చివరికి "గో మూత్రం"పైనా పన్ను..!

  చరిత్రలో ఎవరూ తీసుకోని వింత నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం గో మూత్రంపై 5 శాతం పన్ను విధించింది. ఏపీ వ్యాట్ చట్టం-2005లోని 5వ షెడ్యూల్ ప్రకారం గో మూత్రంపై పన్ను విధించే అధికారం తమకు ఉందంటూ వాణిజ్య పన్నుల విభాగం నుంచి వివిధ సంస్థలకు నోటీసులు వెళ్లాయి. డ్రగ్స్, కాస్మోటిక్స్ చట్టం-1940 కింద లైసెన్స్ పొంది తయారు చేసే ఆయుర్వేద, హోమియోపతి మందులపై పన్ను వేస్తున్నట్టే గోమూత్రాన్ని ఔషధంగా ఉపయోగిస్తున్న కారణం చూపి పన్ను విధిస్తున్నట్టు పేర్కొంది.    అనాదిగా భారతీయ సంస్కృతిలో, భారతీయుల జీవితాలలో గోమూత్రం భాగమైంది. ఎంతోకాలం నుంచి నయం కాని జబ్బులకు ఉపశమనాన్ని కలిగించే శక్తి అవు మూత్రానికి ఉందని ఆయుర్వేదం చెబుతోంది. మన పూర్వీకులకు "పంచగవ్య చికిత్స గోమూత్ర విశిష్టత" ఎప్పటి నుంచో తెలుసు. భారతీయులు గోవును మాతృభావంతో "గోమాత"గా ఆరాధిస్తారు. గోవును సమస్త దేవతా స్వరూపంగా భావిస్తారు. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు అన్నీ కూడా గోమాత ప్రాముఖ్యతని, భారతీయులకు , గోమాతకు ఉన్న అవినాభావ సంబంధాన్ని తెలియజేస్తాయి.    గో మూత్రాన్ని మూఢ నమ్మకంగా చూస్తున్న నాగరిక ప్రపంచానికి దీని విశిష్టత తెలియజేసింది అమెరికన్ పేటేంట్ కార్యాలయం. నాగ్‌పూర్‌లోని గోవిజ్ఞాన అనుసంధాన కేంద్రం దరఖాస్తును పరిశీలించిన కార్యాలయం అనేక చర్చల అనంతరం గో మూత్రానికి "యాంటీ బయాటిక్"గా పేటెంట్ ఇచ్చింది. ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలను గో మూత్రంపై దృష్టి మళ్లేలా చేసింది. పలు విడతలుగా భారతీయ గో మూత్రాన్ని శోధించిన ప్రపంచ వైజ్ఞానిక లోకం దాని గొప్పతనాన్ని లోకానికి చాటి చెప్పింది. అధిక బరువు, ఉదర సంబంధ వ్యాధులు, చర్మ వ్యాధులు, చక్కెర వ్యాధి, కాలేయ వ్యాధులు, ఉబ్బసం, పేగు సంబంధిత రుగ్మతలు, కీళ్లవాతం తదితర ఎన్నో జబ్బులకు గో మూత్రం దివ్యౌషధమని దీనిని ఉపయోగించి సత్ఫాలితాలు పొందవచ్చని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ ప్రకటన భారత్‌తో సహా ప్రపంచంలోని చాలా దేశాల వ్యాపారుల నెత్తిమీద పాలు పోసింది. గో మూత్రం కోసం ప్రపంచం మొత్తం భారత్‌పై పడటంతో అది పెద్ద వ్యాపారమైంది. మూత్రాన్ని కాచి వడపోసి ప్యాక్ చేసి అమ్మే చాలా సంస్థలు పుట్టుకొచ్చాయి.   ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా గోశాలలు, రైతుల నుంచి గో ఉత్పత్తుల తయారీ సంస్థలు నిత్యం వేలాది లీటర్ల మూత్రాన్ని సేకరిస్తున్నాయి. ఇటీవలి కాలంలో దేశీ ఆవులకు, గో మూత్రానికి గిరాకీ పెరిగింది. దేశీ ఆవుల నుంచి తీసిన మూత్రాన్పి వైద్యంతో పాటు సేద్యానికి ఉపయోగిస్తున్నారు. శుద్ధి చేసిన మూత్రాన్ని లీటర్‌కు రూ.50, సేద్యానికి వినియోగించే మూత్రాన్ని లీటర్‌ను రూ.25 నుంచి రూ.30 మధ్య విక్రయిస్తున్నారు. అటు ప్రభుత్వ వాదన చూస్తే గోమూత్రాన్ని ఆధ్యాత్మిక వస్తువుగా కాకుండా వ్యాపారత్మకంగా ఆలోచించి దానిని వినియోగవస్తువుగా మార్చారని, చట్ట ప్రకారం వినియోగ వస్తువులపై పన్ను విధించే అధికారం ప్రభుత్వానికి ఉందని చెబుతోంది. ఆయుర్వేద, హోమియోపతి మందుల మాదిరిగానే గో మూత్రాన్ని ఔషధంగా ఉపయోగిస్తున్నందున పన్ను విధించవచ్చని ఏపీ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వాదిస్తోంది. ఆవు మూత్రాన్ని వేదకాలం నుంచి ఆయుర్వేదంలో వినియోగిస్తున్నప్పటికీ పన్ను నుంచి మినహాయించాలని ఎక్కడా లేదని స్పష్టం చేసింది.    నీటిపై పన్ను, పాలపై పన్ను, ఆహారంపై పన్ను ఇలా అవకాశం ఉన్న ఏ అంశాన్ని వదలకుండా పన్నుల జాబితాలోకి తీసుకురావడం..ఆదాయాన్ని పెంచుకోవడం ప్రభుత్వాలకు అలవాటుగా మారింది. వందలో 20 రూపాయలు ట్యాక్సుల రూపంలో లాగేసుకుంటున్న పరిస్థితి. నోటికి నచ్చిన తిండిని తినేందుకు కూడా ఇంతేసి పన్నులు కట్టాలా? అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. విభజన తర్వాత ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో ఏపీ సర్కార్ ఇలాంటి విషయాలను అస్సలు వదలిపెట్టడం లేదు. ఎక్కడ దొరికితే అక్కడ పన్ను వేసి రెవెన్యూ లోటును పూడ్చుకోవాలనుకుంటోంది. ఈ చర్యల పట్ల ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.   ఏపీని దేశంలోని మిగిలిన రాష్ట్రాలు ఫాలో అయితే  గోశాలలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. గోశాలలు విక్రయించే మూత్రంతో వచ్చే డబ్బును ప్రస్తుతం వాటి నిర్వహణకు వినియోగిస్తున్నారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రొత్సహించాలన్నా..దేశీవాళీ ఆవులను కాపాడాలన్నా గోశాలలు అవసరం. ఇలాంటి పరిస్ధితుల్లో గో మూత్రంపై పన్ను వేస్తే దీనితో తయారయ్యే అన్ని వస్తువులపై ప్రభావం పడి ధరలు విపరీతంగా పెరుగుతాయి. ఒకప్పటితో పోలిస్తే మనదేశంలో గోసంతతి తరిగిపోతోంది. కాని కొంతమంది సంప్రదాయవాదులు, ఔత్సాహికులు గోవులను వృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారి ప్రయత్నాన్ని ఈ నిర్ణయం చావుదెబ్బ కొడుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయంపై పునరాలోచించాలని పలువురు కోరుతున్నారు.    

ప్రభుత్వ పాఠశాలలకేం తక్కువ!

    ఒకప్పుడు ప్రైవేటు పాఠశాల అంటే ఎవరో ధనికుల బిడ్డలు చదువుకునే బడి అన్న అర్థం స్ఫురించేంది. మరోపక్క ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేయడం అంటే చాలా చులకనగా ఉండేది. ‘బతకలేని బడిపంతులు’ అన్న సామెత ఊరికనే రాలేదు కదా! కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. మరీ కటిక దారిద్ర్యంలో ఉంటే తప్ప ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోరన్న అపోహ స్థిరపడిపోయింది. ఒక పక్క ప్రభుత్వ ఉపాధ్యాయులకు సాఫ్టవేర్‌ జీతాలతో సమానమైన జీతాలు అందిస్తున్నా, విద్యార్థుల పరిస్థితి మాత్రం దయనీయంగా ఉంది. దీనికి కారణం ఏమిటి అని వెతికితే...   ప్రపంచీకరణ నేపథ్యంలో చదువుకి ప్రాధ్యాన్యత పెరిగిపోయింది. పిల్లల ప్రాథమిక స్థాయి నుంచి కూడా నాణ్యమైన చదువుని అందిస్తే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందన్న అభిప్రాయం స్థిరపడిపోయింది. మరి నాణ్యమైన చదువు ఎక్కడ దొరుకుతుంది అని తల్లిదండ్రులు వెతికితే వాటికి జవాబుగా వందలాది ప్రైవేటు బడులు కనిపించడం మొదలుపెట్టాయి. ప్రైవేటు బడుల్లో విద్య ఎంత నాణ్యంగా ఉంటుందో తెలిసే అవకాశం లేకపోవచ్చు. కానీ వారు చూపించే హంగూ, ఆర్భాటం తప్పకుండా చూపరుల మీద ప్రభావం కలిగిస్తాయి. ఇక మోడల్ స్కూల్‌, ఐఐటీ ఓరియంటెడ్‌ సిలబస్‌, ఇంగ్లీషులోనే మాట్లాడిస్తాం... లాంటి ప్రకటనలూ వారిని ఊరిస్తుంటాయి. సరైన చదువు లేకపోవడం వల్లే తమ జీవితాలు ఇలా అయిపోయాయనీ, కనీసం తమ పిల్లల బతుకులైనా అలా కాకూడదని వారు కోరుకుంటున్నారు. అందుకే తలకు మించిన భారమైనా అప్పోసొప్పో చేసైనా తమ పిల్లలని ఖరీదైన చదువులు చదివిస్తున్నారు. ఆ మధ్య ఎర్రచందనం కేసులో పట్టుపడిన ఓ ఇద్దరు దొంగలు తమ పిల్లల ఫీజులు కట్టడం కోసమే తాము దొంగతనాలకు దిగామని చెప్పడం చూస్తే తల్లిదండ్రుల్లో కార్పొరేట్‌ విద్య పట్ల ఎంత మోజు ఉందో అర్థమవుతోంది.       నిజానికి ప్రైవేటు పాఠశాలలు తమ వద్ద చేరిన పిల్లలకు తగిన చదువుని అందిస్తున్నాయా లేదా అంటే అందుకు స్పష్టమైన సమాధానం లభించదు. చాలా ప్రైవేటు బడులలో తగిన విద్యార్హత లేని ఉపాధ్యాయులే బోధిస్తూ ఉంటారు. పిల్లల్లో జ్ఞానాన్ని పెంపొందించడం కంటే, వారి మెదడులోకి పాఠాలను చొప్పించడం మీదే వీరి ధ్యాసంతా ఉంటుంది. అందుకోసం వీలైనంత ఎక్కువ సేపు, వీలైనంత ఎక్కువ పాఠాలు చదివించడం మీదే ప్రైవేటు పాఠశాలల దృష్టి అంతా ఉంటుంది. పిల్లల్లో మానసిక, శారీరిక వికాసానికి అవసరమైన ఆటపాటలకు ఏమాత్రం అవకాశం ఉండదు. ఆడుకోవడానికి తగిన ఆటస్థలాలు కానీ, తరగతి సమయాలు కానీ ఉండవు. ఇక సాంస్కృతిక కార్యక్రమాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇలా అన్ని ప్రైవేటు పాఠశాలలూ ఉన్నాయని కాదు కానీ, ఎక్కువ శాతం ప్రైవేటు పాఠశాలల్లోని తీరు ఇది. ఇలాంటి వాతావరణంలో పెరిగిన పిల్లవాడు మంచి మార్కులనైతే సాధిస్తాడేమో కానీ, జీవితానికి ఉపయోగపడే పాఠాలను నేర్చుకోలేదు. నిరంతరం చదువుతోనే అతని బాల్యం సాగిపోవడంతో... భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే మానసిక స్థైర్యం కానీ, శారిరక దృఢత్వం కానీ అతనికి ఉండవు.   ఒకవైపు ప్రైవేటు పాఠశాలల తీరు ఇలా ఉంటే, ప్రభుత్వ పాఠశాలల తీరు మరోలా ఉంటోంది. ప్రైవేటు పాఠశాలల్లో నిపుణులైన అధ్యాపకులు ఉన్నప్పటికీ వారు ఉద్యోగాన్ని తెచ్చుకునేటప్పుడు చూపిన శ్రద్ధ ఆ ఉద్యోగాన్ని నిర్వర్తించడంలో చూపరన్న అపవాదు ఉంది. బడులకు సరిగా రారనీ, వచ్చినా సరిగా పాఠాలు చెప్పరనీ, చెప్పినా ఫలితాల మీద దృష్టి పెట్టరనీ... నానారకాల విమర్శలు ఉన్నాయి.   పాఠశాలల నిర్వహణ మీద కూడా చెప్పలేనన్ని ఆరోపణలు వినిపిస్తూ ఉంటాయి. బడికి సంబంధించిన ప్రతి పనీ కాంట్రాక్టు పద్ధతి మీదే సాగుతూ ఉండటంతో, ఎవరికి వారు లాభాలను వెనకేసుకునేవారే కానీ... తాము చేసిన పని పది తరాల పాటు అక్కడ చదువుకునే పిల్లలకు ఉపయోగపడిందా లేదా అని ఆలోచించేవారు తక్కువ. అందుకే తాగునీటి వసతి దగ్గర్నుంచీ మరుగుదొడ్లు వరకూ అంతా నాసిరకంగా ఉంటాయి. ఇక మధ్యాహ్న భోజన పథకం, యూనిఫారాలు, తాగునీరు... ఇలా పిల్లలకు కల్పించే ప్రతి వసతిలోనూ ఏదో ఒక కొరత కనిపిస్తూనే ఉంటుంది.   తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గు చూపడానికి మరో కారణం ఆంగ్లంలో విద్యాబోధన. పిల్లలకు ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో విద్యను అందిస్తేనే వాళ్లలో జ్ఞానం పాదుకొంటుందనీ, తమ భావాలను స్పష్టంగా వ్యక్తం చేయగలుగుతారనీ, మున్ముందు మరో భాషని సైతం తేలికగా నేర్చుకోగలుగుతారనీ పరిశోధనలన్నీ రుజువు చేస్తున్నాయి. కానీ మనమేమో పిల్లవాడికి ఒకటో క్లాసు నుంచే ఆంగ్లం మీద మంచి పట్టు ఉండాలని మురిసిపోతున్నాము. ఆఖరికి పిల్లవాడు ఆంగ్లాన్ని ఎక్కడ మర్చిపోతాడో అని ఇంట్లో కూడా ఆంగ్లంలోనే మాట్లాడుకునే దుస్థితి మనది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు వివరించాల్సిన ప్రభుత్వాలు తాము కూడా అదే బాట పట్టేందుకు ప్రయత్నించడం విచారకరం.   నిదానంగా ప్రభుత్వ పాఠశాలలు ఒక్కొక్కటీ మూతపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా పాఠశాలల్లో సున్నా శాతం హాజరు నమోదు కావడంతో, వాటిని దగ్గరలోని మరో పాఠశాలలో విలీనం చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. విద్యార్థుల సంఖ్య ఇలా దారుణంగా పడిపోవడం మీద మొన్నటికి మొన్న సుప్రీం కోర్టు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తాము చేయగలిగింది ఏమీ లేదని తెలంగాణ తరఫు న్యాయవాది చేతులెత్తేయడంతో... ‘ఇలాగైతే తెలంగాణను తామే పాలించాల్సి ఉంటుంద’ని హెచ్చరించింది. నిజానికి ప్రభుత్వమూ, ఉపాధ్యాయులూ, తల్లిదండ్రులూ తల్చుకుంటే ప్రభుత్వ పాఠశాలలకు పునర్వైభవం సాధ్యమే!   - ప్రజల సంక్షేమం కోసం వందలాది కోట్లను ఖర్చుచేసే ప్రభుత్వానికి, పాఠశాలల కోసం తగినంత నిధులను ఖర్చుచేయడం భారమేమీ కాదు. ప్రతి పాఠశాలలోనూ అన్ని వసతులూ ఉండేలా తగినన్ని నిధులను ఖర్చుచేయడం, ఆ నిధులు సక్రమంగా అమలవుతున్నాయో లేదో పరీక్షించడం ప్రభుత్వ బాధ్యత. సంఘ రాజకీయాలకు అతీతంగా ఉపాధ్యాయుల హాజరు, పనితీరుని ఎప్పటికప్పుడు గమనించడం మరో ముఖ్య కర్తవ్యం.   - ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే అరకొర వసతుల సాయంతోనే కొందరు ఉపాధ్యాయులు సాధించే ఫలితాలు చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు. చదువుకోవలసిన అవసరం లేనివారే ప్రభుత్వ పాఠశాలలకు వస్తారన్న అపోహను వదిలిపెట్టి, తమ వద్దకు వచ్చిన ప్రతి పిల్లవాడి మీదా వ్యక్తిగత శ్రద్ధను చూపవలసిన ఉపాధ్యాయులది. తాము ఓ మనిషి జీవితాన్ని తీర్చిదిద్దుతున్నామన్న భావన ఉపాధ్యాయులలో కలిగిన రోజున, ప్రతి ఉపాధ్యాయుడు అద్భుతమైన ఫలితాలను సాధించగలడు.   - చదువంటే కేవలం హంగూ, ఆర్భాగం, మార్కులూ, ఆంగ్లంలో ప్రావీణ్యం అన్న భావనను తల్లిదండ్రులు వీడాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే ఉపాధ్యాయులు విద్యను అందించేందుకు తగిన నైపుణ్యం ఉన్నవారన్న విషయాన్ని గ్రహించాలి. లక్షలు పోసి తాము చెప్పించే చదువుకీ దీటైన చదువు ప్రభుత్వ పాఠశాలల్లో అందించవచ్చని తెలుసుకోవాలి. అవసరమైతే ప్రభుత్వ పాఠశాలలో చదివే మిగతా తల్లిదండ్రులతో కలిసి తమ పిల్లలకు నాణ్యతతో కూడిన చదువు చెప్పేలా ఉపాధ్యాయులతో చర్చించాలి.   ఇంత చేశాక ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు మెరుగుపడవు!  

