వివాదాల డ్రీమ్‌గాళ్..

  హేమామాలిని..తన నాట్యంతో..అభినయంతో బాలీవుడ్‌ను శాసించి..70 ఏళ్ల వయసులోనూ తరగని అందంతో ప్రేక్షకుల హృదయాల్లో డ్రీమ్‌గాళ్‌గా చెరగని ముద్రవేశారు హేమ. భారతీయ జనతా పార్టీ తరపున రాజ్యసభ సభ్యురాలిగానూ ఎంపికయ్యారు. ఆ తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో మధుర ఎంపీగా ఎన్నికయ్యారు. అంతే కాకుండా జాతీయ ఫిలిం డెవలెప్‌మెంట్ కార్పోరేషన్‌కు ఛైర్‌పర్సన్‌గా కూడా పనిచేశారు. కాని ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. ఇటీవలి కాలంలో హేమామాలిని ప్రవర్తిస్తున్న తీరు ఆమెకు వివాదాలను తెచ్చిపెడుతున్నాయి.     జులై 3, 2015న జైపూర్‌లోని దౌసా ప్రాంతంలో అర్థరాత్రి హేమామాలిని ప్రయాణిస్తున్న బెంజ్ కారు ఎదురుగా వస్తున్న ఓ ఆల్టో కారును వేగంగా ఢీకొట్టడంతో ఆల్టో నుజ్జు నుజ్జయ్యింది. ఆల్టోలో ప్రయాణిస్తున్న హర్ష్ కండేల్వాల్, శిఖా, సీమ, మరో ఇద్దరు చిన్నారులు సోమిల్, సోనమ్ అనే పేర్లు గల ఐదుగురు కుటుంబసభ్యులు చావు బతుకుల మధ్య కొట్టుకుంటున్నారు. ఇక బెంజ్ కారులో ప్రయాణిస్తున్న హేమకు ముఖం మీద గాయాలయ్యాయి. హేమమాలినికి ప్రమాదం జరిగిందన్న వార్త దావానంలా నగరమంతా వ్యాపించింది. ప్రమాద స్థలానికి బీజేపీ నేతలు పరుగు పరుగున వచ్చి ఆమెను ఆస్పత్రికి తరలించి. ఆల్టో కారులో ఉన్నవారిని గాలికొదిలేశారు.  ఆ ఐదురుగు తీవ్రగాయాలతో దాదాపు అరగంటపాటు రోడ్డుమీదనే తమను రక్షించేవారి కోసం ఎదురుచూశారు.   చివరకు కొందరు వారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రికి తీసుకువెళ్లిన కొద్దిసేపటికే సోనమ్ అనే చిన్నారి చనిపోయింది.  ఆ చిన్నారిని రక్షించే అవకాశం ఉండి కూడా హేమ తన ప్రాణం తాను చూసుకున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరగడం..సోషల్ మీడియాలో హేమను విమర్శించడంతో సర్దుకున్న డ్రీమ్‌గాళ్ చనిపోయిన చిన్నారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపింది. కాని అందులో ఎక్కడా తాను తప్పు చేసినట్టు పశ్చాత్తాపం ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదు.     ఆ తర్వాత తన నియోజకవర్గంలోని బాన్సిబట్ అనే గ్రామ పర్యటనకు వచ్చిన హేమమాలిని ఆ గ్రామ సర్పంచ్‌పై నోరు పారేసుకున్నారు. ఆ గ్రామ సర్పంచ్ ప్యూన్‌గా కూడా పనికిరాదని మండిపడ్డారు. అకారణంగా తమను తప్పు పడుతూ అవమానించడంతో హేమమాలిని తీరుకు నిరసనగా ఆ గ్రామస్తులు ఆమె దిష్టి బొమ్మను దహనం చేసి హేమకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడితో ఆగకుండా హేమమాలినిపై పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇన్ని జరిగినా అమ్మగారి తీరు మారలేదు.     మధురలోని జవహర్‌బాగ్ వద్ద ఉన్న 260 ఎకరాల పార్కును రెండేళ్ల క్రితం స్థానికులు అక్రమించుకున్నారు. ఆ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని న్యాయస్థానాల ద్వార ప్రయత్నిస్తున్నప్పటికి సాధ్యం కాలేదు. అయితే నిన్న పోలీసులు ఆ పార్కు వద్దకు వెళ్లగా ఆక్రమణదారులు పోలీసులపై తిరగబడ్డారు. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు కాల్పులు జరిపారు...అయితే ఆందోళనకారుల వద్ద కూడా ఆయుధాలు ఉండటంతో వారు కూడా పోలీసులపై ఎదురుకాల్పులు జరిపారు. ఆ సమయంలో గ్యాస్ సిలిండర్లు పేలడం, కాల్పుల కారణంగా ఎస్పీ సహా 21 మంది పోలీసు సిబ్బంది మరణించారు. పరిస్థితి ఇంత బీభత్సంగా ఉన్నా స్వయంగా ఆ నియోజకవర్గానికి ఎంపీ అయిన హేమ ఆ ప్రాంతాన్ని సందర్శించాల్సింది పోయి..తీరిగ్గా షూటింగ్‌లో పాల్గొన్నారు. పైగా ఆ సమయంలో తాను లాంచీ ఎక్కుతున్న ఫోటోలను మూడింటిని ఆమె ట్వీట్ చేశారు. దీంతో ట్విట్టర్‌ విమర్శలతో దద్దరిల్లిపోయింది. మథుర కాలిపోతుంటే..ఈ సంబరాలు ఏంటంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు. వెంటనే మేల్కొన్న హేమమాలిని..ఆ ఫోటోలను తన ట్విట్టర్ ఖాతా నుంచి తొలగించారు.   పైన జరిగిన అన్ని సంఘటనల్లోనూ హేమమాలిని ఒక సెలబ్రిటీగా..ఘనత వహించిన పార్లమెంట్ మెంబర్‌గా అన్నింటి కన్నా ముఖ్యంగా మామూలు మనిషిగా కూడా విఫలమయ్యారు. హేమ నటించిన సినిమాలు చూసి వాటిని ఆదరించి ఇంతటి స్థాయికి తీసుకెళ్లిన ప్రజలు కష్టాల్లో ఉంటే వారి పట్ల కనీస కృతజ్ఞత లేకపోవడం దారుణం. తమ జీతాలు, తమ బత్యాలు, తమ సౌకర్యాలు, తమ స్వార్థం తప్ప ప్రజల గురించి ఆలోచించని ప్రజాప్రతినిధులు రాజ్యమేలుతున్న మనదేశంలో..ఇక సినీ మాయా ప్రపంచంలోంచి వచ్చిన హేమామాలిని లాంటి వాళ్ల నుంచి ఇంతకంటే మనం ఎక్కువగా ఆశించలేం.

అంతిమ తీర్పు...

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2002 గుల్మర్గ్‌ సొసైటీ ఊచకోత కేసులో అహ్మదాబాద్ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో 24 మందిని న్యాయస్థానం దోషులుగా తేల్చింది. అందులో 11 మందిని హత్యానేరానికి పాల్పడినందుకు భారతీయ శిక్ష్మాస్మృతిలోని సెక్షన్ 302 కింద దోషులుగా నిర్థారించింది. బీజేపీ ప్రస్తుత కార్పోరేటర్ బిపిన్ పటేల్ సహా నిందితుల్లో 36 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. దోషులకు ఎంత శిక్ష విధించాలన్నది జూన్‌ 6న వెలువరించే తీర్పులో న్యాయస్థానం స్పష్టం చేస్తుంది. 66 మంది నిందితుల్లో ఆరుగురు వ్యక్తులు విచారణ కాలంలోనే మరణించారు.   2002 ఫిబ్రవరి 27న గుజరాత్‌లోని గోద్రాలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌కి దుండగులు నిప్పంటించారు. ఈ ఘటనలో 59 మంది సజీవ దహనమయ్యారు. వీరిలో అత్యధికులు అయోధ్య నుంచి వస్తున్న కరసేవకులు. ఈ ఘటన అనంతరం గుజరాత్‌లో పెద్ద ఎత్తున అల్లర్లు చేలరేగాయి. దాడులు, ప్రతిదాడులు, మారణాయుధాలతో వీధుల్లో స్వైర విహారాలు. దహనాలు, లూఠీలు, హత్యలు, మానభంగాలు, సజీవ దహనాలతో 150కి పైగా పట్టణాలు, వేలాది గ్రామాలు అల్లకల్లోలమయ్యాయి. వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేల కోట్ల ఆస్తి బుగ్గిపాలయ్యింది. సరిగ్గా ఆ సమయంలోనే 2002 ఫిబ్రవరి 28న గుల్బర్గ్ సోసైటీ నివాసాలపై అల్లరి మూకలు దాడి చేశాయి. కనిపించిన వారినల్లా నరికేసింది. ఆస్తులను తగులబెట్టింది. అక్కడే నివసిస్తున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహసాన్ జాఫ్రీ పోలీసులకు, రాజకీయ నేతలకు ఫోన్లు చేశారు. అయినా ఎవరి నుంచి స్పందన లేదు. ఇంతలోనే ఆయనను దుండగులు ఇంటి నుంచి బయటకు ఈడ్చుకొచ్చి కత్తులతో నరికి తగులబెట్టారు.   ఈ సంఘటనపై ఎంపీ భార్య జకియా జాఫ్రీ న్యాయం చేయాలంటూ పోరాటానికి దిగారు. దిగువ కోర్టుల్లో నిందితులకు క్లీన్ చీట్ రావడంతో ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీంతో ఈ ఘటనపై విచారణ కోసం సుప్రీం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. సిట్ అందజేసిన నివేదికలో అనేక వాస్తవాలు బయటకు వచ్చాయి. బాధితులు సజీవ దహనం చేయబడ్డారనడానికి అక్కడ లభించిన మృతదేహాలే సాక్ష్యమని, అవన్నీ పూర్తిగా కాలిపోయాయని తెలిపింది. పెట్రోల్ క్యాన్లు, కర్రలు, కత్తులు కూడా ఘటనా స్థలంలో దొరికాయాని, దాన్ని బట్టి అక్కడ మారణ హోమం ఏ స్థాయిలో జరిగిందో వివరించింది. సిట్ నివేదిక ఆధారంగా అహ్మదాబాద్ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ సంఘటనపై అందరూ మొదటగా వేలెత్తి చూపేది ప్రస్తుత ప్రధాని..నాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీనే. అల్లర్లు దావానంలా వ్యాపిస్తున్నా వాటిని ఆయన ఏమాత్రం పట్టించుకోలేదన్నది ప్రధాన అభియోగం. పోలీస్ యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకుని మతోన్మాద శక్తులకు వెన్నుదన్నుగా నిలిచారని, మోడీ అండదండలతోనే అల్లరి మూకలు చెలరేగిపోయాయని ఆయన ఇప్పటికి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.  ఆఖరికి సర్వోన్నత న్యాయస్థానం నియమించిన రాఘవన్ కమిటీ కూడా మోడీని తీవ్రంగా విమర్శించింది. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి పక్షపాతంగా వ్యవహరించారని, ముస్లింలపై దాడులు జరుగుతున్నా వారిని కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని నివేదికలో తెలిపింది.   చివరకు ఇన్నేళ్ల నిరీక్షణ ఫలితంగా తీర్పు వెలువడింది. కాని ఈ తీర్పుపై కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహసాన్ జాఫ్రీ సతీమణి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 36 మందిని నిర్దోషులుగా ప్రకటించడం అన్యాయమని, మనుషుల్ని చంపి, ఆస్తి విధ్వంసానికి పాల్పడ్డవారిని శిక్షించాల్సిందేనని జాకియా అన్నారు. వారు మనుషుల్ని చంపడం తాను కళ్లారా చూశానని ఒక మహిళగా వారిని మరణదండన విధించాలని కోరే సాహసం చేయలేనని, కానీ కఠినశిక్ష విధించాలన్నారు. మొత్తం 400 మంది దాడిలో పాల్గొంటే 24 మందినే దోషులుగా ఎలా నిర్థారించారని జాఫ్రీ కుమారుడు తన్వీర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.   

బంగారు తెలంగాణ సాధన దిశగా...

