ఇక డిజిటల్ ఇండియాకి 'జియో'స్తు!

డిజిటల్ ఇండియా... ఒకప్పుడు ఇండియా అంటే వెస్టనర్స్ కి పాములు ఆడించుకునే దేశం అనే భావం వుండేది. కాని, ఇప్పుడు ఇండియా పూర్తిగా మారిపోయింది. పాముల్ని పూజించుకుంటూనే... అత్యాధునిక దశలోకి సరసరా పాకేస్తోంది! అది చంద్రమండలమైనా సరే తన మేధస్సుతో అంతు చూస్తోంది! అందుకే, ప్రధాని మోదీ సంధించిన డిజిటల్ ఇండియా బాణం అత్యంత వేగంగా దూసుకుపోతోంది...  మోదీ డిజిటల్ ఇండియాను నిజం చేసే దిశగా మరో అడుగు పడింది. అయితే, ఈసారి సక్సెస్ ఏ ఇస్రో లాంటి ప్రభుత్వ రంగ సంస్థ నుంచో రాలేదు. రెలయన్స్ లాంటి ప్రైవేట్ ప్లేయర్ కారణంగా డిజిటిల్ ఇండియా కల మరింత సుస్పష్టంగా సాకారమవ్వనుంది!   రెలయన్స్ వారి జియో త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. అయితే, దీన్ని మోదీ కలలుగంటోన్న డిజిటిల్ ఇండియా నినాదానికి లింక్ చేయటం కొంచెం అతిగా అనిపించవచ్చు. నిజానికి ముఖేష్ అంబానీ జియో ద్వారా బిజినెస్సే చేస్తాడు తప్ప దేశ సేవేం కాదు. అది ఒప్పుకున్నప్పటికీ .... జియో కారణంగా మొత్తం ఇండియన్ టెలికామ్ ఇండస్ట్ట్రీ ముఖచిత్రమే మారిపోనుంది. అది ఈ పరిణామంలోని ప్రత్యేకత! దేశంలోకి సెల్ ఫోన్లు వచ్చిన కొత్తలో కూడా సామాన్యులు బెంబేలెత్తిపోయేలా వుండేవి మొబైల్ రేట్స్. అలాగే, కనెక్షన్ కూడా విపరీతమైన ఖరీదుతో కూడుకుని వుండేది. ఇన్ కమింగ్, అవుట్ గోయింగ్ అన్నిటికి తెగ బాదుడు వుండేది. కాని, అటువంటి దశలో రెలయన్స్ ఎంటరైంది. కేవలం 500లకు మొబైల్ ఇస్తామంటూ మొత్తం గేమంతా మార్చేసింది. ఫలితంగానే ఇప్పుడు మనం చూస్తున్నంత వరకూ టెలికామ్ ఇండస్ట్రీ వచ్చింది. మారుమూల పల్లెళ్లలో కూడా ఇవాళ్ల స్మార్ట్ ఫోన్లు దర్శనమిస్తున్నాయి. రెలయన్స్ మన దేశంలో మొబైల్ విప్లవానికి కారణం కాకపోవచ్చు! కాని, అదొక క్యాటలిస్ట్ లాగా ఉపయోగపడిందన్నది మాత్రం నిజం...  ఫోన్ తో కాల్స్ చేసుకోవటం ఇప్పుడు సమస్య కాదు. సమస్యల్లా స్మార్ట్ ఫోన్ చేతిలో పట్టుకుని ఇంటర్నెట్ వాడకుండా వుండటం. చాలా మందికి డేటా రేట్స్ పట్ల ఇంతకాలం అసంతృప్తి వుంటూ వస్తోంది. దాదాపు అందరు సర్వీస్ ప్రొవైడర్స్ అటు ఇటుగా ఒకే రేట్ మెయింటైన్ చేస్తున్నారు. పైకి తగ్గించినట్లు ఆఫర్లు , ప్రకటనలు చూపించినా చివరాఖరుకు కస్టమర్ కు దక్కే లాభం అంతంతమాత్రమే. ఈ కారణంతోనే ఇప్పటికీ చాలా మంది తమ స్వార్ట్ ఫోన్ వాట్సప్ వినియోగానికి తప్ప దేనీకి వాడటం లేదు...  జియో 4జీ వినియోగదారుడికి తప్పకుండా మేలు చేస్తుంది. ఒకటి రెలయన్స్ సంస్థ భారీగా ఆఫర్లు ప్రకటించి ఒక ఎంబీ కేవలం 5పైసలకి ఇవ్వటమే కాదు.... ఇతర సంస్థలు కూడా పోటీలో వుండటం కోసం ధరలు తగ్గించేలా చేస్తోంది. దీని వల్ల అన్ని నెట్ వర్క్ ల వాళ్లు మేలు పొందుతారు. అంతే కాదు, ఎప్పుడైతే డేటా రేట్స్ పడిపోతాయో జనం ఇంటర్నెట్ వాడకం పెంచేస్తారు. వాట్సప్, ఫేస్బుక్ లాంటివి వాడుకోవటం కాకుండా రకరకాల ఇతర వెబ్ సైట్స్ కూడా బ్రౌజ్ చేయగలరు. విద్యార్థులు మొదలు సీనియర్ సిటీజన్స్ వరకూ అందరూ జియో రాకతో లాభపడతారు. తమ చేతి వేళ్ల అంచుల్లో ప్రపంచాన్ని ఒడిసి పట్టుకోగలుగుతారు! మోదీ ఆశిస్తోన్న డిజిటల్ ఇండియా ఇదే! అన్ని రంగాల్లో, అందరూ డిజిటల్ టెక్నాలజీని వాడుకుని మరింత వేగంగా, సమర్థంగా దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి!  వ్యాపార దృష్టితోనే అయినా జియో... ఇండియన్ డిజిటల్ డ్రీమ్స్ కి ఎంతో కొంత సాయపడనుంది. అలాగే, కస్టమర్ కి కూడా చీప్ డేటా రేట్స్ అందుబాటులోకి వస్తాయి. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం!

ఆందోళన'రేపు'తున్న అంకెలు!

ఢిల్లీలోని మన్మోహన్ ప్రభుత్వం కూలిపోవటం, తరువాత మోదీ రావటం, అలాగే, అరవింద్ కేజ్రీవాల్ గద్దెనెక్కటం... ఇవన్నిటికంటే ముందు ఏం జరిగింది గుర్తుందా? ఢిల్లీని పట్టి కుదిపేసిన ఈ మధ్య కాలపు ఉద్యమాల్లో నిర్భయ ఉద్యమం ఒకటి! అసలు నిర్భయ రేప్ తరువాత దేశ రాజధాని పెనంపైన ఆమ్లేట్ లా ఊడికిపోయింది! మన్మోహన్, సోనియా మొదలు షీలా దీక్షత్ వరకూ అందరూ గడగడలాడిపోయారు. జనం రోడ్ల మీదకి వచ్చి రాత్రి, పగలు అన్న తేడా లేకుండా నిరసనలు తెలిపారు! ఆ చారిత్రక ఘట్టానికి ప్రతిఫలమే నిర్భయ చట్టం!. నిర్భయ చట్టం తెచ్చిన మన్మోహన్ ప్రభుత్వాన్ని , ఢి్ల్లీలోని షీలా దీక్షత్ సర్కార్ ని జనం 2014లో అస్సలు క్షమించలేదు. అందుకు అనేక కారణాలు వుండొచ్చు. కాని, స్త్రీలకు రక్షణ ఇవ్వలేకపోవటం కూడా వాటిలో ప్రధానమైంది! అయితే, మన్మోహన్ పోయి మోదీ వచ్చినా, షీలా దీక్షత్ పోయి కేజ్రీవాల్ వచ్చినా నిర్భయల పరిస్థితి ఏమైనా మారిందా? అస్సలు మారలేదు! నిర్భయ చట్టం వున్నా కూడా నిర్భయలంతా భయం భయంగానే బతకాల్సి వస్తోంది! తాజాగా వెల్లడైన అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటికీ దేశ రాజధాని ఢిల్లీయే రేపుల్లో టాప్! 2199కేసులతో సిటీలన్నిట్లో అదే అగ్రస్థానంలో వుంది. ఇక రాష్ట్రాల వారిగా చూస్తే మధ్యప్రదేశ్ 4391 కేసులతో మహిళలకి నరకప్రాయంగా వుంది! ఈ అంకెలు చూసి మధ్య ప్రదేశ్ , ఢిల్లీలు మాత్రమే డేంజర్ అనుకుంటే పొరపాటే! మహారాష్ట్రలో 4144, రాజస్థాన్ లో 3025 కేసులు... ఇలా వుంది లిస్ట్! అంటే... మహిళల భద్రత విషయంలో ఏ రాష్ట్రమూ పెద్ద సంతోషకరంగా ఏం లేదన్నమాట!  మొత్తం దేశం విషయానికి వస్తే 34600 కేసులు నమోదు అయ్యాయట! ఇవన్నీ స్త్రీల మీద జరిగిన రకరకాల దాడుల కారణంగా నమోదైనవే! అందులో మరీ దారుణం ఏంటంటే.... 33098 కేసుల్లో ఆడవార్ని వంచించింది వారికి తెలిసిన వారు, దగ్గరి వారేనట! ఇక్కడే అసలు సమస్యంతా వుంది! నిర్భయ కేసులో లాగా ఎవరో ఆగంతకులు దాడి చేస్తే అర్థం చేసుకోవచ్చు! కాని, ఇండియాలో చాలా రేపు కేసులు దగ్గరి వారి వల్లే అవుతుంటాయి. అందుకే, చాలా లైంగిక వేధింపు కేసులు పోలీస్ స్టేషన్ దాకా వెళ్లవు! ఢిల్లీలో, మధ్యప్రదేశ్ లో ఎక్కువగా నమోదు అయ్యాయి అంటే ఒక విధంగా దాన్ని మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవాలి కూడా! అక్కడ రేప్ జరిగిన తరువాత కేసు పెట్టేంత చైతన్యం మహిళల్లో వుందని గ్రహించాలి. మిగతా చోట్ల అంతకంటే ఎక్కువ కేసులే జరుగుతున్నప్పటికీ స్త్రీలు దైర్యం చేసే పరిస్థితులు లేకపోవచ్చు! దేశంలో అభివృద్ధి తారస్థాయిలో వున్న ఢిల్లీలోనూ , అత్యంత వెనుకబాటుతనం వున్న మారుమూల పల్లెళ్లలోనూ....  మహిళల పట్ల, అమ్మాయిల పట్ల అణిచివేత ఒకేలా వుందంటే మనం ఖచ్చితంగా ఆందోళనపడాల్సి వుంది! ఎందుకంటే, కేవలం ఆర్దిక స్వేచ్ఛ, చదువు లాంటివి కూడా ఆడవారికి భద్రత కల్పించలేకపోతున్నాయి. మొత్తంగా భారతీయుల ఆలోచన శైలిలో మార్పు రావాలి. మన సినిమాలు, రచనలు, టీవీ సీరియల్స్... ఇలా అన్నీ సరైన రీతిలో సంస్కరింపబడాలి.దానితో పాటే అత్యాచార కేసులు , మహిళలకు సంబంధించిన ఇతర కేసుల్లో కఠినమైన శిక్షలు త్వరితగతిన పడాలి అప్పుడే దేశంలో సగభాగమైన స్త్రీలకు రక్షణ వుండేది! లేదంటే... మనం మాట్లాడుకుంటోన్న అభివృద్ధి అంతా మేడిపండు ఛందంగానే వుంటుంది!

'నీటి'పాలైపోతోన్న స్త్రీలు, బాలికల జీవితాలు!

  నీటి కటకట... ఈ మాట వినగానే ఇప్పడు చెప్పబోయేదేదో... హైద్రాబాద్ బస్తీల్లో తాగు నీటి సమస్య గురించి అనుకోకండి! పోనీ, దేశంలోని తీవ్ర కరువు పరిస్థితుల  గురించి అనుకోకండి! మనం ఏకంగా ప్రపంచం గురించే మాట్లాడుకోబోతున్నాం! భూమ్మీద చాలా దేశాలు నీటి కటకటతో అల్లాడుతున్నాయి. అంతే కాదు, నీరు నేరుగా స్త్రీజాతి కన్నీరవుతోంది. అదే పెద్ద విషాదం...    నీరు చాలా ముఖ్యమైన అవసరం. నీళ్లు లేకపోతే ఏది వున్నా ఏం లాభం? అందుకే, మనిషి నీటి లభ్యత వున్న చోటే నాగరికతలు నిర్మించుకున్నాడు. కాని, నదులు, వాగుల పక్కకు బతికేయడం మొదలు ఇవాళ్ల చంద్రుడిపై నీరుందని కనుక్కునే దాకా ఎంతో ఎదిగాడు. అయినా నీటి విషయంలో మనిషి ప్రయాణం ఒకడుగు ముందుకి, రెండడుగులు వెనక్కి అన్నట్టే సాగుతోంది!   ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో నీటి కోసం నానా తంటాలు పడుతుంటారు జనం. ఇంతటి కంప్యూటర్లు, రాకెట్ల కాలంలో కూడా గుక్కెడు మంచి నీటి కోసం కిలో మీటర్లు పోవాల్సిన అభాగ్యులు చాలా మందే వున్నారు. అలాంటి దుర్భర పరిస్థితులున్న చోట్లలో మరో విషాదం కూడా దాగి వుంది. ఎక్కడైతే నీటి లభ్యత కష్టంగా వుంటుందో అక్కడ నీళ్లు తెచ్చే పని చాలా వరకూ మహిళలు, బాలికలపైనే పడుతుంటుంది. ఇది పైకి మామూలు విషయంలా కనిపించినా ఆందోళనకరమైన అంశాన్ని సూచిస్తుంది.   యూనిసెఫ్ సంస్థ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా దేశదేశాల్లో మహిళలు, బాలికలు రోజుకి ఎంత సేపు నీటి సేకరణ కోసం ఖర్చు చేస్తున్నారో తెలుసా? అందరూ కలిపి రోజుకి 200మిలియన్ల గంటలు వ్యయం చేస్తున్నారట! అంటే... 22,800 సంవత్సరాలు! ఇలా ప్రతీ రోజూ అంత సమయం ప్రపంచ వ్యాప్తంగా మహిళలు, బాలికలు వెచ్చిస్తూనే వుండాల్సి వస్తోంది...    మనిషి భూమ్మీది కొన్ని ప్రాంతాల్లో, కొన్ని కోణాల్లో ఎంతగా అభివృద్ధి చెందినా అత్యధిక భాగం మాత్రం వెనుకబడే వుండిపోతున్నాడు. అందుకు, ఎన్నో దేశాల్లోని స్త్త్రీలు, బాలికలు కనీస నీటి కోసం తమ విలువైన సమయాన్ని ఇలా వెచ్చించటమే చక్కటి ఉదాహరణ. మామూలుగా అయితే, నీటి కోసం తమ అమూల్యమైన జీవితాల్ని నీటి పాలు చేసుకుంటున్న ఈ మహిళలు, బాలికలు ఎంతో అభివృద్ధికి దోహదపడాల్సిన వారు! కాని, వారి శక్తి, యుక్తి అంతా నీటి కోసం... నీటి పాలైపోతూనే వుంది!   2050 కల్లా వెయ్యి కోట్ల జనాభా భూమిపై వుంటుందని అంచనాలున్నాయి. ఇక అప్పుడు ఈ నీటి కటకట ఎంతగా వుంటుందో, మహిళలు, బాలికలు ఇంకెంతగా తమ కాలాన్ని నీటి కోసం ఖర్చు చేయాల్సి వుంటుందో మనం ఊహించుకోవచ్చు. అందుకే, ఇప్పటి నుంచే అన్నీ దేశాలు నీటి ఆదా, నీటి సరఫరాపై దృష్టి పెట్టాలి... 

