"ముందుచూపు" ఫలాలు?
posted on Jul 12, 2016 @ 10:10AM
ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలకు ఎగువన ఉన్న ప్రాణహిత, ఇంద్రావతి నదులు నుంచి భారీ ఎత్తున వరదనీరు వచ్చి చేరుతుండటంతో నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. ఇది మరింత పెరిగితే తదుపరి మజిలి ఉభయగోదావరి జిల్లాలే. వరద నీరంతా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్‌కి చేరితే గోదావరి జిల్లాలు ముంపునకు గురవుతాయి. కానీ అక్కడి జనం కాని..ఏపీ ప్రభుత్వం కానీ ఎలాంటి చీకు చింతా లేకుండా ఉంది దానికి కారణం పట్టిసీమ. ఒకవేళ గోదావరి ఉరకలెత్తితే పట్టిసీమ ద్వారా కృష్ణమ్మను చేరుతుందిలే అన్న ధీమా.
అబ్బా ఏం ప్లానింగ్..ఏం ప్లానింగ్..ఎంతటి ముందుచూపు..ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందుగానే ఊహించి వృథాగా సముద్రంలోకి పోయే నీటిని ఒడిసిపట్టి నీరు లేక ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలకు మళ్లించాలనే ఒకరి తపనకు నిలువెత్తు నిదర్శనం పట్టిసీమ. జలం లేనిదే జనం లేరన్నది జగమెరిగిన సత్యం. భూగ్రహంపై మానవాళి మనుగడకు మూలాధారం నీరని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక మనదేశం ఎన్నో నదీమతల్లులకు నెలవైనా ఆ నీటి గలగలలను ఒడిసిపట్టడంలో ఇప్పటికీ విజయం సాధించలేకపోతున్నాం. అయితే అతివృష్టి..లేదంటే అనావృష్టి..ఇదీ మన దురవస్థ. ఇలాంటి గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే నదుల అనుసంధానమే సరైన పరిష్కార మార్గమంటూ నిపుణులు, మేధావుల నోట వినిపిస్తున్న మాట. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నాళ్లైనా..ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ దిశగా ఒక్క అడుగు పడలేదు. మహామహులు సైతం కొరివితో తలగొక్కోవడం ఎందుకు అని వదిలివేసిన నదుల అనుసంధానాన్ని ఆచరణలో చేసి చూపించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
దక్షిణ భారతదేశంలో అత్యంత నీటి కొరతతో, కరువు కోరల్లో ఉన్న ప్రాంతం రాయలసీమ. అయితే మరో పక్క ఎక్కువ వరదలు వచ్చే ప్రాంతం గోదావరి..ప్రతి సంవత్సరం వరదల కారణంగా 3000 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలోకి వృథాగా పోతున్నాయి. ఇందులో కొంత మొత్తం ఉపయోగించుకున్నా రాయలసీమ కరువు తీరిపోతుంది..అయితే ఎక్కడి గోదావరి జిల్లాలు..ఎక్కడి రాయలసీమ ఇంత దూరానికి నీటిని ఎలా చేరవేయ్యాలి. దానికి సమాధానమే పోలవరం ప్రాజెక్ట్ కుడికాలువ..ఇప్పటికే 70% పూర్తి అయిన కుడికాలువ మిగిలిన భాగాన్ని శరవేగంగా పూర్తి చేసి, గోదావరి నదిని విజయవాడ వద్ద కృష్ణానదితో అనుసంధానం చేసి, రాయలసీమకు నీటి కొరత తీర్చే ఈ బృహత్తర కార్యక్రమంలో తొలి దశను విజయవంతంగా పూర్తి చేశారు సీఎం. ప్రతి సంవత్సరం కృష్ణాడెల్టా రైతుల అవసరం కోసం ప్రకాశం బ్యారేజ్‌కి శ్రీశైలం నుంచి కొంత నీరు వస్తుంది.
ఇప్పుడు గోదావరి నుంచి నీరు వస్తున్నందున శ్రైశైలం, నాగార్జునసాగర్ నీరు కృష్ణా డెల్టా రైతులకు అవసరం ఉండదు. అందువలన ఈ ఆదా అయిన నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు తరలించి, అక్కడి పంటలను బతికించాలన్నది చంద్రబాబు ఆశయం. ఈ మహాక్రతువులో చంద్రబాబు ఎన్నో అటుపోట్లను ఎదుర్కొన్నారు. పట్టిసీమ పేరుతో వందల కోట్లు లూటీ చేసేందుకు సీఎం స్కెచ్ గీశారంటూ ప్రతిపక్షం ఆరోపణలు, పట్టిసీమ పేరుతో జలదోపిడి చేస్తున్నారంటూ పక్క రాష్ట్రం పేచీలు వాటన్నింటిని పరిష్కరించుకుంటూనే చంద్రబాబు చరిత్రను సృష్టించారు. అసాధ్యం అనకున్న దానిని సుసాధ్యం చేశారు. దేశంలోని చాలా రాష్ట్రాలు ఆయన్ను స్పూర్తిగా తీసుకుని తమ తమ రాష్ట్రాల్లో నదుల అనుసంధానానికి ప్రణాళికలు రచిస్తున్నాయి. కాలువలు పారకపోయినా..ఎగువ రాష్ట్రంలోని ఆనకట్టల గేట్లు తెరుచుకోకపోయినా ఏపీకి ఇక దిగులులేదు.