పుష్కరశోభ

శ్రావణమాసపు శోభతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిస్తున్న సమయంలో తెలుగురాష్ట్రాలకు మరో కొత్త పండుగ వచ్చింది. పవిత్ర కృష్ణవేణీ పుష్కరాలు ఇవాళ్టీ నుంచి ప్రారంభంకానున్నాయి. భక్తజనం పారమార్థిక భావనతో పులకరించిపోయేలా.. ప్రకృతి అందాల నడుమ నదీమతల్లి ఆశీర్వాదంతో మైమరచిపోయేలా.. కృష్ణవేణి పుష్కర సంరంభం ఆరంభమయ్యింది. గురుడు ప్రతి సంవత్సరం ఒక్కోరాశిలో సంచరిస్తాడు. అందువల్ల దేశంలోని 12 నదులకు పుష్కరాలు వస్తాయి. ఆ ప్రకారం ఆయన కన్యారాశిలోకి ప్రవేశించినందువల్ల కృష్ణానదికి పుష్కరాలు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. నిన్న రాత్రి 9.28 నిముషాలకు బృహస్పతి కన్యారాశిలోకి ప్రవేశించడంతో కృష్ణానదీకి పుష్కరాలు ఆరంభమయ్యాయి.   మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వతసానువుల్లో రావి చెట్టు మొదటి నుంచి చిన్న బిందువుగా కృష్ణా ప్రవాహం ప్రారంభమైంది. విష్ణుమూర్తి అంశ కాబట్టి "కృష్ణ"గా..నల్లరేగడి మీద ప్రస్థానాన్ని ప్రారంభించింది కాబట్టి, నేలను బట్టి "కృష్ణ" అన్న పేరొచ్చిందిని చెబుతారు. మహారాష్ట్రలోని సహ్యాద్రిలో పుట్టి..కన్నడిగుల ఇంట కస్తూరి తిలకం దిద్దుకుని..తెలంగాణలో కుడికాలు మోపి..ఆంధ్రలో బిరబిరా పరుగులిడుతూ హంసలదీవి వద్ద సముద్రుడితో సంగమించేదాకా..నాలుగు రాష్ట్రాల్లో పద్నాలుగు వందల కిలోమీటర్ల ప్రస్థానంలో లక్షల ఎకరాల నేలను సస్యశ్యామలం చేసింది, కోట్లాది మంది ప్రజల గొంతు తడిపింది, ఎన్నెన్నో జలచరాలకు ఆవాసమైంది. అలా పంటలిచ్చి కడుపునింపే తల్లికి, నీళ్లిచ్చి గొంతు తడిపే దేవతకు..పన్నెండేళ్లకోసారి జరిగే పండుగే పుష్కరం.   కృష్ణానదికి పుష్కరాలంటే తెలుగుజాతికి ఓ పెద్ద పండుగ. ఈ పండుగకు తెలుగు రాష్ట్రప్రభుత్వాలు భారీ ఏర్పాట్లు చేశాయి. రెండు రాష్ట్రాలను దాటి తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా "సంగం" వద్ద తెలుగింట కాలు మోపుతుంది కృష్ణమ్మ. తెలంగాణ రాష్ట్రంలో 300 కిలోమీటర్ల మేర ప్రయాణించే కృష్ణవేణి ఆ నేలను సుభిక్షం చేస్తోంది. తెలంగాణ ఆవిర్భవించాక జరుగుతున్న మొట్టమొదటి కృష్ణాపుష్కరాలు కావడంతో ఆ రాష్ట్రప్రభుత్వం ఏర్పాట్లు ఘనంగా చేసింది. ముఖ్యమంత్రి ఆదేశం మేరకు కృష్ణా పుష్కరాల ఆహ్వాన కమిటీ చైర్మన్ కేవీ రమణాచార్యుల సారథ్యంలో తెలంగాణ చీఫ్ ఎడిటర్ అష్టకాల రామ్మోహనశర్మ, మృత్యుంజయశర్మ తదితరులు.. శృంగేరీ పీఠాధిపతి జగద్గురువులు శ్రీ భారతీతీర్థ మహాస్వామితో ప్రారంభించి జగద్గురువులను, యతీంద్రులను కృష్ణా పుష్కరాలకు ఆహ్వానించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య తెలంగాణ సీఎం కేసీఆర్ పుష్కరాలను ఇవాళ లాంఛనంగా ప్రారంభించారు. మహబూబ్‌నగర్ జిల్లా గొందిమళ్ల ఘాట్ దగ్గర సీఎం దంపతులు పుష్కర స్నానం ఆచరించారు.    ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకం: ఆంధ్రప్రదేశ్‌కు ఈ పుష్కరాలు ప్రత్యేకమైనవి..ఆంధ్రరాష్ట్ర తొలి రాజధాని ప్రాంతం నుంచి ఆంధ్రుల ప్రజా రాజధాని మీదుగా కృష్ణమ్మ తాను నడిచి వచ్చే ప్రాంతమంతా ఆకుపచ్చ చీరను చుట్టింది. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో జరుగుతున్న తొలి కృష్ణాపుష్కరాలు కావడంతో ప్రభుత్వం వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కృష్ణా పుష్కర ప్రధాన కేంద్రం విజయవాడతో పాటు కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో మొత్తం 170 ఘాట్లు ఏర్పాటు చేసింది. గురుడు నిన్న రాత్రి సరిగ్గా 9.28 నిమిషాల సమయంలో కన్యారాశిలోకి ప్రవేశించగానే పుష్కరాలు ప్రారంభమైన సంకేతంగా విజయవాడ కృష్ణాతీరంలో కొత్త కాంతులు రంగరించుకున్నాయి.   రంగురంగుల వస్త్రాలు ధరించిన వెయ్యిమంది కళాకారులు శోభాయాత్ర ప్రారంభించారు. అనంతరం దుర్గాఘాట్‌లో తొమ్మిది మంది రుత్వికులు మనసా, వాచా,కర్మణా పవిత్రభావంతో మంత్రోచ్ఛారణతో దీపాలు చేతబట్టి కృష్ణమ్మకు హారతులిచ్చే అద్భుత సన్నివేశంతో ప్రతి హృదయం పులకించిపోయింది. ప్రకాశం బ్యారేజ్‌ వద్ద పేల్చిన బాణాసంచా చూపరులను కట్టిపడేసింది. ఈ ఉదయం ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణాపుష్కరాలను లాంఛనంగా ప్రారంభించారు. వేకువ జామునే కుటుంబసభ్యులతో కలిసి ఆయన పుణ్యస్నానమాచరించి పుష్కరుడికి హారతులిచ్చారు. ఈ వేడుకలు ఇవాళ్టీ నుంచి 23 వరకు జరగనుండటంతో ఆ పన్నెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో పండుగే. జీవన ప్రవాహంలా నదిలా నలుగురికీ ఉపయోగపడినప్పుడే..మనిషి పుట్టుకకు పరిపూర్ణత. అప్పుడే నదిని మనం తలుచుకున్నట్లు..జనం మనల్ని తలుస్తారు.

పుష్కరకాలం వచ్చేసింది

  మొత్తానికి కొద్ది నెలలుగా ఎదురుచూస్తున్న పుష్కరాలు ముంచుకువచ్చేశాయి. రేపు తెల్లవారుజామున కృష్ణమ్మతల్లికి నీరాజనాలను అర్పించి, పుష్కరుని స్వాగతించేందుకు పండితులంతా సిద్ధమైపోయారు. ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తరువాత కృష్ణమ్మకు వస్తున్న తొలి పుష్కరాలు కావడంతో ఇరు ప్రభుత్వాలూ వీటి నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కానీ గత పుష్కరాల నుంచి ఏమన్నా గుణపాఠాలు నేర్చుకున్నాయా లేదా అన్నదే అందరిలోనూ మెదుల్తున్న ప్రశ్న!   గత ఏడాది గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన పొరపాటు సామాన్యమైనది కాదు. రాజమండ్రి కోటగుమ్మం వద్దనున్న పుష్కరఘాట్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో 29 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. షార్ట్‌సర్క్యూట్‌ జరిగిందన్న వదంతితో జనం తోపులాటకు దిగారని కొందరంటే, ముఖ్యమంత్రిగారి కోసం జనాలని ఆపి ఉంచడం వల్లే ప్రమాదం జరిగిందని కొందరు ఆరోపించారు. ఏది ఏమైనా, అధిక మొత్తంలో భక్తులు ఒక్కసారిగా స్నానానికి సిద్ధపడటంతో ఈ అనర్థం జరిగిందన్నది సుస్పష్టం. ఫలానా చోట పుష్కర స్నానం చేస్తేనే పుణ్యం వస్తుంది. మొదటి రోజునే మునిగితే అధికఫలం దక్కుతుంది.... వంటి ప్రవచనాలతో ఊదరగొట్టిన ప్రవచనకారులు, జరిగిన అనర్థానికి కిమ్మనకుండా మిన్నకుండిపోయారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం జాతీయస్థాయిలో అభాసుపాలైంది.   గోదావరి పుష్కరాల అనుభవం దృష్ట్యా ఈసారి ప్రభుత్వం మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లే కనిపిస్తోంది. ఇరు రాష్ట్రాలలోనూ కృష్ణాతీరం వెంబడి వందలాది ఘాట్లను నిర్మించారు. ఒక్క కృష్ణాజిల్లాలోనే 70కి పైగా ఘాట్ల నిర్మాణం జరిగింది. వీటికి తోడు ఆంధ్రప్రదేశ్‌లో పుష్కరాల నిర్వహణ కోసం ఏకంగా లక్షమంది అధికారులను నియమించినట్లు తెలుస్తోంది. వేల కొద్దీ ప్రత్యేక బస్సులు, రైళ్లు పరుగులెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి! మరోవైపు శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలుగకుండా ముందస్తుగా రౌడీషీటర్లను అదుపులోకి తీసుకుంటున్న వార్తలూ వినిపిస్తున్నాయి. ఇక రోజూ లక్షలమందికి అన్నదానాలు, సాంస్కృతిక కార్యక్రమాల సంగతి సరేసరి.   కాగితాల మీద చూడ్డానికి పుష్కరాల ఏర్పాట్లు చాలా ఘనంగానే కనిపిస్తున్నాయి. కానీ లక్షలాది మంది జనం ఒక్కసారిగా వచ్చిపడ్డాక పరిస్థితి ఎలా ఉంటుందన్నదే ఉద్వేగాన్ని కలిగించే అంశం. కొన్ని చోట్ల ఘాట్ల నిర్మాణం హడావుడిగా, నాసిరకంగా సాగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గత ఏడాదిలాగానే ఈసారి కూడా ప్రచార ఆర్భాటానికే ప్రాధాన్యతని ఇస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదృష్టవశాత్తూ ఈసారి భారీ వర్షపాతం కారణంగా పుష్కరఘాట్ల పొడవునా స్నానానికి తగినంత నీరు ఉంది. పైగా తెలుగుప్రాంతాల నడిబొడ్డున ఉండే ఆరు జిల్లాలగుండా (నల్లగొండ, మహబూబ్‌నగర్‌, కర్నూలు, కృష్ణా, గుంటూరు) కృష్ణానది సాగడంతో పుష్కర స్నానం కాస్త సులువుగానే జరిగే అవకాశం ఉంది.   ప్రభుత్వాలు ఎన్ని ఏర్పాట్లు చేసినా, ప్రకృతి ఎంత చల్లగా చూసినా... ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత భక్తుల మీద కూడా ఉంటుంది. ఫలానా రోజునే స్నానం చేయాలి, స్నానం చేశాక నదిలోకి మట్టిగడ్డలు విసరాలి, పుణ్యక్షేత్రాలు ఉన్నచోటే పుష్కరస్నానం చేయాలి... వంటి పట్టుదలలకు పోకుండా ఉంటే చాలు. అన్నింటికీ మించి... పుష్కర స్నానం అనేది ఒక మంచి ఆచారమే కానీ, స్నానం చేయనంత మాత్రాన నానా పాపాలూ చుట్టుకుంటాయన్న భ్రమని వీడితే మంచిది.