1000కోట్లు... డబ్బు కాదు, జనం!

దేశమంటే మట్టి కాదోయ్... దేశం అంటే మనుషులోయ్! ఇది తెలుగు వారికి బాగానే తెలుసు. కాని, దేశమే కాదు... ప్రపంచమూ మట్టి కాదు. ప్రపంచం అంటే కూడా మనుషులే! ఈ విషయం 2050నాటికల్లా మరింత సుస్పష్టంగా తెలిసిపోనుంది. ఎందుకంటే, అప్పటికి మానవ జాతి చరిత్రలో మనిషి ఏనాడూ చేరుకోని స్థాయికి చేరుకుంటాడు! సంఖ్యా పరంగా భూమండలానికే అతి పెద్ద భారంగా మారిపోతాడు!. పాప్యులేషన్ రెఫరెన్స్ బ్యూరో అనే సంస్థ మానవ జనాభాకు సంబంధించి తన అంచనాలు ప్రకటించింది. ఈ సంస్థ చాలా దశాబ్దాలుగా వాల్డ్ పాప్యుషన్ గురించి ఆసక్తికర అంశాలు వెల్లడిస్తూ వస్తోంది. అలాగే, ఈసారి వినగానే షాకయ్యే గణాంకాలు బయటపెట్టింది! ఇప్పటికే ప్రపంచ జనాభ విపరీతంగా పెరిగిపోయింది. ఆ పలితంగానే వుండేందుకు భూమి, తాగేందుకు నీరు, తినేందుకు ఆహారం దొరక్క సతమతమైపోతున్నాం. అయితే, ఆందోళనకరంగా మన జనాభా ముందు ముందు ఇంకా పెరుగుతుందట!  2050నాటికి 980కోట్ల సంఖ్యకి చేరతాడట మనిషి!ఆ తరువాత కేవలం మూడు ఏళ్ల వ్యవధిలో, అంటే, 2053సంవత్సరానికి కల్లా వెయ్యి కోట్లకు మానవ జనాబా పెరిగిపోతుందట! ఇంత భారం భూమాతపై వేయటం నిజంగా ఆందోళనపడాల్సిన విషయమే! అంతే కాదు, ప్రపంచ జనాభా వృద్ధి అంతటా ఒక్కలా లేదు. ఇది మరో ప్రమాదకర సంకేతం... ప్రపంచం మొత్తం జనాభా పెరుగుతూ వుంటే ఒక్క యూరప్ ఖండంలో మాత్రం తగ్గుముఖం పడుతోంది! అక్కడ ఇప్పుడు 74కో్ట్లుగా వున్న జనం 2050నాటికి 72.8కోట్లకు తగ్గిపోతారట! కాని, మిగతా ప్రపంచం మొత్తం జనాభా పెరుగుతూనే పోతోంది. అమెరికాలు, ఆస్ట్రేలియా లాంటి ప్రాంతాల్ని మినహాయిస్తే ఆసియా, ఆఫ్రీకాల్లో మాత్రం 2053నాటికి పరిస్థితి తీవ్రంగా వుంటుంది!. భారత్, చైనా లాంటి పెద్ద దేశాలున్న అతి పెద్ద ఖండమైన ఆసియాలో జనాభా పెరుగుదల ఆశ్చర్యమేం కాదు. కాని, అత్యంత వెనుకబడిన ఆఫ్రీకాలో కూడా జనాభా అతి వేగంగా పెరిగిపోతోంది. 2053లో చాలా ఎక్కువ జనం వుండేది ఆఫ్రికాలోనే! అక్కడ సగటున ఒక్కో మహిళకు ఆరేడేగురు పిల్లలుంటారని అంచనా! ప్రపంచ జనాభా ఇబ్బడి ముబ్బడిగా పెరిగితే వచ్చే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. సహజ వనరులు చాలక పేదల జీవితాలు నరక ప్రాయం అవుతాయి. అంతే కాదు, జపాన్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు విపరీతంగా ముసలివారితో, ఖతార్ లాంటి దేశాలు విపరీతంగా పిల్లలతో నిండిపోయే ప్రమాదం వుంది. జననాల్లో వృద్ధి, మరణాల్లో తగ్గుదల ఇందుకు కారణం.  ప్రపంచ దేశాలు అన్నీ కలిసి జనాభా పెరుగుదల  మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా వుంది. కొన్ని సామాజిక వర్గాలు, మతాలు, ప్రాంతాలు ఎక్కువ జనాభా వృద్ధికి ఎందుకు కారణం అవుతున్నాయో విశ్లేషించాల్సిన అవసరం వుంది. అప్పుడే భూమికి భారం తగ్గి భూమాత ఊపిరి పీల్చుకుంటుంది! లేదంటే... దీర్ఘ కాలంలో ప్రళయాన్ని మనకు మనం ఆహ్వానించినట్టే!

పాకిస్తాన్ కి కాశ్మీర్ వాత.... బలూచిస్తాన్ కర్రుతో!

ఇండియాకి,పాకిస్తాన్ కి రెండు దేశాలకి కాశ్మీర్ పెద్ద సమస్యే! కాని, ఇండియాకి అనేక పెద్ద సమస్యల్లో కాశ్మీర్ ఒకటి! పాకిస్తాన్ కి అలా కాదు... కాశ్మీర్ సమస్య లేకుంటే ఆ దేశ భవిష్యత్తే గందరగోళంలో పడుతుంది! ఎందుకంటే, కాశ్మీర్ అనే బూచి చూపించి ఇండియాతో శత్రుత్వాన్ని సమర్థించుకుంటారు ఇస్లామ్ బాద్ పాలకులు. అదే సాకుతో పాక్ మిలటరీ కూడా జనాన్ని రెచ్చగొట్టి తన పట్టు నిలుపుకుంటుంది! ఒకవేళ రెండు దేశాల మధ్య కాశ్మీర్ సమస్యే లేకపోతే? అప్పడు అక్కడి పాలకులకి , మిలటరీకి, ఉగ్రవాదులకి అందరికీ సమస్యే! అందుకే, కాశ్మీర్ ని రాజేస్తూ వుంటారు పక్క దేశపు ముష్కరులు...  ఇండియా, పాక్ విడిపడినప్పటి నుంచీ జమ్మూ కాశ్మీర్ పై ఎలాగోలా పట్టు కోసం ప్రయత్నిస్తోన్న పాకిస్తాన్ పదే పదే భంగపడుతూ వచ్చింది. యూడు యుద్దాల్లో కన్ను లొట్ట పోయి బయటపడింది. అయినా సరే తన తోక వంకరని సరి చేసుకోలేకపోతోంది. ఇప్పటికిప్పుడు ప్రత్యక్ష యుద్ధం వస్తే సరిగ్గా నాలుగు రోజులు కూడా పోరాడలేని ఆర్ధిక స్థితి ఆ దేశానిది! అయినా కాశ్మీర్ ను అడ్డం పెట్టుకుని అంతర్జాతీయంగా రభస చేస్తుంటుంది. పైగా దొంగ చాటు యుద్ధం బాగా అలవాటైపోయింది పాకిస్తానీ పాలకులు, ఐఎస్ఐ దొంగలకి! అందుకు తాజా ఉదాహరణ రెండు నెలలుగా కాశ్మీర్ అట్టుడికిపోవటమే.  ఎవరో ఒక ఉగ్రవాది బుర్హాన్ వని ఎన్ కౌంటర్లో చచ్చిపోతే వేలాదిగా యువత రోడ్లపైకి వచ్చి రాళ్లు రువ్వింది. అంతే కాదు, ఎంత మంది ఆర్మీ కాల్పుల్లో నేలకూలినా ఆందోళనకారులు వెనక్కి తగ్గటం లేదు. ఇదంతా ఎందుకు? ఒక ఉగ్రవాది కోసం! ఇందులోనే అసలు కిటుకు వుంది. ఆందోళనకారులుగా చెలరేగిపోతున్న వారి వెనుక ఖచ్చితంగా పాక్ హస్తం వుంది. అది అందిస్తున్న డబ్బులతోనే ఈ కృత్రిమ పోరాటం నడుస్తోంది. అదే మోదీ అన్నారు స్వాతంత్ర్య దినోత్సవ ఉపన్యాసంలో! మోదీ కేవలం పాక్ ని కాశ్మీర్ విషయంలో తప్పు పట్టడమే కాకుండా బలూచిస్తాన్ విషయంలో ఉతికి ఆరేశారు. కాశ్మీర్ గురించి పాక్ మాట్లాడటం మానకపోతే తాము బలూచిస్తాన్ గురించి మాట్లాడతామని అగ్గి రాజేశారు. అప్పట్నుంచీ ఇస్లామాబాద్ లోని నవాజ్ షరీఫ్ కుర్చీ కింద సెగ రాజుకుంది! పాక్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది! బలూచిస్తాన్ లో పాక్ జెండాలు ఉద్యమకారులు కాళ్ల కింద. ఇండియా జెండాలు గాల్లో ఎగురుతూ కనిపిస్తున్నాయి! మోదీ ఫోటోలు అక్కడి స్వాతంత్ర్య పోరాట మోధుల చేతుల్లో ప్రత్యక్షమయ్యాయి! జర్మనీ లాంటి దేశాల్లోని ప్రవాస బలూచీ ప్రజలు ఇండియా జెండాలతో నిరసనలు తెలుపుతున్నారు! ఇదంతా పాక్ కి జ్వరం తెప్పిస్తోంది! మోదీ, తన చాణక్యుడు అజిత్ ధోవల్ తో కలిసి గట్టిగా ప్లాన్ చేస్తే పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ విడిపోవటం అసాద్యమేం కాదు. ఇంతకు ముందు ఇండియా వల్లే బంగ్లాదేశ్ ను వదులుకోవాల్సి వచ్చింది పాక్. ఇప్పుడు మళ్లీ చరిత్ర పునరావృతం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాని, బలూచిస్తాన్ విముక్తి అంత ఈజీ విషయం కూడా కాదు. కాని, పాక్ ను కాశ్మీర్ విషయంలో కట్టడి చేయటం కోసం బలూచిస్తాన్ కు సాయం చేయటం తప్పు కూడా కాదు! అసలు ఇంత కాలమే గత ప్రభుత్వాలు ఆ సాహసోపేతమైన వ్యూహం అమలు చేయాల్సింది!  బలూచిస్తాన్ కు మోదీ మద్దతు చెవిలో పడ్డప్పటి నుంచీ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ వణికిపోతున్నాడు. తన చీఫ్ అడ్వైజర్ సర్ తాజ్ అజీజ్ ను పంపి కాశ్మీర్ విషయంలో తమకు హెల్ప్ చేయమని యూఎస్, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యాల్ని అడిగించాడు. కాని, ఎక్కడా ఇండియాకి వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ కూడా తెచ్చుకోలేకపోయారు! చైనా కూడా పాకిస్తాన్ ఆశించిన విధంగా స్పందిచలేదు! మోదీ దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ ని అమెరికా, జపాన్, వియత్నాంతో కలిసి ఒంటరిని చేయటమే ఇందుకు కారణం! చేసేదేమి లేక ప్రగల్భాలకు దిగుతోంది పాకిస్తాన్. నవాజ్ షరిఫ్ తాను 22 మంది ఎంపీల్ని ఎన్నిక చేశాననీ, వాళ్లు అంతర్జాతీయ వేదికల్లో రెగ్యులర్ గా కాశ్మీర్ అంశం లేవనెత్తుతారనీ అన్నాడు. ఈ తాజా నిర్ణయంతో పాకిస్తాన్ అభద్రత మరింత స్పష్టమైంది! ఇస్లామ్ బాద్ నుంచి వచ్చిన చర్చల ఆఫర్ ని ఇండియా నిర్ద్వంద్వంగా తోసి పుచ్చింది. ముందు కాశ్మీర్లో హింస రాజేయకుండా వుంటే అప్పుడు చూద్దామంది!  మోదీ అధికారంలోకి వచ్చాక సెగ తగులుతున్న వారిలో కాంగ్రెస్ నేతలు, వారి అనుచర మేధావులు, ఎన్జీవుల యజమానులు ముందు వరసలో వుంటారు! ఇక దేశానికి ఆవల మోదీ హీట్ పక్కగా తగులుతున్న వ్యక్తులు పాకిస్తాన్, చైనా ప్రధాని, ప్రెసిడెంట్లు! 

