శేఖర్ వల్ల... షేకైపోతోన్న బాలయ్య కంచుకోట!
posted on Feb 6, 2017 @ 11:02AM
శేఖర్ ... ఇప్పుడు ఈ పేరు ఆంధ్రప్రదేశ్ అంతటా వినిపిస్తోంది! మరీ ముఖ్యంగా, అనంతపురం జిల్లాలో, మీడియాలో తెగ సందడి చేస్తోంది! అలాగని, ఈ శేఖర్ ఎవరో సెలబ్రిటీ కాదు. ఒక టాప్ సెలబ్రిటీకి పీఏ! అంతే! కాని, అధికార టీడీపీకి ఎంతో కీలకమైన హిందూపురం నియోజకవర్గాన్ని సదరు శేఖర్ సారు అతలాకుతలం చేసేస్తున్నారు. అంతే కాదు, పార్టీలో చంద్రబాబు తరువాత అంతటి స్థాయి వున్న బాలకృష్ణను కూడా రొంపిలోకి లాగుతున్నాడు!
హిందూపురం ఎమ్మెల్యే హీరో బాలయ్య. ఈ విషయం అందరికీ తెలిసిందే. కాని, నిన్న మొన్నటి వరకూ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అక్కడ తనని తాను ఎమ్మెల్యేగా ఫీలైపోతున్నాడు బాలకృష్ణ పీఏ శేఖర్. ఆయన పెడుతోన్న టార్చర్ భరించలేక ఇప్పుడు నానా రభస జరుగుతోంది నియోజకవర్గంలో. ఎవరో ఒకరిద్దరు నేతలని కాకుండా చాలా మంది నాయకులే రోడ్లపైకి వచ్చేశారు. శేఖర్ ని అమాంతం వెనక్కి పిలిపించాలని డిమాండ్ చేస్తూ నిరసనలకు దిగుతున్నారు. అధికారుల్ని కూడా తన చెప్పుచేతల్లో పెట్టుకున్న ఎమ్మెల్యే పీఏ ఎవ్వర్నీ పట్టించుకోవటం లేదంటున్నారు. తన ఇష్టారాజ్యంగా ఆర్డర్లు వేస్తూ అవినీతికి పాల్పడుతున్నాడని సీరియెస్ ఆరోపణలే చేస్తున్నారు.
సినిమా షూటింగ్స్ లో బిజీగా వుండే బాలయ్య ప్రతీ రోజూ హిందూపురంలో వుండలేరు. అందుకే, శేఖర్ కి అన్ని అధికారాలూ ఇచ్చారు. వాటిని ఆయన దుర్వినియోగం చేస్తున్నారని ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. అదీ ఒకరిద్దరు కాదు. చాలా మందే చేస్తున్నారు. కాబట్టి ఎంత త్వరగా దీనిపై బాలకృష్ణ, చంద్రబాబు దృష్టి పెడితే అంత మంచిది. కాని, పరిస్థితి చూస్తుంటే అలా కనిపించటం లేదు. టాప్ లెవల్లో శేఖర్ గొడవని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించటం లేదు. కనీసం పార్టీ హైకమాండ్ తరుఫున శేఖర్ వ్యతిరేక వర్గాన్ని ఎవరూ పిలిచి మాట్లాడినట్టు కూడా సంకేతాలు లేవు.
దీని వల్ల గొడవ మరింత పెద్దదవుతోంది. మీడియాలో పార్టీ పరువుపోతోంది. అంతే కాదు, బాలకృష్ణ లాంటి కీలక నేత ప్రతిష్ఠ కూడా ఇందులో ముడిపడి వుంది. అందుకోసమైనా టీడీపీ అధిష్ఠానం త్వరగా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. నిజంగా, శేఖర్ అరాచకానికి పాల్పడ్డాడా లేదా అన్నది నిగ్గుతేల్చాలి. ఎందుకంటే, ఊరికే నియోజక వర్గంలోని నేతలు ఎమ్మేల్యే పీఏపై ఆరోపణలు చేస్తారని భావించలేం. అదీ ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణను కూడా గొడవలోకి లాగేటటువంటి ఆరోపణలు ఎవరూ కాలక్షేపం కోసం చేయరు కదా?
హిందూపురంలో శేఖర్ కలకలంపై ఇప్పటి వరకూ ఇటు బాలకృష్ణ కాని, అటు చంద్రబాబు కాని మాట్లాడలేదు. అలాగే, పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ కూడా దీనిపై దృష్టి పెట్టారని ఎలాంటి వార్తలు లేవు. మరి దీనికి అంతం ఎలా? శేఖర్ సంక్షోభం ఎంతగా ముదిరితే అంతగా పార్టీకి, బాలకృష్ణకు నష్టం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. హిందూపురం లాంటి టీడీపీ కంచుకోటలో ఇలాంటి పరిస్థితులు ఎక్కువ కాలం కొనసాగటం మంచిది కాదంటున్నారు. చూడాలి మరి, పార్టీ అధిష్టానం దీనిపై ఎలాంటి ప్లాన్ తో వుందో! ఇంత జరుగుతున్నా హైకమాండ్ కి ఏమీ తెలియదనుకోవటం పొరపాటే అవుతుంది!