స్వాతి హత్యకు బదులేది!
posted on Jul 4, 2016 @ 1:05PM
దక్షిణ భారతదేశాన్నంతా ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన ‘స్వాతి’ హత్య కేసు ఒక కొలిక్కి వచ్చింది. ఆమెను కొంతకాలంగా వెంటాడుతూ వచ్చిన రామ్‌కుమార్ అనే యువకుడే ఈ హత్యకు పాల్పడ్డాడని తేలింది. కానీ నిందితుడు అందించిన వివరాలతో మరిన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న స్త్రీల రక్షణ గురించి మరిన్ని భయాలు కలిగిస్తున్నాయి.
స్వాతిని తాను ఫేస్‌బుక్‌లో చూసి ప్రేమించాననీ, ఆమెతో ఫేస్‌బుక్‌లోనే పరిచయం చేసుకున్నాననీ రామ్‌కుమార్ చెప్పుకొస్తున్నాడు. అలా ఫేస్‌బుక్ ద్వారా మొదలైన పరిచయాన్ని ప్రేమగా మార్చుకునేందుకు రామ్‌కుమార్ ప్రయత్నించడంతో స్వాతి నుంచి నిరాకరణ ఎదురైంది. ఆ నిరాకరణని జీర్ణించుకోలేని రామ్‌కుమార్ ఆమె మీద హత్యాయత్నానికి ఒడిగట్టాడు. వేలమంది తిరిగే నుంగంబాక్కమ్ (చెన్నై) రైల్వే స్టేషన్లో, నిర్భయంగా ఆమె గొంతుకోసి చంపేశాడు. ఎక్కడో తిరువన్వేలిలో ఉండే రామ్‌కుమార్, స్వాతిని వెతుక్కుంటూ చెన్నైకి రావడం వెనుక సామాజికమాధ్యమాల పాత్ర ఉండటం దురదృష్టకరం.
నిజానికి ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలను యువత ప్రమాదరహితంగా భావిస్తోంది. చాప కింద నీరులా తమ జీవితాన్ని ప్రభావితం చేయగల సత్తా వీటికి ఉందన్న ప్రమాదాన్ని గ్రహించలేకపోతోంది. ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్‌ని ఎన్నుకొనేటప్పుడు కూడా ఎంతో అప్రమత్తంగా ఉండాలన్న సూచనని రామ్‌కుమార్ వంటి ప్రబుద్ధులు అందిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్, వారితో షేర్ చేసుకునే ఫొటోలు.... ఆఖరికి లైక్ చేసే పోస్టులు కూడా కొన్ని మృగాలకి ఆటవిడుపుగా మారే ప్రమాదం లేకపోలేదు.
సోషల్ మీడియాలో అకారణమైన పరిచయాలు, రోజుకో హత్యకు దారితీస్తున్నా.... అటు పోలీసులు కానీ, ఇటు సామాజిక మాధ్యమాలు కానీ వినియోగదారులని హెచ్చరించే ప్రయత్నాలు ఎందుకు చేయడం లేదన్నది అసలు ప్రశ్న! మొన్నామధ్య ఇంటర్నెట్ మీద ఆధిపత్యం కోసం ఫేస్‌బుక్ కోట్ల రూపాయలను వెచ్చించి ప్రకటనలను రూపొందించింది. తమ పప్పులు ఉడకకపోయేసరికి మన దేశ వ్యవస్థను దుమ్మెత్తిపోసింది. కానీ కొత్తవారితో స్నేహం చేసే ముందు జాగ్రత్త అంటూ ఎక్కడన్నా మనకు పోస్టరు కనిపించిందా? ప్రకటన వినిపించిందా? సామాజిక మాధ్యమాల ద్వారా నేరస్తులు చెలరేగిపోతున్నారంటూ బాధపడుతున్న పోలీసులు, ఈ దిశగా ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రజల్లో సైబర్ క్రైం పట్ల అవగాహన కలిగించేందుకు ప్రభుత్వాలు, కళాశాలలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి?... లాంటి ప్రశ్నలెన్నో జవాబులు లేకుండా తిరిగి తిరగి వినిపిస్తూనే ఉన్నాయి.
స్వాతి హత్యలో కేవలం సామాజిక మాధ్యమాల దుర్వినియోగమే కాదు... స్త్రీల రక్షణ ఎంత దారుణమైన స్థితిలో ఉందో కూడా కనిపిస్తోంది. లేకపోతే ఒక మహా నగంలోని ముఖ్యమైన రైల్వే స్టేషన్లో పగటివేళ ఇలాంటి దారుణం జరగడం ఏమిటి? దానిని నివారించేందుకు కానీ, కనీసం బాధితురాలిని వైద్యం కోసం తరలించేందుకు కానీ ఎవ్వరూ ముందుకు రాకపోవడం ఏమిటి? సామాజిక మాధ్యమాల మాట అటుంచితే, సమాజంలోని ఈ వింత పోకడలే మరింత భయాన్ని కలిగిస్తున్నాయి స్వాతి హత్యకు బదులివ్వమని మనలో ప్రతి ఒక్కరినీ నిలదీస్తున్నాయి.