కాషాయానికి... కషాయం తాగించిన పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ సభ... రెండు రోజులుగా మీడియాలో నానా హడావుడికి కారణమైన ఈ అంశం ఎట్టకేలకు ముగిసింది! ఇంతకీ పవన్ సభ ఏమైనట్టు? ఖచ్చితంగా టీకప్పులో తుఫాన్ అయితే కాదు! నిజమైన తుఫానే! ఎవరికి తుఫాను అంటే మాత్రం బీజేపికి, మోదీకి అనే చెప్పాలి! గంట సేపు అనర్గళంగా మాట్లాడిన పవన్ చనిపోయిన తన అభిమాని వినోద్ రాయల్ గురించి ఓ సారి అలా ప్రస్తావించినా మెయిన్ టార్గెట్ మాత్రం ప్రత్యేక హోదాగానే పెట్టుకున్నాడు. అది ఇవ్వని కేంద్ర ప్రభుత్వాన్నే సీరియస్ గా టార్గెట్ చేశాడు. తెలుగు దేశాన్ని, టీడీపీ ఎంపీల్ని, కేంద్ర మంత్రుల్ని ఆయన అక్కడక్కడా విమర్శించినా ఘాటు మాత్రం కమలదళానికే ఎక్కువగా తగిలింది.  మోదీ అంటే తనకు అభిమానం అని చెబుతూనే పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా మాత్రం కావాల్సిందేనన్నాడు. అందుకోసం సుదీర్ఘ ప్రణాళికనే ప్రకటించాడు కూడా. బీజేపీనే మరీ మరీ టార్గెట్ చేసిన పవర్ స్టార్ నెక్ట్స్ సభ కాకినాడలో వుంటుందని తేల్చాడు. ఎందుకంటే, అక్కడే బీజేపి ఒక ఓటు రెండు రాష్ట్రాలని తీర్మానం చేసిందన్నాడు. కాషాయ దళాన్ని ఓ రేంజ్లో ఆటాడిన పవన్ కళ్యాణ్ మోదీనే కాక వెంకయ్యనాయుడ్ని కూడా ఒక దశలో బాగా టార్గెట్ చేశాడు. కాంగ్రెస్ లాగే బీజేపి కూడా ప్రవర్తిస్తుందని ధ్వజమెత్తాడు.  విమర్శలు చేస్తూనే తన భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించాడు జనసేన అధినేత. మూడు దశల్లో ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తానని అన్నాడు. సభలతో మొదలు పెట్టి రోడ్లపై ధర్నాలు , రాస్తారోకోల వరకూ అన్నీ చేస్తామని చెప్పాడు. దీని ద్వారా 2019వరకూ తాను ప్రజల్లోనే వుంటానని స్పష్టమైన సంకేతం ఇచ్చాడు. తాను 75కిలోలు కూడా వుండనని చెప్పుకొచ్చిన పవన్ తన బలం అభిమానులే అన్నాడు. తన కూతురు క్రిస్టియన్ అంటూ కూడా చెప్పిన కళ్యాణ్ అక్కడక్కడా కొన్ని డైలాగ్స్ తో బాగానే ఆకట్టుకున్నాడు. కాకపోతే, చాలా వరకూ స్పీచ్ సీరియస్ గా నడిచిందనే చెప్పుకోవాలి. చివర్లో ఇంగ్లీష్, హిందీల్లో కూడా దంచి కొట్టాడు పవర్ స్టార్.  పవన్ కళ్యాణ్ అనూహ్యంగా ఏర్పాటు చేసిన సభ అంతే అనూహ్యంగా బీజేపి వైపు గురి పెట్టబడింది! తెలుగు దేశాన్ని తగినంత విమర్శిచలేదనే వాళ్లు ఎలాగూ వుండనే వున్నారు. కాకపోతే, విమర్శకుల మాటలెలా వున్నా పవన్ మాత్రం ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వాన్ని సహజంగానే టార్గెట్ చేశాడు. ఇక జనసేనాని దాడికి ఢిల్లీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి... 

పవన్ కళ్యాణ్ సభ ఇందుకేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.... ఈ పేరు చెబితే సినిమా ఇండస్ట్రీకి పులకరింత వస్తుంది! కాని, ఇప్పుడు రాజకీయ రంగం కూడా పలవరింత చేస్తోంది పవన్ పేరు చెబుతూ! అందుక్కారణం తిరుపతి సభ!   పవన్ చనిపోయిన తన అభిమాని వినోద్ రాయల్ కుటుంబాన్ని పరామర్శించటానికి తిరుపతి వెళ్లారు. కాని, అక్కడే మూడు రోజులుగా వుంటూ ఇవాళ్ల బహిరంగ సభ అంటున్నారు! అది కూడా ఎనిమిదేళ్ల కింద సేమ్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తొలి సభ పెట్టిన రోజునే! ఏంటి దీని వెనుక ఆంతర్యం? ఇప్పడు తెలుగు నేలపైన అందరి మదిలో ఇదే ప్రశ్న!    పవన్ హఠాత్తుగా సభ పెట్టటానికి కారణం ఏంటి? ఎప్పుడో 2019 సంవత్సరానికి ముందు యాక్టివ్ పాలిటిక్స్ లోకి వస్తాడని అంతా అనుకుంటే ఇప్పుడే, ఈ సభతోనే జనం మధ్యలోకి జనసేనాని దూకేస్తారా? కమిటైన సినిమాలు అసలు చేస్తారా? చేయరా?  కేవలం వినోద్ రాయల్ అనే అభిమాని హత్యకి గురైనందుకు ఇంత పెద్ద సభ అక్కర్లేదని విశ్లేషకులు అంటున్నారు. ప్రెస్ మీట్ పెట్టినా సరిపోయేది. కాని, పవన్ తన కోసం ఫ్యాన్స్ పడుతున్న ఆరాటం చూసి బాగానే చలించిపోయినట్టు వున్నారు. అందుకే, ఈ సభ పెట్టాలనే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇంత హఠాత్తుగా సభ పెట్టాలని మరే ఇతర రాజకీయ నాయకుడు అనుకున్నా కష్టమే అయ్యేది. కాని, పవన్ ఫాలోయింగ్ కారణంగా జనం సమకూరటం పెద్ద ఇబ్బందేం కాదు. అయితే, అసలు ప్రశ్న వచ్చిన  ఫ్యాన్స్ కి పవన్ ఏం చెబుతాడు?    అభిమానులు మిగతా హీరోల ఫ్యాన్స్ తో సఖ్యంగా వుండాలి, హీరోల మధ్య ఎలాంటి గొడవలు వుండవు, మేమంతా ఒక్కటే లాంటి మాటలు ఎలాగూ వుంటాయి. కాని, ప్రత్యేక హోదా కోసం నానా రభస జరుగుతున్న తరుణంలో ఈ సభలో పవన్ దాని గురించి ఖచ్చితంగా ఏదోఒకటి మాట్లాడే ఛాన్స్ వుంది. అలాగే, ఇక మీద తాను ఫుల్ టైం ప్రశ్నించే పనిలో వుంటానని ఆయన అంటే మాత్రం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు సమూలంగా మారే అవకాశం వుంది. పవన్ పని కట్టుకుని పూర్తిగా రాజకీయాల మీద కాన్సన్ ట్రేట్ చేస్తే అధికార తెలుగు దేశంకు కొంచెం కష్టమే.   ఇంతకాలం జగన్ ప్రతిపక్ష నేతగా పెద్దగా టీడీపిని ఇబ్బంది పెట్టిందేం లేదు. అలాగే, పవన్ ప్రతిపక్ష పాత్ర పోషించటం మొదలుపెడితే వైసీపీ అధినేత జగన్ కు కష్టకాలమనే చెప్పాలి. ఆయనకున్న ప్రతిపక్ష నేత హోదా కూడా అనుమానంలో పడుతుంది. ఆయన వద్ద అతి కష్టంగా కాలం గడుపుతున్న నేతలంతా జనసేన కొత్త ఆఫీసుకి బయలుదేరే ఛాన్స్ లేకపోలేదు!   ఇక ఢిల్లీలో అధికారంలో వుండి ప్రత్యేక హోదా పై ఫుల్ డ్రామా నడుపుతున్న బీజేపికి కూడా పవన్ ఎంట్రీ ఇబ్బంది కలిగించే అవకాశాలే ఎక్కువ! పవన్ ప్రత్యేక హోదా అంటూ జనంలోకి వెళితే అది ఇవ్వక తప్పని అనివార్య స్థితిలోకి మోదీ ప్రభుత్వం వెళుతుంది. అప్పుడేం చేస్తారో చూడాలి!   బీజేపి, టీడీపీ, వైసీపీ... ఇలా అన్ని ప్రధాన పార్టీలకి పెద్ద కొశన్ మార్క్ గా మారిపోయిన పవన్ బహిరంగ సభ .... ముగిస్తే గాని పవర్ స్టార మనసులో ఏముందో తెలియదు! కాకపోతే, ఈ సభతో పుష్కరాల హడావిడి ముగిసి రాజకీయ పుష్కరాల హంగామా మొదలవుతుంది! కృష్ణలో గురువు ప్రవేశించినట్టు... ఆంద్ర రాజకీయ కృష్ణా నదిలో పవన్ ప్రవేశిస్తాడేమో!

కాశ్మీర్ లో కాశ్మోరా పిశాచాలు!

భారతదేశం ఎదుర్కొంటోన్న తీవ్రమైన సమస్యల్లో కాశ్మీర్ వేర్పాటు వాదం ఒకటి. కాశ్మీర్ కి బయట వున్న మనమంతా కేవలం పాకిస్తాన్ నే శత్రువుగా చూస్తాం. వాళ్లు మన ఆర్మీపై కాల్పులు జరిపితే ఆవేశపడతాం. లేదంటే ఏ క్రికెట్ మ్యాచ్ టైంలోనో దేశభక్తితో రగిలిపోతాం. కాని, కాశ్మీర్ సమస్యకు మరో కోణం వుంది! అదే ఇంటి దొంగల కోణం...         దాదాపు 50 రోజుల కింద భారత్ ఆర్మీ ఒక ఉగ్రవాదిని కాశ్మీర్ లో హతం చేసింది. ఎన్ కౌంటర్లో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వని అంతమయ్యాడు. ఇక అక్కడ్నుంచీ కాశ్మీర్ కాలిపోతూ వస్తోంది. వందలు, వేల సంఖ్యలో నిరసనకారులు రోడ్లపై వచ్చి ఆర్మీపై రాళ్లు రువ్వటం, పోలీస్ స్టేషన్లపై దాడి చేయటం రొటీన్ అయిపోయింది. ఆత్మ రక్షణ కోసం ఆర్మీ, పోలీసులు కూడా పెల్లెట్ గన్నుల్లాంటివి ఉపయోగించటంతో చాలా మంది గాయపడ్డారు. కొన్ని మీడియా సంస్థల లెక్కల ప్రకారం పది వేల మంది గాయాల పాలయ్యారు! 70మంది వరకూ చనిపోయారు... ఒక ఉగ్రవాదిని హతం చేస్తే ఇంత నిరసనలు ఎందుకు? ఈ ప్రశ్నకి సమాధానంగానే కాశ్మీర్ లోని ఇంటి దొంగలు బయటపడతారు! వాళ్లకు సాయం చేస్తున్న సో కాల్డ్ లిబరల్స్ కూడా కలుగుల్లోంచి బయటకొస్తారు!       కేంద్రంలో బీజేపి  వున్నా, కాంగ్రెస్ వున్నా కాశ్మీర్ ని కాశ్మోరా పిశాచాల్లా పీక్కుతినే కొన్ని వర్గాలు జమ్మూ, కాశ్మీర్లోనే తిష్ట వేశాయి. వాళ్లని టోకుగా చెప్పుకుంటే వేర్పాటు వాదులు అనొచ్చు. హురియత్ పేరుతో స్థానిక అమాయక, ఆవేశపూరిత యువతని కాశ్మీరియత్ రొంపిలోకి దించుతున్నారు. కాశ్మీరియత్ అంటూ పిచ్చి పిచ్చి సిద్ధాంతాలు చెబుతూ వేర్పాటు వాదం పెంచి పోషిస్తున్నారు. మామూలు టైంలో తిండి, గుడ్డ, గూడు అన్నీ భారత ప్రభుత్వం ఇచ్చే డబ్బులతోనే నడుస్తాయి జమ్మూ, కాశ్మీర్ ప్రజలకి. ఇక వరదలు, భూకంపాలు వచ్చినప్పుడు అయితే నూటా ఇరవై కోట్ల మంది భారతీయులు కట్టిన ట్యాక్స్ లతోనే కాశ్మీర్లో సహయక చర్యలు సాగుతాయి. అలాంటి అవసరమైన సందర్బంలో ఈ వేర్పాటువాదులు సిగ్గు లేకుండా ఇండియన్ ఆర్మీ సహకారం పొందుతారు. తరువాత మాత్రం అదును చూసి ఉగ్రవాదులకి, పాకిస్తాన్ కి మేలు జరిగేలా యూత్ ను రెచ్చగొడుతుంటారు!       వేర్పాటు వాదుల దుర్మార్గం ఒకవైపు అయితే అభ్యుదయవాదులుగా చెలామణి అయ్యే మేధావులు, మీడియా వాళ్ల గోల మరోవైపు. వీళ్లు పైకి వేర్పాటు వాదం సమర్థించినట్టు కనిపించకున్నా లోలోపల వాళ్లతో కలిసి మెలిసి తిరుగుతుంటారు! కొందరు సీనియర్ ఇంగ్లీష్, హిందీ మీడియా జర్నలిస్టులైతే ఏకంగా ఈ వేర్పాటువాదులతో పార్టీలు చేసుకునే దాకా వెళ్లిపోయారు! ఉదాహరణకి బర్కా దత్ అనే ఎన్డీటీవీ సీనియర్ ఎడిటర్ చనిపోయిన ఉగ్రవాది బుర్హాన్ వని ఓ హెడ్మాస్టార్ కొడుకని కథనం ప్రసారం చేసింది. అసలు యాకుబ్ మెమన్ , కసబ్ మొదలు బుర్హాన్ వని దాకా ఉగ్రవాదులందరి మీదా కొన్ని మీడియా సంస్థలకి ఎందుకంత ప్రేమ, గౌరవం అన్నది ఎవ్వరికీ అంతుపట్టని ప్రశ్న!       జమ్మూ, కాశ్మీర్లోని గొడవలకి మన దేశంలోనే అడ్డు అదుపు లేకుండా కథనాలు ప్రసారం చేసే కొంత శాతం మీడియా కారణమన్నది అనుమానమక్కర్లేని విషయం. ఇక వేర్పాటు వాదులు, మీడియా పైత్యమే కాక ప్రతి పక్షం లో వుండే రాజకీయ నేతల స్వార్థం మరోవైపు. ఎవరు అపోజిషన్లో వున్నా ప్రజల తరుపున మాట్లాడుతున్నట్టు నటిస్తూ వేర్పాటు వాదుల్ని బలపరుస్తారు. ఇప్పుడు పీడీపీ ప్రభుత్వం అధికారంలో వుంది కాబట్టి జమ్మూ కాశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ నిన్న తీవ్రంగా మాట్లాడారు. పోలీసుల దాడిలో గాయపడ్డవారెవరు చాక్లెట్లు కొనుక్కోటానికి బయటకొచ్చిన చిన్న పిల్లలు కాదనీ, పాలప్యాకెట్ తెచ్చుకోటానికి వచ్చిన సామాన్యులు కాదని అన్నారు! వాళ్లు పోలీసులు, ఆర్మీపై దాడి చేసేందుకే కర్ఫ్యూను ధిక్కరించి రోడ్లపై వచ్చిన అల్లరి మూకలన్నారు!        ఇదే మెహబూబా తాను ప్రతి పక్షంలో వున్నప్పుడు మాత్రం నిరసనకారుల్ని ఎక్కడలేని విధంగా వెనకేసుకు వచ్చేది. వాళ్ల మీద ఈగ వాలనిచ్చేది కాదు. ఈ ద్వంద్వ ప్రమాణాలే కాశ్మీర్ దొంగలకి లాభసాటిగా మారిపోతున్నాయి. వాళ్లిప్పుడు అమాయక జనాన్ని కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ సాయంతో రెచ్చగొడుతున్నారు.       కాశ్మీర్లో ఇంత ఘారం జరుగుతున్నా భారత్ సంతోషించాల్సిన విషయం ఒక్కటే. ఆ రాష్ట్ర సీఎం చెప్పినట్టు ఈ అల్లర్లు మొత్తం ఓ అయిదు శాతం అరాచకుల పనే! మిగతా 95శాతం ఇండియాకి విదేయంగా వుండేవారు. కాబట్టి మోదీ ప్రభుత్వం అటు పాకిస్తాన్ ని పీఓకే విషయంలో, బలూచిస్తాన్ విషయంలో అంతర్జాతీయంగా కార్నర్ చేస్తూ .... ఇటు ఈ అయిదు ఇంటి దొంగల ఆటకట్టించాలి. లేదంటే పరిస్థితులు చేదాటిపోయే ప్రమాదం లేకపోలేదు..

