ప్రాణాలు నిలబెడుతున్న సీఎం సహాయనిధి
posted on Jul 15, 2016 @ 12:48PM
చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం ఆర్‌ఎస్ కొత్తపల్లెకు చెందిన రమణప్ప, సరస్వతి దంపతుల కుమార్తె జ్ఞానసాయి దీనగాధ గుర్తుందా..? పాపకు పుట్టుకతోనే కాలేయ సంబంధ వ్యాధి ఉన్నట్లు తెలియడంతో ఆ తల్లిదండ్రులు తిరగని ఆసుపత్రి లేదు..ఆపరేషన్ చేయాలని అందుకు 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. అంతస్తోమత రమణప్ప కుటుంబానికి లేకపోవడంతో పాపను చంపడానికి అనుమతి ఇవ్వాలంటూ కారుణ్య మరణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. కారుణ్య మరణం పిటిషన్ చూసిన అక్కడి న్యాయవాదులు, జడ్జి నివ్వెరపోయారు. ఇది తమ పరిధిలోకి రాదని పైకోర్టుకు వెళ్లాలని సూచించడంతో దంపతులు మీడియా ఎదుట తమ గోడును వెళ్లబోసుకున్నారు.
వీరి ఆవేదన మొత్తం పత్రికల్లో రావడం మరుసటి రోజు క్యాంపు కార్యాలయంలో పత్రికలు చదువుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఈ కథనం కనిపించడంతో ఆయన చలించిపోయారు. పాపకు కావాల్సిన చికిత్సను అందించాలని మంత్రి కామినేని శ్రీనివాస్‌ను ఆదేశించారు. వెంటనే పాప చికిత్సకు కావాల్సిన రూ.30 లక్షల మొత్తాన్ని "సీఎం సహాయనిధి" నుంచి విడుదల చేశారు. ఇలా ఈ ఒక్క పాప మాత్రమే కాదు..తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, వైద్యం చేయించుకోవడానికి అవసరమైన ఆర్థిక స్థోమత లేని పేదలకు "ముఖ్యమంత్రి సహాయనిధి" చేయూతనందిస్తోంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో సీఎంఆర్ఎఫ్ ద్వారా 20,312 మందికి రూ.167.36 కోట్ల ఆర్థిక సాయం అందించారు.
సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సాయం చేస్తారని జనానికి తెలుసు కాని...దానిని ఎలా పొందాలో..ఎవరిని సంప్రదించాలో తెలిసేది కాదు. హైదరాబాద్ వెళ్లి రెండు మూడు ఆఫీసుల చుట్టూ తిరగాల్సి ఉండేది. పెద్ద సిఫార్సులు ఉంటే తెల్ల రేషన్ కార్డు లేకపోయినా సీఎం కార్యాలయ అధికారులు ఆర్థిక సహాయాన్ని అందించేవారు. అంతే కాకుండా మంత్రి సిఫారసు ఉంటే దరఖాస్తు చేసుకున్న మొత్తంలో 85 శాతం వరకూ మంజూరు చేస్తుండగా, సీఎం వద్ద పలుకుబడి ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైనా సిఫారసు చేస్తే 75 నుండి 80 శాతం వరకూ ఆర్థిక సహాయాన్ని అందించేవారు. ఎవరి సిఫారసు లేని పేదలు వాస్తవంగా వైద్యానికి అయిన ఖర్చులుకుగాను నేరుగా దరఖాస్తు చేసుకుంటే అందులో 15 శాతం నుండి 30 శాతం వరకూ మాత్రమే మంజూరు చేసేవారు. ముఖ్యమంత్రి సహాయనిధి ఎప్పటి నుంచో అమల్లో ఉన్నా, చంద్రబాబు ప్రభుత్వం దానిని ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు సీఎం కార్యాలయం విజయవాడకే వచ్చేయడంతో నేరుగా అక్కడే దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో బాధితులు నేరుగా ముఖ్యమంత్రినే కలిసే అవకాశం కూడా ఉంది.
సీఎంఆర్ఎఫ్ కింద పేద రోగులకు మూడు విధాలుగా సహాయం అందుతుంది. దానిలో మొదటిది లెటర్ ఆఫ్ క్రెడిట్ దీని కోసం వైద్యుడి సిఫారసు లేఖ, మెడికల్ రిపోర్టులు, గుర్తింపు కార్డు, తెల్ల రేషన్ కార్డు లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రంతో దరఖాస్తు చేసుకోవాలి. వాటిని పరిశీలించిన మీదట వైద్యానికి ఎంత ఖర్చవుతుందో లెక్కవేసుకుని..దానిలో కొంత మొత్తాన్ని మంజూరు చేసి నేరుగా రోగికి చికిత్స చేసిన ఆసుపత్రికి పంపిస్తారు. మరో పద్ధతి రీయంబర్స్‌మెంట్..అత్యవసర పరిస్థితుల్లో రోగులు ఆసుపత్రుల్లో చేరి వైద్యం చేయించుకుని, ఆ తర్వాత తమకు ఎంత ఖర్చయిందో తెలిపే ఆసుపత్రి బిల్లులు, రిపోర్టులతో దరఖాస్తు చేసుకోవాలి. వాటిని పరిశీలించిన అధికారులు కొంత మొత్తాన్ని మంజూరు చేస్తారు.
మూడో విధానం..ఎన్టీఆర్ వైద్య సేవ కింద గుర్తించిన వ్యాధితో బాధపడుతూ..ఈ పథకం కింద చికిత్స పొందే అర్హత ఉండి కూడా..తెల్ల రేషన్‌కార్డు గానీ, ఎన్టీఆర్ వైద్యసేవ కార్డుగానీ లేకపోతే అలాంటి వారు నేరుగా విజయవాడలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ వైద్యసేవ కేంద్రానికి రోగితో సహా వస్తే, అక్కడి వైద్యులు ఆ రోగిని పరిశీలించి ఒక సిఫారసు లేఖ ఇస్తారు. దాని ఆధారంగా ఉచితంగా చికిత్స పొందవచ్చు.