ఉత్తరాఖండ్‌లో... ప్రజాస్వామ్యానికి విజయం

  ఎక్కడో దక్షిణాదిన ఉన్న మనకి ఉత్తరాఖండ్‌లో నిన్న జరిగిన పరిణామం ఓ వార్తగానే కనిపించవచ్చు. కానీ ఇది నిజానికి మన భవిష్యత్తుకు ఓ భరోసా! ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలని రాజ్యంగంలోని లొసుగులు కారణంగా చూపి కూలదోయాలనుకునే కేంద్ర ప్రభుత్వాలని ఓ హెచ్చరిక! కేవలం రాష్ట్రపతి పాలన విషయంలోనే కాదు, గట్టు దాటే ప్రజాప్రతినిధులు కూడా ఇక మీదట ఉత్తరాఖండ్‌ని చూసి కాస్త జాగ్రత్తగా మసులుకోవాల్సిన అవసరం ఉంది.   మార్చి 27న ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనను విధించినప్పటి నుంచీ కేంద్రానికి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అక్కడ పాలనలో ఉన్న కాంగ్రెస్‌ను గద్దె దింపి, ఆ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన 9 మంది ఎమ్మెల్యేల సాయంతో తాను ప్రభుత్వాన్ని చేపట్టాలన్నది బీజేపీ ఆలోచన అన్నది దారిన పోయేవాడికి కూడా తెలిసిపోయింది. నిజానికి ఇదే రకమైన మంత్రాంగంతో అరుణాచల్‌ ప్రదేశ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపి, తనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పరుచుకుంది బీజేపీ. కానీ పరిస్థితులు నిదానంగా మారుతున్నాయనీ, న్యాయస్థానాలు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నాయనీ గ్రహించలేక పరువు పోగొట్టుకుంది. మొదట ఉత్తరాఖండ్‌ హైకోర్టు అక్కడ విధించిన రాష్ట్రపతి పాలన మీద తీవ్రంగా విరుచుకుపడింది. కొన్ని సమయాలలో రాష్ట్రపతి కూడా తప్పు చేసే అవకాశం ఉందంటూ దేశ ప్రథమ పౌరుడినే దెప్పి పొడిచింది. అంతేకాదు! తిరుగుబాటు చేసిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కూడా బలపరీక్షలో పాల్గొనేందుకు అనర్హులు అంటూ వేటు వేసింది. చివరాఖరికి ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రికి తన బలాన్ని నిరూపించుకునేందుకు తగిన అవకాశం కల్పించాలంటూ తీర్పుని వెలువరించింది.   ఉత్తరాఖండ్‌ న్యాయస్థానం తీర్పుతో కేంద్రానికి తల బొప్పి కట్టిపోయింది. అయినా గంభీరంగా కనిపించడానికి ప్రయత్నిస్తూ సుప్రీం కోర్టు తలుపులు తట్టింది. కానీ సుప్రీం కోర్టులోనూ కేంద్రానికి అక్షింతలు తప్పలేదు. రాష్ట్రపతి పాలన విధించేంత క్లిష్టమైన సమస్యలు అక్కడ ఏర్పడలేదు కదా అంటూ అనేక ప్రశ్నలను లేవనెత్తింది. చివరికి హైకోర్టు వెలువరించిన తీర్పుని బలపరుస్తూ నిన్న హరీష్‌ రావత్‌ తన బలాన్ని నిరూపించుకునేందుకు అవకాశాన్ని ఇచ్చింది. సుప్రీం అదుపాజ్ఞలలో ఉత్తరాఖండ్‌లో నిన్న బలప్రదర్శన జరిగింది. చివరి నిమిషంలో బీఎస్‌పీ కూటమిలోని ఆరుగురు సభ్యులు కూడా కాంగ్రెస్‌కు మద్దతుగా నిలవడం, ఒకరిద్దరు ఎమ్మెల్యేలు అటూఇటూ అవడం జరిగినా 71మంది సభ్యులున్న ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో హరీష్‌ రావత్‌ సగానికి పైగా సభ్యుల విశ్వాసాన్ని సాధించారన్నది అనధికారికంగా తేలిపోయింది. దీంతో బహుశా సుప్రీం కోర్టు అక్కడ రాష్ట్రపతి పాలనను రద్దు చేసి రాజ్యంగబద్ధమైన ప్రభుత్వాన్ని తిరిగి నెలకొల్పవచ్చు.   ఉత్తరాఖండ్‌లోని పరిణామాలు నిజంగా బీజేపీకి మింగుడుపడనివే. తాము కాంగ్రెస్‌ విధానాలకంటే భిన్నంగా ఉంటామంటూ బీరాలు పోయిన బీజేపీ చివరికి అలాంటి కుయుక్తులకే దిగడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. నల్లధనాన్ని వెలికితీసుకురావడంలో కానీ, దేశంలోని అసహన వ్యాఖ్యలను ఖండించడంలో కానీ ఇప్పటికే బీజేపీ విఫలం చెందిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, తెలంగాణకు కరువు సాయం వంటి విషయాలలో బీజేపీ మాట తప్పుతోందంటూ తెలుగురాష్ట్రాలు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బీజేపీని నిజంగానే ఇదో ఎదురుదెబ్బ. అంతేకాదు! ఇవాళ తిరుగుబాటు ఎమ్మెల్యేల మీద కూడా సుప్రీం కోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇదే కనుక జరిగితే ఐపీఎల్‌ క్రికెట్‌లో ఎక్కడ మంచి బేరం పలికితే ఆ జట్టులో చేరినంత తేలికగా పార్టీలు మారుతున్న ప్రజాప్రతినిధుల గట్టుదాట్లకు కూడా అడ్డుకట్ట పడినట్లే! అందుకనే నిన్న ఉత్తరాఖండ్‌లోని పరిణామం ప్రజాస్వామ్యానికి ఓ కీలక విజయంగా భావిస్తున్నారు విశ్లేషకులు.

నీటుగా తాట తీస్తున్నారు

  దేశవ్యాప్తంగా వైద్య విద్య కోసం ఒక ఉమ్మడి పరీక్షను నిర్వహించి తీరాలంటూ ఎట్టకేలకు సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని తెలియచేసింది. దాదాపు నెల రోజుల నుంచీ తాము ఎంసెట్ ద్వారానే వైద్య కోర్సులలోకి అనుమతిని అందిస్తామంటూ తెలుగు రాష్ట్రాలు, సుప్రీం కోర్టు ముందు చేసిన వాదనలన్నీ ఈ తీర్పుతో కొట్టుకుపోయాయి. కేవలం ఒక్క తెలుగు రాష్ట్రాలే కాదు, ఈ తీర్పు చాలామందికి శరాఘాతంగా తగిలింది. నామమాత్రంగా ఏదో ఒక పరీక్షని నిర్వహించేసి విద్యార్థులను అనుమతించే ప్రైవేటు కాలేజీలు, ఇష్టారాజ్యంగా తమకు తోచిన వారిని చేర్చుకునే మైనారటీ కాలేజీలు ఇక నుంచి నీట్‌ పరీక్ష ఆధారంగానే అడ్మషన్లను చేపట్టవలసి ఉంటుంది. ఇక ఎలాంటి ప్రవేశ పరీక్షా లేకుండా 12వ తరగతి మార్కుల ఆధారంగా వైద్య పరీక్షలకు అనుమతించే తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలకు కూడా ఈ తీర్పు ఓ భంగపాటు.   ఎందుకీ నీట్‌! అసలు నీట్‌కి రూపకల్పన చేసిన ప్రయోజనం వేరు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఉన్నా 15 శాతం సీట్లలో స్థానికేతరులకు అవకాశాన్ని కల్పించేందుకు AIPMT పేరుతో ఒక పరీక్షను నిర్వహించేవారు. కానీ ఇదే పరీక్షను అన్ని సీట్లకూ ఎందుకు అమలు చేయకూడదంటూ వాదనలు మొదలయ్యాయి. స్థానికంగా ఉన్న రిజర్వేషన్లకు భంగం కలిగించకుండానే ఈ పరీక్షను అమలు చేయవచ్చంటూ ప్రభుత్వం భావించింది. దాంతో 2013లో తొలిసారి ఈ పరీక్షను అమలుచేశారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల గగ్గోలు పెట్టిన వివిధ పక్షాలు సుప్రీం కోర్టులో 100కు పైగా కేసులను దాఖలు చేశాయి. ఆశ్యర్యంగా ఆనాటి సుప్రీం కోర్టు ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలు చెల్లవని తీర్పునివ్వడమే కాకుండా, ఇలాంటి పరీక్ష రాజ్యాంగవిరుద్ధమంటూ తీర్పునిచ్చింది.   మరి ఇప్పుడేమొచ్చింది! సుప్రీం కోర్టు మళ్లీ తను ఇచ్చిన తీర్పుని తానే తోసిరాజంటూ నీట్‌ (నేషనల్‌ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌- NEET)ని నిర్వహించేందుకు ఈ ఏడాది అనుమతినిచ్చింది. ఈ తీర్పుకి వ్యతిరేకంగా పలు రాష్ట్రాలు, ప్రైవేటు కళాశాలలు గుండెలు బాదుకుంటూ కోర్టు ముందు తమ వాదనలు మొదలుపెట్టాయి. కానీ నీట్‌ ద్వారానే వైద్య విద్యలోకి అనుమతిని సాధించాలంటూ సుప్రీం స్పష్టం చేసేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 400కి పైగా వైద్య కళాశాలలలోకి అనుమతి కోసం దాదాపు 35 ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నారనీ... ఇక మైనారటీ, ప్రైవేటు కళాశాలలైతే డబ్బు కోసం ఇష్టారాజ్యంగా విద్యార్థులను చేర్చుకుంటున్నాయనీ వచ్చిన వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. కనీసం ఈ ఒక్క ఏడాదైతే నీట్‌ నుంచి మినహాయింపుని ఇవ్వమంటూ తెలుగురాష్ట్రాలు చేసిన అబ్యర్థనను కూడా కోర్టు తిరస్కరించింది. ఈ ఏడాది జులై 24న నీట్‌ పరీక్ష నిర్వహించాల్సిందేనంటూ తేల్చి చెప్పింది.   నీట్‌తో సమస్య ఏమిటి! సుప్రీం కోర్టు చెబుతున్నట్లుగా దేశవ్యాప్తంగా ఒకే పరీక్షా విధానం ఉండటం, అవకతవకలకు ఆస్కారం తగ్గిపోవడం అన్నది వినడానికి బాగానే ఉంది. కానీ నీట్‌ పరీక్షలోని సిలబస్‌ కానీ, పరిక్షా పత్రం తీరు కానీ, మార్కులు అందించే విధానం కానీ... ఎంసెట్‌ను పోలి ఉండవు. నీట్‌ను రాసే విద్యార్థులంతా చచ్చినట్లు సీబీఎస్‌ఈ సిలబస్‌ ప్రకారమే పరీక్షను సిద్ధపడాలి. అది కూడా ఆంగ్లంలోనే రాయాల్సిన అగత్యం రావచ్చు. ఇక తప్పైన జవాబు వారా మార్కులను తగ్గించడం కూడా మరో కొత్త సమస్య! వీటి వల్ల మధ్యతరగతి, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులు నానా అగచాట్లకు గురికావలసి వస్తుందన్నది వివిధ వర్గాల ఆందోళన. పైగా ఈ ఏడాది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులు ఎంసెట్‌ను రాసేశారు. దాని ఫలితాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ మరో రెండు నెలల్లో పూర్తి భిన్నమైన పరీక్షకు సిద్ధం కావడం అంటే, పూర్తిగా సెంట్రల్‌ సిలబస్ మీద పట్టున్న వారికే అది సాధ్యపడుతుంది. ఇది నిజంగానే ప్రభుత్వ విద్యార్థులకు ఓ పీడకలలా మిగిలిపోయే ప్రమాదం ఉంది.   ఇలా ఒకటీ రెండూ కాదు... నీట్‌కి అటు అనుకూలంగానూ, ఇటు వ్యతిరేకంగానూ చెలరేగుతున్న వాదనలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇప్పటికీ సుప్రీం కోర్టు తీర్పు ఓ తుది నిర్ణయంగా భావించడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ తీర్పుని వెలువరించింది ఒక త్రిసభ్య ధర్మాసనం మాత్రమే! మళ్లీ ఈ సమస్య విస్తృత ధర్మాసనం ముందుకి చేరితేనే కానీ కరాఖండిగా తీర్పు వెలువడే అవకాశం ఉండదు. మరి అప్పటి వరకూ విద్యార్థుల భవిష్యత్తు ఏమిటన్నదే ప్రశ్న. సుప్రీం కోర్టు వంటి ఉన్నత న్యాయస్థానం సైతం ఒకోసారి ఒకలా, మరోసారి ఇంకోలా తీర్పులను వెలువరించడం... ఇప్పటికిప్పుడే తమ తీర్పులు అమలు కావాలంటూ పట్టుపట్టడం ఎంతవరకు సబబన్నదే సామాన్యుడి బాధ!