అభిమానులు కాదు... అభిమన్యులు!

  సినిమా.... రెండున్నర గంటల సేపు నడిచే వేలాది రంగుల మాయ! అందుకే, లక్షలాది మంది, కోట్లాది మంది సినీమాయకు బానిసలైపోతుంటారు! అబద్ధం అయినా సరే వెండితెర మీద కనిపిచేదంతా నిజమని భ్రమించి మళ్లీ మళ్లీ థియేటర్లవైపు పరుగులు తీస్తుంటారు!   సినిమాని ఊరికే ప్రేక్షకుడిగా చూడటం తప్పు కాదు. కాని, ఒక హీరోకు అభిమాని కావటం చాలా ప్రమాదకరం. ఆ అభిమానం ఏ మాత్రం ముదిరిపోయినా సదరు అభిమాని అభిమన్యుడైపోతాడు! హీరోగారి పిచ్చిలో పడి... తనకు తానే ఓ పద్మవ్యూహం సృష్టించుకుని అందులోనే మరణిస్తాడు! ఇంకా గట్టిగా చెప్పాలంటే సాలెపురుగు కట్టిన దారాల గూటిలోకి వెళ్లిన తరువాత ఏ పురుగూ తిరిగి రాదు. కరడుగట్టిన పిచ్చాభిమానులూ అంతే! తమ అభిమానానికి తామే బలైపోతారు!   ఈ మధ్య జరిగిన పవన్ కళ్యాణ్ , జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గొడవ అందరికీ తెలిసిందేగా! తిరుపతికి చెందిన వినోద్ రాయల్ పవన్ అభిమాని. అందుకే, కర్ణాటకలోని కోలార్ దాకా వెళ్లి అవయవ దాన కార్యక్రమంలో పాల్గొన్నాడు! ఇది నిజంగా సంతోషించాల్సిన విషయం. ఇదే కాదు, చాలా హీరోల ఫ్యాన్స్ తమ హీరోలు చెప్పినా , చెప్పకపోయినా ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ వుంటారు. మరీ ముఖ్యంగా మెగాస్టార్ అభిమానులు, యువరత్న బాలయ్య అభిమానులు ఎన్నో మంచి పనులు చేయటం మనం చూస్తూనే వుంటాం...    ఫ్యాన్స్ హీరో పై అభిమానంతో సమాజ సేవ చేయటం నాణానికి ఒక వైపు మాత్రమే. కాని,అసలు వికృత స్వరూపం మరొకటి వుంటుంది. అందరు అభిమానులు కాకపోయినా... అభిమన్యుల్లా హీరోల ఇమేజ్ సాలెగూటిలో ఇరుక్కుపోయిన కొందరు వీరాభిమానులు మాత్రం నానా రచ్చ చేస్తుంటారు. వీళ్లు ఎక్కడ వుంటే అక్కడ సర్వనాశనమే! కారణం... హీరోల అభిప్రాయాలతో సంబంధం లేకుండా వీళ్లు పెట్టుకునే పంచాయితీలే!   మీరు ఒక్కసారి ఏ ఫేస్బుక్ పేజీల్లోనో, లేదంటే బాగా పాప్యులర్ అయిన ఇంటర్నెట్ సినిమా వెబ్ సైట్స్ లోనో చూడండి.... అంతా తెలిసిపోతుంది! ఓ హీరోగారి ఫ్యాన్స్ మరో హీరోగారిని దుమ్మెత్తిపోస్తుంటారు కామెంట్స్ లో. అదీ సాధ్యమైనంత దరిద్రగొట్టు బూతులతో! వాట్ని సంస్కారం వున్న ఎవడు కనీసం రిపీట్ కూడా చేయలేడు. అంతే కాదు, ఈ ఉన్మాద ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హీరోల్ని, వాళ్ల ఇంట్లోని లేడీస్ ని, వాళ్ల కులాన్ని, వాళ్లతో నటించిన హీరోయిన్స్ ని ... ఇలా అందర్నీ దుర్భాషలాడతారు! నోటికి వచ్చిందల్లా వాగేస్తారు! అందుకు ప్రతిఫలంగా ఎదుటి హీరో అభిమానులు కూడా అమ్మ నా బూతులు తిడుతు అరాచకం మొదలుపెడతారు!   ఒకప్పుడు ఇంటర్నెట్ లాంటివి లేని సమయంలో హీరోల ఫ్యాన్స్ కాలేజీల్లో, వీధుల్లో, థియేటర్ల వద్ద కొట్టుకు చచ్చేవారు. ఇప్పడు ఇంటర్నెట్ కి మకాం మారింది. అయితే, కామెంట్స్ సెక్షన్లో మాటలతో సరిపెట్టుకున్నారా అంటే అదీ లేదు. హీరోగారి పై అభిమానానికి కుల పిచ్చి కూడా జోడించి సదరు అభిమాన ఉగ్రవాదులు నిజంగానే కొట్టుకునే దాకా వెళుతున్నారు. ఈ మధ్య చాలా సార్లు పవర్ స్టార్ ఫ్యాన్స్ కి, మరో హీరో ఫ్యాన్స్ కి గొడవ అని మనం బ్రేకింగ్ న్యూస్ లు చూస్తూనే వున్నాం. ఇందులో ఏ హీరో ఫ్యాన్స్ కూడా వెనుకబడటం లేదు. పవన్ కళ్యాన్ జనసేన పార్టీ ఒకటి వుండటం, అలాగే బాలయ్య, ఎన్టీఆర్ లకు టీడీపి పార్టీతో దగ్గరి సంబంధాలు వుండటంతో సెన్సేషనలైజ్ అవుతున్నాయి. కాని, గొడవలు దాదాపు అందరి హీరోల అభిమానుల మధ్య జరుగుతూనే వున్నాయి! చాలా సార్లు గాయాలతో పోయినా అప్పుడప్పుడూ ప్రాణాలు కూడా పోతున్నాయి. అందుకు, తాజాగా జరిగిన వినోద్ రాయ్ హత్యే ప్రత్యక్ష సాక్ష్యం. పవన్ అభిమాని అయిన వినోద్ ని ఎన్టీఆర్ అభిమానినని చెప్పుకునే వ్యక్తి చంపేశాడంటున్నారు. అసలు ఇలాంటి అభిమాని వున్నాడంటే తారక్ మాత్రం సంతోషిస్తాడా? ఏ హీరో కూడా తనకు హంతుకులు, గూండాలు అభిమానులు కావాలని కోరుకోడు. ఇంకా చెప్పుకుంటే, తనకు పిచ్చిపట్టిన మతిస్థిమితం లేని అభిమానులు కావాలని ఏ హీరో కోరుకోడు!   సైకలాజికల్ గా ఈ ఫ్యాన్స్ మెంటాలిటీ గమనిస్తే... ఒక్క విషయం తెలిసిపోతుంది. వీళ్లంతా తమ హీరోని అడ్డుపెట్టుకుని ఇగో సాటిస్ ఫై చేసుకుంటూ వుంటారు. తమ హీరో విజయాల్ని చూపిస్తూ తాము ఊరికే తిని తిరుగుతుంటారు. బాగా చదువుకున్న , పెద్ద ఉద్యోగాలు చేసే ఉన్మాద ఫ్యాన్స్ కూడా అక్కడక్కడా వుండొచ్చు. కాని, రోడ్లపై పడి కొట్లాటలకు రెడీ అవ్వటం చాలా వరకూ పని పాటా లేని వాళ్లే చేస్తుంటారు.    ఇక ఆంధ్ర ప్రాంతంలో ఈ హీరో వర్ షిప్ కి కులం పిచ్చి కూడా జోడుకావటం మరింత ప్రమాదకరంగా తయారవుతోంది. దీనికి అత్యంత సరైన పరిష్కారం... అభిమానపు పిచ్చి పట్టి అభిమన్యుల్లా తయారవుతున్న తమ పిల్లల్ని ఇంట్లో వాళ్లే ఓ కంట గమనిస్తూ ఎప్పటికప్పుడు మత్తు వదిలిస్తూ వుండాలి. మా వాడు ఫలానా హీరోకి డై హార్డ్ ఫ్యానండీ... అని తెలివి తక్కువగా కితాబులు ఇవ్వవద్దు!    భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న మన హీరోలు కూడా తమలో తమకు ఎలాంటి విభేదాలు లేవని ఫ్యాన్స్ కోసం కలిసి కనిపిస్తే బావుంటుంది. వాళ్లను కొట్టుకు చావొద్దని పిలుపునిస్తే ఇంకా బావుంటుంది. అసలు ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు కలిసి నటించినట్లు మల్టీ స్టారర్స్ చేస్తే ఇంకా ఇంకా బావుంటుంది! ఎందుకంటే, ఊరికే పైపై మాటలుగా అభిమానులు కొట్టుకోకండి అంటే పెద్దగా లాభం వుండదు. తమ మధ్య నిజంగా స్నేహం వుందని నిరూపించుకునేలా కలిసి నటిస్తే ఫ్యాన్స్ కూడా తమ అరాచకం పక్కన పెడతారు. లేదంటే అప్పటి వరకూ ఈ పవన్ కళ్యాణ్ వర్సెస్ జూ. ఎన్టీఆర్, చిరంజీవి వర్సెస్ బాలయ్య, మహేష్ బాబు వర్సెస్ ప్రభాస్ ఫ్యాన్స్ న్యూసెన్స్ కొనసాగుతూనే వుంటుంది!  

ఊళ్లో పెళ్లికి... కుల గజ్జి కుక్కల గోల!

