంగను భారతీయులు తల్లిలా చూస్తారన్నమాట! గంగ, యమునల్ని ప్రత్యేక అస్థిత్వం గల ప్రాణులుగా పరిగణించాలి అని కోర్టు అనటం వెనుక చాలా అర్థమే దాగుంది. ప్రస్తుతం ఉత్తర భారతదేశానికి జీవనాడుల్లాంటి గంగా, యమునా నదులు తీవ్ర ప్రమాదంలో వున్నాయి. తీరం వెంబడి నివసించే జనం నిర్లక్ష్యం, లక్షలాదిగా తరలి వచ్చే భక్తుల విశృంఖలత్వం, కలుషితాల్ని ప్రవాహాల్లో కలిపేసే కర్మాగారాలు... అన్నీ కలిసి ఆ జీవనదుల జీవాన్ని హరించేస్తున్నాయి. వాటి బ్రతికే హక్కుని హరించేసి గంగా, యమునల అంతానికి ఆరంభం పలికేశాయి! ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం చాలా రోజులుగా గంగా, యమునా రక్షణకి నడుం బిగించింది. కాని, మొన్నటి వరకూ యూపీలో, ఉత్తరాఖండ్ లో బీజేపి ప్రత్యర్థి పార్టీలు అధికారంలో వుండటంతో గంగా మ్యానేజ్ మెంట్ బోర్డ్ ఏర్పాటు కుదరలేదు. దీనిపై కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. త్వరలోనే నదుల సంరక్షణకి బోర్డ్ ఏర్పాటు చేయాలని సూచించింది. గంగా, యమునలు పునర్వైభవం పొందేలా చేస్తామని హామీ ఇచ్చిన మెదీ సర్కార్ ఇప్పుడు ఉత్తరాఖండ్ , ఉత్తర్ ప్రదేశ్ లలో కూడా తమ ప్రభుత్వాలే ఏర్పాడ్డాయి కాబట్టి ఏం చేస్తుందో వేచి చూడాలి! మన పురాణాలు, ఇతిహాసాలతో పాటూ కోర్టు కూడా గంగా, యమునలు సజీవ అస్థిత్వాలని, కోట్లాది జనం తాలూకూ విశ్వాసానికి మూలాలని ప్రకటించింది కాబట్టి పాలకుల బాధ్యత మరింత పెరుగుతుంది. దేశ సంపద, వారసత్వం లాంటి నదుల్ని ఎంతటి శ్రమైనా భరించి రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది! వాటి కోసం కాకపోయినా.. మన అస్థిత్వం కోసమైనా...

ఇండియా... పాక్ కంటే హీనం! బంగ్లాదేశ్ కంటే దారుణమట!

నార్వే, డెన్మార్క్, నెదర్లాండ్స్ ఫిన్ ల్యాండ్... ఇలాంటి దేశాలు మనకంటే సంతోషంగా వున్నాయంటే నమ్మొచ్చు! కాని, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇరాక్ కూడా ఇండియా కంటే హ్యాపీగా వున్నాయట! ఇదేం విడ్డూరం? కాని, తాజాగా రిలీజైన వాల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2017 ప్రకారం అదే నిజం! మొత్తం 155 దేశాల్లో మన భారత్ 122వ స్థానంలో నిలిచింది! అంటే, మరో 33 దేశాలు మాత్రమే మన దేశం కన్నా ఏడుపుగొట్టుగా వున్నాయన్నమాట!   మార్చ్ 20ని ప్రపంచ వ్యాప్తంగా హ్యాపీనెస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు! ఆ విషయం కూడా తెలియని వారు మన దేశంలో బోలెడు మంది. అంతగా బాధల్లో, కన్నీళ్లలో మునిగిపోయారు ఇండియన్స్! మనకన్నా పూట గడవని ఆర్దికంగా చితికిపోయిన దేశాలు ఎక్కువ సంతోషంగా వున్నాయట. అలాగే, బాగా సంపన్నమైన యూరోపియన్, అమెరికన్ దేశాలు కూడా ఖుషీగానే వున్నాయట! ఐక్యరాజ్య సమితి అధికారికంగా ప్రకటించిన సర్వే ఫలితాల్లో ఈ ఆందోళనకర విషయం బయటపడింది!   ప్రస్తుత ప్రపంచ ఆర్దిక పరిస్థితుల దృష్ట్యా భారత్ ను మించి దూసుకుపోతున్న దేశం లేదు. గత సంవత్సరంలో మనం ఆర్దిక అభివృద్దిలో చైనాను కూడా వెనక్కి తోశాం. అయినా కూడా చైనాకు 79వ ర్యాంక్ వస్తే ఉగ్రవాదుల స్వర్గమైన పాకిస్తాన్ కు 80వ చోటు దక్కింది. ఇక చల్లటి హిమపర్వతాల నేపాల్ 99వ స్థానంతో సరిపెట్టుకుంది. అడ్డూ అదుపు లేని బంగ్లాదేశ్ 110వ ర్యాంక్ కొట్టేసింది. నిత్యం మానవ బాంబుల పేలుళ్లతో హృదయ విదారకంగా వుండే ఇరాక్ కూడా మనకన్నా బెటర్ గా 117వ ప్లేస్ లో వుండగా, శ్రీలంక 120 స్వంతం చేసుకుంది! వీటన్నటి తరువాత ఇండియా 122వ స్థానంలో ముఖం వేలాడేసుకుని నిలవాల్సి వచ్చింది! దీనికి కారణం ఏంటి?    