అమెరికాలో రగిలిన "జాతి" విద్వేష జ్వాల..
posted on Jul 9, 2016 @ 11:53AM
అగ్రరాజ్యం అమెరికాలో జాత్యాంహకారం మరోసారి పడగ విప్పింది. నల్లజాతీయులను తెల్ల పోలీసులు పదేపదే కాల్చి చంపడాన్ని నిరసిస్తూ డాలస్‌లో తెల్లజాతి పోలీసులే లక్ష్యంగా తుటాల వర్షం కురిపించారు. ఈ దాడిలో ఐదుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోగా..మరో ఏడుగురు గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. అగ్రరాజ్యాన్ని వణికించిన 9/11 దాడుల తర్వాత..అమెరికాలో పోలీసులు పెద్ద సంఖ్యలో మరణించింది ఈ కాల్పుల్లోనే. అమెరికాలో నల్లజాతి వారిపట్ల తెల్లజాతి పోలీసులు వివక్ష చూపడం అనాదిగా జరుగుతోంది. అయితే ఈ వారంలో జరిగిన రెండు ఘటనలు నల్లజాతి ప్రజల్లో తీవ్ర ఆగ్రహన్ని కలిగించాయి.
బుధవారం మిన్నెసోటాలో ఫిలాండో క్యాజిల్ అనే నల్లజాతీయుడు, ఒక మహిళ, చిన్నారితో కలిసి కారులో వెళుతుండగా ఓ తెల్ల పోలీసు అధికారి కాల్చి చంపాడు. అంతకుముందు రోజు లూసియానాలో ఆల్టన్ స్టెర్లింగ్ అనే నల్లజాతీయుడిని ఇద్దరు శ్వేతజాతి అధికారులు రోడ్డు పక్కన పేవ్‌మెంట్ పైకి ఈడ్చుకెళ్లి, కాళ్లు, చేతులు తొక్కిపట్టేసి గుండెల్లోకి బుల్లెట్లు దింపారు. ఈ రెండు ఘటనలకు సంబంధించిన వీడియోలు బయటికి రావడంతో అమెరికా అంతటా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ క్రమంలోనే డాల్లాస్ వేదికగా గురువారం రాత్రి 7 గంటల సమయంలో 800 మంది "బ్లాక్ లైవ్స్ మేటర్" పేరిట నిరసన ప్రదర్శన నిర్వహించారు.
బెల్‌గార్డెన్ పార్క్ నుంచి ఓల్డ్ రెడ్ కోర్ట్‌హౌస్ దాకా..1963లో అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్.కెన్నడీ హత్య జరిగిన చోటు మీదుగా వారి ప్రదర్శన సాగింది. ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు జరక్కుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది..దాదాపు 100 మంది సాయుధ పోలీసులు ప్రదర్శనతో పాటు సాగారు. ప్రదర్శన అంతా శాంతియుతంగానే సాగింది. అయితే ఎల్‌సెంట్రో కాలేజీ వద్దకు చేరుకునే సరికి స్నైపర్ల మారణ కాండ మొదలైంది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం తుపాకుల మోతతో దద్దరిల్లింది. నిరసనకారులు భయంతో చెల్లాచెదురవ్వగా..వీరికి రక్షణగా ఉన్న పోలీసులు తమ ప్రాణాలను కాపాడుకుంటూనే..కాల్పులు జరిపారు.
ఇంతలో రైఫిల్‌తో ఉన్న ఒక దుండగుడు..పోలీసు వెనగ్గా వెళ్లి పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చి చంపేశాడు. అదే గన్‌మాన్ ఎల్‌సెంట్రో గ్యారేజ్ లోపల దాక్కుని పోలీసులపై కాల్పులు జరిపాడు. కొద్దిసేపు అతనితో చర్చలు జరిపిన అనంతరం పోలీసులు ఒక బాంబు రోబోకు పేలుడు పదార్ధాలు అమర్చి..దుండగుడి వద్దకు పంపి పేల్చివేయడంతో అతను చనిపోయాడు. చనిపోయే ముందు అతడు.. ‘ఈ గ్యారేజ్‌లో, డౌన్‌టౌన్ అంతటా బాంబులు పెట్టాం. మీలో ఇంకా చాలా మందిని చంపుతాం. అంతం సమీపిస్తోంది’ అన్నట్టు డాల్లాస్ పోలీస్ చీఫ్ బ్రౌన్ చెప్పారు. ఘటనకు కారణమైన వారిగా భావిస్తూ మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
అటు కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన సమయంలో ఆయన వార్సాలో ఉన్నారు. పోలీసులపై హేయమైన, కుట్రపూరితమైన దాడి జరిగింది. ఈ విషాద సమయంలో డాల్లాస్ ప్రజలకు, పోలీస్ శాఖకు అండగా ఉంటామని పేర్కొన్నారు. ఇవన్నీ చెదురుమదురుగా జరిగిన ఘటనలు కావు. మన దగ్గర నెలకొన్న వర్ణపరమైన అసమానతలకు నిదర్శనం. ఇది హిస్పానిక్ ఇష్యూ కాదని, ప్రతీ అమెరికన్ ఆలోచించాల్సిన విషయమని..మనిషి చర్మం రంగును బట్టి అతన్ని ట్రీట్ చెయ్యడం చాలా బాధాకరమని ఒబామా ఆవేదన వ్యక్తం చేశారు.