ట్రంప్, మోదీ vs పాక్, చైనా!
posted on Feb 8, 2017 @ 11:35AM
మోదీ అధికారంలోకి వచ్చాక అత్యంత ఉక్కిరిబిక్కిరి అవుతోంది ఎవరంటే పాకిస్తాన్ అనే చెప్పాలి! మనకి కళ్లకు కనిపించేంత లాభం కలగకపోవచ్చు. కాశ్మీర్ సమస్య అలాగే వుండి వుండవచ్చు. మరో వైపు పదే పదే పాక్ తన రక్త దాహంతో మన మీద దాడులు చేస్తూ వుండవచ్చు. అయినా కూడా పాక్ కి నిద్ర లేకుండా చేయటంలో మోదీ సక్సెస్ అవుతున్నారనే చెప్పాలి. అంతే కాదు, రాను రాను పాకిస్తాన్ ఆశలు పెట్టుకున్న అమెరికా దానికి కాశ్మీర్ విషయంలో దూరమవుతూ వస్తోంది. నమ్మకం పెట్టుకున్న చైనా కూడా చేతులు ఎత్తేసే పరిస్థితులు వస్తున్నాయి!
వాజ్ పేయ్ ప్రభుత్వ హయాంలో మన విమానం ఒకటి హైజాక్ అయింది. అప్పట్నుంచీ నిన్న మొన్నటి పఠాన్ కోట్ దాడి వరకూ అన్నిటి వెనుకా వున్న చీడపురుగు మసూద్ అజర్! జైషే మహ్మద్ అనే ఉగ్రవాద సంస్థ స్థాపించి అమాయకుల రక్తం తాగుతున్నాడు ఈ రాక్షసుడు. అందుకే, భారత్ పదే పదే వీడ్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితిని కోరుతోంది. కాని, ఇప్పటికి మూడు సార్లు చైనా అడ్డు పడింది. తన వీటో పవర్ ఉపయోగించి పాకిస్తాన్ ని, మసూద్ అజర్ ను కాపాడుతోంది! దీని వల్ల అంతర్జాతీయ సమాజంలో చైనాకు ఎక్కడలేని చెడ్డ పేరు వస్తోంది...
ఇప్పుడు పాకిస్తాన్ కు మిగిలిన ఏకైక నేస్తం డ్రాగనే. భారీగా పెట్టుబడులు పెడుతూ భారత్ మీద కక్ష్య సాధించటానికి చైనా పాక్ ను వాడుకుంటోంది. అది బాగా తెల్సిన ఇస్లామాబాద్ బీజింగ్ ను అంతకంటే ఎక్కువ వాడేసుకుంటోంది. యుద్ధం వస్తే చైనా మా తరుఫున గన్నులు పట్టుకుని వచ్చేస్తుందంటూ బెదిరించటం మొదలు మసూద్ అజర్ లాంటి ఉగ్రవాదుల్ని కాపాడుకోవటం వరకూ అన్నీ చేస్తోంది పాక్. అయితే, తాజాగా ట్రంప్ సారథ్యంలో సరికొత్త అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ కరుడుగట్టిన అజర్ పై కన్నేసింది. వాడ్ని యూఎన్ ఉగ్రవాదిగా ప్రకటించాలని త్వరలో కోరనుంది.
ఈ సారి కూడా చైనా వీటో చేసి అజర్ ని కాపాడాలని పాకిస్తాన్ కోరుకుంటోంది. కాని, చైనా అందుకు మరీ అంత ఉత్సాహంగా లేదని వార్తలు వస్తున్నాయి. కారణం అమెరికా లాంటి అగ్రదేశం రంగంలోకి దిగి ఒక ఉగ్రవాదిని టార్గెట్ చేస్తే చైనా తనకు ఏ లాభమూ లేకుండా ఇండియా, యూఎస్ కు శత్రువు కావటం అనవసరం అన్న ఫీలింగ్ తోనట! అందుకే, లోలోపల చైనా పాకిస్తాన్ కు మసూద్ అజర్ సంగతేంటో తేల్చుకోవాలని చెప్పేసిందంటున్నారు. ప్రతీ సారి తన పవర్ ఉపయోగించి ఐక్యరాజ్య సమితిలో కాపాడటం కుదరదని డ్రాగన్ అంటోందట!
మసూద్ అజర్ విషయంలోనే కాదు... ఈ మధ్య ట్రంప్ దెబ్బకి పాకిస్తాన్ హఫీజ్ సయీద్ ను కూడా హౌజ్ అరెస్ట్ చేసింది. ముంబై దాడులకి కారకుడైన ఆ హంతకుడ్ని అమెరికా భయంతోనే కాదు చైనా ఒత్తిడి మేరకు కూడా నవాజ్ షరీఫ్ నిర్భంధించాడని తాజా టాక్. ఇక హఫీజ్ సయీద్ అయితే స్వయంగా ట్రంప్, మోదీల జోడీనే తన నిర్భంధానికి కారణం అని చెప్పేశాడు కూడా! ఈ స్టేట్మెంట్ ఒక్కటి చాలు మోదీ వ్యూహం ఫలిస్తోందని చెప్పటానికి!
మోదీ వచ్చాక మొదలు పెట్టిన దూకుడు ఇండియా ఎప్పట్నుంచో ప్రారంభించాల్సింది. కాని, దురదృష్టవశాత్తూ అలా జరగలేదు. మన పాలకులు పాకిస్తాన్ను కావాల్సినంత గారాబం చేశారు. ఇప్పుడు ఆ తప్పు దిద్దుకున్నట్టు కనిపిస్తోంది. త్వరలోనే దాయాది దేశం దారికి వస్తుందని ఆశిద్దాం...