గతంలో చేసిన ఇంటర్నేషనల్ హ్యాపినెస్ సర్వే రిపోర్ట్ లో మనకు 118వ స్థానం దక్కింది. ఇప్పుడు నాలుగు స్థానాలు కోల్పోయి 122కు వచ్చాం. అయితే, విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ పతనానికి కారణం ఆర్దిక కోణం మాత్రమే కాదు. డబ్బులే సంతోషానికి మూలమైతే అమెరికా లాంటి దేశం నెంబర్ వన్ అవ్వాల్సింది. కాని, ఎక్కడో పద్నాలుగవ ర్యాంక్ తో టాప్ టెన్ లో కూడా కనిపించకుండా పోయింది! నార్వే, డెన్మార్క్ మొదలు ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ వరకూ అన్నీ మనం ఊహించని దేశాలే అత్యున్నత సంతోష స్థాయితో ముందున్నాయి. దీనికి కారణం అభివృద్ది చెందుతున్న దేశాల్లో సామాజిక సమస్యలు, భద్రత కూడా ఆందోళకరంగా వుండటమే. వేగంగా మార్పు జరుగుతున్నప్పుడు అనూహ్య పరిస్థితులు, పరిణామాలు సహజం. వాటి మూలంగా జనం అభద్రతకి లోనవటం, కొత్త సవాళ్లతో సతమతం అవ్వటం కూడా సహజమే. ఇక ఇండియా, చైనా లాంటి దేశాల్లో అభివృద్ధి కేవలం కొంత మందికే ఉపయోగపడుతూ పేద వార్ని మరింత పేదగా, గొప్ప వార్ని మరింత గొప్పగా మార్చేస్తుండటం... జనంలో సంతోషం క్షీణించటానికి కారణం! గతంలో కన్నా మనకు ఇప్పుడు బోలెడు భౌతిక సౌకర్యాలు, సుఖాలు అందుబాటులోకి వచ్చి వుండవచ్చు. అయినా అవేవీ ఆధునిక జీవనశైలి తెచ్చి పెడుతోన్న మానసిక రుగ్మతల్ని దూరం చేయలేకపోతున్నాయి!   నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాక్, ఇరాక్ లాంటి దేశాల్లో మనకన్నా ఆనందం స్థాయి ఎక్కువ వుండటం మరో విషయం కూడా స్పష్టం చేస్తుంది. సామాజిక స్థిరత్వాన్ని, కట్టుబాట్లని, అనుబంధాల్ని పణంగా పెట్టి అభివృద్ది సాధిస్తే దానికి మూల్యంగా సంతోషాన్ని చెల్లించాల్సి వస్తుంది. నిజానికి భారత్ కంటే మెరుగైన హ్యాపీనెస్ ఇండెక్స్ సాధించిన చాలా దేశాల్లో నిరుద్యోగం తీవ్రంగా వుంది. అయినా అక్కడి వారు సంతోషంగా వుంటున్నారని లెక్క తేలటం... మన దేశంలో ఉద్యోగ స్థానాల్లో ఎదురవుతోన్న ఒత్తిడికి సంకేతం! ఈసారి హ్యాపినెస్ సర్వే చేసిన వారు ఆధునిక మానవుడు ఎక్కువ కాలం గడిపేది వర్క్ ప్లేస్ లోనే కాబట్టి దాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారట! అలా చూసినప్పుడు కూడా ఇండియా, చైనా లాంటి దేశాల్లో ఆఫీసుల్లో సంతోషం కొరత తీవ్రంగా వుందట! జనం ఆనందంగా ఉద్యోగాలు చేయటం లేదు. తప్పనిసరై అసంతృప్తిగానే బండి నెట్టుకొస్తున్నారు!   155 దేశాల్లో పరిస్థితి గురించి ఒక సంస్థ తనకు దొరికిన కొద్దిపాటి డేటాతో ఓ రిపోర్ట్ తయారు చేస్తే దాన్ని గుడ్డిగా నమ్మాలా? అస్సలు అక్కర్లేదు! నిజంగా మనకన్నా పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలు ఆనందంగా వుండొచ్చు. వుండకపోవచ్చు. కాని, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే! మనం సాధిస్తున్న ఆర్దిక ఫలాలు ఆనందపు ఘుమఘుమలతో మక్కుతున్నాయా లేదా అని! ఊరికే మందులు వేసి మక్కేలా చేసిన రంగురంగుల ఫలాల మాదిరిగా... పైకి కళకళలాడుతూ... లోన చప్పగా వుండిపోతున్నాయా? సమాధానం వెదుక్కోవాల్సింది మనమే!