  తరతరాలుగా సొంత రాష్ట్రం కోసం..స్వపరిపాలన కోసం అస్థిత్వ పోరాటం సాగించిన అనంతరం సాకారమైన 60 ఏళ్ల కల తెలంగాణ వచ్చిన రోజు..అదే జూన్..2. ఇది ఎవరి ఘనతా కాదు..యావత్తు తెలంగాణసాగించిన అపూర్వ పోరాటాల ఫలం..రాష్ట్ర ఏర్పాటును ఓ అనివార్యతగా మార్చేసిన అద్భుతమైన ప్రజాపోరు. నీళ్లు, నిధులు, నియామకాలు, యాస, సంస్కృతుల కోసం సాగించిన అద్వీతీయ ప్రజాందోళన ఇది. నెత్తుటి చుక్క చిందకుండా ఓ లక్ష్యం ముద్దాడిన చరిత్ర ఇది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ మూడో ఏడాదిలోకి అడుగుపెడుతోంది. ఆ సమయంలో తెలంగాణ నినాదాన్ని భుజానికెత్తుకున్న టీఆర్ఎస్‌ పార్టీనే ప్రజలు నమ్మారు. ఉద్యమనాయకుడే..తొలి ప్రభుత్వాధినేత అయ్యారు. ఉద్యమ నాయకుడిగా జనాన్ని నడిపించిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా పాలనలోనూ సరికొత్త పంథాకు శ్రీకారం చుట్టారు. అన్నీ తానై దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో..వారి ఆశలు, ఆకాంక్షలేమిటో తెలిసిన నాయకుడిగా సంక్షేమ పథకాలకు రూపకల్పన చేశారు.   చిన్న రాష్ట్రం ఎన్నటికీ కుదురుకోలేదని..విడిపోతే వికలమైపోతుందనీ..శాంతి భద్రతల నుంచి కరెంట్ కష్టాల వరకు సమస్యలు చుట్టుముట్టి రాష్ట్రంగా మనగలగడమే కష్టమన్న స్థితి నుంచి రాష్ట్రమంటే ఇలా ఉండాలి అనేంతగా కేసీఆర్‌ తెలంగాణను నడిపిస్తున్నారు.  రాష్ట్ర భవిష్యత్‌కు బంగారు బాటలు వెయ్యటంలో పరిణితి చెందిన వ్యక్తిగా రాణిస్తున్నారు. అటు రాజకీయంగానూ, ఇటు పరిపాలనాపరంగానూ తనకు ఎదురులేకుండా చూసుకుంటున్నారు. తెలంగాణ బంగారు తెలంగాణగా మార్చే శక్తి తాగునీరు, సాగునీరుల్లోనే ఉన్నాయని గ్రహించిన గులాబీ దళపతి ఆ దిశగా భారీ బాధ్యతలను నెత్తుకున్నారు. కాకతీయుల కాలంలో కీలకభూమిక పోషించిన చెరువులకు తిరిగి జవజీవాలనివ్వాలనే లక్ష్యంతో మిషన్ కాకతీయ పేరుతో మళ్లీ చెరువులకు పునర్వైభవాన్ని కల్పించేందుకు కష్టపడుతున్నారు. ఈ సారి వర్షాలు సాధారణ స్థాయిలో కురుస్తాయన్న వాతావరణశాఖ అంచనాల నేపథ్యంలో చెరువులన్నీ జలకళను సంతరించుకోనున్నాయి. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచినీరును అందించాలనే లక్ష్యంతో మిషన్ భగీరథ ప్రాజెక్ట్‌ను చేపట్టారు కేసీఆర్. వచ్చే సాధారణ ఎన్నికల నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చి మంచినీళ్లు అందించి ఏ ఆడబిడ్డా నీటి కోసం నెత్తిన బిందె పెట్టుకుని రోడ్డెక్కకూడదన్నది ముఖ్యమంత్రి ఆశయం.   ఐడీహెచ్‌ కాలనీలో పర్యటించిన వేళ పేదవాడి గూడును చూసి చలించిన కేసీఆర్ బడుగుజీవి ఆత్మగౌరవంతో బతకాలని ఆకాంక్షించారు. అందుకే డబుల్ బెడ్‌రూం ఇళ్లను కట్టించి ఉచితంగా అందజేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో శాంతిభద్రతల అంశంపై దృష్టి కేంద్రీకరించి చర్యలు తీసుకున్నారు కేసీఆర్. కొత్త పెట్రోలింగ్ వాహనాలు అందజేసి నేరాల అదుపుకు కృషిచేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా పోలీసులకు , ప్రజలకు మధ్య వారధిగా నిలిచారు. త్వరలో అగ్రరాజ్యాలతో పోటీపడేలా కమాండ్ కంట్రోల్ నిర్మించేందుకు సీఎం శంకుస్థాపన చేశారు. ఆసరా  ఫించన్ల ద్వారా వృద్ధులు, వికలాంగుల కళ్లలో వెలుగులు నింపారు. పేదింటి ఆడపిల్లలకు పెళ్లి చేయ్యాలంటే ఈ రోజుల్లో సాధ్యమయ్యే పనికాదు. అందుకే ఎస్సీ, ఎస్టీ, మైనారిటి యువతుల సంక్షేమం కోసం షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మీ పథకాల ద్వారా పేద తల్లిదండ్రుల భారం తనదిగా భావించి తండ్రిగా మారారు. శిశు మరణాల రేటును తగ్గించేందుకు కేసీఆర్ నడుం బిగించారు. గతంలో శిశు మరణాల రేటు ప్రతి వెయ్యి జననాలకు 38 మరణాలుగా ఉండగా ఇప్పుడది 28కి తగ్గింది. రాష్ట్రంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి ప్రారంభించింది.   హాస్టల్‌లో చదువుకునే విద్యార్థులకు ఇది వరకు ముక్కిపోయిన బియ్యం, రేషన్ బియ్యాన్ని భోజనంగా పెట్టేవారు. కాని కేసీఆర్ ఈ పరిస్థితిని మార్చాలనుకున్నారు. నా మనవడు ఏ బియ్యం తింటాడో అదే బియ్యం హాస్టల్ బిడ్డలకు పెట్టాలని అధికారులను ఆదేశించారు. దేశంలోనే తొలిసారిగా సన్నబియ్యంతో హాస్టల్ విద్యార్థులకు అన్నం పెట్టిన ఘనత దక్కించుకుంది తెలంగాణ. ఏ రాష్ట్రానికైనా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లలాంటివి. సంక్షేమాన్ని విజయవంతంగా అమలు చేసిన కేసీఆర్ ఆర్థికాభివృద్ధిపైనా దృష్టిపెట్టారు. తెలంగాణ ఉద్యమ కాలంలో హైదరాబాద్‌కు రావాల్సిన వివిధ సంస్థలు, ఇక్కడున్న పరిస్థితితో ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లిపోయాయి. మళ్లీ ప్రశాంత వాతావరణాన్ని కల్పించాలని కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఊతమివ్వడంతో పాటు ఉపాధి కల్పన లక్ష్యంగా నూతన పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్‌కు రూపకల్పన చేసింది కేసీఆర్ ప్రభుత్వం. 2014 నవంబర్ 27న టీఎస్ ఐపాస్‌కు చట్టబద్ధత కల్పించారు. దరఖాస్తు చేసుకున్న పక్షం రోజుల్లోనే పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులన్నీ ఇచ్చేలా సింగిల్ విండ్ విధానాన్ని బలోపేతం చేస్తూ నూతన విధానాన్ని ప్రతిపాదించారు. ఈ విధానం ద్వారా ఇప్పటి వరకు రూ.35 వేల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది.   వినూత్న ఆలోచనలతో ముందుకు వచ్చే ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు టీ-హబ్ పేరిట దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌కు కేసీఆర్ రూపకల్పన చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశాల్లో పర్యటించి అక్కడి పారిశ్రామిక వేత్తలతో చర్చలు జరిపి వారిని తెలంగాణలో పెట్టుబడులు పెట్టేవిధంగా ఒప్పించారు. ఆయన కృషి ఫలితంగా గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆమెజాన్, ఫేస్‌బుక్, ఆపిల్ వంటి ఐటీ దిగ్గజాలు తమ కార్యకలాపాలకు కేంద్రంగా హైదరాబాద్‌ను ఎంచుకున్నాయి. పాలనలో టెక్నాలజీకి పెద్ద పీట వేస్తూ ఫైబర్ గ్రిడ్, రాష్ట్ర వ్యాప్తంగా 4జీ సేవలు, ముఖ్య నగరాల్లో వైఫై సేవలు, ఈ-గ్రామ పంచాయతీలు, పాఠశాలల్లో కంప్యూటర్ విద్య తదితరాలకు పెద్దపీట వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ ఉద్యమ నినాదంలో అత్యంత కీలకమైన నియామకాలపై కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా ఇప్పటికే సింగరేణి, ట్రాన్స్‌కో, జెన్‌కోలతో పాటు రాష్ట్ర పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేశారు. ఈ ఏడాది మరి కొన్ని ఖాళీలను భర్తీ చేసేందుకు ఆదేశాలిచ్చారు.   మరోపక్క చాలి చాలని జీతాలతో బతుకు బండిని ఈడుస్తున్న ప్రభుత్వోద్యోగులకు భారీగా ఫిట్‌మెంట్ పెంచి వారి జీతాలను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానం చేశారు. తెలంగాణ వస్తే అంధకారమవుతుందనే అపోహల్ని పటాపంచలు చేసేందుకు కేసీఆర్ తన తొలి ప్రాథాన్యతను విద్యుత్ రంగానికే ఇచ్చారు. కొత్త ప్రాజెక్ట్‌లు, విద్యుత్ కొనుగోళ్లతో రాష్ట్రానికి నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేస్తున్నారు. ఇలా ప్రతీ రంగంలోనూ కేసీఆర్ అన్నీ తానై వ్యవహరిస్తూ బంగారు తెలంగాణ  సాధన దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఆయన కృషి ఫలించాలని ఆకాంక్షిస్తూ..తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.

ఆ 18 మంది జవాన్లు బలి కాకుంటే..

ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్దదైన పుల్గావ్‌ ఆయుధాగారంలో సంభవించిన ఘోర ప్రమాదంలో 18 మంది జవాన్లు బూడిద కుప్పగా మారారు. వీరిలో ఇద్దరు అధికారులతో పాటు 16 మంది సిబ్బంది ఉన్నారు. వీరంతా ప్రమాదంలో మరణించిన వారు కాదు..ఆ ప్రమాదం మరింత పెద్దది కాకుండా చేసే ప్రయత్నంలో మరణించినవారు. పుల్గావ్ ఆయుధాగారం భారత్‌లోనే అతిపెద్దది. నాగ్‌పూర్‌కు 115 కి.మీల దూరంలో ఉన్న ఈ కేంద్రం భారతసైన్యానికి అత్యంత ముఖ్యమైన ఆయుధాగారాల్లో ఇది ప్రత్యేకం. దీంట్లో  ఏకే 47లు, బ్రహ్మోస్ క్షిపణులు, గ్రెనేడ్లు, బాంబుల వంటి శక్తివంతమైన ఆయుధాలు నిల్వ ఉంచుతారు. దేశవ్యాప్తంగా వివిధ ఆయుధ కర్మాగారాల్లో తయారైన ఉత్పత్తులను ఇక్కడికి తీసుకువచ్చిన తర్వాతే ఇతర ప్రాంతాలకు పంపిణీ చేస్తారు. ఏడువేలకు పైగా ఎకరాల్లో  విస్తరించి ఉన్న ఈ ఆయుధాగారంలో మొత్తం పది షెడ్లు ఉంటాయి.   సోమవారం అర్థరాత్రి దాటిన తరువాత అత్యంత సున్నితమైన మందుగుండు సామాగ్రి ఉన్న ఒక షెడ్డులో మంటలు చెలరేగాయి. మంటల ధాటికి ఒకదాని తర్వాత ఒకటిగా అనేక వరుస పేలుళ్లు చోటు చేసుకున్నాయి. పేలుడు ఘటనలో మోటర్ షెల్స్, స్లింటర్స్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలపై వర్షం కురిసినట్టు పడ్డాయి. అర్థరాత్రి దాటిన తర్వాత..జనం గాఢనిద్రలోకి జారుకుంటున్న వేళ బాంబుల మోతతో ఏం జరుగుతోందో తెలియక ఆయా గ్రామాల ప్రజలు ప్రాణాలరచేత బట్టుకుని బయటకు పరుగులు తీశారు. భూకంపం వచ్చిందా..? ప్రళయం ముంచుకొచ్చిందా అన్నంత తీవ్రమైన శబ్ధాలతో పేలుళ్లు సంభివించడంతో పిల్లలు, వృద్ధులు, మహిళలు భయాందోళనలకు గురయ్యారు.   నెమ్మదిగా మంటలు ఇతర షెడ్డుల్లోకి వ్యాపించడాన్ని పసిగట్టిన సైనికులు అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది, క్విక్ రియాక్షన్ టీమ్‌లు వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపు చేసే వ్యవస్థలను యాక్టివేట్ చేశారు. మరోవైపు ఎగిసిపడుతున్న మంటల నుంచి విలువైన ఆయుధసంపత్తిని కాపాడే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో సైనికాధికారులు లెఫ్టినెంట్ కల్నల్ ఆర్.ఎస్.పవార్, మేజర్ మనోజ్ కుమార్ మృత్యువాతపడ్డారు. ఈ ప్రయత్నంలో మరో 16 మంది జవాన్లు కన్నుమూశారు.   ప్రాణాలను పణంగా పెట్టి వీరు చేసిన ప్రయత్నాల వల్లే మంటలు ఇతర షెడ్లకు వ్యాపించలేదు. రెప్పపాటులో ప్రాణాలు పోతాయని తెలిస్తే మనిషి అటువైపు వెళ్లడు. కాని చెవులు సైతం చిల్లులు పడే శబ్థాలొస్తున్న సమయంలో..మృత్యుదేవత తన పంజా విసరడానికి సిద్థంగా ఉన్న తరుణంలో దేశ రక్షణే పరమావధిగా అక్కడ విధులు నిర్వహిస్తున్న సైన్యానికి ఈ మంటలు ఎక్కువైతే ఏం జరుగుతుందో బాగా తెలుసు, అంతే ఏ మాత్రం ఆలోచించకుండా మంటల్లో దూకారు. వారు తమ ప్రాణాల్ని కాపాడుకోవడానికి చూసుంటే భారతదేశ పటంలో మహారాష్ట్ర మాయమైపోయేది. ఎందుకంటే మంటలు వ్యాపించిన షెడ్డును అనుకుని ఉన్న షెడ్డులో క్షణాల్లో ఒక దేశాన్ని నాశనం చేయగల "బ్రహ్మోస్" వంటి క్షిపణులు నిల్వ చేసి ఉన్నాయి. ఏ మాత్రం అటు ఇటైనా జరిగే నష్టం ఊహకు కూడా అందదు. ఆ 18 మంది జవాన్ల బలిదానం కారణంగా మహా విధ్వంసం త్రుటిలో తప్పిపోయింది. దేశరక్షణ కంటే సైనికులకు ఏది ఎక్కువ కాదనడానికి ఇదోక నిదర్శనం. ఈ సందర్భంగా ఆ అమరులకు నివాళులర్పిద్దాం..జై హింద్.

ప్రాణానికి "పొగ" సెగలు...

