మన అత్యాశే "క్లిక్" మనిపించింది
posted on Feb 3, 2017 @ 3:40PM
డబ్బు..రెండక్షరాలే..కానీ ప్రపంచాన్ని చుట్టేస్తూనే ప్రపంచాన్నే గిరగిరా తిప్పేస్తోంది. మనిషి డబ్బు అనబడే మారకాన్ని తయారు చేసి మంచి పని చేశానని జెబ్బలు చరుచుకుంటున్నాడు..కానీ ఆ మంచితో పాటే అన్నీ జాడ్యాలు దాని వెంబడే ఉన్నాయని కనిపెట్టలేకపోయాడు. మనిషి డబ్బు కోసం ఎంతగా అర్రులు చాస్తే అంతే త్వరగా పతనమైపోతాడు. ఎంత వీలైతే అంత త్వరగా పక్కవాడి కన్నా ముందుగా కోటీశ్వరులైపోవాలి నేటీ తరం అంతా ఇలాగే ఆలోచిస్తుంది. ప్రపంచం సంగతి పక్కన బెడితే ఫ్రీ వస్తే ఫినాయిల్ తాగే మనుషులున్న భారతదేశంలో ఇలాంటి వ్యక్తుల బలహీనతను ఆసరాగా తీసుకుని పుట్టగొడుగుల్లాగా సంస్థలు పుట్టుకొచ్చి జేబులు నింపుకుంటున్నాయి..
డిపాజిట్ కడితే రెండున్నర రెట్ల సొమ్ము..రోజువారీగా మన అకౌంట్లో జమ చేయడం..వినడానికి బాగానే ఉంటుంది కానీ, జేబు ఖాళీ అయ్యాక, నమ్ముకున్నాడే బిచాణా ఎత్తేస్తాడని తెలిశాక..అప్పుడు కానీ అది మోసమని..మనం నిండా మునిగామని అర్థం కాదు. ఆకర్షణీయమైన స్కీములు..శ్లాబ్‌లు రూపొందించి కోట్లకు కోట్లు కొల్లగొడుతున్నారు కొందరు కేటుగాళ్లు.. ఇలాంటి ఎన్నో బాగోతాలు వెలుగులోకి వచ్చినప్పటికి భారతీయులకు డబ్బు పట్ల ఉన్న మక్కువ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. తాజాగా మరో భారీ ఆన్‌లైన్ మల్టీలెవల్ మార్కెటింగ్ మోసం గుట్టురట్టయ్యింది. ఇంట్లో కూర్చొని వెబ్‌సైట్ల లింకులు క్లిక్ చేయడం ద్వారా లక్షలు సంపాదించవచ్చని ఎరవేసి లక్షల మంది నుంచి డబ్బులు కొల్గగొట్టిన ఆన్‌లైన్ మోసాన్ని ఉత్తరప్రదేశ్ పోలీసులు ఛేదించారు.
2015లో అనుభవ్ మిట్టల్ అనే వ్యక్తి నోయిడాలో అబ్లేజ్ ఇన్ఫో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని ప్రారంభించి సోషల్ ట్రేడ్.బిజ్ అనే పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ మోసానికి తెరలేపింది. ఈ వెబ్‌సైట్‌లో రూ. 5,750, రూ. 11,500 రూ.28,750, రూ. 57,500 చెల్లించి సభ్యత్వం తీసుకోవాలి. అలా తీసుకున్న సభ్యత్వాన్ని బట్టి వెబ్‌సైట్ల లింక్స్ పంపుతారు. ఆ లింక్స్‌ను క్లిక్ చేసి ఓపెన్ చేస్తే ప్రతీ క్లిక్‌కు రూ.5 చొప్పున చెల్లిస్తారు. అంతేకాకుండా ఇతరులను సభ్యులుగా చేర్పిస్తే ఈ క్లిక్స్ రెట్టింపు అవుతాయి. దీనికి ఆశపడిన ఎంతో మంది తాము చేరడమే కాకుండా స్నేహితులను, బంధువులను సభ్యులుగా చేర్పించారు. ప్రారంభంలో వారికి డబ్బులు బాగానే రావడంతో మరిన్ని సభ్యత్వాలు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా 7 లక్షల మంది వీరి బుట్టలో పడ్డారంటే ఎంతగా మాయ చేశారో అర్థం చేసుకోవచ్చు..కానీ నిజాన్ని ఎంతోకాలం దాచలేరు కదా...! ఆ సమయం ఆసన్నమైంది.
గత 15 రోజుల నుంచి కొందరు ఖాతాదారులకు డబ్బులు రావడం లేదు..ఇదే విషయంపై ఈమెయిల్స్ ద్వారా వివరణ కోరగా..ఆర్‌బీఐ నిబంధనల కారణంగా వెబ్‌సైట్ పేరును ఫెండ్సప్‌గా మారుస్తున్నమని..త్వరలోనే ఖాతాల్లో డబ్బులు పడతాయని చెప్పారు.. దీనిపై అనుమానం కలిగిన కొంతమంది పోలీసులను ఆశ్రయించడంతో మొత్తం భండారం బయటపడింది. గురువారం నోయిడాలోని సంస్థ కార్యాలయాలపై దాడులు చేసిన పోలీసులు సంస్థ డైరెక్టర్ అనుభవ్ మిట్టల్, సీఈవో శ్రీధర్, టెక్నికల్ హెడ్ మహేశ్ దయాళ్‌ను అరెస్ట్ చేసి.. ఖాతాలను సీజ్ చేశారు..ఈ ఖాతాల్లో రూ.500 కోట్ల వరకు ఉన్నట్లు అంచనా. తదుపరి చర్యల కోసం భారత రిజర్వ్ బ్యాంక్, ఆదాయపు పన్ను విభాగం, సెబీకి సమాచారం అందించామని పోలీసులు తెలిపారు. మనిషిలో డబ్బు మీద ఆశ చావనంత కాలం..ఇలాంటి మోసాలకు..మోసం చేసే కంపెనీలకు కొదవ ఉండదు. డబ్బు అనే ఆశను చక్కగా నియంత్రించగలిగితే సర్వసుఖాలు కిందకి దిగి వస్తాయి..లేదంటే అంతే స్థాయిలో చుక్కలు కనిపిస్తాయి.