ఒక్క ఎన్‌కౌంటర్..వంద ప్రశ్నలు

వెయ్యి ప్రాణుల్ని వేట్నో మెక్కిన శాల్తీ ఒకటి... ఒక్క గాలివానకు తుడిచి పెట్టుకుపోయిందట! నయీమ్ ఎన్ కౌంటర్ ఇదే సామెత నిజం చేసింది! ఏళ్లుగా , దశాబ్దాలుగా నయీమ్ పేరు వినటమే తప్ప నిజంగా అతను ఎవరు, ఏంటని పెద్దగా ప్రచారం జరగలేదు. అయితే, అతనో గ్యాంగస్టర్ అని, సెటిల్మెంట్లు చేస్తుంటాడని అందరికీ తెలుసు. కాని, నయీమ్ హఠాత్తుగా ఆగస్ట్ ఎనిమిదన పోలీసుల చేతుల్లో ఎన్‌కౌంటర్ కావటంతో తీగలు మెల్లమెల్లగా లాగబడుతున్నాయి. డొంక కూడా అదే స్థాయిలో ఆశ్చర్యకరంగా కదులుతోంది! నయీమ్ ది నల్గొండ జిల్లా. విద్యార్థిగా వున్నప్పుడే జేబులో పాముల్ని, తేళ్లని వేసుకుని వచ్చి తోటి పిల్లల్ని గడగడలాడించే వాడట! ఆ బుద్దీ ఎన్‌కౌంటరై టపా కట్టేదాకా ఆయనకి పోలేదు. కాకపోతే ఏజ్ పెరిగిన కొద్దీ నయీమ్ భయపెట్టే వాళ్ల స్థాయి కూడా మారుతూ వచ్చింది. ఆయన ఫోన్ నుంచి కాల్ వస్తే చెమటలతో తడిసేపోయే వారి రేంజ్ మామూలు బిజినెస్‌మెన్ మొదలు ఐపీఎస్, పొలిటీషన్స్ వరకూ వుండేది.   అసలు నయీమ్ క్రిమినల్ సత్తా మనకు సరిగ్గా తెలియాలంటే ఒక్క విషయం చాలు! ఆయన వద్దకు పోయి పెద్ద పెద్ద ఐపీఎస్‌లే తమకు పోస్టింగ్ లు ఎక్కడ కావాలో అక్కడ వేయించుకునే వారట! ప్రభుత్వంలో మనోడి అక్రమ ప్రమేయం ఆ రేంజ్లో వుండేది! అయితే,  ఇలాంటివి పక్కాగా ఎవరికీ తెలియకపోయినా నయీమ్ గురించిన అనేక షాకింగ్ విషయాల్లాగే ఈ పోస్టింగ్ ల విషయం కూడా ప్రచారంలో వుంది. నయీమ్ పోస్టింగ్‌లు చేయించటం లాంటి విషయాలు పక్కన పెడితే అతని వ్యవహారం మాత్రం హై రేంజ్ అనేది క్లియర్. వందల కోట్ల సెటిల్మెంట్లు నయీమ్‌కి నిత్యకృత్యం. ఆ క్రమంలో దమ్కీలు, మర్డర్లు ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ కూడా మామూలే. దావూద్ మొదలు సోహ్రాబుద్దీన్ వరకూ , ఇప్పుడు నయీమ్ దాకా అందరు క్రిమినల్స్ టాప్ క్రిమినల్స్ బయోడేటా ఇలాగే వుంటుంది. కాని, నయీమ్ విషయం లో మాత్రం ఒక్క ప్రత్యేకత మనల్ని ఆశ్చర్యపరుస్తుంది...   నయీమ్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. కాని, పోలీసులకి ఎన్నో రోజులుగా దొరక్కుండా తిరుగుతున్నాడని ప్రచారం జరుగుతోన్న నయీమ్ ఎన్ కౌంటర్ కాగానే కొందరు లోకల్ జర్నలిస్టులతో సహా చాలా మందినే అదపులోకి తీసుకుని విచారించి వదిలిపెడుతున్నారు. పోలీసులు అనుమానంతో అరెస్ట్ చేసిన వారంతా నయీమ్ మనుషులే అవ్వాల్సిన పని లేకున్నా అతడితో చాలా మందే టచ్ లో వుంటూ వచ్చారన్నది మాత్రం క్లియర్. అసలు బయట నడుస్తున్న అనధికారిక ప్రచారం నయీమ్‌‌ను చాలా సార్లు పోలీసులు , పొలీటీషన్స్ కూడా వాడుకున్నారట. తాము నేరుగా హ్యాండిల్ చేయటం కుదరని సెటిల్మెంట్లు వంటివి నయీమ్ చేత చేయించి తిలా పాపం తల పిడికెడు పిడికెడు పిడికెడు... అన్నట్టు అందరూ పంచుకునే వారట! రాజకీయ నేతలు, పోలీసు అధికారులతో వున్న ఈ లింక్ వల్లే నయీమ్ ఇంత కాలం మహారాజాలా లైఫ్ గడిపాడు. లేకపోతే వందల కోట్ల సెటిల్మెంట్లు చేస్తూ పెద్ద తలనొప్పిగా మారిన ఒక క్రిమినల్ ఇంత కాలం ఎన్‌కౌంటర్ అవ్వకపోవటం, అది అతను దావూద్‌లా ఏ విదేశానికీ పారిపోకుండా ఇక్కడే వున్నా కూడా అంటే... వ్యవస్థలోనే నయీమ్ అభివృద్ధి, చావు రెండూ వున్నాయని అర్థం!   నయీమ్ హతం కావటంలో మరో కోణం కూడా వుంది. అతను పోయాక పోలీసులు చెబుతున్న దాని ప్రకారం లభించింది కేవలం కొన్ని గన్నులు, బుల్లెట్లు, కొన్ని కోట్ల నగదు మాత్రమే! తన జీవితమంతా ప్రాణాలకు తెగించి పెద్ద పెద్ద సెటిల్మెంట్లు చేసిన నయీమ్ ఇంతే వెనుకేసుకున్నాడా అంటే... కాదని చెప్పటానికి పెద్ద తెలివితేటలు అక్కర్లేదు. మరి నయీమ్ వందల కోట్ల ఆస్తులు, నగదు, ఇతర విలువైన వస్తువులు ఇప్పుడు ఏమైనట్టు? ఖచ్చితంగా ఇటు నుంచి ఇటు పోయాయని ఎవ్వరం చెప్పలేం! సాధ్యమైనంత ఎక్కువ ప్రభుత్వ ఖజానాకు చేరి ప్రజల శ్రేయస్సుకు ఉపయోగపడాలని కోరుకుందాం. కాని, అదీ మనమిప్పుడున్న వ్యవస్థలో దురాశే! ఎందుకంటే, ఇప్పుడంతా అందరి పరిస్థితి , నీతి... చీకట్లో దాక్కున్న తేలు కుట్టిన తోడు దొంగల మౌనం లాంటిది! ఒక దొంగ సొమ్ము మరో దొంగ పాలో, దొంగలకే దొంగ పాలో అవుతూంటూంది! నయీమ్ రక్తపు సంపదంతా ఏమౌతుందో చూద్దాం... 

ఇది తెలుగు విజయం..

తమిళ గడ్డపై తెలుగు భాష ఘన విజయం సాధించింది. తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా భాషలకు ప్రాచీన హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. భాషలకు ప్రాచీన హోదా కల్పించే విషయంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. ప్రాచీన హోదా ఇచ్చేందుకు తెలుగుకు అన్ని అర్హతలూ ఉన్నట్లు కేంద్రప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ చేసిన సిఫారసులతో తాము ఏకీభవిస్తున్నట్టు స్పష్టం చేసింది. మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఆర్.మహదేవన్‌లతో కూడిన థర్మాసనం ఈ చరిత్రాత్మక నిర్ణయం వెల్లడించింది.   ప్రాచీన భాషా హోదా కోసం 2006లో నిపుణులతో కూడిన ప్రత్యేక కమిటీ ముందుగా సంస్కృతం, తమిళ భాషలకు ప్రాచీన హోదా కల్పించింది. అనంతరం 2008లో తెలుగు, కన్నడ భాషలకూ ప్రాచీన హోదా కల్పించింది. ఈ రెండు భాషలకు ప్రాచీన హోదా కల్పించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మద్రాస్ హైకోర్టులో సీనియర్ న్యాయవాది ఆర్.గాంధీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో ఉండగానే 2013లో మలయాళం, 2014లో ఒడియా భాషలకు కేంద్రం ప్రాచీన హోదా కల్పించింది. దీంతో ఈ రెండు భాషలకు కూడా ప్రాచీన హోదా కల్పించడాన్ని సవాలు చేస్తూ గాంధీ 2014లో మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై 2009లో అప్పటి ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఏబీకే ప్రసాద్ మద్రాస్ హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేశారు.   2014 జూన్‌లో ఆంధ్రరాష్ట్ర విభజన జరగనున్న నేపథ్యంలో ప్రాచీన హోదా పిటిషన్లను త్వరగా పరిష్కరించాలని తెలుగు భాషాభిమాని, "చెన్నై తెలుగు ప్రకాశం పత్రిక" సంపాదకుడు తూమాటి సంజీవరావు మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. ఇందుకు న్యాయస్థానం సమ్మతించినా ప్రతివాదులు హాజరుకాలేదు. సరిగ్గా ఆ సమయంలోనే ఆంధ్రప్రదేశ్ విభజన జరగడంతో మద్రాసు హైకోర్టు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. 2016 జూన్ 20న తుది విచారణ ప్రారంభమైంది. ప్రాచీన హోదాపై నిర్ణయం తీసుకునే కమిటీలోని సభ్యులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల తరపున రవీంద్రనాథ్ చౌదరి, చెన్నై తెలుగు ప్రకాశం పత్రిక సంపాదకులు తూమాటి సంజీవరావు ధర్మాసనం ముందు హాజరై తమ వాదనలు వినిపించారు. న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసి నిన్న తుది తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు కీలకవ్యాఖ్యలు చేశారు.   తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా భాషలకు ప్రాచీన హోదా కల్పించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చుతున్నట్లు తెలిపారు. పిటిషనర్ అభ్యంతరాలతో తాము ఏకీభవించడం లేదన్నారు. భాషలకు ప్రాచీన హోదా కల్పించడంపై ఏర్పడిన కమిటీ అన్ని రకాల అంశాలను పరిశీలించి సంతృప్తి చెందితేనే ఈ భాషలకు ప్రాచీన హోదా కల్పించింది. కమిటీ అభిప్రాయాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకోదు. ఇప్పటికీ పిటిషనర్‌కు ఏవైనా అభ్యంతరాలు ఉంటే ప్రాచీన హోదా కల్పించిన నిపుణుల కమిటీకి నివేదించవచ్చని సూచించారు. తీర్పు వెలువడిన వెంటనే న్యాయవాది రవీంద్రనాథ్ చౌదరి మీడియాతో మాట్లాడారు. తెలుగు భాష ప్రాచీనమైనదని ఎప్పుడో రుజువైందని, మధ్యలో కొంతమంది అవాంతరాలను సృష్టించేందుకు ప్రయత్నించినా న్యాయస్థానం వాటిని తోసివేయడం హర్షణీయమని వ్యాఖ్యానించారు. అటు మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పార్లమెంట్ ఆవరణలో స్వీట్లు పంచి తన ఆనందాన్ని పంచుకున్నారు.   ప్రాచీన హోదా వల్ల వచ్చే లాభాలు: ఏ భాషకైనా ప్రాచీన హోదా లభిస్తే దాని అభివృద్ధి కోసం కేంద్రం ఐదేళ్లకొకసారి రూ.100 కోట్లు ఇస్తుంది. దీని వల్ల ఆ భాషకు సంబంధించి అంతర్జాతీయ సదస్సులు నిర్వహించుకోవచ్చు. తెలుగు భాషకు కృషి చేసిన పండితుల్లో ప్రతి సంవత్సరం ముగ్గురికి లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డులతో పాటు లక్ష రూపాయల నగదు బహుమతిని అందజేస్తారు. ఐదు జాతీయస్థాయి అవార్డులు ప్రకటిస్తారు. ఇందుకు గానూ ఒక్కో అవార్డు గ్రహీతకు రూ.50 వేలు నగదుగా ఇస్తారు. ఆ భాషకు సంబంధించి ప్రత్యేక కేంద్రం ఏర్పాటవుతుంది. ప్రాచీన సాహిత్యాన్ని ఇతర భాషల్లోకి అనువదించి, పుస్తకాలను ముద్రించి ప్రచారం చేసుకోవచ్చు.  

ఉద్యమం ఊపిరి ఆగిపోయింది

సారా మహమ్మారి కబంద హస్తాల్లో చిక్కి కుటుంబాలకు కుటుంబాలే విచ్ఛిన్నమవ్వడం చూసి సారాకు వ్యతిరేకంగా ఉద్యమించి ప్రజలను, ప్రభుత్వాన్ని కదిలించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను సంపూర్ణ మద్య నిషేధం దిశగా నడిపిన ఉద్యమ నాయకురాలు దూబగుంట రోశమ్మ ఇకలేరు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆమె..నెల్లూరు జిల్లా కలిగిరి మండలం దూబగుంటలోని స్వగృహంలో మరణించారు. నెల్లూరు జిల్లా జలదంకి మండలం గట్టుపల్లి చింతలపాలెంలోని ఓ సామాన్య రైతు జక్కంపూడి పిచ్చయ్య, సుబ్బమ్మలకు మూడో సంతానంగా జన్మించారు రోశమ్మ. 16వ ఏటనే కలిగిరి మండలం తూర్పు దూబగుంటకి చెందిన వర్థినేని కొండయ్యతో ఆమెకు వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె.   సాఫీగా సాగుతున్న వారి కుటుంబంలో సారా మహమ్మారి చిచ్చు పెట్టింది. సారాకు బానిసై భర్త చనిపోగా..ఇద్దరు కొడుకులు కూడా సారా మత్తులో తూగుతుండేవారు. సారా తన కుటుంబాన్నే కాకుండా ఎందరి జీవితాలనో కకావికలం చేయడం..లెక్కకు మిక్కిలి కుటుంబాలు రోడ్డున పడటం ఆమెను కలచివేసింది. దీంతో ఈ రక్కసిని తరిమికొట్టేదెలా..? ఇవే ఆలోచనలు ఆమెకు నిద్ర లేకుండా చేశాయి. అదే సమయంలో  రాష్ట్ర వ్యాప్తంగా "అక్షర దీపం" కార్యక్రమం ఊపందుకుంది. సారా తాగి మగాళ్లు పెట్టే బాధలకు విసుగుచెందిన దూబగుంట మహిళలు, అక్షరదీపం పుస్తకాల్లో "సీతమ్మకథ" పాఠం స్పూర్తితో 1993 అక్టోబర్ రెండో తేదీన గ్రామానికి వస్తున్న కల్లు, సారా వాహనాన్ని ఊరు బయటే అడ్డుకున్నారు. అంతేకాకుండా జీపులోని కల్లు, సారా ప్యాకెట్లను తగులబెట్టారు. వ్యాపారులు, పోలీసుల సాయంతో అమ్మకాలు జరపాలని చూశారు. కొందరు మగాళ్లు తమ ఇళ్లలో మహిళలపై దాడులు చేయడంతో కొంతమంది మహిళలు వెనక్కి తగ్గారు. కానీ రోశమ్మ మాత్రం వెనకడుగు వేయలేదు.   సారా మాఫియా ఆగడాలు, పోలీసుల కేసులు, పెద్దల బెదిరింపులు వంటి ఎన్నింటినో తట్టుకుని ఉద్యమంలా ముందుకుసాగారు. జిల్లాలోనే గాక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి మహిళల్లో చైతన్యం తీసుకువచ్చారు. అలా ఆంధ్రదేశం మొత్తం సారా వ్యతిరేక ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది. మహిళల్లో చైతన్యం పెరిగింది..రాజకీయ పార్టీలు ఉద్యమ తీవ్రతను గుర్తించాయి. రోశమ్మ ఉద్యమంతో కదిలిన ఆనాటి ప్రతిపక్షనేత ఎన్టీఆర్ తన ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధికారంలోకి వస్తే "సంపూర్ణ మద్యపాన నిషేధం" అమలు చేస్తామని ప్రకటించారు. ఆయన మాట మీద నమ్మకంతో ప్రజలు టీడీపీకి బ్రహ్మరథం పట్టారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం 1995 జూన్ 1 నుంచి సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తున్నట్లుగా ప్రకటిస్తూ ఎన్టీఆర్ తొలి సంతకం చేశారు.  అది చూసిన రోశమ్మ ఆనందానికి అవధుల్లేవు.   ఇలా రోశమ్మకు లభించిన గుర్తింపు ఆమె పేరును మార్చేసింది..అప్పటి నుంచి ఆవిడ "దూబగుంట" రోశమ్మగా మారిపోయారు. రాష్ట్రంలో అంతటి కదలిక తెచ్చి మద్యపాన నిషేధాన్ని సాధించిన రోశమ్మ చివరి దశలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు. ప్రభుత్వం నుంచి ఆమెకు ఎటువంటి సాయమందలేదు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ..కనీసం వైద్య పరీక్షలు చేయించుకునే ఆర్థిక స్థోమత కూడా లేక మంచంపట్టారు. మూడు రోజుల నుంచి పరిస్థితి మరింత క్షీణించడంతో నిన్న ఉదయం ఎనిమిది గంటల సమయంలో 93 ఏళ్ల వయసులో రోశమ్మ తుదిశ్వాస విడిచారు. మంచంలో ఉండే చనిపోతానని తెలిసి కూడా సంపూర్ణ మద్యనిషేధమే తన చివరి కోరికని చెప్పడం ఉద్యమం పట్ల ఆమెకున్న పట్టుదలను తెలియజేస్తోంది.   ఆమె మరణవార్త తెలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహిళా లోకానికే ఆమె ఆదర్శమని కొనియాడారు. సమాజంలో మద్యం వల్ల రోజు రోజుకి పెరుగుతున్న ప్రమాదాలు చూస్తుంటే..రమ్య లాంటి చిన్నారులు ఇంకా బలికాకుండా ఉండాలంటే ఇలాంటి రోశమ్మలు మళ్లీ పుట్టాల్సిన అవసరం ఉంది.  