పవన్‌ కళ్యాణ్‌ దారేది!

  ఫిబ్రవరి 2014. తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌ నుంచి విభజిస్తూ పార్లమెంటులో బిల్లుని ఆమోదించేశారు. తెలంగాణ ఉద్యమం ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ, హఠాత్తుగా... పార్లమెంటు తలుపులు మూసేసి, ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేసి మరీ బిల్లుని ఆమోదింపచేయడం ఆంధ్రా ప్రజల మనసుని తీవ్రంగా కలచివేసింది. బిల్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించనీయం అంటూ ప్రతినలు పూనిన నేతల మీద మనసు విరిగిపోయింది. కేవలం రాబోయే ఎన్నికలలో లాభపడేందుకే కాంగ్రెస్‌ ఈ దుందుడుకు చర్యకు పాల్పడిందన్న ఆక్రోశం కలిగింది. ఒకవైపు తెలంగాణలో సంబరాలో జరుగుతుంటే, అదే స్థాయిలో తమ ఆక్రోశాన్ని కూడా వెలిబుచ్చాలని కోరుకున్నారు. అప్పుడు తెరమీదకు వచ్చాడు పవన్‌ కళ్యాణ్‌!   2014 మార్చి, 14న పవన్‌ కళ్యాణ్ హైదరాబాదు కన్వెన్షన్‌ సెంటరులో చేసిన ఉపన్యాసం ఓ అద్భుతం. ఒక పక్క సమాజం గురించి మాట్లాడుతూనే మరో పక్క కాంగ్రెస్‌ను దుయ్యపట్టారు. ఒక వైపు భవిష్యత్తు గురించి ప్రస్తావిస్తూనే మరో వైపు తెరాస, ఆంధ్రులను రెచ్చగొడితే, ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. కేంద్రం తీరుతో కడుపు రగిలిపోయి ఉన్న ఆంధ్రా ప్రజలకు పవన్‌ మాటలు ఓ కొత్త బలాన్నిచ్చాయి. తమ తరఫున పోరాటం చేసేందుకు, తమకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నించేందుకు ఓ మనిషి ఉన్నాడన్న ఆశని కల్పించాయి. పవన్‌ కేవలం తన ప్రారంభోపన్యాసంతోనే సరిపెట్టుకోలేదు. ఆ ఉపన్యాసంలో తను ఇచ్చిన ‘కాంగ్రెస్‌ హఠావో, దేశ్‌ బచావో’ పిలుపుని జనంలోకి తీసుకువెళ్లారు. 2014 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఒక్క కాంగ్రెస్‌ నేత కూడా చట్టసభలకు ఎన్నిక కాకపోవడం వెనుక పవన్‌ ఇచ్చిన పిలుపు ప్రభావం కూడా ఉంది. కానీ ఆ తరువాతే అసలు కథ మొదలైంది!   ఎన్నికల సమయంలో అంతగా విరుచుకుపడిన పవన్‌ ఆ తరువాత నిశ్శబ్దంగా మారిపోయారు. ఆంధ్రులకు సంబంధించిన ఏ రాజకీయ పరిణామం ఏర్పడినా, ఆ సమయంలో పవన్‌ ప్రతిస్పందనని ఆశించేవారికి నిరాశే మిగిలింది. పవన్‌ నిర్లిప్తంగా మారిపోయారనీ, ఒకవేళ బయటకు వచ్చి ఎప్పుడన్నా మాట్లాడినా అది కేవలం చంద్రబాబుని కష్టకాలంలో ఆదుకునేందుకే అని ప్రతిపక్షాలు విమర్శించడం మొదలుపెట్టాయి. అలాగని పవన్‌తో తెలుగుదేశం సంతోషంగా ఉందా అంటే అదీ లేదు. ఎన్నికల సమయంలో తెదెపాకి ఓ ఊపునిచ్చిన పవన్‌ రాజధాని శంకుస్థాపన, గ్రేటర్‌ ఎన్నికలు వంటి కీలక సమయాలలో ఆ పార్టీకి దూరంగా ఉండిపోయారు. ఇక ప్రత్యేక హోదా, కాపు రిజర్వేషన్‌ వంటి సమస్యల సందర్భంలోనూ పవన్‌ కచ్చితంగా మాట్లాడలేకపోయారన్న అపవాదు ఎలాగూ ఉంది.   కళారంగంలో ఉన్నవారు రాజకీయాలలో కూడా తమ ప్రభను, ప్రతిభను చూపాలనుకోవడం కొత్తేమీ కాదు. అలా సినీరంగం నుంచి వచ్చి రాజకీయాలను ప్రభావితం చేసిన వారి సంఖ్యా తక్కువేమీ కాదు. దక్షిణ భారతదేశంలో సినిమాలు, రాజకీయాలు జోడుగుర్రాలుగా మారి చాలా కాలమే అయిపోయింది. కానీ సినిమాల్లో హిట్ అయినంత మాత్రాన రాజకీయాలలో ఫ్లాప్‌ కాకూడదన్న సూత్రం ఏదీ లేదు. అందుకు మెగాస్టారే ఓ గొప్ప ఉదాహరణగా నిలిచారు. ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌, తన అన్నగారు అందించిన ఉదాహరణను బలపరుస్తున్నారా అన్న సందేహం కలగక మానదు. రాజకీయాల్లో చూపించాల్సిన అపారమైన చాతుర్యం, సహనం లేకపోతే ఎలాంటివారికైనా మనగలగడం కష్టం. దీర్ఘకాలిక లక్ష్యాలు లేకుండా అకస్మాత్తుగా తమకు ఉన్న ప్రజాదరణ అంతా ఓట్ల రూపంలోకి మారిపోతుందనుకుంటే భంగపడక తప్పదు. అన్నింటికీ మించి... ప్రజలు వారి ప్రతి అడుగునూ నిశితంగా గమనిస్తారనీ, వారి ప్రతి మాటనూ ప్రతిపక్షాలు విమర్శిస్తాయనీ మర్చిపోకూడదు. ఏదో ఒకసారి అలా కనపడి వెళ్లడానికి ఇది అతిథి పాత్ర కాదు. ఏదో ఒకసారి ఇలా ఆవేశంగా మాట్లాడి ఊరుకుండి పోవడానికి సినిమా క్లైమాక్సూ కాదు.   పవన్‌కు ఈ విషయాలన్నీ తెలియక కాదు. కానీ ఎప్పుడూ తనదైన లోకంలో ఉండిపోయే పవన్‌, నిరంతరం రాజకీయాలలో మనగలిగే చొరవ చూపగలడా అన్నదే ప్రశ్న! ఆవేశానికి మారుపేరైనా అతని వ్యక్తిత్వం రాజకీయాలకు సరిపోతుందా అన్నదే అనుమానం! మరికొద్ది సంవత్సరాలలో తన జీవితాన్ని పూర్తిగా రాజకీయాలకే అంకితం చేస్తానని పవన్‌ అంటున్నారు. నిజానికి ఇది కూడా ఓ ఉద్వేగపూరితమైన ప్రకటనే! సినిమాలు తీయడమా, మానడమా అన్నది తరువాత విషయం. ముందు తనను తాను ఓ క్రియాశీల రాజకీయ నాయకుడిగా పవన్‌ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. తన జనసేన పార్టీ లక్ష్యం ఏమిటో స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది.   ఇప్పటికే జనసేన ఎప్పటి నుంచి ఎన్నికలలో పాల్గొనబోతోందో కూడా తెలియని అయోమయంలో కార్యకర్తలున్నారు. ఆ పార్టీ తెదెపాకి మిత్రపక్షమా, ప్రతిపక్షమా తెలియని సందిగ్థంలో సామాన్యులున్నారు. ఆంధ్రాలో జగన్ ఒంటెద్దుపోకడతో వైకాపా క్రమంగా బలహీనపడుతోంది. ప్రత్యేక హోదా వంటి విషయాలలో బీజేపీ అంటేనే అక్కడి జనాలకి గుర్రుగా ఉంది. ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను నిర్వహించేందుకు ఎవ్వరూ లేకపోవడం నిజంగా దురదృష్టకరం. ఆ అవకాశం ఉన్నా కూడా జనసేన స్తబ్దుగా ఎందుకు మిగిలిపోతోందన్నదే అందరిలోనూ మెదుల్తున్న ప్రశ్న. ఆంధ్రప్రదేశలో కానీ, ఆంధ్రప్రదేశ్‌ తరఫున కానీ పోరాడేందుకు ఇప్పుడు సవాలక్ష సమస్యలు సిద్ధంగా ఉన్నాయి. రాజధాని భూముల వివాదం, జలవివాదాలు, పెరుగుతున్న నిరుద్యోగం, కరవు... ఇలా పవన్‌ పోరాడేందుకు చాలా సమస్యలే సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ సర్దార్ తన మాటల తూటాలను పొదుపుగా ఎందుకు వాడుతున్నాడన్నది కోటి రూపాయల ప్రశ్న!   జనసేన ఏర్పడి ఇప్పటికి రెండేళ్లు దాటిపోయింది. కానీ ఇంతవరకూ ఆ పార్టీ మీద ప్రజలు ఓ స్థిరాభిప్రాయాన్ని ఏర్పరుచుకోలేకపోయారన్నది వాస్తవం. అందుకే జనసేన తరఫున పవన్‌ కళ్యాణ్ తప్ప మరో నాయకుడు కనిపించడం లేదు. ఆ పార్టీ కార్యకర్తలు సేవా కార్యక్రమాలతో కాలం వెల్లబుచ్చుతున్న వార్తలు వినిపిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే సాగితే జనసేన మరో ప్రజారాజ్యంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. అదే కనుక జరిగితే వ్యక్తిగతంగా పవన్‌కు ఎంత నష్టమో కానీ, తమ కోసం పోరాడే పార్టీ వచ్చిందని మురిసిపోయే సామాన్యుల నమ్మకాన్ని వమ్ము చేసినట్లవుతుంది. అది దేశానికి. ఆ దేశంలో ఉన్న ప్రజాస్వామ్యానికి ఏమంత మంచిది కాదు కదా!

సోనియా వెతలు తీరేనా!

  కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధి బహిరంగ ప్రదర్శనలకు హాజరు కావడం చాలా అసాధారణం. అలాంటిది నిన్న ‘సేవ్‌ డెమోక్రసీ’ పేరుతో ఆమె జంతర్‌మంతర్‌ వద్ద ధర్నాకు దిగారు. పార్లమెంటుని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఆఖరికి కాసేపు అరెస్టు కూడా అయ్యారు. దేశంలో పేదల బాధలను చూడలేక, రైతుల ఆత్మహత్యలను తట్టుకోలేక తాము ఈ ధర్నాకు దిగామనీ.... ఈ దెబ్బతో అటు బీజేపీకి, ఇటు ఆరెస్సెస్‌కు తమ సత్తా ఏమిటో తెలిసి వస్తుందని ఆశిస్తున్నామని ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పేర్కొంది. అరుణాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలను వ్యతిరేకంగా తమ నిరసనను వినిపించింది. కానీ అగస్టా కుంభకోణంలో కుదేలైపోతున్న తమ అధినాయకత్వాన్ని కాపాడుకునేందుకే కాంగ్రెస్ ఈ హడావుడి చేస్తోందన్న విశ్లేషణలూ వినవస్తున్నాయి.   జంతర్‌మంతర్‌ వద్ద జరిగిన ధర్నాలో పాల్గొంటూ పోరాటాలు తనకి కొత్తకాదనీ, రక్తం చిందించిన చరిత్ర మనదనీ చెప్పుకొచ్చారు సోనియా గాంధి. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే మున్ముందు అగస్టా కుంభకోణం ఆమెను ముప్పుతిప్పలు పెట్టేట్లే కనిపిస్తోంది. కుంభకోణాలు కాంగ్రెస్‌కు, ఆ మాటకు వస్తే ఏ రాజకీయ పార్టీకైనా కొత్తకాదు. కానీ వాటికి సంబంధించి ప్రతికూల అంశాలు ఉన్నట్లే సానుకూల అంశాలు కూడా ఉంటాయి. ప్రజలు నిదానంగా వాటిని మర్చిపోవడమో, అధికారంలో ఉన్న పార్టీ వివాదాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నించడమో జరుగుతూ ఉంటుంది. కానీ అగస్టా వివాదం అలా కనిపించడం లేదు. సాక్షాత్తూ ఇటలీ కోర్టే వేలెత్తి చూపడంతో, ఆనాటి ప్రభుత్వం మీద మచ్చ పడినట్లైంది.   సోనియా బద్ధ శత్రువైన సుబ్రమణ్య స్వామిని రాజ్యసభకు పంపడంతోనే బీజేపీ రణతంత్రం ఏమిటో తెలిసిపోయింది. తన వాక్చాతుర్యంతో, దూకుడుతో రాజ్యసభలోకి అడుగుట్టిన రెండోరోజు నుంచే సోనియాను ఇరుకున పెట్టడం మొదలుపెట్టారు స్వామి. అయితే అటు రాజ్యసభలో కానీ, ఇటు లోక్‌సభలో కానీ సోనియాను సమర్థించగల వాక్పటిమ ఎవరికీ లేకపోయింది. జ్యోతిరాదిత్య సింధియా వంటి యువనేత, తమ అధినేత్రిని వెనకేసుకు రావల్సి వచ్చింది. ఒక దశలో కాంగ్రెస్‌కు శత్రు పక్షమైన తృణమూల్‌ కాంగ్రెస్‌ సింధియాకు మద్దతుగా నిలవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టమెంటు పీఠం మీద సోనియాను వెనకేసుకు వచ్చే నాయకులు కరువయ్యారేమో అన్న సందేహం కలగక మానదు.   సోనియా కష్టాలు కేవలం అగస్టా కుంభకోణంతో ముగిసేవి కాదు. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. తమిళనాడు, పుదుచ్చేరిలలో కాంగ్రెస్‌ ఓటమి ఖాయమని ఇప్పటికే తేలిపోయింది. ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న అసోం, కేరళలో పరిస్థితులు ఏమంత ఆశాజనకంగా కనిపించడం లేదు. పశ్చిమ బెంగాల్లో కూడా చివరి నిమిషంలో ఏదన్నా అద్భుతం జరిగితే తప్ప కాంగ్రెస్‌కు విజయావకాశాలు లేవు. ఈ ఎన్నికల ఫలితాలు కనుక కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వస్తే అవి సోనియాకు శరాఘాతంగా పరిణమించే అవకాశం ఉంది. ఇప్పటికే అరుణాచల్‌ ప్రదేశ్‌ ఎలాగూ చేజారిపోయింది. ఇక ఉత్తరాఖండ్‌, మణిపూర్‌లలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాలు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో హిమాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటక, మేఘాలయ, మిజోరం రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్‌ ప్రభుత్వాలు స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఒక జాతీయ పార్టీకి ఇవేమంత ఘనమైన గణాంకాలుగా తోచడం లేదు.   ఇక సోనియాకు కష్టకాలంలో అండగా నిలబడతాడనుకుంటున్న రాహుల్‌ పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది.  ఇప్పటివరకూ తన వాక్పటిమ గురించి, వ్యూహాత్మక తప్పిదాల గురించి విమర్శలు ఎదుర్కొంటున్న రాహుల్‌ పేరు ఇప్పుడు స్వయంగా అగస్టా కుంభకోణంలో ప్రముఖంగా వినిపించడం మొదలుపెడుతోంది. నిన్న మొన్నటి వరకూ చాటుమాటు విమర్శలకు దిగిన సుబ్రమణ్య స్వామి ఇప్పుడు రాహుల్‌ మీద నేరుగా అస్త్రాలను సంధించడం మొదలుపెట్టారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులోను, బ్రిటిష్‌ పౌరసత్వం వివాదంలోనూ రాహుల్ తీవ్రంగా పోరాడక తప్పని స్థితి! మరి కాంగ్రెస్‌ అంటే సోనియా, సోనియా తరువాత రాహుల్ అన్న భావనలో ఉన్న నేతలు ఇప్పుడేం చేయబోతున్నారు? సోనియాను వెనకేసుకు వచ్చేందుకు కృష్టి చేస్తారా లేకపోతే బలహీనపడుతున్న పార్టీని పునర్మించేందుకు పాటుపడతారా!

పాక్-అమెరికా డీల్ చెడింది..!

  పాకిస్తాన్-అమెరికా ఫేవికాల్ బంధం గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు. అయితే ఇప్పుడు ఈ బంధానికి పెద్ద దెబ్బ తగిలింది. ఉగ్రవాదంపై పోరాటం చేస్తామనే సాకు చెప్పి అమెరికా ఆర్థిక సాయంతో రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకుంటున్నపాకిస్తాన్ ఆశలపై అమెరికా కాంగ్రెస్ నీళ్లు చల్లింది. దేశంలో రక్తపుటేరులు పారిస్తున్న తాలిబన్లను ఎదుర్కోవాలంటే అత్యాధునిక ఆయుధాలు అవసరమని పాక్ ప్రభుత్వం భావించింది. అందుకే తనకు అత్యంత మిత్రదేశం అయిన అమెరికా నుంచి ఎనిమిది ఎఫ్-16 యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి కొద్ది కాలం క్రితం అగ్రరాజ్యంతో చర్చలు జరిపింది. పాక్‌కు ఎఫ్-16 విమానాలు విక్రయించేందుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం అంగీకరించారు.   దీని మొత్తం విలువ 270 కోట్ల అమెరికన్ డాలర్లు. ఈ ఆర్డర్‌లో సగం పాకిస్తాన్ చెల్లించాలి..మిగతా సగం అమెరికా తన మిత్రదేశాలకు చేసే సైనిక సహాయనిధి నుంచి చెల్లించేలా ఒప్పందం కుదిరింది. మొదట మొత్తం 18 ఎఫ్-16 యుద్ధ విమానాలు కావాలని పాక్, అమెరికాను కోరింది. అయితే ఆర్ధికపరమైన సమస్యల కారణంగా ఎనిమిది విమానాలను మాత్రమే విక్రయిస్తామని అగ్రరాజ్యం తేల్చిచెప్పింది. ఇందులో కూడా సగం ధరకే ఎఫ్-16 విమానాలు అందుతుండటంతో పాక్ ఎగిరిగంతేసింది. ఇక్కడతో కథ అవ్వలేదు ఈ బప్పందానికి అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపినప్పటికి అతి శక్తివంతమైన సెనేట్ విదేశీ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ బాబ్ కార్కర్ నేతృత్వంలోని సెనేటర్ల బృందం ఈ ఒప్పందానికి అడ్డుకట్ట వేసింది.    ఇందుకు కారణం లేకపోలేదు..ఎఫ్-16 యుద్ధ విమానాలను ఉగ్రవాదంపై కాకుండా తమకు వ్యతిరేకంగా గురిపెడుతుందని అందువల్ల ఈ డీల్‌పై పునరాలోచించాలని భారత్, అమెరికాను కోరింది.  పాకిస్తాన్ నమ్మదగిన మిత్రుడు కాదని, ఒసామా బిన్ లాడెన్‌ను అంతమొందించడంలో సాయపడిన ఒక వైద్యుడిని పాక్ ప్రభుత్వం వేధిస్తోందని సెనేటర్లు వాదించారు. మరీ ముఖ్యంగా దేశంలోని హక్కానీ నెట్‌వర్క్‌పై పాక్ చర్యలు శూన్యమని కమిటీ సూచించింది. ఈ కారణాలతో అమెరికా జాతీయ నిధి నుంచి నిధులను వినియోగించడానికి తాము అంగీకరించమని కమిటీ తేల్చి చెప్పింది. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో పాలుపోని ఒబామా సర్కార్ సొంత నిధులతోనే యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని పాక్ ప్రభుత్వానికి సూచించింది. ఎఫ్-16 యుద్ధ విమానాలను తక్కువ ధరకు ఇవ్వలేమని తెగేసి చెప్పింది.   ఊహించని ఈ పరిణామంతో షాక్ తిన్న పాకిస్తాన్, అమెరికా నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఈ వ్యవహారంపై పాక్ ప్రధాని సలహాదారు సర్తాజ్ అజీజ్ ఘాటుగా స్పందించారు. అగ్రరాజ్యం ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. ఒక వేళ అమెరికా యుద్ధ విమానాల కోసం ఇస్తున్న సబ్బీడీ ఎత్తివేయాలనే నిర్ణయానికి కట్టుబడి ఉంటే తాము ఎఫ్-16 యుద్ధ విమానాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి వెనుకాడేది లేదని హెచ్చరించారు. పాకిస్తాన్‌లో నెలకొని ఉన్న పేదరికం, మౌలిక సదుపాయాల కల్పనకు అమెరికా ఉదారంగా నిధులిచ్చింది. అయితే ఏ సాయాన్ని అయినా భారత్‌కు వ్యతిరేకంగా వినియోగించడానికే పాక్ ప్రణాళిక రచిస్తూ వస్తుంది. ఇది అమెరికాకు తెలిసినప్పటికి పాక్‌తో ఉన్న అవసరం దృష్ట్యా చూసి చూడనట్లు వదిలివేస్తోంది.   ఒకప్పటితో పోలిస్తే పాక్-అమెరికా బంధం అంత గట్టిగా ఏం లేదు. ఇటీవల నాటో దళాలు జరిపిన దాడుల్లో 24 మంది పాకిస్తాన్ సైనికులు మరణించడంతో..పాక్-అమెరికా సంబంధాలపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. తమ దేశ సార్వభౌమత్వానికి, గౌరవానికి భంగం వాటిల్లనంతవరకు అమెరికాతో సంబంధాలు కొనసాగించాలనే తాము కోరుకుంటున్నామని ఆ దేశ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. పాక్ సైనికులను చంపడం, లాడెన్‌ను హతమార్చేందుకు పాక్ భూభాగంలో దాడులు జరపడం పట్ల పాక్ ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ఆఫ్ఘన్‌లోని ఒక మిలటరీ క్యాంప్‌పై ఉగ్రదాడి వెనుక పాక్ గూడఛార సంస్థ ఐఎస్ఐ ఉన్నట్లు అమెరికా ప్రకటించింది. ఈ దాడిలో సీఐఏ ఏజెంట్లు, పాత్రికేయులు, ప్రజలు ఉన్నారని పేర్కొంది. ఇలా ప్రతి విషయంలోనూ అమెరికా, పాక్ మధ్య మనస్పర్ధలు కామన్ అయ్యాయి. అగ్రరాజ్య తీరు కారణంగా పాక్ , చైనాకు మరింత దగ్గరయ్యే పరిస్థితి కనిపిస్తుంది. మరి అమెరికా అంత వరకు రానిస్తుందా? తన మిత్రుడిని వదులుకుంటుందా? అనేది వేచి చూడాలి. మొత్తానికి ఈ డీల్ క్యాన్సిల్ కావడం భారత్‌కు ఒకింత మేలే. అదే అమెరికా నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎఫ్-16 విమానాలు దిగినట్లైతే భారత్ తక్షణమే అప్రమత్తమై ఉండాల్సి వచ్చేది.  

నిర్భయలు ఎందరో!

