శశికళ కాదు... శశి'కల'నేనా?
posted on Feb 7, 2017 @ 12:59PM
శశికళ... శశికళగా కాకుండా శశి'కల'గా మిగిలిపోనుందా? గత కొన్ని రోజులుగా తమిళ రాజకీయాలు చూస్తుంటే అదే అనిపిస్తోంది! జయ మరణం తరువాత రెండు నెలలు కూడా కాక ముందే శశికళ సీఎం పీఠంపై కళకళలాడిపోవాలని కోరుకుంది. అదే కలకలానికి కారణమైంది. అసలు ఆమె తొందరపడిందంటున్నారు విమర్శకులైతే. కాదు కాదు, ఇందులో చిన్నమ్మ లెక్కలు చిన్నమ్మకూ వుండే వుంటాయంటున్నారు మరి కొందరు! ఎవరి వాదన ఎలా వున్నా చెన్నై నుంచి ఢిల్లీ దాకా శశికళ కలకలం అందర్నీ ఆకర్షిస్తోంది!
భారతదేశ చరిత్రలోనే ఏనాడూ ఒక ముఖ్యమంత్రి చేత ప్రమాణ స్వీకారం చేయించటానికి గవర్నర్ లేకుండా పోవటం జరగలేదు. కాని, తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు హుటాహుటిన ఢిల్లీ వెళ్లి అక్కడే వుండిపోయారు. మీడియాలో చిన్నమ్మ పట్టాభిషేకం అంటూ బ్రేకింగ్ లు వచ్చినా, ఏర్పాట్లు చకచకా జరిగిపోయినా ఆయన హస్తిన వదిలి రాలేదు. అందుక్కారణం శశికళపై వేలాడుతోన్న సుప్రీమ్ కోర్టు తీర్పు తాలూకూ కత్తే! ఒక కేసులో ఏ2గా వున్న వ్యక్తిని ఎవరైనా సీఎంగా ఎలా ఒప్పుకుంటారు? కాని, మన రాజ్యాంగం ప్రకారం గవర్నర్ నిమిత్తమాత్రుడు మాత్రమే. అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు శశికళను తమ నేతగా ఎంచుకున్నాక విద్యాసాగర్ రావుకు పెద్దగా ఆప్షన్స్ ఏమీ లేవు. ఆయన చిన్నమ్మను గద్దె మీద కూర్చుండబెట్టాల్సిందే!
మొదట్నుంచీ శశికళపై అనుమానంగానే వున్న ప్రధాని మోదీ ఆమెను సీఎం అవ్వనిచ్చే ఉద్దేశంలో వున్నట్టు లేదు. ప్రజాస్వామ్యంలో ఆమెను నివారించటం తప్పే అయినా నైతికంగా మోదీ చేస్తున్నది కరెక్టే అనే వారు కూడా వున్నారు. నిజంగా తమిళనాడు జనంలో శశికళ సీఎం అవ్వాలన్న కోరిక ఎంత మాత్రం లేదు. ఆమె ఎన్నికల సమయంలోనే తన వారికి ఎమ్మెల్యే సీట్లు ఇప్పించుకుంది కాబట్టి వారు ఇప్పుడు ఆమెను సమర్థిస్తున్నారు. అంతే తప్ప తమిళ ప్రజలు జయలలిత సమానంగా చిన్నమ్మను అభిమానిస్తున్నారని భావించటం మూర్ఖత్వమే అవుతుంది. కాబట్టే, మోదీ రాజ్యాంగం ప్రకారం తప్పే అయినా విద్యాసాగర్ రావును చెన్నైవెళ్లకుండా ఆపేశారనుకోవాలి. కేవలం వారం రోజుల్లో దోషిగా తేలే అవకాశం వున్న శశికళ ఇంతలోనే సెక్రటేరియట్ లో కాలుమోపి సాధించేదేముంది? తీర్పు వచ్చాక ప్రమాణ స్వీకారం చేయవచ్చు కదా? ఇదే ప్రశ్న వేస్తున్నారు చాలా మంది! అందుకే, ముఖ్యమంత్రిగా శశికళ ప్రమాణ స్వీకారం చేస్తానన్నా గవర్నర్ రాకపోతే పెద్దగా నిరసనలు వెలువడలేదు. జనం రోడ్ల మీదకి రాలేదు. ఇలాగే జయ ప్రమాణానికి కేంద్రం అడ్డంకులు కల్పించి వుంటే జనాగ్రహం ఎలా వుండేది? ఈ ఒక్క అంశంలోనే శశికళ జనాకర్షణ తేలిపోతోంది!
తీర్పు వచ్చేలోగానే సీఎం పీఠం ఎక్కాలని శశికళ తొందరపడటంలో ఒకే ఒక్క లాజిక్ వుంది! సీఎంగా జైలుకి వెళ్లాల్సి వస్తే జనం, అన్నాడీఎంకే శ్రేణులు రోడ్లపైకి వచ్చే అవకాశం ఎక్కువ. అంతే కాదు సానుభూతి కూడా బాగానే వస్తుంది. మీడియా కూడా వీలైనంత ఎక్కువగా కవర్ చేస్తుంది. కాని, ఎలాంటి కుర్చీలో లేకుండా జైలుకెళితే తిరిగొచ్చేలోపు పుణ్యకాలం దాటిపోతుంది. పార్టీ తన చేతుల్లోంచి పూర్తిగా జారిపోతుంది. ఈ ఆలోచన చిన్నమ్మ మనసులో వుండి వుండాలి! అందుకే చకచకా పావులు కదిపింది. కాని,కేంద్రంలో పూర్తి మెజార్టీతో వుండీ, తమిళనాడులో పెద్దగా ఆశలేమీ లేని బీజేపి ఆమె ఆడమన్నట్టు ఆడే అవకాశాలు అస్సలు లేవు! అటు పోయి ఇటు పోయి స్టాలిన్ కోరినట్లు గవర్నర్ పాలన విధించాల్సి వస్తే అది కేంద్రానికి మరింత సౌకర్యం! రజినీకాంత్ లాంటి తిరుగులేని శక్తితో రాబోయే ఎన్నికల్లోకి దిగితే కమలానికి అధికారంలో వాటా గ్యారెంటీ!