కేంద్రానికి చావుదెబ్బ...
posted on Jul 14, 2016 @ 4:45PM
బీజేపీ సారథ్యంలోని కేంద్రప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బతగిలింది. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించి చేతులు కాల్చుకున్న మోడీ సర్కార్‌కు..సుప్రీంకోర్టు మరోసారి వాతలు పెట్టింది. రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్న ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్‌ను పునరుద్దరించాలని అత్యున్నత న్యాయస్థానం చారిత్రక తీర్పునిచ్చింది. ఆ ప్రభుత్వ పతనానికి కారణమైన గవర్నర్ నిర్ణయాలన్నీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించేవిగా ఉన్నాయని పేర్కొంటూ వాటన్నింటిని రద్దు చేసింది. అసెంబ్లీలో 2015 డిసెంబర్ 15 నాటి స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. దీంతో ఈ ఏడాది జనవరిలో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించడంతో పదవీచ్యుతుడైన నబమ్‌టుకీ తిరిగి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.
అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 60 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ 47 మంది ఎమ్మెల్యేల మద్థతుతో అధికారంలోకి రాగా, నబమ్ టుకీ 2011 నవంబర్ 1న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు..ఆయన సోదరుడు రెబియా స్పీకర్ అయ్యారు. 2014 డిసెంబర్‌లో టుకీ ప్రభుత్వం ఆర్థిక అవతవకలకు పాల్పడుతోందంటూ ఆరోగ్య శాఖ మంత్రి కలిఖోపుల్ ఆరోపణలు చేశారు. దీంతో సీఎం ఆయన్ను మంత్రివర్గం నుంచి తొలగించారు. దీంతో పుల్ తిరుగుబాటుకు దిగారు..పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు పుల్‌ను 2015లో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్‌గా జ్యోతి ప్రసాద్ రాజ్‌కోవా గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించడంతో సంక్షోభం కొత్త మలుపు తిరిగింది. 2016 జనవరి 14న జరగాల్సిన ఆరో విడత అసెంబ్లీ సమావేశాలను డిసెంబర్ 16, 2015నే నిర్వహించాలని గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు.
అదే సమయంలో స్పీకర్ రెబియా 21 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో 14 మందిని అనర్హులుగా ప్రకటించారు. స్పీకర్ ఆదేశాలను 2015 డిసెంబర్ 16న డిప్యూటీ స్పీకర్ రద్దు చేశారు. 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోవన్న స్పీకర్ నిర్ణయం చట్ట వ్యతిరేకమన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో టుకీ సర్కార్ అసెంబ్లీకి తాళం వేసింది. తిరుగుబాటు ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ, స్వతంత్ర ఎమ్మెల్యేలు 33 మంది వేరే భవనంలో భేటీ అయ్యి అసెంబ్లీ నిర్వహించారు. స్పీకర్‌గా రెబియాను తొలగిస్తూ తీర్మానాన్ని ఆమోదించి, కొత్త స్పీకర్‌ను ఎన్నుకున్నారు. తిరిగి 2015 డిసెంబర్ 17 ఓ హోటల్‌లో సమావేశమై పుల్‌ను సీఎంగా ఎన్నుకున్నారు. రాజకీయ సంక్షోభం ముదిరిపాకాన పడటంతో కేంద్రం రంగంలోకి దిగి ఈ ఏడాది జనవరి 26న రాష్ట్రపతి పాలన విధించింది. జనవరి 28న రాష్ట్రపతి పాలనను వ్యతిరేకిస్తూ సీఎం టుకీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫిబ్రవరి 19న రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను ఎత్తివేశారు. అదే నెల 20న కలిఖోపుల్ సీఎంగా ప్రమాణం చేశారు.
టుకీ పిటిషన్‌పై విచారణ నిర్వహించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తాజాగా తీర్పును వెలువరించింది. జస్టిస్ దీపక్‌మిశ్రా, జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ పి.సి.ఘోష్, జస్టిస్ ఎన్.వి.రమణలతో కూడిన ధర్మాసనం 331 పేజీల తీర్పునిచ్చింది. ప్రజాప్రతినిధుల అధికారాన్ని కాదనే అధికారం గవర్నర్‌కు ఉండదు. మంత్రిమండలికి సభ విశ్వాసం ఉన్నంతకాలం..ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి సాయం, సలహాలకు గవర్నర్ బద్ధుడై ఉండాల్సిందే..అధికారంలో ఉన్న ప్రభుత్వం శాసనసభలో మెజారిటీని కోల్పోయినప్పుడు మాత్రమే మంత్రిమండలి సాయం, సలహా లేకుండా గవర్నర్ రాజ్యాంగంలోని 174వ అధికరణ కింద తనకు గల అధికారాన్ని వినియోగించవచ్చు. రాజకీయపార్టీలోని అసమ్మతి, విభేదం, అనైక్యత, అసంతృప్తి, అభిప్రాయబేధాలకు గవర్నర్ దూరంగా ఉండాలి. ఒక రాజకీయ పార్టీలోని కార్యకలాపాలు..ఆ పార్టీ శ్రేణుల మధ్య అలజడి, ఆందోళనల విషయం గవర్నర్‌కు సంబంధం లేని అంశం.
రాష్ట్ర శాసన వ్యవస్థకు తాను స్వతంత్ర న్యాయాధికారిగా వ్యవహరించరాదు. స్పీకర్ విధుల్లో జోక్యం చేసుకునే అధికారం గవర్నర్‌కు లేదు. స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్‌ను తొలగించడంలో గవర్నర్‌కు ఎలాంటి పాత్రా ఉండకూడదని జస్టిస్ ఖేహార్ పేర్కొన్నారు. గవర్నర్‌కు..మంత్రిమండలికి మధ్య సమాచార సంబంధాలు పూర్తిగా విఫలమైనపుడు రాష్ట్రపతి జోక్యం చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇక స్పీకర్ అత్యున్నత స్థాయి రాజ్యాంగహోదాను అనుభవిస్తారు. రాజ్యాంగం స్పీకర్‌పై అపార విశ్వాసం ఉంచుతుంది. ఈ ఒక్క కారణానికే, స్పీకర్ ఉన్నతమైన స్వతంత్ర భావన. రాజ్యాంగంలోని 179(సి) అధికరణ ఉద్దేశ్యం అదేనని గుర్తు చేశారు. సుప్రీం తీర్పుతో కాంగ్రెస్ శ్రేణుల్లో సంతోషంలో మునిగి తేలుతుండగా..బీజేపీకి చావుదెబ్బ తగిలింది. ఈ ఏడాది మేలో ఉత్తరాఖండ్‌లో కేంద్రం విధించిన రాష్ట్రపతి పాలనను ఎత్తేసిన సుప్రీం..బలపరీక్ష జరపాలని ఆదేశించడంతో రావత్ సర్కార్ తిరిగి అధికారంలోకి వచ్చింది.