  అత్యాచారం అనేది చాలా తీవ్రమైన నేరమే కావచ్చు. కానీ అదే నేరం మాటిమాటికీ ఏదో ఓ మారుమూల ప్రాంతంలో జరుగుతూనే ఉంటే... ప్రజలూ, ప్రభుత్వం కూడా మొద్దుబారిపోతారేమో! సవాలక్ష వార్తల్లో ఇది కూడా ఒకటే కదా అని సర్దుకుపోతారేమో! కానీ ఆ నిర్లిప్తతే మన జాతిని నిర్వీర్యం చేసే ప్రమాదం ఉందని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. లేకపోతే మనది గొప్ప సంస్కృతి అనే కాదు, మనం మనుషులం అని చెప్పుకునే అర్హత కూడా మిగలదు.   ఏప్రిల్‌ 28: పట్టపగలు. జిషా అనే 29 ఏళ్ల అమ్మాయి కేరళలోని మారుమూల గ్రామమైన పెరుంబవూర్‌లోని తన సొంత ఇంట్లో ఉంది. అకస్మాత్తుగా ఆ ఇంటి తలుపులను తోసుకుంటూ ఎవరో లోపలికి వచ్చారు. లోపలికి వచ్చిన మృగం చేయరాని అకృత్యాలన్నీ చేసింది. జిషాను కొరికికొరికి అనుభవించి, పొడిచి పొడిచి చంపింది. జిషా తల్లి ఇంటికి వచ్చి చూసేసరికి కూతురు రక్తపుమడుగులో అపస్మారకంగా పడి ఉంది. తన కూతురిని ఆసుపత్రికి తీసుకువెళ్లాలంటూ ఆమె వేసిన కేకలని కూడా ఎవరూ పట్టించుకోలేదు.   జిషా ఒక దళిత యువతి. ఎప్పటికైనా న్యాయశాస్త్రంలో పట్టా తీసుకుని అసమానత్వానికి వ్యతిరేకంగా పోరాడాలన్నది ఆమె ఆశగా ఉండేది. కానీ అరకొర ఆర్థిక పరిస్థితుల వల్ల చదువు కూడా మందకొడిగా సాగేది. చదువు పూర్తయ్యేలోగానే ఆమె జీవితమే ముగిసిపోయింది. జిషాది మొదటి నుంచీ ఓ విషాద యాత్రే! ఆమెకు తొమ్మిదేళ్ల వయసు ఉండగానే తండ్రి వాళ్లని వదిలి వెళ్లిపోయాడు. ఆ ఘటనకో ఏమో తల్లికి అప్పుడప్పుడూ మతిస్థిమితం తప్పుతూ ఉండేది. అయినా జిషా చాలా నిబ్బరంగా, తన పనేదో తాను చూసుకుంటూ సాగిపోయేదని చుట్టుపక్కల వారు చెబుతారు. దగ్గర్లోని ఒక ఆసుపత్రిలో పనిచేస్తూ, చదువుని ఎలాగొలా కొనసాగించాలని ఆశపడుతూ, ఓ పక్కా ఇంటి కోసం కలలు కంటూ జీవితాన్ని గడిపేసేది. జిషాకి ఇప్పుడు కలలు కనే అవకాశం కూడా లేకుండా పోయింది. జిషాని పైశాచికంగా అనుభవించి చంపి నిటారుగా నడుచుకుంటూ పోయిన ఆ మనిషిని ఇప్పటివరకూ పట్టుకోలేకపోయారు.   జిషా కుటుంబం మీద కక్షతోనే ఎవరో ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని కొందరి అనుమానం. అసలు ఈ నేరానికి పాల్పడింది ఒక్కరా లేక ఇద్దరా అన్నది మరి కొందరి సందేహం. కానీ ఒక్కటి మాత్రం నిజం! జిషాను పట్టపగలు, ఆమె స్వంత ఇంట్లో అత్యాచారం చేసే అవకాశం ఉండటం నిజంగా దురదృష్టకరం. నేరస్తుడికి ఆ అలుసు మన సమాజమే కల్పించింది. మామూలు రోజుల్లో అయితే జిషా మరణం మరో వార్తగా మిగిలిపోయేదేమో! కానీ కేరళలో ఎన్నికలు జరుగుతుండటంతో, ఈ ఘటనను ఎవరికి వారు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించసాగారు. ప్రభుత్వ, ప్రతిపక్ష నేతలు హుటాహుటిని వెళ్లి జిషా తల్లిని పరామర్శించారు. ముఖ్యమంత్రి ఆ కుటుంబానికి పది లక్షల సాయం, ఎప్పుడో దూరమైన జిషా సోదరికి ప్రభుత్వోద్యోగం కల్పిస్తామని ప్రకటించేశారు. కేరళలో ఉన్న దారుణమైన పరిస్థితులకు జిషా ఘటనే ఓ ఉదాహరణ అని ప్రతిపక్షాలన్నీ దుమ్మెత్తి పోయడం మొదలుపెట్టాయి.   నిజానికి కేరళలో స్త్రీల పట్ల నేరాలు కొత్తేమీ కాదు. మా రాష్ట్రంలో మానవాభివృద్ధి చాలా అద్భుతమని ఆ నేతలు చెప్పుకొంటున్నప్పటికీ, పొరుగు రాష్ట్రాల్లో పోలిస్తే అక్కడ ఇలాంటి ఘటనల సంఖ్య ఎక్కువే! అక్షరాస్యతలోనూ, ఇంటిని నిభాయించుకోవడంలోనూ అక్కడి మహిళలు ముందుంటున్నప్పటికీ... వారి మీద జరుగుతున్న అత్యాచారాలను మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. కేరళలను విడతలవారీగా ఏలుతున్న సీపీఎం, కాంగ్రెస్‌ ప్రభుత్వాలే దీనికి కారణం అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2012లో దిల్లీలో జరిగిన నిర్భయ ఘటన తరువాత ప్రభుత్వాలన్నీ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తాయనీ అంతా ఆశించారు. అందుకు తగినట్లుగానే చట్టాలలో తీవ్రమైన మార్పులనూ తీసుకువచ్చారు. కానీ ఎన్ని చట్టాలు వచ్చినా అవి నేరాలను ఏమాత్రం అదుపు చేయలేకపోయాయని గణాంకాలు చెబుతున్నాయి. సాక్షాత్తూ దేశ రాజధాని దిల్లీలోనే, అత్యాచారం అభియోగాలు ఎదుర్కొంటున్నవారిలో 83 శాతం మంది ఎలాంటి శిక్షా లేకుండా తప్పించుకోగలుగుతున్నారని లెక్కలు కనిపిస్తున్నాయి. పోలీసుల దగ్గర్నుంచీ న్యాయవాదుల వరకూ అత్యాచారాన్ని చాలా సహజమైన చర్యగా భావించడంతో కేసులు నిర్వీర్యం అయిపోతున్నాయి. ఇదిగో! ఇలా ఎప్పుడన్నా జిషాలాంటి ఘటన వెలుగులోకి వచ్చినప్పుడు, కొన్నాళ్లు దాని మీద చర్చ జరగుతూ ఉంటుంది. అప్పుడు కూడా అటు మీడియా, ఇటు రాజకీయ నేతలు ఎవరికి వారు తమకు అనుగుణంగా ఇలాంటి ఘటనను వాడుకోవడంతోనే కాలం గడిచిపోతుంది.   జిషా సంఘటన జరిగిన కొద్ది రోజులకి కేరళలోనే మరో ఘటన జరిగింది. నర్సింగ్‌ శిక్షణను తీసుకుంటున్న ఓ వైద్య విద్యార్థిని మీద ఆటోలో ప్రయాణిస్తున్న తోటి ప్రయాణికులే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఆటో డ్రైవరు బాధితురాలకి పరిచయస్తుడే కావడం గమనార్హం. దీనిని బట్టి ఒక విషయం స్పష్టంగా తేలిపోతోంది. పట్టపగలైనా, ఇంట్లో ఉన్నా, నడి రోడ్డు మీద ఉన్నా, తెలిసినవారితో ఉన్నా.... ఆడవారికి రక్షణ లేదన్న భయం స్పష్టమవుతోంది. కేవలం చట్టాలకు పదును పెట్టడం వల్ల ఈ భయం తీరిపోదు. వాటిని అమలుచేయడంలోనూ అంతే కఠినంగా ఉండాలి. హెల్ప్‌లైన్లు, ఫాస్ట్ ట్రాక్‌ కోర్టులు, ప్రత్యేక వైద్య విభాగాలు, 24X7 సిద్ధంగా ఉండే ప్రత్యేక పోలీసు యంత్రాంగం.... ఇలా చట్టాన్ని అమలు చేయాల్సిన ప్రతి విభాగాన్నీ పదునెక్కించాల్సి ఉంది. లేకపోతే నేరం చేసి తప్పించుకోవడం, దొంగా పోలీసు ఆట ఆడుకున్నంత తేలికగా మారిపోతుంది.

ఉత్తరాఖండ్ తగలబడుతోంది!

  ఉత్తరాఖండ్‌లో విధించిన రాష్ట్రపతి పాలన గురించి ఓ పక్క దేశమంతా చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయమై న్యాయస్థానాలు ఏమంటున్నాయి, నేతలు ఏమని తిట్టుకుంటున్నారు అని అంతా గమనిస్తూనే ఉన్నారు. కానీ చాలామంది పెద్దగా పట్టించుకోని విషయం... అక్కడి అడవులు తగలబడటం! అడవులలో మంటలు చెలరేగడం కొత్తేమీ కాదు. కార్చిచ్చులు ప్రకృతిలో అతి సహజమైన పరిణామం. కానీ ఈసారి ఉత్తరాఖండ్‌లో చెలరేగుతున్న మంటల వెనుక కారణాలను పరిశీలిస్తే... ఆ మంటల్లో మనిషి నిలువెత్తు స్వార్థం కనిపిస్తుంది.   ఏటా రుతుపవనాలకు ముందుగా ఉత్తరాఖండ్‌ అడవులలో కొన్ని చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవిస్తూనే వచ్చేవి. కానీ గత రెండేళ్లుగా వర్షపాతం సరిగా లేకపోవడంతో ఇక్కడి అడవులలో ఉన్న దేవదారు వృక్షాలలో తేమశాతం తగ్గిపోయింది. ఉత్తరాఖండ్‌ అడవులలో ఇప్పుడు ఎటు చూసినా అలాంటి దేవదారు వృక్షాలే కనిపిస్తూ ఉంటాయి. దేవదారు ఆకులు చాలా కోసుగా ఉండి వెంటనే నిప్పంటుకుంటాయి. దేవదారు కలప నిప్పుకి నిలువెల్లా తగలబడిపోతుంది. ఇప్పుడు ఈ దేవదారు చెట్లే ఉత్తరాఖండ్‌ కొంప ముంచాయి. ఒకప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదు! ఉత్తరాఖండ్‌ అడవుల నిండా నానారకాల వృక్షజాతులన్నీ ఉండేవి. వాటిలో వెడల్పాటి ఆకులు ఉన్న చెట్లు, తేమ ఎక్కువ శాతాన్ని నిలువ చేసుకునే చెట్లు... మంటలని నిలువరించేవి. కానీ ఏళ్లు గడిచేకొద్దీ ఖరీదైన కలపని ఇచ్చే దేవదారు చెట్లను ఇబ్బడిముబ్బడిగా పెంచేయడం మొదలుపెట్టారు అక్కడి జనం. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 16 శాతం ఈ దేవదారు చెట్లే ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.   ఒకప్పుడు అడవులు తగలబడితే అక్కడికి దగ్గర్లో ఉన్న గ్రామస్తులకి కాస్తో కూస్తో లాభం ఉండేది. ఆ కలపని తెచ్చుకుని వంట చెరుకు కోసం ఉపయోగించుకునేవారు. కానీ ఇప్పుడు అడవులు తగలబడటం కోసం కాచుకు కూర్చునేవారు చాలామందే తయారయ్యారు. అటవీ శాఖ నుంచి తగలబడిన కలపను కొనుక్కునేందుకు కలప వ్యాపారస్తులు సిద్ధంగా ఉంటారు. మరోపక్క  అడవులు తగలబడిపోయిన తరువాత మిగిలిన భూమిని ఆక్రమించుకునేందుకు భూకబ్జాదారులు ఎదురుచూస్తుంటారు. వీరితో చేతులు కలిపితే తమకి ఎంతో కొంత లాభం కలుగకపోతుందా అని స్థానిక గ్రామస్తులు కూడా ఆశపడుతుంటారు. ఈసారి కనీవినీ ఎరుగని రీతిలో ఉత్తరాఖండ్‌లో అడవులు తగలబడిపోవడం వెనుక ఇలాంటి దురుద్దేశాలు ఉన్నాయన్నది ఓ అనుమానం. ఆ అనుమానాన్ని బలపరుస్తూ కొన్నిచోట్ల నిప్పంటించేందుకు ప్రయత్నిస్తున్న ఆగంతకులని పట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.   మూడు నెలలుగా ఎడతెరపి లేకుండా ఎగసిపడుతున్న ఈ అగ్నికీలలను అదుపు చేసేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. కేంద్ర ప్రభుత్వ దళాలు సైతం మంటలను ఆర్పేందుకు శతథా ప్రయత్నిస్తున్నాయి. ఈ చర్యలలో పావు వంతైనా, మంటలు మొదలవక ముందే తీసుకుని ఉంటే ఉపయోగం ఉండేదన్నది పర్యావరణవేత్తల ఆరోపణ. ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న దేవదారు వృక్షాలను నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోవడం; మంటలు త్వరత్వరగా వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం; తగినంతమంది అటవీ సిబ్బందిని నియమించడం; స్థానికులలో పర్యావరణ స్పృహ పెంపొందించడం; మంటలకు కారణమైనవారిమీద కఠిన చర్యలను తీసుకోకపోవడం.... ఇలా ఒకటి కాదు రెండు కాదు... ప్రభుత్వం తరఫు నుంచి వైఫల్యాలు చాలానే కనిపిస్తున్నాయి.   ఉత్తరాఖండ్‌ కార్చిచ్చు వల్ల దాదాపు రెండు వేల హెక్టార్లకు పైగా అడవుల బూడిదపాలయ్యాయి. ఈ మంట్లలో కనీసం ఏడుగురన్నా చనిపోయి ఉంటారని అంచనా. కానీ ఇది కేవలం కనిపించే నష్టం మాత్రమే! ఈ కార్చిచ్చుల వల్ల కనిపించని నష్టం అపారమన్నది విశ్లేషకుల మాట.   - మంటల నుంచి వ్యాపించే నుసి, హిమానీనదాల (గ్లేసియర్స్‌) మీద పేరుకోవడం వల్ల, అవి త్వరత్వరగా కరిగిపోతాయంటున్నారు పర్యావరణవేత్తలు.   - ఉత్తరాఖండ్‌గుండా ప్రవహించే గంగ, యమున వంటి నదులు ఈ కార్చిచ్చుల వల్ల పూర్తిగా కలుషితం అయిపోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది.   - ఈ కార్చిచ్చుల వల్ల వేలాదిగా పక్షులు, జంతువులు, చెట్లు అంతరించిపోయాయని అంచనా. వీటిలో కొన్ని అరుదైన జాతివి కూడా ఉండి ఉంటాయి.   - తీవ్రస్థాయిలో మంటలు చెలరేగడం వల్ల ఉత్తరభారతంలో ఉష్ణోగ్రతలు కనీసం 0.2 డిగ్రీలు పెరిగి ఉంటాయని  అంచనా. మనుషుల మీద ఈ ఉష్ణోగ్రత పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. కానీ పర్యావరణం మీద ఈ కాస్త మార్పు కూడా తప్రక ప్రభావం చూపుతుంది.   - ఈ మంటలు ఉత్తరాఖండ్‌లోని దాదాపు 70 శాతం అడవులను కాల్చి వేశాయంటున్నారు. శతాబ్దాలు, దశాబ్దాల తరబడి పెరిగిన ఈ అడవులు తిరిగి సాధారణ రూపుకి రావాలంటే మరిన్ని శతాబ్దాలు, దశాబ్దాలు పట్టక మానదు. ఇదీ ఉత్తరాఖండ్‌లో ఏర్పడిన రావణకాష్టం తాలూకు విషాదగాథ. మనిషి నిర్లక్ష్యానికీ, స్వార్థానికీ చెంపపెట్టులా కనిపించే ఈ ఉదాహరణ ఇకనైనా మనకు ఓ గుణపాఠంలా గుర్తుండిపోతుందని ఆశిద్దాం. అడవులను నాశనం చేసుకోవడం అంటే మన కాళ్లని మనమే నరుక్కోవడం అన్న నిజాన్ని గుర్తిద్దాం!   వృక్షో రక్షతి రక్షితః

మరో ఆర్థిక మాంద్యం రానుందా!