  మనం తాగే కూల్ డ్రింక్ ఏ కులం వాడు బాటిల్ లో నింపాడు? మనకవసరం లేదు! దాహం తీరితే చాలు... మనం తినే బిర్యానీ ఏ కులం వాడు ప్యాక్ చేశాడు? మనకవసరం లేదు! కడుపు నిండితే చాలు... పూసర్ల వెంకట సింధు మెడల్ కొట్టింది! వెంటనే, కొందరు లంజాకొడుకులకి మాత్రం ఆమె కులం కావాలి! ఛీఛీ... ఇదేం బూతు పదాల దౌర్జన్యం అంటారా? అంతే మరి... దేనికైనా ఓ హద్దు వుంటుంది! ప్రతీ దానికి కులం కావాలి అంటే ఎలాంటి వాడికైనా ఒళ్లు మండిపోతుంది. ఈ మధ్యే సోషల్ మీడియాలో ఓ ఇమేజ్ చక్కర్లు కొట్టింది! వాడెవడికో తమ కులం వాళ్ల రక్తమే కావాలట! అదీ మూడేళ్ల పాపాయిని బతికించుకోటానికి. ఇంతకన్నా బలుపు ఫలానా అంగంలో ఎవడికైనా వుంటుందా?  ఇతర కులాల వాళ్ల రక్తం ఆ గాడిద కొడుక్కి వద్దట!   మీరనొచ్చు... ఆ ఫలాన కులం వారి రక్తమే కావాలని పెట్టిన పోస్టు ఒట్టి ఫేక్ పోస్టు మాత్రమే అని. అది నిజం కాకపోవచ్చు. కాని, అది రేపిన దుమారం ఎంతో అందరికీ తెలిసిందేగా? పైగా రక్తానికి కూడా కులం కంపుకొట్టించిన ఆ ట్విట్టర్ పోస్టుకి లైక్స్ కూడా వచ్చాయి. అలా లైక్ లు కొట్టిన వెధవల్ని ఏమనాలి? ఒకవేళ అదే పోస్టు నిజమై... ఆ పిచ్చి పిండంగాడు తన కులం వాళ్ల రక్తం దొరక్క... మూడేళ్ల పసి ప్రాణాన్ని బలిపెడితే? ఎవడు ఆ నష్టాన్ని పూరిస్తాడు? కాని, ఇంకా మన ఖర్మలు సంకనాకి పోక పోవటం వల్ల... ఆ పోస్ట్ నిజం కాదు, ఆ పసి పాపకు రక్తం అవసరం అన్నది కూడా నిజం కాదు! అదే మనమున్న ఈ కులాల కంపుగొట్టు సమాజంలో సంతోషకర విషయం... ఇప్పుడే కాదు గతంలోనూ కులాల్ని అడ్డుపెట్టుకుని పబ్బం గడుపుకోవాలని ప్లాన్ చేసిన దొంగ నా కొడుకులు చాలా మందే వున్నారు. ఇందుకు మంచి ఉదాహరణ, పవన్ కళ్యాణ్ , పరిటాల రవి గొడవ! అది నిజంగా జరిగిందనే దానికి ఒక్క సాక్ష్యమూ లేదు. కాని, ఇలానే కొందరు కుల గజ్జిగాళ్లు కళ్యాణ్, రవిల మధ్య గొడవ సృష్టించి, ఆయన పవర్ స్టార్ కి గుండుకొట్టించాడని వదంతలు పుట్టించి గులానందం తీర్చుకున్నారు. చివరకు, అది రెండు కులాల మధ్య యుద్ధంగా మారేదాకా పోయింది. సరే.... ఇక ఇప్పుడు ఫేక్ నుంచి రియల్ కే వద్దాం. పీవీ సింధు అక్కడ రియోలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ, గోవా నుంచి గౌహతి వరకూ వున్న ఇంత పెద్ద ఇండియా కోసం బ్యాడ్మింటన్ బ్యాట్ పట్టి ఫైనల్ ఆడుతుంటే ఇక్కడ మన కుల గజ్జి కుక్కలు ఏం చేస్తున్నాయో తెలుసా? ఇంకేం చేస్తుంటాయి.... ఏ కులం వాడు కనుక్కున్నాడో తెలియని టెక్నాలజీ ఉపయోగించి.... తమ వంకర తోకల్ని ఆడిస్తూ... సింధు క్యాస్ట్, పూసర్ల క్యాస్ట్, పూసర్ల వెంకట సింధు క్యాస్ట్ అంటూ సెర్చ్ లు చేయటం మొదలుపెట్టాయి! అంటే... స్వర్ణమో, సిల్వరో ఏది తెచ్చినా తమ కులం అమ్మాయే సాధించిందంటూ... మొరగుదామని ఈ కుక్కల ప్రయత్నం!   పాపం తెలిసో, తెలియకో కులం గురించి వెదికారు వదిలేయండి. ఎందుకని బూతులు తిడతారు అని మాత్రం మీరు అనకండి. ఎందుకంటే, ఈ కుల ఉగ్రవాదులు మానవ బాంబుల కంటే ప్రమాదకరం. ఈ ఊర పందులు తమ హీరో సినిమా రిలీజ్ రోజు థియేటర్ల ముందు నానా వేషాలు వేస్తారు. అదేదో వీళ్ల హీరో కేవలం వీళ్ల గురించే సినిమా తీసినట్టు, ఇతర కులాల్ని ఆయనగారు అస్సలు పట్టించుకోరన్నట్టు. కాని, అన్ని కులాల వాళ్లు తమ కులం హీరో సినిమా చూస్తేనే హిట్ అవుతుందని అర్థం కాదు ఈ ఎబ్రాసులకి. అంతే కాదు, వీళ్ల కుల పిచ్చి తమ తమ ఊళ్ల నుంచి హైద్రాబాదుకి, అక్కడ్నుంచి అమెరికాకి కూడా తీసుకుపోయారు తమ వెంట. అందుకే, అక్కడ కూడా ఎవడి కులం వారు తమ తమ కులానికి ఓ సంస్థ స్థాపించుకున్నారు. వెదికి వెదికి తమ కులం సెలబ్రిటీలకే సత్కారం చేస్తుంటారు! దీన్నే సంస్కృతంలో స్వకుచ మర్దనం అంటారు! పచ్చి తెలుగులో ఏమంటారో నేను వివరించను లెండీ... భయపడకండి!   అమలపురం నుంచి అమెరికా దాకా తీసుకుపోయిన తమ కుల గజ్జి సింధు పతకం కొట్టే టైంలో పతాక స్థాయికి చేరుకుంది! ఒకేసారి లక్షల మంది గూగుల్ మీద పడ్డారు ఆమె కులం కోసమని! ఇందులో కుట్ర వుంది, బొంగు, బోషాణం అని ఎన్ని మాటలు చెప్పినా... నిజంగా ఆమె క్యాస్ట్ గురించి వెదికిన 'కమ్మ'టి సత్యం ఎవ్వరూ కాదనలేనిది. గూగుల్ అనాలిటిక్స్, స్టాటిస్టిక్స్ 'కాపు' కాస్తూనే వున్నాయి. పైగా ఈసారి కేవలం వెజిటేరియన్ ఫుడ్డు తినే ఓ 'ఓసీ కులం' వాళ్లు కూడా సింధు సక్సెస్ పై కర్చీఫ్ వేసే ప్రయత్నం చేశారు. ఆమె తమ కులం బిడ్డేనంటూ ఫేస్ బుక్ నిండా పోస్టులు పెట్టి గబ్బు లేపారు! అసలు ఆమె చిన్న, చితకా టోర్నమెంట్లు ఆడుతున్నప్పుడు ఈ దౌర్భాగ్యులు పట్టించుకుకన్న పాపాన పోలేదు. ప్రపంచ ఛాంపియన్ అయినప్పుడు సింధుని గుర్తించిన దిక్కులేదు. కాని, ఒలంపిక్స్ మెడల్ సాదించే సరికి సదరు కులోన్మాదులంతా రొట్టె ముక్క కోసం వెంటపడ్డ కుక్కల్లా సెర్సింగ్ లు మొదలు పెట్టారు.   ఏమైతేనేం భారతీయ కులానికి చెందిన మనందరి సింధు... పతకం తెచ్చింది. అన్ని కులాల వాళ్లు ఆమెకు జరిగిన రెండు రాష్ట్రాల్లోని సన్మానం ..... ఏ కులం వాడు తయారు చేశాడో తెలియని టీవీల్లో కళ్లప్పగించి చూశారు! మరి ఇంత మాత్రం దానికి దేశాన్ని రెండడుగులు ముందుకు వేస్తే నాలుగడుగులు వెనక్కి తీసుకెళ్లే కులం సెర్చ్ లు ఎందుకు? ఇప్పటికైనా సింధు సక్సెస్ లోంచి ఇన్ స్పిరేషన్ సెర్చ్ చేద్దాం. అంతే కాని, ఆమె క్యాస్ట్ ని కాదు! అయినా కూడా కొందరుంటారు కదా.... కులం పట్టుకుని వేళ్లాడే వాళ్లు అంటారా? ఖచ్చితంగా వుంటారు... వాళ్లు... ఇవాళ్ల తిన్నది రేపొద్దున్న శరీరంలోంచి బయటకు వచ్చేస్తుంది కదా... దాని లాంటి వాళ్లు!ఆ కుల గబ్బుగాళ్లు మీకు ఎదురైతే... అమాంతం 'ప్లష్' చేసి పారేయండి... డ్రైనేజీలో కొట్టుకుపోతారు! పీడ పోతుంది....    

అంగట్లో అన్నీ వున్నా న్యూస్ ఛానల్ ప్రేక్షకుడి నోట్లో....

అంగట్లో అన్నీ వున్నా... అల్లుడి నోట్లో శని అంటారు! పాపం తెలుగు న్యూస్ ఛానల్స్ చూసే వారి పరిస్థితి ఆ అల్లుడిలాగే తయారైంది! అసలు విషయం తెలుసా... మొత్తం దేశంలో తెలుగు వాళ్లకు వున్నన్ని న్యూస్ ఛానల్స్ మరే భాష వారికి లేవు! ఇది నిజంగా గర్వించదగ్గ విషయం. కాని, ఆనందించదగ్గ సంగతి మాత్రం కాదు!   తెలుగులో దాదాపు 20 వరకు వార్త ఛానల్స్ వున్నాయి. అందులో కొన్నిట్ని జనం చూస్తే ... కొన్ని ఛానల్స్ వున్నాయని ప్రజలు ఎప్పుడో మరిచిపోయారు. కనీసం ఉద్యోగులకు నెలకోసారి జీతాలు కూడా ఇవ్వని న్యూసెన్స్ ఛానల్స్ బోలెడున్నాయి మన ఉభయ రాష్ట్రాల్లో. అయితే, ఇక్కడ విషయం వాట్ని తిట్టిపోయటం కాదు. అసలు ఇన్నేసి ఛానల్స్ జనానికి ఏం అందిస్తున్నాయి అని ఒకసారి విశ్లేషిస్తే ఒకింత ఆశ్చర్యమే కలుగుతుంది...   గత రెండు వారాలుగా అందర్నీ షేక్ చేసిన రెండే రెండు విషయాలు కృష్ణ పుష్కరాలు, సింధు పతకం గెలవటం. ఇవాళ్టితో కృష్ణమ్మ పుష్కర సంబరం ముగుస్తోంది. సింధు కూడా రెండు రాష్ట్రాల సన్మానాలు పొంది ఇల్లు చేరుకుంటోంది. కాబట్టి ఈ రెండు టాపిక్స్ కాస్త చల్లబడతాయి. కాని, ఇదే సందర్భరంలో మన మీడియా వ్యవహారం ఓ సారి చక్కగా చూడొచ్చు...   ఎన్ని ఛానల్స్ వున్నా అన్నీ గత రెండు వారాలుగా పుష్కరాలు, ఒలంపిక్స్ లో మెడల్ గెలవటం అనే టాపిక్స్ నే నెత్తికెత్తుకున్నాయి. మీరు రిమోట్ పట్టుకుని కూర్చుంటే వరుసగా రియో ముచ్చట్లే తప్ప మరొకటి కనిపించేది కాదు. కాదంటే మన రిపోర్టర్లు కెమెరా వేసుకుని వెళ్లి మైక్ పట్టుకుని జనాన్ని దగ్గరుండి పుష్కర స్నానాలు చేయించేవారు! పన్నెండు రోజులు అదే ప్రశ్న '' మీరెలా ఫీలవుతున్నారు?''... లేదంటే '' ఏర్పాట్లు ఎలా వున్నాయి?'' దానికి జనం కూడా రొటీన్ సమాధానాలే ఇచ్చి పిండ ప్రదానానికి వెళ్లిపోయే వారు! ఇదీ వరస...   రాష్ట్రంలో ప్రధానంగా జరుగుతున్న విషయాల్ని రిపోర్ట్ చేయకుండా మరేం చేయమంటారు అని మీరు ప్రశ్నించవచ్చు! కాని, ఒకసారి మనం జాతీయ ఇంగ్లీష్ మీడియా ఛానల్స్ ని పరిశీలిస్తే ఏం చేయోచ్చొ తెలుస్తుంది. అక్కడ వారు ఒక ఛానల్ ఒక విషయాన్ని ప్రధానంగా పట్టుకుంటే మరో ఛానల్ మరో ఆసక్తికర అంశాన్ని ఫాలోఅప్ చేస్తుంది. కాని, తెలుగులో అలాంటిదేమీ వుండదు. ఈ విషయం మాకు బాగా తెలియాలంటే పార్లమెంట్ , అసెంబ్లీల సమావేశాలు జరుగుతున్నప్పుడు చూడండి. టీవీ 9 మొదలు చోటామోటా ఛానల్స్ వరకూ అందరూ సమావేశాల లైవ్ ఇచ్చి టీలు, టిఫిన్లు కానివ్వటానికి వెళ్లిపోతారు. ఒకే లైవ్ ని అన్ని ఛానల్స్ లో చూడాల్సిన అగత్యం జనానికి ఎందుకుంటుంది? అందుకే, మన దగ్గర ఎన్ని ఛానల్స్ వున్నా టీఆర్పీలు మాత్రం ఒకట్రెండు ఛానల్స్ కే వస్తుంటాయి!   పుష్కరాలు, ఒలంపిక్స్ లాంటివి వచ్చినప్పడు ఛానల్స్ సాధ్యమైనన్ని కొత్త విషయాలు, కొత్త కోణాలు ఆవిష్కరిస్తే బావుంటుంది. కాదంటే, అరడజను ఛానల్స్ ఆల్రెడీ ఒకే అంశం చుట్టూ ఈగల్లా ముసురుకుంటే నెక్ట్స్ ఛానల్ వారు సీరియస్ గా ప్రజా సమస్యల్ని రిపోర్ట్ చేయవచ్చు. ఆఫ్ట్రాల్ పుష్కరాలు వచ్చాయనో, పతకాలు గెలిచామనో, ఫలాన అగ్రహీరో సినిమా ఆడియో రిలీజ్ అవుతుందనో .... ప్రజా సమస్యలు మాయమైపోవు గదా? మన సమాజంలో బోలెడు కష్టాలు, కన్నీళ్లు వున్నాయి. వాట్ని జనం దృష్టికి , పాలకుల దృష్టికి తేకుండా అన్ని ఛానల్స్ పోలోమని ఒకే రొట్టే ముక్కపై పడి కొట్టుకోవటం ఎందుకు? దాని వల్ల ప్రేక్షకుల కంటే సదరు మీడియాకే ఎక్కువ నష్టం! కొన్ని రోజులు పోయాక టాప్ ఫోర్ ఆర్ ఫై ఛానల్స్ తప్ప మిగతావన్నీ చూడటం మానేస్తారు జనం. అప్పుడు చేసేది లేక దుకాణాలు మూసుకోవాల్సి వస్తుంది!

నిరుద్యోగులకి స్పీడ్ బ్రేకర్స్ కానున్న కొత్త జిల్లాలు?