  చూడటానికి అది చేతి వ్రేలంత లేని చిన్న కాగితపు గొట్టం..కాని దానిని పట్టుకున్న వాడికి తెలియదు ఆ గొట్టంలోంచే ప్రాణం పోతుందని. అది తనతో పాటు ఇంటిని కబళలిస్తుందని. చుట్ట, బీడీ, హుక్కా ఇలా తన భిన్న రూపాలతో పొగాకు మనిషి ప్రాణాన్ని హరించేస్తోంది. నేడు"ప్రపంచ నో టొబాకో డే"సందర్భంగా పొగాకు దుష్పరిణామాలపై అవగాహన కోసం ప్రత్యేక కథనం  పొగ అన్న పదానికి మన పురాణాలు, శాస్త్రాలు పవిత్రతను ఆపాదించాయి. ఎందుకంటే యజ్ఞాలు, యాగాలు జరిగేటప్పుడు హోమగుండంలోంచి వెలువడే పొగకు శక్తి ఉంటుందని దానిని పిలిస్తే ఆరోగ్యానికి మంచిదని మన పూర్వీకులు విశ్వసించారు. కాని భారతదేశంలోకి పోర్చుగీసు వారి రాకతో పొగాకు అనేది మనదేశంలోకి అడుగుపెట్టింది. ఈ ధూమపానం తరతరాలుగా మనతో పాటే వస్తుంది. తండ్రికి సిగరెట్ తాగే అలవాటు ఉంటే పిల్లలకు కూడా అలవాటయ్యే అవకాశాలెక్కువ. పొగాకు అలవాటయ్యేలా ప్రోత్సహిస్తున్నది నికొటిన్. రుచికరమైన వంటకం మళ్లీ మళ్లీ తినాలని ఎలా కోరుకుంటామో సిగరెట్ కూడా అలాంటిదే. పొగ పీల్చగానే..నికొటిన్ ఊపిరితిత్తుల నుంచి చాలా వేగంగా రక్తంలో కలిసి, 10-16 సెకన్లలోనే మెదడును చేరుతుంది. వెంటనే శరీరానికి కొత్త ఉత్సాహం ఆవరించినట్లుంటుంది. అయితే ఈ నికొటిన్ ఒంట్లో ఎక్కువసేపుండదు. దీంతో మళ్లీ నికొటిన్ కోసం తహతహ, సిగరెట్ తాగాలన్న కాంక్ష బయల్దేరతాయి. దీంతో ఏ పనిలో ఉన్నా పక్కన పెట్టి పొగ కోసం వెదుక్కుంటారు. ఈ విధంగానే మనిషి పొగాకుకు బానిసవుతాడు.   చిన్నపుడు తండ్రిని చూస్తూ పెరగడం..యవ్వనంలో స్నేహితుల వల్ల ఒకసారి పొగ తాగి చుద్దామన్న ఆసక్తి రేగుతుంది. నేటి యువతకు పొగ తాగడం ఒక ఫ్యాషన్. పొగ తాగడం వల్ల ఎలాంటి కీడు జరుగుతుందో తెలిసి కూడా తక్కువగా తాగితే ఏ ప్రమాదం లేదని భావించడం వల్ల తాగుతున్నవారు ఎక్కువ. పొగ తాగినప్పుడు అది మన వూపిరితిత్తుల్లోకి మాత్రమే వెళుతుందని, దీంతో మహా అయితే దగ్గు వస్తుందనీ చాలా మంది భావిస్తుంటారు. కాని ఇది పెద్ద అపోహ. ఊపిరితిత్తుల్లోకి వెళ్లే పొగ అక్కడి నుంచి రక్తంలో కలిసి శరీరంలోని ప్రతీ అవయవాన్నీ చేరి లోలోపలి దేహాన్ని నిర్వీర్యం చేస్తుంది. మనం కళ్లు తెరిచే లోపల జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. దీని వల్ల గుండెపోటు, అల్సర్లు, చర్మ సంబంధ సమస్యలు, ఎముకలు పెళుసుగా మారడం, క్షయ, నోటీ, గొంతు క్యాన్సర్, వినికిడి, చూపు కోల్పోవడం, సంతానలేమి ఇలా టాప్ టూ బాటమ్ శరీరం మొత్తంపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపుతుంది పొగ.   ప్రపంచం సంగతి ఎలా ఉన్నా పొగాకు వినియోగంలో ఇండియా మూడోస్థానంలో ఉంది. రానున్న కాలంలో ఇది మరింత పెరిగే అవకాశం ఉండటంతో 2020 నాటికి దేశంలో భారీ ధూమపాన మరణాలు సంభవించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎవడి జీవితం వాడి ఇష్టం ఎమైనా చేసుకోవచ్చు. కాని పక్కవాడి ప్రాణాన్ని తీసే హక్కు మాత్రం ఎవరికి లేదు. పొగతాగే వారి కంటే దానిని పీల్చేవారికే ఎక్కువ ప్రమాదకరం. పొగ తాగిన వ్యక్తి విడిచిన పొగ ఆ పరిసర ప్రాంతమంతా పొగ అవరిస్తుంది. ఇది నేరుగా వారి శరీరాల్లోకి వెళ్లి ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుంది.   ప్రభుత్వం పొగాకు వినియోగంపై అనేక కఠినమైన చట్టాలు తీసుకువచ్చినప్పటికి ఆచరణలో మాత్రం అమలుకు నోచుకోవడం లేదు. 18 ఏళ్లలోపు పిల్లలు పొగతాగరాదని, వారికి పొగాకు ఉత్పత్తులు విక్రయించరాదని నిబంధనలు ఉన్నాయి. గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు హుక్కాను నిషేధించాయి. ఆ మధ్య సిగెరెట్లను లూజ్‌ సెల్స్ అమ్మరాదని..ప్యాకెట్లతోనే అమ్మాలని కేంద్రప్రభుత్వం ఆదేశించింది. అయితే ఈ ప్రయోగం ఆశించినంత స్థాయిలో విజయవంతం కాలేదు. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా సిగరెట్‌ మానడం..మానకపోవడం మన చేతుల్లోనే ఉంటుంది. మీరు పొగే కదా అని తేలిగ్గా అనుకోకండి..మీ మీదే ఆశలు పెట్టుకుని జీవించే మీ కుటుంబం గురించి..మీ తల్లిదండ్రుల గురించి ఒక్కసారి ఆలోచించండి. సంకల్పంతో ఈ మహమ్మారి నుంచి బయటపడండి.

నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల " కుప్ప"

నీళ్లు నకిలీ..పాలు నకిలీ..తినే తిండి నకిలీ ఇలా దేశం "నకిలీ భారతం" అయిపోయింది. ఒరిజనల్‌ను అచ్చుగుద్దినట్టు దించేయడంలో మనవాళ్లు ఎక్స్‌పర్ట్స్‌ అని ప్రపంచం మొత్తానికి తెలుసు. ఒక్క పాలు, నీళ్లే కాదు, సర్టిఫికేట్లు, పాస్‌పోర్ట్‌లు ఇలా ఒక్కటేంటి అన్నిటా నకిలీ..నకిలీ . ఇప్పుడు ఈ కోవలోకి నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌లు వచ్చి చేరాయి. ఈ మాట ఏ సర్వేలోనో తేలింది కాదు. సాక్షాత్తూ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నోటి వెంట వచ్చిన మాటలు. దేశంలోని డ్రైవింగ్ లైసెన్స్‌ల్లో మూడింట ఒక వంతు నకిలీవేనట. 18 కోట్లకు పైగా లైసెన్స్‌లను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం ..ఇందులో 5.4 కోట్ల లైసెన్స్‌లు నకిలీవేనని తేల్చింది.   మనదేశంలో డ్రైవింగ్ లైసెన్స్‌‌లు పొందటం చాలా సులభం. డ్రైవింగ్ రాకపోయినా పర్వాలేదు పచ్చనోటు ఉంటే చాలు లైసెన్స్‌ వచ్చేస్తుంది. రాజకీయ నాయకులో..సెలబ్రిటీలో అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్టీఏ ఆఫీసులకు వెళ్లాల్సిన పని కూడా లేదు.  లైసెన్స్ నేరుగా మీ ఇంటికే వస్తుంది.  లైసెన్స్‌ కోసం చాలా మంది బ్రోకర్లపై ఆధారపడుతుంటారు. ఆర్టీవో కార్యాలయం చుట్టూ తిరగటం ఇష్టం లేనివారు, సమయం దొరకని వాళ్లు, లైసెన్స్ ఎలా పొందాలో తెలియని వాళ్లు అనేక మంది మధ్యవర్తులను ఆశ్రయిస్తుంటారు. వీరు ప్రజల అమాయకత్వాన్ని, అవసరాన్ని సొమ్ము చేసుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. రవాణా శాఖ అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్న కొంతమంది " బ్రోకర్లు " కేవలం గంటల వ్యవధిలోనే లైసెన్స్‌లు ఇప్పిస్తున్నారు.   లైసెన్స్ వచ్చిందన్న ఆనందంలో అది అసలుదో..నకిలీదో తెలుసుకునే ప్రయత్నం గాని అవసరం గాని మన జనానికి లేదు. ఒకే సంఖ్యతో కూడిన లైసెన్స్‌లను వివిధ దరఖాస్తుదారులకు జారీ చేసిన సందర్భాలు కూడా ఉన్నట్లు ప్రభుత్వ అధ్యయనంలో వెల్లడైంది. చట్టాల ఉల్లంఘన, ఏజెంట్లు చేసే మోసం, సక్రమంగా లేని ఆర్టీవో డేటాబేస్‌ల కారణంగా డూప్లికేట్ లైసెన్స్‌ల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నట్టు తెలుస్తోంది. దేశంలోని వివిధ రవాణా శాఖ మంత్రులతో ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశంలో నితిన్ గడ్కరీ బోగస్ లైసెన్స్‌ల విషయంలో ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌లు, రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు త్వరలోనే రోడ్డు రవాణా, భద్రత బిల్లును అమలు చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.  ఏటా రోడ్డు ప్రమాదాల్లో 1.5 లక్షల మంది మరణిస్తున్నారని ఆయన అన్నారు. ఈ బిల్లు ద్వారా రోడ్డు రవాణా వ్యవస్థనే సమూలంగా ప్రక్షాళన చేయవచ్చని గడ్కరీ తెలిపారు.   అయితే నకిలీ లైసెన్స్‌లతో పట్టుబడిన వారిపై ప్రస్తుతం విధిస్తున్న శిక్షలు ఏ మాత్రం కఠినంగా లేకపోవడంతో పరిస్థితిలో మార్పు రావడం లేదు. ప్రస్తుతానికి బోగస్ డ్రైవింగ్ లైసెన్స్‌లు కలిగిఉన్న వారిపై రూ.500 పెనాల్టీతో పాటు గరిష్టంగా మూడు నెలల జైలుశిక్ష విధిస్తున్నారు.  త్వరలో జరిమానాను రూ.10 వేలకు, శిక్షా కాలాన్ని గరిష్టంగా ఏడాదికి పెంచనున్నారు. ఒక వేళ బాలలు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే వాహన యజమాని లేదా ఆ బాలుడి సంరక్షకులపై గరిష్టంగా రూ. 20 వేల జరిమానాతో పాటు మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించనున్నారు. అంతేకాదు వాహన రిజిస్ట్రేషన్‌ను సైతం రద్దు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది.

"అన్న"గారి గుర్తులు...

ఒక్కడు.. ఒకే ఒక్కడు..మేరునగధీరుడు..యుగపురుషుడు..యుగానికి ఒక్కడు. మదరాసీలుగా పిలుస్తున్న తెలుగువారికి ఓ ప్రత్యేక ఆస్తిత్వం ఉందని జగతికి చాటిన మహానీయులు..ఏళ్లకు ఏళ్లు ఏకఛత్రాధిపత్యం కింద పాలిస్తున్న కాంగ్రెస్‌ కంచుకోటను బద్ధలు కొట్టిన వ్యక్తి..పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారం అందిపుచ్చుకున్న శక్తి. ఆయనే తెలుగువారి ఇలవేల్పు నందమూరి తారకరామారావు. సినీనటుడిగా, ముఖ్యమంత్రిగా  ఆయన తెలుగువారిపై వేసిన ముద్ర ఎప్పటికి చెరిగిపోనిది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందరో ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పాలించినా..పాలిస్తున్నా ఎన్టీఆర్ ఈజ్ ఒన్ అండ్ ఓన్లీ. సంక్షేమ పథకాలతో ప్రభుత్వాన్ని పేదవారికి దగ్గర చేసినా..రాజకీయాలంటే ఇలా ఉంటాయని తెలియజేసినా అది తారక రాముడికే చెల్లింది. తెలుగునేలపై ఆయన జ్ఞాపకాలు ఎన్నటికి పదిలం. అన్నగారి జయంతి సందర్భంగా ఆ జ్ఙాపకాల్లో మచ్చుకు కొన్ని.   1. రెండు రూపాయలకే కిలో బియ్యం   అన్నగారి పేరు తలచుకోగానే ముందుగా గుర్తొచ్చే పథకం ఏమైనా ఉందా అంటే అది రెండు రూపాయలకే కిలో బియ్యం. దీని ద్వారా ఎంతోమంది నిరుపేదలకు నాలుగువేళ్లూ లోపలికి వెళ్లి ప్రజల దృష్టిలో ఎన్టీఆర్ దేవుడయ్యారు. తద్వారా దేశంలోని చాలా మంది ముఖ్యమంత్రులకు మార్గదర్శకుడయ్యారు.   2. జనతా వస్త్రాలు   చేనేత కార్మికుల కష్టాలను తీర్చడం, పేదలకు సగం ధరకే వస్త్రాలను అందించడానికి ఎన్టీఆర్ ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఈ పథకాన్నే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు పున:ప్రారంభించారు   3.  పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు   నిజాం నుంచి స్వాతంత్ర్యం పొంది భారతదేశంలో భాగమైనా కాని తెలంగాణ ప్రజలకు పటేల్, పట్వారీల నుంచి ఇబ్బందులు తప్పలేదు. రామారావు అధికారంలోకి వచ్చిన వెంటనే 1985లో పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసి తెలంగాణ ప్రజలకు నిజమైన స్వాతంత్ర్యాన్ని తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్.     4. మహిళలకు ఆస్తిలో వాటా   స్త్రీలకు ఆర్థిక స్వాతంత్ర్యం లభించనంత వరకూ వారి జీవితాల్లో ఎలాంటి మార్పు ఉండదని నమ్మి..మహిళలకు ఆస్తిలో సమానవాటా ఇవ్వాలి అని చట్టం తెచ్చి మొత్తం ఆడపడుచులకు అన్నగారయ్యాడు.   5. ట్యాంక్ బండ్   అనేక రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన తెలుగు ప్రముఖుల గురించి ముందు తరాల వారికి తెలియజేయాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ ట్యాంక్‌బండ్‌లో వారి విగ్రహాలను ఏర్పాటు చేసి భాగ్యనగరానికి కొత్తకళను తీసుకువచ్చారు.   6. హుస్సేన్‌సాగర్‌లో బుద్ద విగ్రహాం   హైదరాబాద్‌కు సహాజ అందాన్ని తీసుకువచ్చే హుస్సేన్‌సాగర్‌కు మరింత వెలుగులు తీసుకురావడానికి బుద్ధపూర్ణిమ ప్రాజెక్ట్‌ పేరిట కార్యక్రమాన్ని చేపట్టి ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి హుస్సేన్‌సాగర్ మధ్యలో బుద్దుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న గౌతమ బుద్ధుని ఏకశిలా విగ్రహాం ఇదొక్కటే.   7 సంపూర్ణ మద్యపాన నిషేధం   మద్యపానంతో కుటుంబాలు ఎలా విచ్ఛిన్నమవుతాయో ప్రత్యక్షంగా తెలుసకున్న ఎన్టీఆర్ 1994 ఎన్నికల్లో తాను అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తానని ప్రకటించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ఐదు నిమిషాల్లోనే మద్యపాన నిషేధం బిల్లుకు సంబంధించిన ఫైలుపై సంతకం పెట్టి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. దీనిని పకడ్బందీగా అమలుపరచడానికి రాష్ట్రం నలుమూలలా చెక్‌పోస్ట్‌లతో మొత్తం ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌ను అప్రమత్తం చేశారు.   8. తెలుగుగంగ ప్రాజెక్ట్   రాయలసీమ సాగునీటి అవసరాలతో పాటు చెన్నై వాసుల దాహార్తిని తీర్చేందుకు ఎన్టీఆర్ నిర్ణయానికి ప్రతిరూపమే తెలుగుగంగ   9.  తెలుగువిశ్వవిద్యాలయ స్థాపన   తెలుగుభాష, సాహిత్య సాంస్కృతిక అభివృద్ధి కోసం ఒక ప్రభుత్వ సంస్థ ఉండాలనే తపనతో తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు ఎన్టీఆర్. అంతేకాకుండా బోధన, పరిశోధనల నిమిత్తం రాజమండ్రి, శ్రీశైలంలలో ప్రాంగణాలు నెలకొల్పి, మూడు ప్రాంతాలను సమదృష్టితో వికాసపరచాలనే ముందుచూపు ఎన్టీఆర్‌కే సాధ్యం.   10.  ఎంసెట్     మొత్తం విద్యావిధానాన్ని ప్రక్షాళన చేసి. ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశానికి గాను ప్రత్యేక ప్రవేశ పరీక్షా విధానానికి నాంది పలికారు. ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎంసెట్)ను ప్రవేశపెట్టింది అన్నగారే. దీనిలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా విద్యార్థులు, తమకు నచ్చిన ఏ కాలేజీలోనైనా చేరే వెసులుబాటును కల్పించారు. 11.  నేషనల్ ఫ్రంట్   కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా దేశంలోనే ఎదురు నిలచిన వ్యక్తి ఎన్టీఆర్. ప్రాంతీయ శక్తులన్నింటిని ఏకం చేసి నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి కేంద్రంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఆయనదే   12 . శాసనమండలి రద్దు   శాసనమండలి వల్ల ఖజానాపై భారం తప్ప ప్రజలకు ఒరిగేదేమి లేదని భావించిన ఎన్టీఆర్. ఒకే ఒక్క కలం పోటుతో ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని రద్దు చేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు.   పైన చెప్పినవే కాకుండా తెలంగాణ ఉద్యోగుల కోసం 610 జీవో, మండల వ్యవస్థ, ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం, జోగిని దురాచార నిర్మూలన,  గరిష్ట భూపరిమితి చట్టం, లోకాయుక్త ఏర్పాటు, నేత వృత్తుల వారికీ ఆప్కోద్వారా భద్రత, మత కల్లోలాల అణిచివేత , శాంతి భద్రతల రక్షణ వంటి పలు కార్యక్రమాలతో ఎన్టీఆర్ పాలన రామరాజ్యాన్ని తలపించింది.

