ఒక ఉపన్యాసం: ఉత్తేజం..విధ్వంసం
posted on Jul 8, 2016 @ 12:40PM
ఉపన్యాసం..తనలోని భావాలతో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే ఒక అరుదైన కళ. కాకలు తీరిన మహా సామ్రాజ్యాలను సైతం కకావికలం చేసిన శక్తి ఉపన్యాసానికి ఉంది. భారత స్వాతంత్ర్యోద్యమంలో జాతి నేతలుగా వెలుగొందిన వాళ్లకి ఈ నేర్పరితనం ఉంది. నేతాజీ ఉపన్యాసం వింటే ఒంట్లోని రక్తం ఉడుకేక్కిపోయేదని చెప్పుకునేవారు. ఎన్టీఆర్ తన వాగ్ధాటితో 125 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీని మట్టికరిపించారు. వివేకానంద అమెరికా పర్యటనలో చేసిన ఉపన్యాసాలు ప్రజలను ఉర్రూతలుగించి చివరి వరకూ వారు మంత్రముగ్ధులై తల తిప్పుకోకుండా కూర్చుండిపోయేవారు. ఆయన ఉపన్యాసం పూర్తికాగానే శ్రోతలు నూతన ధైర్యంతో, నూతన ఆశాభావంతో, కొత్త శక్తితో, కొత్త విశ్వాసంతో కదలివెళ్ళేవారు. ఆ ఉపన్యాసాలన్ని జాతిని చైతన్యపరిచి నవశకానికి నాంది పలికాయి. ఉపన్యాసంతో కలిగే చైతన్యం మంచితో పాటు చెడు కూడా చేయిస్తుందనడానికి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఉగ్రదాడే ప్రత్యక్ష నిదర్శనం.
ముష్కరులు అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే హోలి ఆర్టిసన్ రెస్టారెంట్‌పై దాడి చేసి 20 మంది విదేశీయులను ఊచకోత కోసిన ఘటన ప్రపంచాన్ని దిగ్భ్రాంతి పరిచింది. ఆ ఉగ్రదాడిలో పాల్గొన్న ముష్కరులు ఒక ప్రసంగం నుంచి స్పూర్తి పొంది దాడులకు దిగారన్న వార్తలు మరోసారి కలకలం రేపాయి. ఆ ప్రసంగం చేసిన వ్యక్తి ఏ ఇస్లామిక్ దేశానికి చెందిన వ్యక్తో కాదు సాక్షాత్తూ మన భారతదేశానికి చెందిన వ్యక్తి.. డాక్టర్ "జకీర్ నాయక్". ముంబయికి చెందిన ఈయన ఇస్లామ్ మత బోధకుడు అహ్మద్ దీదత్ నుంచి ప్రేరణ పొంది ఇస్లామిక్ ఇంటర్నేషనల్ స్కూల్‌తో పాటు యునైటెడ్ ఇస్లామిక్ ఎయిడ్ అనే సంస్థనూ ప్రారంభించి పేద ముస్లిం యువతకు ఉపకార వేతనాలను అందిస్తున్నారు.
ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను స్థాపించిన ఆయన పీస్ టీవీ అనే ఛానల్‌ను స్థాపించి దాని ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉపన్యాసాలు ఇచ్చారు. ఎన్నో చర్చల్లో పాల్గొన్నారు. అలా ఆయన ఉపన్యాసాలను విన్నవారిలో ఉగ్రవాదులు ఉన్నారు. తాజాగా ఆయన ప్రసంగాలు పలువురిని ఉగ్రవాదం వైపు నడిపించాయని వార్తలు వినిపిస్తున్నాయి. 2008లో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరిగిన మారణహోమానికి సూత్రధారిగా వ్యవహరించిన "హఫీజ్ సయీద్" చెందిన "జమాత్ ఉద్ దవా " సంస్థ వెబ్‌సైట్‌లో ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ పేరు ఉంది. దీంతో జకీర్ "జమాతే" ఉగ్రవాదులకు బోధనలు వినిపిస్తున్నారన్నట్లు తేలిపోయింది.
ఉగ్రదాడులకు తన బోధనలే కారణమన్న వార్తలతో జకీర్ నాయక్ స్పందించారు. ఉగ్రవాదానికి తాను పూర్తి వ్యతిరేకుడినని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని ఆరోపించారు. ఎవరినైనా భయభ్రాంతులకు గురిచేసేవాడు ఉగ్రవాది అని నాటి కార్యక్రమంలో నేను చెప్పాను. దొంగను పోలీసు భయపెడతాడంటూ ఉదహరించానని.. అంటే దొంగ దృష్టిలో పోలీసు ఉగ్రవాది అన్నమాట. సమాజ వ్యతిరేక శక్తులకు ప్రతి ముస్లిం ఉగ్రవాదిగా మారాలి అని వివరించానని నాయక్ తెలిపారు. ఈ వ్యాఖ్యలపై కేంద్రప్రభుత్వం మండిపడింది..నాయక్ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని వెల్లడించింది. మరోవైపు జకీర్ నాయక్‌పై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విచారణకు ఆదేశించారు. ఇలా జకీర్ తన మాటలతో చిక్కులను కొని తెచ్చుకున్నట్లైంది. రాబోయే రోజుల్లో అతని భవిష్యత్తు ఏంటో తేలిపోనుంది.