మంటని పొడిచే కొద్దీ పెద్దదవుతుంది! మోదీ అయినా, యోగీ అయినా అంతే!

ఒక వ్యక్తిని మనం వ్యతిరేకించాలంటే అతను ఏదైనా పొరపాటు చేసి వుండాలి. లేదంటే అతడ్ని మనం ద్వేషించాలంటే అతడేదైనా దారుణమైన తప్పు చేసి వుండాలి. ఇక ఒక వ్యక్తిని మనం అసహ్యించుకోవాలంటే తాను పరమ నీచుడై వుండాలి! కాని, మన ప్రజాస్వామ్య దేశంలో ఈ మధ్య ఒక విడ్డూరం మొదలైంది! అదే ఆకారణ అసహనం!   ఆ మధ్య దేశంలో అసహనం ప్రబలిందంటూ అవార్డులు వాపస్ చేశారు కొంత మంది మేధావులు. వాళ్లు ఎందుకు చేశారు? వాళ్లకు వాపస్ ఇచ్చిన ఆ అవార్డ్ లు గతంలో ఇచ్చిన ప్రభుత్వ పెద్దలు ఎందుకు ఇచ్చారు? ఇదంతా పెద్ద చర్చ! అది పక్కన పెడితే అసలు అసహనం నిజంగా మన దేశంలో వుందా? ఈ ప్రశ్నకు సమాధానం అవును అనే! అసహనం నిజంగానే వుంది! కాని, హిందూత్వం వినిపించే అతి వాదుల్లో కాదు! వారికంటే ఎక్కువగా అభ్యుదయవాదులమని చెప్పుకునే వారిలో అసహనం ప్రజ్వరిల్లుతోంది!   అభ్యుదయవాదులు, లిబరల్స్, ప్రజాస్వామ్యవాదులు, మానవతావాదులు.. ఇలా ఎన్ని పేర్లు పెట్టుకున్నా మన దేశంలో చాలా మంది తరతరాల పాత చింతకాయ నిర్వచనాలకు స్థిరపడిపోయారు. వాట్ని మార్చుకునే ఉద్దేశమే వున్నట్టుగా కనిపించదు. అందులో ప్రధానమైంది, కాషాయం వేసిన వార్ని కఠినాత్ములుగా, కర్కశులుగా చూడటం! హిందూత్వం వినిపిస్తే చాలు వార్ని అంటరాని వారిగా చూసే సంస్కృతి మన దేశంలో ఎప్పుడూ కొనసాగుతోంది. అదే తాజాగా యోగి ఆదిత్యనాథ్ ఎంపిక తరువాత కూడా బయటపడింది! ఆయన్ని విమర్శించేవారు, వ్యతిరేకించేవారు, అడ్డూ అదుపు లేకుండా తిట్టిపోసే వారూ అందరూ ఏకమై దాడి మొదలు పెట్టారు! వాళ్ల ప్రధాన అభ్యంతరం, ఆరోపణ ఏంటంటే... యోగి ఆదిత్యనాథ్ ఒక హిందూ మతోన్మాది! దీనికి ఏంటి ఆధారం?   యోగి ఆదిత్యనాథ్ అయిదు సార్లు వరుసగా ఎంపీగా ఎన్నికైన ప్రజా నేత. ఆయనను గోరఖ్ పూర్ ప్రజలు నమ్మకంతో పదే పదే పార్లమెంట్ కు పంపించారు. లక్షల మెజార్టీ ఇచ్చి మరీ తమ ప్రతినిధిగా చేశారు! దీన్ని గౌరవించే బాధ్యత మీడియాలోని కొందరు జర్నలిస్టులకి, చర్చల్లో పాల్గొనే మేధావులకి, సోషల్ మీడియాలో చెలరేగే అభ్యుదయవాదులకి లేదా? లేక గోరఖ్ పూర్ ఓటర్ల కంటే యోగి ఆదిత్యనాథ్ గురించి దేశంలో ఎక్కడెక్కడో వుంటోన్న అపర మేధావులకే ఎక్కువ తెలుసా?  యోగి ఆదిత్యనాథ్ ముక్కుసూటిగా మాట్లాడతారు. అంతే తప్ప ఆయన ఇప్పటి వరకూ నీచమైన కామెంట్స్ ఏమీ చేయలేదు. అడపాదడపా హిందూత్వ వాదిగా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసి వుండవచ్చు. కాని, అవేవీ కూడా ఆయన్ని కోర్టుల్లో శిక్షార్హుడ్ని చేసేవి కావు! అలాంటి అవకాశమే వుంటే 1998 నుంచి ఇప్పటి వరకూ మాయవతి, అఖిలేష్ సర్కార్లు ఊరుకునేవా? యోగి ఆదిత్యనాథ్ ను కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టేవి కావా?    