పాలనకు కొత్త రక్తం...
ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించారు. 19 మందిని కొత్తగా మంత్రులుగా తీసుకున్నారు. ఐదుగురు సహాయ మంత్రుల్ని తొలగించారు. పలువురు కేబినెట్ మంత్రుల శాఖలు మార్చేశారు. మోడీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ , వెంకయ్య నాయుడు లాంటి అగ్రనేతలు మినహా మిగిలిన మంత్రుల్లో చాలా మందికి శాఖలు మారాయి. వివాదాలు, వయసు మీద పడటం, పనితీరు వంటి వాటిని భేరీజు వేసుకుని మోడీ తన మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేశారు.
కేబినెట్‌లో మోడీ తర్వాత అంతటి ఛరిష్మా కలిగిన నేతగా పేరు తెచ్చుకున్న స్మృతి ఇరానీ నుంచి మానవ వనరుల అభివృద్ధిశాఖను తొలగించి, ఆ శాఖను ప్రకాశ్ జవదేకర్‌కు అప్పగించి ఆయనకు ప్రమోషన్ ఇచ్చారు. హెచ్‌ఆర్‌డీ శాఖ మంత్రిగా హెచ్‌సీయూలో దళిత స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య విషయంలోనూ, జేఎన్‌యూ వివాదంలోనూ స్మృతి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఆమెను తప్పించి తక్కువ ప్రాధాన్యం గల శాఖకు బదిలీ చేయటం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది.
మరోవైపు సదానంద పనితీరు పట్ల ప్రధాని అంత సంతృప్తిగా లేరు. ఏపీ-తెలంగాణ ఉమ్మడి హైకోర్టు విభజన అంశంలో వివాదాస్పద వ్యాఖ్యలు, న్యాయమూర్తుల నియామకం విధానంపై సుప్రీంకోర్టుకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య తలెత్తిన విభేదాల పరిష్కారంలో సమర్థంగా వ్యవహరించలేకపోవడం తదితర కారణాలతో న్యాయశాఖ మంత్రి డివి సదానంద గౌడను ఆ శాఖ నుంచి తప్పించారు. ఆయన్ను గణాంకాలు, పథకాల అమలు శాఖకు మార్చి..వాజ్‌పేయ్ హయాంలో న్యాయశాఖను సమర్ధవంతంగా నడిపిన ప్రస్తుత ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు అదనపు బాధ్యతగా న్యాయశాఖను అప్పగించారు. అటు సహాయమంత్రులైన సన్వర్‌లాల్ జాట్, మోహన్‌భాయ్ కుందారియా, నిహాల్‌చంద్, మన్‌సుఖ్‌భాయ్ ధాంజీభాయ్, రామ్‌శంకర్ కతేరియాలపై మోడీ వేటు వేశారు.
పాలనలో యువరక్తానికి పెద్దపీట వేయాలని భావించిన మోడీ అలాగే ముందుకెళ్లారు. తాజా మంత్రుల్లో ఐదుగురు 50 ఏళ్ల లోపు వయస్సు వారే. పది మంది 60 ఏళ్ల పైబడిన వారు. కొత్త మంత్రులంతా విద్యాధికులు..వీరిలో 9 మంది పీజీ, ఏడుగురు న్యాయవాద పట్టభద్రులు, మరో ఏడుగురు పట్టభద్రులు, ఇద్దరు ఎంబీఏలు, ఒక వైద్యుడు ఉన్నారు.15 మందికి చట్టసభల కార్యకలాపాలు క్షుణ్ణంగా తెలుసు. నలుగురు మాత్రమే తొలిసారి చట్టసభకు వచ్చారు. 10 మందికి గతంలో కేంద్రంలోనో, రాష్ట్రంలోనో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది.
ఇదంతా చూస్తే ఈ మంత్రివర్గ విస్తరణపై మోడీ ఎప్పటి నుంచో కసరత్తు చేశారనిపిస్తోంది. మంత్రులుగా ఎంపిక చేసుకున్న వారి పూర్వానుభం, చదువు, పాలనపై పట్టు తదితర అంశాలను మోడీ మదింపు చేశారు. ఈ కొత్త కూర్పుతో పాలనను పరుగులు పెట్టించడంతో పాటు, రాజకీయ అవసరాలు కూడా ఉన్నాయి. కొత్త మంత్రి పదవుల్లో యూపీకి మూడు, గుజరాత్‌కు మూడు, రాజస్థాన్‌కు నాలుగు పదవులు దక్కాయి. యూపీ, గుజరాత్‌లకు వచ్చే ఏడాది ప్రారంభంలో ఎన్నికలు జరగనుండగా, రాజస్థాన్ వందశాతం ఎంపీ స్థానాలు గెలిపించిన రాష్ట్రం. మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగిన అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని ..ఇది పునర్‌వ్యవస్థీకరణ కాదని, అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలు మరింత సమర్థంగా, వేగంగా అమలు చేయడం కోసమే ఈ మార్పులు, చేర్పులన్నారు. పదవులు దక్కాయని సంబరపడకండి..ఈ నెలలోనే పార్లమెంట్ సమావేశాలున్నాయి..పని మొదలెట్టండి అని కొత్తమంత్రులకు దిశానిర్దేశం చేశారు.