భూ కం(ట్రం)పం మొదలైంది....
posted on Jan 31, 2017 @ 11:47AM
ట్రంప్ అన్నంత పనీ చేశాడూ. ఏడు ఇస్లామిక్ దేశాల పౌరులు తమ గడ్డపైకి రావొద్దని తాత్కాలిక నిషేధం విధించాడు. కాని, ఆయన నిర్ణయం ఎఫెక్ట్ ప్రపంచ వ్యాప్తంగా పడుతోంది. ఉధృతంగా నిరసనాలు, ఖండనలు వస్తున్నాయి. అమెరికా లోపల కూడా జనం రోడ్లెక్కుతున్నారు. ట్రంప్ డౌన్ డౌన్ అంటూ హంగామా చేస్తున్నారు. కాని, పూర్తి మెజార్టీతో అధ్యక్షుడైన ఆయన ఇప్పుడు ఏం చేసినా అంత ఈజీగా ఆపగలిగే పరిస్థితి లేదు. అమెరికన్ సెనేట్, కాంగ్రెస్ అన్నీ కొన్నాళ్ల పాటూ చూస్తూ కూర్చోవాల్సిందే! అదీగాక ఆయన సమర్థకుల వాదన ప్రకారం ట్రంప్ చేస్తోన్నది అనూహ్యమైందేమీ కాదు. ట్రంప్ ఎన్నికలకు ముందు ఏం చెప్పాడో అదే చేస్తున్నాడు.
మెక్సికో పొడవునా గోడ కట్టడం, ఉగ్రవాద ముప్పు వున్న దేశాల నుంచీ జనాన్ని రానీయకపోవటం ట్రంప్ చేసిన ప్రధాన రాజకీయ హామీలు. అందుకే, అమెరికన్లలో తన స్థానాన్ని పదిలం చేసుకోవటం కోసం వాటి మీదే దృష్టి పెట్టాడు కొత్త ప్రెసిడెంట్. ఇక మన ఇండియా లాంటి దేశాలతో సహా చాలా ప్రాంతాల్లో ట్రంప్ వ్యతిరేకతో జోరుగా బయటకొస్తోంది. కాని, ఆయన్ని సమర్థించే వారు చెబుతోన్న కోణం మాత్రం వేరుగా వుంది. అమెరికా ఉగ్రవాదం నుంచి తనని తాను కాపాడుకోవటం కోసం ఏం చేసినా తప్పు పట్టాల్సిన పని లేదంటున్నారు.
అంతే కాదు, ఏడు దేశాల పౌరుల ప్రవేశంపై నిషేధాన్ని యావత్ ముస్లిమ్ సమాజంపై యుద్ధంగా చూడొద్దంటున్నారు. ఉదాహరణకి ప్రధాన ఇస్లామిక్ దేశమైన సౌదీ అరేబియాపై ఎలాంటి నిషేధమూ విధించలేదు. అలాగే, ప్రపంచంలోని బోలెడు ముస్లిమ్ దేశాలు ట్రంప్ ఆర్డర్స్ వల్ల ఎలాంటి ప్రభావానికి లోను కావు. ఆయన మెక్సికో నుంచి వచ్చే వార్ని కూడా రావొద్దంటున్నాడు కాబట్టి మత కోణం ఏం లేదని చెబుతున్నారు ట్రంపిస్టులు!
ట్రంప్ చేసిన నిషేధం ఎలాంటి ప్రభావం చూపుతుందో చెప్పలేం కాని.... ఖచ్చితంగా మార్పులకైతే దారి తీస్తుంది. అమెరికా ఉగ్రవాదానికి అసలు కారణమైన పాకిస్తాన్ పై ఇంకా నిషేధం ఏం విధించలేదు. కాని, అప్పుడే మన పక్కనున్న టెర్రరిస్టు దేశంలో ఉలికిపాటు మొదలైంది. నిన్న మొన్నటి వరకూ తెగ వెనకేసుకొచ్చిన హఫీజ్ సయిజ్ ను పాక్ హౌజ్ అరెస్ట్ చేసింది. అతడి ఉగ్రవాద సంస్థ జమాతేను బ్యాన్ చేసే ఆలోచన కూడా చేస్తోంది. ఈ పరిణామం ఖచ్చితంగా ట్రంప్ ఎఫెక్టేనని చెప్పుకోవచ్చు!
ట్రంప్ ఇప్పుడు కొన్ని దేశాల వార్ని రానీయటం లేదు. ముందు ముందు మన భారతీయులకి కూడా నో ఎంట్రీ బోర్డ్ ఎదురవుతుందని కొందరు ఆందోళన చెందుతున్నారు. అందులో నిజం లేకపోలేదు. మన వారు కొందరు ఉద్యోగాలు ఊడి తిరిగి రావొచ్చు. కొత్త వారు అసలు వెళ్లలేక పోవచ్చు. కాని, అలా జరుగుతుందని కూడా గ్యారెంటీ లేదు. ఎందుకంటే, భారతీయులు కేవలం ప్రతిభ ఆధారంగానే అమెరికాలో స్థిరపడుతున్నారు. అక్కడున్న మన వార్ని పంపేస్తే ఆయా కంపెనీలకు అంతే టాలెంట్ వున్న వారు స్థానిక అమెరికన్స్ లో దొరకటం అంత తేలికైన విషయం కాదు. కాబట్టి అమాంతం ఇండియన్స్ ట్రంప్ వెళ్లగొట్టకపోవచ్చు. అలాగే, ఇండియన్ మార్కెట్స్ లో అమెరికాకు వున్న అవసరాలు కూడా అలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోకుండా చేస్తాయి.
అందుకే, ఎప్పుడూ యాంటీ అమెరికన్ వాదన వినిపించే వామపక్ష మేధావులు, మీడియా వారి మాటలు పెద్దగా పట్టించుకోవద్దని ట్రంప్ సమర్థకులు చెబుతున్నారు.చరిత్రలో అమెరికా ఎప్పుడూ శరణార్థుల్ని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ సాక్షిగా ఆహ్వానిస్తూనే వుంది. కాని, గత మూడు వందల సంవత్సరాల్లో తొలిసారి కొందరిపై తలుపులు వేసేసింది. ఇది ట్రంప్ చేస్తోన్న తెంపరి పనిగా మాత్రమే చూడకూడదు. స్థానిక అమెరికన్స్ గా వున్న వైట్ పీపుల్ లోని అభద్రతగా చూడాలి. మారుతున్న అమెరికా పరిస్థితిగా చూడాలి. ఎందరు వచ్చినా అతిథి మర్యాదలు చేసే స్థోమత, స్థాయి క్రమంగా అగ్రదేశానికి కూడా లేకుండా పోతున్నాయి. అదీ తమ అంతర్గత అభద్రత పణంగా పెట్టి చేయడం ... నిజంగా కూడా కష్టమే! అతి సాహసమే!