పోలీస్ బాస్ ల న(యీమ్)య వంచన...
posted on Feb 2, 2017 @ 3:48PM
పోలీసులకి , దొంగలకి మధ్య రిలేషన్ షిప్ ఎలా వుండాలి? వలకి, చేపకి మధ్య వున్న సంబంధంలా వుండాలి. కాని, అది ఫిష్ కి, అక్వేరియమ్ కి మధ్య వున్న రిలేషన్ లా వుంటే ఎలా వుంటుంది? నయీమ్ ఫోటోలు చూసిన చాలా మంది ఇప్పుడు ఇలాగే ప్రశ్నించుకుంటున్నారు! మరోసారి మన పోలీస్ వ్యవస్థపై అంతా ఆందోళనకి గురవుతున్నారు...
కేసు పెట్టడానికి స్టేషన్ కి వెళితే బాధితుల్నే వేధించిన పోలీసులని మనం చాలా సార్లు వింటుంటాం. ఒక్కోసారి ఖాకీలు అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారా అని కూడా అనుమానపడుతుంటాం. కాని, పదే పదే బయటపడే పోలీస్ అరాచకాలు అన్నిట్నీ పటాపంచలు చేసేస్తుంటాయి. గ్యాంగస్టర్ నయీమ్ తో ఖాకీల చెట్టాపట్టాలు అలాంటివే! అసలు ఒక రౌడీ షీటర్ అంతలా నియంతలా ఎలా ఎదగగలిగాడు అని ప్రశ్నించుకుంటే మనకు తాజాగా బయటపడ్డ ఫోటోలే సమాధానంగా దొరుకుతాయి.
నయీమ్ హఠాత్తుగా ఎన్ కౌంటరై టీవీల్లో కనిపించే వరకూ ఎవరూ అలా జరుగుతుందని ఊహించలేదు. అందుక్కారణం అతడికి వున్న పరపతే. ఒకప్పుడు మావోయిస్టులతో పని చేసిన నయీమ్ తరువాత బయటకొచ్చి ఎన్నో ఆకృత్యాలు చేశాడు. అందుకు రాజకీయ నేతలు, పోలీసుల అండదండలు పుష్కలంగా వుండేవని చాలా మంది చెబుతారు. కాని, ఎప్పుడూ ఎక్కడా ఖచ్చితంగా మాత్రం బయటపడలేదు. అయితే, ఎక్కడో ఏదో తేడా జరిగి నయీమ్ తాను విందులు, వినోదాలు చేసుకున్న పోలీసుల చేతిలోనే ఆశ్చర్యకరంగా అంతమయ్యాడు. కాని, అంత అవలీలగా ఎన్ కౌంటర్ చేసిన మన భద్రత దళాలు మరి అంత కాలం ఎందుకు స్వేచ్ఛగా వదిలేశాయి? ఇదే ప్రశ్న అతడి బాధితుల్ని, చాలా మంది సామాన్యుల్ని వేధించింది. అయితే, కారణం ఇప్పుడు ఫోటోల రూపంలో బయటపడింది...
ఈ మధ్యే నయీమ్ కు , పోలీసు ఉన్నతాధికారులకు సంబంధలు వున్నట్టు ఎలాంటి సాక్ష్యాలు లభ్యం కాలేదని కోర్టుకు చెప్పాయి దర్యాప్తు సంస్థలు. తరువాత లోలోన ఏం జరిగిందో కాని ఉన్నట్టుండీ పోలీస్ బాస్ లు నయీమ్ తో విందులు చేసుకుంటున్న ఫోటోలు బయటకొచ్చాయి. ఇది ఆ ఫోటోల్లోని అధికారులకి తీవ్రమైన కళంకమే. కాకపోతే, ఇప్పటికిప్పుడు కోర్టుల పరంగా వారికొచ్చే నష్టమేం లేదు. అలాగే, నయీమ్ ను పెంచి, పోషించింది పోలీసులు, రాజకీయ నేతలేనన్న వాదనకి కూడా ఈ ఫోటోలతో అమోద ముద్ర లభించింది!
పోలీసులే లేకుంటే మన సమాజాన్ని అస్సలు ఊహించలేం. అరాచకం దారుణంగా ప్రబలిపోతుంది. కాబట్టి నిజాయితీగల పోలీసుల సేవలు, త్యాగాలు అస్సలు కాదనలేనివి. కాని, వారి మధ్యనే ఖాకీ డ్రస్సు వేసుకున్న రౌడీ ఇన్ స్పెక్టర్లు, గూండా అధికారులు వుండటం ఇక్కడ పెద్ద విషాదం. వృత్తిలోని ఒత్తిడి తట్టుకోలేక ఒకవైపు కింది స్థాయి పోలీసులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పై స్థాయి వారు సంఘ విద్రోహ శక్తులతో జల్సాలు చేయటం క్షమించరానిది. దీనిపై ప్రభుత్వం కఠినంగా స్పందించాలి. పోలీసు వ్యవస్థ ప్రజల నమ్మకం దృఢంగా వుండేలా చూడాలి...