రాజ్ భవన్లో తిష్టవేసిన మరో తివారీ!
posted on Jan 28, 2017 @ 9:39AM
భారతదేశంలో రాష్ట్రపతి తరువాత ఆ స్థాయిలో గౌరవం, విలువ వుండేది గవర్నర్ కే. అయితే, రాష్ట్రపతిని దేశంలోని ప్రతీ ఒక్క ప్రజా ప్రతినిధీ తన ఓటు హక్కుతో మన తరుఫున ఎన్నుకొంటాడు. అంటే, పరోక్షంగా రాష్ట్రపతిని కూడా మనమే ఎన్నుకుంటున్నామని అర్థం. కాని, గవర్నర్ వ్యవస్థ అలా కాదు. ఢిల్లీలో అధికారంలో వున్న ప్రభుత్వం సిఫారసు మేరకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వార్ని రాష్ట్రాలకు పంపుతారు. ఇక్కడే అసలు సమస్యంతా వచ్చింది. ఇంచుమించూ పైరవీ చేయించుకుని సాధించుకున్న ప్రభుత్వ ఉద్యోగం లో మారిపోతోంది గౌరవప్రదమైన గవర్నర్ పోస్టు కూడా. రాను రాను బయటపడుతోన్న సెక్స్ స్కాండల్స్ మరింత దిగజారుస్తున్నాయి గవర్నర్ ల స్థానాన్ని...
ఆ మధ్య సమైక్యాంధ్ర రాష్ట్రానికి గవర్నర్ గా పని చేసిన ఎన్డీ తివారీ ఉదంతం గుర్తుంది కదా.. ఇప్పుడు మరో గవర్నర్ రాజ్ భవన్లో తివారీ చేష్టలే చేశాడు. ఒకరిద్దరు కాదు ఏకంగా వంద మంది దాకా గవర్నర్ ఆఫీస్ సిబ్బంది మోదీకి, ప్రణబ్ ముఖర్జీకీ అయ్యగారి రాసలీల గురించి లెటర్ రాయటంతో రచ్చ రచ్చ అయిపోయింది. ఇమీడియెట్ గా రాజీనామా చేశారు మేఘాలయా గవర్నర్ షణ్ముగనాథన్!
మేఘాలయా లాంటి చిరు రాష్ట్రం, అదీ ఈశాన్య భారతదేశంలోది కావటం వల్ల మనకు పెద్దగా తెలియరాలేదు షణ్ముగనాథన్ సిగ్గుమాలిన వ్యవహారం. కాని, ఢిల్లీలో మోదీ సర్కార్ కి ఇది కొంత తలవంపుగానే పరిణమించింది. అవినీతి కన్నా దారుణంగా సెక్స్ స్కాండల్ లో తాము అపాయింట్ చేసిన గవర్నర్ ఇరుక్కోవటం నిజంగా ఇబ్బందే. అయితే, రాజ్ భవన్ని అందమైన అమ్మాయిల కొలువుగా మార్చేసిన షణ్ముగనాథన్ మాత్రం అంతా కుట్రే అంటున్నారు. ఆయన మాట కూడా నిజం కావచ్చు. ఎందుకంటే, మేఘాలయాలో వున్నది కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ బీజేపి, ఆరెస్సెస్ లకి పెద్దగా పట్టు వున్నట్టు కనిపించదు. మరి షణ్ముగనాథన్ ఆరెస్సెస్ తో సంబంధాలున్న వ్యక్తి కాబట్టి ఆయన మీద కుట్ర జరిగి వుండవచ్చు. అయితే, గవర్నర్ స్థాయి వ్యక్తిపై దాదాపు వంద మంది ఉద్యోగులు ఊరికే ఆరోపణ చేస్తారని భావించటం కొంత మూర్ఖత్వమే అవుతుంది. నిప్పు లేకుండా పొగ రావటం అంత తేలిక కాదు.
మేఘాలయా మాజీ గవర్నర్ రాసలీల వ్యవహారంలో నిజం బయటకి రావాలంటే విచారణ ఒక్కటే మార్గం, విచారణ జరిపించి తప్పు ఎవరిదో నిగ్గు తేల్చాలి. కాని, అలా జరిగే సూచనలు తక్కువే. గతంలో తివారీ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం పదవి నుంచి తప్పించి ఊరుకుంది. అంతే తప్ప ఆయనకి శిక్షేం పడలేదు. గవర్నర్లుగా వున్న వారికి శిక్ష పడుతుందని ఆశించటం కూడా దురాశే.
అసలు కొందరి అభిప్రాయం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లుగా పని చేసే గవర్నర్లు వుండటమే అవసరం లేదు. వారి వల్ల రాష్ట్రానికి కలిగే ప్రత్యేక లాభాలంటూ ఏం లేవు. పైగా బోలెడు ప్రజాధనం వృథాయే కాక అప్పుడప్పుడూ ఇలాంటి అవమానకర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సెక్స్ స్కాండల్స్ కాకపోతే ఢిల్లీ ప్రభుత్వాల అదుపాజ్ఞలు పాటిస్తూ ప్రజలెన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాల్ని ఇబ్బంది పెట్టిన గవర్నర్లు కూడా చాలా మందే వున్నారు డెబ్బై ఏళ్లలో! ఈ నేపథ్యంలో ఆరో వేలు లాంటి గవర్నర్ వ్యవస్థ అవసరం లేదనే వారి మాటలోనూ ఆలోచించాల్సిన అంశం లేకపోలేదు. నీతి ఆయోగ్ ఏర్పాటు మొదలు నోట్ల రద్దు దాకా అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటోన్న మోదీయే గవర్నర్ల వ్యవస్థపై కూడా కన్నేస్తే ముందు ముందు ఇలాంటి రాజ్ భవన్ రాసలీలలు దేశాన్ని అప్రతిష్ఠపాలుజేయకుండా వుంటాయి...