కోదండరాం నేతృత్వంలో మరో ఉద్యమం!

  సుదీర్ఘకాలపు ఉద్యమం, ఆరువందలకు పైగా నిరసనకారుల ప్రాణత్యాగంతో... దేశంలోని 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. బడుగు తెలంగాణను బంగారు తెలంగాణగా మారుస్తామంటూ కొత్త ప్రభుత్వం కోటి ఆశలతో ముందుకొచ్చింది. కానీ తెలంగాణ ఏర్పడి రెండేళ్లు గడిచిన తరువాత కూడా పైపై మెరుగులే తప్ప పేదల బతుకు పెద్దగా మారలేదన్న అసంతృప్తి కొందరిలో లేకపోలేదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో తన భవిష్యత్తుని పణంగా పెట్టి ఉద్యమంలో పాల్గొన్న యువత ఇప్పుడు నిరుద్యోగంతో విసిగెత్తిపోతోంది. ఇలాంటి యువకులంతా కలిసి కోదండరాం నేతృత్వంలో మరోసారి ఉద్యమించేందుకు రంగం సిద్ధమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.   తెలంగాణ ఏర్పడిన తరువాత ప్రభుత్వం నిదానంగా కోదండరాం నేతృత్వంలోని జె.ఎ.సిని నీరుగార్చడం మొదలుపెట్టింది. జె.ఎ.సి. అవసరమే లేదనుకున్నారో లేక తమ అధికారానికి ప్రత్యామ్నాయంగా మారుతుందనుకున్నారో టీఆర్‌ఎస్‌ నేతలంతా నిదానంగా జె.ఎ.సి. నుంచి తప్పుకున్నారు. అప్పటివరకూ కె.సి.ఆర్‌ తరువాత అంతటి ప్రచారాన్ని సాధించిన కోదండరాం హవా నిదాంగా తగ్గడం మొదలైంది. కోదండరాం కూడా ఈ పరిణామాన్ని చూసీ చూడనట్లు ఊరుకున్నట్లు కనిపించింది.   తెలంగాణ తన రెండో వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకున్న దగ్గరనుంచీ కోదండరాం తీరు మారిపోయింది. ప్రభుత్వం మీద పదునైన వ్యాఖ్యలను చేయడం మొదలుపెట్టారు. ప్రభుత్వం తన వాగ్దానాలను నిలబెట్టుకోలేకపోయిందనీ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం లేదని విమర్శలు మొదలుపెట్టారు. సహజంగానే కోదండరాం వ్యాఖ్యల మీద టీ.ఆర్‌.ఎస్‌ శ్రేణులన్నీ విరుచుకుపడ్డాయి. వారూవీరూ అని లేకుండా మంత్రులంతా తలా ఓ మాటా అనేశారు. కానీ నిదానంగా తమ విమర్శల పదును తగ్గించుకున్నారు. రాష్ట్ర ప్రజల్లోని అసంతృప్తిని గమనించే కోదండరాం మాట్లాడుతున్నారనీ, అందుకనే ఆయనను టీ.ఆర్‌.ఎస్‌ నేతలు రెచ్చగొట్టకుండా మిన్నకున్నారనీ... ఓ వాదన వినిపించింది.   టీ.ఆర్.ఎస్‌ నేతలు భయపడినట్లుగానే కోదండరాం నిదానంగా ప్రజల్లోకి అసంతృప్తికి ఒక ప్రతినిధిగా మారుతున్నట్లు తోస్తోంది. మల్లన్నసాగర్‌ నిర్వాసితుల ఆక్రోశం; మెదక్‌లో భూసేకరణను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు; ఎంసెట్-2 లీకేజీ వ్యవహారం; రెండేళ్లు గడుస్తున్నా గ్రూప్‌1 వంటి ఉద్యోగాలు భర్తీ కాకపోవడం.. తదితర వ్యవహారాలన్నీ కూడా ఇప్పుడు కొందరిలో `All is not well` అనే భావనని కలుగచేస్తున్నాయి. ఈ అసంతృప్తి ఆధారంగా కోదండరాం మరో ఉద్యమానికి తెరతీస్తున్నట్లు కనిపిస్తోంది. దానికి అనుగుణంగా కోదండరాం తరచుగా, ఘాటుగా విమర్శలు చేయడం పత్రికల నిండా కనిపిస్తోంది.   ఒక ఉద్యమకర్తగా కోదండరాంను తీసిపారేయడానికి ఏమాత్రం వీల్లేదన్న విషయం టీ.ఆర్‌.ఎస్‌ నేతలకు బాగా తెలుసు. కాబట్టి అధికారం ఉంది కదా అని ఆయన రగిలిస్తున్న అసంతృప్తినీ, వాటి వెనుక ఉన్న కారణాలనీ ఉదాసీనంగా తీసుకుంటే... ఇప్పటికిప్పుడు కాకున్నా వచ్చే ఎన్నికలలో అయినా ఆ పార్టీ భంగపడే ప్రమాదం ఉంది. ఇప్పటికే కోదండరాం ఉపాధి కల్పన కోసం తాము దసరా నుంచి ఉధృతమైన ఉద్యమాన్ని చేయనున్నట్లు ప్రకటించేశారు. మరి ప్రభుత్వం పట్టువిడుపులకు పోకుండా తగిన హామీలతో, కార్యాచరణతో ముందుకు వస్తే సరే సరి! లేకపోతే ఏ యువత ఉద్యమాల ఆధారంగా తాము అధికారంలోకి వచ్చారో, ఆ యువతకే వ్యతిరేక దిశలో నిలిచే అవకాశం ఉంది.

సౌదీలో భారతీయుల విలవిల

ఒకవైపు కరువు..పంటలు పండక..చేయడానికి పనిలేక బ్రతుకు తెరువు కోసం అయినవాళ్లనూ, కన్న తల్లి లాంటి ఊళ్లను వదిలి పొట్టచేతబట్టుకుని గల్ఫ్ దేశాలకు పోయిన భారతీయులకు ఇప్పుడు పెద్ద కష్టం వచ్చి పడింది. సౌదీలోని వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న వేలాది మంది భారతీయులను అక్కడి సంస్థలు బయటకు నెట్టడంతో వారంతా దిక్కుతోచక రోడ్డున పడ్డారు. ఉద్యోగాలు పోయి..వేతనాలు రాక..చేతిలో చిల్లుగవ్వ లేకపోవడం, చివరకు పాస్‌పోర్ట్‌లు కూడా కంపెనీల వద్దే ఉండటంతో దాదాపు 10 వేల మంది భారతీయులు ఆకలితో అలమటిస్తున్నారు. బాధితుల్లో ఒకరైన ఇమ్రాన్ ఖోకర్ అనే వ్యక్తి ట్వీట్టర్ ద్వారా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు తమ సమస్యలను తెలియజేశారు.   దీనిపై అంతే వేగంగా స్పందించిన సుష్మ, భారతీయులకు ఆహారం అందించాలని సౌదీలోని భారత రాయబార కార్యాలయాన్ని ఆదేశించారు. రంగంలోకి దిగిన ఎంబసీ అధికారులు ఆగమేఘాల మీద భారతీయులకు ఆహారం అందజేశారు. అంతర్జాతీయంగా చమురు ధరలు పతనం కావడంతో ఆయిల్ ఎగుమతులపైనే ఆధారపడ్డ గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. ఇటీవల కొన్నేళ్లుగా సౌదీ అరేబియా, బహ్రైన్, ఒమన్ తదితర దేశాల్లో ఆర్థికలోటు అపారంగా పెరిగింది. ఒక్క సౌదీ విషయమే తీసుకుంటే నిరుడు ఆ దేశ ఆర్థికలోటు 9,800 కోట్ల డాలర్లు. దానికి తోడు సౌదీ ప్రభుత్వం యెమెన్‌లో సైనిక జోక్యం చేసుకోవడంతో ఆ దేశ పరిస్థితి మరింత క్షీణించింది. దీని ప్రభావంతో అక్కడ కంపెనీలు కాస్ట్ కటింగ్ చర్యలు చేపట్టాయి..సిబ్బందిని తగ్గించుకుని ఉన్నవారిపై పనిభారాన్ని పెంచడం, జీతాలు ఆలస్యం చేయడం, అసలు చెల్లించకపోవడం వంటి చర్యలు పెరిగాయి.     ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో అతిపెద్ద నిర్మాణ సంస్థ బిన్‌లాడెన్ గ్రూపు ఈ ఏడాది మొదట్లో 50,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. ఇలా తొలగించిన వారందరికీ ఆ సంస్థ ఎగ్జిట్ వీసాలు మంజూరు చేసినా గల్ఫ్ దేశాల్లో ఉండే కఠిన నిబంధనల కారణంగా దానికి అనుబంధంగా కంపెనీ నుంచి వివిధ రకాల పత్రాలు లేనిదే దేశం నుంచి బయటికెళ్లేందుకు అనుమతించరు. దీని ప్రభావం భారత్‌పై ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరించారు. అనుకున్నట్లుగానే ఉపద్రవం ముందుకొచ్చింది. గల్ఫ్‌లో దాదాపు 70 లక్షల మంది ప్రవాస భారతీయులున్నారని అంచనా. వీరిలో ఒక్క సౌదీలోనే 30 లక్షల మంది వరకూ ఉంటారు. వలసలను అరికట్టడం కోసం, స్థానికులకు ఉపాధి కల్పించడం కోసం మూడేళ్ల క్రితం నిలాఖత్ చట్టం తీసుకురావడం వల్ల సౌదీలో గతంతో పోలిస్తే భారతీయుల వలసలు తగ్గాయి. గల్ఫ్‌కు వెళ్లేవారిలో అత్యధికులు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల వద్ద అప్పులు చేసి ఎన్నో వ్యయప్రయాసలకొర్చి అక్కడికి చేరుకున్న వారే.   అమెరికా, బ్రిటన్ వంటి దేశాలకు వెళ్లేవారు చదువుల కోసమో, కెరీర్‌లో మరింత ఉన్నతస్థానానికి వెళ్లాలని వలస పోతుంటే..గల్ఫ్ దేశాలకు మాత్రం కేవలం ఆకలి బాధ నుంచి తప్పించుకోవడానికే వెళ్తారు. ఇప్పుడు వారిలో 30 లక్షల మంది భారతీయులు రోడ్లపైకి వచ్చారు. బిన్‌లాడెన్ గ్రూపు నుంచి తప్పించబడ్డ భారతీయులు కూడా వారికి జత కలిశారు. దీనికి వ్యతిరేకంగా వారు మక్కాకు శాంతి ప్రదర్శన జరిపారు. బిన్‌లాడెన్ కార్యాలయాల ముందు ధర్నాలు చేశారు. బస్సులను దగ్థం చేశారు. అయినా సౌదీ ప్రభుత్వం వారి రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు..భారత ప్రభుత్వం కూడా స్పందించలేదు. సౌదీలోని చమురు కంపెనీలు ఊహించని లాభాలు గడిస్తుండటం, అక్కడి ప్రవాస భారతీయులు భారత్‌లో పెట్టుబడులు పెడుతుందటంతో మన ప్రభుత్వాలు పండుగ చేసుకుంటున్నాయి.   వలస కార్మికులు గల్ఫ్ నుంచి ఇక్కడి తమ వారికి పంపే డబ్బు ఏటా 3,300 కోట్ల డాలర్లు( సుమారు రూ.2,20,000 కోట్లు) ఉంటుందని అంచనా. విదేశీ మారక నిల్వల పేరిట దేశానికి ఇంత సాయం చేస్తున్నా అందుకు ప్రతిఫలంగా వారి బాగోగుల విషయంలో మాత్రం భారత ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా అక్కడ చిక్కుకుపోయిన భారతీయ కార్మికులకు ఎగ్జిట్ వీసాలను ఇప్పించి వెనక్కి తీసుకురావటం మినహా భారత ప్రభుత్వం ప్రస్తుతం చేయగలగిందీ ఏమీ లేదు. కొన్ని నెలలుగా రావాల్సిన బకాయిలను తీసుకోకుండా ఖాళీ చేతులతో భారత్‌కు వెళ్లడం కార్మికులకు ఇష్టం లేదు. అందుకే ఆందోళన బాట పడుతున్నారు. అక్కడి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి వారి బకాయిలను భారత ప్రభుత్వం ఇప్పించగలిగితే అంతకు మించిన సాయం వారు ఆశించరు.

Female Feticide – ‘Death before birth’