యోగి ఆదిత్యనాథ్ ని బీజేపి అభిమానులు, మోదీ భక్తులు, కరుడుగట్టిన హిందూ వాదులు ఆకాశానికి ఎత్తేసి వుండొచ్చు. కాని, ఆయన్ని విమర్శించదలుచుకున్న ఉదారవాదులు మరీ తొందర్లో ఏం చేస్తున్నారో కూడా అర్థం చేసుకోలేకపోయారు. ఒక మార్ఫ్ చేసిన ఫోటోషాప్ ఫోటోను చూపించి యోగి ఆదథ్యనాథ్ విదేశీ వనిత సేవలో తరిస్తున్నాడని షోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు! ఇది ఎంతటి మూర్ఖత్వం? అదే నిజమైతే ఇన్ని రోజులు ఆ వ్యవహారం దాగేదా? ఒక హిందూ సన్యాసిని ఆటాడుకునే అవకాశం మనం మీడియా వదులుకుంటుందా? ఫేక్ ఫోటో షేర్ చేసిన ప్రబుద్ధులు అక్కడితో ఆగకుండా ఇక ముందు ప్రజాస్వామ్యానికి చీకటి రోజులు అంటూ రొమ్ములు బాదుకున్నారు! అసలు ఇదేం విడ్డూరం? ప్రత్యక్ష రాజకీయాల్లో వుంటోన్న ఒక నేత జనం భారీ మెజార్టీ ఇచ్చినప్పుడు సీఎం అయితే తప్పేంటి? ఎమ్మెల్యేల మద్దతు వున్నాయన పీఠం ఎక్కితే ఆపటానికి మనం ఎవరం? యూపీ ప్రజలు పిచ్చివాళ్లనా ఈ సోకాల్డ్ టీవీ స్టూడియో ఇంటలెక్చువల్స్ అభిప్రాయం?    అకారణంగా యోగి ఆదిత్యనాథ్ పై మీడియా, మేధావులు, సెక్యులర్ పార్టీల అక్కసు చూస్తుంటే ఒకప్పటి అద్వానీయే గుర్తొస్తున్నారు! ఆయనని బాబ్రీ కూల్చివేతకు ప్రధాన కారకుడ్ని చేసి ఎదిగేలా చేసింది ఇలాంటి అభ్యుదయ బ్యాచీనే! వాజ్ పేయ్ తో పోల్చి అద్వానీ మతోన్మాది అన్నారు. తరువాత మోదీ వచ్చాక 2002 జపం చేస్తూ గుజరాత్ సీఎంని కాస్తా దేశ ప్రధానిని చేశారు! మోదీ ఎవరో తెలియని వారికి కూడా పనిగట్టుకుని పరిచయం చేశారు! మోదీ ఆగమనంతో అద్వానీ సెక్యులరే కాని నమో కర్కోటకుడని అన్నారు! ఇక ఇప్పుడు యోగి రాగానే మోదీ అభివృద్ది చేసే దార్శనికుడు కాని... యోగి కరుడుగట్టిన హిందూ వాది అంటున్నారు! ఇది యోగీకి రివర్స్ లో ఉపయోగపడి భవిష్యత్ లో ఆయన జాతీయ స్థాయి నేత అయినా ఆశ్చర్యం లేదు! అదే పనిగా అందరూ కలిసి ఆయనని అభిమన్యుడ్ని చేయాలనుకుంటే... జనం అతడిలో ఏదో గొప్పతనం వుందని బలంగా భావిస్తారు! లేకపోతే... ఇంత మంది ఎందుకు భయపడతారనేది జనం లాజిక్!   యోగి ఆదిత్యనాథ్ ని సన్యాసి అని, మతోన్మాది అని విమర్శలు చేస్తూ పసలేని తతంగం నడపకుండా కొన్నాళ్లు ఆగి తప్పులు చేస్తుంటే అప్పుడు టార్గెట్ చేయటం మంచిది! మత కలహాలు జరిగినా, అభివృద్ది జరగకపోయినా ఆయనని క్షమించాల్సిన అవసరం లేదు! అంతే కాని, అకారణంగా దుమ్మెత్తిపోసే కార్యక్రమం పెట్టుకుంటే మాత్రం అసలు ఎసరు రాక మానదు!