  విభజన తరువాత ఏర్పడ్డ నవ తెలంగాణ విషయంలో ఎన్నో విధాన పరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఆయన అలాంటి పనులు చేయాల్సిందే. గొల్కొండ కోటపై జెండా ఎగురవేయటం, సకల జనుల సర్వే లాంటి నిర్ణయాలు మొదలు తాజాగా అమలు చేస్తున్న జిల్లాల విభజన వరకూ ఆయన ఎన్నో దూకుడుగా చేస్తున్నారు. అయితే, ఇవాళే తుది రూపు దాల్చనున్న 27జిల్లాల తుది తెలంగాణ చిత్రపటం కొత్త సమస్యలు తెచ్చిపెట్టవచ్చంటున్నారు అధ్యయనకారులు. మరీ ముఖ్యంగా నిరుద్యోగులకు ఈ కొత్త  జిల్లాల హీట్ మరింత ఎక్కువంటున్నారు...   ఒక్కసారి తెలంగాణ ఉద్యమం మూలాల్లోకి వెళితే మనకు స్పష్టంగా కనిపించేది ఉద్యోగాల డిమాండ్. సమైక్యాంధ్రగా వున్నప్పుడు తమకు తగినన్ని ఉద్యోగాలు రాలేదన్నదే యువత ప్రధానమైన ఆరోపణ.అందుకే, ఉస్మానియా యూనివర్సిటీ మొదలు మారుమూల పల్లెల దాకా యూత్ ఉద్యమంలోకి దూకింది. కాని, తీరా స్వరాష్ట్రం వచ్చాక కూడా పెద్దగా కొలువు జాతర జరిగిందేం లేదు. టీఎస్పీఎస్సీ ఏర్పాటై నోటిఫికేషన్ల వంటివి వస్తున్నా ఈ రెండేళ్లలో భారీగా ఉద్యోగాల్లో చేరిన నిరుద్యోగులు లేరనే చెప్పాలి. అలాగే, రెగ్యులరైజేషన్ కోసం ఎదురు చూస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా బోలెడు మంది వున్నారు.   స్వంత రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో వున్న తెలంగాణ వాదులు,  కేసీఆర్ పై ఇప్పటికిప్పుడు నమ్మకాన్ని కోల్పోవటం లేదు. సహనంగా వాళ్లు జాబ్స్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, సీఎం తీసుకున్న తాజా జిల్లాల ఏర్పాటు నిర్ణయం వారిలో కొంత మందిని నిరాశపరిచే ఛాన్స్ వుంది. పది జిల్లాలు ఇరవై ఏడుగా మారితే కొత్తగా వచ్చిన 17 జిల్లాల వల్ల అనేక పెను మార్పులు తప్పనిసరి. అందులో నియామకాలు కూడా వుంటాయి. ఎందుకంటే, ఇప్పటి వరకూ ప్రబుత్వ ఉద్యోగాలు జోన్ల వారీగా భర్తి చేస్తున్నారు. కాని, ఇప్పుడు దసరా కల్లా కొత్త జిల్లాలు అమల్లోకి వస్తే జోన్లు కొనసాగే ఛాన్స్ లేదు. అంతే కాదు, జోనల్ వ్యవస్థ రద్ధు చేస్తూ స్వయంగా కేసీఆరే నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల ఇప్పటికే పెండింగ్ లో వున్న గ్రూప్ 2 ఉద్యోగాల నోటిఫికేషన్ మరింత డిలే కానుంది. రాత పరీక్ష కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు జిల్లాల ఏర్పాటు పూర్తయ్యే దాకా ఓపిక పట్టాలి. ఆ తరువాత కూడా గ్రూప్ వన్, గ్రూప్ టూ ఉద్యోగాల్ని ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా స్థాయి పోస్టులుగా విభజించే దాకా ఎదురుచూడాలి. ఇలాంటి కసరత్తు అంతా పూర్తి కావాలంటే అటుఇటుగా ఆర్నెల్లు పట్టొచ్చు. ఆ తరువాతే రాత పరీక్ష. పోస్టుల భర్తి.   ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైన గ్రూప్ 2 నే కాదు ఇంకా చాలా రకాల పోస్టులు ప్రస్తుతం జోనల్ పద్ధతిలో భర్తి చేస్తున్నారు. జూనియర్ లెక్చరర్, డైట్ లెక్చరర్, డిగ్రీ కాలేజీ లెక్చరర్, పాలిటెక్నిక్ లెక్చరర్,  సబ్ ఇన్‌స్పెక్టర్ వంటి పోస్టులు కూడా ఇప్పుడప్పుడే భర్తీ అయ్యే సూచనలు కనిపించటం లేదు. జిల్లాల ఏర్పాటు మొత్తం ఓ కొలిక్కి వచ్చాకే జోనల్ పద్ధతిలో భర్తీ అవుతూ వచ్చిన ఈ పోస్టులు నోటిఫికేషన్ కి వస్తాయి.   ఇక తెలంగాణ నిరుద్యోగుల్ని వేధిస్తున్న మరో అంశం జోనల్ పద్ధతి పోయి ఓపెన్ సిస్టమ్ వస్తే ప్రతీ ఉద్యోగానికి అందరూ పోటీ పడే ఛాన్స్ వుంటుంది. ఇలా అయితే, లోకల్ వారికి ఉద్యోగాలు అంత ఈజీగా దక్కే అవకాశం వుండదు. హైద్రాబాద్ లాంటి జిల్లాల నుంచి అభ్యర్థులు భారీగా ఇతర జిల్లాల ఖాళీలకు పోటీ పడతారు. అప్పుడు స్థానిక నిరుద్యోగులకు విజయం సాధించటం కత్తి మీద సామైపోతుంది. దీనికి విరుగుడుగా ఉద్యోగాల్లో కొన్ని స్థానికులకి, కొన్ని ఓపెన్ క్యాటగిరిలో పెడతారని వార్తలు వస్తున్నా అవ్వి ఏ నిష్పత్తిలో , ఎప్పుడు విభజిస్తారనే దానిపై క్లారిటీ లేదు. మొత్తం మీద తెలంగాణ నిరుద్యోగ యువతకి కొత్త జిల్లాల ఏర్పాటు పెద్ద స్పీడ్ బ్రేకర్ లా తయారైందని చెప్పుకోవచ్చు. మరి రాష్ట్ర ఏర్పాటుకే అసలు కారణమైన ఉద్యోగాల భర్తి సమస్యని వచ్చే ఎన్నికల్లో ఫలితాలపై ప్రభావం చూపకుండా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఎలా హ్యాండిల్ చేస్తారో మరి కొంత కాలం వేచి చూడాలి...

ఒక సింధు... ఎందరో పూజలు!

  మన దేశంలో చల్లటి హిమాలయాలు వుంటాయి. భగభగలాడిపోయే తార్ ఎడారి కూడా వుంటుంది. సంవత్సరం మొత్తం వర్షంలో తడిసే ప్రాంతాలుంటాయి. సంవత్సరాల పాటూ నీటి చుక్క కురవని కరువు ప్రాంతాలు కూడా వుంటాయి. ఇండియా అంటేనే అంతా... క్రీడల విషయంలో కూడా భారతదేశంలో ఎటు చూసినా అంతే కనిపిస్తుంది. ఒకవైపు సింధు లాంటి ఒలంపిక్ విన్నర్స్ కి మన ప్రభుత్వాలు కోట్లు గుమ్మరిస్తాయి. అది తప్పు కూడా కాదు. ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత, విజయాల్ని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా వుంది. కాని,అసలు సమస్య నాణానికి మరో వైపు వుంటుంది...   సింధు, సానియా, సైనా, మేరీ కామ్... వీళ్లే మనకు తెలుసు. తెలియకుండా మిగిలిపోతోన్న అనేక మంది క్రీడాకారులు దేశంలో అడుగడుగునా వున్నారు. వాళ్ల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు మన పాలకులు. కనీస అవసరాలు కూడా ఏర్పాటు చేయకుండా అమానుషంగా చిదిమేస్తున్నారు ఎందరో క్రీడా సుమాల్ని.   రియోలో సిల్వర్ సాధించిన సింధు ఇంకా ఇంటికి కూడా రాలేదు. కాని, అప్పుడే పంజాబ్ లోని పటియాలాలో ఒక పూజ అర్ధాంతరంగా జీవితం చాలించింది. కారణం... వివిధ దశల్లో పాలకుల నిర్లక్ష్యం. ఆమె జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ క్రీడాకారిణి కావటంతో పటియాలాలోని ఖల్సా కళాశాలలో సీట్ వచ్చింది. మొదటి సంవత్సరం పూజా హాస్టల్ లో వుంటూ హాయిగానే చదువుకుంది. కాని, రెండో సంవత్సారనికి ఆమెని మన దేశంలోని దారుణమైన వ్యవస్థ కాటేసింది. ప్రధాని మోదీని ఉద్దేశించి ఆమె రాసిన సూసైడ్ నోట్ ప్రకారం... కోచ్ వల్ల ఆమె రెండో యేడు హాస్టల్ లో వుండే అర్హత పొందలేకపోయింది. ఫలితంగా కఠిన పేదరికంతో బాధపడే ఆ అమ్మాయి ప్రతీ రోజూ డబ్బులు పెట్టుకుని ఇంటి నుంచి కాలేజ్ కి వచ్చిపోవాల్సి వచ్చింది. చివరకు, ఆర్దిక భారం భరించలేక, తాను ఇష్టపడ్డ ఆటలో ముందుకు పోలేక, పోతాననే విశ్వాసమూ లేక ప్రాణాలు తీసుకుంది...   పంజాబ్ లోని పటియాలాలో ఒక పూజ కాదు. మన దేశంలో ప్రతీ రాష్ట్రంలో ఎందరో పూజలు వున్నారు. అందరూ ఆత్మహత్యలు చేసుకోకపోవచ్చు. కాని, ప్రభుత్వం నుంచి సరైన ప్రొత్సాహం, సరైన సమయంలో దక్కక ఆటకి ఆటవిడుపు ప్రకటించి సామాన్య జనాల్లో కలిసిపోతున్నారు. అంటే... మనుషులుగా కాకపోయినా క్రీడాకారులుగా ఆత్మహత్య చేసుకుంటున్నారన్నమాట! ఇందుకు స్పష్టమైన కారణం ఒలంపిక్ మెడల్ విజేతలకు, క్రికెట్ ప్లేయర్లకు సాగిలబడి దండలు పెట్టే ప్రభుత్వాలే. విజయం సాధించిన వార్ని తప్ప సాధించే సత్తా వున్న వార్ని ఇక్కడెవ్వరూ పట్టించుకోరు! అదే విషాదం!   ఆల్రెడీ ఎదిగి మహా వృక్షమైన చెట్టుకి ఎన్ని నీళ్లు పోసినా కొత్తగా ఒదిగేదేం వుండదు. అప్పుడప్పుడే ఎదుగుతున్న మొక్కకి, మొక్కవోని దీక్షతో సాధన చేస్తున్న ఔత్సాహికులకి... ప్రొత్సాహమనే నీరందిస్తేనే ప్రభుత్వాలు, పాలకుల బాధ్యత నెరవేరేది! దేశం దూసుకుపోయేది... 

మన పాలకులకి .... ఆటలంటే ఆటైపోయింది!

సింధు సిల్వర్ గెలిచింది. దేశం మొత్తం మురిసిపోయింది. అయితే, ఒక్కటి మాత్రం శేష ప్రశ్నగానే మిగిలిపోయింది. ఎందుకని ఇన్ని కోట్ల జనాభా వున్న భారతదేశం జస్ట్ రెండు మెడల్స్ తో సరిపెట్టుకోవాల్సి వస్తోంది? అందుకు అసలు రీజన్ ఈ స్టోరీ వింటే మీకే తెలుస్తుంది! అనగనగా ఓ బ్యాడ్మింటన్ ప్లేయర్. ఆయన ఇండియాలో ఎవ్వరూ పట్టించుకోని షటిల్ అండ్ కాక్ గేమ్ ని ఎంతగానో ప్రేమించాడు. తాను సరైన సౌకర్యాలు లేక ఒలంపిక్స్ మెడల్ సాధించలేకపోయినందుకు ఓ బ్యాడ్మింటన్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ పెట్టాలనుకున్నాడు. ఒలంపిక్స్ మెడల్స్ కల తన శిష్యుల ద్వారా నిజం చేసుకోవాలనుకున్నాడు. ఇదంతా 2003 నాటి మాట. కట్ చేస్తే...  2016లో సదరు బ్యాడ్మింటన్ ద్రోణాచార్యుడి శిష్యురాలే సింధు. రియో ఒలంపిక్స్ లో ఆమె సాధించిన సిల్వర్ మొత్తం దేశానికి గర్వకారణమైంది. ఇంతే కాదు, పోయిన ఒలంపిక్స్ లో సైనా కూడా ఆయన కోచింగ్ లోనే కాంస్యం కొట్టింది! ఇలా రెండుసార్లు భారతదేశానికి బ్యాడ్మింటన్లో పతకాలు సాధించిపజేసిన ఆ గురువు పుల్లెల గోపిచంద్. ఆయనకి మన ప్రభుత్వాలు, పొలిటీషన్స్ ఇస్తున్న ప్రొత్సాహం ఏంటో తెలుసా? ఏ చిన్న గ్రౌండ్లో ఎంత చిన్న టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి వచ్చినా మన రాజకీయ నాయకులు తాము క్రీడల అభివృద్ధికి కట్టుబడి వున్నామని ఉపన్యాసాలు దంచేస్తారు. కాని, తన జీవితమే బ్యాడ్మింటన్ కు అంకితం చేసి వజ్రాల్లాంటి శిష్యులని తయారు చేస్తున్న గోపిచంద్ కు మాత్రం ఎలాంటి ఎంకరేజ్‌మెంట్ దక్కలేదు, సరి కదా 2003లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గచ్చిబౌలి దగ్గర ఇచ్చిన 5ఎకరాల్లో మూడెకరాలు తిరిగి లాక్కునేందుకు కుట్ర జరిగింది.  చంద్రబాబు తరువాత సీఎం అయిన వైఎస్ గచ్చిబౌలి వద్ద అత్యంత ఖరీదైన 5ఎకరాల భూమి గోపిచంద్ అకాడమికీ వుండటం గమనించి తనదైన స్టైల్లో కథ నడిపించారు. బ్యాడ్మింటన్ కు ప్రొత్సాహం ఇవ్వాల్సిన ముఖ్యమంత్రే స్వయంగా అకాడమికీ రెండెకరాలు చాలు, స్విమ్మింగ్ పూల్, రన్నింగ్ ట్రాక్ లాంటివి ఎందుకంటూ జీవో జారీ చేశారు. దాని ప్రకరాం 3ఎకరాలు గవర్నమెంట్ వెనక్కి తీసుకోబోయింది. కాని, గోపిచంద్ కోర్టుకు వెళ్లటంతో ఆ ప్రయత్నం మధ్యలో ఆగిపోయింది.    వైఎస్ తరువాత సీఎం అయిన మరో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రోశయ్య కూడా బ్యాడ్మింటన్ భూమిల్ని లాక్కునే జీవో ఉపసంహరించలేదు. తరువాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డిగాని, ఇప్పటి కేసీఆర్ గాని అలాంటి పని చేసినట్లు దాఖలాలు లేవు. ఇదీ మన ప్రభుత్వాల క్రీడాభివృద్ధి కాంక్ష! బడా కార్పోరేట్లకు రైతుల పొలాలు లాక్కుని మరీ భూములు దానం ఇయ్యటం సమర్థంగా చేసే మన నేతలు దేశానికి గర్వకారణం అయ్యే గోపిచంద్ అకాడమీ లాంటి వాటికి మాత్రం మూడెకరాల భూమి వదలకపోవటం నిజంగా విడ్డూరమే! ఆటలకు ప్రొత్సాహం ఇంతగా వుంది కాబట్టి ఒలంపిక్స్ లో మన ప్రతాపం ఆ రేంజ్లో వుంది మరి... 