బెజవాడలో "రెంట్" మంటలు...!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల్లో అద్దెలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి ఫైరయ్యారు. ప్రజలపై అద్దెల భారం పెంచి ఇబ్బంది పెడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. తన పాలనను హైదరాబాద్ నుంచి విజయవాడకు మార్చినప్పటి నుంచి పలు సందర్భాల్లో రాజధాని వాసులకు అద్దెపై ప్రేమ ఎక్కువని దానిని వీడాలని చెప్పుకుంటూ వచ్చారు. విజయవాడ వాసులది సంకుచిత మనస్తత్వమని..వీరు ప్రపంచమంతా వెళ్లి వ్యాపారాలు చేస్తుంటారు. కానీ సొంత ప్రాంతం వచ్చేసరికి సంకుచితంగా ఆలోచిస్తారని సాక్షాత్తూ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. బెజవాడ, గుంటూరు ప్రజలు తాత్కాలిక ప్రయోజనాలను వెతుక్కోవద్దని హితవు పలికారు. చిన్న చిన్న స్వార్థాలను వదులుకోకపోతే నష్టపోవాల్సి వస్తుందని అన్నారు. అయినా ఇక్కడి ప్రజల ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడం..సచివాలయ ఉద్యోగులు విజయవాడ వచ్చేందుకు అద్దెను కారణంగా చూపుతుండటంతో సీఎం "రెంట్‌పై" ఫోకస్ చేశారు.   బెజవాడలో ఈ పరిస్థితి ఇప్పుటికిప్పుడు వచ్చింది కాదు. రాష్ట్ర విభజనకు పూర్వం నుంచే రాజకీయ, విద్యా, వైద్య, సాంస్కృతిక, వాణిజ్య, రవాణా రంగాలకు బెజవాడ కేంద్రం. నిత్యం ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు వివిధ వ్యాపారాల నిమిత్తం తరలివస్తుంటారు. వన్‌టౌన్‌లో వస్త్ర, బంగారం, బెనిటిక్స్‌ తదితర వ్యాపారం బాగా జరుగుతుంది. దీంతో రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా ఉపాధి నిమిత్తం బెజవాడ బాట పడుతుంటారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ వసతి నిమిత్తం అద్దె ఇళ్లే శరణ్యం. మొదట్లో కాస్త తక్కువగానే ఉన్న అద్దెలు రియల్ బూమ్ పెరగడం, అద్దెను వ్యాపార కోణంలో చూడటంతో కాలక్రమేణా పెరుగుతూ వచ్చాయి. అప్పట్లో ఒక కుటుంబానికి అద్దె ఇళ్లు కావాలంటే కనీసం రూ.6 వేల నుంచి 10 వేలను నెల అద్దెగా చెల్లించుకోవాలి.   కాని రాష్ట్ర విభజన జరగడం..అమరావతిని రాజధానిగా..విజయవాడను తాత్కాలిక రాజధానిగా నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో నవ్యాంధ్రలో బెజవాడ, గుంటూరులు కీలక నగరాలుగా మారడంతో అద్దెలు భారీగా పెరిగిపోయాయి. ఒక జాతీయ సంస్థ సర్వే ప్రకారం ఈ రెండు నగరాల్లో అద్దెలు కనీసం 25 వేల నుంచి 30 వేల వరకు పెరిగిపోయాయి. దీనికి తోడు ఇంటిపన్ను, నీటిపన్ను, కరెంట్ చార్జ్ అదనం. ఇలాంటి పరిస్థితుల్లో జూన్ 27లోగా ఏపీ సచివాలయ ఉద్యోగులు అమరావతికి తరలిరావాల్సిందేనని సీఎం చంద్రబాబు తేల్చిచెప్పారు. అయితే హైదరాబాద్‌ను వదులుకోవడానికి సిద్ధపడ్డ ఉద్యోగస్తులకు విజయవాడ అద్దెలు వణికిస్తున్నాయి. ఈ రెండు నగరాల్లో అద్దెలు, హైదరాబాద్‌లో సంపన్నులు నివసించే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలను మించిపోయాయని సాక్షాత్తూ ఏపీ సర్కార్ నియమించిన కమిటీ ప్రభుత్వానికి తెలిపింది.   రాజధానికి చుట్టుపక్కల 20 కిలోమీటర్ల పరిధి వరకూ సింగిల్ బెడ్ రూం రూ.15 వేలు, డబుల్ బెడ్‌రూం రూ.18 వేల నుంచి రూ. 25 వేల వరకూ ఉన్నాయని ఈ కమిటీ గుర్తించింది. ఒకవేళ ప్రభుత్వమే కల్పించుకుని ఉద్యోగులకు వసతి సౌకర్యాలు కల్పించాలన్నా ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పరిస్థితి లేదని వెల్లడించింది. ఈ నేపథ్యంలో జూన్ 27 సమీపిస్తుండటంతో ఉద్యోగుల తరలింపు, వసతి, ప్రభుత్వ కార్యాలయాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. దీనిలో అద్దె అంశం వచ్చింది..గతంతో పోలిస్తే అద్దెలు విపరీతంగా పెరిగాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకురావడంతో ఆయన అగ్గిమీద గుగ్గులమయ్యారు. ఇకపై దీనిని ఉపేక్షించేది లేదని అద్దెనియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మరి సీఎం చర్యలు విజయవాడ, గుంటూరుల్లో అద్దెలు తగ్గించగలుగుతాయా..? బాబు ఆవేదనను ప్రజలు అర్థం చేసుకుంటారా..?

కొంచెం తీపి..కొంచెం చేదు

సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజున ఒక ఛాయ్ వాలా భారతదేశ భవితను నిర్దేశించేందుగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టాడు. ఆయనే నరేంద్ర దామోదర్‌దాస్ మోడీ. అప్పటికే పీకల్లోతు అవినీతి ఆరోపణలు, కుంభకోణాలతో దేశ ప్రతిష్టను మంట గలిపిన కాంగ్రెస్‌పైన కోపంతో సంకీర్ణ ప్రభుత్వాలు తప్న దేశానికి సుస్థిరమైన ప్రభుత్వం వచ్చే అవకాశమే లేదని అందరూ నమ్ముతున్న దశలో మోడీకి స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టారు ప్రజలు. మరి ఎంతో నమ్మకంతో ఓట్లేసి గెలిపించుకున్న మోడీ, ఆ ప్రజల నమ్మకాన్ని నిలుపుకున్నారా? ఈ రెండేళ్లలో ఆయన సాధించిన విజయాలేమిటీ.? వైఫల్యాలేమిటీ.? అనే చర్చ మరోసారి దేశం మొత్తం జరుగుతోంది.   ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా  సాధించిన పాపులారిటీతోనే మోడీ ప్రధాని పీఠాన్ని అధిరోహించారని స్పష్టంగా చెప్పవచ్చు. 2014లో ప్రధాని అయిన తొలి రోజుల్లో ఆయన సీఎంగానే ఆలోచించేవారు. కానీ ఈ రెండేళ్ల సమయంలో మోడీ ఎంతో నేర్చుకున్నారు. కేంద్రంలోని వ్యవస్థల పనితీరును త్వరగానే అర్థం చేసుకున్నారు. అప్పట్లో సీనియర్ మంత్రులపై ఆధారపడిన మోడీ ఇప్పుడు తానే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టారు. యూపీఏ హయాంలో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినా చాలా వరకూ అంతంత మాత్రంగానే అమలయ్యాయి. దీనిపై దృష్టిసారించిన మోడీ నగదు బదిలీ, ఆధార్ అనుసంధానం ద్వారా పేదల ముంగిట్లోకి సంక్షేమ ఫలాలను అందించారు. గ్రామీణ ప్రాంతాల్లో 7.10 కోట్ల బ్యాంక్ ఖాతాలు తెరవటం ద్వారా..ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో అవినితీ అవకాశాలను తగ్గించడం, ఆ ప్రయోజనాలు మరింత ఎక్కువ మంది ప్రజలకు అందేలా చేశారు.   ఇక ధరల విషయానికి వస్తే అధికధరలు అనేది నిరంతర సమస్య. ఈ రెండేళ్లలో ప్రజల కనీస ఆహార పదార్ధాల ధరలు భారీగా పెరిగాయి. కందిపప్పు కిలో రూ.200 చేరుకుని సామన్యుడు కొనలేని పరిస్థితి వచ్చింది.  అలాగే అంతర్జాతీయంగా పెట్రోలు ధరలు తగ్గినా మన దగ్గర మాత్రం భారీగా ఉండటాన్ని ప్రజలు సమర్ధించడం లేదు. కానీ వీటి విషయంలో మోడీ సర్కార్ అనుకున్నంత కృషి చేయలేదు. ఇక పారిశ్రామిక రంగాన్ని మోడీ వృద్ధిలోకి తీసుకువచ్చేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. దేశీ తయారీ రంగానికి చేయూతనిచ్చేలా "మేకిన్ ఇండియా" కార్యక్రమాన్ని తలపెట్టారు. దీని కింద దాదాపు 400 బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. అలాగే చిన్న సంస్థల ఏర్పాటుకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం "స్టార్టప్ ఇండియా"ను ప్రారంభించారు. మోడీ సంస్కరణల ఫలితంగా రైల్వే, డిఫెన్స్ వంటి కీలక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారీగా వచ్చాయి. కార్పోరేట్ కంపెనీల మార్జిన్లు పుంజుకున్నాయి. కరెంట్ అకౌంట్, ద్రవ్య పరిస్థితులు మెరుగయ్యాయి. మొత్తానికి ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశంగా చైనాను భారత్ అధిగమించింది.   ఇక మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సాధించిన విజయాల్లో కెల్లా అతిపెద్దది విదేశాంగ విజయం. అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను పెంచడానికి..తద్వారా దేశంలోకి పెట్టుబడులను ఆకర్షించడానికి మోడీ గతంలో ఏ ప్రధాని చేయని విధంగా అనేక దేశాల్లో పర్యటించారు. దశాబ్ద కాలంపైగా ఊరిస్తూ వచ్చిన భారత్-ఇరాన్ ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు . వీటన్నింటి ద్వారా భారత విదేశీ విధానానికి మోడీ కొత్త జీవం పోశారని చెప్పవచ్చు. యూపీఏ ప్రభుత్వానికి అపకీర్తిని మూటకట్టిన అవినీతి విషయంలో నరేంద్రుడు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. రెండేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వంలో ఎవరిపైనా అవినీతి ఆరోపణలు రాకుండా మోడీ జాగ్రత్తలు తీసుకున్నారు. అటు రాజకీయంగానూ మోడీ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. తన రాజకీయ పత్యర్థి కాంగ్రెస్‌ను కట్టడి చేసి "కాంగ్రెస్ ముక్త భారత్ "దిశగా దూసుకుపోతున్నారు. 2014 లో మోడీ అధికారం వచ్చేనాటికి కాంగ్రెస్ పార్టీ 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది..కానీ రెండేళ్ల తర్వాత తిరిగి చూస్తే కాంగ్రెస్ ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలు ఏడుకు తగ్గిపోయాయి. వీటిలో కర్ణాటకను మినహాయిస్తే అన్నీ చిన్నచితకా రాష్ట్రాలే. ఇదే సమయంలో ఎన్‌డీఏ సర్కార్ కొలువుదీరే నాటికి 7 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు 13 రాష్ట్రాల్లో సొంతంగా లేదా సంకీర్ణంగా ప్రభుత్వాలను నడుపుతోంది. ఇటీవలే జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అసోంలో గెలుపుతో ఈశాన్యంలో మొదటి సారి పాగా వేసింది.     ఇన్ని విజయాలు సాధిస్తున్నా మోడీకి విమర్శలు తప్పడం లేదు. ఎన్నికల మేనిఫేస్టోలో పేర్కొన్నట్టు నల్లధనం వెనుక్కు తీసుకురాలేదు. ఆయన రెండేళ్లపాలనలో ఏదైనా పెద్ద విమర్శ ఉందంటే అది సమాజంలో పెరుగుతున్న అసహనమే. తమ మాట వినని కవులు, రచయితలు, కళాకారులు, మేధావులు, విద్యార్థుల పట్ల అసహనం. హెచ్‌సీయూ, జేఎన్‌యూలలో చేలరేగిన అల్లర్లు తదితరా అంశాల విషయంలో మోడీ సర్కార్ ఉదాసీనంగా వ్యవహరిస్తోందని పెద్ద ఎత్తున విమర్శలు ఎదురయ్యాయి. భారత్-పాక్ సరిహద్దుల్లో మోడీ హయాంలో జరిగినన్ని కాల్పులు ఏ ప్రధాని హయాంలోనూ జరగలేదు. పాక్ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత పోస్ట్‌లపై దాడులకు దిగాయి. ఈ దాడుల్లో ఎంతోమంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు..ఇంకా కోల్పోతూనే ఉన్నారు. అటు  చైనా రాజకీయంగా, సైనికంగా, ఆర్థికంగా చొచ్చుకుని వస్తున్నా మోడీ సర్కార్ ధీటైన జవాబివ్వడంలో విఫలమైందని చెప్పవచ్చు. మొత్తం మీద మోడీ రెండేళ్ల పాలన అన్నివర్గాలను అనుకున్నంత మేర సంతృప్తి పరచలేకపోయినా ఆయన తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో సమర్థుడైన ప్రధాని లేడంటున్నారు. మిగిలిన మూడేళ్లలో అయినా సామాన్యుడి కలల్ని మోడీ నిజం చేసి "అచ్చేదిన్" తీసుకువస్తారని ఆశిద్దాం..  