  ఆర్థిక మాంద్యం అంటే ఎప్పుడో 1929లో అమెరికాని కుదిపివేసిన సంఘటనే అనుకునేవారు ఒకప్పుడు. కానీ ప్రపంచీకరణ పుణ్యమాని 1999, 2009 ప్రాంతాల్లో వచ్చిన ఆర్థికమాంద్యం మన దేశానికి కూడా దివాళా పాఠాలను నేర్పింది. పరిస్థితులు చూస్తుంటే మరో ఆర్థికమాంద్యం నిదానంగా మన జీవితాలలోకి ప్రవేశించనున్నదన్న అనుమానాలు కలుగక మానవు. ఎందుకంటే...   చైనా మొరాయిస్తోంది! ఈ ఏడాది మొదలవుతూనే చైనా తన ఆర్థిక పురోగతి చాలా తక్కువగా ఉండబోతోందంటూ (7%) ప్రకటించింది. ఇప్పటి వరకూ వెలువడిన గణాంకాలన్నీ కూడా చైనా భయాలకు అనుగుణంగానే ఉన్నాయి. చైనాలో అభివృద్ధి పాతికేళ్ల కనిష్ట స్థాయికి చేరుకుందంటూ విశ్లేషకులు పేర్కొంటున్నారు. నానాటికీ పెరిగిపోతున్న కూలీ ఖర్చులు, రుణాలు, ప్రభుత్వ జోక్యం... చైనా పాలిట శాపంగా మారాయి. అక్కడ ఉన్న పరిమిత వనరులను ఎడాపెడా తవ్విపారేయడంతో, బొగ్గు, స్టీల్ వంటి ఉత్పత్తులు మునుపులా లాభాలను తెచ్చిపెట్టే స్థితిలో లేవు. అలా ఉత్పాదకతలో ప్రపంచంలోనే తొలి స్థానంలో ఉన్న చైనా వైఫల్యం చెందడంతో, ఆ ప్రభావం మొత్తం ప్రపంచం మీదే పడనుంది.   చమురు వదిలిపోతోంది! గత 13 ఏళ్లలో ఎప్పుడూ లేనంత కనిష్ట స్థాయికి చమురు ధర పడిపోయింది. చమురు కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న గిరాకీని మించి చమురుని ఉత్పత్తి కావడమే ఇందుకు కారణం. అయితే ఈ పరిస్థితికి సౌదీ అరేబియా దురుద్దేశాలే కారణం అంటున్నారు విశ్లేషకులు. ఒక పక్క గిరాకీ పడిపోతోందని తెలిసినా సౌదీ అరేబియా తన ఉత్పత్తిని తగ్గించలేదు సరికదా, మరింతగా పెంచిపారేసింది. దీని వల్ల చమురు మీద ఆధారపడిన ఇతర దేశాలు తీవ్రంగా నష్టపోతాయనీ, భవిష్యత్తులో తనదే ఏకఛత్రాధిపత్యం అవుతుందని సౌదీ వ్యూహం. సౌదీ ఆశించినట్లుగానే చమురు మీద ఆధారపడిన వెనిజులా లాంటి చిన్నాచితకా దేశాలు ఈ దెబ్బకి కుప్పకూలిపోయాయి. ఇక సంపన్న దేశాలైన ఇరాక్‌, రష్యా, ఇరాన్‌ల పరిస్థితి కూడా నానాటికీ దిగజారిపోతోంది.   ఇతరత్రా సమస్యలెన్నో! చైనా, సౌదీ అరేబియాల వల్ల కలుగుతున్న సమస్యలు కొన్నైతే... వివిధ దేశాలలో ఉన్న అనిశ్చితి మరో కారణం. ఇటు సిరియా, ఆఫ్గనిస్తాన్‌, టర్కీ దేశాలేమో ISIS వంటి ఉగ్రవాద సంస్థల పంజాలో విలవిల్లాడిపోతున్నాయి. అటు ఉక్రెయిన్, సొమాలియా వంటి దేశాలు అంతర్యుద్ధంలో మునిగిపోయాయి. ఒక దేశంలో కరువైతే, ఒక దేశంలో భూకంపాలు. ఒక దేశంలో పేదరికం తాండవిస్తుంటే, మరో దేశంలో రాజకీయ అనిశ్చితి సాగుతోంది. ఇలా ఒకో దేశానిదీ ఒకో కన్నీటి కష్టం!   మన పరిస్థితో! మిగతా దేశాలతో పోలిస్తే మన దేశం పరిస్థితి కాస్త మెరుగేనని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి దేశంలో ద్రవ్యోల్బణం 5.53% వద్ద అదుపులోనే ఉంది. విదేశీ పెట్టుబడులు ఎన్నడూ లేనంత స్థాయికి చేరుకున్నాయి. ఆర్థిక పురోగతి కూడా 7.8 శాతానికి చేరుకోవచ్చునని భావిస్తున్నారు. అంతమాత్రాన పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవడానికి లేదు. దేశంలోని చాలా ప్రాంతాల్లో కరువు విలయతాండవం చేస్తోంది. వ్యవసాయ ఉత్పత్తి తీవ్రంగా పడిపోయింది. దేశంలోని కనీసం అయిదు రాష్ట్రాల్లో రాజకీయ అనిశ్చితి కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోనున్నాయంటూ నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాది కనుక వర్షపాతం సరిగా లేకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడానికే భయం వేస్తోంది.   కిం కర్తవ్యం! ఆర్థికమాంద్యం చాలా చిత్రమైన పరిస్థితి. అది వస్తోందని గ్రహించే లోపులే ఒక్కసారిగా సమాజాన్ని చుట్టుముట్టేయగల సునామీ! ఫలానా కారణం అని చెప్పుకునే అవకాశం ఇవ్వకుండానే, మన జేబుల్ని గుల్ల చేసి పారేసే మాయావి. వీలైనంత జాగరూకతతో ఉండటమే దాన్ని ఎదుర్కొనేందుకు ఏకైక మార్గం. మునుపు ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పుడు మన దేశానికి కలిగిన నష్టం చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. మన మధ్యతరగతి జీవన విధానం, మన బ్యాంకుల పటిష్ట స్థితే ఇందుకు కారణం అని చెబుతారు. అందుకే విదేశాల మీద ఆధారపడిన కాల్‌సెంటర్‌ ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్‌ నిపుణులు మాత్రమే అప్పట్లో ఎక్కువగా నష్టపోయారు. కానీ ఈసారి పరిస్థితులు కాస్త భిన్నంగా కనిపిస్తున్నాయి. విలాసవంతమైన జీవనానికి అలవాటు పడే ఎగువ మధ్యతరగతి ప్రజల సంఖ్య పెరిగిపోయింది. బ్యాంకుల ప్రతిష్ఠ తీవ్రంగా మసకబారిపోయింది.   ప్రమాద ఘంటికలు మొదలయ్యాయా! ఇప్పటికే ఆర్థికమాంద్యాన్ని సూచించే పరిస్థితులు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. యాపిల్‌ వంటి ప్రఖ్యాత కంపెనీలన్నీ ఎప్పుడూ లేనంత తక్కువ లాభాలను నమోదు చేస్తున్నాయి. మున్ముందు కూడా ఆర్థిక వాతావరణం ఏమంత అనుకూలంగా ఉండబోదని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఈపాటికే తేల్చి చెప్పింది. బ్రెజిల్‌, అర్జంటినా, గ్రీస్ వంటి దేశాలు ఇప్పటికే ఆర్థికమాంద్యంలోకి జారుకుంటున్న వార్తలు వినిపిస్తున్నాయి. వెరసి రానున్న కాలం కాస్తా గడ్డుగానే ఉండబోతోందన్న భయం స్పష్టమవుతోంది. మరి ఈ విషయాన్ని మన ఘనత వహించిన ఆర్థికవేత్తలు గుర్తిచారా? గుర్తిస్తే ఎలాంటి ముందస్తు చర్యలను తీసుకోనున్నారు?... అన్నదే మనకి తెలియాల్సి ఉంది.

వైకాపాకు కష్ట కాలం!

  వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డి పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన దిల్లీలో అలా హడావుడి చేసి ఇలా తిరిగి వచ్చారో లేదో... తెలంగాణలో తన పార్టీ ఖాళీ అవనున్న విషయం తెలుసుకుని అవాక్కయ్యారు. తెలంగాణలో వైకాపాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకే ఒక్క ఎమ్మెల్యే, ఒకే ఒక్క ఎంపీ తెరాసలోకి మారడం ఇప్పుడు ఖాయంగా కనిపిస్తోంది. అటు పక్క ఆంధ్రాలో పరిస్థితీ అంతంతమాత్రంగానే ఉంది! ఇందులో జగన్ స్వయంకృతం కూడా కొంత లేకపోలేదు.   సాక్షాత్తూ వైకాపా వెబ్‌సైట్‌ ప్రకారం ఆంధ్రాలో వారి ఎమ్మెల్యేల బలం 51. అంటే ఒకరు కాదు ఇద్దరు కాదు... గడచిన రెండేళ్లలో దాదాపు 16 మంది ప్రతినిధులు పార్టీ నుంచి జారుకున్నారు. రోజూ ఉదయాన్నే లేచి ఎవరు పార్టీలో ఉన్నారు, ఎవరు గట్టు దాటనున్నారు అని తెలుసుకోవాల్సిన దుస్థితిలోకి అక్కడి వైకాపా జారిపోయింది. ఇతర  నేతలను తన పార్టీ వైపు లాక్కొని, నిదానంగా ప్రతిపక్షాలను ఖాళీ చేసే యుక్తి జగన్ తండ్రి వైఎస్‌ఆర్‌ కాలం నుంచే ఊపందుకుందని చెబుతారు. కాకపోతే ఇప్పుడు వైఎస్‌ఆర్‌ తనయుడే ఆ తంత్రానికి చిక్కుకోవడం ఓ వైచిత్రి.   పార్టీలో దాదాపు నాలుగో వంతు ఖాళీ అయిపోవడంతో కంగారుపడ్డ జగన్‌ హుటాహుటిన దిల్లీకి చేరుకున్నారు. ‘ఎంపరర్ ఆఫ్‌ కరప్షన్‌’ పేరుతో చంద్రబాబు మీద ఓ చిరుపుస్తకాన్ని ముద్రించి అక్కడి కనిపించినవారందరికీ పంచిపెట్టారు. పనిలో పనిగా తన ఎమ్మెల్యేలు అందరూ పసుపురంగు పులుముకుంటున్న విషయాన్ని కూడా ఏకరవు పెట్టారు. అసలు పార్టీని ఫిరాయించినవారి మీద స్పీకరు కాకుండా ఎన్నికల కమీషన్‌ నిర్ణయం తీసుకోవాలని కూడా డిమాండ్‌ చేశారు. కానీ జగన్‌ సూచనలను దిల్లీ పెద్దలు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. స్వయంగా పీకల్లోతు అవినీతి ఆరోపణల్లో మునిగిపోయి ఉన్న జగన్‌, చంద్రబాబు మీద ఆరోపణ చేయడంతో దిల్లీగణం లైట్ తీసుకున్నారు. ఇక పార్టీ ఫిరాయింపు గురించి కూడా బీజేపీ నేతలు అంత పట్టించుకునే స్థితిలో లేరు. ఎందుకంటే ఉత్తరాఖండ్‌, అరుణాచల్ ప్రదేశ్‌, మణిపూర్‌ వంటి రాష్ట్రాల్లో బీజేపీ ఇలాంటి వ్యవహారాలతోనే అధికారాన్ని దక్కించుకునే ప్రయత్నాలు చేస్తోంది.   దిల్లీ మంత్రాంగం ఫలించకపోవడంతో ఉసూరుమంటూ తిరిగివచ్చిన జగన్‌కు అటు ఆంధ్రా, ఇటు తెలంగాణలో మరికొందరు సభ్యలు గోడ దూకేందుకు సిద్ధంగా కనిపించారు. పైగా వైకాపాలో ఏకైక పెద్దదిక్కుగా ఉన్న మైసూరారెడ్డి కూడా వైకాపాను వీడటమే కాకుండా, వీడ్కోలు సమావేశంలో జగన్‌ మీద తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఆంధ్రాలో వైకాపాకు ఛర్మిష్మాను అందించే నేతలు కరువైపోయారు. ప్రతిపక్ష సభ్యులు అధికారం కోసం వలసబాట పట్టడం కొత్తేమీ కాదు. ఇందుకు జగన్‌ ఒంటెద్దు పోకడలు, తన కంటే ఎత్తుగా మరో నేత కనిపించకూడదన్న పంతం ఫిరాయింపులకు కలిసివచ్చాయి. దానికి తోడు జగన్ ఎప్పుడు ఏ వైఖరిని ఎందుకు అవలంబిస్తారో తెలియని అయోమయం ఎలాగూ ఉంది. తెలంగాణలో వైకాపా తీరే ఇందుకు ఉదాహరణ! తొలుత అక్కడ వైకాపా, తెరాసతో వైరం ఎందుకన్నట్లు సుతిమెత్తటి ఆరోపణలతో సరిపుచ్చుకునేది. ఒకదశలో తెలంగాణలో వైకాపా, తెరాస మిత్రపక్షాలేమో అన్నంత అనుమానం కలిగేది. కానీ ఇంతలోనే తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా దీక్ష, పాలేరు ఉప ఎన్నకలలో కాంగ్రెస్‌కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడంతో... తెరాస తన ఫిరాయింపు తంత్రాన్ని వైకాపు వైపు పారించింది. ఆ పార్టీకి ఉన్న ఇద్దరంటే ఇద్దరు ప్రజాప్రతినిధిలను తన వైపుకి మళ్లించుకుంది. ప్రస్తుతానికి తెలంగాణలో వైకాపా తన పార్టీని మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణలో వైకాపాకు బలమైన క్యాడర్‌ నిర్మించగల పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆ పార్టీకి దూరం కావడం నిజంగా జగన్‌కు శరాఘాతమే! తాజా పరిణామంతో తెలంగాణలో వైకాపాకు వర్తమానమే కాదు, భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడిపోయింది.   ఆంధ్రాలో పరిస్థితి కూడా వైకాపాకు ఏమంత స్థిరంగా కనిపించడం లేదు. అక్కడ ప్రత్యేక హోదా, కరువు, నిరుద్యోగం... లాంటి నానారకాల సమస్యలు ఉన్నా కూడా జగన్‌ వాటి మీద పోరాటం చేయకపోవడం విచిత్రం. అది మానేసి తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కర్నూలులోను, ఫిరాయింపులకు వ్యతిరేకంగా దిల్లీలో ఎందుకు పోరాడుతున్నారో ఎవరికీ కొరుకుడపడని అంశం. అసలు సమస్యలని గాలికొదిలేసి కాపు రిజర్వేషన్‌ వంటి సమస్యలను సృష్టించడం , అరకొర అవినీతి ఆరోపణలు చేయడంతో వైకాపా నిబద్ధత మీదే ప్రశ్నలు చెలరేగాయి. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలో వైకాపా తరచూ వైఫల్యం చెందుతోందన్నది మరో ఆరోపణ. మొన్నటికి మొన్న అసెంబ్లీ సమావేశ సమయంలో వైకాపా తీరే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఆ సమయంలో వైకాపా తీసుకున్న అవిశ్వాస తీర్మానం వంటి నిర్ణయాలు ఆ పార్టీనే ఇరుకున పెట్టాయి.   ఇప్పటికైనా వైకాపాకు సమయం మించిపోయింది లేదు. ఆ పార్టీ జాగ్రత్తగా వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల నాటికైనా బలాన్ని పుంజుకునే అవకాశం ఉంది. అటు ఆంధ్రాలోనూ, ఇటు తెలంగాణలో పోరాడవలసిన ప్రజా సమస్యలు చాలానే ఉన్నాయి. వైకాపాలోకి చేరేందుకు దాసరి వంటి నేతలూ సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు విభజన విషయంలో కాంగ్రెస్‌ అంటే గుర్రుగానే ఉన్నారు. తాజాగా ప్రత్యేక హోదా విషయంలో మొండిచేయి చూపుతున్న బీజేపీ అన్నా మండిపడుతున్నారు. ఇలాంటి సందర్భంలో తెదెపాకు ప్రత్యామ్నాయంగా ఒక్క వైకాపానే కనిపిస్తోంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని వైకాపా తాను ప్రజల పక్షం అని నిరూపించుకోవల్సిన అవసరం ఉంది. లేకపోతే తెలంగాణలో తెరాసది ఏకఛత్రాధిపత్యంలో మిగిలిపోయినట్లుగా, ఆంధ్రాలో తెదెపా దెబ్బకి కునారిల్లక తప్పదు.

