మోదీ హీట్ తో... 'ఉడికిపోతోన్న' ఉద్ధవ్ థాక్రే!
posted on Feb 13, 2017 @ 2:34PM
మహారాష్ట్రలో శివసేన పార్టీ పరిస్థితి... ఇష్టం లేని భర్తతో కాపురం చే్స్తోన్న భార్యలా తయారైంది! ఏదో ఒక కారణంతో కమలాన్ని తిట్టిపోయటమే పనిగా పెట్టుకున్నాడు ఆ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే! నిజానికి మహాలో శివసేన, బీజేపి మిత్ర పక్షాలు. కాని, గత కొన్ని నెలలుగా గమనించి చూస్తే కాంగ్రెస్ , ఎన్సీపీ లాంటి బీజేపి ప్రత్యర్థి పార్టీల కంటే ఎక్కువ శివసేననే విమర్శలు గుప్పిస్తోంది. ఓ వారం ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ను టార్గెట్ చేస్తే మరో వారమంతా మోదీని కార్నర్ చేస్తోంది. చివరకు, ఉద్ధవ్ చర్యలు ఆయన స్వంత పార్టీ అభిమానులకి కూడా అంతు చిక్కకుండా వుంటున్నాయి...
మోదీ బాత్రూంలలోకి తొంగి చూడటం మానేసి పాలనపై దృష్టి పెట్టాలి. ఈ మాటలు అన్నది ఎవరో కాంగ్రెస్ నేతలు కాదు. తమ అధికార పత్రిక సామ్నాలో ఉద్ధవ్ థాక్రే చేసిన వ్యాఖ్యలివి! మోదీ మన్మోహన్ గురించి రెయిన్ కోట్ కామెంట్ చేసినప్పటి నుంచీ దాన్ని వాడుకుని విమర్శించాలని శివసేన తెగ ఉబలాటపడుతోంది! అందులో భాగంగానే ఆ మధ్య మన్మోహన్ అద్భుతమైన ఆర్దికవేత్తని, నిజాయితీపరుడని కితాబులిచ్చాడు ఉద్ధవ్. అలాంటి వ్యక్తిని మోదీ విమర్శించవద్దని క్లాస్ తీసుకున్నాడు.
ఇంకా కోపం చల్లారక సామ్నా పత్రిక ఎడిటోరియల్ లో మరోసారి చెలరేగిపోయాడు. మోదీ ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో ప్రతిపక్షాల జాతకాలు తన వద్ద వున్నాయని బెదిరించటం సరికాదన్నాడు. బీజేపి ఓడిపోయినప్పుడు ఇతర పార్టీలు కూడా అలాగే బ్లాక్ మెయిల్ చేస్తాయని హితవు పలికాడు. అంతే కాదు, ఉద్ధవ్ థాక్రే ఉత్తర్ ప్రదేశ్ లో మహిళలు సాయంత్రం బయటకి రాలేపోతున్నారని మోదీ అనటాన్ని కూడా తప్పుబట్టాడు. అక్కడ డెబ్బై మంది బీజేపి ఎంపీలు వున్నారనీ, వారంతా సాయంత్రాలు ఏం చేస్తున్నారని అడిగాడు. మహిళల రక్షణ వారికి పట్టదా అన్నాడు!
శివసేన ఇలా బీజేపి విషయంలో రాద్ధాంతం చేయటం ఇదే మొదటిసారి కాదు. అసలు గుజరాత్ రాష్ట్ర శివసేన అధ్యక్షుడుగా మోదీ శత్రువు... హార్దిక్ పటేల్ ను ఉద్ధవ్ నియమించాడంటేనే... పరిస్థితి ఎంతదాకా వచ్చిందో తెలుసుకోవచ్చు! దీనికంతటికీ కారణం, మహారాష్ట్రలో బీజేపి బలం పుంజుకోవటమే. మోదీ మేనియాతో 2014 నుంచీ క్రమంగా మహారాష్ట్ర కమలం వికసిస్తూ పోతోంది. ఫడ్నవీస్ సీఎం అయ్యాక గత కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పార్టీల ప్రభుత్వాల కంటే మెరుగైన పాలన అందుతోంది. ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత పెల్లుబుకటం లేదు. ఇదే శివసేనకు మింగుపడటం లేదు. ఒకప్పుడు తమకు తోక పార్టీగా వున్న బీజేపి ఇప్పుడు తమనే శాసించటం ఉద్ధవ్ జీర్ణించుకోలేకపోతున్నాడు!
మహారాష్ట్రలో కమల వికసానికి కారణం కేవలం మోదీ మ్యాజిక్ మాత్రమే కాదు. శివసేన, ఎమ్ఎన్ఎస్ మహారాష్ట్ర సెంటిమెంట్ అడ్డుపెట్టుకుని అరాచక రాజకీయాలు చాలానే చేశాయి. బాల్ థాక్రే చనిపోయాక శివసేనకు ఒక ప్రజాకర్షణ గల లీడర్ కూడా లేకుండా పోయాడు. అందువల్లే ఆరెస్సెస్ మద్దతు కూడా వున్నా బీజేపి శివసేన ఓటు బ్యాంక్ తినేస్తూ వస్తోంది. కాని, ఉద్ధవ్ బీజేపిపై మండిపడటం తప్ప క్షేత్రస్థాయిలో ఏమీ చేయటం లేదు. పేద, మధ్యతరగతి మరాఠీల ఇబ్బందుల్ని పట్టించుకుని, ఉద్యమాలు చేయాల్సిన ఆ పార్టీ ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల మీద కామెంట్స్ చేస్తూ కాలం గడుపుతోంది.
తమ పతనానికి బీజేపి కన్నా పెద్ద కారణం తమ నిర్లక్ష్యమే అని ఉద్ధవ్ తెలుసుకోలేకపోతున్నాడు. అంతే కాదు, రాజ్ థాక్రే లాంటి నేత వేరు కుంపటి పెట్టుకోవటం కూడా శివసేన బలం తగ్గించింది. ఇవన్నీ ఆలోచించుకోకుండా అరివింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ లాగా ఉద్ధవ్ పొద్దస్తమానం మోదీని తిట్టిపోస్తున్నాడు. కాని, దాని వల్ల నష్టం కలిగితే కలగాలి తప్ప లాభం చేకూరే అవకాశం లేదు. ఎందుకంటే, మోదీ ప్రభావం అంతా జాతీయ రాజకీయాల్లో వుంటుంది. ఉద్ధవ్ తన పార్టీని బతికించుకోవాలంటే బలపడాల్సింది, తలపడాల్సింది మహారాష్ట్ర రాజకీయాల్లో! ఇది శివసేన అధినేతకి అంత తేలిగ్గా బోధపడుతుందని అనిపించటం లేదు...