అమరావతికి భూములివ్వని రైతులపై కొత్త అస్త్రం

నవ్యాంధ్ర రాజధాని అమరావతి డిజైన్ల ప్రక్రియ కొలిక్కి వస్తున్నా.... భూముల వ్యవహారం మాత్రం తేలడం లేదు. 29 గ్రామాల పరిధిలో 33వేల 500 ఎకరాలను భూసమీకరణ కింద తీసుకున్న ప్రభుత్వం.... మరో 3వేల ఎకరాల భూములను స్వాధీనం చేసుకోవడంలో అష్టకష్టాలు పడుతోంది. ఉండవల్లి, పెనుమాక, యర్రబాలెం తదితర గ్రామాల్లో రైతులు భూములు ఇచ్చేందుకు ససేమిరా అనడం, కొన్ని గ్రామాల్లో అక్కడక్కడా ఎకరం, అరెకరం  బిట్లను ఇవ్వకుండా ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెడుతున్నారు.   భూసేకరణ నోటిఫికేషన్‌ ఇచ్చినా, రైతులు కోర్టుకెళ్లడంతో రాజధాని నిర్మాణ ప్రక్రియకు అంతరాయం కలుగుతోంది. దాంతో భూముల వ్యవహారాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. అందుకే భూములివ్వని రైతులపై కొత్త అస్త్రాన్ని ప్రయోగించేందుకు సర్కార్‌ సిద్ధమవుతోంది. భూసమీకరణ లేదా భూసేకరణ కింద భూములు ఇచ్చేందుకు ముందుకురాని రైతుల భూములను గ్రీన్‌బెల్ట్‌గా ప్రకటించనున్నారు.   గ్రీన్‌బెల్ట్‌గా ప్రకటిస్తే ఆయా భూముల్లో కేవలం వ్యవసాయ పనులు మాత్రమే చేయడానికి అనుమతి ఉంటుంది. భూములను ప్లాట్లుగా అమ్ముకునే వీలుండదు. దాంతో భూములు ఇవ్వని రైతులు భవిష్యత్‌లో తీవ్రంగా నష్టపోయే అవకాశముంటుంది. అయితే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటున్న రైతులు.... తమ పొలాలను గ్రీన్‌బెల్ట్‌గా ప్రకటిస్తే, న్యాయ పోరాటం చేస్తామంటున్నారు.   గ్రీన్‌బెల్ట్‌ అస్త్రాన్ని ప్రయోగించడం ద్వారా రైతులను దారిలోకి తెచ్చుకోవాలన్నది ప్రభుత్వ వ్యూహామైనా, ఈ నిర్ణయం భవిష్యత్‌లో సర్కార్‌కు కూడా కొత్త చిక్కులు తెచ్చిపెట్టే అవకాశముందని అధికారులు అంటున్నారు.

మోదీ ఆమోదంతో యూపీని ఏలనున్న ఐఐటీ ఇంజనీర్!

