ఉగ్రవాదానికి మతం ఉంటుందా!
posted on Jul 2, 2016 @ 1:07PM
నిఘావర్గాల పుణ్యమా అని హైదరాబాద్ పెను విపత్తు నుంచి తృటిలో బయటపడింది. మారణహోమం తప్పిందంటూ ఊపిరి పీల్చుకుంది. అయినా ఇంకా భాగ్యనగరం బిక్కుబక్కుమంటూనే ఉంది. వరుస పండుగలు, సెలవలని ఉపయోగించుకునేందుకు ఉగ్రవాదులు ఏ మూలన నక్కి ఉన్నారో అంటూ ప్రజలు భయపడుతూనే ఉన్నారు. కానీ ఇదే సమయంలో... ధ్వంసరచనకు పూనుకొన్న ఐఎస్ తీవ్రవాదుల చుట్టూ మతరాజకీయాలు కమ్ముకుంటున్నాయి.
మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ ఒకవైపు ఐఎస్ తీవ్రవాద తీరుని ఖండిస్తూనే, వారికి న్యాయసహాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు. పనిలో పనిగా నిఘావర్గాలు తరచూ అమాయకులైన కుర్రవాళ్లని హింసిస్తోందంటూ దుమ్మెత్తిపోశారు. భారత రాజ్యాంగం ప్రకారం ఎంతటి నేరం చేసినవారికైనా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశం ఉంది. అలా నిరూపించుకునేందుకు వీలుగా ఒక న్యాయవాదిని నియమించుకునే హక్కూ ఉంది. ఒకవేళ వారికి ఆ స్తోమత లేకపోతే ప్రభుత్వమే వారి తరఫున వాదించేందుకు ఓ న్యాయవాదిని నియమిస్తుంది. ఇన్ని హక్కుల మధ్య ఒవైసీ తానే ఆ ముద్దాయిలకి న్యాయం అందించేందుకు ఎందుకు త్వరపడుతున్నారన్నది ప్రశ్న!
ఉగ్రవాదం ఏదో ఒక మతపు రంగుని పులుముకోవచ్చుగాక! కానీ వారికి తన మన అన్న బేధాలు ఉండవు. లేకపోతే రంజాన్‌వంటి పవిత్రమాసంలో పెను విధ్వంసానికి పాల్పడేందుకు ఎందుకు కుట్రపన్నినట్లు? హిందువులని రెచ్చగొట్టి ముస్లింలను బలిచేయాలన్న ప్రణాళికను ఎందుకు రచించినట్లు? ఈ విషయాన్ని కొందరు ముస్లిం పెద్దలు సైతం గ్రహించారు కనుకనే మసీదుల గుండా నిఘావర్గాలు ప్రవేశించేందుకు అనుమతిని ఇచ్చారు. మత ప్రాబల్యం ఉన్న పాతబస్తీలో ఇలాంటి సాయం... నిజంగానే అపురూపం. కానీ కొందరు రాజకీయ నేతలు, పట్టుబడ్డవారు అమాయకులేమో అంటూ ముందుగానే వెనకేసుకు రావడం దురదృష్టకరం.
ఇది కేవలం ఐఎస్ తరహా ఉగ్రవాదానికి సంబంధించిన సమస్య కాదు. గుజరాత్ అల్లర్లు, సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన పేలుళ్లు, మాలేగావ్‌లో జరిగిన బాంబుదాడులు... వంటి సంఘటనల్లో హిందూ తీవ్రవాదులు పాల్గొన్నప్పుడు కూడా ఇలాంటి రాజకీయాలే చోటుచేసుకున్నాయి. సదరు సంఘటనలకి కాంగ్రెస్ ఒకలాగా, బీజేపీ మరొకలాగా స్పందించి ప్రజాస్వామ్యాన్ని ఇరుకున పెట్టాయి. ఇలా ఉగ్రవాదాన్ని మత కోణంలోంచి చూడటం మానుకున్న రోజునే నిందితులకు శిక్ష, నిర్దోషులకు రక్షణ లభిస్తాయి. లేకపోతే రాజకీయ పార్టీలు ఉగ్రవాదాన్ని కూడా అనుకూలంగా వాడుకునే రోజులు దాపురిస్తాయి.
అమెరికా వంటి ఆధునిక దేశాలలోనే తీవ్రవాదం అన్న పేరుతో అన్యమతస్తులను పీడించడం జరుగుతోంది. ఆ దేశ ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టిన వెంటనే బట్టలూడదీసి మరీ తనిఖీలు చేస్తున్నారు. అలాంటి పరిస్థితితో పోల్చుకుంటే మన దేశం చాలా సహృద్భావంగానే వ్యవహరిస్తున్నట్లు లెక్క. ఈ దేశం ఏ ఒక్క మతం వారిదో కాదన్నది భారతీయుల నమ్మకం కాబట్టే, ప్రభుత్వాలు ఉదారంగా ఉన్నా ప్రమాదాలు ముంచుకురావడం లేదు. ఒకవేళ లెక్క తప్పి నిఘావర్గాలు ఎవరనన్నా నిర్దోషిని పట్టుకుంటే గొంతెత్తే అధికారం అసదుద్దీన్ వంటి నేతలకు ఎలాగూ ఉంది. అలాంటప్పుడు ముందుగానే మన దేశ రక్షణ దళాలను ఎందుకు దుమ్మెత్తిపోయడం అన్న ప్రశ్న ఎవరికైనా తట్టక మానదు.