ఒక వ్యక్తి మరణం..కాశ్మీరాన్ని రగిలిస్తోంది
posted on Jul 11, 2016 @ 11:56AM
మోస్ట్ వాంటెడ్ హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వానీని సైన్యం హతమార్చడంతో జమ్మూకశ్మీర్ అట్టుడుకుతోంది. ఆ రోజు చేలరేగిన హింస ఇవాళ్టీకి కొనసాగుతోంది. ముఖ్యంగా భద్రతాదళాలు, పోలీసులే లక్ష్యంగా అల్లరిమూకలు దాడులకు తెగబడుతున్నాయి. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు 21 మంది మరణించారు, 200 మందికి పైగా గాయపడ్డారు. అందులో 96 మంది పోలీసులేకావడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఒక ఉగ్రవాది మరణిస్తే కశ్మీర్ లోయ ఇంతలా ఎందుకు మండుతోంది అనేది ఒకసారి చూస్తే..జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని విస్తరించడమే ధ్యేయంగా ముందుకు వెళుతున్న వ్యక్తి బుర్హాన్ వాని.
కశ్మీర్‌లో వేర్పాటువాదులు ఎన్నో ఏళ్లుగా ఆధునాతన తుపాకులు, పేలుడు పదార్థాలను ఆయుధాలుగా ఉపయోగిస్తే అతను మాత్రం సోషల్ మీడియాను ఆయుధంగా ఎంచుకున్నాడు. కశ్మీర్‌ను ఎలాగైనా పాక్‌లో విలీనం చేయాలని కరడు గట్టిన ఉగ్రవాద సంస్థ అయిన హిజ్బుల్ ముజాహిదీన్‌లో చేరాడు. ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా కశ్మీరీ యువతను ఆకట్టుకుని..తీవ్రవాద భావాలను, వేర్పాటువాద బీజాలను వారి మనసులో నాటాడు. సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతూ..ఉత్తేజపూరితమైన ప్రసంగాలు చేస్తూ ఎంతోమంది యువతను ప్రభావితం చేశాడు. తీవ్రవాదులుగా వచ్చే వారికి బహుమతులు, ఆయుధాలు ఎరగా వేసేవాడు.
దీంతో దిగువ మధ్యతరగతి. పేద వర్గాలకు చెందిన యువకులు ఎందరో అతని అనుచరులు అయ్యారు. ఇతని కదలికలపై నిఘా పెట్టిన భద్రతాదళాలు..తాజాగా త్రాల్ అటవీ ప్రాంతం నుంచి ఈద్ వేడుకులకు వస్తున్నాడనే స్పష్టమైన సమాచారంతో మాటువేసి బుర్హాన్‌ను మట్టుబెట్టాయి. బుర్హాన్ మరణాన్ని ఒక ఉగ్రవాది మరణంగా అక్కడి యువత భావించలేదు. గతంలో ఎందరో ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్లలో చనిపోతే వారిపై ఎటువంటి అభిమానం వ్యక్తమయ్యేది కాదు. కానీ బుర్హాన్ ఎన్‌కౌంటర్ మాత్రం తీవ్ర ప్రభావాన్ని చూపింది. కశ్మీర్ యువత అతడిని తమలో ఒకరిగా..ఒక హీరోగా భావించడమే అందుకు కారణం.
బుర్హాన్ మరణాన్ని జీర్ణించుకోలేని యువత అందుకు కారణమైన భద్రతా బలగాలపై కక్ష పెంచుకున్నాయి. అందుకే వారిని టార్గెట్ చేశారు. నిన్న జీలం నదిలోకి పోలీస్ జీపును తోసేయ్యడంతో డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. అంతకు ముందు రోజు హాంజీపురా పోలీస్‌స్టేషన్ మీద యువత దాడి చేసినపుడు ముగ్గురు పోలీసులు జాడ తెలియకుండా పోయారు..ఇప్పటికి వారి క్షేమ సమాచారం అందడం లేదు. అనంతనాగ్ జిల్లాలో పోలీస్‌స్టేషన్‌పై రాళ్లదాడికి పాల్పడ్డారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాజధాని శ్రీనగర్ సహా కశ్మీర్ లోయ అంతటా కర్ఫ్యూ విధించింది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. భద్రతా దళాలు గుంపును అదుపు చేయాల్సి వచ్చినపుడు తీసుకునే అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని, ప్రాణనష్టాన్ని తగ్గించాలని సీఎం, వేర్పాటువాద పార్టీలను కోరారు. ప్రభుత్వం తీసుకునే చర్యలు..కశ్మీర్ యువత గుండెల్లో మండుతున్న అగ్గిని ఏమేరకు చల్లార్చుతాయో వేచిచూడాలి.