గుర్రాలను కూడా బతకనివ్వరా!

  ప్రజా ప్రతినిధులు అంటే ప్రజలకు సేవ చేసేవారు అన్న అభిప్రాయం ఏనాడో పోయింది. ప్రజల మీదా, ప్రజల జీవితాల మీదా, ఆఖరికి ప్రకృతి మీదా తమకి ఎనలేని అధికారం ఉందన్న అహంకారం నేటి నేతలది. ఆ అహంకారాన్ని పెంచి పోషించేలా అడుగులకు మడుగులెత్తే అధికారగణం, ఆకాశాన్నెత్తే అనుచరులు ఎలాగూ ఉన్నారు. ఇలాంటి వారు తప్పు చేసినా మన న్యాయవ్యవస్థలు పెద్దగా పట్టించుకోవన్న అపవాదులు ఉండనే ఉన్నాయి. ఇన్ని సానుకూల అంశాలు ప్రోత్సహించడంతో కొందరు నేతలకు పట్టపగ్గాలు లేకుండా పోతోంది. వారి చేతలకి ప్రజలే అడ్డుచెప్పడం లేదు, ఇంక నోరు లేని జీవాలు ఎందుకు ఎదురుతిరుగుతాయి! కానీ ఈసారి కథ వేరేలా ఉండేట్లుంది. ఓ ఎమ్మెల్యే చేతిలో బలైపోయిన శక్తిమాన్‌ అనే గుర్రం గురించి విన్న దేశప్రజలకి ఒళ్లుమండిపోతోంది!   మార్చి 14: ఉత్తరాఖండ్‌ రాజధాని అయిన డెహ్రాడూన్‌లో కొందరు ప్రతిపక్ష సభ్యులు ధర్నాకు దిగారు. ఆ సమయంలో వారిని నిలువరించేందుకు అక్కడ పోలీసు బలగాలు మోహరించాయి. వాటిలో అశ్వికదళం కూడా ఉంది. ధర్నాను అదుపుచేయడానికి వచ్చిన పోలీసులను చూసేసరికి గణేష్ జోషి అనే బీజేపీ ఎమ్మెల్యేగారికి చెప్పలేనంత కోపం వచ్చింది. అందులోనూ సదరు పోలీసులు గుర్రాల మీద వచ్చేసరికి ఆయన అహం దెబ్బతిన్నట్లుంది. వెంటనే లాఠీ తీసుకుని శక్తిమాన్‌ అనే ఓ గుర్రం మీద తన ప్రతాపమంతా చూపారు. ఎమ్మెల్యే ఒకో దెబ్బా వేస్తున్నా గుర్రం వెనుకడుగు వేస్తూ వచ్చింది. దాంతో గణేష్ జోషి మరింత రెచ్చిపోయి లాఠీకి పని చెప్పాడు. గణేష్ ఉత్సాహానికి ఆ గుర్రం కాలు ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది. అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.   గుర్రం కాలు విరిగిన వార్త దేశమంతటా హల్‌చల్‌ చేయడంతో జోషిగారు నీళ్లు నమలడం మొదలుపెట్టారు. తాను ఊరికనే గుర్రాన్ని అలా అదిలించాననీ, బహుశా గుర్రం కాలుకి వేరే ఎక్కడో దెబ్బతినడంతో, పోలీసులు తన మీద అక్రమంగా కేసు బనాయించారనీ చెప్పుకొచ్చారు. కానీ జోషీగారి ప్రతాపాన్ని చూపే వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేయడంతో, ఆయన మీద చర్యలు తీసుకునేందుకు కావల్సినన్ని ఆధారాలు దొరికినట్లైంది. పైగా బీజేపీ మంత్రి మేనకా గాంధి వంటి వారు కూడా జోషి తీరుని ఖండించడంతో, ఆయన మీద అభియోగం మోపక తప్పలేదు పోలీసులకి. ఎట్టకేలకు సంఘటన జరిగిన అయిదు రోజులకు పోలీసులు జోషిని అరెస్టు చేయగలిగారు. అప్పుడు కూడా ఆ రాష్ట్ర బీజేపీ ఆయనను వెనకేసుకు వచ్చే ప్రయత్నం చేసింది. పోలీసులు జోషిని కిడ్నాప్‌ చేశారంటూ మండిపడింది. రాష్ట్రంలో ఉన్న రాజకీయ అనిశ్చితి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంటోందని ఆరోపించింది. జోషి మీద సహా ఆ రోజు నిరసనకు సంబంధించి, పోలీసులు పెట్టిన కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్‌ చేసింది.   జోషి సంగతి అలా ఉంటే ఇటు శక్తిమాన్‌ పరిస్థితి నానాటికీ క్షీణించడం మొదలుపెట్టింది. గుర్రం కాలు బాగుపడటం అంటే మనిషి కాలు బాగుపడినంత తేలిక కాదు. ఎందుకంటే వాటి కాళ్ల నిర్మాణం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. అవి చురుగ్గా, తేలికగా పరుగులెత్తేందుకు అనుగుణంగా తీర్చిదిద్దబడి ఉంటాయి. వాటిలో ఏ ఒక్క ఎముక బీటవారినా గుర్రం తిరిగి కోలుకోవడం దాదాపు అసాధ్యమవుతుంది. ఆ గుర్రం కాలు తీసివేసి కృత్రిమ అవయవాన్ని అందించాల్సి ఉంటుంది. అప్పుడు కూడా గుర్రం కోలుకుంటుందని చెప్పలేము. ఒకవేళ కోలుకున్నా అది తిరిగి పరుగులెత్తే స్థితిలో అసలే ఉండదు. పైగా ఇదంతా కూడా ఆ జీవి శరీరానికి చాలా అసౌకర్యాన్నీ, బాధనీ కలిగిస్తుంది. అందుకే చాలామంది తమ పెంపుడు గుర్రాల కాళ్లకు దెబ్బ తగిలితే వాటి జీవితాన్ని ముగించేస్తారు. ఒకరకంగా చెప్పాలంగే గుర్రానికి కాలు పోతే దాని ప్రాణం పోయినట్లే! అయినా కూడా శక్తిమాన్‌ను ఎలాగొలా కాపాడుకోవాలని తాపత్రయపడింది ఆ రాష్ట్ర పోలీసు శాఖ. జోషి దాడికి గాయపడిన శక్తిమాన్‌ వెనుక కాలుని తీసివేసినా, ఆ స్థానంలో కృత్రిమ కాలుని అమెరికా నుంచి తెప్పించింది. ఇంత జరుగుతున్నా శక్తిమాన్‌ ఎంతవరకూ కోలుకుంటుందా అని దేశ ప్రజలంతా ఆందోళన చెందడం మొదలుపెట్టారు. ఎందుకంటే శక్తిమాన్ బరువు 400 కిలోలకు పైమాటే ఉంటుంది. అంత బరువుని కృత్రిమ అవయవం ఎంతవరకూ మోయగలదన్నది మొదటి సమస్య! ఇక దాని కాళ్లను సరిదిద్దేందుకు మరిన్ని శస్త్రచికిత్సలు అవసరం కావడంతో, వాటిని శక్తిమాన్‌ ఎంతవరకు తట్టుకుంటుందన్నది రెండో సమస్య! భయపడినట్లుగానే నిన్న శక్తిమాన్‌ ఓ శస్త్రచికిత్స సమయంలో మత్తుమందుని తట్టుకోలేక మరణించింది.   శక్తిమాన్ చనిపోయాక కూడా పాపం ఆ గుర్రాన్ని వదల్లేదు రాజకీయ నాయకులు. బీజేపీ ఎమ్మెల్యే చేతిలో దెబ్బతిన్నది కాబట్టి బీజేపీనే గుర్రం చావుకు కారణం అంటూ కాంగ్రెస్‌ విరుచుకుపడింది. మరోవైపు బీజేపీ నేతలేమో, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం తమను ఇరికించేందుకేందుకు శక్తిమాన్‌ ఆరోగ్యం మీద తగిన శ్రద్ధ చూపలేదని అంటోంది. కేంద్ర మంత్రి మేనక గాంధి మాత్రం పార్టీలకు అతీతంగా ప్రతిస్పందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసు శాఖలో గుర్రాల అవసరం లేదన్నారు మేనకగాంధి. వాటిని హింసిస్తూ, ఇబ్బందుల పాల్చేయడం మానుకోవాలని సూచించారు. అంతేకాదు! శక్తిమాన్‌ పోలీసు శాఖలో విధులను నిర్వహిస్తోంది కాబట్టి, ఒక పోలీసు ఆఫీసరుని చంపిన అభియోగం కింద సదరు ఎమ్మెల్యేను విచారించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌ వినడానికి సబబుగానే ఉన్నా, అది ఎంతవరకు ఆచరణసాధ్యమో చెప్పలేం. ప్రస్తుతానికి మాత్రం IPC సెక్షన్‌ 429 కింద మాత్రమే జోషి కేసుని ఎదుర్కొంటున్నారు. ఈ చట్టం కింది ఆయనకు మహా అయితే ఐదేళ్ల జైలు శిక్ష పడుతుంది. కానీ జంతువులకు సంబంధించిన చట్టాలు పరమ బలహీనంగా ఉన్న మన దేశంలో ఈ శిక్షే చాలా ఎక్కువని సంబరపడక తప్పదు. ఎందుకంటే సాధారణంగా జంతువుల మీద ఎవరన్నా అకృత్యాలకు పాల్పడినప్పుడు వారి మీద ‘జంతు హింస వ్యతిరేక చట్టం – 1960’ కింద కేవలం 10 నుంచి 50 రూపాయలు చెల్లించి దర్జాగా తప్పించుకోవచ్చు!   ఆపదలో ఆదుకునేవారికి సాయపడే సూపర్‌ హీరో పేరే శక్తిమాన్‌! ఆ పాత్ర పేరు మీదుగానే ఈ గుర్రానికి శక్తిమాన్ అని ముద్దుగా పిలుచుకోసాగారు ఉత్తరాఖండ్‌ పోలీసులు. పదేళ్లుగా ఉత్తరాఖండ్‌ ప్రజలను రక్షిస్తున్న ఈ శక్తిమాన్‌ తమను ఆపద నుంచి గట్టెక్కిస్తోందనుకుని మురిసిపోయారు. కానీ ఈ శక్తిమాన్‌ ఓడిపోయింది. మన ప్రజాప్రతినిధుల ముందు ఈ శక్తిమాన్‌ నిలబడలేకపోయింది. కుప్పకూలిపోయింది. నేతలా మజాకా!

పీ.ఎఫ్‌ జోలికి ఎందుకు!

  వేసవిలోనూ చల్లగా ఉండే బెంగళూరు నిన్న ఒక్కసారిగా మండిపడింది. పీ.ఎఫ్ విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కార్మికులంతా రోడ్డు మీదకు వచ్చారు. ఈ విషయంలో సంబంధిత మంత్రి బండారు దత్తాత్రేయ ఆగమేఘాల మీద జోక్యం చేసుకుని కార్మికులకు తగిన పరిష్కారాన్ని చూపడంతో సమస్య సద్దుమణిగిపోయింది. కానీ కార్మికుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రభుత్వానికి ఒక్కసారిగా తెలిసివచ్చింది. ప్రభుత్వం ప్రావిండెంట్‌ ఫండ్‌ మీదే మాటిమాటికీ ఎందుకు తన దృష్టి పెడుతోందన్నదే ఆసక్తికరమైన విషయం!   నిబంధనల ప్రకారం 20మంది కంటే ఎక్కువమంది ఉద్యోగులు పనిచేస్తున్న సంస్థల్లో ఉద్యోగి మూలవేతనం నుంచి 12 శాతాన్ని ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతాకు మళ్లిస్తారు. అదే మొత్తంలో యజమాని కూడా భవిష్య నిధికి తన వంతు నిధులను అందించాల్సి ఉంటుంది. ఉద్యోగి పదవీవిరమణ లేదా రాజినామా చేసిన పక్షంలో తన జీతం నుంచి సమకూరిన 12 శాతం, యజమాని అందించిన సొమ్ములోంచి 3.67 వెరసి 15.67 శాతాన్ని, దాని మీద వడ్డీని పొందే అవకాశం ఉంది. పీ.ఎఫ్‌ ఉపసంహరణకు సంబంధించిన తేనెతుట్టుని మొదట ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ తన బడ్జెట్‌ ప్రసంగంలో కదిపారు. పీ.ఎఫ్‌ సొమ్ముని ఉపసంహరించుకునే సమయంలో 40 శాతం సొమ్ము మీద పన్ను రాయితీ అందిస్తున్నట్లు ఘనంగా ప్రకటించారు. ఆ ప్రకటనను మొదటిసారి విన్న మధ్యతరగతి జీవులు తమకు మరో పన్ను రాయితీ వచ్చిందనుకుని మురిసిపోయారు. ఆ తరువాత కాసేపటికి కానీ వాళ్లకి అర్థం కాలేదు... ఇప్పటి వరకూ అసలు పీ.ఎఫ్‌ సొమ్ముల మీద పన్నులే లేవనీ, ఇక నుంచి అందులోని 60 శాతం మీద పన్ను బాదుడు ఉండబోతోందని! దాంతో ఒక్కసారిగా వేతన జీవుల నుంచి ఒక్కసారిగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆ నిరసనకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం, రోజుకో వాదన వినిపించడం మొదలుపెట్టింది. పన్ను కేవలం యజమాని భాగమైన నిధి మీదే అని ఓసారి, దీర్ఘకాలిక ప్రభుత్వ పథకాలలో పెట్టుబడి పెడితే పన్ను ఉండదని మరోసారి వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించింది. కానీ మధ్య తరగతి ఆవేశం ముందు ఆర్థికమంత్రి అతిచాతుర్యం పనికిరాలేదు.   త్వరలో అయిదు రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇలాంటి చర్యలు మొదటికే మోసాన్ని తెస్తాయని గ్రహించిన కేంద్రం, పూర్వపు స్థితే కొనసాగుతుందంటూ వెనక్కి తగ్గింది. కానీ బడ్జెట్‌ ముగిసిన కొద్దిరోజులకే పీ.ఎఫ్‌ని మరో విధంగా అదుపు చేసేందుకు ప్రయత్నించడం మొదలుపెట్టింది. ఉద్యోగి రాజినామా చేస్తే, తన వంతు పీ.ఎఫ్‌ను మాత్రమే ఉపసంహరించుకోవచ్చనీ, మిగతా మొత్తం 58 ఏళ్లు వచ్చిన తరువాతే లభిస్తుందనీ నిబంధన విధించింది. అదుగో ఆ నిబంధన మీదే నిన్న బెంగళూరు భగ్గుమంది. బెంగళూరులో సాగుతున్న కార్మికుల నిరసన హింసాత్మకంగా మారడంతో, ఈ నిబంధనను ఆదరాబాదరాగా వెనక్కి తీసుకున్నారు.   కేంద్ర ప్రభుత్వం చీటికీ మాటికీ పీ.ఎఫ్‌ని అదుపుచేసేందుకు ఎందుకు ప్రయత్నిస్తోందన్న అనుమానం ఇప్పుడిక కలగక మానదు. భవిష్య నిధి నిజంగా భవిష్యత్తు కోసం అక్కరకు రావాలనీ, ఉద్యోగి జీవిత చరమాంకంలో అది ఉపయోగపడాలనీ... అందుకే తాము ఇలాంటి చర్యలను తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ వాస్తవాలను పరిశీలిస్తే ప్రభుత్వ నిర్ణయాల వెనుక మరో కారణం ఏదన్నా ఉందేమో అన్న అనుమానం కలుగక మానదు. ప్రస్తుత మోదీ ప్రభుత్వం మౌలిక వసతుల మీదా, పేదల సంక్షేమం మీదా, వ్యవసాయం మీదా అధిక ప్రాధాన్యతను ఇస్తోందన్న విషయం తెలిసిందే. ఇందుకోసం లక్షల కోట్లు అవసరం అవుతాయి. ఈ లక్షల కోట్లను సేకరించేందుకు ప్రభుత్వం విస్తృత స్థాయిలో రుణాలను సేకరించాల్సి ఉంటుంది. ప్రభుత్వ బ్యాంకులేమో ఈ రుణాలను అందించే పరిస్థితుల్లో లేవు. బాండ్ల ద్వారా సేకరించగలిగే సొమ్మూ అంతంత మాత్రంగానే ఉంటుంది.   ఇలాంటి సమయంలో పీ.ఎఫ్ నిధులను కనుక నిలువరించగలిగితే లక్షల కోట్లు ప్రభుత్వం వద్దకి చేరుకునే అవకాశం ఉంటుంది. అందుకే పీ.ఎఫ్‌ ఉపసంహరణ మీద పన్ను విధించి, ఆ పన్ను నుంచి తప్పించుకోవాలంటే ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెట్టుకోండి అంటూ ఓ రాయి విసిరి చూశారు ఆర్థిక మంత్రి. ఆ మంత్రం పారకపోవడంతో ఉపసంహరణ మీద పరిమితులు విధించారు. తద్వారా పీ.ఎఫ్‌ ఖాతాలో ఉండే సొమ్ము పది లక్షల కోట్లను దాటిపోయే అవకాశం వస్తుంది. ఆ సొమ్ములను ఎలాగూ ప్రభుత్వ బాండ్లలోనే పెట్టుబడి పెడుతుంది. పైగా ఈ సొమ్ములను స్టాక్‌ మార్కెట్‌లో కూడా పెట్టుబడి పెట్టే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. తద్వారా మంచి లాభాలను సాధించి మరిన్ని సంక్షేమ పథకాలను చేపట్టాలన్నది ప్రభుత్వ ఆలోచన కావచ్చు.   ఉన్నవాడి నుంచి కొంత తీసుకుని లేనివాడికి ఇవ్వడం ఓ ధర్మం. కానీ మన ప్రభుత్వాలు సాధారణంగా ఉన్నవాడి జోలికి పోవు. కోట్లకు కోట్లుగా తరాల కొద్దీ పోగైన వారి నిధులను ముట్టుకోవు. ఒకవేళ నల్లధనాన్ని వెలికితీస్తామంటూ వాగ్దానాలు చేసినా, అవన్నీ మాటలకే పరిమితం అవుతూ ఉంటాయి. వాళ్లు చేసిన పన్ను ఎగవేతను కూడా చాలా సగౌరవంగా వెనక్కి తీసుకునే ప్రయత్నాలు చేస్తాయి. ఎందుకంటే ఉన్నవాడు కళ్లెర్ర చేస్తే ప్రభుత్వాలకు కష్టమని మన నేతలకు తెలుసు. అలాగని లేనివాడికీ పెట్టక తప్పదు. ఓట్ల కోసమో, సంక్షేమ రాజ్యం అన్న పేరు కోసమో వాళ్లకి ఏదో ఓ రూపంలో సాయాన్ని అందిస్తూ ఉంటాయి   ప్రభుత్వాలు. పేదల్ని ఉద్ధరించడం అంటే వాళ్లకి తగిన జీవనోపాధి కల్పించడం కాదనీ, వాళ్లని ఎప్పటికప్పుడ ప్రభుత్వాల మీద ఆధారపడేలా చేయడం అని అనాదిగా ప్రభుత్వాలు చేస్తున్న ఆలోచన. ఇలాంటి సమయాలలో ప్రభుత్వాలకి మిగిలిన ఒకే ఒక్క జీవి మధ్యతరగతి మనిషి. వాళ్ల మీద ఎన్ని పన్నులు వేసినా, ఆ పన్నులను ఎంతగా ముక్కుపిండి వసూలు చేసినా సహించి ఊరుకుంటారే కానీ తిరగబడరన్నది ప్రభుత్వాల నమ్మకం. కానీ సందర్భం వస్తే దేశానికి వెన్నుగా నిలిచే మధ్యతరగతి మనిషి కూడా తిరగబడతాడన్నది చరిత్ర చెబుతోంది. వారిలో ముఖ్యమైన కార్మిక వర్గం కళ్లెర్ర చేస్తే ప్రభుత్వాలే కూలిపోతాయని గతం హెచ్చరిస్తోంది. ఈ విషయం బహుశా ఈపాటికి కేంద్ర ప్రభుత్వానికి అర్థమై ఉంటుంది. అర్థం కాకపోతే నిన్న బెంగళూరులో కనిపించిన నిరసన దేశవ్యాప్తంగా పెల్లుబికే ప్రమాదం ఉంది.

సెలవలు సరే... మరి ఆటలో!