వడ్డించే వాడు మనవాడైనా....అర్థాకలితోనే ఆంధ్రా!

వడ్డించే వాడు మన వాడైతే ... అంటూ ఓ సామెత చెబుతారు. కాని, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అందుకు భిన్నంగా వుంది. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీతో బీజేపి గత సార్వత్రిక ఎన్నికలకి ముందే జోడీ కట్టింది. పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దిగి ప్రచారం చేయటంతో ఆంధ్రా జనం ఎన్డీఏ కూటమికే అధికారం కట్టబెట్టారు. రాష్ట్రంలోనే కాదు ఢిల్లీలోనూ ఎన్డీఏ అధికారం చేపట్టింది. మొత్తం మీద లోటు బడ్జెట్ తో ఏర్పడ్డ నవ్యాంధ్ర వడ్డించే వాడు ఇక మనవాడే అనుకుంటూ ఊపిరి పీల్చుకుంది...     ఢిల్లీలోని ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎలాగైనా ఆదుకుంటుందని ఆశించిన తెలుగు వారికి రెండేళ్లుగా నిరాశే ఎదురవుతోంది. అసలు ప్రత్యేక హోదానే ఇచ్చేస్తారని భ్రమపడ్డ వారికి ఇప్పుడు మెల్లగా మెల్లగా తత్వం బోధపడుతోంది. పోనీ ప్యాకేజీ అన్నా భారీగా ఇస్తారా అనుకుంటే అదీ హుళక్కేనని తాజా పరిణామాలతో తేలిపోయింది.     పోయిన బీహార్ ఎన్నికలప్పుడు ఆ రాష్ట్రానికి కేంద్రం వేల కోట్ల ప్యాకేజ్ అనౌన్స్ చేసింది. అలాగే, బీజేపి అధికారంలో లేని బుందేల్ ఖండ్ కి కూడా భారీగా ఆర్దిక సాయం అందుతూ వుంటుంది. కాని, టీడీపీతో కలిసి అధికారం చేపట్టిన ఆంద్రప్రదేశ్ బీజేపి మాత్రం ఢిల్లీలో ఏమీ చేయలేకపోతోంది. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఎన్నిసార్లు మాట్లాడినా ఫలితం వుండటం లేదు. బుందేల్ ఖండ్ తరహా భారీ ప్యాకేజ్ అని ఇంతకాలం ఆశించిన వారికీ అది ఇప్పుడు ఆకాశంలో మబ్బులా తేలిపోయింది. ఆర్దిక కరువులో వున్న రాష్ట్రానికి కేంద్రం నుంచి కాసుల వర్షం కురవదని తేలిపోయింది.    ఏపీ  సీఎం స్వయంగా వెళ్లి నాలుగు వేల కోట్లన్నా ఇవ్వమంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఇచ్చింది ముష్టి రెండు వేల కోట్లు. అందులోనే లోటు బడ్జెట్, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, రాజధాని నిర్మాణం అన్నీ చేసుకోమ్మని చల్లగా సెలవిచ్చింది. ఇంతకీ, 4వేల కోట్లు బదులు 2వేల కోట్లు ఇచ్చిన ఢిల్లీ సర్కార్ మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ ఎంత పూడ్చాలో తెలుసా? అక్షరాలా 16వేల కోట్లు! అందులో ఇప్పటి దాకా దక్కింది 2800కోట్లు మాత్రమే! ఇది స్వయంగా చంద్రబాబే చెప్పిన మాట!     ప్రత్యేక హోదా అసాద్యమని చెప్పకనే చెబుతూ, కనీసం ప్యాకేజీ కూడా పెద్ద మనసుతో ఇవ్వకుండా తెలుగు వారికి చుక్కలు చూపుతున్న హస్తిన పెద్దలు పోలవరం, విశాఖ రైల్వే జోన్ లాంటి హామీలు నిలబెట్టుకుంటారంటే అది దురాశే అవుతుంది. రాజ్యసభలో ఎంతో కీలకమైన టీడీపీ మద్దతు అప్పన్నంగా తీసుకుంటూ కూడా నవ్యాంధ్రని నిర్లక్ష్యం చేయటం శుద్ధమైన మోసమే అవుతుంది. మరి తదుపరి ఏం చేయాలో నిర్ణయించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుదే! టీడీపీ అధినేతగా ఆయన కఠినమైన నిర్ణయం తీసుకుంటే మాత్రం ఎన్డీఏకి, ప్రధానంగా బీజేపికి అది పెద్ద డ్యామేజీనే! ఇప్పటికే పదమూడు జిల్లాల్లో ఖతమైన కాంగ్రెస్సే చక్కటి ఉదాహరణ... 

ఒలంపిక్స్ లో సగర్వంగా 'మెడల్' ఎత్తుకున్న భారత్!

రియో క్రీడా సమరం మొదలై ఇన్ని రోజులైనా ఒలంపిక్స్ లో ఒక్క మెడలూ రాలేదు! ఇక ఇలా భావించుకుంటూ మెడల్ రాలేదని మెడలు దించుకుని... నేల చూపులు చూస్తూ... అవమాన పడాల్సిన పని లేదు! ఎందుకంటే, నూటా ఇరవై అయిదు కోట్ల అభిలాశల సాక్షిగా మన సాక్షి మాలిక్ ఒలంపిక్ మెడల్ తన మెడలో వేయించుకుంది! అదీ ఇప్పటి వరకూ దక్కని ఫీమేల్ రెస్లింగ్ విభాగంలో!       హర్యాణాకు  చెందిన సాక్షి మాలిక్ ఒలంపిక్స్ లో పతకం సాధించిన తొలి మహిళా రెజ్లర్! 24ఏళ్ల ఆమె పన్నెండేళ్లుగా ఈ అద్భుత అంతర్జాతీయ విజయం కోసం తనతో తాను కుస్తీ పడుతూనే వుంది! తన గ్రామంలో మొదలైన ఆమె పోరాటం అంచెలంచెలుగా ముందుకు సాగుతూ ఇప్పుడు రియో దాకా వెళ్లింది. అదీ ఆటలంటే .... ఏ పట్టింపూ లేని ఓ ఆటైపోయిన మన భారతదేశంలో! ఆమె విజయం నిజంగా గొప్ప ప్రేరణే! అసలు ఇక్కడ చాలా మంది ప్రభుత్వ పెద్దలకి క్రికెట్ తప్ప మరో క్రీడ వుంటుందనే తెలియదు.బిసీసీఐ పగ్గాలు పట్టుకుని భీమ పరాక్రమం చూపుదుమాని తప్ప ఇంకో ఆలోచన వుండదు!       మన దేశంలో సామాన్యుల పరిస్థితి కూడా అంతే.... ఒక సానియా, ఒక సైనా, ఒక మేరీ కామ్ ఎప్పుడైతే ఛమక్కున మెరుస్తారో అప్పుడే టెన్నిస్, బ్యాడ్మింటన్, బాక్సింగ్ లాంటి ఇతర క్రీడలు గుర్తుకు వస్తాయి. తరువాత యథా ప్రకారం జనం క్రికెట్ పిచ్ పై పిచ్చెక్కిపోయి పరుగులు తీస్తారు. నాలుగేళ్లకోసారి ఒలంపిక్స్ రాగానే ఇండియా యథా ప్రకారం రన్ అవుట్ అవుతూ వుంటుంది! .  12ఏళ్ల ప్రాయం నుంచీ ఒక పుష్కర కాలం కష్టాలతో కుస్తీ పట్టిన సాక్షి చివరకు ఈ సారి ఇండియాకు తొలి పతకం, తొలి మహిళా రెజ్లింగ్ పతకం రెండూ అందించింది! అయితే, చిన్నప్పుడు ఆమెతో కుస్తీ పట్టడానికి మరో అమ్మాయి ఎవ్వరూ లేకపోవటంతో అబ్బాయిలనే మట్టికరిపిస్తూ వచ్చిన ఆమెని రియోలో అదృష్టం బాగానే వరించింది. క్వార్టర్ ఫైనల్ లో ఓడిపోయి కూడా రెపిఛేజ్ పద్దతి ప్రకారం మరోసారి పోటీలో పాల్గొనే అవకాశం వచ్చింది. కాంస్య పతకం కోసం జరిగిన రౌండ్స్ లో సాక్షి కొత్త చరిత్రకు సాక్షిగా నిలుస్తూ వరుస విజయాలు సాధించి కాపర్ మెడల్ కొట్టింది!   సాక్షి భారత్ ఖాతాలో వేసిన ఈ మొదటి పతకం సాక్షిగా మనం ఒలంపిక్స్ కి ముందు జరిగిన శోభా డే రచ్చని గుర్తుకు తెచ్చుకోవాలి. ఆమె తన ట్వీట్ లో భారత్ నుంచి వందకు పైగా అథ్లెట్లు రియోకు వెళ్లటం డబ్బులు, సమయం దండగా అన్నారు! ఆమె ఉద్దేశ్యం నిజంగా ఏంటో మనకు తెలియదుగాని సాక్షి మొదటి పతకం సాధించి భారత్ పరువు నిలబెట్టింది. అంతే కాదు, శోభా డే లాంటి సీనియర్ జర్నలిస్టులు, క్రిటిక్స్, ఇంటలెక్చువల్స్ అథ్లెట్ల నైతిక స్థైర్యం దెబ్బతిసే మాటలు కాకుండా ప్రాక్టికల్ గా ఏమైనా చెబితే బాగుంటుంది. పతకాలు రావటం లేదనీ, రావనీ మనల్ని మనం తిట్టుకుంటే సరిపోదు. బోధ కాలు వ్యవహారంలా క్రికెట్ మాత్రమే ఎందుకు మన దేశంలో పెరిగిపోతోంది? మిగతా క్రీడలు ఎందుకని పోలియో కాళ్లలా మిగిలిపోతున్నాయి? ఇవీ... సాక్షి మాలిక్ అందించిన తొలి రియో ఒలంపిక్ మెడల్ సాక్షిగా మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్నలు! కుస్తీలో ఓ పతకం దక్కిందని సంతోషిస్తూనే... మనతో మనం కుస్తీ పట్టాల్సిన అంశాలు! 

జగన్ గారి కొత్త 'స్వరూపం'!

  అపజయం అన్నిటికంటే పెద్ద గురువు! ఈ సత్యం ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ కు బాగానే బోధపడింది! జగన్ ఈ మధ్య ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి 'ప్రత్యేక' హోదా సాధించేందు కోసం జాతీయ నేతలు చాలా మందినే కలిశారు. కాని, తరువాత ఎందుకోగాని 'ప్రత్యేక' శ్రద్ధతో అటు నుంచి అటు రిషీకేష్ వెళ్లి 'ప్రత్యేక' పూజల్లో పాల్గొన్నారు! పైగా ఆ 'ప్రత్యేక' పూజలు జరిపింది మరెవరో కాదు... అడపాదడపా చంద్రబాబుపై విమర్శలు కురిపించే విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి వారు! ఇదీ జగన్ ప్రత్యేక పూజల్లోని అసలు ప్రత్యేకత!     ప్రత్యేక హోదా కోసమని జగన్ ఢిల్లీకి వెళ్లి అక్కడ ప్రత్యేక క్రతువుల్లో పాల్గొనటం వెనుక చాలా వ్యవహారమే వుందంటున్నారు రాజకీయ పండితులు. అందరికీ తెలిసిన సంగతేంటంటే జగన్ ఎంతో భక్తి విశ్వాసాలు కలిగిన క్రిస్టియన్. వాళ్లమ్మ విజయమ్మ అయితే ఏకంగా  బైబిల్ పట్టుకునే బహిరంగ సభలకు కూడా హాజరయ్యేవారు. ఇక దేవుని పేరున వర్షం ఆపటం లాంటి లీలలు ప్రదర్శించే బ్రదర్ అనీల్ కుమార్ సంగతైతే చెప్పే పనేలేదు!     జగన్ క్రిస్టియన్ అవ్వటం అన్నది మన ప్రజాస్వామ్య దేశంలో తప్పేం కాదుగాని ఆయన హఠాత్తుగా హిందూ పుణ్యక్షేత్రం రిషీకేష్ లో ప్రత్యక్షమై స్వరూపానందేంద్ర స్వామి వారి ఆశీస్సులతో యజ్ఞ, యాగాలు చేయటమే... పెద్ద ఆశ్చర్యం! 2014 ఎన్నికల ముందు జగన్ ఎక్కడా హిందూ మతానికి సంబంధించిన పూజా, పునస్కారాల్లో పాల్గొన్నట్టు దాఖలాలు లేవు. కాని, ఒక్కసారి జనం గత సార్వత్రిక ఎన్నికల్లో షాక్ ఇవ్వటంతో యువనేతలో 'మెజార్టీ' ప్రజలు మతం పట్ల భక్తి జాగృతం అయినట్టు కనిపిస్తోంది!     గోదావరి పుష్కరాల సమయంలో తండ్రి వైఎస్ కు శ్రాద్ధ కర్మ కూడా చేసిన జగన్ ఈ సారి ప్రత్యేక పూజల్లో పాల్గొని తాను హిందూ మతానికి వ్యతిరేకం కాదనే సంకేతం ఇస్తున్నాడంటున్నారు విశ్లేషకులు. ఇంత వరకూ కృష్ణ పుష్కరాల్లో మాత్రం వైఎస్ ఆర్సీ నేత మునకలు వేయలేదుగాని పోయిన ఎన్నికల వేళ ఎదురైన ఆపజయం చాలా పాఠాలే నేర్పినట్టుంది. ముఖ్యంగా జనంలో వుండే రాజకీయ నేతలు మెజార్జీ ప్రజల మత విశ్వాసాలు క్యాష్ చేసుకోకుండా సీఎం కుర్చీ ఎక్కలేరన్నది ఆయనకు బోధపడి వుంటుంది.     పూజలు, హోమాలు చేసి జగన్ క్రీస్తు అనుగ్రహంతో హిందు దేవుళ్లు, స్వామీజీల అనుగ్రహానికి కూడా పాత్రుడవుతాడో లేదో తెలియదుగాని ఆయన తపస్సు, తపన అంతా వేరే దాని కోసం అంటున్నారు పొలిటికల్ గాసిపర్స్! అదేంటంటే, విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర చాలా మంది అరెస్సెస్ పెద్దలకు బాగా క్లోజట. అంతే కాదు, అస్సొం, జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రాల్లో బీజేపి కమలాన్ని వికసింపజేసి మంచి ఊపు మీదున్న రామ్ మాధవ్ స్వామీ వారి శిష్యుడంటారు. మరో ఫైర్ బ్రాండ్ బీజేపి ఎంపీ సుబ్రమనియమ్ స్వామీ కూడా ఈ స్వామి వారికి దగ్గరేనట.   ఇన్ని కారణాలు వల్లె వేసుకున్నాక ఇక దాపరికం ఏముంది? జగన్ వచ్చే ఎన్నికల్లో బీజేపితో పొత్తు కోసం, పనిలో పనిగా తనపై వున్న కేసుల గోల తగ్గించుకునేందు కోసం హిందూ పూజా, పునస్కారాలు చేస్తూ కొత్త 'స్వరూపం' దాలుస్తున్నాడంటున్నారు అబ్జర్వర్స్! మరి ఆల్రెడీ బీజీపీతో పొత్తులో వున్న టీడీపీ , యువనేత వారి ఈ 'కొత్త' తపస్సుకి ఎలా భంగం కలిగిస్తుందో... చూడాలి!