యుద్ధ వీరులకు నమ్మకద్రోహం- ఆదర్శ్‌ కుంభకోణం!

  1999- కార్గిల్‌ యుద్ధం! తీవ్రవాదుల సాయంతో పాకిస్తాన్‌ తీసిన ఆ దొంగదెబ్బ నుంచి కోలుకునేందుకు మన దేశానికి చాలా సమయమే పట్టింది. ఊహించని ఆ దాడిని తిప్పికొట్టే దశలో మన సైన్యం భారీగానే నష్టపోయింది. కార్గిల్‌ యుద్ధ సమయంలో తమ సత్తాని చాటిన వీరులకు, కార్గిల్ యుద్ధ వితంతువులకు ఏదన్నా చేస్తే బాగుండు అని భారతీయ సమాజం ఆశించింది. అందుకని, వారి కోసం ఇళ్లు కట్టించి ఇస్తామంటూ మహారాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాగానే మురిసిపోయింది. కానీ కార్గిల్ యుద్ధ వితంతువుల పేరుతో మన నేతలు మరింత లాభపడే ప్రయత్నం చేశారని తెలుసుకుని విస్తుపోక తప్పలేదు. వీరులకు ఇళ్లు కట్టిస్తామని చెప్పి తమ బంధుగణాన్ని మేపిన నేతల చేతల్ని చూసి దేశం సిగ్గుపడింది. పాకిస్తాన్‌ అంటే ఏదో శత్రు దేశం అనుకోవచ్చు. కానీ మనల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన నేతలే అమర వీరుల పేరుతో మోసం చేయాలని చూస్తే! ఆ వెన్నుపోటు పేరే ఆదర్శ కుంభకోణం. కుంభకోణాలన్నింటికీ ఆదర్శంగా నిలిచిన ఈ నేరం కథ ఇదీ...   కొలాబా- ముంబైలోని అతి ఖరీదైన ప్రాంతాల్లో ఇది ముందుంటుంది. నారిమన్‌ పాయింట్‌ వంటి వ్యాపార కేంద్రానికి దగ్గరగా, సముద్ర తీరం కనిపించేలా ఉండే కొలాబాలో నివసించేందుకు ధనికులంతా ఉవ్వళ్లూరుతూ ఉంటారు. అలాంటి కొలాబాలో కార్గిల్ వీరులకు, యుద్ధ వితంతువులకు ఒక గృహ సముదాయాన్ని నిర్మించాలని మహారాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. అందుకోసం తన కింద ఉన్న వేల గజాల స్థలాన్ని ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. అంతవరకు బాగానే ఉంది. కానీ రోజులు గడిచే కొద్దీ, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న తంత్రాలు కనిపించసాగాయి. తొలుత ఆరు అంతస్తులు అని చెప్పి మొదలుపెట్టిన ఈ భవంతిని ఏకంగా 31 అంతస్తులకు పెంచి పారేసింది. ఆదర్శ్‌ కో-అపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ పేరుతో తన ఇష్టారాజ్యంగా వ్యవహరించసాగారు అధికారంలో ఉన్న నేతలు. కనీసం ఆరు కోట్లు విలువ చేసే ఫ్లాట్లను, అయిన వారికి ఆదర్శ పేరటి అరవై లక్షలకే అందించే పథకానికి తెరతీశారు.   ఆదర్శ్‌ కుంభకోణానికి సంబంధించి వెలుగులోకి వస్తున్న నిజాలు విస్తుపోయేలా చేశాయి. ఆదర్శ్ గృహసముదాయంలోని ఇళ్లు ఎవరెవరికి కేటాయించారో తెలుసుకున్న జనం ముక్కున వేలేసుకున్నారు. ఆనాటి ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌ అత్తగారితో సహా నలుగురు బంధువులకు అందులో ఫ్లాట్లను కేటాయించారు. కేవలం అశోక్‌ చవాన్‌ మాత్రమే కాదు. ఆదర్శ గృహ యజమానుల జాబితాలో యాభై శాతానికి పైగా అధికారులు, రాజకీయ నాయకులు, వారి బంధుగణాల పేర్లే కనిపించాయి. పోనీ యుద్ధ వీరులకైనా న్యాయం చేశారా అంటే అదీ లేదు! పలుకుబడి ఉన్న సైన్యాధికారులకు మాత్రమే కొన్ని ఇళ్లని అందించారు. ఆఖరికి నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి, తమకు కావల్సిన అనుమతులు ఇచ్చిన అధికారులకు కూడా తలా ఓ ఫ్లాటు బహుమతిగా అందించేశారు. మహారాష్ట్రకు చెందిన నలుగురు ముఖ్యమంత్రుల బంధువుల పేర్లు ఇందులో కనిపించాయంటే ఫ్లాట్ల కేటాయింపు ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. పార్టీలకు అతీతంగా సాగిన ఈ అక్రమంలో ప్రస్తుత రైల్వే మంత్రి సురేష్‌ప్రభుగారికి కూడా ఉదారంగా ఓ ఇంటిని అందించారు.   ఆదర్శ్‌ గృహాలను కేటాయించడంలో ఎలాగూ అక్రమాలు జరిగాయని తేలిపోయింది. కనీసం ఆ గృహ సముదాయాన్ని నిర్మించడంలో అన్నా నిబంధనలు పాటించారా అంటే అదీ లేదు! ఆ ప్రాంతంలో కేవలం ఆరు అంతస్తుల భవంతిని మాత్రమే నిర్మించే అనుమతి ఉన్నా, ఏకంగా 31 అంతస్తుల భవనాన్ని కట్టిపారేశారు. పర్యావరణ, అటవీశాఖ అనుమతులను ఏమాత్రం తీసుకోలేదు. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే రక్షణ శాఖకు చెందిన కార్యాలయాలు ఉన్న చోట 100 మీటర్ల భవంతిని కట్టడం ఏమిటంటూ నౌకాదళం చేసిన అభ్యంతరాలను కూడా ఖాతరు చేయలేదు.   2010 నాటికి ఆదర్శ్‌ కుంభకోణం ముదరడంతో అప్పటి ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌ రాజినామా చేయక తప్పలేదు. కానీ అశోక్‌ తరువాత ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టిన పృథ్విరాజ్ చవాన్‌ కూడా ఈ కుంభకోణాన్ని చల్లార్చేందుకే ప్రయత్నించారు. ఏదో కంటి తుడుపు చర్యలుగా విచారణ సంఘాలను నియమించడం, ఆ విచారణ సంఘాలు అందించిన నివేదిలను పక్కన పారేడం లాంటి చిత్రాలు చాలానే చేసేందుకు ప్రయత్నించారు. దీంతో హైకోర్టు కల్పించుకుని స్వయంగా సీబీఐ దర్యాప్తుని పర్యవేక్షించడం మొదలుపెట్టింది. అప్పుడు కూడా నేతలు తమ బుద్ధులను పోనిచ్చుకోలేదు. కుంభకోణానికి సంబంధించిన కీలక పత్రాలను మాయం చేసి పారేశారు. కానీ ఎందరు ఎన్ని జిమ్మక్కులు చేసినా ముంబై నడిబొడ్డున తమ అక్రమాలకు సాక్ష్యంగా ఉన్న 300 అడుగుల ఎత్తైన ఆదర్శ్‌ భవంతిని మాత్రం మాయం చేయలేకపోయారు.   ఆదర్శ్‌ కుంభకోణంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న అక్రమాల మీద హైకోర్టు నిన్న కొరడా ఝుళిపించింది. ప్రజాస్వామ్యానికి నిలువెత్తు ఎగతాళిగా నిలిచిన ఆదర్శ భవనాన్ని కూల్చివేయాలని నిర్మొహమాటంగా ఆదేశించింది. అంతేకాదు! ఈ కుంభకోణంలో పాలు పంచుకున్న అధికారులందరినీ కూడా విడిచిపెట్టవద్దంటూ ప్రభుత్వాలను ఆదేశించింది. కానీ నిందితుల తరఫు న్యాయవాదులు సుప్రీం తలుపులు తట్టేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో, కోర్టు ఆదేశాలు ఏమేరకు అమలవుతాయో వేచిచూడాలి. ఈ లోపల ఎలాగూ మరో కుంభకోణం బయటపడక తప్పదు! జనం, పత్రికలు కొత్తగా మరో నేతను తిట్టుకోకా తప్పదు!

ఎవరీ సుబ్రమణ్య స్వామి?