Introduction “Murder” sounds relatively pale and less gruesome in comparison with inhumane practice called Female feticide (and infanticide), which tends to be rather ubiquitous and customary across several nations on this planet. Call it apathy, call it attempted murder. This article strives to generate awareness by bringing to light such scathingly truculent practices, (which, surprisingly are quite common) with a focus on India.   What is Female feticide? Female feticide is a diabolical act of discriminatory elimination of a girl child by selective abortion in her mother’s womb. I personally believe feticide to be tantamount to murder. This custom originates from transcendental patriarchal nature of society, inherent in both autochthonous and urbane cultures around the globe. The fanatic obsession for a male child is driven by several factors, ranging from carrying forward the legacy of family name, performing religious funeral traditions to being meal earner of the family or familial inability to get their daughters married. There were cases where pregnant women, upon finding sex of baby to be a girl, were kicked, punched and ‘stomped on’ belly, by their mother-in-laws. Practices like these are sure to ignite sparks of misanthropy. Sadly, in traditions like these, people find a girl child to be a burden.   According to ‘Annual Report on Vital Statistics of India based on Civil Registration System-2013’, the sex ratio at birth based on registered events was 898 in 2013, which is a drop from 908 in 2012 and 909 in 2011. Expected natural sex ratio is 943 females for every 1000 males. Cases like above, are emblematic of “Death before birth”. These whopping skewed sex ratios are indicative of plummeting human values. Per the report, the highest birth sex ratio has been reported from state of Tripura (1,055) followed by Meghalaya and Arunachal Pradesh (978), Daman and Diu (961) and Sikkim (956). The lowest sex ratio has been reported by Manipur (700) followed by Haryana (840). United Andhra Pradesh, Karnataka and Sikkim have the distinction of being the only major states reporting favorable sex ratio at birth in last so many years,” the report said. These numbers are indeed a giant leap into evolutionary darkness.   A slightly different mode of practice is “Female infanticide”, which happens to be a distant cousin of “Female feticide”, both practices genetically related in terms of barbarity. While feticide involves killing fetus, infanticide involves killing a live child. Depending on the rusticity of the area, the infanticide techniques involve feeding dry rice hull to puncture windpipes, feeding poisonous fertilizers, strangling with towels to starving to death. Gender discrimination, in general, also happens to be a reason. Research indicates a definite bias in feeding boys milk and milk products and eggs. In the states of Rajasthan and Uttar Pradesh, it is usual for girls and women to eat less than men and boys and to have their meal after the men and boys had finished eating. In case of illness, it is usually boys who have preference in health care.   So, how is this done? Ancient techniques include prenatal sex discernment, surgical abortion, injection and/or over-the-counter medication. With the advent of new technology, came the ultrasound scan. Per Times of India report in November 2013, a new non-invasive test, till now used in the western countries to find out any abnormality in a fetus, has made its entry into India and is causing some apprehensions among doctors as it can be misused for determining the sex of fetus. Per Pre-Conception and Pre-Natal Diagnostic Techniques Act introduced in 1994 (and later amended in 2002), the government of India enacted to stop female feticides.  However, this had little effect on people and their thinking.   Reasons Let’s delve a little deeper into the various reasons behind such barbarous lore. It turns out this practice has been existing from the days of yore. United Nations Population Fund and several other NGOs have also researched the reasons behind these practices. Family economics is a key element. Traditionally, the major causes of discrimination against a girl child have been the son preference deeply rooted in the patriarchal Indian society. Low literacy rate and low familial earnings rattle the cage even further. Also, in many societies, parents depend on their children to look after them in their senectitude. The fact that a girl leaves her parental family and joins her husband's family when she marries, gives parents a strong reason to treat girls as a drain on family resources during their childhood without bringing economic benefits later on.   Sad existence of ‘Dowry’ is one of the major reasons why a female child is often deemed unwanted. In Indian society, it has been a tradition for the parents of the bride to pour in huge amounts of money and valuable goods to the groom and his family. For families with several daughters, this can be a serious financial burden. Status of women, among others, is a concern. Some women resort to Female Infanticide and feticide in order to protect their daughters from a flippant societal clutches of objectification and helotry in societies dominated by men.   Improvement in literacy rates could change the skewed sex ratios.  Prevalence of prenatal sex determination is another contributing factor. This is more widespread among the economically well-off because availing of such services is determined by one's ability to pay. Thus, the rich agriculturalists living in the rural areas of the states of Punjab, Haryana and Gujarat and the urban elite living in the metropolis of Delhi tend to avail of sex-selective abortion. On the other hand, in matriarchal societies in the northeastern states of India, women control land holding and have a better say in matters related to family, economy and society. This has resulted in a slight preference for daughters in states like Meghalaya.   Gender discrimination, is by far, the biggest factor. Communities that encourage female feticide always show many other signs of prejudice against females. It’s a deeply regrettable fact that women are perceived as subservient because of their role as traditional homemakers, whilst men predominantly ensure the family's social and economic stability. Men are usually the bread earners, either because they have higher chances of employment or because of their physical wherewithal to perform agricultural work, which gives rise to a preference for male babies. As herculean as it might sound, it’s time women and men voice their support for women, to end gender discrimination, which affects our society in more ways than one, to create what seems to be an Utopian scenario of a “gender equal” society.   Consequences Infanticide comes with many perilous consequences. Gender-based violence, skewed sex ratios, illegal trafficking of women due to steep decline in number of girls, increase in rape and assault, population decline are some long term implications of female feticide and/or infanticides. Per 2013 National Crime Records Bureau report, there were around 23,640 reported cases related to human trafficking. Many states started adopting anti-trafficking policies. With no mothers or wombs to bear any child (male or female), there would be fewer births, leading to a decline in the country’s population. Although the Government of India passed the Pre-Conception and Pre-Natal Diagnostic Techniques Act in 1994 to bring an end to feticide, there is growing concern about its effectiveness. There are numerous reasons why it still goes unchecked: sometimes district health officers are unaware of the provisions of the act; sometimes families and doctors collude in the practice, and records from ultrasound clinics are rarely scrutinized by health officials.   Steps Taken Numerous steps have been taken by Government of India in tackling these issues. Some of them included  cancellation/permanent termination of the doctor’s license involved in fulfilling a client’s demand to do away with her girl child, heavy penalty imposed on companies that specialize in marketing medical equipment used for illegal sex determination and abortion in unlicensed clinics and hospitals, high fines and judicial action against ‘parents’ who knowingly try to kill their unborn baby, widespread campaigns and seminars for young adults and potential parents to enlighten them about the ill effects of female feticide.   The state of Maharashtra was the first state to pass legislation to regulate sex-determination tests in 1988. The bill in effect limits the use of sex-determination tests to the detection of "chromosomal abnormalities, genetic metabolic diseases, sex-linked genetic diseases and congenital anomalies”. In the state of Rajasthan, a woman giving birth to a girl child in a rural area given monetary reward from the state government under ‘Sumangala Yojna’ scheme . The state of Haryana decided to issue electronic cards with unique ID numbers to all pregnant women undergoing ultrasound tests in the district. State of West Bengal has a system for enabling money transfers at periodic intervals for the child’s education. In Punjab, pregnant women are registered in their first trimester in order that the authorities may follow up and monitor cases of feticide. Another example is Tamil Nadu’s Amma Baby Care Kit.  In January 2015, Prime Minister Narendra Modi has launched twin programs “Beti Bacho, Beti Padho” - the "Save daughters, educate daughters" and “Sukanya Samriddhi” account. An initial corpus of $16 million has been allocated to the scheme and a reward of $166,000 has been announced to ‘innovative’ village which attains a balanced sex ratio. Any savings account opened in the name of girl child, would attract an interest rate of 9.1% provided by Government of India, with no income tax charged.   Prevention/ Solutions Following steps could be taken to prevent the malady of ‘female feticide’ from spreading. In my personal research over the past several years with a number of community-based organizations, I found promoting gender equality to be an extremely effective way to combat female feticide. I set up mini training camps to bring to light the impact of skewed sex ratio in altering the healthy biological balance.   States should devise programs and strategies to improve gender equality and empower women following the adoption of the International Conference on Population and Development (ICPD) Program of Action and the Convention on the Elimination of all Forms of Discrimination Against Women (CEDAW). Legal measures, including legal bans on sex-selective abortions, sex determination and its advertisement are obvious policy options for targeting prenatal discriminatory behavior. Trends in sex selection should be monitored, most notably with support from statistical bureaus, professional associations, Non-Governmental Organizations and civil society organizations. Advocacy actions including awareness-raising campaigns and communication aimed at behavioral changes are crucial instruments. Welfare programs and Policy recommendations involving further research, trend analysis in all states through national statistical offices, developing new guidelines on the ethical use of relevant technologies to suppress deliberate gender discrimination should be at the core. Female Genital Mutilation (FGM) should be out rightly banned. Advancing girls' rights is also key to eliminating prenatal sex selection.   Results Of late, the society started witnessing occasional marginal change in violence against women, skewed sex ratios and gender bias. However, change is far from utopian realty. It is the minds of the people and their thought process, more than governmental policies, which need to be a subject to paradigm shift. Respect towards women and gender equality needs to be perennially imbibed into the societal strata of patricians and plebeians, alike, to witness a discernible change in society. It’s only then, can we dare dream of a society to be “gender neutral”, a phrase which would be a misnomer no more, and whose words can be mentioned in the same breath.   ...Arun

ఆత్మహత్యల "భారతం"

భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల్లో ఆత్మహత్యలు ముందు వరుసలో ఉండటం ఆందోళన కలిగించే అంశం. సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే మానసిక బలంలేక..చిన్న కష్టానికే విలవిలాడుతూ బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న వారు సంవత్సరానికి వేల నుంచి లక్షకు మించి పోవడం కలచివేస్తోంది. దేశవ్యాప్తంగా ఏటా 1.30 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. హోంశాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్ జి.ఆహిర్ లోక్‌సభలో వెల్లడించిన గణంకాల ప్రకారం 2012-14 మధ్యకాలంలో మొత్తం 4.01 లక్షల మంది అర్థాంతరంగా తనువు చాలించగా... వీరిలో 2.68 లక్షలమంది పురుషులు, 1.33 లక్షలమంది మహిళలున్నట్టు పేర్కొన్నారు.   కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ల్లో ఆత్మహత్యల ఘటనలు అధికంగా నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సంఖ్య అధికమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆత్మహత్యల సంఖ్య ఏటా సగటున 14 వేలకుపైగా ఉండగా..విభజన అనంతరం ఏపీలో 6 వేలు, తెలంగాణలో 9 వేలకు పైగా బలవన్మరణాలు నమోదయ్యాయి. అన్ని రంగాల్లో యువత ముందున్నట్లే..ఆత్మహత్యల్లో కూడా వారే అగ్రస్థానంలో నిలిచారు. ఒత్తిడి తాళలేక కొందరు, ర్యాంకుల పరుగుల్లో చతికిలపడి మరికొందరు, తల్లిదండ్రులు మందలించారని ఇంకొందరు, వేధింపులు భరించలేక, కుటుంబ, వ్యక్తిగత సమస్యలతో కొద్దిమంది అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు.   ఇంటర్ విద్యార్థుల్లో ఈ సమస్య మరి తీవ్రంగా ఉంది..పదో తరగతి తర్వాత ఇంటర్‌లో ప్రైవేట్ గురుకుల కళాశాలల్లో చేరుతున్న విద్యార్థులు ఒక్కసారిగా ఇంటికి దూరంగా ఉండాల్సి రావడంతో ఆ వాతావరణానికి ఇమడలేకపోతున్నారు. దానికి తోడు ఇంజనీరింగ్, ఇతర వృత్తివిద్య కోర్సుల్లో సీనియర్ల వేధింపులు, ప్రేమ వైఫల్యాల వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. విద్యార్థుల తర్వాతి స్థానంలో రైతులు, చేనేత కార్మికులు నిలిచారు. వర్షాలు పడకపోవడంతో బోర్లద్వారానైనా సాగు చేయాలని అధిక వడ్డీలకు అప్పులు తెస్తారు. అంత శ్రమకొర్చి పంట సాగు చేసినా ఆశించిన దిగుబడి రాక..అప్పు చెల్లించలేక..మనస్థాపంతో పురుగు మందులు తాగి తనువు చాలించే రైతన్నలు దేశంలో కొకొల్లలు. నిత్యావసరాలు పెరిగినా..కూలి పెరగకపోవడంతో కుటుంబాన్ని పోషించలేక నేత కార్మికులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. సిరిసిల్లకెళ్లినా..గద్వాల పోయినా..పోచంపల్లినడిగినా ఈ విషయం తెలుస్తుంది.   అప్పులు, పెళ్లి కుదురకపోవడం, వరకట్నం, వివాహేతర సంబంధం, విడాకులు, కుటుంబ సమస్యలతో అత్యధిక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ తర్వాత అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఆత్మహత్యలవైపు లాగుతున్నాయి. ఎయిడ్స్, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడేవారికింటే ధీర్ఘకాలిక రోగాలతో సతమతమవుతున్న వారే ఎక్కువగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ప్రేమ వ్యవహారాలు, పేదరికం, ఆస్తి తగదాలు, ఉద్యోగ జీవితంలో ఒత్తిడి, టార్గెట్లు కూడా ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి.   అప్పుల కారణంగా పురుషులు ఎక్కువ సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటుండగా..వివాహసంబంధ సమస్యల వల్ల పురుషులతో పోలిస్తే మహిళలు రెట్టింపు సంఖ్యలో ప్రాణాలు తీసుకుంటున్నారు. దేశానికి పెనుసవాలుగా మారిన ఆత్మహత్యలపై ప్రభుత్వాలు సమగ్రంగా అధ్యయనం చేసి విధానపరమైన చర్యలు చేపట్టాలి. ఆత్మహత్యల్లేని భారత్ నిర్మాణానికి సామాజిక కోణంలో పరిష్కారాలు కనుగొనాలి. ఈ విషయంలో ప్రభుత్వాలతో పాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల పాత్ర కీలకమైనది.

"జామ్‌"జాటం

ఒక్క గంట ట్రాఫిక్‌జామ్‌లో చిక్కుకుంటే చాలు అయిపోయాం రా బాబూ అనుకుంటాం. అలాంటిది గంటో రెండు గంటలో కాదు, ఏకంగా రోజులకు రోజులు అలాగే ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతే..అమ్మో ఇంకేమైనా ఉందా..? గత వారం గుర్గావ్, ఢిల్లీ ప్రజలు అలాంటి ప్రత్యక్ష నరకాన్ని చవిచూశారు. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో ఢిల్లీ, హర్యానాల్లో రోడ్లన్ని చెరువుల్ని తలపించాయి. ప్రధాన రహదారులతో పాటు గల్లీ రోడ్లు జలాశయాల్ని తలపించాయి. నాలుగు అడుగుల మేర నీటితో రోడ్లు సగం మేర కనిపించక ఢిల్లీలో ఉన్నామా..లేక నదిపై తిరుగుతున్నామా అని జనాలు ఆశ్చర్యపోయారు. ఇక చూస్కోండి..పొద్దున ఆఫీసులకు వెళ్లినవాళ్లు..తర్వాతి రోజు పొద్దున ఇళ్లకు చేరారు. ముఖ్యంగా ఢిల్లీ-గుర్గావ్ జాతీయ రహదారిపై ప్రయాణించిన వారికి నరకం అంటే ఏమిటో..అది ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూసినట్లైంది.   హీరోహోండా చౌక్ వద్ద మురుగునీరు రోడ్డుపై నుంచి ప్రవహించడం..అదే ప్రాంతంలో అండర్‌పాస్, ఫ్లైఓవర్ నిర్మాణాలతో వాహనాల్ని మళ్లించడం వల్ల పరిస్థితి దారుణంగా తయారైంది. దీంతో వాహనాలు ఏటు కదల్లేక ఉన్నచోటే నిలిచిపోయాయి..అలా ఒక గంట కాదు రెండు గంటలు కాదు ఏకంగా 17 గంటలపాటు ట్రాఫిక్ జాంలో చిక్కుకుపోయారు. పోనీ నడుచుకుంటూ వెళ్లిపోదామనుకుంటే కార్లను రోడ్లపై వదల్లేక..రాత్రంతా అలాగే తిండి, నీళ్లు లేకుండా గడిపారు. అదే రోజు దేశ ఐటీ రాజధాని బెంగుళూరులో కురిసిన వర్షంతో సిలికాన్ వ్యాలీ సాగరాన్ని తలపించింది. పలు చోట్ల నీరు నిలిచిపోవడంతో నగరవాసులు గంటల తరబడి రోడ్లపైనే గడిపారు. కాలువల్లో పూడిక తీయకపోవడంతో చెరువు కట్టలు తెగి శివారు ప్రాంతాలు జలదిగభ్భంధంలో చిక్కుకున్నాయి. ముంపులో చిక్కుకున్న వారిని రక్షించడానికి అగ్నిమాపకశాఖ పడవలను వేసుకువచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.   వరద నీటిలో చేపలు కొట్టుకురావడంతో వాటిని వేటాడేందుకు జనం పోటీపడ్డారు. అసలే మోకాల్లోతు వరద నీటితో సతమతమవుతున్న వాహనదారులకు చేపలు పట్టేవారు అడ్డురావడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీ, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై నగరమేదైనా ప్రాబ్లమ్ ఇదే. ఇంత వాన పడితే ఎవరు మాత్రం ఏం చేస్తారు? అనే వాదనలు విని ఊరేకోవడమేనా..? లోతుగా సమస్య పరిష్కారానికి శ్రద్ద పెట్టరా..? ఇన్ని అవస్థలకు కారణం మన స్వయంకృతాపరాధమే. నీళ్ల మధ్య ద్వీపాలుగా మారిన అపార్ట్‌మెంట్లు, రోడ్ల నిర్మాణంలో ప్రణాళికా లోపం ఇవన్నీ కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. భారీ నిర్లక్ష్యం..కబ్జాలు..కాసుల వేటల ముందు సమాజం ఏమైతే మనకేం అన్నట్లు..అడ్డగోలు నిర్మాణాలు, చెరువులు, నాలాలు, నదీతీరాలు కబ్జాలకు గురైన తీరు కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. అందువల్లే వరద నీటితో మురుగునీరు కలిసిపోయి మనిషి ఎత్తున రోడ్లపై కలిసికట్టుగా పారుతోంది.   ఇదంతా ఒక రోజులో జరిగింది కాదు. ఈ విధ్వంసానికి ఆహ్వానపత్రిక ఇపుడు లిఖించింది కాదు ఎన్నో ఏళ్లుగా చేస్తోన్న పాపానికి ప్రతిఫలం ఇపుడు లభించింది. చెట్లు, మొక్కలు, విశాలమైన బహిరంగ ప్రదేశాలు ఉంటే వర్షం నీరు భూమిలోకి ఇంకిపోతుంది. కానీ కాంక్రీట్ జంగిల్ మధ్య ఆ అవకాశమెక్కడది..? అసాధారణ వర్షాల నీటిని తమలో ఇముడ్చుకోవాల్సిన జలాశయాలు, చెరువులు కబ్జాల కోరల్లో కుదించుకుపోయి..మైదానాలుగా మారటంతో మరో దారి లేక వరద నీరు జనావాసాల మధ్యకు పొంగుకొచ్చింది. సక్రమమైన మురుగునీటి పారుదల వ్యవస్థ లేని కారణంగా రోడ్లపై మనిషి ఎత్తు నీరు నిలబడిపోయింది. ప్రత్యేకించి కేంద్రప్రభుత్వం వంద భావి స్మార్ట్ నగరాల నిర్మాణానికి అడుగులు వేస్తోన్న సమయంలో ఢిల్లీ-గుర్గావ్ హైవే పెద్ద గుణపాఠం నేర్పుతోంది. జలాశయాలను, వర్షపునీటిని కాపాడుకుంటే ఇలాంటి విలయాలు సంభవించే అవకాశం ఉండదని నిపుణులు చెబుతున్నారు. 