మనోజ్ సిన్హా... ఈయనెవరో తెలుసా? పెద్దగా తెలిసే అవకాశం లేదు! కాని, శనివారం తరువాత ఈయన ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రపంచం ముందుకు రానున్నారు! అతి పెద్ద రాష్ట్రంలో అత్యంత శక్తివంతమైన బలప్రదర్శనతో మెజార్టీ సాధించిన కమలదళం ఎట్టకేలకు తన ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ధారించుకుందని డిల్లీ టాక్. ఇంకా అధికారికంగా మనోజ్ సిన్హా పేరు అనౌన్స్ కాలేదు కాని... ఆయన ముఖ్యమంత్రి అని దాదాపు ఖరారు అయిపోయింది.   యూపీలో బీజేపిని మోదీ, అమిత్ షా ముందుండి గెలిపించారు. కాని, రాష్ట్ర స్థాయిలో కమల వికాసానికి తోడ్పడిన నేతలు చాలా మంది వున్నారు. యూపీ బీజేపి అధినేత కేశవ్ ప్రాద్ మౌర్యా మొదలు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ వరకూ అందరూ ఉత్తర్ ప్రదేశ్ నేతలే! నిజానికి ప్రస్తుతం నడుస్తోన్న సోషల్ మీడియా కామెడీ ఏంటంటే.. యూపీలో బీఎస్పీ గెలుచుకున్న ఎమ్మెల్యేల కంటే బీజేపీలో వున్న సీఎం క్యాండిడేట్లు ఎక్కువని! అంత మందిలో మోదీషా ద్వయానికి నచ్చిన సైలెంట్ కిల్లర్ మనోజ్ సిన్హా!   మనోజ్ సిన్హాని సైలెంట్ కిల్లరని ఎందుకు అనాలి? ఎందుకంటే, మొదట్నుంచీ ఆయన స్టైలే అది! మౌనంగా తన పని తాను చేసుకుపోతుంటాడు ఈ బనారస్ హిందూ యూనివర్సిటీ ఐఐటీ పట్టభద్రుడు! సివిల్ ఇంజనీరింగ్ లో ఐఐటీ సర్టిఫికెట్ పొందిన మనోజ్ సిన్హా ప్రస్తుతం కేంద్రంలో స్వతంత్ర హోదా కలిగిన మంత్రి. ఇటు కమ్యూనికేషన్స్ శాఖని, అటు రైల్వే శాఖని ఆయన ఏక కాలంలో నిర్వర్తిస్తున్నాడు! ఆ క్రమంలోనే మనోజ్ సిన్హా ఇటు కమ్యూనికేషన్స్ కు సంబంధించి కార్పోరేట్లను, అటు రై్ల్వేస్ కు సంబంధించి యూనియన్ లీడర్లను ఏక కాలంలో మ్యానేజ్ చేశాడు. అదే మోదీకి, అమిత్ షాకు ఆయన మీద ప్రత్యేక నమ్మకం కలగటానికి కారణం. ఇక ఐఐటీ పూర్తి చేసి ఇంజనీర్ అయినప్పటికీ పక్కా కాషాయ స్టైల్లో ధోతీ కట్టి జుబ్బా వేసుకుంటాడు భూమిహర్ బ్రాహ్మణుడైన సిన్హా!   టాలెంట్, లుక్స్, పర్ఫామెన్స్... ఏ విధంగా చూసినా మనోజ్ సిన్హాకు అన్ని అర్హతలు వుండటంతో మోదీ, షా అతడ్నే లక్నో పీఠంపై కూర్చోబెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. అయితే, సిన్హా పేరే ఫైనల్ అయితే మాత్రం ఇది నిజంగా సాహసోపేతమైన నిర్ణయమే. ఎందుకంటే, దశాబ్దాలుగా యూపీలో సీఎం ఎవరన్నది నిర్ణయిస్తోంది కులమే! ప్రతిభ, సత్తా వంటి వాటికి అక్కడ ఏ విలువా వుండదు. పార్టీ ఏదైనా కులాల లెక్కలు వేసుకుని ఏదో ఒక బలమైన సామాజిక వర్గానికే సీఎం కుర్చీ కట్టబెట్టేస్తుంటారు. అలా చూస్తే మనోజ్ సిన్హా ఉత్తర్ ప్రదేశ్ లో ఏ ప్రభావమూ చూపని భూమిహర్ వర్గానికి చెందిన వాడు! అయినా మహారాష్ట్రలో ఫడ్నవీస్, జార్ఖండ్ లో రఘుబర్ దాస్, హరియాణాలో కట్టర్... ఇలా అనూహ్య ముఖ్యమంత్రుల్ని పదవుల్లో కూర్చోబెట్టిన మోదీ యూపీలో కూడా అదే చేయబోతున్నారు! సిన్హా ఎవరు అని కాకుండా ... ఏంటి అని పరిక్షించి బాధ్యతలు అప్పజెబుతున్నారు!   ఉత్తర్ ప్రదేశ్ కవల రాష్ట్రమైన ఉత్తరాఖండ్ లో కూడా మోదీషా టాలెంట్ కే సీఎం సీటుని అప్పజెప్పాలని డిసైడ్ అయ్యారట. త్రివేంద్ర సింగ్ రావత్ ముఖ్యమంత్రి అవుతారని బలంగా వినిపిస్తోంది. ఆయన గతంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మంత్రిగా పని చేసి సత్తా చాటాడు. అలాగే, పార్టీ కోసం ఢిల్లీలోనూ అనేక బాధ్యతలు చేపట్టి మోదీకి దగ్గరయ్యాడు. అలా సంపాదించిన నమ్మకమే ఇప్పుడు రావత్ ని ఉత్తరాఖండ్ సెక్రటేరియల్ దిశగా రారామ్మంటోందని అభిప్రాయం!