భారత్ (ప్రధాని) స్వరం మారింది...

పాక్ ఆక్రమిత కాశ్మీర్..భౌగోళికంగా ఆ ప్రాంతం భారత భూభాగంలోనిది. దశాబ్ధాలుగా ఈ భూతల స్వర్గం గురించి రెండు దేశాలకు మధ్య వివాదాలు రేగుతూనే ఉన్నాయి. వేర్పాటువాదులు తమ స్వాతంత్ర్య కోసం రావణ కాష్టాన్ని రగిలిస్తూనే ఉన్నారు. ప్రతి ఏడాది స్వాతంత్ర్య దినోత్సవాలు వస్తూనే ఉన్నాయి..పోతూనే ఉన్నాయి. ప్రధానులంతా ఎర్రకోట వద్ద జాతీయ జెండాను ఎగురవేసి..ఉపన్యాసించారు. ఆ ప్రసంగంలో కాశ్మీర్ అంశంపై ప్రస్తావన ఉండేది కాదు..ఒకవేళ ఆ ప్రస్తావన వచ్చినా కంటితుడుపు మాటగా నాలుగు ముక్కలు మాట్లాడేవారు. కానీ తొలిసారిగా భారత ప్రధాని ఒకరు పీవోకే మాదేనన్న హెచ్చరికను పాక్‌కు..కాశ్మీర్ మనదేనన్న నమ్మకాన్ని భారతీయులలో కలిగించారు.   భారత 70వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. వాడవాడలా త్రివర్ణపతాకాన్ని ఎగురవేసి దేశ ప్రజలు జెండాకు సెల్యూట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధాని నరేంద్రమోడీ జాతీయ పతాకాన్ని ఎగురవేసి అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు. దాదాపు గంటన్నరపాటు సాగిన సుధీర్ఘ ప్రసంగంలో ఉగ్రవాదం-మానవత్వం, స్వరాజ్యం-సురాజ్యం, పేదరికం-అభివృద్ధి, సంక్షేమం-సంస్కరణలు సహా అంశాలపై ఉపన్యాసం ఇచ్చారు. భారత్-పాక్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొంటున్న పరిస్థితుల్లో కశ్మీర్ విషయంలో అనవసర జోక్యం చేసుకుంటున్న పాకిస్థాన్‌కు ఎర్రకోట సాక్షిగా ప్రధాని గట్టిగా హెచ్చరించారు. ఉగ్రవాదంపై పాక్ రెండు నాలుకల ధోరణిని ఎండగట్టారు. బెలూచిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌ అంశాలను ప్రస్తావించారు.   పొరుగున ఉన్న దేశానికి ఒక్కటే చెప్పదలుచుకున్నా..మనమిద్దరం ఒకరితో ఒకరు పోరాడటం కన్నా..ఇద్దరికి సహజ సమస్య అయిన పేదరికంపై కలసి పోరాడుదాం..అప్పుడే రెండు దేశాలు సంపన్నమవుతాయి. పేదరికం నుంచి విముక్తి పొందే స్వాతంత్ర్యం కంటే ప్రపంచంలో గొప్ప స్వాతంత్ర్యం ఏమీ లేదు. అలాగే బలూచిస్తాన్, జిల్‌జిత్, పీవోకే ప్రజలు నాకు కృతజ్ఞతలు చెప్పారు. నేను ఎప్పుడూ ఈ భూమిని చూడలేదు. వారు ఎప్పుడూ నన్ను కలవలేదు. కానీ అక్కడి ప్రజలు నన్ను గుర్తించి గౌరవించడం 125 కోట్లమంది భారతీయులకు దక్కిన గౌరవం. అందుకే బలూచిస్తాన్, గిల్‌జిత్, పీవోకే ప్రజలకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా..పాకిస్థాన్‌లోని పెషావర్‌లోని ఒక పాఠశాలలో అమాయకులైన చిన్నారులను ఉగ్రవాదులు క్రూరంగా హతమార్చారు. విద్యాలయం రక్తసిక్తమయ్యింది, దాన్ని చూసి భారత్‌లో ప్రతి ఒక్కరు కంటతడిపెట్టారు, ఇదీ మన మానవత్వం.   కానీ అటువైపు చూడండి ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదులను వారు కీర్తిస్తున్నారు. ముష్కరుల చేతుల్లో అమాయకులు చనిపోతే అక్కడ ఉత్సవం జరుపుకుంటున్నారు. అంటూ ఇటీవల భారత సైన్యం చేతుల్లో హతమైన మోస్ట్ వాంటెడ్ హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వానిని పాక్‌ అమరవీరుడుగా కీర్తిస్తున్న విషయాన్ని మోడీ ప్రస్తావించారు. భారతదేశం ఉగ్రవాదానికి, హింసకు ఎన్నటికీ తలవంచబోదని ఉద్ఘాటించారు. పాక్ ఎన్నిసార్లు కవ్వించినా భారత్ హద్దు దాటలేదు.. కానీ తొలిసారిగా భారత్ ఈ విషయంపై ఎదురుదాడికి దిగింది. అయితే బుర్హాన్ వానీ ఎన్‌కౌంటర్ తర్వాత జరిగిన పరిణామాలతో కశ్మీర్ వేర్పాటువాదులకు పాక్ బహిరంగంగా మద్ధతు ప్రకటించడంతో పాటు బెలూచిస్తాన్‌ తిరుగుబాటుకు భారత్ తోడ్పాటునందిస్తోందంటూ పాకిస్థాన్ అంతర్జాతీయ సమాజం ముందు ఇరుకునపెట్టే వ్యూహం పన్నింది.   అయితే మేం భారత్‌లో కలుస్తాం అంటూ పీవోకే ప్రజలు ఉద్యమానికి దిగాలని నిర్ణయించుకోవడంతో పాక్‌ ఆత్మరక్షణలో పడింది. సరిగ్గా అవకాశం కోసం ఎదురుచూస్తోన్న మోడీ గురి చూసి పాక్‌ను కొట్టాలనుకున్నారు. అందుకు స్వాతంత్ర్య దినోత్సవ ఉపన్యాసంలో ఈ అంశానికి అధిక ప్రాధాన్యతనిచ్చారు. మామూలుగా ప్రెస్ మీట్ పెట్టి పాక్‌పై విమర్శలు చేస్తే ఆ సందేశం సరిగ్గా వెళ్లదు. భారత స్వాతంత్ర్య దినోత్సవం అంటే ప్రపంచం మొత్తం ఆ రోజు ఇటే చూస్తుంది కాబట్టి ఆ సమయాన్ని..ఆ రోజుని ప్రధాని వేదికగా చేసుకుని పాక్‌పై చెలరేగిపోయారు.  "సహనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దు"..అని ఘాటైన హెచ్చరికలు పాక్‌కు పంపారు మోడీ. అదోక్కటే కాదు కశ్మీర్ అంటే కేవలం తమ భూభాగంలో ఉన్న కశ్మీర్ మాత్రమే కాదని..పాక్ ఆక్రమణలో ఉన్న కశ్మీర్‌ను కూడా కలుపుకుని మాట్లాడతామని మోడీ స్పష్టం చేసినట్లైంది. 

మారాల్సింది అమెరికానా..? ఇండియానా..?

గ్లోబలైజేషన్ పుణ్యమా అని ప్రపంచం ఒక కుగ్రామంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు వ్యక్తిగత అవసరాల కోసమో, వృత్తిగత పనుల కోసమో వివిధ దేశాలకు వెళుతూ ఉంటారు. అయితే సుదూర ప్రాంతాల నుంచి వేరే దేశంలో అడుగుపెట్టే వారిని విమానాశ్రయంలో తనిఖీలు చేయడం కామన్. అయితే ఒక దేశంలో పేరు ప్రఖ్యాతులు కలిగిఉండి..దేశంలో ఎక్కడకెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పట్టే సదరు వ్యక్తులకు పరాయిదేశంలో తనిఖీలు ఎదురైతే..అచ్చం ఇప్పుడు అలాగే ఉంది భారతీయ ప్రముఖుల పరిస్థితి. తన అసమాన నటనతో హిందీ చిత్రపరిశ్రమలో అగ్రకథానాయకుడిగా..అభిమానుల చేత బాలీవుడ్ బాద్‌షాగా జేజేలు అందుకుంటున్న షారూఖ్‌ఖాన్‌కు అగ్రరాజ్యంలో అవమానాలు తప్పడం లేదు. ఇప్పటికే పలుమార్లు ఆ దేశానికి వెళ్లిన షారూఖ్‌‌ను అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు ఎయిర్‌పోర్టులో తనిఖీల పేరిట అదుపులోకి తీసుకున్నారు.   తాజాగా నిన్న ఉదయం అమెరికాలో ల్యాండైన షారూఖ్‌ను అక్కడి భద్రతాధికారులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు. తన పిల్లలు సుహానా, ఆర్యన్‌లతో కలిసి అమెరికాలో దిగిన వెంటనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా షారూఖ్‌ ఖాన్ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈ విషయం తెలిసిన వెంటనే భారత్ రగిలిపోయింది. దీంతో ఆగమేఘాలపై స్పందించిన అమెరికా ప్రభుత్వం బాలీవుడ్ బాద్‌షాకి క్షమాపణలు చెప్పింది. ఎయిర్‌పోర్టులో జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. అమెరికన్ పౌరులపై సైతం నిఘాను అధికారికంగా పెట్టాల్సిన పరిస్థితి ఉంది అని దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాలను పర్యవేక్షిస్తుండే యూఎస్ అసిస్టెంట్ సెక్రటరీ నిషా బిస్వాల్‌ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. షారూఖ్ వస్తున్నారన్న సమాచారం ముందుగా ఇచ్చి ఉంటే, ఈ పరిస్థితి రాకుండా చూసేవాళ్లమని ఆయన తెలిపారు.   ఇది ఒక్కసారి కాదు...షారూఖ్ ఒక్కరికే ఇది పరిమితం కాలేదు. భారత మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా దివంగత అబ్దుల్ కలాం విషయంలోనూ అమెరికా ఇలాగే ప్రవర్తించింది. అబ్దుల్ కలాం న్యూయార్క్‌లోని జెఎఫ్‌కె విమానాశ్రయంలో ఎయిరిండియా విమానం ఎక్కి, తన సీట్లో కూర్చున్న తర్వాత సోదా చేశారు ఇమ్మిగ్రేషన్ అధికారులు. కలాం వద్దకు వచ్చి, పేలుడు పదార్ధాలున్నాయేమోనని ఆయన బూట్లు, జాకెట్ అందరిముందు విప్పించారు. సోదా చేసిన తర్వాత ఆయన వస్తువులు ఆయనకు తిరిగి ఇచ్చేశారు. అయితే ఇలాంటి వాటి విషయంలో చూసిచూడనట్టుగా వదిలివేసే కలాం..ఈసారి మాత్రం కాస్త మనస్థాపం చెందారు. ఈ చర్య భారత్‌లో తీవ్ర ప్రకంపనల్ని సృష్టించింది. ప్రతీకార చర్య తీసుకుంటానని ఇండియా ప్రకటించింది. దీంతో దిగివచ్చిన అమెరికా కలాంకు, భారత ప్రభుత్వానికి లిఖిత పూర్వకంగా క్షమాపణలు చెప్పింది. నిజానికి భారతదేశంలోని "బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ చెక్స్" నుంచి మినహాయింపు పొందినవారి జాబితాలో కలాం పేరు ఉన్నా ఆయన్ను తనిఖీ చేయకుండా వదల్లేదు.   భారతీయ ప్రముఖుల్ని అవమానించడం అమెరికాకు కొత్త కాదు. భారత మాజీ ఉపప్రధాని ఎల్‌కే అద్వానీ, జార్జ్ ఫెర్నాండెజ్, కమల్ హాసన్, ఇర్ఫాన్‌ఖాన్‌, ముమ్ముట్టి ఇలా భారతీయ ప్రముఖులంతా తనిఖీలకు గురైనవారే. ఇలాంటివి గతంలో జరిగాయి..ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అగ్రరాజ్యానికి ఇదొక అలవాటుగా మారింది. భారతీయ ప్రముఖుల్ని సోదాపేరుతో అవమానించడం, ఆతర్వాత క్షమాపణ చెప్పడం అమెరికాకు మామూలైపోయింది. అలాగే, అలాంటి సంఘటనలు జరిగినప్పుడు తీవ్రంగా స్పందించి అమెరికాపై కారాలు, మిరియాలు నూరడం, గట్టి చర్య తీసుకుంటాననడం, తర్వాత కొద్ది రోజులకు మరిచిపోవడం మనదేశానికి అలవాటైపోయింది. దీనిని ఇలాగే వదిలేస్తే షారూఖ్‌ఖాన్‌కే మళ్లీ ఇలాంటి అవమానం జరగవచ్చు.