ఇక రె "ఢీ"

ఆంధ్రప్రదేశ్‌‌కు ప్రత్యేకహోదా కల్పించాలని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు సందర్భంగా జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి ఇచ్చిన వివరణపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనానికి గురయ్యారు. ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని ఆయన మాటల్లో తేటతెల్లం అయ్యింది. ఎన్ని సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగినా..ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా రాష్ట్రానికి ఒరిగిందేమి లేదని మరోసారి రుజువైంది. జైట్లీ ప్రకటన నేపథ్యంలో చంద్రబాబు తన క్యాంపు కార్యాలయంలో కేంద్రమంత్రులు, ఎంపీలు, సీనియర్ నేతలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు.   ఈ సమావేశం వేళ చంద్రబాబు ఒక రాష్ట్రధినేతగా..ఒక నిఖార్సైన రాజకీయవేత్తగా వ్యవహరించారు తప్ప ఎక్కడా పట్టుకోల్పోలేదు. గొంతులో తొణకని ఆత్మవిశ్వాసం..మితిమీరిన భావోద్వేగాలు, తీవ్ర హావభావాలు, పరుష పదజాలం ఏవి లేవు..దగా పడి, గాయపడిన మనసు తాలూకూ ఉక్రోశం, బేలతనం జాడ మచ్చుకు కూడా కనిపించలేదే. ప్రభుత్వంలో ఉండి ఏం సాధించారని ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలు..బయటకు రమ్మంటూ విసుర్లు. కానీ ఎప్పుడు ఏం చేయాలో తెలిసినవాడే అసలైన నాయకుడు. అందుకే ఎవరెన్ని మాటలన్నా రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా రాజనీతితో వ్యవహరిస్తున్నారు ఏపీ సీఎం. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పెదవి విరుస్తూనే..ఇచ్చిన హామీలను గుర్చు చేస్తూ సాగింది ఆ ప్రసంగం.  ఒకప్పుడు చెన్నై నుంచి కర్నూలుకు అక్కడి నుంచి హైదరాబాద్‌కు చేరాం. అరవై ఏళ్లు ఉన్న తర్వాత నెత్తిన అప్పు పెట్టుకుని అమరావతికి వచ్చాం. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీకి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రానికి, ప్రధానమంత్రికి లేదా..? ఆ బాధ్యత నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు.. ఏపీ కూడా ఈ దేశంలో అంతర్భాగం, మనమూ పన్నులు కడుతున్నాం. అలాంటప్పుడు మనకు మాత్రమే ఎందుకు అన్యాయం జరగాలంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.   ఎందుకు విభజించారు: ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నారు...ఏపీ ప్రజలు కోరుకున్న విభజన కాదిది. రాష్ట్రంలో వనరులు లేవని అనుకున్నపుడు విభజనకు ఎందుకు ఒప్పుకున్నారని చంద్రబాబు బీజేపీని ప్రశ్నించారు. నాడు విభజనకు అన్ని పార్టీలు అంగీకరించాయని, మెజారిటీ పార్టీలన్నీ, హోదా, విభజన చట్టానికి అనుకూలమేనన్న సంకేతాలను పార్లమెంట్ సాక్షిగా ఇచ్చాయని తెలిపారు. అప్పుడు పట్టుబట్టి ప్రత్యేకహోదా బిల్లులో పెట్టించిన బీజేపీ, ఇప్పుడేమో నిబంధనల పేర్లు చెప్పి తప్పించుకోవాలనుకుంటోందని అభిప్రాయపడ్డారు. ఏం చేయలేనపుడు ఎందుకు విభజించారని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసికట్టుగా రాష్ట్రాన్ని విభజించాయని..ఆ అన్యాయాన్ని ప్రజలు మరచిపోయేలా చేయాల్సి ఉందని, నాడు అంగీకరించి, ప్రజలకు హామీలిచ్చి, నేడు ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయని ఎలా చెబుతారని ప్రశ్నించారు.   కాంగ్రెస్‌కు పట్టిన గతి గుర్తులేదా..? ఎవరెన్ని చెప్పినా వినకుండా..హేతుబద్ధత లేకుండా రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని కాంగ్రెస్ పన్నిన కుట్రలు అందరికి తెలుసునన్నారు. బిల్లు నెగ్గించుకోవడం కోసం పార్లమెంట్ తలుపులు మూసేసి, ప్రత్యక్ష ప్రసారాలు సైతం నిలిపివేసి దుర్మార్గంగా వ్యవహరించారని చంద్రబాబు అన్నారు. అలాంటి కాంగ్రెస్‌కు ప్రజలు ఏ గతి పట్టించారో గుర్తులేదా..ప్రజాస్వామ్యంలో ప్రజలదే అంతిమతీర్పుని..హామీలు నెరవేర్చని రాజకీయ పార్టీలను వారే ఇంటికి పంపుతారని గుర్తు చేశారు.   ప్రధానిదే బాధ్యత రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లు గడచినా ఇప్పటికీ అనేక సమస్యలు పరిష్కారం కావాల్సి ఉంది. కేంద్రం చేయ్యాల్సిన పనులు ఇప్పటికీ చేయలేదు. పోలవరం ప్రాజెక్ట్‌కు రూ.1500 కోట్లు ఖర్చు చేశాం. రెవెన్యూ లోటు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అది నెరవేర్చలేదు, ఆర్ధిక సంఘం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా ఏమీ ఇవ్వలేదు. మిగతా రాష్ట్రాలతో పాటే ఏపీని చూశారు. నేనేం ప్రత్యేకంగా ఏమి అడగటం లేదు..విభజన బిల్లులో ఉన్నవి..ప్రధాని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా.   బంద్‌ల వల్ల ఒరిగేదేమి లేదు ప్రత్యేక హోదాపై కేంద్రప్రభుత్వ వైఖరికి నిరసనగా బంద్‌లకు పిలుపునిచ్చారని, కాని ఇది సరైన ఆలోచన కాదు..అన్యాయానికి వ్యతిరేకంగా కేంద్రంతో పోరాడాల్సిందే తప్ప రాష్ట్రంలో కాదు. బంద్‌లకు పిలుపునిచ్చి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం వల్ల మనకే నష్టం. జపాన్‌లో తరహా నిరసన తెలిపి కేంద్రంపై ఒత్తిడి తేవాలి. నల్లబ్యాడ్జీ ధరించి ఒక మొక్క నాటినా అదే నిరసన, బస్సు ధ్వంసం చేసినా అదే నిరసన.    బాధ్యత లేని ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైనా, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైనా చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో బాధ్యత లేని ప్రతిపక్షం ఉంది. నేనేదో కేసులకు భయపడుతున్నాననడం విడ్డూరంగా ఉంది. అసలు ఈడీ కేసులు, సీబీఐ కేసులున్న వ్యక్తి భయపడాలి కానీ నాకేందుకు భయం. ఇలాంటి రాజకీయ పార్టీల అవసరం రాష్ట్రానికి ఉందా అని ప్రజలు ఆలోచించుకోవాలి. రాజకీయాలంటే తెలియకుండా సమయం, సందర్భం లేకుండా ప్రతిపక్షనాయకుడు మూర్ఖత్వంతో మాట్లాడుతున్నాడని చంద్రబాబు అన్నారు.

మళ్లీ తప్పని ఎంసెట్‌!

  తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎంసెట్‌-2 ప్రశ్నాపత్రం బహిర్గతం అయిపోవడంతో... ఇప్పుడు మరోసారి ఎంసెట్‌ను నిర్వహించక తప్పనిసరి వచ్చింది. కొద్దిమంది స్వార్థం కోసం మా జీవితాలను బలి చేయవద్దు మొర్రోమంటూ విద్యార్థులు ఎంత మొక్కినా ఉపయోగం లేకుండా పోయింది. మున్ముందు న్యాయపరమైన చిక్కులు ఏవీ తలెత్తకుండా ఉండాలంటే మరోసారి ఎంసెట్‌ను నిర్వహించక తప్పదంటూ నిపుణులు తేల్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో విద్యార్థులు ఒకే ఏడాది ఎంసెట్‌-1, ఎంసెట్-2, ఎపిఎంసెట్‌, నీట్-1, నీట్‌-2లతో పాటుగా ఇప్పుడు ఎంసెట్‌-3... ఇలా ఆరుసార్లు పరీక్షలను ఎదుర్కొనే గతి పట్టింది. సమాజంలో పేరుప్రతిష్టల కోసమో, పెళ్లి వ్యాపారంలో ధర ఎక్కువ పలికేందుకో, వైద్య వ్యాపారంలో దండిగా సంపాదించుకుంటారనో... కొందరు తల్లిదండ్రులు పడిన కక్కుర్తి ఫలితంగా ఇప్పుడు వేలాది ఇళ్లలో విషాదం అలముకొంది. ఒకసారి తరువాత మరోసారి ప్రశ్నాపత్రాలతో వ్యాపారం చేస్తున్నా దర్జాగా తిరుగుతున్న ‘లీకు రాకాసుల’ వల్ల తెలంగాణ చిన్నబోయింది. ‘కష్టపడి చదివి మంచి ర్యాంకులు తెచ్చుకున్నాం! ఇక మా రెక్కలు అలసిపోయాయంటూ’ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మంత్రులను బతిమిలాడుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. సెప్టెంబరు 30లోగా అన్ని వైద్య కోర్సులనూ భర్తీ చేయాలన్న సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు ఇప్పుడు ఆదరాబాదరాగా మరోసారి ఎంసెట్‌ను నిర్వహించాల్సి ఉంటుంది. సాధారణంగా నోటిఫికేషన్‌ నుంచి కౌన్సిలింగ్‌ వరకూ దాదాపు మూడు నెలల సమయం పడుతుంది. కానీ ఇప్పుడు అంత సమయం లేకపోవడంతో పరీక్షకు సిద్ధమయ్యేందుకు విద్యార్థులకు పెద్దగా సమయం దక్కకపోవచ్చు. ఈ విషయమై సుప్రీం కోర్టుని వేడుకుంటే, లీకేజీ వ్యవహారమై మొట్టికాయలు తినవలసి వస్తుందన్నది రాష్ట్ర ప్రభుత్వం భయపడుతున్నట్లు తోస్తోంది. ఈ మొత్తం ప్రక్రియలో జాతీయ స్థాయిలో మనది అని చెప్పుకోదగిన జేఎన్‌టీయూహెచ్‌ విశ్వవిద్యాలయం ప్రతిష్ట దారుణంగా మసకబారింది. విశ్వవిద్యాలయ అధికారుల నిర్లిప్తత, అలసత్వం వల్లే లీకేజీ సాధ్యమైందన్న విమర్శలు వినవస్తున్నాయి. కానీ ఇప్పటివరకూ విశ్వవిద్యాలయపు అధికారుల మీద ఎలాంటి చర్యలూ తీసుకున్నట్లు వార్తలు రాలేదు. ప్రస్తుతం దర్యాప్తు అధికారుల ధ్యాసంతా ఈ లీకేజీకి ప్రత్యక్ష బాధ్యులైన రాజగోపాల్ వంటి నిందితుల మీదే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈసారి వీరి మీద కఠినమైన చట్టాలను ప్రయోగించాలని పట్టుదలగా ఉండటం ఒక్కటే ఈ మొత్తం వ్యవహారంలో మిగిలిన ఒకే ఒక్క మంచి పరిణామం. ఎంసెట్‌ పరీక్షను మరోసారి నిర్వహించడం అన్నది ఎలాగూ తప్పదని తేలిపోయింది. ఇక మున్ముందు ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఏం చర్యలు తీసుకోవాలన్నదే ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. నేరస్తులు లీకేజీకి భయపడేలా కఠినమైన చట్టాలను తీసుకురావడం, విద్యాశాఖ మరింత అప్రమత్తంగా వ్యవహరించడం, పరీక్షను నిర్వహించే సంస్థలు తుది వరకూ ఎలాంటి లొసుగుతూ మిగలకుండా చూసుకోవడం... వంటి జాగ్రత్తలు తప్పనిసరి. అన్నింటికీ మించి పిల్లలకి ఏది మంచి ఏది చెడు అని చెప్పాల్సిన తల్లిదండ్రులే, తప్పుదారి పట్టకుండా ఉండాలని ఆశించడం మినహా మరేం చేయగలం!!!