రోహిణి దంచుతోంది..!

సరిగ్గా వారం క్రితం ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారతం మొత్తం భారీ వర్షాలు, ఈదురు గాలులతో వణికిపోయింది. అందుకు కారణం రోను తుఫాను. దీని ప్రభావంతో ఈ ఏడాది రోహిణి కార్తె ప్రభావం అంతంగా ఉండకపోవచ్చని నిపుణులు, ప్రజలు భావించారు. దానికి తగ్గట్టుగానే రోను వెళ్లిన రెండు, మూడు రోజుల వరకు ఎండవేడిమి అంతగా కనిపించలేదు. అయితే రోహిణి కార్తె ప్రవేశంతో సోమవారం నుంచి వాతావరణంలో ఒక్కసారిగా మార్పు ప్రారంభమైంది. నిన్న మొన్నటి వరకు 35 లోపుగా ఉన్న ఉష్ణోగ్రత..ఏకంగా 45 నుంచి 48 డిగ్రీలకు పెరిగిపోయింది.   రాజమండ్రిలో ఈ ఏడాదిలోనే అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మచిలీపట్నం, బాపట్ల, రెంటచింతల, నర్సాపురం, కావలిలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు సింగరేణి బొగ్గుగనుల ప్రాంతమైతే నిప్పుల కొలిమిని తలపించింది. కేటీపీఎస్, కొత్తగూడెం ప్రాంతాలు ఎండదెబ్బకు నిర్మానుష్యంగా మారాయి. అనేక ప్రాంతాల్లో గబ్బిలాలు, పక్షులు నేలరాలాయి. ఓపెన్‌కాస్ట్ గని కార్మికులు విధుల్లోకి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఆశ్వారావుపేట మండలం తిరులకుంటలో 20 ఎకరాల జామాయిల్ తోట, మద్దికొండలో ఐదెకరాల పామాయిల్ తోట ఎండదెబ్బకు తగలబడిపోయింది. ఉదయం ఎనిమిది గంటల నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తుండగా..సాయంత్రం ఆరు గంటల వరకు నిప్పుల వాన కురిపిస్తున్నాడు. దీంతో చాలా ప్రాంతాల్లో వడగాల్పులు పెరిగిపోయాయి.   దూరప్రాంతాలకు వెళ్లాల్సిన వారు వడగాల్పుల తీవ్రతను తట్టుకోలేక నానా అవస్థలు పడ్డారు. వాహనదారులు నరకం చూశారు. జనం ఇళ్లలో ఉన్నప్పటికీ వేడితీవ్రతను అనుభవించారు. ఇక తప్సనిసరి పరిస్థితుల్లో రోడ్ల మీదకు వచ్చినవారి బాధలు అన్నీ ఇన్నీ కావు. వడదెబ్బకు నిన్న ఒక్కరోజే 768 మంది మరణించారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరణించిన వారిలో తెలంగాణ నుంచి 315 మంది, ఏపీ నుంచి 453 మంది ఉన్నారు. పశ్చిమ, వాయువ్య దేశం నుంచి పొడిగాలులు తెలుగు రాష్ట్రాలపైకి దూసుకురావడంతో గాలిలో తేమశాతం తగ్గి ఎండతీవ్రత పెరిగింది. ప్రస్తుతం ద్రోణులు, అల్పపీడనాలు లేకపోవడంతో వడగాల్పులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. జనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తప్పనిసరి అయితేనే బయటకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. మొత్తానికి  రోహిణి కార్తెలో రోళ్లు కూడా బద్ధలవుతాయని ఉన్న సామెతను రోహిణి నిలబెట్టుకుంటోంది. దీని ప్రభావం మరో 14 రోజులు ఉండటంతో ప్రజలు వణికిపోతున్నారు. నైరుతి రుతుపవనాలు కేరళను తాకే వరకు జనం రోహిణిని భరించకతప్పదు.

భారత్ "ఛాబహార్" దెబ్బ..పాకిస్థాన్ అబ్బా..!

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత విదేశాంగ విధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతూ వస్తున్న ప్రధాని నరేంద్రమోడీ ఏ దేశం వెళ్లినా విజయంతో తిరిగి వస్తున్నారు. వివిధ దేశాలతో భారత్ దశాబ్దాల క్రితం కుదుర్చుకోవాలని , కుదుర్చుకోలేకపోయిన ఎన్నో ఒప్పందాలను మోడీ తన చాతుర్యంతో నెరవేరుస్తున్నారు. రెండు రోజుల ఇరాన్ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోడీ చరిత్రాత్మకంగా నిలిచే కీలకమైన ఒప్పందంపై ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనితో చర్చలు జరిపారు. ఆ చర్చలు ఫలవంతమై కీలక ఒప్పందంపై రెండు దేశాలు సంతకాలు చేసేలా దారి తీశాయి. అదే ఛాబహార్ రేవు అభివృద్ధిలో భారత్ భాగస్వామి అయ్యే ఒప్పందం. అది భారత్‌కు ఏవిధంగా కీలకమనేగా మీ డౌట్..అక్కడే ఉంది భారత వ్యూహకర్తల మేధస్సు.   ఛాబహార్ ఉన్న ప్రాంతం భారతదేశ పశ్చిమ తీరానికి కూతవేటు దూరంలో ఉంది. పాకిస్థాన్‌లోని కరాచీ రేవు ద్వారా వెళ్లాల్సిన అవసరం లేకుండానే కొన్ని దేశాలను చేరుకునేందుకు ఈ మార్గం సులభతరమవుతుంది. అంతేకాదు ఈ రేవుపై వాణిజ్య ఒప్పందం ద్వారా ఇరాన్‌లో అడుగుపెట్టి, అఫ్గానిస్థాన్, రష్యా, ఐరోపా దేశాలతో అనుసంధానత సాధించేందుకు భారత్‌కు వీలవుతుంది. మన ఇంధన అవసరాల రీత్యా ఇరాన్‌ నుంచి చమురు దిగుమతి చేయడానికి పైప్‌లైన్ నిర్మించాలని ఎప్పుడో ఒప్పందం కుదుర్చుకున్నాం. అయితే ఇరాన్ నుంచి భారత్‌కు పైప్‌లైన్ నిర్మించాలంటే అది పాక్ భూభాగం గుండా రావాలి దీనికి పాక్ ససేమిరా అంటోంది. అదీగాక ఇరాన్-పాక్ మధ్య సంబంధాలు అంతంత మాత్రమే . దీంతో చాబహార్ చాలా కీలకమవుతుంది. అలాగే భారత్ నుంచి ఆఫ్గనిస్థాన్‌కు వెళ్లాలన్నా పాక్‌ను టచ్ చేయాల్సిందే. దీంతో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చాబహార్ కల సాకారమైతే అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఆఫ్గాన్‌కు వెళ్లవచ్చు.   ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఛాబహార్ రేవు అభివృద్ధిపై 2003లోనే అప్పటి వాజ్‌పేయ్ ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేసింది. అనంతరం ప్రభుత్వ మార్పిడి జరగడం..కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించకపోవడంతో ఇది మరుగునపడింది. అయితే భారత్‌ను అష్టదిగ్బంధం చేయాలని యోచిస్తున్న చైనా మనకు సమీపంలోని ప్రతిదేశంతో ఏదో రకంగా పొత్తుపెట్టుకుని అక్కడ తన ఆయుధాల్ని మోహరిస్తోంది. ఆ ప్లాన్‌లో భాగంగానే పాకిస్థాన్‌లోని గ్వదర్ ఓడరేవును అభివృద్ధి చేసి భారత్‌ను దెబ్బతీయాలని భావిస్తోంది. దీనిని పసిగట్టిన మన రక్షణ శాఖ నిపుణులు వీలైనంత త్వరగా మేల్కొనకపోతే నష్టం తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.   దీనికి ధీటైన జవాబు కోసం అన్వేషిస్తుండగా గతంలో అటకెక్కించిన ఛాబహార్ ప్రతిపాదన వెలుగుచూసింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ ఇరాన్‌ పర్యటనను ఏర్పాటు చేసుకున్నారు. ఆ దేశాధినేత హాసన్ రౌహానీతో ద్వైపాక్షిక అంశాలపై సమగ్రంగా చర్చించిన తర్వాత 12 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వాటిలో ఒకటిగా ఛాబహార్ రేవును చర్చి రౌహానిని ఒప్పించారు. అటు ఛాబహార్ రేవు అభివృద్ధిలో భారత భాగస్వామి అవుతుందని ఏ మాత్రం ఊహించని పాక్, చైనాలకు ఈ వార్తతో గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లైంది. మరి ఇరాన్, ఇండియాలపై తన అక్రోశాన్ని వెల్లగక్కేందుకు ఈ ఇద్దరుమిత్రులు ఏం చేయబోతున్నారో..?

తెలంగాణకు కొత్త రూపు..!

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన అన్న మాటను నిజం చేయబోతున్నారు. అదే కొత్త జిల్లాల ఏర్పాటు..తీవ్ర మల్లగుల్లాలు, వరుస సమీక్షలు, ఉద్యమాల మధ్య అధికార యంత్రాంగం 14 కొత్త జిల్లాలతో తుది జాబితాను ఖరారు చేసింది. దీంతో ఇప్పుడున్న పది జిల్లాలతో కలిపి మొత్తంగా 24 జిల్లాలతో తెలంగాణకు కొత్త రూపు రాబోతోంది. ఈ కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి మ్యాపులు, సరిహద్దుల వివరాలన్నీ భూపరిపాలన శాఖ సిద్ధం చేసింది. దీంతో  ప్రతి జిల్లా రెండు లేదా మూడు ముక్కలైంది. రాష్ట్ర ఆవతరణ దినోత్సవం నాటికి కొత్త జిల్లాలను ప్రకటిస్తానని సీఎం కేసీఆర్ ముందుగానే ప్రకటించడంతో ఆ రోజు నాటికి అన్ని పనులు చక్కబెట్టేందుకు అధికార యంత్రాంగం ఉరుకులు, పరుగులు పెడుతోంది.    విశ్వసనీయ సమాచారం మేరకు ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం కేంద్రంగా కొత్తగా "భద్రాద్రి "జిల్లాను..నల్గొండ జిల్లాలోని భువనగిరి కేంద్రంగా "యాదాద్రి" జిల్లాను ఏర్పాటు చేయనున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాలను "కొమురం భీం" జిల్లాగా, వరంగల్ జిల్లాలోని భూపాల్‌పల్లి కేంద్రంగా "ఆచార్య జయశంకర్" జిల్లాగా ఏర్పాటు చేయనున్నారు. ఇదే వరంగల్ జిల్లాలోని జనగామను జిల్లాగా చేయాలని ప్రభుత్వం భావించినప్పటికి ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో మహబూబాబాద్‌ను జిల్లాగా చేయాలని నిర్ణయించారు.  జిల్లాల రేసులో ముందున్న నల్గొండ జిల్లా సూర్యాపేటకు అనుకున్నట్లుగానే జిల్లా హోదా దక్కింది. సీఎం కేసీఆర్ సొంత జిల్లా మెదక్‌లోని సిద్దిపేటతో పాటు సంగారెడ్డిని కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయనున్నారు. నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి, కరీంనగర్ జిల్లాలోని  జగిత్యాలను కొత్త జిల్లాలుగా ఎంపిక చేశారు.   జిల్లాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగిన జిల్లా మహబూబ్‌నగర్.. ఇక్కడి నుంచి వనపర్తి, నాగర్ కర్నూల్‌లను జిల్లాలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే గద్వాలను కూడా జిల్లాగా చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నడిచాయి. అయినప్పటికి ప్రభుత్వం ముందుగా అనుకున్నదానికే కట్టుబడింది. జిల్లాల ఏర్పాటులో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల విభజనపై అధికార యంత్రాంగం భారీ కసరత్తును చేస్తోంది. హైదరాబాద్‌ను రెండు జిల్లాలుగా , రంగారెడ్డిని రెండు జిల్లాలుగా విభజించాలని నిర్ణయానికి వచ్చారు. రంగారెడ్డిలో వికారాబాద్ కేంద్రంగా కొత్త జిల్లాను, హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ ప్రాంతాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.   ఇదిలా ఉండగా కొత్త జిల్లాల కోసం వివిధ జిల్లాల్లో ఇంకా ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. వీటిపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి అవి ప్రజల డిమాండ్లేనా..ఇంకేమైనా అంశాలు ఉన్నాయా అనే సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇవాళ జిల్లా కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగానే  జిల్లాల రూపకల్పనపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటులో కలెక్టర్ల పాత్ర  కీలకం కావడంతో వారితో ప్రత్యేకంగా చర్చించాలని సీఎం భావించారు. అందుకే అంతా సవ్యంగా సాగేందుకు వీలుగా సీఎం కలెక్టర్లను అప్రమత్తం చేయనున్నారు. మొత్తం మీద పది జిల్లాల తెలంగాణ కాస్తా..24 జిల్లాల తెలంగాణ కానుంది. రాష్ట్రం ఏర్పడిన రెండేళ్లలోనే తెలంగాణలో జిల్లాల సంఖ్య రెట్టింపు కన్నా ఎక్కువ కానుంది. అదే సమయంలో, సుమారు వెయ్యి కోట్లకు పైనే కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రభుత్వంపై భారం పడనుందని అంచనా. అయితే, కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధుల్ని రాబట్టేందుకు కొత్త జిల్లాల ఏర్పాటు తప్పదని కేసీఆర్ భావిస్తున్నారు. ఒక్కటి మాత్రం నిజం..పది జిల్లాల తెలంగాణ కన్నా ఇరవై నాలుగు జిల్లాల తెలంగాణ అన్న మాట వినడానికి కాస్త "గొప్ప"గా కనిపిస్తుంది.