ఇంకుతో ఏదంటే అది రాస్తే... ఇంకు దాడులు తప్పవా?

దేశంలో పార్లమెంట్ ఎన్నికల తరువాత అంత పెద్ద కలకలం రేగేది యూపీ ఎన్నికలప్పుడే! ఎట్టకేలకు అది పూర్తైంది. కాని, వెంటనే నెక్స్ట్ ఎలక్షన్స్ కి సిద్ధమవుతోన్న రాష్ట్రాల్లో వ్యవహారం మొదలైనట్టు కనిపిస్తోంది! మరీ ముఖ్యంగా, కర్ణాటకలో! కాంగ్రెస్ చేతిలో వున్న నిజమైన పెద్ద రాష్ట్రం ఇదొక్కటే!    దక్షిణాదిలో ఎలాగైనా పాగా వేయాలనుకుంటున్న బీజేపికి ఆ అవకాశాలు పుష్కలంగా వున్న చోటు కర్ణాటక. గతంలో ఒకసారి అధికారం చేజిక్కించుకునీ, నిలుపుకోలేకపోయిన కాషాయ దళం రాబోయే ఎన్నికల కోసం బాగానే కసరత్తు చేస్తోంది. ఒకప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా కూడా చేసిన ఎస్ఎం కృష్ణ త్వరలోనే బీజేపిలో చేరబోతున్నారు. ముందు ముందు ఈ వలసలు మరింతగా వుండే ఛాన్స్ వుంది!   పవర్ కోసం జరిగే పొలిటికల్ గేమ్స్ పక్కన పెడితే కర్ణాటకలో ఆరెస్సెస్, వీహెచ్ పీ, బజరంగ దళ్ లాంటి సంస్థల కార్యక్రమాలు కూడా చురుగ్గా సాగుతుంటాయి. అందుకే, క్షేత్రస్థాయిలో గొడవలు, దాడులు కూడా ఎక్కువగానే వుంటాయి. కాషాయ కార్యకర్తలు అభ్యుదయవాదులుగా చెలామణి అయ్యేవారిపై దాడులు చేయటం, అందుకు విపరీతంగా నిరసనలు రావటం కర్ణాటకలో మామూలే. అయితే, మీడియాలో అంతగా చోటు దక్కించుకోని విషయం ఏంటంటే, కర్ణాటకలో ఈ మధ్య ఆరెస్సెస్, బీజేపి వర్కర్లు కూడా హత్యలకు గురవుతున్నారు. రాజధాని బెంగుళూరులోనే మర్డర్లు జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకున్నట్లు కనిపించటం లేదు! కాని, తన ఓటు బ్యాంక్ రాజకీయాల్లో భాగంగా హిందూత్వ సంస్థల్ని బోనులో నిలబెట్టే అవకాశాల్ని మాత్రం వదులుకోవటం లేదు. తాజాగా దావాణగెరె ప్రాంతంలో యోగేశ్ మాస్టర్ అనే రచయితపై కొందరు హిందూత్వ సంస్థల కార్యకర్తలు నల్లటి నూనేతో దాడి చేశారు. ఒక పుస్తకావిష్కరణకు అక్కడకు వచ్చిన యోగేష్ పై కొందరు అగాంతకులు వచ్చి నూనేతో దాడి చేసి జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ వెళ్లిపోయారట!   యోగేష్ అనే రచయిత గతంలో దుండీ అనే పుస్తకం రాసి వివాదంలో ఇరుక్కున్నారు. అందులో గణపతిని తప్పుగా చిత్రకరిస్తూ ఆయన ఏదేదో రాశారట. సహజంగానే ఆయన ఫ్రీడమ్ ఆప్ స్పీచ్ ను సమర్థించే వారి మద్దతు పొందాడు. కాషాయ సైనికుల ఆగ్రహానికి గురయ్యాడు. దాని ఫలితమే నల్లటి నూనేతో దాడి! యోగేష్ పై దాడి చేసిన వార్ని కఠినంగా శిక్షించాలని పోలీసుల్ని ఆదేశించిన కర్ణాటక కాంగ్రెస్ సీఎం సిద్ధరామయ్య ఇంత అలెర్ట్ గా ఆరెస్సెస్ , ఇతర హిందూ సంస్థల కార్యకర్తలు హత్యలకి గురైతే వుండటం లేదు. కేరళలో కూడా హిందూత్వం వినిపించే వారి ప్రాణాలకు దారుణమైన గండం దాపురిస్తోంది. దక్షిణాదిలో బీజేపి విస్తరణని అడ్డుకునే ఉద్దేశ్యంలో భాగంగా కాంగ్రెస్ , సీపీఎం లాంటి పార్టీలు ఈ దాడుల్ని చూసీ చూడనట్టు వదిలేస్తున్నాయి!   ఒక రచయిత పై నూనె దాడిని ఎవ్వరమైనా ఖండించాల్సిందే. కాని, అదే సమయంలో సెక్యులర్ పార్టీలు, మీడియా కాషాయ కార్యకర్తల హత్యల్ని కూడా తీవ్రంగా పరిగణించాలి. అలా చేయకుంటే ఇప్పటికిప్పుడు లాభం అవ్వొచ్చు కాని... రాబోయే ఎన్నికల్లో బీజేపి యూపీ తరహా స్వైర విహారం చేసే అవకాశం వుంది! జనాల్లో ఒక్కసారి సానుభూతి వచ్చాక ఏ సెక్యులర్ నీతులు కూడా పోలింగ్ సెంటర్ల వద్ద పని చేయవు!