  సంస్కృతి అంటే కేవలం కట్టూబొట్టూ కాదు. కట్టడాలూ కాదు. మన భాష, జీవనశైలి, పెద్దలు నేర్పిన సంస్కారం... అన్నీ సంస్కృతి కిందకే వస్తాయి. వీటిలో మన సంప్రదాయిక ఆటలు కూడా ఉన్నాయన్న విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదేమో! బహుశా అందుకనే కావచ్చు. ఈ ఏడాది యునేస్కో ప్రపంచ వారసత్వ సంపద కింద ప్రాచీన ఆటలను కూడా పరిరక్షించుకోవాలంటూ పిలుపునిచ్చింది. ఇష్టంగా ఆడుకోవాల్సిన ఆటలను పరిరక్షించుకోవాలని పిలుపునివ్వాల్సి రావడం చాలా దురదృష్టకరం కదా!   1990వ దశాబ్దం తరువాత వచ్చిన ప్రపంచీకరణ ఒక్కసారిగా భారతదేశ పునాదులను కదిలించివేసింది. శరవేగంగా మారిపోతున్న జీవనశైలికి అనుగుణంగా తెలుగువాడు త్వరగానే అలవాటుపడిపోయాడు. దేశంలో ఎక్కడా లేనంత చురుగ్గా ఇక్కడి విద్య, వైద్యం కార్పొరేట్ స్థాయికి చేరుకున్నాయి. ర్యాంకులను సాధించేవారిలో, ఉన్నత చదువులను చదివేవారిలో, అమెరికాకు రెక్కలు కట్టుకునేవారిలో తెలుగువారే ఎక్కువగా ఉండటమే దీనికి సాక్ష్యం. కానీ భౌతికంగా ఎదుగుతున్న మనం ఏం కోల్పోతున్నామో గ్రహించలేకపోయాము. ప్రభుత్వ పాఠశాలలకు విలువలేకుండా పోయింది. ఆటలన్నా, కథల పుస్తకాలన్నా కాలాన్ని వృథా చేసుకోవడం అన్న అభిప్రాయానికి తెలుగు సమాజం వచ్చేసింది. మనం బట్టీలు పట్టే యంత్రాలుగా మారేందుకు సిద్ధపడ్డామే కానీ... ఆలోచించే, స్పందించే, ప్రతిస్పందించే వ్యక్తులుగా ఎదిగేందుకు అంతగా మొగ్గు చూపలేదు. ఈ ప్రహసనంలో ఆటలకు, ఆ మాటకు వస్తే సంప్రదాయిక ఆటలకు దూరం కావడం వల్ల మనం ఏం కోల్పోతున్నామో ఒక్కసారి ఊహించేందుకు ప్రయత్నిద్దాం.     పిల్లవాడి ఎదుగుదలలో అ,ఆలు నేర్చుకోవడం ఎంత అవసరమో, ఆటలు కూడా అంతే అవసరం. కానీ దురదృష్టం ఏమిటంటే కిండర్‌గార్టెన్ బడులలో కూడా ఆటస్థలాలు కనిపించడం లేదు. ప్రతి పాఠశాలకీ కనీసం ఆటస్థలం ఉండాలనీ, వారిని ఆడించేందుకు కొన్ని ప్రత్యేకమైన తరగతులు ఉండాలని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ.... అలాంటి వసతులు లేకుండానే వేలాది పాఠశాలలు పనిచేసుకుంటూ పోతున్నాయి. ఆటస్థలాల సంగతి దేముడెరుగు, అసలు పరిగెత్తేంతటి ప్రాంగణం కూడా లేకుండా బడులు సాగుతున్నాయి. పోనీ ఇండోర్‌ గేమ్స్‌కి అయినా ప్రాధాన్యత ఉంటుందా అంటే... వెన్ను విరిచే సిలబస్‌ మీద పాఠశాలు దృష్టి పెడుతున్నాయే కానీ, ఆటలాడమని వెన్ను తట్టి ప్రోత్సహించడం లేదు.   ఇది కేవలం ప్రాథమిక పాఠశాలల దుస్థితి మాత్రమే. పిల్లలు ఆరు, ఏడు తరగతులకు రాగానే చదువుని రుబ్బడం, రుద్దడం మొదలవుతోంది. పిల్లవాడిలో ఏమాత్రం ఓపిక మిగిలి ఉన్నా ఐఐటీ అనో, ప్రత్యేక ప్రాజెక్టులనో... చాకిరేవు చాకిరీ చేయిస్తారు. ఇక ఇప్పటి కాలేజీలను చూస్తే వాటి బయట ఉండే బ్యానర్ల బట్టి తప్ప అవి కాలేజీలో అపార్టుమెంట్లో అర్థం కాని పరిస్థితి. అలాంటి చోట ఆటల గురించి మాట్లాడినా వింతగా చూస్తారు. వెరసి పిల్లవాడు మానసికంగా, శారీరకంగా ఎదుగుతున్నాడా లేదా అన్నది ఎవరికీ పట్టడం లేదు. అతని మెదడు ద్వారా ఎన్ని మార్కులను సాధించగలం అన్నదే ఇప్పటి ప్రాధాన్యత. ఈ రకంగా బడిలో చితికిపోయే పిల్లవాడు ఇంటికి వచ్చిన తరువాత కాసేపు ఆడుకోవాలనుకోవడం సహజం. కానీ ఇంట్లో ఎక్కడ సుఖపడిపోతాడో అని అక్కడ కూడా అతణ్ని చదువు వెంబడిస్తూనే వస్తోంది. హోంవర్కుల పేరిట, ప్రాజెక్టుల పేరిట అతని సమయాన్ని హరించివేస్తోంది. వెరసి ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు పిల్లవాడికి చదువే లోకంగా మారుతోంది.   మార్కుల వెంపర్లాటలో పడి అటు ఉపాధ్యాయులు, ఇటు తల్లిదండ్రులు ఆటల వల్ల పిల్లలకు కలిగే ప్రయోజనం గురించి అంతగా ఆలోచిస్తున్నట్లు లేదు. ఆట అనేది కేవలం ఒక కాలక్షేపం కాదు. అది ఒక వ్యాయామం. ఒక జీవన నైపుణ్యం. పిల్లలు ఆడుకుంటూనే చాలా విషయాలు నేర్చకుంటారు. వారిలో నాయకత్వ లక్షణాలు, ఇచ్చి పుచ్చుకునే ధోరణి, గెలుపోటములను స్వీకరించే తత్వం, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, చొరవ... లాంటి సవాలక్ష సానుకూల దృక్పథాలు ఆటలతో అలవడతాయి. ఆటలు ఆడటం వల్ల కండరాలు, ఎముకలు ఎలాగూ బలపడతాయి. ఊపిరితిత్తులు, గుండె కూడా దృఢంగా మారతాయి. వెన్ను గట్టిపడుతుంది. ఇంద్రియాలు మరింత చురుగ్గా మారతాయి. ఇలా ఆట మీద దృష్టి పెట్టడం వల్ల శరీరం ఎలాగూ దృఢంగా మారుతుంది. మానసిక ఒత్తిడి కూడా దూరమవుతుంది. చాలా సందర్భాలలో ఆత్మన్యూనత, క్రుంగుబాటు వంటి మానసిక సమస్యలకు ఆటలను ఓ పరిష్కారంగా చూపుతారు వైద్యులు.   పిల్లలు ఈ ఆటల రంధిలో పడితే ఎక్కడ పాడయిపోతాడో అని భయపడిపోతున్న తత్వం ప్రస్తుత తరానిది. ఎవరితో కలిసి ఆడుకుంటున్నాడో, ఎలాంటి అలవాట్లు చేసుకుంటాడో, చదువు పాడైపోతుందేమో, కాలం వృథా అయిపోతుందేమో, దెబ్బలు తగుల్తాయి కదా... అంటూ సవాలక్ష అనుమానాలను పోషించుకుంటూ పిల్లలను సుకుమారులుగా తీర్చిదిద్దుతున్నారు. ఫలితం! జ్ఞానం పెంచాల్సిన చదువు ఇప్పటి పిల్లల్లో నైరాశ్యాన్ని నింపుతోంది. చదువు ముగిసి జీవితంలోకి అడుగుపెట్టే సమయానికి వారు మానసికంగా బలహీనంగా తయారవుతున్నారు. ఎలాంటి అలసటా ఎరుగని వారి శరీరాలలో నానా రోగాలు ఎలాగూ తిష్ట వేసుకుంటున్నాయి. చిన్నపాటి సమస్యలను కూడా బెంబేలెత్తి ఆత్మహత్యలకు పాల్పడేంత సున్నితంగా మారిపోతున్నారు.   కేవలం బయట నలుగురితో ఆడే ఆటల పరిస్థితే కాదు! నాలుగు గోడల మధ్యా ఆడుకునే ఆటలూ ఇప్పుడు కరువైపోయాయి. ఒకప్పుడు ఇంట్లో ఆడుకునే ఆటలు కూడా మేధస్సునీ, సంప్రదాయాన్నీ పెంపొందించేలా ఉండేవి. కాళ్లాగజ్జీ కంకాలమ్మ వంటి ఆటపాటల్లో ఆయుర్వేద విజ్ఞానం ఉంది. చదరంగంలో జీవితానికి సరిపడా చాతుర్యం ఉంది. కానీ ఇప్పటి పిల్లల చేతుల్లో వీడియో గేమ్స్‌, కళ్ల ముందు కార్టూన్‌ ఛానల్సే మెదుల్తున్నాయి. వీటి వల్ల పిల్లల అవయవాల మధ్య సమన్వయ లోపం ఏర్పడుతుందనీ, చిన్నప్పుడే వారు ఊబకాయం వంటి అనారోగ్యానికి గురవుతారని వైద్యులు హెచ్చరిస్తున్నా ఎవరూ పెద్దగా పట్టించుకుంటున్న పాపాన పోవడం లేదు. భాష, సంభాషణ, భావ వ్యక్తీకరణ అలవడేందుకు తల్లిదండ్రులు పిల్లలతో కలిసి చిన్నా చితకా ఆటలు ఆడుకోవాలని నిపుణులు చెబుతున్నా ఆ మాటలు గాల్లో కలిసిపోతున్నాయి.   ఇప్పటికైనా సమయం మించిపోయింది లేదు! ఈ సెలవుల సమయంలోనైనా కాస్త నీడపట్టున పిల్లలు కావల్సినన్ని ఆటలు ఆడుకునేలా పెద్దలు ప్రోత్సహించాలి. ఇంట్లోనూ వారితో కాస్త సమయాన్ని గడుపుతూ, చిన్న చిన్న ఆటలను నేర్పించాలి. భేషజాలను కాసేపు పక్కన పెట్టి పిల్లలతో కలిసి ఆడితే కలిగే సంతోషమే వేరు. అందుకే అన్నారు, ఆటలకు వయసుతో సంబంధం లేదని. ఇప్పటికైనా మన పిల్లలను ఆటల వైపు దృష్టి మళ్లిద్దాం. వీలైతే మనమూ ఆటలాడేందుకు ఓ అడుగు ముందుకేద్దాం! డబ్బు పోతే సంపాదించుకోవచ్చు. కెరీర్‌లో వెనక్కి తగ్గితే తిరిగి కష్టపడవచ్చు. కానీ జీవితంలో సంతోషమూ, ఆరోగ్యమూ పోతే ఇక ఆ బ్రతుకుకి విలువేముంది. ఆ సంతోషం, ఆరోగ్యాల కోసమైనా ఆటల మీద దృష్టి పెడదాం బాస్‌!

ప్రపంచంలో వారసత్వ దినోత్సవం... మరి మనం!

  మనుషులకు వారసత్వాలుగా ఇళ్లూ, స్థలాలూ దొరుకుతాయి. ఇంకా కావాలంటే ఇంటిపేర్లూ, వంశ చరిత్రలూ లభిస్తాయి. కానీ అంతకంటే ఘనమైనది సమాజానికి దొరికే వారసత్వం. అది మన సంస్కృతిలో ఉంటుంది. ఆ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాలలో ఉంటుంది. మరి ఆ కట్టడాల గురించి మనకి ఉన్న శ్రద్ధ ఎంత అంటేమాత్రం తెల్లమొగం వేయక తప్పదు.   భారతీయులకు తమ ఇతిహాసాల మీద ఉన్న శ్రద్ధ చరిత్ర మీద లేదనీ, వ్యక్తిగత ఆస్తులను పెంచుకోవడంలో చూపే ఆసక్తి వారసత్వ కట్టడాల మీద ఉండదనీ ఓ విమర్శ. ఇందుకు తెలుగువారు మినహాయింపు కాదు అని చెప్పేందుకు కావల్సినన్ని ఉదాహరణలే ఉన్నాయి. ఒకానొక సమయంలో ప్రపంచానికంతటికీ బౌద్ధ కేంద్రంగా నిలిచిన అమరావతి స్తూపాన్ని చితక్కొట్టిన చరిత్ర మనది. అలాగని దేవాలయాలనన్నా మనం కాపాడుకున్నామా అంటే అదీ లేదు. తెలుగునాట వందల ఏళ్లనాటి దేవాలయాలు కూడా పాడుబడిపోయి కనిపిస్తాయి. గుడికి ప్రశాంతత కోసమో, శిల్ప సంపదను చూడటం కోసమో, దైవభక్తితోనో కాకుండా... కేవలం ఫలితం కోసమే వెళ్లే రోజులు కదా ఇవి! ఒకప్పుడు పుణ్యక్షేత్రాల సందర్శనలో ఆరాధనతో పాటు అనుభూతి కూడా భాగంగా ఉండేది. ఇప్పుడు ఆరాధనతో పాటు ఆటవిడుపు మాత్రమే తోడవుతోంది.   దేవాలయాలు సహా వారసత్వ కట్టడాలను పరిరక్షించుకోవడంలో తమిళతంబిలు, మహారాష్ట్ర వాసులు మనకంటే జాగ్రత్తగానే ఉన్నారు.  ఆ జాగ్రత్తే కనుక లేకపోతే రెండువేల సంవత్సరాల పురాతనమైన అజంతా బొమ్మలు ఎప్పుడో చెరిగిపోయి ఉండేవి, మహాబలిపురంలోని రాతి కట్టడాలు ముక్కలై సముద్రంలో కలిసిపోయి ఉండేవి. వారసత్వ కట్టడాలను రక్షించుకోవడం ఒక ఎత్తైతే, వాటిని పర్యటక ప్రదేశాలుగా మలచుకోవడం మరో ఎత్తు. ఈ రెండింటిలోనూ తెలుగునాట ప్రభుత్వాలు విఫలమయ్యాయి కాబట్టే యునెస్కో గుర్తించిన 1031 ప్రదేశాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో లేదు. అమరావతి స్తూపం నుంచి అలంపురం ఆలయాల వరకూ ఘనంగా చెప్పుకునే కట్టడాలేవీ యునెస్కో జాబితాలో కనిపించవు. నిజాం నవాబుల కట్టడాలు, కాకతీయుల చిహ్నాలను ఈ జాబితాలో చేర్చే అవకాశం ఉందని చెబుతున్నా, ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం తీవ్రమైన లాబీయింగ్‌ చేయల్సి ఉంటుంది. ఎందుకంటే తమిళనాట బృహదీశ్వరాలయం, పంజాబు గోల్డెన్ టెంపుల్‌ వంటి కట్టడాలెన్నో ఈ జాబితాలో చేరేందుకు పోటీపడుతున్నాయి మరి!   ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారసత్వ ప్రదేశాల మీద ప్రజల్లో అవగాహన కలిగించేందుకు 1983 నుంచి యునెస్కో ‘ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని’ నిర్వహిస్తోంది. అయితే ఈ ఒక్క రోజు అవగాహన కల్పిస్తే సరిపోని నిర్లక్ష్యం మనది. తెలుగునాట ఏ గ్రామాన్ని చూసినా ఏదో ఒక చరిత్ర వినిపిస్తుంది, ఏదో ఒక కట్టడం శిథిలమై కనిపిస్తుంది. కానీ వాటిని నమోదు చేసే ప్రక్రియ కానీ, పరిరక్షించే క్రియ కానీ ఏదీ కనిపించదు. కొన్నాళ్లకి ఆ చరిత్ర నాశనం అయిపోతుందని తెలిసినా పట్టించుకోనంత నిర్లక్ష్యం మనది. మహా అయితే భారతీయ పురావస్తు శాఖ వారు సదరు కట్టడాల వద్ద ఓ బోర్డుని పెట్టి, ఓ కంచెని వేసి, ఓ ఉద్యోగిని నియమించి చేతులు దులుపుకుంటారు. మన ఊళ్లోనే ఉందికదా, చూసివద్దాం అని ఎవరన్నా సంప్రదాయం తప్పి సదరు స్థలానికి చేరుకుంటే అక్కడి చరిత్ర గురించి తెలుసుకునే అవకాశం ఉండదు. ఎవరో ఒకరు పూనుకుని పునరుద్ధరిస్తే తప్ప కాలగర్భంలో కలిసిపోయేందుకు సిద్ధంగా ఉన్న కట్టడాలు మరెన్నో. అలంపురం ఆలయాలు నదీగర్భంలో మునిగిపోకుండా ఉద్యమాన్ని సాగించిన గడియారం రామకృష్ణ శర్మ వంటి వారు ప్రతి ఊళ్లో ఉండరు కదా!   ఇప్పుడు ఎలాగూ తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయారు. తమ అస్తిత్వం గురించీ, ఘనమైన వారసత్వం గురించీ గుర్తించడం మొదలుపెట్టారు. తెలంగాణలో కాకతీయులనీ, ఆంధ్రలో అమరావతినీ పదే పదే తల్చుకుంటున్నారు. ఇలాంటి సమయంలో అయినా తమ చరిత్రనీ, ఆ చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లనీ రక్షించుకునేందుకు తగిన ప్రయత్నాలు చేస్తారని ఆశిద్దాము. లేకపోతే హైదరాబాదు సంస్కృతికి చార్మినారు కాదు, హైటెక్‌ సిటీ గుర్తుగా నిలుస్తుంది. బహుశా ఇప్పటికే ఆ పరిస్థితి వచ్చేసిందేమో!   చివరగా మరో మాట! ఈసారి ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ప్రాచీన క్రీడలు కూడా మన ఘనవారసత్వంలో ఓ భాగమేనంటూ యునెస్కో పేర్కొంది. ఈసారి వారసత్వ దినోత్సవాన్ని క్రీడలకు అంకితం చేసింది. కానీ ప్రపంచీకరణ మోజులో పడిపోయిన మన జనం ప్రాచీన క్రీడల విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో తల్చుకోవాలంటే... మరో వ్యాసంలో వాపోవాల్సిందే!