థ్యాంక్స్‌ టూ "రోన్"..!

"మే " నెల...  సమ్మర్‌లో ఈ మంత్ అంటే చాలు జనాల గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. రోళ్లు సైతం పగిలిపోయే ఎండతో అడుగుదీసి అడుగు బయటపెట్టకుండా చేస్తుంది మే నెల. అలాంటి మే నెల ప్రారంభంలో ఈ సారి వడగాల్పులు లేవు..ఉక్కపోతలు లేవు..అందుకు కారణం ఒక్కటే "రోన్". బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. దీని దెబ్బ కు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాలు చిగురుటాకులా వణికిపోయాయి. గంటకు 100 నుంచి 150 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఎడతెరిపి లేని వర్షంతో ప్రజలు అల్లాడిపోయారు.   నైరుతి రుతుపవనాల రాకకు ముందు ఈ సీజన్‌లో మొదటిసారి ఏర్పడిన తుఫాన్ "రోన్". బలమైన పశ్చిమగాలుల ప్రభావంతో శ్రీలంక తీరంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి తమిళనాడు తీరంలోకి వాయుగుండంగా ప్రవేశించింది. అక్కడి నుంచి తీవ్ర వాయుగుండమై ఆంధ్రప్రదేశ్ తీరానికి చేరుకుంది. ఇక్కడ మరింత బలపడి రోన్ తుఫాన్‌గా మారి ఒడిశా మీదుగా బంగ్లాదేశ్‌కే చేరుకుంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో మంచి వర్షపాతం నమోదైంది. మండు వేసవిలో కురిసిన ఈ  వర్షాలు అన్ని రంగాలకు మేలు చేశాయి.   ఈ వర్షాల వల్ల భూగర్భజలాలు కాస్త పెరిగినట్టు సాక్షాత్తూ ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా ప్రకటించారు. గతేడాది మేలో 13.83 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలం ప్రస్తుతం 12.40 మీటర్ల లోతులో అందుబాటులో ఉందని చెప్పారు. జల సంరక్షణ చర్యలతో కోస్తా ప్రాంతంలో గతేడాది మేతో పోలిస్తే 0.56 మీటర్ల మేర, రాయలసీమలో 6.08 మీటర్ల మేర పెరుగుదల నమోదైందని చెప్పారు. రాష్ట్రంలో 9 శాతం భూభాగంలో 3 మీటర్లు, అంతకంటే తక్కువ లోతులో భూగర్భ జలం అందుబాటులో ఉందని, 36 శాతం భూభాగంలో 3 మీటర్ల నుంచి 8 మీటర్ల లోతులో, 54 శాతం భూభాగంలో 8 మీటర్ల కంటే ఎక్కువ లోతులో భూగర్భ జలం లభిస్తోందన్నారు.   తుఫాన్ చిన్నదైనా, పెద్దదైనా నష్టం కూడా ఉంటుంది. అలాగే "రోన్" వల్ల మంచితో పాటు విధ్వంసం కూడా జరిగింది. అనేక జిల్లాల్లో మామిడి పంటకు అపార నష్ఠం కలిగింది. కృష్ణా, ఉభయగోదావరి, గుంటూరు, నెల్లూరు జిల్లాల రైతులు తీవ్ర నష్టాన్ని చవి చూశారు. 12 అడుగుల మేర సముద్రపు అలలు ఎగిసిపడటంతో మత్స్యకారుల బోట్లు, వలలు, ఇతర పరికరాలు సముద్రంలోకి కొట్టుకుపోయాయి. అటు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌‌లో జరిగిన విలయం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. దాదాపు అరగంట పాటు ప్రచండ వేగంతో వీచిన ఈదురుగాలులు, కుండపోత వర్షం ధాటికి నగరం వణికిపోయింది. 100 కిలో మీటర్ల వేగంతో వీచిన గాలి దెబ్బకు ఎక్కడికక్కడ చెట్లు, విద్యుత్ స్థంభాలు, భారీ హోర్డింగులు నేలకూలాయి. కిలో మీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయి అర్థరాత్రైనా క్లియర్ కాలేదు. గాలివాన ధాటికి ముగ్గురు మరణించగా..పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఒక్కటి మాత్రం చెప్పవచ్చు.. భూగర్భ జలాలు అడుగంటిపోయి..తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక..కరవు విలయతాండవం చేస్తున్న వేళ "రోన్" ఎడారిలో ఒయాసిస్‌లా తెలుగు రాష్ట్రాలని ఆదుకుంది.  

అలజడి సృష్టించిన అల్లు అర్జున్‌

పవన్‌ కళ్యాణ్‌ అభిమానులను ఉద్దేశించి అల్లు అర్జున్‌ వ్యాఖ్యలు చేసి రెండు రోజులు గడిచినా కూడా ఇంకా ఆ సెగ రగులుతూనే ఉంది. వెబసైట్లలోనూ, సోషల్ మీడియాలోనూ అల్లు అర్జున్ వ్యాఖ్యల గురించి ప్రతివ్యాఖ్యలు జోరుగా సాగుతున్నాయి. వివాదాలకు దూరంగా ఉండే అల్లు అర్జున్ ఇంత తీవ్ర సుడిగుండంలో కోరి కోరి చిక్కుకున్నాడా అంటే ఔననే విశ్లేషణే వినిపిస్తోంది. హీరోల కుటుంబాల నుంచి కథానాయికలు వచ్చే సంప్రదాయం తెలుగులో చాలా తక్కువ. అలాంటి ప్రయత్నం చేసిన అతికొద్దిమంది కూడా అభిమానులకు జంకో, తెరమీద నిలదొక్కుకోలేకనో ఎప్పుడో కనుమరగైపోయారు. అలాంటిది, మెగాఫ్యామిలీ నుంచి నీహారిక అనే నాయిక వస్తోందనగానే ఎవరూ ఆశ్చర్యపడలేదు. ఎందుకంటే ఇప్పటికే నీహారిక, టీవీ ద్వారా తనకంటూ ఒక భూమికను ఏర్పరుచుకున్నారు. అలాంటి నీహారికను సినీరంగానికి పరిచయం చేస్తూ జరిగిన ఓ ఆడియో ఫంక్షన్‌, ఓ వివాదానికి వేదికగా మారడమే ఆశ్చర్యం.  నీహారిక ‘ఒక మనసు’ సినిమా ఆడియో ఫంక్షన్‌కు హాజరైన అల్లు అర్జున్‌ వేదిక మీదకు రాగానే ఒక్కసారిగా పవన్‌ కళ్యాణ్‌ గురించిన నినాదాలు మొదలయ్యాయి. మెగాఫ్యామిలీకి సంబంధించి ఏ వేడుక జరిగినా ఇలాంటి నినాదాలు వినిపించడం కొత్తేమీ కాదు. అయితే అది శృతి మించడమే తాజా వివాదానికి కారణమైంది. దానికి తోడు కొన్నాళ్లుగా అల్లు అర్జున్‌, పవన్‌ గురించి మాట్లాడను అని భీష్మించుకోవడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. అయితే అర్జున్‌ ఈసారి తను ఈ వివాదానికి ఒక ముగింపుని పలకాలని నిశ్చయించుకుని మరీ వేదిక మీదకు వచ్చినట్లుంది. అవతలివారికి నచ్చినా, నచ్చకున్నా పది నిమిషాలకు పైగా తన మనసులోని అభిప్రాయాన్ని కుండబద్దలుకొట్టినట్లు చెప్పేశాడు అల్లు.   పవన్‌ కళ్యాణ్‌కు చెందిన కొందరు అభిమానులు ఒక గుంపుగా చేరి ఎక్కడపడితే అక్కడ నినాదాలు చేస్తూ శృతి మించుతున్నారన్నది అల్లు అర్జున్‌ వాదన. ఇలాంటి నినాదాల వల్ల వేడుకల ఫంక్షన్ల అజెండా మారిపోతోందన్నది అర్జున్‌ ఆరోపణ. ఏదో మాట్లాడాలని వచ్చినవారంతా బలవంతంగా పవన్‌ను పొగడాల్సి వస్తోందన్నది అతని ఆవేదన. అల్లు అర్జున్‌ చెప్పిన మాట జనానికి కొత్తేమీ కాదు. గత రెండేళ్లుగా ఈ తంతు సాగుతున్నదే! పవన్‌ కళ్యాణ్‌ గురించిన నినాదాలు, ఆయనను బలవంతంగా పొగిడే కోటరీలు జనాలకి కనిపిస్తూనే ఉన్నాయి. కానీ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వారసుడే ఈ విషయాన్ని ఖండించడం ఓ కొత్త వివాదానికి దారి తీసింది. అడియో ఫంక్షన్‌లో అల్లు అర్జున్‌ చేసిన ప్రసంగం అప్పటికప్పుడు అనుకున్నది కాదని అర్థమైపోతోంది. నాగబాబు హావభావాలు చూసినప్పుడు అల్లు అర్జున్‌ ప్రసంగానికి పెద్దలు మురుసుకున్నారనీ తేలిపోయింది. కానీ ఇది మెగాఫ్యామిలీలో ఒక చీలికను తేనుందా అన్నదే ఓ ఆసక్తికరమైన ప్రశ్న.   తామంతా ఒక్కటే అని అల్లు అర్జున్‌ ఎంతగా చెప్పినా ఇప్పటికే సోషల్ మీడియాలో దూషణల పర్వం మొదలైపోయింది. అభిమానులు గొడవ చేస్తుంటే ఇన్నాళ్లూ పవన్‌ ఎందుకని స్తబ్దుగా ఉన్నారని ఒక వర్గం అంటే, పవన్‌కి ఉన్న ప్రజాదరణను తట్టుకోలేని అల్లు ఈర్ష్యతో ఈ వ్యాఖ్యలు చేశారని మరో వర్గం అంటోంది. పవన్‌, చిరంజీవి రాజకీయ దారులు వేర్వేరు అయినప్పటి నుంచి వారి అభిమానులు కూడా ఎవరికి వారుగా చీలిపోయారు. దీనికి తోడు ఎన్నికల సమయంలో తామంతా చిరంజీవికే మద్దతునిస్తామని మెగా వారసులంతా ప్రకటించడంతో, ఈ చీలికలో ఒక స్పష్టత వచ్చేసింది. చిన్నప్పటి నుంచీ చిరంజీవిని చూస్తూ, ఆరాధిస్తూ... ఆయన ఏర్పరిచిన దారి మీద నడుచుకుంటూ వచ్చిన మెగా హీరోలందరికీ ఆయనంటే ఎంత అభిమానమో చెప్పనక్కర్లేదు. వీరి తొలి మద్దతు చిరంజీవికే ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. మరి ఈ మెగాఫ్యామిలీలో పవన్‌ ఎంతవరకు ఇమడుతారన్నదే సందేహం! ఒక వేడుకకి వెళ్లి, ఒక వేడుకకి వెళ్లకా ఇప్పటికే పవన్ కావల్సినన్ని అనుమానాలు రేకెత్తిస్తున్నారు.   పవన్‌ ఎందుకు రాలేదు అని అభిమానులు అడిగే ప్రశ్నలకు, మెగా ఫ్యామిలీ తల పట్టుకుంటోంది. అలాగని పవన్‌ వేడుకలకు దూరంగా ఉంటారా అంటే అదీ లేదు. అకస్మాత్తుగా ఏదో ఒక ఆడియో ఫంక్షన్లో హాజరై, ఫలానా హీరా నా తమ్ముడులాంటివాడు అనేస్తారు. సహజంగానే ఈ దోబూచులాట మెగా ఫ్యామిలీకి ఇబ్బంది కలిగించక మానదు. అందుకే అల్లు అర్జున్‌ తన మనసులో ఉన్న చికాకునంతా పవన్‌ అభిమానుల మీద వెళ్లగక్కినట్లు కనిపిస్తోంది. అల్లు అర్జున్‌ ప్రస్తావించిన సమస్య కేవలం మెగా ఫ్యామిలీకే పరిమితం కాదు. నందమూరి ఫంక్షన్లలో కూడా బాలకృష్ణ గురించి ఇలాంటి నినాదాలే వినిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భాలలో నందమూరి వారసులు కొందరు అల్లు అర్జున్‌లాగానే కొంత అసహనానికి లోనైన సంఘటనలు జరిగాయి. కానీ ఈ మొత్తం ప్రహసనంలో నష్టపోయేది అభిమానులే. తెలుగునాట ఒకప్పుడు అభిమాన సంఘాలు చాలా ఉధృతంగా ఉండేవి. వేర్వేరు కథానాయకుల అభిమానులకు ఒక్క నిమిషం కూడా పడేది కాదు. అలాంటి దుస్థితే ఇప్పుడు మళ్లీ తలెత్తుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కాకపోతే ఒకే కుటుంబానికి చెందిన నటుల అభిమానుల మధ్య చిచ్చు రాజుకోవడం తలబాదుకోవల్సిన విషయం! మరి ఈ విషయమై పవన్‌ కళ్యాణ్‌ ప్రతిస్పందిస్తారా, లేక చిరునవ్వులు చిందిస్తారా అన్నది వేచి చూడాలి.

