గాంధీ... విగ్రహమైపోయిన విప్లవం!
posted on Jan 30, 2017 @ 12:19PM
గాంధీ... మన సినిమా రచయిత ఒకాయన చెప్పినట్టుగా... గాంధీ నిజంగా ఒక ఇంటి పేరు కాదు. వీధికో విగ్రహమూ కాదు. ఇంకా కాదూ కూడదంటే... గాంధీ అంటే కరెన్సీ నోటు మీద ఓ బోసి నవ్వూ కాదు! మరి గాంధీ అంటే ఏంటి? ఆయన వర్ధంతి నాడు మనం తప్పక ఆలోచించాల్సిన విషయం ఇదీ...
మనకు నచ్చినా నచ్చకపోయినా మానవ నాగరికతలో యుద్ధం కూడా అంతర్భాగం. తాను పుట్టినప్పటి నుంచీ మనిషి ప్రకృతితో యుద్ధం చేస్తున్నాడు. తరువాత ప్రకృతిలో భాగమైన జంతువుల్ని వేటాడి వాటితో యుద్ధం చేశాడు. చివరకు, ఇప్పుడు మనిషి సాటి మనిషితోనే యుద్ధం చేస్తున్నాడు! పులి, సింహం లాంటి క్రూర జంతువులు కూడా సాటి పులుల్ని, సింహాల్ని చంపుకోవు. ఒక్క మనిషి మాత్రమే తన జాతి వాడ్ని కూడా వదలేక వేటాడుతాడు! అంతటి హింసాత్మక జీవి! అందుకే, గాంధీ అవసరం కూడా ఎప్పుడూ వుంటుంది. బ్రిటీషు వాడు వెళ్లిపోయినంతా మాత్రాన, మనకు రాజకీయ స్వాతంత్ర్యం వచ్చినంత మాత్రాన గాంధీ అక్కర్లేదని కాదు. ఆయన అహింసా మార్గం మనిషిలో హింసాత్మక ఉన్మాదం వున్నంత కాలం అవసరమే. అవశ్యమే...
దేశ స్వతంత్ర సిద్ధికి ముందు, తరువాత మహాత్మ గాంధీ ఒక భావజాలం. ఆయనని అప్పటి వారు ఒక మామూలు మనబోటి మనిషిగా చూసే వారు కాదు. గాంధీ అంటే ఒక ఇజమ్. ఆయన ఒక సజీవ సిద్ధాంతం. హింసని హింసతోనే ఎదుర్కోవాలని చెప్పవారికి పూర్తి వ్యతిరేకం. బుద్ధుడి వైరాగ్యం, అశోకుడి నాయకత్వం రెండూ కలగలిసిన ఆధునిక గీతాసారం!
గాంధీ గత కొన్ని దశాబ్దాలుగా భారతీయ స్మృతి పథంలోంచి క్రమక్రమంగా అదృశ్యమవుతున్నాడు. నెహ్రు మొదలు మోదీ వరకూ అందరూ ఆయన పేరుని వీలున్నప్పుడల్లా స్మరిస్తూనే వున్నా ... నిజంగా గాంధేయ మార్గం అవలంబిస్తున్న వారు తక్కువైపోతున్నారు. రాజకీయ నేతలే కాదు సామాన్యులు కూడా గాంధీ మార్గం పట్టించుకోవటం లేదు. అహింస అంతకంతకూ రక్తసిక్తమైపోయి నడ్డి రోడ్డు మీద కొట్టుమిట్టాడుతోంది. గాంధీ చెప్పిన గ్రామ స్వరాజ్యం కూడా కాలుష్య కోరల్లోని ఈనాటి మన నగరాల్లో మురికి కాలువల వెంట కుళ్లిపోతోంది. అసలు గాంధీ కలలుగన్న ఏ స్వప్పమూ మన పాలకులు, మనమూ నిజం చేయలేదనే చెప్పాలి. ఆయన బ్రిటీష్ వార్ని దేశం నుంచి పారద్రోలే మహా కార్యం మన కోసం పూర్తి చేసినప్పటికీ తరువాత పెద్దగా జరిగిందేమీ లేదు. హింసా, అశాంతి, మతోన్మాదం, పేదరికం... అన్నీ గాంధేయవాదాన్ని ధిక్కరించి ఇక్కడే తిష్ఠవేశాయి.
సరిగ్గా ఇదే రోజున గాడ్సే గాంధీని భౌతికంగా హత్య చేశాడు. ఆయన చేసింది తప్పే కావచ్చు. కాని, గాంధేయ వాదాన్ని ప్రతీ నిత్యం హత్య చేస్తోన్న హంతుకులు చాలా మంది మనలోనే వున్నారు. దాని ఫలితమే భారతదేశంలో ఇప్పుడు మనం అనుభవిస్తోన్న అరాచకం. గాంధీ నూలు ఒడికిన రాట్నం లాగే ఆయన సిద్ధాంతమూ ఆధునిక ఆర్భాటాల మధ్య మూలనపడిపోయింది. కేవలం ఒక నినాదంగా మిగిలిపోయింది. ఎప్పుడైతే భారతీయులు మళ్లీ అహింసా, శాంతి, సత్యం, సమానత్వం వెంట పయనిస్తారో అప్పుడే గాంధీకి నిజమైన నివాళి అందేది. అప్పటి వరకూ గాంధీ జయంతులు, వర్ధంతులు వస్తూ పోతుంటాయి కాని... ఆయన మాత్రం వీధిలో విగ్రహంగానే మిగిలిపోతాడు! రోడ్డు మీద తన వేషమే కట్టి అడుక్కునే అభాగ్య పిల్లల రూపంలో అధిక్షేపిస్తూనే వుంటాడు!