ఈ ఎండలు మనకు పరీక్షలు

  ఒక వారం రోజులుగా ఏ పత్రికను తిరగేసినా ‘భానుని భగభగలు’, ‘మండుతున్న ఎండలు’ లాంటి శీర్షికలే కనిపిస్తున్నాయి. వీటిలో పెద్దగా అతిశయోక్తి లేదు కూడా! గత దశాబ్ద కాలంగా కనీవినీ ఎరుగని ఎండలు ఇప్పుడు నమోదవుతున్నాయి. ఏప్రిల్‌ మాసంలోనే 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు కనిపిస్తున్నాయి. సాధారణ ఎండలకు మారుపేరైన హైదరాబాదులో కూడా నలభై ఏళ్ల రికార్డులు బద్దలవుతున్నాయి. కేవలం హైదరాబాదే కాదు, తెలుగునాట చాలా ప్రాంతాలలో సాధారణం కంటే 3-5 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదవుతోంది.   గురువారం నాడు 51 మంది మృతి, శుక్రవారం నాడు 50 మంది మరణం! ఇవేమీ రోడ్డు ప్రమాదాలలో మరణించినవారి గణాంకాలు కాదు. కేవలం వడదెబ్బతో తెలుగు రాష్ట్రాల్లో ప్రాణాలు కోల్పోయిన అభాగ్యుల సంఖ్య. ఇక పరోక్షంగా వేసవి తాపానికి ప్రాణాలు కోల్పోయేవారి సంఖ్యా తక్కువేమీ ఉండదు. డీహైడ్రేషన్‌ వల్ల గుండెపోటు లేదా పక్షవాతం రావచ్చు. కలుషిత నీరు వల్ల జీర్ణకోశం దెబ్బతినిపోవచ్చు. ఇలా వేసవి ఎండకు బలయ్యేవారు కొందరైతే, ఆ ఎండ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మరికొందరు ప్రాణాపాయ స్థితిలో పడిపోతారు. అందుకే వేసవిలో ఈతకని వెళ్లి ప్రాణాలు కోల్పోయిన వార్తలు తరచూ వినిపిస్తూ ఉంటాయి. వేసవినాటి పొడివాతావరణంలో అగ్నిప్రమాదాలకు కూడా కొదవు ఉండదు. వేసవి తాపం నుంచి బయటపడేందుకు తీసుకోవల్సిన జాగ్రత్తలు గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదేముంది! వాటి గురించి కావల్సిన సమాచారం మన చుట్టూ ఎలాగూ లభిస్తోంది. తగినంత మంచినీరు తీసుకోవడం, ఎండ వేళల్లో నీడపట్టున ఉండటం, బయటకు వెళ్లినప్పుడు ఎండ తగలకుండా తగిన రక్షణతో ఉండటం, ఎలాంటి అనారోగ్యం కలిగినా అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించడం.... ఇలాంటి ప్రాథమిక జాగ్రత్తలు చాలా ఉపయోగంగా ఉంటాయి. కాకపోతే సెలవులనగానే ఆటల్లో పడిపోయే పిల్లల మీద ఓ కన్నేసి ఉంచడం మాత్రం అత్యవసరం! పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి, వాళ్లు ఇంట్లో ఉన్నా కూడా వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందన్న విషయాన్ని గమనించుకోక తప్పదు.   ఈసారి వేసవి తీవ్రంగా ఉండటానికి నిపుణులు చాలా కారణాలే చెబుతున్నారు. ముఖ్యంగా గత ఏడాది ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షపాతం చాలా తక్కువగా నమోదైంది. దానివల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి, భూ ఉపరితలం త్వరగా వేడెక్కే అవకాశం చిక్కింది. ఈ వేసవిలో చాలా ప్రాంత ప్రజలు దాహంతో ఎండిపోవడానికి కూడా ఎల్‌నినో ఒక ప్రధాన కారణం. వీటికి తోడు ఉత్తరాది వీస్తున్న వేడిగాలులు, ఈ వేసవిని మరింత మండిస్తున్నాయి. ఏటా ఈ గాలుల నుంచి ఉపశమనంగా, బంగాళాఖాతం నుంచి వీచే గాలులు కూడా ఈసారి స్తంభించిపోవడంతో, వేసవి వేడి అనుభవానికి వస్తోంది. ఈ ఎల్‌నినో శాపం ఇక్కడితో ఆగేట్లు కనిపించడం లేదు. ఎల్‌నినో ప్రభావం చూపిన మరుసటి సంవత్సరం కూడా రుతుపవనాలు ఆలస్యమవుతాయంటూ ఒక వాదన వినిపిస్తోంది. అదే కనుక నిజమైతే ఈసారి తొలకరి కోసం జూన్ చివరి వరకూ ఎదురుచూడాల్సిన పరిస్థితి వస్తుందేమో!   వేసవి ఉక్కపోత నుంచి జనాలకు కాస్త ఉపశమనం కలిగించేందుకు తెలుగు ప్రభుత్వాలు ఈసారి కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. మునుపటితో పోలిస్తే హైదరాబాదులో తాగునీటి సమస్య అదుపులోనే ఉంది. ఇక బడులకు కూడా వారం ముందుగానే సెలవులను ప్రకటించారు. అన్నింటికీ మించి, వేసవి ఉక్కపోతకు తోడుగా నిలిచే విద్యుత్‌ కోతలు ఈసారి తెలుగు రాష్ట్రాలలో లేకపోవడం శుభసూచకం. కానీ ఏటా వేసవి రాగానే విద్యుత్ గురించీ, నీటి గురించి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకునే రోజులు మారాలి. దేశంలో కావల్సినంత ఎండ నెత్తిన మాడుతున్నా, ఆ ఎండను సౌరవిద్యుత్తుగా మార్చుకునే దిశగా ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలు అంతంతమాత్రమే! తెలంగాణలో తాగునీటి కోసం, ఆంధ్రాలో సాగు కోసం బోర్లను ఎడాపెడా తవ్వేస్తున్న వైనం కూడా ఆందోళన కలిగిస్తోంది. ఈ తవ్వకం మీద సరైన పర్యవేక్షణ కానీ, నిషేధం కానీ లేవు. ఇక వర్షపాతాన్ని పూర్తిగా ఒడిసిపట్టేందుకు చేపడుతున్న చర్యలూ నామమాత్రంగానే సాగుతున్నాయి. వనరులను దాచుకునే, ఉపయోగించుకునే ప్రయత్నాలు మాని ఉన్నవాటిని తుదివరకూ వాడుకోవడం భవిష్యత్ తరాలకు ఏమంత శుభ పరిణామం కాదు. కాబట్టి వేసవిలో ప్రజలు తమ ఆరోగ్యాన్ని గురించి శ్రద్ధగా ఉండాలని ప్రభుత్వాలు ఎంతగా కోరుకుంటాయో, ప్రభుత్వాలు వనరుల గురించి శ్రద్ధ చూపించాలని ప్రజలు కూడా కోరుకోవడంలో తప్పులేదు!

రామమందిరం మళ్లీ రాజుకుంటోంది!

  వందల సంవత్సరాలుగా రగులుగున్న రామమందిర వివాదం కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉండిపోయింది. బీజేపీ అధికారంలోకి వచ్చేయడం, దేశంలో ఇతరత్రా సమస్యలు చెలరేగడంతో రామమందిరం గురించి అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. కానీ గడచిన కొద్దిరోజులుగా వినిపిస్తున్న వార్తలను గమనిస్తే ఈ వివాదం మళ్లీ రాజుకుంటున్నట్లుగా తోస్తోంది.   అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఒక ఉద్యమ రూపుని ఇచ్చేందుకు విశ్వహిందూ పరిషత్‌ మళ్లీ ప్రణాళికలను రచిస్తోంది. అందుకు అనుగుణంగా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని దాదాపు లక్ష గ్రామాలలో రామమందిరాలను నిర్మించాలంటూ ఆ సంస్థ శ్రీరామనవమిని ముహూర్తంగా నిర్ణయించింది. మరో పక్క అయోధ్యలో రామమందిర  నిర్మాణానికి తాము కట్టుబడి ఉన్నామంటూ భాజపా నేతలు ప్రకటనలు చేస్తున్నారు. దీంతో రామమందిర అంశం మరోసారి దేశాన్ని ఆక్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.   అయోధ్యలో శ్రీరాముడు జన్మించాడని మనం తరతరాలుగా చదువుకుంటూ వస్తున్నాము. అయితే ఇప్పుడు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్న అయోధ్యే, మనం చదువుకుంటున్న అయోధ్య అని కొందరి నమ్మకం. అక్కడ రామజన్మస్థానంలో కట్టిన గుడిని కూలగొట్టి 15వ శతాబ్దంలో మొగలు చక్రవర్తి బాబరు మసీదుని కట్టించాడన్నది అసలు వివాదం. బాబరు అక్కడే ఉన్న గుడిని కూలగొట్టాడా లేదా అన్నది చెప్పడం కష్టం. కానీ అక్కడ ఒక గుడి ఉండేదన్న మాట మాత్రం వాస్తవమేనని తేల్చారు పురావస్తుశాఖవారు. బహుశా అక్కడ బాబరు మసీదుని నిర్మించే సమయానికే శిథిలమైపోయి ఉండవచ్చు. అందుకనే 15వ శతాబ్దంలో అయోధ్యలో నివసించిన తులసీదాసు వంటి చారిత్రక వ్యక్తులు సైతం ఆలయాన్ని కూల్చివేసినట్లు ఎక్కడా చెప్పలేదు. 18వ శతాబ్దం వరకూ కూడా అటు ముస్లింలు, ఇటు హిందువులూ ఈ మసీదుని పుణ్యక్షేత్రంగానే భావించేవారు. ముస్లింలు ఈ ప్రాంతాన్ని మసీద్‌-ఇ-జన్మస్థాన్‌గా పేర్కొంటూ హిందువులను మసీదు ప్రాంగణంలోకి అనుమతించేవారు. అయితే నిదానంగా మసీదుని కూల్చి రామాలయాన్ని నిర్మించాలన్న వాదనలు మొదలయ్యాయి. 1885లోనే ఇందుకు సంబంధించిన కోర్టు కేసులు కూడా మొదలయ్యాయి. ఆ సందర్భంగా ‘మసీదు ఉన్న ప్రదేశం హైందవులకు పుణ్యక్షేత్రమేననీ, అయితే వందల ఏళ్లు గడిచిపోవడం వల్ల ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదని’ ఆనాటి బ్రిటిష్‌ కోర్టు అభిప్రాయపడింది. రోజులు గడిచేకొద్దీ బాబ్రీమసీదు వివాదం ఓ ఉద్యమంగా మారసాగింది. 1949నాటికి కొందరు మసీదులోకి చొరబడి అక్కడ సీతారాముల విగ్రహాలను ప్రతిష్టించారు. ఆ విగ్రహాలను అక్కడి నుంచి తీసేయమని కేంద్ర ఆదేశించినా, మతఘర్షణలు చెలరేగుతాయన్న భయంతో వాటిని అక్కడే ఉంచేశారు. ఆ తరువాత చాలాకాలం వరకూ బాబ్రీమసీదు వివాదం నిద్రాణంగా ఉండిపోయింది.   1990లో భాజపా నేత నేత అద్వానీ రథయాత్రను ప్రారంభించడంతో బాబ్రీమసీదు వివాదానికి మళ్లీ రెక్కలొచ్చాయి. రోజులు గడిచేకొద్దీ, అద్వానీ రథయాత్ర సాగుతున్న కొద్దీ, దేశవ్యాప్తంగా హైందవులంతా ఉడుకెత్తిపోసాగారు. చాలాచోట్ల స్థానిక ప్రభుత్వాలు అద్వానీని నిలువరించాల్సి వచ్చింది. 1992, డిసెంబరు నాటికి అయోధ్య విషయంలో తాడోపేడో తేల్చుకునేందుకు లక్షమందికి పైగా జనం బాబ్రీమసీదుని చేరుకున్నారు. ఆ నెల 6వ తేదీన అయోధ్యలో... అద్వానీ, మురళీమనోహర్‌ జోషీ వంటివారి ప్రసంగాలు సాగుతుండగా ఉద్రేకపడిపోయిన జనం ఒక్కసారిగా మసీదుని ముంచెత్తి దానిని కూలగొట్టారు. నిజానికి బాబ్రీ మసీదుని కూల్చాలన్న ప్రణాళిక దాదాపు 10 నెలల ముందుగానే ఏర్పరుచుకున్నారనీ... ఇటు రాష్ట్ర ప్రభుత్వమూ, అటు కేంద్రమూ ఈ విషయంలో చూసీ చూడనట్లు ఉండిపోయాయని ఓ ఆరోపణ. ఆ సమయంలో ప్రధానమంత్రిగా ఉన్న పి.వి.నరసింహరావు సరిగా వ్యవహరించలేదంటూ, కాంగ్రెస్‌ పార్టీ ఓ అపవాదుని ఆయన మీదకు నెట్టివేసి చేతులు దులిపేసుకుంది. బాబ్రీ మసీదు కూల్చివేత దేశాన్ని ఒక్క పెట్టున కుదిపేసింది. మసీదు కూల్చివేత తరువాత జరిగిన ఘర్షణల్లో దేశవ్యాప్తంగా దాదాపు రెండువేల మంది చనిపోయినట్లు అంచనా! ముంబై మొత్తం మతఘర్షణలతో అతలాకుతలం అయిపోయింది.   అద్వానీ రథయాత్ర తరువాత బీజేపీ బలపడుతూ వచ్చింది. 2009లో ఏకంగా తన పార్టీ మేనిఫెస్టోలోనే ఆ పార్టీ రామమందిరాన్ని నిర్మిస్తామంటూ ఎన్నికల వాగ్దానం చేసింది. మరోపక్క న్యాయస్థానాలలో కూడా బాబ్రీమసీదు వివాదం పరిష్కారం దిశగా ముందుకు సాగింది. 2010, సెప్టెంబరులో అలహాబాదు హైకోర్టు ఈ వివాదానికి సంబంధించి ఓ చారిత్రాత్మక తీర్పునిచ్చింది. వివాదాస్పద మసీదు ప్రాంతాన్ని మూడు భాగాలుగా చేయాలనీ, వాటిలో ఓ భాగాన్ని వక్ఫ్‌ బోర్డుకీ, మరో రెండు భాగాలు హిందూ సంస్థలకు అందించాలనీ తీర్పునిచ్చింది. అయితే ప్రస్తుతానికి ఈ తీర్పు మీద సంబంధిత పార్టీలు తిరిగి సుప్రీంకోర్టుని ఆశ్రయించడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది.   ఇప్పటికీ బాబ్రీ మసీదు మీద రకరకాల భావోద్వేగాలు చెలరేగుతూనే ఉన్నాయి. భిన్నమైన వాదనలు వినిపిస్తూనే వస్తున్నాయి. ఇతర మతస్తులకి, వారి ప్రవక్తల జన్మస్థానాలు ఎంత పవిత్రమో... హిందువులకి రామజన్మభూమి అంతే పవిత్రం అనేవారు ఉన్నారు. అసలు రాముడు పుట్టిన అయోధ్య ఇది కాదని, ఇప్పటి అయోధ్యకు ఆ పేరు 11వ శతాబ్దం నుంచే వచ్చిందనే వారూ ఉన్నారు. ఎవరేమన్నా బాబ్రీమసీదు సమస్య మాత్రం ఇటు ప్రభుత్వాలకీ, అటు న్యాయస్థానాలకీ ఓ కొరకరాని కొయ్యగానే మిగిలిపోయింది. ఇరు మతాల పెద్దలూ కూర్చుని పరిష్కరించుకుంటే కానీ ఈ సమస్యకు ఓ పరిష్కారం లభించడం అసాధ్యం. కానీ ఇరు మతాలకు చెందిన సంస్థలు ఆ భూమి మీద సర్వాధికారాలూ తమకే కావాలని పట్టుపట్టడంతో వివాదం ఎప్పటికీ సద్దుమణిగేట్లు కనిపించడం లేదు!

అంబేద్కర్‌నాటి సమస్యలు అలాగే ఉన్నాయి

  అంబేద్కర్‌ పుట్టి నేటికి 125 సంవత్సరాలు. రాజ్యంగ నిర్మాతగా, తొలి న్యాయమంత్రిగా, దళిత నేతగా అంబేద్కర్‌ నేటికీ మార్గదర్శకునిగానే ఉన్నారు.   అంబేద్కరు పుట్టిన పరిస్థితులు సాధారణమైనవి కావు. ఒక పక్క ఆంగ్లేయుల పాలన, మరోపక్క అస్పృశ్యత.... ఈ రెండూ ఉన్నచోట పేదరికం ఎలాగూ ఉండనే ఉంటుంది. ఇన్ని సమస్యల మధ్య కూడా అంబేద్కరు మేధస్సుని నమ్ముకున్నాడు. మహర్‌ కులంలో జన్మించినా చదువులో మాత్రం దూసుకుపోయాడు. మహర్లు మహారాష్ట్రలోని అత్యంత వెనుకబడిన కులాలలో ఒకరు. ఆ రాష్ట్రంలో అధికంగా కనిపించే ఈ కులం మీదే మహారాష్ట్ర అన్న పేరు వచ్చిందన్న వాదన కూడా ఉంది. వీరికి ఆలయ ప్రవేశాలు కానీ, బావులలో తోడుకునే అవకాశాలు కానీ ఉండేవి కాదు. ఒకవేళ ఎలాగొలా బడికి వెళ్లినా, అక్కడ తాము తెచ్చుకున్న ఓ గోనెపట్టా మీద బిక్కుబిక్కుమంటూ కూర్చుని దూరం నుంచే పాఠాలను వినాల్సి వచ్చేది. ఇక సాటి విద్యార్థులు, ఉపాధ్యాయులు అనే సూటిపోటి మాటలు, చూసే చూపులు సరేసరి. అయినా అంబేద్కర్ పట్టుదల ముందు అవేమీ నిలవలేదు. తరగతి తరువాత తరగతి ముందుకు సాగుతూనే ఉన్నాడు.   హైస్కూలు, మెట్రిక్యులేషన్‌, డిగ్రీ... ఇలా అంబేద్కర్‌ చదువు సాగుతూనే వచ్చింది. భారతదేశంలో డిగ్రీని సాధించిన మొదటి దళితుడు అంబేద్కరే అని కొందరంటారు. అంబేద్కర్‌ అక్కడితో ఆగలేదు. ఇంగ్లండులోని కొలంబియా విశ్వవిద్యాలయం, లండన్ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో అనేక ఉన్నత డిగ్రీలను సాధించారు. M.A., Ph.D... ఇలా అంబేద్కర్‌ ఏం చదివినా అందులో భారతదేశానికి సంబంధించిన సమస్యల గురించే సిద్ధాంత పత్రాలను రూపొందించేవారు. భారతీయ కులవ్యవస్థ, ఇక్కడి ఆర్థిక స్థితిగతులు, రూపాయి ఆవిర్భావం.. ఇలాంటి అంశాల మీదే పరిశోధన సాగించేవారు.   ఉన్నత చదువులన్నీ చదువుకుని అంబేద్కరు భారతదేశానికి తిరిగివచ్చినా కూడా ఆయనను ఆస్పృశ్యత వీడిపోలేదు. కాలేజీలు, కార్యాలయాలు... ఇలా ఎక్కడ ఉద్యోగం చేసినా ఆయన వివక్షనే ఎదుర్కొనేవారు. ఆయన కిందిస్థాయి ఉద్యోగులు కూడా అంబేద్కరును ముట్టుకునేందుకు సాహసించేవారు కాదు. దాంతో కులవివక్షను అంతమొందించేందుకు కేవలం విద్యే కాదు ఉద్యమం కూడా అవసరమే అన్న అభిప్రాయానికి వచ్చారు. అందుకే దళితులందరినీ ఏకం చేసి ఉద్యమాలను నడిపించడం మొదలుపెట్టారు.   ఒకపక్క దళిత ఉద్యమాలను నడిపిస్తూనే, మరోవైపు రాజకీయాలలో చురుకుగా పాల్గొన్నారు అంబేద్కరు. అంబేద్కరు అవసరాన్ని గుర్తించిన కాంగ్రెస్‌ ఆయనను స్వాతంత్ర భారతంలో తొలి న్యాయశాఖామంత్రిగా నియమించింది. భారత రాజ్యాంగాన్ని నిర్మించే బాధ్యతనూ అప్పగించింది. అంబేద్కర్‌ సారధ్యంలో రూపొందిన రాజ్యాంగానికి ప్రపంచంలోనే పరిపూర్ణమైన రాజ్యాంగమని పేరు. రాజ్యాంగబద్ధంగా బడుగులకీ, వెనుకబడిన కులాలకీ అంబేద్కర్ ఎన్ని సౌకర్యాలు కల్పించారో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అదే స్థాయిలో అందులో ఎలాంటి వివాదాస్పద నిబంధనా చోటుచేసుకుండా ఉండేందుకు శతథా ప్రయత్నించారు. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించి ఇప్పటికీ ఆ సమస్యను రాజుకునేలా చేసిన ఆర్టికల్‌ 370 అంటే అంబేద్కరుకు ఏమాత్రం ఇష్టం లేదు. కానీ ఆనాటి ప్రభుత్వ పెద్దల బలవంతం మీదే ఆయన దానికి ఒప్పుకోవలసి వచ్చింది.   కేవలం రాజ్యాంగమే కాదు రిజర్వ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా, ఫైనాన్స్‌ కమీషన్ వంటి ఆర్థిక పునాదులన్నీ ఆంబేద్కర్ ఆలోచనల మీదే ఏర్పడ్డాయి. అంబేద్కరు తన జీవిత చరమాంకంలో కులప్రసక్తి లేని బౌద్ధమతాన్ని స్వీకరించారు. అంబేద్కరు జీవితాన్ని తరచి చూస్తే ఆయనలో ఎన్నో పార్శ్వాలు కనిపిస్తాయి. సామాజిక సంస్కర్తగా, విద్యావేత్తగా, రాజ్యాంగ నిర్మాతగా, మేధావిగా, రచయితగా, రాజకీయవేత్తగా, ఆర్థికవేత్తగా.... ఇలా ఎన్నో కోణాలు కనిపిస్తాయి. ఆయా రంగాలలో అంబేద్కరు ప్రతిభావంతునిగా చెలరేగడం ఒక ఎత్తైతే, ఆ ప్రతిభనంతా దేశ పురోగతి కోసమే వినియోగించడం మరో ఎత్తు. అందుకే స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా అంబేద్కరు చూపించిన మార్గంలోనే సామాజిక సంస్కరణలు సాగుతున్నాయి.   అయినా అంబేద్కరు ఎదుర్కొన్న సమస్యలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఇప్పటికీ దేశం కులాల ప్రాతిపదికన చీలిపోయి ఉంది. ఒకరకంగా ఈ విభజన కూడా అస్పృశ్యతే! కేవలం రిజర్వేషన్ల ఆధారంగానో, అంబేద్కరు జయంతుల నిర్వహణ వల్లనో, ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటిచడంతోనో ఇది తీరిపోయేది కాదు. అంబేద్కరు రాసిన రాజ్యాంగాన్నే కాదు, ఆయన రాసిన పుస్తకాలను కూడా వెలికి తీయాలి. అందులో ఆయన ప్రస్తావించిన విషయాల మీద చర్చలు జరగాలి. కుల వ్యవస్థ, వెనుకబాటుతనం, అసమానతలు వంటి విషయాల మీద పోరాడే ధైర్యం కావాలి. లేకపోతే సమస్యలు అలాగే ఉండిపోతాయి. అటు రాజకీయ నాయకులు, ఇటు కులపెద్దలు కేవలం పరిష్కరాలనే చూపుతూ పబ్బం గడుపుకుంటూ ఉండిపోతారు.