లోక్‌పాల్ గొడుగు కిందకి సేవా సంస్థలు

లోక్‌పాల్, లోకాయుక్త చట్టంలో చేర్చిన కొత్త నిబంధనలు దేశంలోని స్వచ్ఛంద సంస్థల మెడకు చుట్టుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం గత నెల 20న విడుదల చేసిన నోటిఫికేషన్ల ప్రకారం లోక్‌పాల్ చట్టంలోని  సెక్షన్ 14(1) కింద ప్రభుత్వ అధికారులు తమ ఆస్తులు, అప్పుల జాబితాను ఈ నెలాఖరులోపు ప్రభుత్వానికి సమర్పించాలి. తమతో పాటు భార్య, పిల్లల పేర్ల మీద ఉన్న ఆస్తిపాస్తులు, అప్పులు, నగదు నిల్వ, బ్యాంక్ ఖాతాల్లోని సొమ్ము తదితర వివరాలన్నీ ప్రభుత్వానికి సమర్పించాలి. అయితే ఇక్కడే కథ అడ్డం తిరిగింది. ప్రభుత్వ అధికారులతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు కూడా నడవాలి. ప్రభుత్వం నుంచి రూ.కోటి, విదేశాల నుంచి రూ.10 లక్షలకు పైగా విరాళాలు అందుకుంటున్న ఎన్జీవోలు అన్నీ తమ ఆస్తులకు సంబంధించిన వివరాలు ప్రకటించాలని కేంద్రప్రభుత్వం ఆదేశించడంతో స్వచ్ఛంద సంస్థల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లైంది.   రిజిస్టర్డ్ సొసైటీలు, ట్రస్ట్‌లు ఇతర స్వచ్ఛంద సేవా సంస్థల్లోని డైరెక్టర్లు, మేనేజర్లు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, ముఖ్యమైన అధికారులు..అందరూ లోక్‌పాల్ చట్టంలోని నిబంధనల ప్రకారం పబ్లిక్ సర్వెంట్లు అవుతున్నారు. అభాగ్యుల బాగు కోసం పోరాడుతున్న స్వచ్ఛంద సంస్థ..అంటరానితనంపై పోరాడుతున్న ఎన్జీవో ఇలా ప్రతిరోజు వార్తల్లో వింటూనే ఉంటాం. లాభాపేక్ష లేకుండా ఒక పదిమందికో, ఇరవై మందికో మేలు చేస్తూ దానికే అమితమైన ప్రచారం కల్పించుకునే సంస్థలు దేశంలో అనేకం. స్వచ్ఛంద సంస్థంటే..స్వచ్ఛందంగా సేవ చేసే సంస్థని అర్థం. దేశంలోని దాదాపు 99 శాతం స్వచ్ఛంద సంస్థలు ఒకరిద్దరు వ్యక్తులు నడిపేవే. కుటుంబ పోషణ తదితర ఖర్చులకు సరిపడా ఆదాయాన్నిచ్చే వృత్తి లేదా ఉద్యోగం ఉండి..మిగతా సమయంలో కొంత భాగాన్ని సేవకు ఉపయోగించేవారు కొందరు.   తాము నెలకొల్పిన సంస్థకు విరాళాల రూపంలో వచ్చిన నిధులను పరిమితంగానైనా సొంత అవసరాలకు వాడుకునేవారు సర్వసాధారణం. పని మానుకొని పేదలు, అనాథల సేవకే జీవితాన్ని ఆర్పించి..నా కోసం రూ. 50-60 వేలు తీసుకోవడంలో తప్పేంటి..? అని ప్రశ్నించే నిర్వాహకులు చాలా మంది ఉన్నారు. అలా సేవ కాస్తా ఆర్జనకు మార్గంగా మారింది. సేవ పేరిట ప్రభుత్వాలు, విదేశాలు, ప్రజల నుంచి పెద్ద మొత్తంలో విరాళాలు సేకరిస్తున్నాయి ఈ సంస్థలు. వచ్చిన విరాళాలకు, చేసిన ఖర్చుకు పొంతన లేదని, సరైన రికార్డులు చూపించలేదని ప్రభుత్వం ఎన్నో ఎన్జీవోల అనుమతులు రద్దు చేసిన సందర్భాలు కోకొల్లలు. ఆయా సంస్థలు వివాదాల్లో ఉన్నా మీడియా పెద్దగా పట్టించుకోదు కాబట్టి ప్రజలకు తెలిసే అవకాశం లేదు..మీడియా వీటిని టచ్ చేయకపోవడానికి కారణం అత్యున్నత హోదాల్లోని వ్యక్తులు నడుపుతుండటం, రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులు నడిపే సంస్థలు, కొంతమంది నాయకులను లక్ష్యంగా చేసుకుని ఉద్యమాలు, న్యాయపోరాటాలు చేస్తున్న సంస్థలు కావడమే.   ఎన్జీవోలు ఏం సేవలు చేస్తున్నాయి? వాటి అసలు లక్ష్యం ఏంటి? నిధులు ఎక్కడ నుంచి వస్తున్నాయి? ఎలా ఖర్చు చేస్తున్నారు? తదితర వివరాలు సామాన్యులకు తెలిసే అవకాశం లేదు. ఈ విషయాలను గురించి ఎవరైనా ఆయా సంస్థల నిర్వాహకులను అడిగినా..వాటి గురించి చెప్పరు. దేశంలో దాదాపు 45 వేల ఎన్జీవోలకు, సీఎస్‌వోలకు విదేశీ విరాళాలు అందుతున్నాయి. ఈ విరాళాలను పొందుతున్న సంస్థలన్నీ ఏటా తమ విరాళాలు, ఖర్చుల వివరాలను కేంద్ర హోంశాఖకు పంపాలి. దేశంలోని ఎన్జీవోలన్నింటిలో ఇలా ప్రభుత్వానికి సహకరిస్తున్న సంస్థలు కేవలం 10 శాతం మాత్రమేనని గణాంకాలు వివరిస్తున్నాయి. ఎన్నిసార్లు నోటీసులు పంపినా స్పందన లేకపోవడంతో కేంద్ర హోంశాఖ దేశవ్యాప్తంగా పదివేలకు పైగా వివిధ సంస్థల రిజిస్ట్రేషన్లను రద్దు చేసింది. ఈ మద్యనే 4470 ఎన్‌జీవోల లైసెన్స్‌లను రద్దు చేసింది. ఓ పక్క విదేశాల నుంచి నిధులు, మరోపక్క ప్రభుత్వం నుంచి గ్రాంట్లు పొందుతున్న ఈ తరహా సంస్థలు చట్టపరమైన నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని, అందువల్ల చర్యలు తప్పటం లేదని ప్రభుత్వ వాదన.   అయితే స్వచ్ఛంద సేవా సంస్థలను మొత్తం ఒకే గాటన కట్టేయలేం. ఎన్జీవోలన్నీ అక్రమాలే చేస్తున్నాయని గానీ, అన్నీ సక్రమంగానే ఉన్నాయని గానీ అనడానికి లేదు. ఎన్జీవోల మీద విమర్శలు, ఆరోపణలు వచ్చిన వెంటనే వాటిపై నిష్పాక్షిక దర్యాప్తును జరిపించి నిజాన్ని నిగ్గు తేల్చే వ్యవస్థ మనదేశంలో లేదు. రాజకీయంగా తమకు అనుకూలంగా ఉండి, తమ దారికి అడ్డురానప్పుడు..అవి ఏం చేసినా ప్రభుత్వాలకు పట్టదు. అలా కాకుండా నిబంధనలను పాటించని ఎన్జీవోలన్నింటి మీద నిష్పాక్షిక విచారణ జరిపి, వాటి అసలు స్వరూపాన్ని బయటపెడితే స్వచ్ఛంద సేవ చేసే సంస్థలే మిగులుతాయి. ఇన్ని విమర్శల మధ్యన పార్లమెంట్ ప్రభుత్వ ఉద్యోగులకు, ఎన్జీవోలకు పెద్ద ఊరటనిచ్చింది. లోక్‌పాల్ చట్టంలోని 44వ సెక్షన్ సవరణకు లోక్‌సభ తాజాగా ఆమోదం తెలిపింది. దీని వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఎన్జీవోలు తమ ఆస్తుల వివరాల దాఖలు గడువును జూలై 31 నుంచి మరోసారి పొడిగించినట్లైంది. 

రాజుకుంటున్న వర్గీక‘రణం’

దళితుల కోసం కేటాయించిన రిజర్వేషన్లలో వర్గీకరణ జరగాలంటూ గత రెండు దశాబ్దాలుగా సాగుతున్న ఉద్యమం మరోసారి తెరమీదకు వచ్చింది. తెలంగాణ ఉద్యమకాలంలో కాస్త నిద్రాణంగా ఉన్న ఈ ఆకాంక్ష ఇప్పుడు మళ్లీ వినిపించడం మొదలైంది. వర్గీకరణ జరగాలన్న నినాదంతో మంద కృష్ణమాదిగ దిల్లీలో మరోసారి ధర్నా చేపట్టడంతో దేశమంతా అటువైపుగా చూడాల్సిన పరిస్థితి వచ్చింది. బీసీలలో వివిధ కులాల వెనుకబాటుతనాన్నీ, జనాభా నిష్ఫత్తినీ దృష్టిలో ఉంచుకుని వారికి లభించే రిజర్వేషన్లను వేర్వేరుగా విభజించారు. దాని వల్ల ఎవరికి దక్కాల్సిన వాటా వారికి దక్కిందన్న తృప్తి ఉంది. కానీ ఇదే తరహా వర్గీకరణను దళితులలో ఎందుకు చేపట్టకూడదన్నదే మాదిగల ప్రశ్న. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు రెండు దశాబ్దాల క్రితమే రామచంద్రరాజు కమిషన్‌ను నియమించారు. కమిషన్‌ నివేదిక వర్గీకరణకు అనుకూలంగా రావడంతో కొన్నాళ్లపాటు దాని అమలు కూడా జరిగింది. అయితే చట్టంలోని నిబంధనలకు వ్యతిరేకంగా ఈ వర్గీకరణ ఉందంటూ సుప్రీంకోర్టు ఆక్షేపించడంతో వర్గీకరణ సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. మందకృష్ణ మాదిగ నేతృత్వం వహిస్తున్న మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (యం.ఆర్‌.పి.ఎస్‌) ఈ వర్గీకరణ కోసం గట్టిగా పట్టుబడుతోంది. మరోవైపు ఆర్‌.కృష్ణయ్య వంటి నేతల నేతృత్వంలో ఉన్న మాల సంఘాలు వర్గీకరణకు వ్యతిరేకంగా తమ నిరసన గళాన్ని విప్పుతున్నాయి. కృష్ణయ్య ఏకంగా మరో అడుగు ముందుకు వేసి, తన డిమాండ్లను నెరవేర్చుకునేందుకు రాజకీయ నేతలతో సైతం జట్టు కట్టారు. ఇరు వర్గాలూ తమకు అనుకూలమైన వాదనలకే కట్టుబడి ఉండటంతో సమస్య జటిలమైపోయింది. పరస్పర అంగీకారంతోనూ, చర్చలతోనూ ముందుకు సాగాల్సిన పరిష్కారం కాస్తా పీటముడిగా మారిపోయింది. ఈ సమయంలో పార్లమెంటులో వర్గీకరణకు అనుకూలంగా చట్టాన్ని చేసే ధైర్యం ఎవరు చేస్తారన్నది సందేహమే! అలాంటి ధైర్యంతో ముందుకు సాగితే కనుక, తెలుగు రాష్ట్రాలలోని దళితులలో అధికశాతం ఉన్న మాలల ఆగ్రహానికి సదరు పార్టీలు గురి కావలసి ఉంటుంది. మరోవైపు మాలల జనాభా అధికం అన్న కారణంతోనే వర్గీకరణ జరగాలంటూ మాదిగలు పట్టుబడుతున్నారు. బి.సిలలో ఇలాంటి వర్గీకరణ జరిగినప్పుడు ఎలాంటి అశాంతీ తలెత్తలేదని గుర్తు చేస్తోంది యం.ఆర్‌.పిఎస్! వర్గీకరణే కనుక లేకపోతే దళితులలో మరింత దయనీయమైన స్థితిలో ఉన్న పాకి వంటి ఉపకులాలవారు ఎప్పటికీ రిజర్వేషన్ల ఫలాలను అందుకోలేరని హెచ్చరిస్తోంది. ఏది ఏమైనా మరోసారి ఎస్సీ రిజర్వేషన్‌ వర్గీకరణ సమస్య వార్తల్లోకి వచ్చింది. దిల్లీలో మంద కృష్ణ మాదిగ సాగించిన నిరసన కార్యక్రమాలలో పాల్గొన్న యెండ్లూరి సుధాకర్‌ వంటి మేధావులు మాలల అభ్యంతరాల మీద విరుచుకుపడ్డారు. మరోవైపు మాలలు మాత్రం వర్గీకరణ పేరుతో దళితులలో చీలిక తీసుకు రావడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. పైగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత జనాభా సమీకరణలు, నాయకత్వాలు ఒక్కసారిగా మారిపోయాయి. అటు ఆంధ్రప్రదేశ్‌లో వర్గీకరణ ఉద్యమం అంత బలంగా లేదనీ, ఇటు తెలంగాణలో మాదిగల సంఖ్యే ఎక్కువగా ఉందనీ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వర్గీకరణకు అనుకూలంగా, వ్యతిరేకంగా వచ్చే వాదనలలో మళ్లీ మార్పు తప్పదు. దాంతో ఈ సమస్య అసలు పరిష్కారం అవుతుందా అని ఎదురుచూడటం తప్ప చేయగలిగిందేమీ లేదు. ఏది ఏమైనా ఒకటిగా ఉండాల్సిన మాలమాదిగలు ఇలా వర్గీకరణ పేరుతో కత్తులు దూసుకోవడం మాత్రం బాధాకరం!