తలచినదే జరిగిందీ

దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగిన ఎన్నికల ఫలితాలు ఒక కొలిక్కి వచ్చాయి. అనుకున్న ఫలితాలనే ఇవి అందించినప్పటికీ ఓటరు నాడి విస్పష్టంగా వెల్లడి కావడం అనూహ్యమైన విషయం. తమిళనాడు! ఎన్నికలు ముగిసిన వెంటనే తాజావార్తగా నిలిచిన అంశం, తమిళనాట జయ ఓడిపోనుందన్న అనుమానం. తమిళనాట ఓటర్లు మార్చిమార్చి ఫలితాలను అందించే అలవాటు ఉన్నవారు కావడంతో, అలవాటు ప్రకారం ఈసారి డీఎంకేకు అధికారం దక్కుతుందని అంతా ఊహించారు. ఇంచుమించుగా ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ కూడా డీఎంకేకు అనుకూలమైన సంకేతాలను అందించడంతో అన్నాడీఎంకే కార్యకర్తలు నైరాశ్యంలో మునిగిపోయారు. కానీ దాదాపు 30 ఏళ్ల తరువాత అన్నాడీఎంకే, రెండోసారి వరుస విజయాన్ని సాధించిన పార్టీగా రికార్డు సృష్టించింది. అటు డీఎంకేను, ఇటు అన్నాడీఎంకేను ఓడించి తమిళ ప్రజలకు ప్రత్యామ్నాయంగా నిలుస్తానని బీరాలు పలికిన కేప్టెన్‌ విజయ్‌కాంత్‌గారి ఓడ బయల్దేరకముందే మునిగిపోయింది. విజయ్‌కాంత్‌ తన పార్టీని నిలబెట్టుకోలేకపోగా, ఓట్లను చీల్చి పరోక్షంగా అన్నాడీఎంకే విజయానికి కారణంగా నిలిచారు.   అసోం! ఈ రాష్ట్రంలో బీజేపీ సంకీర్ణం గెలవనుందన్న ఊహలు మొదటినుంచీ చెలరేగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటివరకూ ఈశాన్య భారతం మీద బీజేపీకి పట్టులేకపోవడంతో, హంగ్‌ దిశగా ఓటర్లు సాగుతారనే అనుమానాలూ ఉన్నాయి. అందుకే భాజపా నేతలంతా ఈ ఎన్నికలలో తమ తురుపుముక్కయిన అసోం మీదే కన్నేశారు. మోదీ, అమిత్‌షా వంటి హేమాహేమీలంతా అసోం దారిపట్టారు. ఒక పక్క కేంద్రంలో ప్రభుత్వం నానారకాల సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ, అవేవీ అసోం ప్రజల మీద ప్రభావం చూపకుండా ఉండేందుకు వారిని హామీలతో ముంచెత్తారు. ఫలితం 15 ఏళ్లుగా అసోంను ఏలుతున్న కాంగ్రెస్‌ కురువృద్ధుడు తరుణ్ గొగోయ్‌ తలవంచక పశ్చిమ బెంగాల్లో! ఇటు తమిళనాట జయలలిత పట్టు నిలుపుకున్నట్లే,   బెంగాల్‌ శక్తిమాత మమత అక్కడ తన ఉనికిని నిలబెట్టుకున్నారు. శారదా స్కాం మొదలుకొని నారదా స్కాం వరకూ మమత ప్రభుత్వం ఎన్ని కుంభకోణాలను ఎదుర్కొన్నా, ఆమెకు మరో అవకాశం ఇచ్చిచూడాలని నిర్ణయించుకున్నారు బెంగాలీ బాబులు. తృణమూల్ కాంగ్రెస్ ఇక్కడ గెలుస్తుందనుకున్న అనుమానం మొదటి నుంచీ ఉన్నప్పటికీ, మూడింట రెండువంతులకు పైగా మెజారటీతో అధికారాన్ని అందుకునే దిశగా మమత సాగిపోవడం ఆశ్చర్యకరం. వామపక్షాలు, కాంగ్రెస్‌ కలిసి కూడా 294లో 100 సీట్లను మించి గెల్చుకునే పరిస్థితి అక్కడ కనిపించడం లేదు. మరి ఈ కరాఖండి విజయంతో మమత అక్కడ బలమైన సంస్కరణలు తీసుకువస్తారా లేదా అన్నది రానున్న రోజుల్లో తేలిపోతుంది.   కేరళ! కేరళలో ఎలాంటి ఫలితం వస్తుందన్న అనుమానం ఎవరికీ లేదు. సహజంగానే ఉండే ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ పీకల్లోతు అవినీతి ఆరోపణల్లో మునిగిపోవడంతో ఓటర్లంతా వామపక్షాల వైపు మొగ్గుచూపసాగారు. దీనికి తోడు అగ్నిప్రమాదాల నుంచి అత్యాచార ఘటనల వరకు చాలా వార్తలు కేరళ ప్రభుత్వ ప్రతిష్టను మసకబరిచాయి. దాంతో వామపక్ష కూటమికి చెందిన 92 ఏళ్ల అచ్చుతానందన్ ఈసారి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే కనుక జరిగితే భారతావనిలో అతి వృద్ధ ముఖ్యమంత్రిగా అచ్చుతానందన్‌ రికార్డుని సృష్టించవచ్చు. ఇక ‘మీ రాష్ట్రంలో సోమాలియా తరహా పేదరికం తాండవిస్తోందని’ మోదీ చేసిన వెక్కిరింపుకి నొచ్చుకున్న కేరళ సహోదరులు బీజేపీకి చుక్కలు చూపించారు. బీజేపీ తరఫున నిల్చొన్న శ్రీశాంత్‌కు మరోసారి ఏడుపొచ్చేలా విధి పావులు కదుపింది.   పుదుచ్చేరి! అసోం, కేరళలో అధికారాన్ని కోల్పోయి... బెంగాల్, తమిళనాట నిండా మునిగిపోయి ఉన్న కాంగ్రెస్‌కు పుదుచ్చేరి ఫలితాలు ఒక్కటే ఊరటని కలిగించనున్నాయి. ఇక్కడ డీఎంకేతో పాటుగా బరిలోకి దిగిన కాంగ్రెస్‌, ముఖ్యమంత్రి పీఠాన్ని చేజిక్కించుకోనుంది. తమిళనాట అరుదైన అవకాశాన్ని పోగొట్టుకున్న కరుణానిధి, దేశంలో మరో ఇద్దరు ముఖ్యమంత్రులను చేజార్చుకున్న రాహుల్‌గాంధీలకు పుదుచ్చేరి సముద్రపు ఒడ్డే కాస్త సేద తీర్చనుంది.  

మోడీ నోట మళ్లీ పాత పాటే..!

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వననని బీజేపీ పార్లమెంట్ సాక్షిగా తెగేసి చెప్పిన పక్షంలో..నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రత్యేకహోదాపై కేంద్రంతో చర్చించి, క్లారిటీ తీసుకొస్తారు..దీని కోసం బీభత్సమైన బ్యాక్‌గ్రౌండ్ వర్క్ ప్రేపేర్ చేస్తున్నారంటూ పెద్ద హంగామా చేసింది మీడియా. తీరా సస్పెన్స్ ముగిసింది..సీఎం ఢిల్లీ వెళ్లారు, ప్రధానితో భేటీ అయ్యారు. అంతే ఎప్పటి లాగానే విభజన హామీలు నెరవేరుస్తామని ప్రధాని హామీ ఇచ్చారని సాక్షాత్తూ ముఖ్యమంత్రి మీడియాతో చెప్పారు.   రాష్ట్రానికి ప్రత్యేక హోదా, కరువు, అభివృద్ధి ప్యాకేజీలు తదితర అంశాలపై ప్రధానితో చర్చించేందుకు సీఎం తన బృందంతో నిన్న ప్రధాని కలిశారు. 20 నిమిషాల పాటు సీఎం, ప్రధానితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్ట్, రెవెన్యూ లోటు భర్తీ, తదితర అంశాల గురించి ప్రస్తావించారు. నిర్దిష్ట కాలవ్యవధిలో అమలు చేయాల్సిన 12 అంశాలతో కూడిన వినతిపత్రాన్ని ప్రధానికి అందజేశారు. 2019-20 నాటికి 14వ ఆర్ధిక సంఘం కాలవ్యవధి పూర్తయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్‌కు ఆదాయ లోటు ఉంటుందని బాబు చెప్పారు. పొరుగు రాష్ట్రాలతో సమానంగా పోటీ పడేలా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌పై 2014, ఏప్రిల్ 14 నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.1,472 కోట్లు కేంద్రం చెల్లించాలని ముఖ్యమంత్రి, ప్రధానిని కోరారు. ఈ ప్రాజెక్ట్ ‌2018 నాటకి పూర్తి అవ్వడానికి అవసరమైన నిధులు అందించాలని విజ్ఞప్తి చేశారు.   కొత్త రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణం, ఇతరాత్ర అవసరమైన మౌలిక సదుపాయాలకు మరో మూడేళ్ల పాటు రూ.10వేల కోట్ల సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. జాతీయ మౌలిక సదుపాయాల పెట్టుబడుల నిధి నుంచి ఆర్ధిక సాయం చేయాలని కోరారు. పదేళ్ల పాటు మూలధన రాయితీ 30 శాతం, కేంద్ర ఎక్సైజ్ సుంకం, ఆదాయపుపన్ను, సేవా పన్ను నుంచి 100 శాతం మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈశాన్య రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌తో సమానంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. వీటితో పాటు రాయలసీమ, ఉత్తర కోస్తా జిల్లాల అభివృద్ధికి వచ్చే ఎనిమిదేళ్ల పాటు జిల్లాకు ఏడాదికి రూ.200 కోట్ల చొప్పున ఆర్ధిక సాయం, పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లోని సంస్థలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని, షెడ్యూల్‌ 13లోని మౌలిక సదుపాయాలు, ఆర్ధిక చర్యల సమస్యలను పరిష్కరించాలని కోరారు. నియోజకవర్గాల పునర్విభజనకు వేగంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి విన్నవించారు.   అభివృద్ధి కోసమే మీతో పొత్తు పెట్టుకున్నాం. సీమాంధ్రులకు ఇష్టం లేకున్నా విభజన జరిగింది. ప్రత్యేక హోదా ఇస్తే తప్ప రాష్ట్రం కోలుకోలేదు. మిగతా రాష్ట్రాలతో సమానంగా ఎదిగేదాకా కేంద్రం చేయూతనివ్వాలి. ఎన్నికల సమయంలో బిడ్డను బతికించి తల్లిని చంపారని మీరే స్వయంగా వ్యాఖ్యానించారు. మీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాం. అంటూ సీఎం కాస్త సూటిగానే ప్రశ్నించారు. సీఎం ఆవేదనను విన్న ప్రధాని ఎప్పటిలాగానే నేనున్నా.. అన్ని సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇలా చంద్రబాబు, మోడీని 20 సార్లకు పైగా కలిశారు. ఎన్నోసార్లు రాష్ట్ర పరిస్ధితిని ఏకరువు పెట్టారు. మోడీకి ఇవ్వడం ఇష్టం లేనప్పుడు ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా ఉపయోగం లేదన్నది ఇక్కడ సుస్పష్టం. మొత్తానికి వారం రోజుల పాటు సాగిన సస్పెన్స్‌కు ప్రధాని తన స్టైల్లో తెరదించారు.

ఎగ్జిట్‌ పోల్స్‌ నిజమైతే!

