బ్యాస్టిల్ డే..బ్లాక్ డేగా మారిన వేళ
posted on Jul 16, 2016 @ 12:48PM
స్వేచ్ఛా, సమానత్వం అనే భావాలు ప్రపంచానికి అందిన రోజు...పర్యాటకానికి కేరాఫ్ అడ్రస్‌గా..ప్రశాంతతకు మారు పేరుగా నిలిచే నీస్ నగరం ఉగ్రోన్మాదంతో భీతిల్లింది. మతోన్మాదం నెత్తికెక్కిన ఓ ఆగంతకుడు..లారీనే ఆయుధంగా మార్చుకుని..సంబరాల్లో మునిగి తేలిన జనంపైకి దూసుకెళ్లాడు. కసి, నిర్లక్ష్యంతో కూడిన వికృతానందంతో కంప్యూటర్‌లో వీడియో గేమ్ ఆడుతున్నట్టుగా, తన వాహనాన్ని అత్యంత వేగంతో నడుపుతూ జనం మీదకు పోనిచ్చాడు. దీంతో అప్పటి వరకు ఆనందంలో మునిగితేలిన వారంతా కకావికలమయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు తలో దిక్కుకు పారిపోయారు. అయినవారు కళ్లముందే మృత్యుశకటానికి బలైపోయారు. చక్రాల కింద పడి నలిగి నుజ్జునుజ్జయిపోయారు. దాదాపు 2 కిలోమీటర్ల మేర ఆ నరహంతకుడు వెళ్లిన దారంతా శవాల గుట్టలే..తలలు పగిలి, మెదళ్లు ఛిద్రమైన మృతదేహాలు. చిన్నపిల్లల మృతదేహాల పక్కనే పడి ఉన్న బొమ్మలు..కాపాడాలంటూ హృదయవిదారకంగా రోదిస్తున్న క్షతగాత్రులు..తప్పిపోయిన వారి కోసం వెతుకులాటలు ఇలా రెప్పపాటులో ఆనందహేల..మృత్యుహేలగా మారిపోయింది.
బ్యాస్టిల్ కోట పతనానికి గుర్తుగా ప్రతియేటా జూలై 14న ఫ్రాన్స్ ప్రజలు దేశవ్యాప్తంగా బ్యాస్టిల్ డే వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటారు. ఫ్రెంచి రాజు లూయిస్-16 తనకు ఎదురు తిరిగిన వారిని బ్యాస్టిల్ అనే భవనంలో బంధించేవాడు. అలా రాజు చర్యలతో విసిగిపోయిన ప్రజలు 1789లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలకు దిగారు. బ్యాస్టిల్ కోటను ముట్టడించి బందీలుగా ఉన్న వారిని విడిపించారు. ఇది చారిత్రక ఫ్రెంచి విప్లవానికి నాంది పలికి ఫ్రెంచి రిపబ్లిక్ ఆవిర్భావానికి దారితీసింది. ఆ తర్వాతి ఏడాది నుంచి జూలై 14న ప్రెంచి ప్రజలు బ్యాస్టిల్ డే సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. 1879లో దీనిని జాతీయ దినోత్సవంగా ప్రకటించింది ఫ్రెంచి ప్రభుత్వం. ఆ రోజు మిలటరీ పరేడ్‌లు..సామూహిక భోజనాలు..విందులు వినోదాలతో దేశమంతా పండుగ శోభతో కళకళలాడుతుంది.
అలాంటి సంబరాన్ని ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. నీస్‌లోని విహార ప్రదేశమైన ప్రొమనేడ్ డెస్ ఆంగ్లైస్ వద్ద జాతీయ దినోత్సవం ముగింపు కార్యక్రమాల సందర్భంగా రాత్రి 10.30 గంటల ప్రాంతంలో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. ఈ వేడుకలను తిలకించేందుకు దాదాపు 30 వేల మంది ప్రజలు గుమిగూడి ఉన్నారు..సంగీత కచేరి వింటూ..బీచ్‌లో ఉత్సాహంగా గడుపుతుండగా ఉగ్రవాదిగా భావిస్తున్న ఆగంతకుడు భారీ ట్రక్కును అతి వేగంగా, అడ్డదిడ్డంగా నడుపుతూ జనంపైకి దూసుకొచ్చాడు. ఆగంతకుడు లారీని నడుపుతూనే కాల్పులకు దిగినట్లుగా భావిస్తున్నట్టు ప్రత్యక్షసాక్షి ఒకరు వెల్లడించారు. అయితే ఓ వ్యక్తి మోటార్ సైకిల్‌పై వెళ్లి లారీని నిలువరించే క్రమంలో డ్రైవర్ ఉన్న క్యాబిన్ తలుపు తెరిచేందుకు ప్రయత్నించాడు. అయితే దురదృష్టవశాత్తూ లారీ కిందపడి మరణించాడు. పోలీసులు వేగంగా స్పందించి ఉన్మాదిపై కాల్పులు జరపడంతో మారణకాండకు తెరపడింది.
ఇంతటి నరమేధానికి కారణమైన ఆగంతకుడిని ట్యునీషియాకు చెందిన మొహ్మద్ లహౌయెజ్ బౌహ్లెల్‌గా గుర్తించారు. దాడికి పక్కాగా ప్రణాళిక వేసుకున్న మహ్మద్..రెండు రోజుల క్రితమే ఆ ట్రక్కును అద్దెకు తీసుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ట్రక్కులో భారీగా తుపాకులు, గ్రెనేడ్‌లను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఐరోపా సమాఖ్యలో ముస్లిం జనాభా ప్రాన్స్‌లోనే ఎక్కువ. ఉత్తర ఆఫ్రికాలోని పూర్వపు వలస దేశాల నుంచి వీరంతా వలస వచ్చారు. అయితే ఐఎస్ఐఎస్‌పై పోరులో భాగంగా అమెరికా సారథ్యంలోని సంకీర్ణదళాల కూటమిలో ఫ్రాన్స్ క్రీయాశీలక పాత్ర పోషిస్తోంది. అంతేకాకుండా ఇరాక్, సిరియాల్లో తలదాచుకున్న ముష్కరులపై వైమానిక దాడులకు దిగుతోంది. దీంతో ఫ్రాన్స్‌పై ఇస్లామిక్ స్టేట్ ఆగ్రహంతో ఉంది.
అందుకే ఐఎస్ రెండేళ్లుగా ఫ్రాన్స్‌లో నరమేధం సృష్టిస్తోంది. గతేడాది జనవరిలో వ్యంగ్య వారపత్రిక ఛార్లీ హెబ్డో కార్యాలయంపై విరుచుకుపడి పాత్రికేయులు, పోలీసులు సహా 17 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ ఏడాది నవంబర్‌లో రాజధాని పారిస్‌లో ఏకకాలంలో వివిధ చోట్ల దాడులకు తెగబడి 130 మంది ప్రాణాలు బలిగొన్నారు. తాజాగా జాతీయ దినోత్సవ వేడుకలను టార్గెట్ చేసి 84 మంది ప్రాణాలు తీశారు. ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా..ఎంతమంది ఉగ్రవాదులను హతమార్చిన ఉగ్రవాదం చావదు. దానికి రూపురేఖలుండవు, విలువలుండవు. ఏ పేరు చెప్పుకున్నా మతం ఉండదు..మృత్యువే దాని మతమూ, అభిమతమూ. అందువల్ల ప్రపంచం జాగ్రత్తగా అడుగేయాల్సిన అవసరం ఉందని తాజా ఘటన మరోసారి నిరూపించింది.