సడలిన "ఉక్కు" సంకల్పం

16 ఏళ్లు పచ్చి మంచి నీళ్లు తాగలేదు..అమ్మను చూడలేదు..ఇంటిముఖం తెలియదు...డాక్టర్ అవ్వాలనుకుంది..ఉక్కు మహిళగా మారింది, ఆమె ఎవరో ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది. ఆవిడే ఇరోమ్ షర్మిల. మణిపూర్‌లో సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దు చేయాలంటూ 16 ఏళ్లు పాటు చేసిన దీక్షకు ముగింపు పలకాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఆగస్టు 9న తన దీక్షను విరమిస్తున్నట్టు ప్రకటించారు. ఆత్మహత్యాయత్నం ఆరోపణలపై ఇంఫాల్ కోర్టులో విచారణకు హాజరైన షర్మిల..నిరాహారదీక్ష వల్ల సాధించేది లేదని భావిస్తున్నందున వివాదాస్పద ఏఎఫ్ఎస్‌సీఏ చట్టం రద్దుకోసం త్వరలోనే రాజకీయాల్లోకి చేరనున్నట్టు ప్రకటించారు.    కల్లోల ప్రాంతాలుగా ఉన్న అరుణాచల్‌ప్రదేశ్, అసోం, మణిపూర్, మేఘాలయా, మిజోరం, నాగాలాండ్, త్రిపురలలో పరిస్థితుల్ని అదుపు చేయడం కోసం సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని భారత పార్లమెంట్ 1958 సెప్టెంబర్ 11న ఆమోదించింది. ఆ తర్వాత ఈ చట్టాన్ని జమ్మూకాశ్మీర్‌కు కూడా వర్తింపజేస్తూ సాయుధ దళాల(జమ్మూకశ్మీర్) ప్రత్యేకాధికారాల చట్టం..1990 అమల్లోకి వచ్చింది. ఈ చట్టం భారత సాయుధ దళాలకు విస్తృతాధికారాలను కల్పించింది. కనిపిస్తే కాల్చివేతకు, ఏ సాకుతోనైనా, ఎవరినైనా అరెస్ట్ చేసేందుకు, ఎటువంటి వారెంట్ లేకుండానే సోదాలు నిర్వహించే అవకాశం సైన్యానికి దక్కింది. అయితే ఈ అధికారాన్ని సైన్యం దుర్వినియోగం చేస్తున్నట్టు ఎప్పటి నుంచో ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారం మాటున సైన్యం మానభంగాలు, చిత్రహింసలు, పౌరుల్ని విచక్షణారహితంగా కాల్చివేయడం లాంటి చర్యలకు పాల్పడింది. ఈ చట్టం ఆసరాతో అక్రమాలకు పాల్పడిన సైనికుల్ని అరెస్ట్ చేయడం గాని, ఎటువంటి విచారణకైనా గురిచేయడానికి కాని అవకాశం లేదు.   ఈ నేపథ్యంలో 2000 నవంబర్‌లో మణిపూర్ రాజధాని ఇంఫాల్‌కు సమీపంలోని మాలమ్‌లో బస్టాప్‌లో నిలబడిన 10 మందిని అస్సామ్ రైఫిల్స్ దారుణంగా కాల్చిచంపింది. మృతుల్లో 62 ఏళ్ల మహిళతో పాటు..సినామ్ చంద్రమణి అనే జాతీయ సాహస బాలల అవార్డు అందుకున్న యువతి కూడా ఉంది. ఈ ఘటన షర్మిల జీవితాన్ని మలుపు తిప్పింది. కనీస విచారణ లేకుండా సైన్యం అంతటి దారుణానికి పాల్పడటంపై తీవ్రంగా చలించిన షర్మిల..ఇందుకు కారణమైన సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దు చేయాలంటూ దీక్ష ప్రారంభించారు. ఆహారాన్ని తీసుకోకపోవటం మాత్రమే కాదు..ఈ చట్టాన్ని రద్దు చేసేంతవరకు అద్దంలో మొహం కూడా చూసుకోనని, జుట్టును కూడా ముడివేయనని, చివరికి తన తల్లిని కూడా చూడనని తనకు తాను కట్టుబాట్లు విధించుకున్నారు.   అలా ఒకరోజు, రెండు రోజులు కాదు ఏకంగా 16 సంవత్సరాల పాటు అన్నపానీయాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఆమెను ఇంఫాల్‌లోని జేఎన్ ఆసుపత్రిలో ఉంచి ముక్కులోపలి నుంచి గొట్టాల ద్వారా ద్రవాహారం అందిస్తున్నారు. అప్పటి నుంచి ఆసుపత్రినే జైలుగా మార్చి అందులోనే షర్మిలనునిర్భందించారు. 16 ఏళ్ల ఈ నిరసన కాలంలో ఆమె ఇంతవరకు తన ఇంటికి వెళ్లనప్పటికీ ఒక్కసారి మాత్రం యాదృచ్ఛికంగా తన తల్లిని కలిశారు. 2009లో ఆమె తల్లి సఖీదేవిని అనారోగ్య కారణాలతో షర్మిల ఉన్న ఆసుపత్రిలోనే చేర్చడంతో తల్లీకూతుళ్లు ఒకరినొకరు చూసుకున్నారు. అంతే తప్ప తనకు తానుగా తల్లిని చూడకపోవడం షర్మిల మొండిపట్టుదలకు నిదర్శనం.   2004లో 30 మంది షర్మిల మద్ధతుదారులు ఢీల్లిలోని అస్సాం రైఫిల్స్ ప్రధాన కార్యాలయం వద్ద నగ్నంగా నిరసన చేశారు. దీంతో ఈ విషయం అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాల చెవిన పడింది. అనేక మంది నోబెల్ బహుమతి అవార్డు గ్రహీతలు, అమ్మెస్టీ ఇంటర్నేషనల్, అన్నాహజారే వంటి సామాజిక వేత్తలు షర్మిల దీక్షకు మద్ధతు పలికారు. అయినా ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దు చేయించలేకపోయారు. రోజులు గడుస్తున్నా..ప్రభుత్వ వైఖరిలో ఏ మార్పు లేకపోవడం, ప్రజలు, ప్రజాసంఘాల మద్ధతు కరువువ్వడంతో తన దీక్షను విరమించి రాజకీయ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు షర్మిల.   దీనిలో భాగంగా 2017లో జరిగే మణిపూర్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తానని..వివాహం చేసుకుంటానని ఆమె ప్రకటించారు. ఇరోమ్‌‌ను రాజకీయాల్లోకి రావాల్సిందిగా 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలోనే తృణమూల్ కాంగ్రెస్, సీపీఎంలు కోరాయి. ఈ ప్రతిపాదనను ఆమె నిరాకరించారు. 28 సంవత్సరాల వయసున్నపుడు దీక్ష ప్రారంభించిన షర్మిలకు ఇప్పుడు 44 సంవత్సరాలు. బహుశా వయసు మీద పడుతుండటం, మునుపటి శక్తి లేకపోవడం కూడా ఆమె దీక్ష విరమణకు కారణం కావచ్చు. ఏది ఏమైనా ప్రపంచంలోనే అత్యంత సుధీర్ఘకాలం పాటు నిరాహార దీక్ష చేసి ఇప్పుడు ఉన్నపళంగా దీక్ష విరమణ చేయడం కుటుంబీకులు, పోరాట సహచరులు సహా యావత్ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది.  

కాలగర్భంలోకి "యాహూ"

ఆధునిక సాంకేతిక రంగంలో ఒక దిగ్గజ సంస్థ శకం ముగిసింది. సుమారు రెండు దశాబ్దాల పాటు ఇంటర్నెట్ ప్రపంచాన్ని శాసించిన "యాహూ" వేరొకరి గుప్పిట్లోకి వెళ్లబోతోంది. యాహూ ఇంక్స్ కోర్ ఇంటర్నెట్ బిజినెస్‌లు అమెరికాకే చెందిన ప్రముఖ సంస్థ "వెరిజోన్" చేతికి వెళ్లిపోయాయి. 4.83 బిలియన్ డాలర్లకు (భారత కరెన్సీలో రూ. 32, 491.41కోట్లు) యాహూను కొనుగోలు చేస్తున్నట్లు వెరిజోన్ ప్రకటించింది. ఈ డీల్ మొత్తం నగదు రూపంలో ఉండనుందని తెలిపింది. మొదటి నుంచి గట్టి పోటీదారుడిగా వచ్చిన వెరిజోన్ చివరికి యాహూను కైవసం చేసుకోవడం విశేషం. ప్రపంచంలో తొలి తరం ఇంటర్నెట్ వాడకం దార్లకు తొలి మెయిల్‌గా యాహూనే అయి ఉంది. అంతేకాదు తొలినాళ్లలో ఇంటర్నెట్‌ను పరిచయం చేసింది కూడా యాహూనే. అందుకే ఆ తరం ఈ-మెయిల్ వినియోగదార్లలో ఎక్కువ మంది ఐడీలు యాహూ పేరుతోనే ఉంటాయి.   1994లో స్టాన్‌ఫోర్డ్ విద్యార్థులైన "జెర్రీ యాంగ్", "డేవిడ్ ఫిలో"లు యాహూను స్థాపించగా..1996లో స్టాక్ ఎక్స్జేంజీలో లిస్ట్ అయ్యింది. అలా దశాబ్దకాలం పాటు ఇంటర్నెట్‌ ప్రపంచాన్ని శాసించింది. 2000 సంవత్సరం నాటికి డాట్.కామ్ బూమ్ వచ్చి, సెర్చ్ ఇంజన్‌కు ఆదరణ పెరగటం మొదలైంది. దీన్ని యాహూ గుర్తించింది. కానీ సొంతంగా సెర్చ్ ఇంజన్‌ను అభివృద్ధి చేసుకోవటానికి బదులు అటువంటి సేవలు అందించే ఇతర సంస్థల వైపు దృష్టి సారించింది. కానీ ఆ తర్వాత శరవేగంగా వచ్చిన సాంకేతిక మార్పులకు, ఎదురైన సవాళ్లకు సన్నద్ధం కాలేకపోయింది. మరో పక్క "మైక్రోసాఫ్ట్", "గూగుల్" వంటి సంస్థలు యాహూకు పోటీనిచ్చాయి. ప్రోడక్ట్స్ రంగంలో మైక్రోసాఫ్ట్ ఆధిపత్యాన్ని సాధిస్తే..సెర్చ్ ఇంజన్‌తో మొదలు పెట్టి సోషల్ నెట్‌వర్కింగ్, వార్తలు, డాక్యుమెంట్లు, డ్రైవ్..తదితర పలు రకాలుగా తన సేవలను గూగుల్ విస్తరించింది.   కేవలం ఇంటర్నెట్ సేవలకే పరిమితమైన యాహూ ఈ సంస్థలతో పోటీపడలేని పరిస్థితిని ఎదుర్కొంది. గత కొన్నేళ్లుగా మళ్లీ పైకి రావటానికి, ప్రజాదరణ పొందటానికి యాహూ విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ అవేవి సత్ఫాలితాలు ఇవ్వలేదు. నాలుగేళ్ల క్రితం ఎంతో ఆశతో సీఈవోగా నియమించిన "మరిస్సా మాయర్" కూడా కంపెనీ క్షీణతను నిలువరించలేకపోవడంతో చివరికి అమ్మకానికి సిద్ధమైంది. అయితే 2008లోనే యాహూను కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్ ఆసక్తి చూపించింది. అందుకు ప్రతిఫలంగా 44 బిలియన్ డాలర్లను ఇవ్వజూపింది. అంటే డీల్ విలువ 1.76 లక్షల కోట్లు అది కూడా రూపాయి మారకం విలువ రూ 40 ఉన్నపుడు( ఇపుడు డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 67). ఈ ఒప్పందాన్ని అప్పట్లో యాహూ డైరెక్టర్ల  బోర్డు తిరస్కరించింది.   ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిలబడిన యాహూ.. గతేడాది సంభవించిన 4.4 డాలర్ల నష్టం దెబ్బకు కోలుకోలేని స్థితికి పడిపోయి తన వ్యాపారాన్ని ఎంతో తక్కువ విలువకు విక్రయించేందుకు సిద్ధపడింది. దాని ఫలితమే వెరిజోన్‌తో 4.83 బిలియన్ డాలర్ల ఒప్పందం. ఈ ఒప్పందంలోకి యాహూకు సంబంధించిన నగదు, యాహూ కన్వర్టబుల్ నోట్స్, కొన్ని మైనారిటీ వాటాలు, యాహూ ప్రధానేతర పేటెంట్లు పరిగణనలోకి రావని వెరిజోన్ ప్రకటించింది. అన్ని అనుమతులు పొంది 2017 తొలి త్రైమాసికంలో ఈ డీల్ పూర్తికావొచ్చని అంచనా. ఈ ఒప్పందం ఫలితంగా డిజిటల్ వ్యాపార ప్రకటనల మార్కెట్‌లో గూగుల్, ఫేస్‌బుక్ తర్వాత మూడో స్థానానికి చేరనుంది. తద్వారా వినియోగదార్లకు బదులుగా వ్యాపార ప్రకటనల నుంచి ఆదాయం పొందాలని అది భావిస్తోందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.   చీకటిలో చిరుదీపం: 13 ఏళ్లుగా క్షీణిస్తూ..ఎన్నో నష్టాలను చవిచూస్తూ వస్తోన్న యాహూ చివరికి వేరొకరికి సొంతం అవ్వడానికి నిర్ణయించుకుంది. ఇంతటి కష్టంలో చీకటిలో చిరు దీపంలా నిలిచింది అలీబాబా. ఇ-కామర్స్ విభాగంలో అమెజాన్‌ స్థాయి కలిగిన చైనా సంస్థ అలీబాబాలో యాహూ కొంతకాలం క్రితం పెట్టుబడి పెట్టి 15 శాతం వాటా కొనుగోలు చేసింది. ఇప్పుడు ఈ పెట్టుబడి విలువ ఎంతో తెలుసా 40 బిలియన్ డాలర్లు. అంటే యాహూ ఇంటర్నెట్ వ్యాపారానికి ఉన్న విలువ కంటే అలీబాబాలో పెట్టిన పెట్టుబడి విలువ దాదాపు 9 రెట్లు అధికం.   ఏ రంగంలో అయినా ముందుచూపు, భవిష్యత్తు ఎలా ఉంటుందో అంచనా వేయడం అత్యంత ఆవశ్యం. ఇంటర్నెట్‌ ప్రపంచంలో వినియోగదారుల నాడిని పట్టుకోవడంలో విఫలమై తను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లుగా వ్యవహరించిన యాహూ కోరి కష్టాలు తెచ్చుకుని పతనానికి తనకు తానే బాటలు వేసుకుంది. ఏది ఏమైనా వెబ్, ఈ-మెయిల్, సెర్చ్ వంటి మాధ్యమాలతో ప్రపంచ గతిని మార్చిన కంపెనీగా..యాహూ చరిత్రలో నిలిచిపోతుంది.

మానని గాయానికి రెండేళ్లు..