  2014లో జరిగిన పార్లమెంటు ఎన్నికల తరువాత యావత్‌ దేశం దృష్టినీ ఆకర్షించిన ఎన్నికలు ముగిశాయి. చెదురుమదురు సంఘటనలు మినహా, ఓటింగ్‌ ప్రక్రియ పూర్తయిందనిపించారు. ఓటింగ్‌ ప్రక్రియ అలా ముగిసిందో లేదో, పలు సంస్థలు తమ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను వెల్లడించేశాయి. ఆశ్చర్యకరంగా ఈ ఎగ్జిట్‌ పోల్స్‌లో వెల్లడైన ఫలితాలన్నీ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. అందుకే అసలు ఫలితాలు వెల్లడవ్వక ముందే ఆయా రాష్ట్రాల్లో సంబరాలు మొదలైపోయాయి. ఈ ఎగ్జిట్‌ పోల్సే కనుక నిజమైతే, ఓటర్లు ప్రతి రాజకీయ పార్టీకీ కొన్ని సూచనలు చేసినట్లు కనిపిస్తోంది. అన్నాడీఎంకే- ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడైన వెంటనే తాజావార్తగా మారిన అంశం, తమిళనాట జయ పరాభవం. తమిళ తంబిలు ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ దఫాకో ద్రవిడ పార్టీకి అవకాశం ఇస్తారన్న విషయం తెలిసిందే. కానీ కరుణానిధికి వయసు మీద పడటం, ఆయన పుత్రరత్నం అళగిరి సొంత పార్టీకి గోతులు తవ్వడం చూస్తే అక్కడ ‘జయ’కేతనానికి అడ్డులేదని అనిపించింది. అయితే ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కుందేలు, తాబేలు పరుగుపందెం కథ గుర్తుకురావడం మొదలైంది. అబ్యర్థులను ఎడాపెడా మార్చేయడం దగ్గర్నుంచీ, మందకొడిగా ప్రచారం చేయడం వరకూ జయ అతి విశ్వాసం అసలుకే ఎసరు పెట్టింది. జయకు భిన్నంగా 92 ఏళ్ల కరుణానిధి ప్రచారంలో దూసుకుపోయారు. వయసుకు అతీతంగా తాను పాలించి తీరతానన్న విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించారు. తుపానులో పులిహోర పొట్లాల మీద సైతం అమ్మ బొమ్మ వేయించే అన్నాడీఎంకే కరుణ తాకిడికి వెనక్కి తగ్గింది. వీటికి తోడు రుణ మాఫీ వంటి పథకాలతో కట్టుదిట్టంగా ఏర్పరిచిన డీఎంకే మేనిఫెస్టో కూడా ప్రజల్లో ఆ పార్టీ పట్ల విశ్వాసాన్ని రగిల్చింది. ఇక కేప్టెన్‌ విజయ్‌కాంత్‌ ఆటలో అరటిపండులా మిగిలిపోవడమే కాకుండా, ఓట్లను చీల్చి అన్నాడీఎంకేకు పరోక్షంగా నష్టం కలిగించినవారయ్యారు. కాంగ్రెస్‌- వరుస ఎదురుదెబ్బలతో తల బొప్పి కట్టించుకున్న కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల ఫలితాలు మరింత శిరోభారంగా మారనున్నాయి. అసోంలో మూడు దఫాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న గోగోయ్‌ ఇప్పుడు గద్దె దిగనున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇటు కేరళలోనూ రోజుకో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఊమెన్‌ చాందీని సాగనంపేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. నేషనల్‌ హెరాల్డ్‌, అగస్టా చాపర్ వంటి స్కాములతో తలగోక్కొంటున్న కాంగ్రెస్‌కు ఇప్పుడు ప్రాంతీయంగా కూడా గడ్డు పరిస్థితి ఎదురు కానుంది. ఈ ఎన్నికల తరువాత దేశంలోని దాదాపు ఐదో వంతులో మాత్రమే కాంగ్రెస్‌ పాలన నిలిచి ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. దీనిని బట్టి జాతీయ స్థాయిలో ఆ పార్టీ పునర్వైభవం సాధించడం ఎంత కష్టమో తెలుస్తోంది. మరి ఆ కష్టమైన లక్ష్యాన్ని సాధించే సత్తా రాహుల్‌కు ఉందా! భాజపా- అసోంలో భాజపా కూటమి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్‌ పోల్స్ చెబుతున్నాయి. ఇదే కనుక నిజమైతే తొలిసారి ఈశాన్యంలో కమలం విరబూయనుంది. కానీ మిగతా రాష్ట్రాల్లో ఒకటీ అరా స్థానాలకే అది పరిమితం కానుంది. అసోంలో మూడు దఫాలుగా గెలుస్తూ వస్తున్న పార్టీని మార్చాలని ఓటర్లు భావించడం సహజమే! అందుకు ప్రత్యామ్నాయంగా భాజపా ముందుకు దూసుకురావడం మంచిదే! కానీ ఈ విజయంతో దేశంలో తమకి తిరుగులేదని భాజపా భావిస్తే కనుక త్వరలోనే ఎదురుదెబ్బలు తప్పకపోవచ్చు. ఇప్పటికే దక్షిణాదిన బీజేపీకి వ్యతిరేకంగా గాలులు వీయడం మొదలయ్యాయి. ఇక ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన పేరుతో భాజపా ప్రతిష్ట మసకబారింది. మధ్యతరగతి ప్రజల పీఎఫ్ మీద మాటిమాటికీ కన్నేయడం, నల్లధనాన్ని వెలికితీయడంలో విఫలం కావడం చూస్తుంటే భాజపా, కాంగ్రెస్‌లు ఒకే తాను ముక్కలేమో అన్న అనుమానం ప్రజలకి కలుగుతోంది. ఆ అనుమానాన్ని నివృత్తి చేసేందుకు భాజపా చాలానే కష్టపడాల్సి ఉంది. వామపక్షాలు- మన దేశంలో వామపక్షాలకు పెట్టని కోటలు రెండు. ఒకటి పశ్చిమబెంగాలు, రెండు కేరళ! ఈసారి ఎన్నికల్లో కేరళ వామపక్షాల కైవసం అవనుందని అంచనాలు చెబుతున్నాయి. అయితే ఇది చెప్పుకోదగ్గ విజయం ఏమీ కాదు. కేరళ ముఖ్యమంత్రి సోలార్‌ స్కాంలో పీకల్లోతు మునిగిపోవడం అక్కడ వామపక్షాలకు కలిసి వచ్చింది. పైగా తమిళ తంబిలలాగానే, కేరళ సహోదరులకు కూడా పార్టీలను మార్చి మార్చి గెలిపించుకునే అలవాటు ఉంది. ఇక పశ్చిమబెంగాల్లో మమతను ఓడించలేకపోవడం ఆ పార్టీకి పెను పరాభవం. ఈ ఎన్నికల యుద్ధానికి ముందు నారదా స్కాం, కోల్‌కతా ఫ్లై ఓవర్‌ సంఘటన, తృణమూల్‌ మూకల హింస... తదితర అస్త్రాలు వామపక్షాలకు ఎన్ని అందినా కూడా అవి మమతను నివారించలేకపోయాయి. అందుకు కారణం వారి స్వయంకృతాపరాధాలే! దశాబ్దాల తరబడి వామపక్షాలు సాగించిన పాలనతో బెంగాలీ బాబులు విసుగెత్తిపోయారు. ఒక తరం పాటు తలెత్తుకు తిరగలేనంతగా బెంగాల్‌ వెనుకబడిపోయింది. అలాంటి దౌష్ట్యం కంటే మమత మొండి వైఖరే మేలన్న అభిప్రాయానికి జనం వచ్చేశారు. బెంగాల్లో వామపక్షం మళ్లీ వెలగాలంటే, వారి పాలన తాలూకు జ్ఞాపకాలు చెరగాల్సిందేనేమో!

నైరుతి ఆశలు ఆవిరి..!

వేసవి తాపంతో అల్లాడుతూ..వడగాల్పులు, ఉక్కపోతలతో వానెప్పుడు పడుతుంది రా బాబూ..!  అని ఎదురు చూస్తున్న ప్రజలకు చేదు వార్త. దేశంలోకి నైరుతి రుతుపవనాల రాక కాస్త ఆలస్యమయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ప్రతి ఏడాది జూన్ 1 నాటికి నైరుతి రుతుపవనాలు భారత భూభాగాన్ని తాకాలి. కాని రుతుపవనాల పురోగమనానికి దోహదపడే వాతావరణం హిందూ మహా సముద్రం పరిసరాల్లో నెలకొనాలి. నిజానికి మే నెలలో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి తరువాత బలపడి అండమాన్ నుంచి తూర్పు తీరం దిశగా రావాలి. అయితే ఈ ఏడాది ఆగ్నేయ బంగాళాఖాతంలో కాకుండా శ్రీలంక సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినందునే కేరళకు రుతుపవనాల రాక ఆలస్యమవుతుందని నిపుణులు భావిస్తున్నారు.   నైరుతి రుతుపవనాల రాకకు సంబంధించి మోడల్ రూపకల్పనలో ప్రధానంగా నాలుగు అంశాలను ప్రామాణికంగా తీసుకుంటారు. వాయువ్య భారతంలో కనీస ఉష్ణోగ్రతలు, ముందస్తుగా శ్రీలంకలో కురిసే వర్షాలు, దక్షిణ చైనా సముద్రంపై అవుట్ గోయింగ్ లాంగ్ వేవ్ రేడియేషన్ తదితర అంశాల ఆధారంగా రుతుపవనాల రాకను ఐఎండీ నిర్ధారిస్తుంది. ఈ అంశాలు ప్రతికూలంగా ఉండటంతో రుతుపవనాల రాక ఆలస్యమయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు.   తెలుగు రాష్ట్రాల సంగతి చూస్తే ఈ ఏడాది వర్షాలు సకాలంలోనే పలకరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు జూన్ 7కు నాలుగు రోజులు ముందుగానీ, నాలుగు రోజుల తర్వాత గానీ కేరళను తాకే అవకాశలుండటంతో..కేరళను తాకిన తర్వాత పది రోజులకు తెలంగాణ, ఏపీల్లోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. గతేడాది రుతుపవనాలు జూన్ 5న కేరళను తాకగా..10న రాయలసీమలోకి ప్రవేశించాయని..13న తెలంగాణలోకి విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు తెలిపారు. రుతుపవనాలు కేరళను తాకిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించడానికి ఒక్కోసారి 15-20 రోజులు పట్టే అవకాశాలున్నాయని కూడా నిపుణులు అంటున్నారు.   రుతుపవనాల రాక ఆలస్యం కానుందని వాతావరణ శాఖ చేసిన ప్రకటన ప్రజల్లో నిరాశ కలిగించింది. పుష్కలంగా వర్షాలు కురుస్తాయని చెప్పిన అధికారులు రుతుపవనాల రాక ఆరు రోజు లేటవుతుందని చెప్పడంతో రైతులు షాక్‌కు గురయ్యారు. భారతదేశ వ్యవసాయరంగం ప్రధానంగా రుతుపవన వ్యవసాయమనే చెప్పవచ్చు. రుతువుల ఆధారంగానే మనదేశంలో వ్యవసాయం జరుగుతుంది. వ్యవసాయం దేశ ఆర్ధిక వ్యవస్థకి వెన్నెముక . రుతుపవనాల్లో నమోదయ్యే అటుపోట్లు ఆర్థికరంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అవి సకాలంలో వచ్చి సమృద్థిగా వర్షాలు కురిస్తే...అంతకన్నా దేశానికి కావల్సిందేమి లేదు. కానీ వాతావరణంలో మార్పుల ఫలితంగా రుతుపవనాలు సరైన సమయానికి రావడం లేదు. దీని వల్ల అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి.   దేశంలో సుమారు మూడింట రెండొంతులు వర్షాధారిత వ్యవసాయమే. ఎలాంటి నిర్మాణానికైనా పునాది పటిష్టంగా ఉండాలంటారు. సంవత్సరంలో తొలి పంట పండే ఖరీఫ్ వ్యవసాయానికి గాని ఆర్ధిక రంగానికి గాని పునాది లాంటిది. అలాంటి ఖరీఫ్ సీజన్ నైరుతి రుతుపవనాల ఆధారంగానే ప్రారంభమవుతుంది.  సకాలంలో ఎరువాక ప్రారంభించాలనుకుంటున్న అన్నదాతల్లో వాతావరణ శాఖ ప్రకటన నిరుత్సాహన్ని నింపింది. వాతావరణ శాఖ వాళ్లు ఏమైనా దేవుళ్లా వారు చెప్పినట్టు జరగడానికి అని మీరు అనుకోవచ్చు. కాని దేశంలో రుతుపవనాల ప్రవేశానికి సంబంధించి ఐఎండీ ముందస్తు అంచనాలను గత 11 ఏళ్లుగా విడుదల చేస్తోంది. గత ఏడాది తప్ప మిగిలిన పదేళ్లలో వాతావరణ శాఖ చెప్పిన అంచనాలు నిజమయ్యాయి. దీంతో నిన్న విడుదల చేసిన బులెటిన్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఏది ఏమైనా సకాలంలో వర్షాలు పడాలని ఆశిద్దాం..  

"బంగారుతల్లి"ని వదిలించుకున్న తెలంగాణ..!

ఆడపిల్లల సంక్షేమానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన "బంగారుతల్లి" పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. స్త్రీ, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి జగదీశ్వర్ ఈ మేరకు నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పథకాన్ని టీ సర్కార్ రద్దు చేస్తుందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నా..అధికారికంగా మాత్రం ఎటువంటి ఉత్తర్వులు రాలేదు. లింగ నిష్పత్తిలో అట్టడుగుకు చేరుకుంటున్న ఆడపిల్లల జనాభాను పెంచడం..భ్రూణ హత్యలను నివారించేందుకు  అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి "కిరణ్‌కుమార్ రెడ్డి" ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆయన ఎవరూ ఈ పథకాన్ని రద్దు చేయకుండా "ఆంధ్రప్రదేశ్ బంగారు తల్లి బాలికాభ్యుదాయ, సాధికారిత చట్టం-2013" పేరున దీనికి చట్టబద్థత సైతం కల్పించి "ఆడపిల్లల భారం ఇక ప్రభుత్వానిదే"నన్నారు. అప్పట్లో ఇది సీఎం మానసపుత్రికగా చలామణీ అయ్యింది.   జూన్ 1, 2014న బిల్లు అమల్లోకి వచ్చింది. ఆడపిల్ల పుట్టగానే వారి పేరు మీద ప్రత్యేక ఖాతాలు తెరిచి రూ.2500 మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. కాన్పు అనంతరం తొలి రెండేళ్ల అవసరాల కోసం రూ.1000, మూడు నుంచి ఐదేళ్లు వచ్చేవరకు రూ.1500 ఇచ్చే విధంగా చట్టంలో మార్గదర్శకాలున్నాయి. అలాగే పాఠశాల అడ్మిషన్ సమయంలో అంటే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు రూ.2000, ఎనిమిదో తరగతిలో రూ.2500, తొమ్మిది, పదో తరగతుల్లో రూ.3000, ఇంటర్మీడియట్‌కు వచ్చేసరికి రూ.3500, డిగ్రీలో చేరేనాటికి రూ.4000 ఇవ్వాలని బంగారు తల్లి పథకం నిబంధనలు చెబుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఉమ్మడి రాష్ట్రంలోని ఒక్కొ పథకాన్ని రద్దు చేయడమో లేదంటే నిధులు నిలుపదల చేయడమో చేస్తూ వస్తున్నారు. అలాంటి పథకాల్లో "బంగారు తల్లి" కూడా ఒకటి.   అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ పథకాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. 2014 జూన్ నుంచి ఇప్పటి దాకా బంగారుతల్లి పథకం కోసం ప్రభుత్వం నుంచి ఒక్కపైసా విడుదల కాలేదు. మహిళా శిశు సంక్షేమ శాఖ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ కింద నడిచే ఈ పథకానికి తెలంగాణ తొలి పద్దులో సైతం నిధుల కేటాయింపులు చేయలేదు. ఈ పథకం కోసం లక్షల్లో దరఖాస్తులు వచ్చాయి. అధికారిక సమాచారం ప్రకారం 67,848 ఆడపిల్లల కుటుంబాలు దాదాపు అన్ని ధ్రువీకరణ పత్రాలతో సహా దరఖాస్తులు చేసుకున్నాయి. కాని ఒక్కరంటే ఒక్క లబ్థిదారున్ని కూడా ఎంపిక చేయలేదు. దీని కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతర ఆడపిల్లల కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి.   అయితే ఈ పథకాన్ని రద్దు చేయడానికి గల కారణాలపై ప్రభుత్వ వాదన మరోలా ఉంది. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి విద్యాభివృద్ధితో పాటు వివాహానికి భారీ ఎత్తున ఆర్థిక సాయం చేసేందుకు తగినంత సిబ్బంది లేరని, బీసీ, ఎస్సీ, ఎస్టీ , మైనారిటీ వర్గాల్లోని నిరుపేద మహిళల వివాహానికి  కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, ఆరోగ్యలక్ష్మీ వంటి పథకాల కింద కోట్లు ఖర్చు చేస్తున్నామని..అలాంటప్పుడు మళ్లీ బంగారు తల్లి పథకం అవసరం లేదని సర్కార్ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ వాదన ఏ మాత్రం సమంజసంగా లేదు. అయితే రెండేళ్లుగా ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారి పరిస్థితి.. తదితర విషయాలపై గాని ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వక ఉన్నపళంగా రద్దు చేయడం మాత్రం ఏ మాత్రం బాగోలేదు. ఒక ఊరికి వెళ్లడానికి వంద దారులున్నట్టు, ఒకే రకమైన ఉపయోగం కోసం చాలా రకాల పథకాలు అమల్లో ఉన్నాయి. ప్రజలు వాటిలో తమకు నచ్చిన దానిని ఎన్నుకుని దరఖాస్తు చేసుకుంటారు. ప్రభుత్వ అంతిమ లక్ష్యం ప్రజల సంక్షేమం ఎన్ని పథకాలున్నాయని కాదు వాటి వల్ల ప్రజలకు లబ్ధి కలిగిందా లేదా అన్నదే కావాల్సింది.