దుమ్మురేపుతున్న ఆంధ్రా పొలిటికల్ సర్వే

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఓ సర్వే.... అధికార, ప్రతిపక్షాల గుండెల్లో గుబులు రేపుతోంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న ఈ సర్వేను ఓ ప్రైవేట్‌ సంస్థ నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం ఇటు టీడీపీ.... అటు వైసీపీ.... రెండింటికీ పవన్ కల్యాణ్‌ జనసేన పార్టీ చెక్‌ పెట్టడం ఖాయమంటోంది.     ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే టీడీపీకి 71 సీట్లు, జనసేన 65 స్థానాలు వస్తాయని సర్వే సంస్థ అంచనా వేసింది. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేవలం 39 సీట్లకే పరిమితమవుతుందని లెక్కగట్టింది. అదీ కూడా వైసీపీకి బాగా పట్టున్న రాయలసీమ నాలుగు జిల్లాల్లోనే 20కి పైగా సీట్లు గెలుచుకుంటుందని, మిగతా 9 జిల్లాల్లో వచ్చే సీట్లన్నీ కలిపి పదిహేనుకి మించవంటోంది.     ఉత్తరాంధ్రలో వైసీపీ అసలు బోణీ కూడా చేయదని సర్వే సంస్థ  తేల్చింది. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన దెబ్బకు అటు తెలుగుదేశం పార్టీ, ఇటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘోరంగా దెబ్బతింటాయని లెక్కగట్టింది. తూర్పుగోదావరిలో వైసీపీ ఒకే ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంటుందన్న సర్వే సంస్థ.... పశ్చిమలో ఈసారి కూడా ఖాతా తెరబోదని చెప్పింది.      ఇక కృష్ణాజిల్లాలోనూ జనసేన దెబ్బకు వైసీపీ ఖాతా తెరవబోదని తాజా సర్వేలో తేలింది. అయితే రాయలసీమ తర్వాత ఎంతో కొంత పట్టున్న ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తలో నాలుగు సీట్లు చొప్పున గెలుస్తుందని అంచనా వేసింది. ఇక గుంటూరు జిల్లాలో కేవలం రెండంటే రెండే సీట్లు గెలుచుకుంటుందని చెబుతోంది.     అంటే ఇప్పటిదాకా రెండు కులాలకి మాత్రమే పరిమితమయిన రాజకీయాలు ఇకమీదట మరో కులం కూడా చేరి మరింత ఆసక్తికర ఆటగా మారబోతున్నాయి అన్నమాట..కాపు సామాజిక వర్గం కి ఎప్పటి నుంచో సరైన ప్రాతినిద్యం లేదని , పవన్ రాకతో ఆ కొరత తీరుతుందని రాజకీయ విశ్లేషకుల ..ఉవాచ. అంటే ఉత్తరప్రదేశ్‌లా అవశేష ఆంద్రప్రదేశ్ కూడా కులాల ప్రదేశ్ గా మారబోతోందన్న మాట . ఇంకో ఇంట్రస్టింగ్ గెస్ (guess) ఏంటంటే BC, ST, SC లకి కూడా ఒక కొత్త పార్టీ రాబోతోందిట . వచ్చినా రావచ్చు ..కులానికో పార్టీ అవసరం ఎంతయినా వుంది అంటున్నారు ...రాజకీయ నాయకులు.