మాసాయిపేట రైలు దుర్ఘటన..తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశాన్ని శోకసంద్రంలోకి నెట్టిన ఒక విషాదగాధ. నాలుగు గ్రామాల్లో..18 కుటుంబాల్లో ఆరనిచిచ్చును రగిల్చిన నెత్తుటి సంతకం. పొద్దున్నే లేచి తయారై లంచ్ బాక్సులు పెట్టుకుని చిట్టి బ్యాగులు వేసుకుని అమ్మానాన్నలకు నవ్వుతూ టాటా చెబుతూ స్కూలు బస్సెక్కిన చిన్నారులకు కాని..వారి తల్లిదండ్రులకు కాని తెలియదు కాసేపట్లో మృత్యుదేవత పంజా విసరబోతోందని. 2014 జూలై 24న మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మాసాయిపేట రైల్వేక్రాస్ వద్ద ఉదయం పదిగంటల సమయం..ట్రాక్ దాటుతున్న స్కూలుబస్సు హఠాత్తుగా ఆగిపోయింది..ఎందుకు ఆగిందో ఎవరికీ తెలియదు..ఇంతలో అటు నుంచి వచ్చిన రైలు స్కూలు బస్సును ఢీకొని కిలోమీటరు దూరం లాక్కెళ్లింది. డ్రైవరు, క్లీనరు సహా 16 మంది అభం శుభం తెలియని చిన్నారులు మృత్యుశకటానికి బలైయ్యారు. ఇందులో 13 మంది చిన్నారులు సంఘటనా స్థలంలోనే మరణించగా..ఒకరు ఆసుపత్రికి తరలిస్తుండగా, ఇద్దరు చికిత్స పొందుతూ చనిపోయారు.   చూస్తుండగానే రెండేళ్లు పూర్తయింది..అయినా కంటివెలుగులను కోల్పోయిన ఆ తల్లిదండ్రులకు మాత్రం ఆ ఘటన ఇంకా కళ్లేదుటే మెదులుతోంది. గాయాలతో బయటపడి తమ ముందే తిరుగుతున్న పిల్లలను చూసి చనిపోయిన తమ పిల్లలను గుర్తు చేసుకుని బాధపడుతున్నారు. స్కూలుకెళ్లే ప్రతి బిడ్డను చూసినప్పుడల్లా తమ బిడ్డ ఉంటే ఇలాగే బడికి వెళ్లేవాడేనేమోనని లోలోపల కుమిలిపోతున్నారు. ఇది గాయానికి ఒకవైపే..అదే ప్రమాదంలో మరో 18 మంది తీవ్రగాయాలతో ప్రభుత్వ ప్రత్యేక శ్రద్దతో ప్రాణాలతో బయటపడ్డారు. వీరిలో కొందరికి జ్ఞాపకశక్తి మందగించింది. మరి కొందరిలో చేతులు, కాళ్లు వణుకుతుండటంతో బతికుండగానే నరకం చూస్తున్నారు.    కారణం ఎవరు..? దశాబ్దాలుగా ప్రజలు మొత్తుకుంటున్నా రైల్వేశాఖ మాసాయిపేట లెవల్ క్రాస్ వద్ద గేటు ఏర్పాటు చేయలేదు..కాపలాదారులను నియమించలేదు. కాపలాలేని లెవల్ క్రాసింగ్స్ వద్ద వాహనాల డ్రైవర్లు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. కానీ ఆ బస్సు డ్రైవర్ ఏమాత్రం అప్రమత్తతతో వ్యవహరించలేదు. దానికి తోడు డ్రైవర్ సెల్‌ఫోనులో మాట్లాడుతుండటం వల్లే అతడు రైలు వస్తున్న విషయాన్ని గుర్తించలేదని స్థానికులు, ప్రత్యక్ష సాక్షులుచెబుతున్నారు. చిట్టచివరి నిమిషంలో వెనుక నుంచి పిల్లలంతా రైలు..రైలు అని అరవడంతో ఒక్కసారిగా కంగారుపడి ఆలస్యంగా బ్రేకులు వేశాడని, కానీ..దాని వల్ల బస్సు ఆగకపోగా రైలు పట్టాల మీదుగా జారిపోవడంతో వేగంగా వస్తున్న రైలు ఢీకొందని తేల్చారు.   చెల్లెలు చనిపోతున్నా..తోటివారి ప్రాణాలను కాపాడి.. ఈ ప్రమాదం ఒక సాహసబాలికను వెలుగులోకి తీసుకువచ్చింది. ఒకర్నొకరు కాపడుకోలేని అచేతనస్థితి..హాహాకారాలు తప్ప..ఆపన్న హస్తాలు కనిపించని ఆపత్కాలంలో..తనను..తన తమ్ముడు, చెల్లి ప్రాణాలను లెక్కచేయకుండా చిన్ని చేతితో తోటివారి ప్రాణాలను కాపాడిన సాహస బాలిక రుచిత. రైలు కూతపెట్టుకుంటూ వస్తోందని గమనించిన రుచిత, డ్రైవర్ అంకుల్ రైలొస్తుందని అరిచింది..అయితే బస్సు ఎంతకూ స్టాట్ కాకపోవడం, రైలు దగ్గరదాకా వస్తుండటంతో రుచిత మదిలో ఆలోచన తట్టింది. అంతే సద్భావన్, మహిపాల్‌రెడ్డి అనే పిల్లలను వెంటనే కిటికీల్లోంచి కిందకు తోసేసి తర్వాత తానూ కిందకు దూకేసింది. అయితే ఆ ప్రయత్నంలో చెల్లెలిని కాపాడలేకపోవడంతో ఆమె చనిపోయింది. రుచిత సాహసాన్ని గుర్తించిన భారతప్రభుత్వం పాపను సాహస బాలికగా ఎంపిక చేసింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా రుచిత అవార్డును అందుకుంది   ప్రతి ప్రమాదం మిగిల్చే విషాద ఛాయలు ఎంతో గాఢంగా ఉంటాయి. ప్రభుత్వాలు ఎంత పరిహారం ఇచ్చినా కానరాని లోకాలకు తరలిపోయిన ఆ చిన్నారులను తీసుకురాలేవు. వారి గుర్తులు తల్లిదండ్రులను జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి దుర్గతి ఏ తల్లిదండ్రులకు పట్టకూడదని..ఆ చిన్నారుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తోంది..మీ తెలుగువన్

ఎంసెట్‌ లీకేజీకి కారణం ఎవరు!

  తమ పిల్లలు ఒకప్పుడు సమాజానికి సేవ చేసేందుకు వైద్యులుగా మారాలని పెద్దలు కోరుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. విలువలే మారాయో లేకపోతే డబ్బుతో పాటుగా పెరిగిపోతున్న సుఖాలే వారి కళ్లను కమ్మేస్తున్నాయో కానీ... అందినంత సంపాదించుకునేందుకు తమ బిడ్డలు వైద్యలుగా మారాలని చాలామంది తల్లిదండ్రులు తపించిపోతున్నారు. ఇప్పుడు వారికి కావల్సింది అట్టడుగు వర్గాలకు వైద్య సేవలను అందించడం కాదు, సమాజంలో అన్నింటికంటే పైమెట్టుని చేరడం. ఇప్పుడు పెద్దల దృష్టిలో వైద్యుడు అంటే బాగా సంపాదించేవాడు, ఎడాపెడా కమీషన్లను గుంజుకునేవాడు, మంచి హోదాని సాధించేవాడు, వీలైనంత కట్నాన్ని చేజిక్కించుకునేవాడు. ఇలాంటి తల్లిదండ్రుల దృక్పథాలను గమనిస్తూ పెరుగుతున్న పిల్లలు ఇంతకంటే గొప్పగా ఏం ఆలోచిస్తారు. విద్యావైద్య వ్యవస్థలు ఎంతగా కలుషితం అయిపోతున్నాయో చెప్పేందుకు ఎంసెట్‌-2 కుంభకోణమే ఓ నిలువెత్తు సాక్ష్యం!   తెలంగాణలోని వైద్య సీట్లను భర్తీ చేసేందుకు నిర్వహించిన ఎంసెట్‌-2లో భారీ అవకతవకలు జరిగాయన్నది ప్రధాన ఆరోపణ. కొందరు దళారులు ప్రశ్నాపత్రాలు ముందుగానే చేజిక్కించుకుని, 35-70 లక్షలకు వాటిని బేరం పెట్టినట్లు ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. అలాంటిదేమీ జరగలేదంటూ తెలంగాణ విద్యామంత్రితో సహా ప్రభుత్వమూ, అధికారులూ ముక్తకంఠంతో చెబుతున్నప్పటికీ... ఏదో గోల్‌మాల్‌ జరిగిందనడానికి బలమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. మీడియా ప్రచురిస్తున్న కథనాలు, ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న వాంగ్మూలాలను పరిశీలిస్తే ఈ కుంభకోణం పక్కా ప్రణాళికతో జరిగిందని తేలిపోతోంది.   ప్రశ్నాపత్రాలను లీక్‌ చేసే అవకాశం ఉన్నవారు ముందుగానే కొందరు తల్లిందండ్రులకు ఎరవేసి బేరసారాలు నడిపారు. ముందుగా ఇంత, పని పూర్తయిన తరువాత ఇంత అంటూ హైదరాబాదుకి పిలిపించుకుని మరీ ‘వ్యవహారం’ కుదుర్చుకున్నారు. పరీక్షకు సరిగ్గా వారం రోజులకు ముందరగా విద్యార్థులను హైదరాబాదుకి రప్పించుకుని ప్రశ్నపత్రాలలోని కీలకమైన ప్రశ్నల మీద తర్ఫీదునిచ్చారు. సహజంగానే ఈ విద్యార్థులకు మంచి ర్యాంకులు వచ్చాయడంలో సందేహం లేదు. దానికి నిదర్శనంగా నీట్ (National Eligibility cum Entrance Test) గొడవలో పడి రద్దయిపోయిన తొలి ఎంసెట్ ఫలితాలకీ, ఈ రెండో ఎంసెట్ ఫలితాలకీ అసలు పొంతనే లేకుండా పోయింది.   నిజంగానే ఎంసెట్‌ ప్రశ్నాపత్రం లీకైనా అవ్వకున్నా, తెర వెనుక ఏదో భాగోతం నడిచిందని మాత్రం స్పష్టంగా తేలిపోతోంది. దళారులు వలవేసేందుకు ప్రయత్నించడాలు, కొందరు వారి మాటలను నమ్మి లక్షలకు లక్షలు సమర్పించుకోవడాలూ జరిగాయనడానికి సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. పరీక్షను నిర్వహించే బాధ్యత ఉన్న అధికారుల సాయం లేకుండా ఇంత తతంగమూ సాధ్యం కాదు! కాబట్టి ఇక్కడ కేవలం ఎంసెట్‌ లీక్ అవ్వడమే సమస్య కాదని అర్థమవుతోంది. తమ పిల్లలు ఎలాంటి పరిస్థితుల్లో అయినా వైద్యులు కావాలని కోరుకునే తల్లిదండ్రుల సంకుచిత తత్వం, తమకు కొన్ని డబ్బులు మిగిలితే చాలు... వైద్య రంగంలోకి ఎలాంటివారు చేరినా ఫర్వాలేదనుకునే అధికారులు, డబ్బుల కోసం ఎంత నీచానికైనా పాల్పడే దళారులు, వీటన్నింటినీ చూసీ చూడనట్లు ఊరుకునే ప్రభుత్వ యంత్రాంగం, తనకు అర్హత లేకున్నా అందలాలు ఎక్కాలని ఉవ్విళ్లూరే విద్యార్థులు... అందరూ ఈ తప్పుకి బాధ్యులే!   సమాజంలో ఇలాంటి మనస్తత్వానిదే రాజ్యంగా సాగుతోంది కాబట్టి, ఒక్క ఎంసెట్‌ కోచింగ్‌ వ్యాపారమే దాదాపు ఐదువేల కోట్లు ఉంటుందని ఓ అంచనా! మరి ఇంత ఖరీదైన వ్యాపారం మధ్య, ఇలాంటి మనుషుల మధ్య... పేదవాడి ఆరోగ్యం, రూపాయి రూపాయి కూడబెట్టుకునే మధ్యతరగతివాడి బతుకూ ఏమైతే ఎవడికి పట్టింది!!!

అవినీతి "ఐఏఎస్‌"లపై ప్రజల చేతికి కొరడా..

పెద్ద పెద్ద హోదాలు..అంతులేని అధికారాలు..అడుగడుక్కూ పరిచారకులు..లంకంత బంగ్లాలు..విదేశీ ప్రయాణాలు..అత్యున్నత నిర్ణయాధికారం.. ఇవి భారత్‌లో ఐఏఎస్ అధికారుల వైభవానికి తార్కాణాలు. ఇలాంటి సౌకర్యాలు ఉన్నప్పటికి కొందరు అధికారులు అవినీతికి పాల్పడి ఈ వ్యవస్థకే మాయని మచ్చ తెస్తున్నారు. వీరికి గల రాజ్యాంగపరమైన రక్షణలు ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవడానికి ప్రతిబంధకాలుగా మారాయి. తాజాగా ఐఏఎస్‌ అధికారులపై విచారణ జరపమని ప్రతిపాదించే అధికారాన్ని సామాన్య ప్రజలకు కల్పిస్తూ కేంద్రప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2012లో అప్పటి ప్రధాని మన్మోహన్‌‌సింగ్‌పై సుబ్రమణ్యస్వామి వేసిన ఒక కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ పబ్లిక్ సర్వెంట్లు తప్పు చేశారని భావిస్తే సామన్య ప్రజలు కూడా విచారణ జరపాలని సమర్ధ అధికార కేంద్రం వద్ద ప్రతిపాదించవచ్చని, దాన్ని నిరోధించే చట్టాలేవీ లేవని చెప్పింది.   ఆ తీర్పును ఆధారంగా చేసుకున్న కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎలాంటి ఆధారాలు, పత్రాలు చూపించకుండానే అవినీతిపరులని భావించిన ఐఏఎస్‌ అధికారులపై విచారణ కోరుతూ సిబ్బంది శాఖకు ప్రజలు ప్రతిపాదనలు పంపవచ్చు. అధికార యంత్రాంగం విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించినపుడే సుపరిపాలన సాధ్యపడుతుందన్నది జాతిపిత అన్నమాట. అందుకే పాలన నేతలదైనా..నడిపించేది మాత్రం ఐఏఎస్‌లే. దేశవ్యాప్తంగా 5 వేల మంది ఐఏఎస్‌‌లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో సేవలందిస్తున్నారు. మెజిస్టీరియల్ అధికారాలను నిర్వహించే స్థాయిని రాజ్యాంగం ఐఏఎస్‌లకు కల్పించి, పాలనాపరంగా విశేషాధికారాలను ఇచ్చింది.  మరేదేశంలోనూ లేని విధంగా ఇక్కడ ఐఏఎస్‌లకు పూర్తి స్థాయి రక్షణ కల్పించారు. నిర్భయంగా పనిచేయడానికి, నిస్సంకోచంగా మనసులో మాట చెప్పడానికి, నాయకులు చెప్పేది తప్పయితే వ్యతిరేకించడానికి అవకాశమిచ్చారు. ఐఏఎస్‌ల వద్ద అపరిమితమైన అధికారం కేంద్రీకృతమై ఉంటూంటే వారి నోటి మాటలు రాజాజ్ఞలుగా చెలామణి అవుతాయి. అందుకే ఎన్ని తప్పులు చేసినా ఐఏఎస్‌లు ఆడింది ఆట పాడింది పాట.   దానికి తోడు వారికి మరింత అధికారమిచ్చే నిర్ణయాన్ని మోడీ సర్కార్ తీసుకుంది. ఐఏఎస్, ఐపీఎస్ ఇతర సివిల్ సర్వీస్ అధికారులను ఏకపక్షంగా సస్పెండ్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలను కట్టడి చేసింది. ఒకవేళ సస్పెండ్ చేసినా ఆ విషయాన్ని 48 గంటల్లోగా కేంద్రప్రభుత్వానికి తెలియజేయాలి. అవినీతి కేసుల్లో ఆ అధికారులపై విధించే సస్పెన్షన్ రెండేళ్లకు మించరాదు. ఇక కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలంటే ప్రధాని అనుమతి తీసుకోవాలి. దీనిని బట్టి చూస్తే ఐఏఎస్‌, ఐపీఎస్‌ల జోలికి వెళ్లే సాహసం ఏ ప్రభుత్వమూ చేయలేదు. ప్రభుత్వాలే చూసి చూడనట్టు వ్యవహరిస్తుంటే ప్రజల పరిస్థితి వేరే చెప్పక్కర్లేదు.   తాజాగా కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం..ఒక పౌరుడు సిబ్బంది శాఖకు పంపించిన ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక దర్యాప్తు జరిపి, నిజమని తేలితే సంబంధిత పత్రాలతో సమగ్ర నివేదిక పంపించాలి. అందులో సంబంధిత అధికారి వివరణ కూడా తీసుకోవాలి. ఆ వివరాలన్నింటిని కేంద్ర సిబ్బంది శాఖకు పంపాలి. అధికారి తప్పేమీ చేయలేదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే ఫిర్యాదు చేసిన పౌరుడికి అదే సమాచారాన్ని అందజేయాలి. దానిపై పౌరుడికి అభ్యంతరం ఉంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. అవినీతి నిరోధక చట్టం కింద అధికారి తప్పు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమిక విచారణలో తేలితే, పౌరుడి ఫిర్యాదునే అవినీతి అధికారిపై చర్యకు ప్రతిపాదనకు భావించి, నిబంధనల ప్రకారం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.