దారి తప్పొచ్చిన చైనీస్, ఇండియన్ మనవడ్నెత్తుకుని ఇంటికెళ్లాడు!
posted on Feb 11, 2017 @ 1:27PM
ఆయన మన దేశం వాడు కాదు! కాని, ఆయన భార్య మధ్యప్రదేశ్ లోని ఒక మారుమూల పల్లెకు చెందినావిడ! ఆయన ముగ్గురు పిల్లలు కూడా భారతీయులే. మనవలు, మనవరాళ్లు కూడా వున్నారాయనకి! ఇంతకీ మన దేశంలోనే గత 54ఏళ్లుగా వుండిపోయిన ఆ విదేశీ ఎవరు? వాంగ్ కీ, ఓ చైనీస్ సైనికుడు!
అయిదున్నర దశాబ్దాల తరువాత భారతదేశంలోని మధ్యప్రదేశ్ నుంచి తన స్వదేశానికి వెళ్లాడు వాంగ్. 1963లో ఇటు వచ్చేప్పుడు ఆయనకి 23ఏళ్లు. ఒంటరి. కాని, అటు వెళ్లేప్పుడు మాత్రం కొడుకు, కూతురు, కోడలు, మనవడితో వెళుతున్నాడు! అయితే, ఆయనేదో ఇష్టపడి భారతదేశానికి వచ్చి ఇక్కడే పెళ్లి చేసుకుని సెటిలైపోయాడనుకోకండి! మన దేశం అనివార్య పరిస్థితుల్లో బలవంతంగా వాంగ్ ను ఇక్కడ వుంచేసింది. ఎందుకంటే, ఆయన 1960ల నాటి విషమ పరిస్థితుల్లో చైనా సైనికుడు. మ్యాపులు గీసే సర్వేయర్. తన పనిలో భాగంగా ఇండియా సరిహద్దులో తిరగాడాడు. తెలిసో, తెలియకో హద్దు దాటి మన వైపు వచ్చేశాడు. ఆయుధాలు పట్టుకుని వచ్చిన నైనికుడు కానప్పటికీ ఆయన శత్రుదేశం వాడు కావటంతో అప్పటి మన భద్రతా దళాలు బంధించాయి. తరువాత ఏడేళ్లు వాంగ్ ని వివిధ జైళ్లలో వుంచారు అధికారులు. చివరకు, 1969లో ఆయనని వదిలేశారు. కాని, తిరిగి మాతృదేశానికి పంపలేదు. భద్రతా కారణాల దృష్ట్యా ఆయనని మధ్యప్రదేశ్ లోని మారుమూల తిరోడి గ్రామంలో విడిచిపెట్టి అక్కడ కొత్త జీవితం ప్రారంభించుకోమని చెప్పారు!
ఇండియా నుంచి చైనా తిరిగి వెళ్లటం సాధ్యం కాదని తేలిపోయిన వాంగ్ ముప్పై ఏళ్ల వయస్సులో స్థానిక భారతీయురాలినే పెళ్లి చేసుకున్నాడు. ముగ్గురు పిల్లలు పుట్టారు. మనవలు, మనవరాళ్లు కూడా కలిగారు! పూర్తిగా భారతీయ బంధాల్లో ఇమిడిపోయాడు చైనీస్ వాంగ్! కాని, ఎవరికైనా స్వంత దేశంపై మమకారం లోలోన వుంటుంది కదా? అదీ అక్కడ ఇరవై ఏళ్లు పెరిగి, పెద్దవాడైన వాడు కదా? అందుకే, వాంగ్ ఈ మధ్య చైనీస్ అధికారుల చేసిన విజ్ఞప్తులకి మన అధికారులు ఒప్పుకుంటే... వెంటనే చైనాకు వెళతానని అంగీకరించాడు! అక్కడికి వెళ్లి తన ఫేవరెట్ నూడుల్స్ తింటూ చైనాలో ఫేమస్ అయిన యెల్లో నదిని వీక్షించాలని ఆయన కోరిక! అది ఎట్టకేలకు ఇప్పుడు నిజం అయింది!
పిల్లలు, మనవడితో కలిసి చైనా వెళ్లిన వాంగ్ అక్కడే వుంటాడని భావించలేం. చైనా ఆ ఏర్పాట్లు కూడా చేసింది. కాని, వాంగ్ తిరిగి ఇండియా వచ్చే అవకాశాలే ఎక్కువ. అయితే, ఆయన లాగే తిరోడి గ్రామంలోనే మరో దారి తప్పి భారతదేశంలోకి వచ్చిన చైనీస్ సైనికుడు వున్నాడు! ఆయన పేరు ల్యూ షురాంగ్! అతను కూడా ఇక్కడి జీవితంతో మమేకం అయిపోయాడు. కాని, తిరిగి చైనా వెళ్లనని చెప్పేశాడు. అక్కడ తనకు కుటుంబం అంటూ ఏమీ లేదనీ, ఇక్కడే వుంటానని ఆయన అన్నాడు!