ఆయుధపోటీలో దూసుకుపోతున్నాం

  అమెరికా అంటే అందరికీ గుర్తుకువచ్చేది ఆధునికత. రష్యా పతనం తరువాత తిరుగులేకుండా పోయిన అమెరికా, ప్రపంచీకరణను పూర్తిగా అందిపుచ్చుకుంది. అభివృద్ధిలో వెనుకబడేది లేదంటూ అగ్రరాజ్యాలలో ముందు నిలిచింది. కానీ చాలామంది అంతగా గమనించని విషయం, అమెరికా చేసే ఆయుధ వ్యాపారం. ఆయుధాల మీద సంపాదన సాగించే దేశాలలో అమెరికా, ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. టైం పత్రిక అంచనా ప్రకారం 2014లో అమెరికా ఆయుధాల విక్రయం ద్వారా రెండు లక్షల కోట్లకు పైగా సంపాదించింది. గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే క్రమంగా భారత్‌ కూడా, అమెరికా ఆయుధ వ్యాపారంలో ఓ పావుగా మారిపోతోందన్న భయాలు కలుగుతున్నాయి.   ఏ ప్రాంతంలో అయితే అనిశ్చిత పరిస్థితులు ఏర్పడతాయో ఆ ప్రాంతంలో అమెరికా ఆయుధ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది. అమెరికా నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే దేశాలను గమనిస్తే ఈ విషయం స్పష్టంగా తేలిపోతుంది. దక్షిణ కొరియా, ఇరాక్‌ వంటి దేశాలు ఈ జాబితాలో ముందుంటాయి. పక్కపక్కనే ఉండే రెండు దేశాల మధ్య ఏదో ఒక వివాదం ఉండటం సహజమే! అందుకని ఎప్పటికప్పుడు యుద్ధానికి కాచుకునేలా ఆయుధాలను పోగేసుకోవడమూ సబబే! కానీ ఒకోసారి తన వ్యాపారం కోసం, సదరు ఆయుధపోటీని అమెరికానే ప్రోత్సహించడం ఓ వైచిత్రి. తీవ్రవాదం మీద పోరు నెపంతో పాకిస్తాన్‌కు, అమెరికా ఎఫ్‌-16 విమానాలను అందించడమే ఇందుకు ఓ స్పష్టమైన ఉదాహరణ. ఒకప్పుడు భారత్‌ తనకు అవసరమనుకునే ఆయుధాలను రష్యా నుంచి కొనుగోలు చేసేది. కానీ ఆధునికతలో రష్యా వెనకబడుతూ ఉండటం, కాలం చెల్లిన ఆయుధాలనే అమ్మకానికి పెట్టడంతో... ఆయుధ సంపత్తి కోసం ఇతర దేశాల వైపు దృష్టి సారించడం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఎక్కువగా లాభపడింది అమెరికా అని వేరే చెప్పనవసరం లేదు కదా! 2007 నుంచి 80 వేల కోట్లకు పైగా విలువ చేసే ఆయుధాలను అమెరికా నుంచి భారత్‌ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ లెక్కలు ముందుముందు మరింతగా పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో F/A-18 విమానాలనీ, సైనిక పర్యవేక్షణను అవసరమయ్యే డ్రోన్లనీ కూడా భారీ సొమ్ముని వెచ్చించి అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేయనుందన్న వార్తలు వస్తున్నాయి.   మన దేశంతో ఇలాంటి ఆయుధ ఒప్పందాలన్నింటినీ సమీక్షించేందుకు, సాక్షాత్తూ అమెరికా రక్షణ శాఖ మంత్రి ఆస్టన్‌ కార్టర్‌ దిల్లీకి చేరుకున్నారు. వీటికి తోడుగా అమెరికా, భారత్‌లు రెండూ ఒకరి భూభాగాల మీద మరొకరు యుద్ధవిమానాలు, నౌకలను నిలుపుకొనేలా కూడా ఓ ఒప్పందం కుదరనుంది. కేవలం మరమ్మతులు, ఇంధనం నింపుకోవడం, సహాయక చర్యలు.... తదితర అవసరాల కోసమే ఈ ఒప్పందం అని బయటకు చెబుతున్నప్పటికీ... ఆమెరికా వాహనాలను భారత భూభాగంలోకి అనుమతించడం వెనుక వేరే ఆంతర్యం ఉంది. రోజురోజుకీ భారత భూభాగం చుట్టూ ఉన్న సముద్ర జలాల మీద చైనా వ్యూహాత్మకంగా పట్టుని సాధిస్తోంది. పాకిస్తాన్ సాయంతో అక్కడి బెలూచిస్తాన్‌లో ఏకంగా ఒక నౌకాశ్రయాన్ని నిర్మించుకుంటోంది. గ్వదర్‌ అనే ప్రాంతంలో సాగుతున్న ఈ నిర్మాణం పూర్తయితే, భారతదేశంలోకి పశ్చిమ సముద్రజలాల మీద చైనా పట్టు సాధించే అవకాశం ఉంది. ఇటు దక్షిణచైనా సముద్రాన్ని కూడా ఆ దేశం నిదానంగా ఆక్రమించుకుంటోంది. సహజ వనరులు మెండుగా ఉన్న ఈ ప్రాంతంలో చైనా సాగిస్తున్న ఆక్రమణ వెనుక ఆర్థిక కారణాలను మించిన ఆంతర్యాలు ఉన్నాయి. ఈ ఆక్రమణతో చైనా చుట్టపక్కల ఉన్న జపాన్‌, మలేసియా, వియత్నాం, ఫిలిప్పీన్స్‌ తదితర దేశాలన్నింటి మీదా పై చేయి సాధిస్తుంది. తద్వారా భారతదేశ తూర్పు తీరం మీద కూడా ఆధిపత్యం సాగిస్తుంది. ఇలా మన దేశం మూడు పక్కలా ఉన్న జలాల మీద చైనా పట్టు సాధించే ప్రయత్నం ఎలాగూ చేస్తోంది. మరోవైపు పాక్‌ ఆక్రమిత కశ్మీరంలో చక్కగా రహదారులను, వంతెనలను నిర్మించుకుంటూ భారత్‌ను రెచ్చగొడుతోంది.   చైనా దూకుడు సహజంగానే భారత్‌కు ఆందోళన కలిగిస్తోంది. మన శత్రు దేశమైన పాకిస్తాన్‌కు వ్యూహాత్మకంగా చైనా సాయపడుతూ వస్తోందని అందరికీ తెలిసిందే! కానీ నేరుగా మనతో శత్రుత్వం సాగించే తత్వాన్ని ఇప్పుడిప్పుడే చైనా అలవర్చుకుంటోంది. ఈ పరిస్థితిలో అమెరికాను మన భూభాగంలో అనుమతించక తప్పలేదు భారత్‌కు. ఎప్పటికప్పుడు ఆధునిక యుద్ధ సామాగ్రిని పోగేసుకోకా తప్పడం లేదు. ఫ్రాన్స్‌ నుంచి 65 వేల కోట్ల విలువైన రాఫెల్ విమానాలను కొనుగోలు చేసినా, అమెరికా నుంచి మరిన్ని విమానాలను కొనుగోలు చేసేందుకు తొందరపడుతున్నా... ఇటు పాకిస్తాన్‌, అటు చైనాల నుంచి పొంచి ఉన్న ప్రమాదాలను నిలువరించేందుకే! నిజానికి చైనా, పాకిస్తాన్‌లతో మనకు యుద్ధం జరుగుతుందని కాదు. మన ఆయుధ సంపత్తిని చూసైనా అవి తమ దూకుడుని తగ్గించుకుంటాయన్నది భారత్‌ ఆశ. ఇప్పుడు ప్రపంచంలో యుద్ధాలన్నీ ఇలా పరోక్షంగానే సాగుతున్నాయి. ఒక దేశానికి మించి మరో దేశం ఆయుధాలను పెంచుకుంటూ పోతోంది. కానీ ఈ ఆయుధపోటీలో బాగుపడుతున్న దేశాల గురించి ప్రత్యేకించి మళ్లీ చెప్పుకోనవసరం లేదు.   రక్షణ అవసరాల కోసం, శత్రువులని నిలువరించడం కోసం ఆయుధాలను సమకూర్చుకోవడం తప్పేమీ కాదు. యుద్ధమంటూ జరిగితే కాలం చెల్లిన ఆయుధాలే మన పరాజయాలను శాసిస్తాయి. కానీ అదే సమయంలో దౌత్యపరమైన సంబంధాలను మెరుగుపరుచుకోవడం కూడా చాలా అవసరం. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇంకా ఆకలి, పేదరికం, అనారోగ్యం, నిరక్షరాస్యత వంటి శాపాలు అక్కడి ప్రజల నుదుటి రాతగా మారుతుంటే... కేవలం రక్షణ కోసం కొన్ని లక్షల కోట్లు ఖర్చుచేయాల్సి రావడం ఎంత దురదృష్టకరం. కాబట్టి అమెరికా, ఫ్రాన్స్‌, రష్యా వంటి దేశాలు నిజంగా తమను తాము ప్రపంచానికి పెద్దన్నలుగా భావిస్తుంటే, చేయాల్సింది ఆయుధవ్యాపారం కాదు... దౌత్యం! విస్తరించాల్సింది ఆయుధ సామ్రాజ్యం కాదు... స్నేహహస్తం! స్నేహాన్ని మించిన లాభసాటి ఒప్పందం మరేముంటుంది?

లాతూర్‌ నీటి రైలు... నేర్పుతున్న పాఠాలు

  లాతూర్‌...ఈ పేరు వినగానే రెండు దశాబ్దాల క్రితం వచ్చిన భూకంపమే మనసులో మెదుల్తుంది. ఆ విపత్తులో దాదాపు పదివేల మంది చనిపోయి ఉంటారని అంచనా. కానీ ఇప్పుడు లాతూర్‌ అంతకంటే తీవ్రమైన విపత్తు ఉంది. కానీ ఈ విపత్తులో కోల్పోయే ప్రాణాలని లెక్కపెట్టడం సాధ్యమయ్యే పని కాదు. ఇది కేవలం ప్రకృతి సృష్టించిందీ కాదు! లాతూర్‌ ఇప్పుడు తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. అక్కడికి రైల్వే వ్యాగన్లలో నీటిని తరలించాల్సిన దుస్థితి దాపురించింది.   లాతూర్‌కి ‘షుగర్‌ బెల్ట్ ఆఫ్‌ ఇండియా’ అని పేరు. ఆ జిల్లాలో విస్తృతంగా చెరకుని పండించడమే దీనిక కారణం. సహకార సంఘాల ద్వారా నిర్వహించే అనేక చెరకు ఫ్యాక్టరీలకు లాతూర్‌ ప్రసిద్ధి. అదే సమయంలో లాతూర్‌ను తరచూ కరవు కాటకాలు పీడించే చరిత్ర కూడా ఉంది. లాతూర్‌ చెరకు రైతులు పంటను గుర్తుంచుకున్నారే కానీ, కరువు సంగతి మర్చిపోయారు. లాతూర్‌ అధికారులు ఫ్యాక్టరీలను చూసి మురిసిపోయారే కానీ, భూగర్భజలాల సంగతి పట్టించుకోలేదు. ఫలితం... అటు వర్షాలు సరిగా కురవకున్నా, నీటికి అనుగుణమైన పంటలను పండించేందుకు ఎవరూ సిద్ధపడలేదు. నీరు సమృద్ధిగా అవసరమయ్యే చెరకు పంటనే నమ్ముకున్నారు. అందుకోసం ఎడాపెడా బోర్లు వేయడం మొదలుపెట్టారు. ఏడాది తరువాత ఏడాది రుతుపవనాలు ముఖం చాటేస్తున్న కొద్దీ, బోర్లు మరింత లోతుకి వెళ్లసాగాయి. రాష్ట్రం కరువులోకి జారిపోతోందని స్పష్టంగా తెలుస్తున్నా, అధికారులు కూడా చూసీ చూడనట్లు ఊరుకున్నారు. బోర్ల తవ్వకం మీద నిషేధం విధించడం కానీ, జలాశయాలలో తగినంత నీటిమట్టాన్ని ఉండేలా చర్యలు తీసుకోవడం కానీ చేయలేదు. వీలైనంత ఎక్కువగా వర్షపు నీటిని ఒడిసిపట్టే ప్రయత్నాలు చేయలేదు. దాంతో లాతూర్ ప్రాంతం, ఆ మాటకి వస్తే మహారాష్ట్రలోని అధిక శాతం వందేళ్లలో కనీవినీ ఎరుగని కరువుకోరల్లో చిక్కుకుపోయింది.   లాతూర్‌లో ప్రస్తుతం తాగేందుకు గుక్కెడు మంచినీరు కూడా దొరకని పరిస్థితి. నీరు లేకపోవడంతో పాఠశాలలు మూతపడ్డాయి. ఆఖరికి ఆపరేషన్లను కూడా వాయిదా వేసే పరిస్థితి వచ్చింది. ఇక ఇంటికి నేరుగా మంచినీరు సరఫరా కావడం అనేది ఒక కలగా మారిపోయింది. మొన్నటివరకూ పదిహేను రోజులకు ఓసారి జరిగే ఈ సరఫరా ప్రస్తుతం నిలిచిపోయింది. లాతూర్‌కి మంచినీటిని సరఫరా చేసే ధనేగావ్‌ జలాశయం ఎండిపోవడంతో ప్రజల దాహాన్ని తీర్చేందుకు అధికారులు తలలు పట్టుకోవలసి వచ్చింది. లాతూర్‌లో ఇంకా ఎక్కడెక్కడ మంచినీరు లభ్యమవుతోందో వివరాలు సేకరించడం మొదలుపెట్టారు అధికారులు. కాస్తో కూస్తో నీరు కనిపిస్తున్న బావులు, చెరువుల వద్ద 144 సెక్షన్లను అమలు చేసి, తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ట్యాంకర్ల ద్వార మంచినీటిని సరఫరా చేయడం మొదలుపెట్టారు. అయినా కూడా ప్రజల దాహార్తిని తీర్చేందుకు అవి చాలలేదు సరికదా, ట్యాంకర్ల నుంచి వచ్చే కొద్దిపాటి మంచినీరు కోసం కొట్లాటలు మొదలయ్యాయి. ఇక పబ్లిక్‌ ట్యాపు ద్వారా నీటిని సరఫరా చేసేందుకు అధికారులు సాగించిన ప్రయత్నం కూడా బెడిసికొట్టింది. దాదాపు పదిగంటల పాటు కుళాయి ముందర నిల్చొంటే కానీ బిందెడు నీళ్లు పట్టుకోలేని పరిస్థితి!   లాతూర్‌లోని కొన్ని ప్రాంతాల్లో గత నాలుగు నెలలుగా మంచినీటి సరఫరా లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ కరువుకాలంలో కూడా డబ్బున్నవాడికి ఎలాంటి బాధా లేదు. 150 రూపాయలు ఖర్చుపెడితే పదిలీటర్ల నీరు శుభ్రంగా దొరుకుతుంది. కానీ అంత ఖర్చుచేయలేని వారు, లాతూర్‌ జిల్లానే వదిలిపెట్టి వలసపోతున్నారు. పట్టుదలతో అక్కడే ఉన్నా, తాగేందుకు తగినంత నీరు లేకపోవడం వల్ల కిడ్నీ రాళ్లతో బాధపడేవారి సంఖ్య పెరిగిపోతోంది. పరిస్థితి తీవ్రతను గమనించిన మహారాష్ట్ర ప్రభుత్వం లాతూర్‌కు రైల్వేల ద్వారా మంచినీటిని తీసుకువచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టింది. లాతూర్‌కు 300 కిలోమీటర్ల దూరంలోని ఉజనీయ జలాశయం నుంచి తొలివిడతగా 5 లక్షల లీటర్ల నీటిని ఇవాళ లాతూరుకి చేరవేశారు. ఈ నీటిని శుద్ధి చేసి లాతూర్ నగరానికీ, పరిసర గ్రామాలకీ అందిస్తారు. ఈ రైలు వస్తున్న మార్గంలోని గ్రామాల ప్రజలు దాడి చేసి నీటిని ‘దోచుకోకుండా’ ఉండేందుకు కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య రైలు ప్రయాణం సాగింది.   ప్రస్తుతానికైతే లాతూర్‌ దాహార్తి తీరే మార్గం దొరికింది. కానీ మున్ముందు పరిస్థితి ఏమిటన్నదే ప్రశ్న! ఉజనీ జలాశయం చుట్టుపక్కల ఉండే ప్రజల, ఈ నీటి మళ్లింపుని వ్యతిరేకించడం మొదలుపెడితే? అసలు ఉజనీ కూడా ఎండిపోతే? లాతూర్ సంగతి సరే! మరి మిగతా ప్రాంతాల దాహం తీరేదెలా? ఈ ఏడాది వర్షపాతం కూడా సరిగా లేకపోతే?... ఆలోచించే ఓపికుండాలే కానీ ఇలాంటి ప్రశ్నలు ఒకదాని వెంబడి ఒకటి మెదుల్తూనే ఉంటాయి. కాబట్టి లాతూర్‌ విషయంలో ప్రకృతి కరుణిస్తుందనీ, రుతుపవనాలు వర్షిస్తాయనీ ఆశిద్దాము. అదే సమయంలో లాతూర్‌ అంశం మిగతా దేశానికి ఒక గుణపాఠంగా నిలవాలని కోరుకుందాము. పరిస్థితులను బట్టి ఏ పంటలు వేయాలి! భూగర్భ జలాలను ఎలా పరిరక్షించుకోవాలి! వర్షపు నీటిని ఎలా ఒడిసిపట్టుకోవాలి!... తదితర అంశాల మీద అటు ప్రభుత్వాలు, ఇటు ప్రజలు విచక్షణతో వ్యవహరిస్తారని కోరుకుందాం. లేకపోతే లాతూరులో కనిపించే నీటి రైళ్లని విజయవాడలోనో, సికింద్రాబాదులోనో చూడాల్సి వస్తుంది. అదేమంత శుభశకునం కాదు కదా!

కేరళలో పేలుడు... నిప్పుతో చెలగాటం!

