ఈ కారణాల వల్లే... ఈ బడ్జెట్ 'చరిత్ర'లో నిలిచిపోనుంది!
posted on Feb 1, 2017 @ 1:23PM
బడ్జెట్ 2017 పార్లమెంట్లో ప్రవేశపెట్టారు జైట్లీ. ఎప్పటిలాగే ఆహా అనే వారూ, ఊహూ అనే వారూ ఇద్దరూ వున్నారు చర్చలో. ఇక సామాన్య జనం ఇంకా క్లారిటీకి రాలేదు తమకు లాభమా, నష్టమా అన్న విషయంలో! కాని, ఈ సారి మోదీ సర్కార్ బడ్జెట్ కొన్ని విషయాల్లో ఖచ్చితంగా స్పెషలే. పేదలు, పెద్దలు లాంటి పదాలు పక్కన పెడితే ఈ బడ్జెట్ నోట్ల రద్దు తరువాత ప్రవేశపెట్టిన తొలి పద్దు. అందుకే, ప్రధాని, ఆర్దిక మంత్రి తమ పై ఎలాంటి వరాల జల్లు కురిస్తారా అని అంతా ఎదురు చూశారు. మరి నిజంగా సామాన్యుల పంట పండిందా అంటే , నో క్లారిటీ!
డీమానిటైజేషన్ తరువాత వచ్చిన బడ్జెట్ మాత్రమే కాదు ఈ సారి బడ్జెట్ రైల్వే బడ్జెట్ ను కూడా కలిపి తీసుకువచ్చింది. ఎప్పుడూ రైల్వేల కోసం వేరుగా బడ్జెట్ వుండేది. ఈ సంప్రదాయం 92 సంవత్సరాలుగా నడుస్తోంది. బ్రిటీష్ వారి కాలంలోనే భారత్ బడ్జెట్ తో కాకుండా రైల్వేల కు వేరుగా బడ్జెట్ ప్రవేశపెట్టేవారు. అందుక్కారణం అప్పట్లో 70 నుంచీ 80శాతం నిధులు రైల్వేలకు కేటాయించటమే. అంత పెద్ద ఎత్తున రైల్వే నిధులు వుండటంతో దాన్ని వేరుగా పరిగణిస్తే మంచిదని అభిప్రాయం వ్యక్తమైంది. అందుకే, 1924 నుంచీ రైల్వే బడ్జెట్ సాధారణ బడ్జెట్ కి ఒక రోజు ముందు ప్రవేశపెడుతూ వచ్చారు.
1924కి ఇప్పటికీ పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. ఇండియన్ బడ్జెట్ లో రైల్వే బడ్జెట్ ఇప్పుడు కేవలం 4శాతం మాత్రమే. అంతే కాదు, రైల్వేస్ వేరుగా వుండిపోవటంతో నష్టాల్ని కూడా స్వంతంగా భరించాల్సి వస్తోంది. అందుకే, బ్రిటీష్ కాలం నాటి పాత సంప్రదాయాన్ని మోదీ గవర్నమెంట్ పక్కన పెట్టింది. సాధారణ బడ్జెట్ ప్లాట్ ఫామ్ పైకే రైల్వే బడ్జెట్ ను కూడా తీసుకువచ్చింది. దీంతో ప్లానింగ్ కమీషన్ తీసేసి నీతి ఆయోగ్ తెచ్చిన మోదీ మరో చారిత్రక మార్పు చేసినట్టైంది.
2017-18 బడ్జెట్ లోని మరో స్పెషాలిటి ఈ సారి ప్రవేశపెట్టిన డేట్. ఎప్పుడూ ఫిబ్రవరీ 28న పార్లమెంట్ ముందుకొచ్చే బడ్జెట్ ఈ సారి ఫిబ్రవరీ ఒకటో తారీఖునే వచ్చేసింది! మధ్యతరగతి భారతీయ కుటుంబాల మాదిరిగానే పార్లమెంట్ కూడా ఒకటో తారీఖున లెక్కా, పద్దుల్లో మునిగిపోయింది. కేరళ ఎంపీ ఒకరు హఠాన్మరణం పాలయ్యే సరికి ఒక దశలో బడ్జెట్ ఫిబ్రవరీ ఒకటిన వుండదని ప్రచారం జరిగినా చివరకు అనుకున్నట్లుగానే వ్యవహారం నడిచింది.
బడ్జెట్ లో కొన్ని అంశాలు కొందరికి నచ్చవచ్చు. మరి కొన్ని కొందరికి నచ్చకపోవచ్చు. సహజంగానే బీజేపి అభిమానులకి ఏ ఇబ్బంది లేకపోవచ్చు. కాంగ్రెస్ , ఇతర పార్టీల ఓటర్లకి ఆరుణ్ జైట్లీదంతా జిమ్మిక్కులా కనిపించవచ్చు. ఇదంతా ఎప్పుడూ వుండేదే. కాని, ఈ సారి బడ్జెట్ మాత్రం దశాబ్దాల సంప్రదాయాలకి స్వస్తి పలికి రెండు, మూడు విధాలుగా చరిత్రలో నిలిచిపోయింది!