భూములు అప్పుడు లాక్కున్నారు... పాపం ఇప్పుడు పండింది!
posted on Feb 9, 2017 @ 2:31PM
లక్షల సంవత్సరాల క్రితం సరస్వతీ నది వుండేదట! అది ఇప్పుడు అదశ్యమైపోయిందంటారు పెద్దలు! జగన్ తాను ప్రారంభిస్తానన్నా సరస్వతీ సిమెంట్స్ ఫ్యాక్టరీ కూడా అలాంటిదే! సరస్వతీ సిమెంట్స్ పేపర్ల మీదా, న్యూస్ పేపర్ల మీదా కనిపించిందే తప్ప ఏనాడూ నిజంగా అస్థిత్వంలోకి వచ్చిందీ లేదు.. ఉత్పత్తి జరిగిందీ లేదు! ఉద్యోగాలు ఇచ్చింది అయితే అసలే లేదు! ఇక తాజాగా సరస్వతీ పేరు చెప్పి ఇంతకాలంగా జగన్ బాబు ఖర్చీప్ వేసిన వందల ఎకరాల భూములన్నీ ఈడీ అటాచ్ చేసింది. ఈ పరిణామంతో ఏడేళ్లుగా భూములు కోల్పోయి భోరున విలపిస్తోన్న రైతుల కళ్లలో ఆనందం తొణికిసలాడుతోంది!
ఇంతకీ సరస్వతీ సిమెంట్స్ సినిమా ఏంటి? ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకున్న కొద్దీ మన ప్రతిపక్ష నేత ఏ రేంజు దర్శకుడో క్లియర్ గా అర్థం అవుతుంది! ఆయన తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో వుండగా నడిపిన అవినీతి రీళ్లలో ఇది కూడా ఒకటి. సరస్వతీ సిమెంట్స్ ఫ్యాక్టరీ పెట్టాలని జగన్ 2008 - 09 సంవత్సరాల్లో నిర్ణయించుకున్నారు. కాని, అంతకంటే ముందే గుట్టుచప్పుడు కాకుండా పల్నాడు ప్రాంతంలోని సున్నపు రాయి నిక్షేపాల్ని జల్లెడ పట్టించేశారు. ఎక్కడ ఎంత లోతున సున్నపు రాయి వున్నదీ ఒక అవగాహనకు వచ్చారు.
దాని ప్రకారం వేమవరం, చెన్నాయపాలెం, తంగెడ వంటి ఊళ్లలో వందల ఏకరాలు ఖరీదు చేశారు. చడీచప్పుడు కాకుండా సున్నపు రాయి వెలికీ తీసేందుకు మైనింగ్ పర్మిషన్ కూడా తెచ్చుకున్నారు. కాని, చివరి నిమిషంలో శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు అమాయక రైతుల తరుఫున పోరాటం చేయటంతో యువనేత వారు దిగిరాక తప్పలేదు. దాని ఫలితమే సరస్వతీ సిమెంట్స్ ఫ్యాక్టరీ నెలకొల్పాక ఇంటికో ఉద్యోగం ఇస్తానని అంగీకరించటం. ఆ మాటలు నమ్మిన ఆయా గ్రామాల రైతులు కారు చౌకగా భూములు అమ్మేశారు. ఎకరానికి లక్ష ఇరవై వేల నుంచి మూడు లక్షల వరకూ చెల్లించి జగన్ దాదాపు వెయ్యి ఎకరాలు స్వంతం చేసుకున్నారు. ఇక సరస్వతీ సిమెంట్స్ మొదలైతే భూములు ఇచ్చిన తమకు ఉద్యోగాలు వస్తాయని రైతులు ఆశగా ఎదురు చూశారు. కాని, ఇన్నేళ్లైనా ఆ కల నెరవేరలేదు!
ఏడేళ్ల కిందట భూములు స్వాధీనం చేసుకున్న సరస్వతీ సిమెంట్స్ యాజమాన్యం రైతులకి ఎంత మాత్రం ఉపాధి కల్పించలేదు. ఉత్పత్తి కూడా చేయలేదు. లక్షల రూపాయాల ఆదాయాన్నిచ్చే సాగుభూమిని మాత్రం కబ్జాలో వుంచుకుంది. చివరకు, ఆగ్రహించిన రైతులు తమ భూములు తాము మళ్లీ సాగు చేసుకుంటామని ఉద్యమానికి దిగేదాకా పరిస్థితి వచ్చింది. అయినా దౌర్జాన్యానికి దిగిన సరస్వతీ సిమెంట్స్ మ్యానేజ్మెంట్ 2014లో ఎన్నికల సమయంలో వేల కోట్లకు ఈ భూముల్ని అమ్ముకునే ప్రయత్నం కూడా చేసింది. కాని, జగన్ అధికారంలోకి రాకపోవటంతో ఎవ్వరూ ఈ భూములు కొనటానికి ముందు రాలేదు.
పచ్చటి పంటలతో కళకళలాడాల్సిన భూములు ఏళ్లుగా అలాగే వుండిపోతోంటే రైతులు ఉపాధి లేక విలవిలాడుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పై నడుస్తోన్న విచారణలో భాగంగా మొత్తం 903 ఎకరాల భూమిని ఈడీ అటాచ్ చేసింది. 318కోట్ల విలువైన ఈ నేలని అమ్మటం కాని, తనఖా పెట్టడం కాని ఏదీ చేయవద్దని ఆదేశాలు జారీ అయ్యాయి! ఈ పరిణామంతో తమ భూములు అమ్ముకుని ఇబ్బంది పడుతోన్న రైతులు సంతోషం వ్యక్తం చేశారు. కాని, సాధ్యమైనంత త్వరగా సరస్వతీ సిమెంట్స్ ఫ్యాక్టరీ ప్రారంభించి తమకు ఉద్యోగాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సమీప భవిష్యత్ లో జగన్ కు అలాంటి ఉద్దేశాలు ఏవీ వున్నట్టు మాత్రం కనిపించటం లేదు...