  నీరు, నిప్పు... ఈ రెండింటినీ మనిషి ఎప్పుడూ తక్కువగా అంచనా వేస్తూనే ఉంటాడు. అలా మనిషి తమపట్ల అజాగ్రత్తగా ఉన్న ప్రతిసారీ అవి తమ విశ్వరూపాన్ని చూపుతూనే వచ్చాయి. కేరళలోని పరవూర్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదమే ఇందుకు మరో సాక్ష్యం!   కేరళలోని పరవూర్‌, ఆ రాష్ట్ర రాజధాని తిరువనంతపురానికి కేవలం 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఉన్న పుట్టంగళ్‌ అమ్మవారి ఆలయంలో ఏటా జరిగే ఉత్సవాలకి గొప్ప పేరు. వారం పాటు జరిగే ఈ ఉత్సవాల ఆఖరి రోజున జరిగే బాణాసంచా ప్రదర్శనని చూసేందుకు వందలాదిమంది కాచుకు కూర్చుంటారు. కానీ ఈసారి వాళ్లంతా చావు కోసమే ఎదురుచూసినట్లైంది. అమ్మవారి జన్మనక్షత్రమైన భరణి రోజున ఈ ముగింపు ఉత్సవం జరుగుతుంది. అది ఈసారి 9వ తేదీన వచ్చింది. ఆ రోజు అర్ధరాత్రి నుంచి మొదలైన బాణాసంచాను, జనమంతా అబ్బురంగా చూస్తూ ఉండిపోయారు. మూడుగంటలపాటు ఏకధాటిగా సాగిన ఈ ప్రదర్శన తుదిఘట్టానికి చేరుకునే సమయంలో అనుకోని ఆపద ఎదురైంది. దగ్గరలోనే బాణాసంచాను నిల్వచేసే గోదాము మీదకి నిప్పురవ్వలు పడటంతో ఆ ప్రాంతమంతా అగ్నిగోళంగా మారిపోయింది. ఆలయ ప్రాంగణమంతా స్మశానమైంది.   ఈ ప్రమాదంలో 107 మంది చనిపోయారనీ, 300 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారనీ చెబుతున్నారు. ఈ లెక్కలు మారే అవకాశం ఉంది. బాణాసంచాను సరఫరా చేసిన కాంట్రాక్టరు 15 కిలోల బాణాసంచాను మాత్రమే నిల్వ చేసుకునేందుకు అనుమతి ఉండగా, ఏకంగా 150 కిలోలను నిల్వ చేయడమే ఈ ప్రమాద తీవ్రతకు కారణం అని తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలోకి కాస్త లోతుగా వెళ్తే కేవలం కాంట్రాక్టరే కాదు... రాజకీయ నేతల నుంచి ఆలయ అధికారుల వరకూ ప్రతిఒక్కరూ ఈ తిలాపాపంలో తలాపిడికెడు పంచుకున్నట్లు అర్థమవుతుంది.   పుట్టంగళ్ అమ్మవారి ఆలయ నిర్వాహక కమిటీలో మొదటి నుంచీ కుల రాజకీయాలు నడుస్తున్నాయి. కమిటీ మీద ఆధిపత్యం కోసం వివిధ కులాలు కొట్లాడుకుంటూ ఉండేవి. ఈ కొట్లాట కొన్నాళ్ల క్రితం సుప్రీంకోర్టు దాకా వెళ్లే పరిస్థితి వచ్చింది. ఆ నేపథ్యంలో కొన్నాళ్లపాటు ఉత్సవాలను కూడా నిలిపివేశారు. ప్రస్తుతానికి పరిస్థితులు చక్కబడినట్లు కనిపించినా, ఉత్సవాల మీద తమ ప్రభావం స్పష్టంగా కనిపించాలని కమిటీలోని వేర్వేరు వర్గాలు పట్టుదలగా ఉన్నాయి. దానికి తగినట్లుగా బాణాసంచా కార్యక్రమాన్ని కనీవినీ ఎరుగనంత ఘనంగా నిర్వహించాలనుకున్నాయి. అయితే కేరళలో తరచూ జరుగుతున్న బాణాసంచా ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని అటు జిల్లా కలెక్టరు కానీ, ఇటు జిల్లా అదనపు మెజిస్ట్రేటు కానీ బాణాసంచా ప్రదర్శనకు అనుమతిని ఇవ్వలేదు. పైగ ఈ బాణాసంచా ప్రదర్శన తీరుని చూస్తుంటే రెండు వర్గాల మధ్య పోటీలాగా సాగే ప్రమాదం ఉందనీ, ఈ నేపథ్యంలో తాను ప్రదర్శనకు అనుమతిని ఇవ్వడం లేదనీ అదనపు మెజిస్ట్రేట్‌ షానవాజ్‌ తన ఉత్తర్వులలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ ఉత్తర్వుని అతిక్రమించినవారి మీద చర్యలు కూడా తీసుకుంటానని హెచ్చరించారు. అయినా ప్రదర్శన ఆగలేదు!   ఉన్నతాధికారులు ఎప్పుడైతే అనుమతిని నిరాకరించారో, స్థానిక రాజకీయ నేతలు రంగంలోకి దిగారు. మంత్రులు సైతం ఉన్నతాధికారుల మీద విపరీతమైన ఒత్తిడిని తీసుకువచ్చారు. కానీ అధికారుల చిత్తశుద్ధి ముందు మంత్రాంగాలు ఫలించలేదు. గుడి చుట్టుపక్కల ఉండే జనం కూడా బాణాసంచా ప్రదర్శనకు వ్యతిరేకంగా నిలబడటంతో అధికారుల వాదనకు తగిన బలం చేకూరింది. పైగా ఇలాంటి విషయాలలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఫలితాలు దారుణంగా ఉంటాయని వారికి తెలుసు. 1952లో శబరిమలలో జరిగిన బాణాసంచాలో 68 మంది మృత్యవువాత పడటం మొదలు... ఆ రాష్ట్రంలో తరచూ జరిగే ఇలాంటి దుర్ఘటనలు వారికి పెను హెచ్చరికలుగా నిలిచాయి.   అధికారులు ససేమీరా అనడంతో అనుమతి ఉందంటూ అబద్ధాలు చెప్పి ఆలయ నిర్వాహకులు బాణాసంచా ప్రదర్శనను మొదలుపెట్టేశారు. కానీ అబద్ధాలు దాగవు. అవి విస్ఫోటనాలై బయటపడతాయి. పుట్టంగళ్‌ ఆలయంలో అదే జరిగింది. బాణాసంచాను నిల్వ చేసిన భవంతి మీద నిప్పు రవ్వలు పడటంతో, భవంతి కాస్తా ఒక్కసారిగా పేలిపోయింది. భవనం నుంచి ఎగిరిపడిన ఇనుపచువ్వలు, కాంక్రీటు గడ్డల వల్లే ఎక్కువమంది చనిపోయినట్లు తెలుస్తోంది. దీనికితోడు పేలుడు తరువాత కరెంటు కూడా పోవడంతో ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని తొక్కిసలాట చోటుచేసుకుంది. అనుమతికి మించిన పేలుడు పదార్థాలను నిల్వ చేయడం ఒక తప్పైతే, వాటిలో నిషేధిత పేలుడు పదార్థాలను ఉపయోగించారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. ఈ పేలుడు దాదాపు 15 కిలోమీటర్ల దూరం వరకూ వినిపించిందంటే, ఆ ఆరోపణల్లో నిజం ఉందనే తోస్తుంది.   ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు తమ గాయాలను సైతం మర్చిపోయి క్షతగాత్రలకు సాయపడేందుకు ముందుకువచ్చారు. సైనిక, నౌకాదళాలు ఒక్క ఉదుటున సహాయ కార్యక్రమాలకు చేరాయి. పరామర్శల కోసం నేతలు పరుగుపరుగున వచ్చారు. ఎక్స్‌గ్రేషియాలు, సంతాప ప్రకటనలూ సాగాయి. ఆలయ అధికారుల మీద ఎలాగూ చర్యలు తీసుకుంటారు. వీటి వల్ల పోయిన ప్రాణాలు తిరిగిరావని చెప్పేందుకు పెద్దగా తత్వం తెలియాల్సిన పని లేదు. కానీ మున్ముందు ఇలాంటి ప్రమాదం జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నదే మొదటి ప్రశ్న.   బాణాసంచాను నిల్వ చేయడం, ప్రదర్శించడాల గురించి సమాజం ఇప్పటివరకూ చూసీచూడనట్లుగా ఉండేది. దానిని ఒక వినోదంగా భావించేవారే కానీ విపత్తుగా అనుమానించేవారు తక్కువ. కానీ పుట్టంగళ్ పేలుడు ఇలాంటి ప్రమాదాల గురించి గట్టిగా హెచ్చరిస్తోంది. పెళ్లిళ్లు మొదలుకొని తిరునాళ్ల దాకా ఎంత బాణాసంచా కాలిస్తే అంత గొప్ప అనుకునే స్థితిలోకి జారుకుంటున్నాం. ఇలా నిప్పుతో చెలగాటమాడితే ఏం జరుగుతుందో ఇటు ప్రజలు, అటు ప్రభుత్వమూ తెలుసుకోవాల్సిన రోజు వచ్చేసింది. అలా తెలుసుకుని మరో పుట్టంగళ్‌ ప్రమాదం జరగకుండా చూసుకోవడమే, ఈ ప్రమాదంలో మరణించినవారికి అసలైన నివాళి!

మన విద్యాలయాలకు ఏమైంది!

మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ..నిన్న జేఎన్‌యూ..నేడు శ్రీనగర్ నిట్ ఎందుకు మన విశ్వవిద్యాలయాలు రాజకీయ రణ క్షేత్రాలుగా మారుతున్నాయి. దేశ ఐక్యత, సమగ్రతలకు పెద్దపీట వేసే దిశగా పునాదులు ఏర్పర్చుకునేందుకు దోహదపడాల్సిన విద్యాలయాలలో రాజకీయాలు చోటు చేసుకోవడం, ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. రాజకీయాలకు అతీతంగా విశ్వమానవ సౌభ్రాతృత్వంతో విశాల దృక్పథాలను అలవర్చుకునేందుకు వాటిని పెంపొందించే దిశలో కీలక భూమిక పోషించాల్సిన విశ్వవిద్యాలయాలు కొందరు రాజకీయ నాయకుల స్వార్ధం కోసం వాటి లక్ష్యాన్ని కోల్పోతున్నాయన్న ఆవేదన వ్యక్తమవుతోంది.   హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో  రాజుకున్న నిప్పు దళిత రీసెర్చ్ స్కాలర్ వేముల రోహిత్ ప్రాణం తీసింది. ఇక అక్కడి నుంచి ఇది రాజకీయ రంగు పులుముకుంది. దేశంలోని బడా రాజకీయ వేత్తలందరూ హెచ్‌సీయూకీ క్యూకట్టారు. నేరం మీదంటే మీదంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఈ ఘటన కళ్ల ముందు కదులుతుండగానే ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో మరోక వివాదం చెలరేగింది.   పార్లమెంట్‌పై దాడి చేసి భారత సార్వభౌమాధికారాన్ని సవాల్ చేసిన ఘటనలో ఉరితీయబడిన ఉగ్రవాది అఫ్జల్ గురు సంస్మరణ కార్యక్రమాన్ని జేఎన్‌యూలో నిర్వహించడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిని విశ్వవిద్యాలయంలో అనుమతించింది ఎవరు? అనే చర్చ జరుగుతుండగానే అక్కడి విద్యార్థి సంఘం నేతలను అరెస్ట్ చేయడంతో ఇక్కడ మళ్లీ రాజకీయం రంగప్రవేశం చేసింది. కన్హయ్య కుమార్ అరెస్ట్ , విడుదల వివాదం సద్దుమణిగి వాతావరణం చల్లబడుతున్న సమయంలో మరోసారి కేంద్ర విశ్వవిద్యాలయంలో అగ్గిరేగింది. అందుకు వేదిక శ్రీనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.   టీ20 వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్‌ చేతిలో టీమిండియా ఓటమి పాలవ్వడంతో స్థానిక విద్యార్థులు పెద్ద ఎత్తున టపాసులు కాల్చి భారత వ్యతిరేక నినాదాలు, పాక్ అనుకూల నినాదాలు చేశారు. దాంతో స్థానికేతర విద్యార్థులు భారత అనుకూల నినాదాలు చేశారు. వీరిద్దరూ పోటాపోటీగా నినాదాలు చేస్తూ ఘర్షణకు దిగారు. అనంతరం రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నారు. ఈ గొడవ చిలికి చిలికి గాలివాన అయ్యింది. ఏకంగా స్థానిక విద్యార్థులను హాస్టల్ ఖాళీ చేసి ఇళ్లకు వెళ్లాలని మేనేజ్‌మెంట్ ఆదేశించిందంటే అక్కడ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.   పై ఘటనలన్నీ గమనిస్తే అవన్నీ భారతదేశానికి వ్యతిరేకంగా జరిగినవే. దేశభక్తిని రగలించవలసిన విశ్వవిద్యాలయాలు, జాతి వ్యతిరేకతను రగిలిస్తున్నాయి. ఈ పనులన్నీ విద్యార్ధులే చేస్తున్నారా లేక విద్యార్థులతో బయటి వారేవరైనా చేయిస్తున్నారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇదిలా కొనసాగుతూ పోతే అది యావత్ దేశానికే పెనుముప్పుగా మారి మనలో మనమే కొట్టుకోవాల్సిన పరిస్థితి రావచ్చు.  

మధుమేహం- ముందుచూపే అసలు మందు!

  ఏటా ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పేరుతో ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహనను పెంచేందుకు కృషి చేస్తోంది. అందులో భాగంగా ఈసారి మధుమేహం మీద తన యుద్ధాన్ని ప్రకటించింది ఆరోగ్య సంస్థ. ఒకప్పుడు మధుమేహాన్ని ఎవరో డబ్బున్నవారికి వచ్చే జబ్బనీ, ఎక్కడో ఒకరికి మాత్రమే కర్మ కొద్దీ ఏర్పడే అసౌకర్యం అనుకునేవారు. కానీ పరిస్థితులు మారిపోయాయి. ఒక అధ్యయనం ప్రకారం 1980లో 1.19 కోట్ల మంది భారతీయులు ఈ వ్యాధిబారిన పడితే, ప్రస్తుతం ఈ సంఖ్య ఆరుకోట్లని దాటిపోయిందని అంచనా! మధుమేహం కనుక ఇదే ఊపుతో విస్తరిస్తూ వెళ్తే, భారతదేశం ప్రపంచానికే మధుమేహ రాజధానిగా మారిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.   మధుమేహం రావడానికి జన్యుపరమైన లోపాలే ముఖ్యకారణం అన్న విషయంలో సందేహం లేదు. అయితే అసంబద్ధమైన జీవనశైలి వల్లే ఈ లోపం బయపడుతోందన్నది నిపుణుల మాట. ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటూ, తక్కువ పని చేయడంతో శరీరం త్వరగా మధుమేహానికి లోనవుతోందని తేలింది. బేక్ చేసిన ఆహారపదార్థాలు, శీతలపానీయాలు, మద్యం, వేపుళ్లు, పాలిష్‌డ్ బియ్యం.... ఇవన్నీ మన జీవితంలో భాగమైపోయాయి. తొలుత ఇవి ఊబకాయానికీ, తరువాత మధుమేహానికీ దారితీస్తున్నాయి. అదే స్థానంలో ఆకు కూరలు, పండ్లు, సంప్రదాయ వంటకాలు... మనకు దూరమైపోతున్నాయి. వీటికి తోడు ఏమాత్రం వ్యాయామం లేని జీవనశైలి కూడా కొంప ముంచుతోంది. సీట్లకు అతుక్కుపోయే ఉద్యోగాలు, ఒక్క నాలుగు అడుగులు కూడా వేయడానికి బద్ధకించే మనస్తత్వాలు మనల్ని మరీ సుకుమారంగా మార్చేసి... రోగగ్రస్తులుగా మార్చేస్తున్నాయి. పాఠశాలల్లో ఆటస్థలాలు ఉండవు. ఉద్యోగాలలో ప్రశాంతత కరువు. దీంతో అటు ఆహారమే కాదు మానసిక ఒత్తిడి, శారీరిక స్తబ్దత కూడా మధుమేహానికి కారణాలుగా మారుతున్నాయి.   మధుమేహం రావడం దురదృష్టమే! అయితే, వచ్చిన తరువాత రోగుల ప్రవర్తన కూడా అంతే నిరాశను కలిగిస్తోంది. మధుమేహాన్ని అదుపుచేసుకునేందుకు మందులు ఎంత అవసరమో, జీవనశైలిలో మార్పులు కూడా అంతే అవసరం అన్న నిజాన్ని చాలామంది గ్రహించరు. మధుమేహం వచ్చే లక్షణాలు కనిపించిన వెంటనే జీవనశైలిలో పెనుస్థాయి మార్పులను కనుక తీసుకురాగలిగితే, చాలా రోజులపాటు దాని దుష్ఫలితాల నుంచి తప్పించుకోవచ్చు. వెల్లుల్లి, మెంతులు, వేప, కాకరకాయ వంటి పదార్థాలను తీసుకోవడం; ప్రాణాయామం, ధ్యానం వంటి పద్ధతులతో ఒత్తిడిని తగ్గించుకోవడం; రోజులో ఎంతో కొంత నడకను అలవాటు చేసుకోవడం; పాలిష్‌డ్, ప్రాసెస్‌డ్ తదితర ఆహారపదార్థాలకు దూరంగా ఉంటూ, మనం తీసుకుంటున్న కేలరీలను గమనించుకోవడం; ఎప్పటికప్పుడు షుగర్, బీపీలను పరీక్షి చేయించుకోవడం.... లాంటి చర్యలతో శుభ్రంగా మధుమేహంతో కలిసిమెలిసి జీవించవచ్చు.   అదుపులో ఉంటే మధుమేహం వల్ల ఎలాంటి ఇబ్బందులూ తలెత్తవు. అందుకే చాలామంది వైద్యులు దీనిని ఒక రోగంగా కాకుండా ఒక లోపంగా భావిస్తారు. ఆ లోపాన్ని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండమని చెబుతారు. కానీ రోగులే అలసత్వాన్ని చూపుతూ ఉంటారు. ఒకసారి మధుమేహం వచ్చిందని తేలాక వైద్యులు ఏ మందులనైతే అందించారో, అవే మందులను తమంతట తాము దశాబ్దాల తరబడి వాడేవారు ఉన్నారు. అసలు మందులనే వాడకుండా ఆయాస, నీరసాలతో నెట్టుకొచ్చేసేవారూ ఉన్నారు. ఇక మందులు ఎలాగూ వాడుతున్నాం కదా అని, ఆహారం నియమాలు పాటించని వారి సంగతి సరేసరి! మన దేశంలో రోగులు ఇంత నిర్లక్ష్యంగా ఉంటారు కాబట్టే ఔషధి సంస్థలు కూడా అంతే బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నాయి. ఇష్టం వచ్చిన పాళ్లలో రకరకాల మందులను ఒక చోటకి చేర్చి ఒక పేరుని పెట్టి కౌంటర్‌ మీదే అమ్మేస్తున్నాయి. అందుకే ఈ మధ్య ప్రభుత్వం నిషేధించిన మందులలో మధుమేహానికి సంబంధించినవి చాలా ఎక్కువమొత్తంలో ఉన్నాయి.   ఇక మధుమేహానికి సంబంధించిన మందులను సుదీర్ఘకాలం వాడితే ఎలాంటి దుష్ఫలితాలు వస్తాయన్న విషయం మీదా తగిన పరిశోధనలు జరగడం లేదు. ఉదాహరణకు పయోగ్లిటజోన్‌ అనే మందుని సుదీర్ఘకాలం వాడితే మూత్రాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అయినా అటు వైద్యులు కానీ ఇటు ఔషధి కంపెనీలు కానీ ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకుంటున్నట్లు లేదు. మన ఆరోగ్యాన్నంతా ఇప్పుడు కార్పొరేట్‌ సంస్థలే నియంత్రిస్తున్నాయి కదా! మధుమేహం విషయంలో వచ్చిన మరో పెనుమార్పు వైద్య ఖర్చు. ఒకప్పుడు మధుమేహానికి కావల్సిన మందులను ఫ్యామిలీ డాక్టర్లే ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మధుమేహానికి ప్రత్యేకమైన రంగం ఏర్పడింది. కార్పొరేట్‌ ఆసుపత్రికి వెళ్లి వీరిని కలవాటంటే 500 రూపాయలు కన్సల్టేషన్‌ ఫీజుకీ, 500 రూపాయలు షుగర్‌ నిర్థరణకీ సమర్పించుకోవాలి. ఇక మందులు ఇతరత్రా ఖర్చుల సంగతి చెప్పనే అవసరం లేదు. అలా మధుమేహం కూడా ఖరీదైన జబ్బుల జాబితాలోకి చేరిపోయింది.   మధుమేహం అనేది ఇప్పుడేమీ తెలియని వ్యాధి కాదు. ఇది ఎందుకు వస్తుంది. వచ్చాక ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి... లాంటి ప్రాథమిక సమాచారం అంతా ఇప్పుడు అందుబాటులో ఉంది. కాబట్టి ఇప్పటి తరానికి చిన్నప్పటి నుంచే సరైన జీవనశైలిని అలవాటు చేయాలి. సుదీర్ఘకాలం టీవీల ముందు కూర్చోవడం, వీడియోగేమ్స్‌తో సమయాన్ని గడపడం మాన్పించాలి. వారి తిండి విషయంలోనూ తగినంత జాగ్రత్త వహించాలి. బ్రెడ్డూ, బిస్కెట్, జామ్‌లే వారి అల్పాహారంగా మారకూడదు. పిజ్జాలతో వారి సరదా తీరకూడదు. ఇక అన్నింటికీ మించి వాళ్లు ఆటలాడుకునేందుకు తగినన్ని అవకాశాలు కల్పించాలి. మనమూ కొంత సమయాన్ని వారితో గడిపేందుకు ప్రయత్నించాలి. ఈ కాస్త జాగ్రత్తా తీసుకుంటే వారి కెరీర్‌ సంగతి తరువాత విషయం, కనీసం వారి ఆరోగ్యానన్నా కాపాడినవారమవుతాం. ఆరోగ్యం బాగుండి మనసు దృఢంగా ఉంటే... కెరీర్‌ దానంతట అదే దారికొస్తుంది. కాబట్టి ఇప్పుడు మన ముందు ఉన్న సవాళ్లు రెండు. ఒకటి మనం మధుమేహం నుంచి బయటపడటం. రెండు- మన పిల్లల జోలికి అది రాకుండా చూసుకోవడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరుకుంటోంది ఇదే!

పఠాన్‌కోట్‌ దాడులు మనం ఆడిన నాటకమా!

  ఏ దేశమైనా తన మీద ఫలానా ఉగ్రవాది, ఫలానా ప్రాంతంలో దాడి చేయబోతున్నాడని తెలిస్తే... అతని కోసం ఎదురుచూస్తూ కూర్చుంటుందా! దాడి తరువాత అతన్ని మట్టుబెట్టి, రోజుల తరబడి పోరాటం జరుగుతున్నట్లు నాటకం ఆడుతుందా! ఇలాంటి ఆలోచనలు చేసే మనిషి మానసిక ఆరోగ్యం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ పాకిస్తాన్‌ నుంచి మంచి హడావుడిగా వచ్చిన సంయుక్త దర్యాప్తు బృందం చెబుతున్న మాటలివి. పాకిస్తాన్‌లోని వివిధ రక్షణశాఖల నుంచి ఎంపిక చేసిన అయిదుగురు మహామహులు చెబుతున్న చిలకపలుకులివి.   ఈ ఏడాది జనవరి 2న ఆరుగురు తీవ్రవాదులు పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరం మీద దాడి చేసిన విషయం ప్రపంచం అంతా చూసింది. నాలుగు రోజుల పాటు జరిగిన పోరులో, ఎట్టకేలకు దాడిలో పాల్గొన్న ఆరుగురు తీవ్రవాదులనూ చంపగలిగింది సైన్యం. కానీ ఈ పోరాటంలో ఏడుగురు సైనికులను పోగొట్టుకుంది. ఎక్కువ కష్టపడకుండానే, ఈ దాడికి కారకులు ఎవరో తెలిసిపోయింది. తీవ్రవాదులంతా పాకిస్తాన్‌ నుంచే వచ్చారనీ, వారందరినీ జైష్‌-ఏ-మహమ్మద్ అనే సంస్థ పంపించిందనీ తేలిపోయింది. అందుకు సంబంధించిన ఫోన్‌ రికార్డుల దగ్గర్నుంచీ, డీఎన్‌ఏ నమూనాల వరకూ మన ప్రభుత్వం పాకిస్తాన్‌కు అందించింది. ఇంత చేసిన తరువాత కూడా పాకిస్తాన్‌ ఏదన్నా చర్య తీసుకుంటుందన్న నమ్మకం ఎలాగూ లేదు. కనీసం జైష్‌-ఏ-మహమ్మద్‌ అధినేత మౌలానా మసూద్‌ అజార్‌ని కట్టడి చేస్తుందన్న చిన్న ఆశ భారత ప్రభుత్వానిది. అది ఎలాగూ జరగలేదు సరికదా, అంతర్జాతీయంగా పెరిగిపోతున్న ఒత్తడిన తట్టుకునేందుకు, పాకిస్తాన్ ‘విచారణ సంఘం’ అనే నాటకాన్ని మొదలుపెట్టింది. భారత్ చేస్తున్న ఆరోపణల్లో నిజానిజాలు తేల్చి, సంబంధితుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ ఓ ఐదుగురు మహామహులను ఎంపిక చేసి ఈ నెల 27న భారతదేశానికి పంపింది.   విచారణ సంఘం మన దేశంలోకి అడుగుపెడుతూనే తన నాటకాలను మొదలుపెట్టింది. ఇటు మీడియాను ఎలాగూ తప్పించుకుని తిరిగింది. అటు భారతీయ పరిశోధనా సంస్థ (NIA)తో కూడా అంటీ ముట్టనట్లు ప్రవర్తించింది. విన్న ప్రతి మాటకీ తల ఊపింది. చూసిన ప్రతి విషయాన్నీ రాసుకుంది. కానీ పాకిస్తాన్‌కు వెళ్లిన తరువాత తన వ్యూహాన్ని అమలుచేయడం మొదలుపెట్టింది. పాకిస్తాన్‌ మీడియా చెబుతున్న మాట వాస్తవమే అయితే, పఠాన్‌కోట్‌ దాడులకు సంబంధించి జిట్ రూపొందించిన నివేదిక అంత దారుణం మరొకటి ఉండదు. ఈ నివేదిక ప్రకారం...   - పఠాన్‌కోట్‌ మీద దాడులు జరగబోతున్నాయన్న విషయం భారతదేశానికి ముందుగానే తెలుసు.   - తెలిసి కూడా పాకిస్తాన్‌ను బద్నాం చేయడానికి పన్నాగం పన్నింది   - అందుకు అనుగుణంగానే పఠాన్‌కోట్‌లో భారీ బందోబస్తుని ఏర్పాటు చేసి, ఉగ్రవాదుల కోసం వేచి చూసింది.   - ఉగ్రవాదులు స్థావరంలోకి అడుగుపెట్టగానే వారిని కాల్చిపారేసింది.   - దాడి విషయంలో ప్రపంచం దృష్టిని ఆకర్షించేందుకు, నాలుగు రోజుల పాటు పోరు జరిగినట్లు నాటకం ఆడింది.   - పైగా ఈ ఉగ్రవాదులు పాకిస్తాన్‌ తీవ్రవాదులు అనడానికి ఎలాంటి ఆధారాలూ లేవు.   - ఇదంతా కూడా భారతీయ ప్రభుత్వం, సైన్యం కలిసి ఆడిన నాటకం.   - విచారణలో భారతీయ పరిశోధనా సంస్థ (NIA), తమకు ఎలాంటి సాయమూ చేయలేదు.   ఇవీ జిట్‌ నివేదికలోని అంశాలుగా పాకిస్తాన్ మీడియా పేర్కొంటోంది. పైగా తీవ్రవాదులు గోడలు ఎక్కేందుకు తాళ్లు కనిపించలేదనీ, స్థావరానికి పెద్దగా నష్టం వాటిల్లలేదని.... కోడిగుడ్డు మీద ఈకలు పీకేందుకు ప్రయత్నించింది జిట్‌. అన్నింటికీ మించి దారుణం ఏమిటంటే, ఈ విషయాలన్నీ తెలిసిన ఓ NIA అధికారిని భారతీయ సైన్యం చంపిపారేసిందని ఆరోపించడం. ఈ వివరాలన్నీ వింటుంటే భారతీయుల రక్తం ఉడికిపోవచ్చుగాక. కానీ ఒకరకంగా మన ప్రభుత్వం చూపిన మంచితనానికి మూల్యమే ఇది.   జిట్‌ రాకను ఆది నుంచీ కూడా ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తూనే ఉన్నాయి. పాకిస్తాన్‌కు చెందిన ఒక పరిశోధన బృందం భారతదేశానికి రావడం ఇంతకు ముందు ఎన్నడూ జరగనే లేదు. ఈ బృందం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదనీ, పైగా మన దేశాన్ని బద్నాం చేసేందుకే అది ప్రయత్నిస్తుందనీ అందరూ భయపడుతూనే ఉన్నారు. శివసేన, ఆప్‌ వంటి పార్టీలు జిట్ రాకను వ్యతిరేకించాయి. అయినా పాకిస్తాన్‌ ఒక్కసారన్నా వాస్తవాలకు అనుకూలంగా ప్రవర్తించకపోతుందా అన్న ఆశ మన ప్రభుత్వానిది. ఆ ఆశ కూడా ఇప్పుడు చెల్లిపోయింది. ఇప్పుడు జిట్‌ను దేశంలోకి రానిచ్చినందుకు మోదీ తీవ్రమైన విమర్శలను వినవలసి వస్తోంది. కేజ్రీవాల్‌ వంటి వారి విమర్శలకైతే అడ్డే లేకుండా పోయింది. షరీఫ్, మోదీ మధ్య ఏదో లాలూచీ జరిగిందనీ... ఇండియా పరువు తీశారనీ... వెన్నుపోటు పొడిచారనీ... ఇలా రకరకాల మాటలు వస్తున్నాయి.   మరోపక్క మసూద్ అజార్‌ను బహిష్కరించేందుకు ఐరాస వేదిక మీద భారత్‌ చేసిన ప్రయత్నమూ చెల్లకుండా పోయింది. మన దేశాన్ని అపహాస్యం చేస్తూ, చైనా అజార్‌ను వెనకేసుకు వచ్చింది. జరుగుతున్న పరిణామాల మీద మోదీ ప్రభుత్వం ఏదన్నా కఠినమైన నిర్ణయాన్ని తీసుకోవాలని దేశప్రజలు ఆశిస్తున్నారు. ఉత్త నిరసనలు, మాటల విరుపులకు ఇక కాలం చెల్లిపోయింది. ఉగ్రవాదులకు, వారికి శిక్షణను అందిస్తున్న సంస్థలకు, ఆ సంస్థలకు పాలు పోసి పెంచుతున్న ప్రభుత్వాలకు గట్టి జవాబునివ్వాల్సిన తరుణం వచ్చింది. లేకపోతే ఏకంగా మన దేశం మీదే యుద్ధం చేసి, మనమే ఆ నాటకం ఆడామని పాకిస్తాన్‌ చెప్పే రోజులు వస్తాయేమో.

ప్రపంచాన్ని తలకిందులు చేసిన కుంభకోణం

    పొలం అమ్మిన డబ్బులను బ్యాంకులో వేసుకుంటే ఆదాయపన్ను శాఖ నోటీసులు పంపిస్తుంది. ఆటో ముందు చక్రం ట్రాఫిక్ గీత దాటితే అధికారులు చలాన్లను నింపుతారు. కానీ పనామా పేపర్స్ బయటపెడుతున్న వివరాలు చూస్తే, ప్రపంచంలోని నిబంధనలన్నీ పేదవాళ్ల కోసమే రూపొందించినట్లు తోస్తుంది. పనామా పేపర్స్.... పేదవాడి రక్తాన్ని ఉడికిస్తున్న పేరు ఇది. 40 ఏళ్లుగా బడాబాడులు కలిసి బడుగుల నుదుట రాసిన రాత ఇది. దాని కథ ఇది!   అమితాబ్, ఐశ్వర్య, జాకీచాన్, ఫుట్‌బాల్‌ ఆటగాడు మెస్సీ, రష్యా అధ్యక్షుడు పుతిన్... ఇదంతా ఏదో ప్రతిభావంతుల జాబితా కాదు! పనామా పేపర్స్ ముసుగు చించిన పన్ను ఎగవేతదారుల చిట్టా. వీరంతా కలిసి తమ ప్రభుత్వాలని మోసం చేసి, విదేశాలలో కోట్లకు కోట్లు దాచుకున్నారన్నది ఈ కుంభకోణంలోని ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణ చేసింది ఎవరో నోరుజారిన రాజకీయవేత్త కాదు. దాదాపు 80 దశాలకు చెందిన 377 మంది జర్నలిస్టులు. ఈ పరిశోధనలో మన దేశానికి చెందిన ఇండియన్ ఎక్సప్రెస్‌కు కూడా భాగస్వామిగా ఉంది. ‘ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్‌ ఇన్‌వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్’ అనే అంతర్జాతీయ సంస్థ ఆధ్వర్యంలో సాగిన శోధన ఇది.   తరాలు గడిచినా తరగనంత డబ్బున్నవారు, విదేశాలలో తమ నల్లధనాన్ని దాచుకోవడం కొత్తేమీ కాదు. ఇలాంటి నల్లధనాన్ని తమ వద్ద దాచుకోమంటూ కొన్ని చిన్నా చితకా దేశాలు సంపన్నులను ప్రోత్సహిస్తుంటాయి. డబ్బు మీద డబ్బు వచ్చిపడుతుంటే దాన్ని తమ దగ్గర దాచుకోమంటూ ఊరిస్తుంటాయి.  సదరు దేశాల్లో డబ్బు దాచుకుంటే వాటి మీద పన్ను ఉండదు. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న అనుమానం ఉండదు. అన్నింటికీ మించి ఈ డబ్బుకి సంబంధించిన వివరాలను బయటకు వెల్లడించే ప్రశ్నే ఉండదు. ఈ దేశాల్లో నల్లధనాన్ని రెండు రకాలుగా దాచుకుంటారు. ఒకటి- అక్కడి బ్యాంకులలో ఏదో ఒక బినామీ పేరుతో డబ్బుని దాచుకుంటారు. ఈ మాటని వినగానే మనకు స్విస్‌ బ్యాంకులే గుర్తుకువస్తాయి. రోజురోజుకీ ఈ స్విస్ బ్యాంకుల మీద ఆరోపణలు పెరిగిపోవడంతో... ఇప్పుడు రెండో పద్ధతి ద్వారా డబ్బుని దాచుకోవడం మొదలైంది. అదే షెల్ కంపెనీల పద్ధతి.     షెల్ కంపెనీ పద్ధతిలో ఏదో ఒక కంపెనీని చట్టబద్ధంగా సృష్టిస్తారు. ఇక అక్కడి నుంచీ ఆ కంపెనీతో తమ ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటారు. దానికి పెట్టుబడిని సమకూరుస్తున్నట్లుగా బినామీ పేర్లతో భారీ షేర్లను కొనుగోలు చేయించవచ్చు; సదరు కంపెనీ మీద విపరీతమైన లాభాలు వచ్చేసినట్లు చూపించవచ్చు; ఈ చిన్నపాటి కంపెనీ పనితీరు నచ్చేసి ఎవరో విపరీతమైన ధరకు దాన్ని కొనుగోలు చేసినట్లు చూపించవచ్చు... చివరికి డబ్బుని ఒక్కసారిగా మాయం చేయాలంటే, కంపెనీ విపరీతమైన నష్టాల్లో ఉందని చెప్పి మూసేయించవచ్చు. ఈ పద్ధతి ద్వారా కనిపించే లాభనష్టాలు అన్నీ చట్టప్రకారమే ఉన్నట్లు కనిపిస్తాయి. కానీ చట్టంలో ఎన్ని లొసుగులు ఉన్నాయో అన్ని లొసుగులనూ వాడుకునే అవకాశాన్ని కల్పిస్తాయి.     ప్రస్తుతానికి ఇలాంటి చట్ట’వ్యతిరేక’ సంస్థలకు ప్రాణం పోసే ఓ పెద్ద కంపెనీ గుట్టు రట్టయ్యింది. డబ్బుకి సంబంధించి ఇలాంటి దివాళాకోరు పనులు జరుగుతాయని అందరికీ తెలిసినా, మరీ ఈ స్థాయిలో... ప్రపంచానికి సమాంతరంగా మరో ఆర్థిక ప్రపంచం నడుస్తోందన్న నిజం మాత్రం ఇప్పుడు భయం గొలుపుతోంది. ఒక్క భారతదేశం నుంచే దాదాపు 500 మంది ప్రముఖుల పేర్లు ఈ కుంభకోణంలో వినిపిస్తున్నాయంటే, మనం ఎందరు బుద్ధిజీవుల మద్య బతుకుతున్నామో తెలుస్తోంది. ఇక కమ్యూనిస్టులు అక్రమాలకు పాల్పడరు, ఆఫ్రికాలో పేదరికం తాండవిస్తుంది... వంటి వాక్యాలు కూడా ఈ కుంభకోణంతో వెలవెలబోయాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్‌, చైనా కమ్యూనిస్టు నాయకుల పేర్లు ఈ పేపర్లో కనిపించాయి. ఘనా, కాంగో వంటి ఆఫ్రికా దేశాల అధినేతల పేర్లూ ఈ చిట్టాలో చోటు చేసుకున్నాయి.     ఈ కుంభకోణానికి కేంద్రబిందువుగా పనామా నిలిచింది. ఒకప్పుడు అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలను కలుపుతూ పనామా కెనాల్‌ను నిర్మించిన ఈ గడ్డ మీదే, ఇప్పుడు నల్లధనం మరో సముద్రమై ప్రవహిస్తూ కనిపించింది. ఈ దేశంలో ఉన్న మొస్సాక్ ఫోన్సెకా అనే ఓ సంస్థ, వాణిజ్య సేవల పేరుతో, నల్లధనాన్ని ఎలా చట్టబద్ధంగా మార్చుకోవాలో ఈ సంస్థ సూచిస్తున్నట్లు తేలింది. 1977లో ఈ సంస్థ ఏర్పాటైన దగ్గర్నుంచీ గడచిన నాలుగు దశాబ్దాలో ఈ కళలో మొస్సాక్‌ ఫోన్సెకా ఆరితేరిపోయింది. వ్యాపారస్తుల దగ్గర్నుంచీ దేశాధ్యక్షుల వరకూ నల్లధనానికి సంబంధించి ఏ అవసరం వచ్చినా తన వైపు చూసే స్థాయికి ఈ సంస్థ ఎదిగింది. కానీ పాపం పండక తప్పలేదు. ఒళ్లు మండిన మాజీ ఉద్యోగి ఎవరో మొస్సాక్ ఫోన్సెకాకు సంబంధించిన వ్యవహారాన్నంతా బట్టబయలు చేయడంతో నిష్టురమైన నిజాలన్నీ ఇప్పుడు ప్రపంచం ముందుకు వచ్చాయి.      రాబోయే రోజులలో ఈ కుంభకోణంలో మరిన్ని పేర్లు బయటపడవచ్చు. ప్రభుత్వాలకు ప్రభుత్వాలే కూలిపోవచ్చు. ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణంగా పేర్కొంటున్న పనామా పేపర్స్ ద్వారా ఏదైనా జరగవచ్చు. కానీ ఒక్కటిమాత్రం వాస్తవం! ఒకవైపు ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు జరుగుతుంటే... కోట్ల కొద్దీ రూపాలయను దర్జాగా దాచుకునే అవకాశాన్ని ప్రభుత్వాలు ఎలా కల్పించగలుగుతున్నాయి? రూపాయి రూపాయికీ లెక్కలు అడిగి పన్నులు వసూలు చేసే వ్యవస్థలు, పెద్దవారిని చూసీ చూడనట్లు ఎందుకు వదిలేస్తున్నాయి? ఈ ప్రశ్నలకి కనుక సరైన సమాధానం లభించకపోతే, రగులుతున్న పేదవాడి మనసు పగలక మానదు. అప్పుడు వచ్చే విప్లవం ముందు ఫ్రాన్స్‌, రష్యా విప్లవాలు సైతం చిన్నబోతాయి. అలాంటి పరిస్థితి రాకుండానే, ప్రభుత్వాలు కళ్లు తెరవాలని కోరుకుందాం.  

తీవ్రవాదానికి మరో పేరు- మౌలానా మసూద్ అజార్!

  మౌలానా మసూద్ అజార్! ఒకప్పుడు చిన్నపాటి తీవ్రవాద సంస్థకి అధినాయకుడిగా ఉంటూ, ఆ సంస్థ కోసం విరాళాలు సేకరించుకునే వ్యక్తి, ఇప్పుడు భారతదేశానికి తొలి శత్రువుగా మారాడు. తాను ఉగ్రవాడిని కాదంటూ సాక్షాత్తూ చైనా చేతే ముద్ర వేయించుకుని, బోర విరుచుకుని తిరుగుతున్నాడు. మనిషిగా ఎదగడానికి చాలా శ్రమించాలి. కానీ ఒక తీవ్రవాదిగా పేరు సంపాదించుకోవడానికి, తనలోని మానవత్వాన్ని చంపుకోవాలి. అందులో అజార్ నిష్ణాతుడు. అందుకే ఈ రోజున తను మన నోళ్లలో నానుతున్నాడు. పాకిస్తానులోని పంజాబులో మొదలై ఐక్యరాజ్య సమితి దగ్గర ఆగిన అజార్ ప్ర‌స్థానం తీరు ఇది...   1968లో అజార్ ఓ స్కూల్ హెడ్మాస్టరు ఇంట పుట్టాడు. ఆ ఇంట 11 మంది సంతానం. అసలు చదువుకోకుండా ఉంటే అజార్ తీరు ఎలా ఉండేదో కానీ, కరాచీలోని `జామియా ఉలూమ్ ఉల్ ఇస్లామియా` అనే మతబోధనాసంస్థలో చేరడంతో, అజార్ దృక్పథం అతివాదం వైపు మళ్లింది. కశ్మీర్ ప్రాంతాన్ని భారతదేశం బలవంతంగా ఆక్రమించుకుందనీ, అక్కడ ఉండే సాటి ముసల్మానులను చిత్రహింసలు పెడుతోందనీ... ఆ బడిలోని పిల్లలందరూ వినే మాటలనే అజార్ కూడా విని ప్రభావితుడయ్యాడు. కశ్మీర్‌ను ఎలాగైతే భారతదేశం నుంచి విడదీయాలని కంకణం కట్టుకున్నాడు. `హర్కత్ ఉల్ అన్సార్` అనే తీవ్రవాద సంస్థలో చేరి, తనలోని అతివాదానికి పదునుపెట్టాడు. ఆ సంస్థ తరఫున అనేక తీవ్రవాద కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనడం మొదలుపెట్టాడు అజార్. అలా ప్రపంచమంతా తిరుగుతూ, రకరకాల తీవ్రవాద సంస్థలతో పరిచయాలను ఏర్పరుచుకున్నాడు. సోమాలియా వంటి మారుమూల దేశాలలో సైతం సంచరిస్తూ, ప్రపంచమంతటా ఉగ్రవాదాన్ని విస్తరించేందుకు  ప్రయత్నించాడు. అంచెలంచెలుగా ఎదుగుతున్న అజార్ ఉనికిని భారతదేశం మొదట్లోనే గ్రహించింది. అందుకే 1994లో అజార్ ఎప్పుడైతే ఉగ్రవాదాన్ని పోషించేందుకు శ్రీనగర్లో అడుగుపెట్టాడో, అదనుచూసిన భారతీయ దళాలు అజార్‌ను పట్టుకున్నాయి. అజార్‌ను శిక్షించేందుకు మ‌న న్యాయవ్యవస్థ ఎప్పటిలాగే నిదానంగా ప్రతిస్పందించింది. ఈలోగా అజార్‌ను విడిపించుకునేందుకు అజార్ తమ్ముడు ఇబ్రహీం పన్నిన వ్యూహంలో మన దేశం చిక్కుకోక తప్పలేదు. 1999 డిసెంబరులో ఇబ్రహీం మరి కొందరు తీవ్రవాదులతో కలిసి ఏకంగా ఓ భారతీయ విమానాన్నే హైజాక్ చేశాడు. బదులుగా అజార్‌తో పాటు మరో ఇద్దరు తీవ్రవాదులను భారతీయ ప్రభుత్వం విడిపించాలంటూ షరతుని విధించాడు.  విమానంలో వందమందికి పైగా ప్రయాణికులు. పైగా విమానాన్ని నిలిపింది తాలిబాన్లు పాలిస్తున్న కాందహార్ ప్రాంతంలో! దాంతో భారతీయ ప్రభుత్వం తల వంచక తప్పలేదు. క్లిష్ట పరిస్థితుల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకోలేమన్న విమర్శలను స్వాగతిస్తూ, భారతీయ అధికారులు స‌ద‌రు తీవ్రవాదులను సగౌరవంగా వారి దోస్తులకు అప్పగించారు.   అజార్‌ను అప్పగించకపోతే వంద ప్రాణాలు పోతాయన్న భయం సహేతుకమే! కానీ అలాంటి తీవ్రవాదికి మళ్లీ అవకాశం కల్పిస్తే ప్రపంచం ఏమైపోతుందో మనం ఊహించలేకపోయాం. ఫలితం! పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ISI అజార్‌ను సాదరంగా తోడ్కొని తమ దేశంలోకి తీసుకువెళ్లింది. పైగా అజార్ తమ దేశంలో ఎలాంటి నేరాలూ చేయలేదు కనుక అతడి మీద ఎలాంటి చర్యలూ తీసుకోమని తేల్చి చెప్పింది. అంతకంటే దారుణం ఏమిటంటే, ISI స్వయంగా స్థాపించిన జైష్ ఏ మహమ్మద్ అనే సంస్థకు నాయకుడిగా పట్టం కట్టింది. అలా పాముకి పాలు పోసి, కోరలు పెంచి ప్రపంచం మీదకి వదిలింది పాకిస్తాన్. ఇంత అవకాశం ఇచ్చాక అజార్ ఊరుకుంటాడా.. `భారత దేశాన్ని నాశనం చేసేదాకా నిద్రపోనని` కరాచీలో ఓ బహిరంగ సభను నిర్వహించి మరీ ప్రతిన పూనాడు. అన్నట్లుగానే 2001లో ఏకంగా భారత పార్లమెంటు మీదే దాడి చేయించాడు. ప్రాణనష్టం అటుంచితే, మన ప్రజాస్వామ్యమే ఈ చర్య ద్వారా అపహాస్యం అయిపోయింది. అప్పుడు కూడా పాకిస్తాన్ అజార్‌ను వెనకేసుకు వచ్చింది. ఓ ఏడాది పాటు గృహనిర్బంధంలో ఉంచుతున్నామంటూ సన్నాయి నొక్కులు నొక్కింది.   పాకిస్తాన్ అండగా అజార్ కశ్మీర్ ఉగ్రవాదాన్ని కొత్త లోతులకు తీసుకువెళ్లాడు. అదను చూసి పఠాన్‌కోట్‌లోని మన వైమానికస్థావరం మీదే దాడి చేయించాడు. మన రక్షణ వ్యవస్థ ఇంత బలహీనంగా ఉందంటూ సిగ్గుపడేలా చేశాడు. ఈ ఘటనలో రక్షణదళాలకు చెందిన ఏడుగురు అశువులు బాశారు. దాడికి కారణం అజారే అంటూ మన దేశం ఎన్ని ఆధారాలను చూపినా పాకిస్తాన్ ఒప్పుకునేందుకు సిద్ధపడలేదు సరికదా, అమెరికా వంటి దేశాల నుంచి ఒత్తిడి పెరిగిన తరువాత కూడా అజార్ జోలికి వెళ్లలేదు. తన ఒంటి మీద చేయి వేసి చూడండి అంటూ అజార్ సవాలు విసిరినా కిమ్మనకుండా ఉండిపోయింది. పాకిస్తాన్ తనంతట తానుగా అజార్ మీద చర్య తీసుకోదని భారత్‌కు అర్థమైపోయింది. దాంతో ఐక్యరాజ్యసమితి ద్వారా అతని మీద నిషేధం విధించేందుకు ప్రయత్నించింది. ఈ నిషేధం కనుక అమలైతే, అజార్ కదలడానికి వీలుండదు. అతని ఆస్తులని స్థానిక ప్రభుత్వం జప్తు చేసుకోవలసి ఉంటుంది. ఈ ప్రతిపాదనను పాకిస్తాన్ ఎందుకు ఆమోదిస్తుంది! అందుకని తన మిత్ర రాజ్యమైన చైనాని ఒప్పించి మరీ ఐరాసలో మన దేశం చేసిన ప్రతిపాదన వీగిపోయేట్లు చేసింది.   చైనా వంటి అగ్రదేశం ఒక తీవ్రవాదిని వెనకేసుకు రాడం కంటే దౌర్భాగ్యం మరేముంటుంది?  కానీ ఈసారి మాత్రం అజార్‌ను చూస్తూ ఊరుకునేది లేదని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. భారత్ శాంతిని కాంక్షించే దేశమే కావచ్చు. కానీ సహనానికి కూడా హద్దులు ఉంటాయని పాకిస్తాన్ ఇంకా గ్రహించినట్లు లేదు. తన దేశం మీద దాడి చేశాడని బిన్‌లాడెన్‌ను పట్టుకునేందుకు అమెరికా ఏకంగా ఒక యుద్ధమే చేసింది. మరి భారత్ ఏం చేయబోతోంది అన్నదే ఇప్పటి ప్రశ్న. యుద్ధం అనేది చాలా పెద్ద మాటే కావచ్చు.  కానీ అజార్‌ను నిలువరించేందుకు పాకిస్తాన్ మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకురావలసిన అవసరం మాత్రం ఉంది. లేకపోతే తీవ్రవాదులకు దేశభక్తి ఉండదని పాకిస్తాన్ గ్రహించే రోజులు వస్తాయి. తాను పెంచి పోషించినవారు తన పౌరుల మీదే దండెత్తే దారుణాలు కనిపిస్తాయి. మొన్న లాహోర్లో జరిగింది ఇదే!

ఇరోం షర్మిళ పోరాటం ఇది!

  సువిశాలమైన భారతదేశం. దేశంలో పదుల కొద్దీ రాష్ట్రాలు, వందల కొద్దీ భాషలు, వేల కొద్దీ వర్గాలు... ఇన్ని వైరుధ్యాలు ఉన్నప్పుడు ఎక్కడో ఒకచోట సమస్యలు చెలరేగుతూనే ఉంటాయి. ఆ సమస్యలకు పరిష్కారంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఒకోసారి వివాదాస్పదం అవుతుంటాయి. ప్రభుత్వ నిర్ణయం వల్ల తమ జీవితాలకు హాని కలుగుతుందని చెప్పగలిగే గొంతుకలు కావాలి. ఆ గొంతుకను బలపరిచే ధైర్యం సామాన్యులలోనూ ఉండాలి. అప్పుడే ప్రజాస్వామ్యం పదిలంగా ఉంటుంది. దానికి ఉదాహరణే ఇరోమ్ చాను షర్మిళ జీవితం!   ఇరోమ్‌ షర్మిళ మణిపూర్‌కి చెందిన ఒక సాధారణ మహిళ. ఆ రాష్ట్ర రాజధాని ఇంపాల్‌లో 19 మంది కుటుంబ సభ్యుల మధ్య పెరుగిన ఓ మధ్యతరగతి మనిషి. షర్మిళ మొదటి నుంచీ మానవ హక్కుల ఉద్యమాలలో చురుకుగా పాల్గొనేది. అయితే పూర్తి స్థాయి పోరాటం చేయాలన్నా ఆలోచన ఆమెకు ఏమాత్రం లేదు. మణిపూర్ సహా ఈశాన్యంలో ఉన్న ఏడు రాష్ట్రాలలోని పరిస్థితులు భారతదేశంలోని మిగతా ప్రాంతాలకంటే కాస్త భిన్నంగా ఉంటాయి. అక్కడ భౌగోళిక వాతావరణం, ప్రజల జీవన విధానం ప్రత్యేకంగా ఉంటుంది. ఈ వైరుధ్యాల వల్లనైతేనేం, స్థానిక తెగల మధ్య ఉన్న గొడవల వల్లనైతేనేం... వేర్పాటువాద ఉద్యమాలు అక్కడ ఊపందుకున్నాయి. ఈ ఉద్యమాలను అణచివేసేందుకు 1958లో Armed Forces Special Powers Act (AFSPA) అనే చట్టాన్ని తీసుకువచ్చింది ప్రభుత్వం.   AFSPA వల్ల అక్కడ విధులను నిర్వహిస్తున్న సైనికులకు విస్తృతమైన అధికారాలను కల్పించింది కేంద్రం. ఈ చట్టం కింద జవానులు ఎవరి ఇంట్లోనైనా వారెంట్‌ లేకుండానే సోదా చేయవచ్చు. ఎవరినైనా నిర్బంధించవచ్చు. దేశవ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని అనుమానం వస్తే ఎవరి మీదైనా చర్యలు తీసుకోవచ్చు. సహజంగానే ఈ చట్టాన్ని కొందరు దుర్వినియోగం చేయడం మొదలుపెట్టారు. అనుమానాస్పదం అన్న మాటకి అర్థం లేకుండా పోయింది. పౌరులు మాయం కావడం, శవాలుగా తేలడం సాధారణమైపోయింది. పనిలో పనిగా సైన్యం పేరుతో వేర్పాటువాదులు కూడా ఇలాంటి ఘాతుకాలకు పాల్పడేవారన్న విమర్శలూ ఉన్నాయి. ఏదైతేనేం. AFSPA పట్ల ప్రజల్లో వ్యతిరేకత కలిగిన మాట మాత్రం వాస్తవం! అది తమ హక్కులను హరిస్తోందన్న వారి భయంలో నిజం లేకపోలేదు!   నవంబరు 2, 2000. ఆ రోజు గురువారం. ప్రతి గురువారంలాగానే ఆ రోజు కూడా షర్మిళ తన ఇష్టదేవత లక్ష్మీదేవి పేరిట ఉపవాసం ఉంది. కానీ ఆ రోజు జరిగిన ఓ ఘటనతో, ఆ రోజు మొదలుపెట్టిన ఉపవాసాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉంది. మలోం అనే పట్నంలో జరిగిన ఒక ఘటనే ఇందుకు ప్రేరణ! ఆ రోజు మలోంలోని ఒక బస్టాపులో నిల్చొన్న పదిమంది పౌరులను నిర్దాక్షిణ్యంగా కాల్పి పారేశారు. సైన్యానికి చెందిన అసోం రైఫిల్సే ఈ ఘటనకు కారణం అన్నది ఆరోపణ. ఈ సంఘటనలో మృతి చెందిన వారి జాబితాను గమనిస్తే వారంతా అన్నెంపున్నెం ఎరుగని అమాయకులని స్పష్టం అయిపోతుంది. అలాంటి అమాయకులని పొట్టన పెట్టుకోవడంతో మణిపూర్‌ సమాజం విస్తుపోయింది. AFSPA చట్టం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని షర్మిళ అభిప్రాయపడింది. వెంటనే తన ఉపవాసాన్ని కొనసాగించింది. AFSPAని ఉపసంహరించేదాకా పచ్చి మంచినీరు కూడా ముట్టనని, జుట్టు కూడా దువ్వుకోనని, కనీసం అద్దంలో తన మొహం కూడా చూసుకోనని శపథం చేసింది.   షర్మిళ ఉపవాసాన్ని సాగించడం చూసి ఆమెకు పిచ్చి పట్టిందనుకున్నారు కొందరు. పేద కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి ప్రచారం కోసమే ఇదంతా చేస్తోందని మరికొందరు విమర్శించారు. ఆనాటి మృతులలో షర్మిళ ప్రియుడు కూడా ఉన్నాడనీ, అతనికోసమే ఇలా ప్రవర్తిస్తోందనీ మరికొందరు పేలారు. సమాజం కోసం ఒక మహిళ తన జీవితాన్ని బలి చేసుకునేందుకు సిద్ధపడటం ఏమిటన్నదే అందిరోనూ మెదిలిన సందేహం. కానీ రోజులు గడిచేకొద్దీ ఆమె పట్టుదల ప్రపంచానికి తెలియడం మొదలుపెట్టింది. షర్మిళ తన దీక్షను విరమించేందుకు నిరాకరించడంతో, ఆమెను అరెస్టు చేసి ముక్కు ద్వారానే పోషకాలను అందించడం మొదలుపెట్టారు.   గత పదహారు సంవత్సరాలుగా ఏదో ఒక కేసులో జైలులోనో, లేకపోతే ప్రభుత్వ పర్యవేక్షణలో ఆసుపత్రిలోనే షర్మిళ గడిపింది. రెండు రోజుల క్రితం ఆమెను ఆత్మహత్యాయత్నం కేసు కింద కోర్టు నిర్దోషిగా ప్రకటించినప్పటికీ, ఆమె ఇంకా ప్రభుత్వ పర్యవేక్షణలోనే తన దీక్షను కొనసాగిస్తున్నారు. ఇంఫాల్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో, పోలీసుల కనుసన్నల మధ్య ఆమె దీక్ష సాగుతోంది. ఇంత సుదీర్ఘ కాలం నిరాహారదీక్షను చేసిన రికార్డు బహుశా షర్మిళదే అయి ఉండవచ్చు. ముక్కు ద్వారా ఇన్నేళ్లు ఆహారం తీసుకున్న రికార్డు కూడా ఆమెదేనేమో! కానీ ఇవేమీ మన దేశం గర్వించే రికార్డులు కావు. ప్రభుత్వాలు మారుతూ వస్తున్నా, మారుతున్న దేశాధినేతలకు షర్మిళ ఉత్తరాలు రాస్తున్నా... AFSPA చట్టం ఇంకా కొనసాగుతూనే ఉంది. విడతలవారీగా ఈ చట్టాన్ని ఉపసంహరిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నా, ఇంకా దాని ఆనవాళ్లు అక్కడ బలంగానే ఉన్నాయి.   షర్మిళ దీక్షకి సాయంగా తృణమూల్‌ కాంగ్రెస్‌ వంటి పార్టీలు కూడా ముందుకు వస్తున్నాయి. షర్మిళకు మద్దతుగా 2004లో అసోం రైఫిల్స్‌ కార్యాలయం ముందు కొందరు మహిళలు చేసిన నగ్న ప్రదర్శనతో ప్రపంచం విస్తుబోయింది. షర్మిళకు అంతర్జాతీయ సమాజం కూడా తోడుగా నిలవడం మొదలుపెట్టింది. దేశ విదేశాల నుంచి అవార్డులు రివార్డులు సరే. ఆమె పేరు మీద విశ్వవిద్యాలయాలలో ఉపకారవేతనాలు, షర్మిళ దీక్షను బలపరిచే ఉద్యమాలు మొదలయ్యాయి. దీంతో ప్రభుత్వం కూడా ఒకో మెట్టూ దిగివస్తోంది. మరికొద్ది రోజులలోనే AFSPA చట్టాన్ని మణిపూర్‌ నుంచి పూర్తిగా తొలగించే అవకాశం ఉందని, ముఖ్యమంత్రి ఒక్రాం సింగ్ ఇటీవలే పేర్కొన్నారు. అదే కనుక జరిగితే తన తల్లి చేత్తో తొలి ముద్దను తినేందుకు షర్మిళ సిద్ధంగా ఉన్నారు. ఆ రోజు త్వరలోనే రావాలని కోరుకుందాం!

చేజారిన ప్రపంచకప్‌

  ఆట అన్నాక గెలుపోటములు సహజం! కానీ జాతీయస్థాయిలో ఆడేటప్పుడు చిన్నచిన్న తప్పులు చేసి కప్పుని చేజార్చుకుంటారని అభిమానులు ఆశించరు. కీలకమైన సమయాలలో నిక్కచ్చిగా ఆడటాన్నే మనం ప్రొఫెషనల్ అంటాము. కానీ నిన్న ఇండియా వెస్టిండీస్‌ మధ్య జరిగిన ఆటను చూసిన వారికి, మ్యాచ్‌ని చేజేతులారా కోల్పోయామన్న భావన బాధించక తప్పదు. మన జట్టు ఒత్తిడిలో గెలవడం నేర్చుకుందని సంబరపడిన వారికి... లేని ఒత్తిడిని మీద వేసుకుని ఓడిన రోజులు గుర్తుకురాక మానవు   విరాట్‌ కోహ్లీ మూడో స్థానంలో ఆడితే ఇండియా గెలుస్తుంది... రోహిత్‌ శర్మను అయిదు పరుగులకే ఔట్‌ చేస్తే విండీస్ గెలుస్తుంది...  నిన్న మ్యాచ్‌ జరగక ముందు ఇలాంటి ఊహాగానాలు చాలానే చేశారు. కానీ మ్యాచ్ ఆరంభం నుంచి ఊహలకు అతీతంగానే సాగింది. ఇండియా టాస్ ఓడిపోవడంతో మొదటి దెబ్బ తగిలింది. ఫ్లాట్‌ పిచ్‌, చిన్నగా ఉండే వాంఖడే స్టేడియం, సమయం గడిచే కొద్దీ తేమ పెరిగిపోయే వాతావరణం... ఇలాంటి పరిస్థితుల్లో   సెమీఫైనల్ అనగానే వెస్టిండీస్‌ సారథి బౌలింగ్‌ను ఎంచుకున్నాడు. ఒకరకంగా ఇది భారత బ్యాట్స్‌మెన్‌కు కలిసివచ్చే అంశమే. ఎందుకంటే మనం మొదటిసారి బ్యాటింగ్ చేసేటప్పుడే బలంగా ఉంటామని ప్రపంచం మొత్తానికీ తెలుసు. దానికి తగినట్లుగానే రోహిత్ శర్మ ఆరు బౌండరీలు బాది, 43 పరుగులు చేసి శుభారంభాన్ని ఇచ్చాడు. ఈ దశలో ఇండియా తేలికగా 200కి పై చిలుకు స్కోర్‌ సాధిస్తుందని అందరూ ఊహించారు. కానీ అజింక్య రహానే ఆటతీరుతో అంచనాలు తారుమారయ్యాయి.   T-20 క్రికెట్‌కు అనుగుణంగా దూకుడుగా ఆడే శిఖర్ ధవన్‌ను కాదని, రహానేను తీసుకోవడంతో ధోనీ వ్యూహాత్మక తప్పిదం చేసినట్లయ్యింది. అజింక్య నిదానంగా ఆడటంతో అతనికి తోడుగా వచ్చిన విరాట్ కోహ్లీ ఆటతీరు కూడా నెమ్మదించింది. అజింక్య దాదాపు ఆరు ఓవర్లకు సరిపడా బంతులు ఆడి కేవలం 40 పరుగులు చేశాడు. అజింక్య నిష్క్రమించిన తరువాత కానీ భారత రన్‌రేట్‌ పుంజుకోలేదు. దీంతో కనీసం 220 పరుగులు చేస్తుందనుకున్న ఇండియా 192 పరుగుల వద్దే ఆగిపోయింది. ఈ లక్ష్యాన్ని కాపాడేందుకు భారతీయ బౌలర్లు ఆదిలో బాగానే శ్రమించారు. బుమ్రా బౌలింగ్‌లో గేల్, నెహ్రా చేతిలో శామ్యూల్స్ ఔట్‌ కావడంతో... 19/2కి వెస్టిండీస్ పరిస్థితి దారుణంగా ఉంది.   గేల్ ఔట్ కావడంతోనే ఇండియా సగం మ్యాచ్‌ను గెలిచిందనుకున్నారు. కానీ విండీస్ ఆటగాడు సిమన్స్‌ను రెండు సార్లు నోబాల్స్‌తో ఔట్‌చేసి భారతీయ బౌలర్లు ఆదుకున్నారు. ఒక ఆటగాడు రెండుసార్లు నోబాల్స్ వల్ల బతికిపోవడం అదృష్టమైతే, అశ్విన్‌ నోబాల్ వేయడం ఆశ్చర్యం. స్పిన్‌ బౌలర్లు నోబాల్‌ వేయడాన్ని చాలా దారుణమైన తప్పిదంగా భావిస్తారు క్రికెట్ పండితులు. నో బాల్‌ మాత్రమే కాదు, భారీగా పరుగులు సమర్పించుకుంటున్న అశ్విన్ తన బౌలింగ్ కోటాను కూడా పూర్తిచేయలేకపోతున్నాడు. ఫలితం! భారత జట్టులో నెహ్రా, బుమ్రా అనే ఇద్దరు ప్రొఫెషనల్‌ బౌలర్లు మాత్రమే మిగిలారు. పార్ట్‌టైం బౌలింగ్‌ చేసే జడేజా, పాండ్యా భారీగా పరుగులు సమర్పించుకున్నారు.   ఇంత జరుగుతున్నా, భారత జట్టు ఏదో ఒక అద్భుతం చేసి విజయాన్ని సాధిస్తుందనుకున్నారు అభిమానులు. ఆఖరికి, చివరి ఓవర్లో ఎనిమిది పరుగులు చేయాల్సి వచ్చినప్పుడు కూడా ఆశలు వదులుకోలేదు. 1993 హీరోకప్‌లో సచిన్ టెండుల్కర్ వేసిన ఆఖరి ఓవరు మొదలుకొని, ఈ టోర్నీలో బంగ్లా మీద హార్థిక్‌ పాండ్యా వేసిన ఆఖరి ఓవరు వరకూ అన్నీ మననం చేసుకున్నారు. కానీ అద్భుతాలు మాటిమాటికీ జరగవు. అద్భుతాలు జరుగుతాయన్న ఆశతో ఆటలు ఆడలేం! విరాట్‌ కోహ్లీ వేసిన ఆఖరి ఓవరు పేలవంగా ముగిసింది. వెస్టిండీస్‌ లక్ష్యాన్ని తాకింది.   టోర్నీలో ఇప్పటివరకు విజయాలను సాధించిన జట్టు ప్రదర్శన ఇలా ముగిసిపోయిందే అన్న బాధే కానీ, ఇందుకోసం జట్టు సభ్యుల సంకల్పాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. గెలిచినప్పుడు నెత్తికెక్కింకుచుని, ఓడిపోయాక నేలకి విసిరికొట్టే రోజులు ఎలాగూ మారాయి. ఈ టి-20 ప్రపంచ కప్‌ పుణ్యమా అని విరాట్‌ కోహ్లీ విశ్వరూపాన్ని చూశాము. హార్థిక్ పాండ్యా అనే ఆల్‌రౌండర్‌ మనకి దొరికాడు. కానీ నేర్చుకోవాల్సిన విషయాలు కూడా చాలానే మిగిలిపోయాయి. కీలక మ్యాచ్‌లలో బౌలర్ల కూర్పు ఎలా ఉండాలి, ఏ సందర్భంలో ఎలాంటి బ్యాట్స్‌మన్‌ అవసరం, చిన్నిచిన్న తప్పిదాల వల్ల మ్యాచ్‌ ఎలా చేజారిపోతుంది అన్న విషయాన్ని ఇకనైనా మన ఆటగాళ్లు గ్రహిస్తారని ఆశిద్దాం.

బెలూచిస్తాన్‌ సమస్య ఏమిటి!

  బెలూచిస్తాన్‌... ఈ మధ్య తరచుగా వింటున్న ఈ పేరు, పాకిస్తాన్‌లోని ఒక ముఖ్య ప్రాంతం. ఆ దేశంలోని నాలుగు ముఖ్య భాగాలలో బెలూచిస్తాన్‌ ఒకటి. ఆది నుంచి కూడా ఇక్కడ నివసించే ప్రజల నుంచి పాకిస్తాన్‌ పాలకులు వ్యతిరేకతను ఎదుర్కొంటూనే ఉన్నారు. తమకు స్వాతంత్ర్యం కావాలంటూ ఇక్కడ నివసించే కొందరు నినదిస్తూనే ఉన్నారు. ఒకరకంగా చెప్పాలంటే భారతదేశానికి కశ్మీర్‌ ఎలా సమస్యాత్మకంగా మారిందో, పాకిస్తాన్‌కు బెలూచిస్తాన్‌ అలాగ. కానీ ఈ రెండు సమస్యలూ మొదలైన తీరులోనూ, వాటిని ప్రభుత్వాలు ఎదుర్కొనే రీతిలోనూ చాలా బేధం ఉంది.   భారతదేశానికి స్వాతంత్ర్యం రాగానే, కశ్మీర్‌ను మనదేశంలో కలిపేందుకు అక్కడి రాజు హరిసింగ్‌ వెనుకాముందూ ఆడాడు. ఆయన తన నిర్ణయాన్ని తీసుకునే వరకు, ఇండియా వేచి చూసింది. కానీ బెలూచిస్తాన్‌ విషయంలో అలా కాదు. స్వాతంత్ర్యానంతరం అక్కడి పాలకుడు అహ్మద్‌ యార్‌ఖాన్‌, పాకిస్తాన్‌కు దక్షిణాన ఉన్న తమ రాజ్యం స్వతంత్ర్యంగానే ఉండిపోవాలని ఆశించాడు. కానీ యార్‌ఖాన్‌ నిర్ణయం కోసం వేచి ఉండటానికి అదేమీ భారతదేశం కాదు. ఏప్రిల్‌ 1948 నాటికి బెలూచిస్తాన్‌లోకి ప్రవేశించిన పాక్‌ సైన్యం, ఆ ప్రాంతాన్ని బలవంతంగా తమ అధీనంలోకి తెచ్చుకుంది. దిక్కుతోచని స్థితిలో యార్‌ఖాన్ తన రాజ్యాన్ని అప్పగించాడు. అయితే బెలూచిస్తాన్‌కు స్వతంత్ర ప్రతిపత్తి ఉండాలని కోరాడు. ఆ మాటని పాకిస్తాన్‌ ఎలాగూ పట్టించుకోలేదు.   బెలూచిస్తాన్‌లో స్థానికంగా ఉండే తెగలని పాకిస్తాన్‌ ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకుపోవడంతో సమస్యలు మొదలయ్యాయి. తమకు తగిన ప్రాతినిధ్యం కావాలంటూ స్థానికులు చేసిన తిరుగుబాటుని ఆ దేశం అణిచివేయడంతో, నిరసన గళాలు మరింత పదునెక్కాయి. ఇక దేశంలోని అన్ని ప్రాంతాల మీదా కేంద్రానికి పూర్తి అధికారాలు ఉంటాయంటూ పాకిస్తాన్‌ 1950ల్లో ‘one unit’ పాలసీని ప్రకటించడంతో తిరుగుబాటు మరింతగా విజృంభించింది. బెలూచిస్తాన్‌లో అధికంగా ఉండే బెలూచి, బెహ్రూయి వంటి తెగలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకటి కావడం మొదలుపెట్టాయి.   ఎప్పుడైతే తిరుగుబాట్లు మొదలయ్యాయో, ప్రభుత్వ అలసత్వం కూడా మొదలైంది. బొగ్గు మొదలుకొని బంగారం దాకా ప్రకృతిసిద్ధంగా ఎంతో సారవంతమైనా కూడా బెలూచిస్తాన్‌లో జీవన విధానం దారుణంగా తయారైంది. అక్కడి నిధినిక్షేపాలను పాకిస్తాన్‌ కేంద్రం తవ్విపారేస్తూనే, స్థానికంగా మాత్రం ఏమాత్రం అభివృద్ధి జరగకుండా జాగ్రత్త తీసుకోసాగింది. ఇప్పటికీ బెలూచిస్తాన్‌లో 25 శాతం మంది నిరక్షరాస్యులు. అక్కడి నిరుద్యోగం శాతం 30 శాతం. ఇక అక్కడి జనాభాలో కేవలం 7 శాతం మందికే తాగునీటి సౌకర్యం ఉంది. దాదాపు 50 శాతానికి పైగా పేదరికంలో మగ్గిపోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గ్యాస్ నిక్షేపాలు అపారంగా ఉన్నా వంటకి గ్యాస్‌ని వాడుకునే అవకాశం అతి స్వల్పం.   తమ ప్రాంతంలోని వనరులను తరలించుకుపోతూనే, తమను పేదరికంలో ఎండబెడుతున్న ప్రభుత్వం పట్ల అక్కడి ప్రజల్లో మరింత వ్యతిరేకత మొదలైంది. బెలూచ్ స్టూడెంట్స్‌ ఆర్గనైజేషన్‌, బెలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ... వంటి అతివాద సంస్ధలు ప్రభుత్వంతో పోరుకు సిద్ధపడసాగాయి. ఈ వ్యతిరేకతని పైకి ప్రకటించేవారు కనిపించకుండా పోయేవారు. అక్కడి విషయాల గురించి రాసేవారు కూడా శవాలుగా తేలడం మొదలుపెట్టారు. కశ్మీర్‌లో ‘ఇండియా ముర్దాబాద్’ అంటూ నినాదం చేసి తప్పించుకోవచ్చు. కానీ బెలూచిస్తాన్‌లో పరిస్థితులు వేరు! తిరుగుబాటు దారుల మీద ఏకంగా పాక్ వైమానిక దాడులను చేయడం మొదలుపెట్టింది. పైగా ‘kill and dump’ పేరుతో వందలాది మందిని పట్టుకుని, వారిని చిత్రహింసలకు గురిచేసి, దారుణంగా చంపి, బహిరంగంగా పడేయడం మొదలుపెట్టింది. ఈ శవాల మీద పాకిస్తాన్ జిందాబాద్‌ వంటి నినాదాలు రాసి ఉండేవి, లేదా పాకిస్తాన్‌ జెండా గుచ్చబడి ఉండేది. స్థానికులను భయభ్రాంతులను చేసేందుకే పాలకులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.   బెలూచిస్తాన్‌లోని తిరుగుబాటుకు భారతదేశం సాయం చేస్తోందన్నది పాకిస్తాన్‌ ముఖ్య ఆరోపణ. మన దేశ గూఢచర్య వ్యవస్థ (RAW) అక్కడి తరుగుబాటుదారులను రెచ్చగొడుతోందని పాక్ విమర్శిస్తూ వచ్చింది. అయితే ఈ ఆరోపణలను భారతదేశం ఖండిస్తూనే వచ్చింది. కశ్మీర్‌లో పాకిస్తాన్‌ జోక్యాన్ని తక్కువ చేసేందుకే, ఆ దేశం ఇలాంటి ఆరోపణ చేస్తోందని భారతదేశం అంటోంది. అయితే బెలూచిస్తాన్‌లో గత వారం ఒక భారతీయ మాజీ నౌకాదళ ఉద్యోగి పట్టుబడటంతో, పాకిస్తాన్‌ తన ఆరోపణలను తిరగతోడటం మొదలుపెట్టింది.   బెలూచిస్తాన్‌లో ఇండియా పాత్ర ఏమోకానీ, చైనా మాత్రం అక్కడి పరిస్థితిని పూర్తిగా తనకు అనుకూలంగా మార్చేసుకుంది. అక్కడ గ్వదర్‌ అనే ప్రాంతంలో భారీ రేవుని నిర్మించడం ద్వారా చైనా పర్షియన్‌ గల్ఫ్‌లో ఉన్న చమురు నిక్షేపాలను తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ రేవుని నిర్మించడం ద్వారా అటు వ్యాపారపరంగా చైనాకి లాభం. అక్కడ చైనా ఉనికి ఉండటం వల్ల రక్షణపరంగా పాకిస్తాన్‌కు లాభం. అలా పరాయి దేశానికి సలాం కొట్టి, తన దేశ ప్రజల కడుపు కొట్టిందన్న అపప్రథను పాకిస్తాన్‌ మూటగట్టుకుంది. బెలూచిస్తాన్‌లోని జనం పరిస్థితి ఎప్పటిలాగే దయనీయంగానే ఉంది!

బొగ్గు స్కాం- మన జీవితాలకి మసిపూశారు!

  బొగ్గు ఓ పరిమిత వనరు. కానీ మనిషి అత్యాశ మాత్రం అపరిమితం! ఆ ఆశకి అధికారం కూడా తోడైతే ఇక చెప్పేదేముంది. చేతులకు మసి అంటుకోకుండా టన్నుల కొద్దీ బొగ్గుని స్వాహా చేయవచ్చు. ఏదో ఒక దశలో విషయం బయటపడితే, తమకే పాపం తెలియదంటూ అమాయకంగా తప్పుకోవచ్చు. అధికారులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు కలిసి ఆడిన ఈ నాటకంలో నష్టపోయింది మాత్రం సామాన్యుడే! 1.86 లక్ష కోట్లని కేంద్ర ప్రభుత్వం కోల్పోయిందని కంట్రోలర్ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ నిర్ధరించిన బొగ్గు స్కాం కథే ఇది. బహుశా స్కాం పూర్తయి ఉంటే, ఈ నష్టం పదిలక్షల కోట్లకి పైనే తేలి ఉండేది.   భారతదేశంలో అపారమైన బొగ్గు నిల్వలున్నాయన్న విషయం ప్రపంచానికంతటికీ తెలుసు! అయితే ఈ నిల్వలను తవ్వుకునే అవకాశం ఎవరికి ఇవ్వాలి అన్న విషయంలో ఎలాంటి శాస్త్రీయమైన పద్ధతీ ఉండేది కాదు. 1993 నుంచి మాత్రం కేంద్ర ప్రభుత్వం నియమించిన ఒక కమిటీ ద్వారా ఈ గనులను కేటాయించడం మొదలుపెట్టారు. దీంతో కమిటీ ఇష్టప్రకారం గనులను ఎవరికి పడితే వారికి అప్పగించే అవకాశం చిక్కింది. నామమాత్రపు విలువకే సదరు సంస్థలు అపారమైన ఖనిజాన్ని తవ్వుకునేవి. 90వ దశాబ్దంలో కూడా ఇలాంటి అశాస్త్రీయమైన పద్ధతి ద్వారా గనులను కేటాయించేవారంటే ఆశ్చర్యం కలగక మానదు.   2004లో ఈ ఇష్టారాజ్య విధానానికి స్వస్తి చెప్పాలనీ, వేలం వేయడం ద్వారా బొగ్గగనులను అర్హులకు కేటాయించాలనీ నిపుణులు సూచించారు. కానీ అప్పటి ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోనేలేదు సరికదా.... విజృంభించి మరీ దేశంలో ఉన్న బొగ్గు గనులన్నింటినీ కేటాయించడం మొదలుపెట్టింది. 1993 నుంచి 2005 వరకు 70 బొగ్గు గనులను కేటాయిస్తే 2006 నుంచి 2009 వరకు... కేవలం నాలుగేళ్ల వ్యవధిలో 145 గనులను కేటాయించి పారేశారు. ఈ సమయంలో బొగ్గు శాఖా మంత్రిగా ఉన్నది సాక్షాత్తూ అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌!   మచ్చలేని చంద్రునిలా కనిపించే మన్మోహన్‌ సింగ్‌కు ఈ విషయంలో ఏ పాపం తెలియదని అందరూ నమ్మారు. మన్మోహన్‌ సింగ్‌ కూడా తనకే పాపం తెలియదనీ, అంతా కమిటీలే నిర్ణయించాయని చేతులు దులిపేసుకున్నారు. అప్పటి బొగ్గు శాఖ కార్యదర్శి పి.సి.పారేఖ్‌ మీదకి నేరాన్ని తోసేశారు. కానీ పి.సి.పారేఖ్‌ నోరు విప్పడంతో మన్మోహన్ అసమర్థత బయటపడింది. ఎవరికి పడితే వారికి గనులను కేటాయించే విధానం మోసపూరితమైనదని, తాను 2004లోనే మన్మోహన్‌కు లిఖితపూర్వకంగా అందించానని, అయినా తన మాటని ఎవ్వరూ ఖాతరు చేయలేదని పారేఖ్‌ ఆరోపించారు. ఈ స్కాంలో మన్మోహన్‌కు ఆర్థికమైన లాభం ఏదీ దక్కి ఉండకపోవచ్చు. కానీ ఏదో దారుణమైన పొరపాటు జరుగుతోందని మన్మోహన్‌ మనస్సాక్షికి తెలియకుండా ఉండి ఉంటుందా! మన్మోహన్‌ మాత్రమే కాదు. తరువాత కాలంలో బొగ్గుశాఖ మంత్రిగా ఉన్న దాసరి నారాయణరావు కూడా ఈ విషయంలో చూసీచూడనట్లు వ్యవహరించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ గనులను జిందాల్ స్టీల్‌కు కేటాయించేందుకు, దాసరి కొంత ఆర్ధిక లాభాన్ని కూడా ఆశించారని కూడా సీబీఐ భావించింది.   మొత్తానికి బొగ్గు గనులను కేటాయించే సందర్భంలో భారీ కుంభకోణం జరిగిందని తేలిపోయింది. 2012 నుంచి సుప్రీం కోర్టు నేతృత్వంలో సీబీఐ, బొగ్గు కుంభకోణం గురించి దర్యాప్తు చేయడం మొదలుపెట్టింది. దర్యాప్తు గడుస్తున్న కొద్దీ వెల్లడైన వాస్తవాలు సామాన్యులకు దిగ్భ్రాంతిని కలిగించసాగాయి...   - బడాబడా కంపెనీలు బినామీల పేరుతో కొన్ని గనులను దక్కించుకున్నాయి. - ఏమాత్రం అర్హత లేని కంపెనీలు ఇష్టమొచ్చిన సమాచారాన్ని చూపించి, తాము అర్హులుగా నిరూపించుకుని, కొన్ని గనులను దక్కించుకున్నాయి. - టాటీ స్టీల్‌, జిందాల్‌ స్టీల్ వంటి కంపెనీలు నామమాత్రపు ఖర్చుతో భారీ గనులను దక్కించుకున్నాయి. - సుభోద్ కాంత్ సహాయ్, జగద్రక్షకన్‌ వంటి కేంద్ర మంత్రులు తమకు చెందిన సంస్థల కోసం గనులను దక్కించుకున్నారు.   ఇంత జరిగిన తరువాత కూడా ఎవరికి ఏమేరకు శిక్షలు పడతాయే చెప్పలేం. ఎందుకంటే రాజకీయ నేతలేమో, నేరాన్ని కమిటీ మీదకు తోసేస్తున్నారు. కమిటీలోని అధికారులేమో తమకు అందిన సమాచారం ఆధారంగా నిర్ణయం తీసుకున్నామని చెబుతోంది. కాబట్టి చివరికి శిక్షలు పడేది తప్పుడు సమాచారాన్ని అందించిన సంస్థల యజమానులకే కావచ్చు. అన్నింటికీ మించిన ఓ విచిత్రం ఏమిటంటే ఈ గనులను ఏ ప్రాతిపదిక మీదన కట్టబెట్టారు అని తేల్చే 100కి పైగా ఫైళ్లు అదృశ్యం కావడం. అవును! 1993-2003 వరకు గనుల కేటాయింపుకి సంబంధించిన 157 ఫైళ్లు కనిపించుట లేదు! కాబట్టి ఆ సమయంలో జరిగని అక్రమాలకు కారకులను పట్టుకునే అవకాశం చేజారిపోయినట్లే!   ప్రస్తుతానికైతే ఇలా విచక్షణారహితంగా కట్టబెట్టిన గనులను పునస్సమీక్షించి, అవసరమైనంత మేర రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించింది. మున్ముందు వేలం ద్వారానే గనులను కేటాయించాలనీ నిర్ణయించింది. 2015లో ఇలా కేవలం 11 గనులను కేటాయించినందుకే కేంద్రానికి 80 వేల కోట్ల రూపాయల ఆదాయం దక్కింది. కానీ ఇప్పటివరకూ జరిగిన నష్టం సంగతో! సామాన్యుడు కుటుంబంతో కలిసి బయట భోజనం చేయాలనుకున్నా రకరకాల పన్నులతో అతణ్ని వేధించే వ్యవస్థలు, లక్షలాది కోట్ల రూపాయల ప్రజాధనం ఏదో ఒక స్కాం రూపంలో నేతల చేతుల్లోకి వెళ్లిపోతుంటే చూస్తూ ఊరుకోవడం గమనిస్తుంటే... పిచ్చెత్తి జుత్తు పట్టుకోవడం కంటే సామాన్యడు మరేం చేయగలడు.