  సుబ్రమణ్య స్వామి పేరు దేశానికి కొత్తేమీ కాదు. కాంగ్రెస్‌కు అసలే కాదు. నెహ్రూ కుటుంబం అంటేనే మండిపడిపోయే ఈ మాటల మాంత్రికుడిని మోదీ ఏరికోరి రాజ్యసభకు పంపారన్న విశ్లేషణలు వినవచ్చాయి. అందుకు అనుగుణంగానే సభలో ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజు నుంచే స్వామి కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టడం మొదలుపెట్టారు. అసలు ఇంతకీ ఈ సుబ్రమణ్య స్వామి ఎవరు? ఆయన నేపథ్యం ఏమిటి? నెహ్రూ కుటుంబం మీద ఆయనకు ఎందుకంత కక్ష? లాంటి ప్రశ్నలకు లభించే జవాబులు చాలా ఆసక్తికరంగా ఉంటాయి!   సుబ్రమణ్య స్వామి దూకుడు చూసి ఆయన ఇంకా 50 ఏళ్ల వయస్కుడే అనిపిస్తుంది. కానీ ఆయన వయసు 76! చెన్నైలోని ఓ తమిళ బ్రాహ్మణుల ఇంట స్వామి పుట్టారు. తండ్రి ఇండియన్‌ స్టాటిస్టికల్‌ సర్వీస్‌లో ఉన్నతాధికారి కావడంతో వాళ్ల ఇంటికి తరచూ నేతల రాకపోకలు ఉండేవి. దాంతో స్వామికి చిన్నప్పటి నుంచే రాజకీయాల మీద కొంతమేరకు అవగాహన ఉంది. చదువుకి ఎక్కువ ప్రాధాన్యతని ఇచ్చే నేపథ్యం ఉండటంతో దిల్లీ, కోల్‌కతాల్లో ఉన్నత చదువులను పూర్తిచేసి ఆర్థికశాస్త్రంలో పీ.హెచ్‌.డీ కోసం ప్రఖ్యాత హార్వర్డు విశ్వవిద్యాలయానికి చేరుకున్నారు. పీ.హెచ్‌.డీ పట్టాను సాధించాక, అదే విశ్వవిద్యాలయంలో ప్రొఫెసరుగా పనిచేయడం మొదలుపెట్టారు. అక్కడే ఆయన జీవితం సాగిపోయి ఉంటే ఏమయ్యేదో కానీ... భారతదేశానికి వస్తే మంచి ఉద్యోగాలు ఇస్తామంటూ ఇక్కడి నుంచి ప్రతిపాదనలు వెళ్లడం మొదలయ్యాయి. ఆ ఉద్యోగాలను స్వీకరించేందుకు భారతదేశానికి తిరిగివచ్చిన స్వామికి అప్పటి ప్రధాని ఇందిరతో మనస్పర్థలు మొదలయ్యాయి.   సుబ్రమణ్య స్వామి స్వాచ్ఛా విపణికి (ఓపెన్‌ మార్కెట్‌) అనుకూలం. ఇందిరాగాంధీ అందుకు విరుద్ధమైన సమాజవాదాన్ని (సోషలిజం) నమ్మేవారు. దాంతో స్వామి అభిప్రాయాలు ఇందిరకు గిట్టేవి కాదు. అందుకే దిల్లీలోని ఐఐటీలో స్వామి ప్రొఫెసరుగా పనిచేస్తున్న సమయంలో, ఆయనను బలవంతంగా ఆ స్థానం నుంచి తొలగించింది ఆనాటి ప్రభుత్వం. తరువాత కాలంలో స్వామి సుప్రీం కోర్టుని ఆశ్రయించి తిరిగి తన స్థానాన్ని దక్కించుకున్నా, ఇందిర మీద ఆయన కోపం మాత్రం తగ్గలేదు. ఇందిరతో స్వామికి ఉన్న వైరాన్ని గమనించిన జనసంఘ్‌ (ఒకప్పటి బీజేపీ) ఆయనను రాజ్యసభకు పంపింది. ఇక ఎమర్జెన్సీ కాలంనాటికి ఇందిర విధానాలను వ్యతిరేకిస్తూ జనతాపార్టీని స్థాపించి, బలపరచడంలో స్వామి కీలక పాత్రను పోషించారు. జనతా పార్టీ తరువాత కాలంలో బలహీనపడుతూ వచ్చినా 2013 వరకూ కూడా తన భుజస్కాందాల మీద దాన్ని మోశారు. జనతా పార్టీ నానాటికీ క్షీణించిపోతోందని గ్రహించిన స్వామి, 2013లో ఆ పార్టీని బీజేపీలో విలీనం చేశారు.   స్వామికి ఉన్న రాజకీయ అనుభవం అపారమైనప్పటికీ, ఆయనను తల్చుకోగానే కేసులే గుర్తుకువస్తాయి. స్వామి వేసిన కేసుల వల్ల ప్రభుత్వాలు కూలిపోవడం, ఎన్నికలలో ఎందుకూ పనికిరాకుండా పోవడం కొత్తేమీ కాదు. ఎక్కడెక్కడి అధికారిక పత్రాలనో వెలికితీసి అధినేతలను ఇరుకున పెట్టడమూ స్వామికి వెన్నతో పెట్టిన విద్య. కర్ణాటకలో రామకృష్ణ హెగ్డే ముఖ్యమంత్రిగా ఉండగా, ఆయన ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడుతోందంటూ అప్పట్లో స్వామి కొన్ని పత్రాలను విడుదల చేశారు. దాంతో 1988లో హెగ్డే తన ముఖ్యమంత్రి పదవికి రాజినామా చేయాల్సి వచ్చింది. ఇక తమిళనాట సింహస్వప్నమైన జయలలిత అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి పదవిని పోగొట్టుకోవడమే కాకుండా, నాలుగేళ్లపాటు జైళ్లో మగ్గడానికీ స్వామి వేసిన కేసులే కారణం. 2010లో 2G స్కాం వెలికిరావడానికి కూడా స్వామి పెట్టిన కేసులే కారణం. ఈ కేసులో అప్పటి టెలికాం ముఖ్యమంత్రి ఎ.రాజా, కరుణానిధి గారాల కూతురు కనిమొళిలను జైలుకి పంపేదాకా స్వామి నిద్రపోలేదు. 2G స్కాం పుణ్యమా అని కేంద్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం, తమిళనాట డీఎంకే ప్రభుత్వాలు తరువాత జరిగిన ఎన్నికలలో ఘోర పరాజయం పాలయ్యాయి.   మిగతా నేతలతో స్వామి వైరం ఒక ఎత్తైతే, ఆయన నెహ్రూ కుటుంబాన్ని వెంటాడే తీరు మరో ఎత్తు! ఒక పక్క సోనియా గాంధి ఇటలీ పౌరసత్వం, రాహుల్‌ గాంధి బ్రిటిష్‌ పౌరసత్వం వంటి విషయాల మీద వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటారు. మరో పక్క నేషనల్‌ హెరాల్డ్‌ వంటి కుంభకోణాలను వెలికితీసి, సోనియాను కోర్టు బోనులో నిలబెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. చట్టపరంగా సోనీయా, రాహుల్‌ల మీద ఆయన దూకుడు ఒక తీరైతే... వారి మీద వ్యక్తిగతంగా తీవ్రమైన విమర్శలు చేయడం మరో తీరు. సోనియా గాంధి పుట్టుక దగ్గర్నుంచీ రాహుల్‌ గాంధి వివాహేతర సంబంధాల వరకూ ఆయన చేయని ఆరోపణ అంటూ లేదు. ఒకోసారి, తిరిగి చెప్పుకోవడానికి కూడా వీల్లేని స్థాయిలో ఆయన ఆరోపణలు ఉంటాయి. అలాంటి ఆరోపణలన్నింటినీ కలిపి ఏకంగా ‘Do you know your Sonia’ పేరిట ఏకంగా ఓ పత్రాన్నే రూపొందించారు. అసలు సోనియా భారత ప్రధాని కాకుండా అడ్డుకున్నది తానేనని కూడా స్వామి చెబుతారు. ఆఖరి నిమిషంలో ఆమె పౌరసత్వం గురించిన వివాదాన్ని అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం దగ్గర ప్రస్తావించాననీ, దాంతో ఆమె కన్నీళ్ల పర్యంతమై ఆ పదవిని వదులుకోవలసి వచ్చిందని అంటారు.   స్వామి రాజకీయాలు, కేసులే కాదు... ఆయనలోని హిందుత్వం గురించి కూడా చెప్పుకోక తప్పదు. తొలి నుంచి జనసంఘ నేతగా ఉన్న స్వామి అణువణువుగా హిందుత్వవాదాన్ని జీర్ణించుకున్న మనిషి. అందుకే ఇస్లాం మతం మీదా, ఇస్లాం తీవ్రవాదం మీదా ఆయన తరచూ విరుచుకుపడుతూ ఉంటారు. భారతదేశంలో ఉన్న ముస్లింలందరూ ఒకప్పుడు హిందువులే అనీ... ఆ విషయాన్ని వారు అంగీకరించాలని అంటారు. అయోధ్యలో వివాదాస్పద మసీదు స్థానంలో రామమందిరాన్ని నిర్మించాలంటూ సుప్రీం కోర్టులో ఆయన వేసిన కేసు ఇంకా నడుస్తోంది.   అలాగని స్వామి అన్ని విషయాల్లో కరుడుగట్టినట్లు ఉంటారని అనుకోవడానికి లేదు. తమిళ నాట ఎల్‌.టీ.టీ.ఈకి వ్యతిరేకంగా మాట్లాడే అతి కొద్ది మందిలో స్వామి ఒకరు. అలాగే తమిళ రాజకీయాలకు మూలమనదగిన ‘ఆర్య ద్రావిడ’ సిద్ధాంతాన్ని కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు. అయితే తరచూ ఏదో ఒక సంచలన ప్రకటన చేయడం, ఎంత మాట పడితే అంతమాటను అనేయడంతో స్వామి తన విలువను తానే తగ్గించుకుంటూ ఉంటారు. అంతగా పరిశోధన చేసే మనిషి ఏమాత్రం తరచి చూసుకోకుండా చిత్రమైన మాటలను మాట్లాడటంతో ఆయన చిత్తశుద్ధి మీద అనుమానం కలుగక మానదు.   ఏది ఏమైనా దేశ రాజకీయాలను ఆసక్తికరమైన మలుపులు తిప్పడంలోనూ, తప్పు చేసిన వారిని మూడు చెరువులు నీరు తాగించడంలోనూ స్వామికి సాటెవ్వరూ లేరు. అందుకే మోదీ, అమిత్‌ షా ఇద్దరూ మరో వ్యక్తిని సంప్రదించకుండానే ఆయనను రాజ్యసభకు నామినేట్‌ చేశారని చెబుతారు. ఉత్తరాఖండ్‌, జేఎన్‌యూ వంటి సమస్యలలో ఇరకాటంలో ఉన్న ప్రభుత్వానికి స్వామి ఆసరా ఎంతైనా అవసరం! ఆశించినట్లుగానే స్వామి ప్రస్తుతం రాజ్యసభలో అగస్టా కేసును తిరగతోడుతూ కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే రీతిలో స్వామి అధికార పార్టీ చేసే పొరపాట్లను కూడా వేలెత్తి చూపితే బాగుండు!

మన స్కాముల్లో మరో కలికితురాయి... అగస్టా!

  ఏ దేశమైనా నూటికి నూరు శాతం అవినీతి రహితంగా ఉంటుందని ఆశించలేం. ఎంత కట్టుదిట్టమైన చట్టాలు ఉన్నా ఏదో ఒక మూల, ఎవరో ఒక అవినీతిపరుడు చేయి చాచి నిల్చొని ఉంటాడని మనకి తెలుసు. కానీ సాక్షాత్తూ దేశాన్ని కాపాడవలసి రక్షణశాఖ అధికారులే అవినీతిలో కూరుకుపోతే! లోకమంతా ఆ అవినీతి గురించి దుమ్మెత్తిపోస్తున్నా, మనం మాత్రం నిర్లిప్తంగా ఉండిపోతే!... అంతకంటే దౌర్భాగ్యం మరోటి ఉండదేమో. ఆ దౌర్భాగ్యానికి మరోపేరే అగస్టా కుంభకోణం.   ఇదీ నేపథ్యం! 2000 సంవత్సరం నాటికి మారుతున్న అవసరాల దృష్ట్యా, మన వైమానిక దళానికి కొత్తతరకం హెలికాప్టర్లు అవసరమయ్యాయి. దేశంలోని ప్రముఖుల పర్యటనలకే కాకుండా, సియాచిన్‌ వంటి ఎత్తైన ప్రాంతాల్లో బాధ్యతలు నిర్వహించేందుకు.... మరింత సమర్థవంతమైన హెలికాప్టర్లు కావల్సి వచ్చాయి. ఇందుకోసం 18,000 అడుగుల ఎత్తులో కూడా ఎగిరే హెలికాప్టర్ల కోసం వైమానిక దళం వెతుకులాట ప్రారంభించింది. 2004లో ఎస్.పీ.త్యాగి వైమానికదళ ముఖ్యునిగా పదవిని చేపట్టడంతో ఈ వెతుకులాట మరో మలుపు తిరిగింది. ఇటలీకి చెందిన అగస్టా సంస్థ రూపొందించిన హెలికాప్టర్లకు అనుగుణంగా త్యాగి నిబంధనలలో తగిన మార్పులు చేయడం మొదలుపెట్టారు. ఉదా॥ అగస్టా హెలికాప్టరు కేవలం 15,000 అడుగుల ఎత్తుకి మాత్రమే చేరుకోగలదు. కాబట్టి దీనికి అనుగుణంగా వైమానిక నిబంధనలను 18,000 అడుగుల నుంచి 15,000 అడుగులకి మార్చిపారేశారు త్యాగి. అలాగే వైమానిక దళం హెలికాప్టర్లలో ఎలాంటి సౌకర్యాలని ఆశిస్తోందో ఎప్పటికప్పుడు ఆగస్టాకు త్యాగి చేరవేశారనే ఆరోపణలూ ఉన్నాయి. త్యాగి చేసిన సాయానికి అగస్టా నుంచి ఆయనకు కనీసం 75 కోట్లు ముట్టి ఉంటాయని సాక్షాత్తూ ఇటలీ న్యాయస్థానమే స్పష్టం చేసింది.   అందరి చేతులూ తడిపారు ఆగస్టా వెస్టల్యాండ్‌ సంస్థ రూపొందించిన AW-101 అనే హెలికాప్టర్లను మన దేశానికి అంటగట్టేందుకు ఇక దళారులు రంగంలోకి దిగారు. వీరు మొదటి త్యాగిని వశపరుచుకున్నట్లు ఎలాగూ ఆరోపణలు ఉన్నాయి. ఆ తరువాత దేశంలో కీలక నిర్ణయాలను తీసుకునే అధినేతలని కూడా వారు చేరుకున్నట్లు సమాచారం. నకిలీ సంస్థలు, నకిలీ ఒప్పందాలు... ఇలా రకరకాల మార్గాల ద్వారా అగస్టా నుంచి భారతీయ నాయకులకు 300 కోట్లకు పైగా లంచాలు అందాయన్నది కుంభకోణంలోని ప్రధాన ఆరోపణ. ఒకానొక దశలో అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.ఆర్‌ అల్లుడైన బ్రదర్‌ అనిల్‌ కుమార్ పేరు కూడా ఈ కుంభకోణంతో పాటు వినిపించింది. బహుశా అగస్టా హెలికాప్టర్లకు సంబంధించిన వేలకోట్ల ఒప్పందం పూర్తయిపోయి ఉంటే ఈ సమాచారం అంతా సద్దుమణిగిపోయేదేమో! కానీ అన్ని దేశాలూ మనలా నిర్లిప్తంగా ