సైన్యం పదఘట్టనల కింద ఇంకా ఏన్నాళ్లు..
posted on Jul 13, 2016 @ 10:35AM
జమ్మూకశ్మీర్ సహా ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేకాధికారాల మాటున సైన్యం చేస్తున్న మారణకాండపై విచారణ జరపాల్సిందేనని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. మణిపూర్‌లొ బోగస్ ఎన్‌కౌంటర్ల ఆరోపణలపై విచారణ జరిపించాల్సిందిగా దాఖలైన పిటిషన్‌ను సుప్రీం విచారించి 85 కేజీల తీర్పును వెలువరించింది. 2000 నుంచి 2012 వరకు అక్కడ జరిగిన బోగస్ ఎన్‌కౌంటర్‌లపై సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశించింది. ప్రత్యేకాధికారాల చట్టం కింద కల్లోలిత ప్రాంతాల్లో పోలీసులు అధిక బలప్రయోగాన్ని ఉపయోగించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. మణిపూర్‌లో పరిస్థితి కేవలం ఒక అంతర్గత అశాంతి మాత్రమేనని పేర్కొంది. దేశ భద్రతకు లేదా దేశంలోని ఒక ప్రాంత భద్రతకు ముప్పు తెచ్చేలా ఎప్పుడూ అక్కడ యుద్ద పరిస్థితి లేదా వెలుపలి శక్తుల దాడి లేదా సాయుధ తిరుగుబాటు లేదు అని సుప్రీం కోర్టు నిర్దేశించింది.
శత్రువులన్న ఆరోపణలు వచ్చినంత మాత్రానే, శత్రువులు అన్న అనుమానంతోనే మనదేశ పౌరులను హతమార్చడానికి సాయుధ బలగాలను మోహరిస్తే చట్టబద్ధ పాలనే కాకుండా మన ప్రజాస్వామ్యమే తీవ్ర ప్రమాదంలో పడుతుందని ధర్మాసనం పేర్కొంది. అంతర్గత అశాంతిని చక్కదిద్దడానికి అక్కడి పౌర ప్రభుత్వానికి సహాయకంగా మాత్రమే సాయుధ బలగాలు కానీ.. అవి పరిపాలనా యంత్రాంగం స్థానాన్ని ఆక్రమించలేవని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. కల్లోల ప్రాంతాలుగా ఉన్న అరుణాచల్‌ప్రదేశ్, అసోం, మణిపూర్, మేఘాలయా, మిజోరం, నాగాలాండ్, త్రిపురలలో పరిస్థితుల్ని అదుపు చేయడం కోసం సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని భారత పార్లమెంట్ 1958 సెప్టెంబర్ 11న ఆమోదించింది. ఆ తర్వాత ఈ చట్టాన్ని జమ్మూకశ్మీర్‌కు కూడా వర్తింపజేస్తూ సాయుధ దళాల(జమ్మూకశ్మీర్) ప్రత్యేకాధికారాల చట్టం...1990 అమల్లోకి వచ్చింది. ఈ చట్టం భారత సాయుధ దళాలకు విస్తృతాధికారాలను కల్పించింది.
కనిపిస్తే కాల్చివేతకు, ఏ సాకుతోనైనా ఎవరినైనా అరెస్ట్ చేసేందుకు, ఎటువంటి వారెంటు లేకుండానే సోదాలు నిర్వహించే అవకాశం సైన్యానికి దక్కింది. అయతే ఈ అధికారాన్ని సైన్యం దుర్వినియోగం చేసినట్టు ఎప్పటి నుంచో ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారం మాటున సైన్మం మానభంగాలు, చిత్రహింసలు, పౌరుల్ని విచక్షణారహితంగా కాల్చివేయడం లాంటి చర్యలకు పాల్పడింది. ఈ చట్టం ఆసరాతో అక్రమాలకు పాల్పడిన సైనికుల్ని అరెస్టు చేయడం గాని, ఎటువంటి విచారణకైనా గురిచేయడానికి కాని అవకాశం లేదు. దీంతో కొంతమంది సైనికులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నేరస్తులైన సైనికులపై కేసులు పెట్టలేక జరిగిన దారుణాలను బయట చెప్పుకోలేక ఎంతోమంది అభాగ్యులు నాలుగు గోడల మధ్య కుమిలిపోతున్నారు. ఇప్పుడు సుప్రీం తీర్పుతో విచారణ జరిగితే మణిపూర్ సహా ఈశాన్య రాష్ట్రాల్లో వాస్తవ పరిస్థితులు బయటకు వస్తాయి. సైనికుడు నేరం చేస్తే సాధారణ నేర న్యాయస్థానం నుంచి విచారణ లేకుండా పూర్తి రక్షణ ఉంటుందన్న భావనేమి లేదని...మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన ఏ సైనికుడినైనా విచారించకతప్పదని సుప్రీం వెల్లడించింది.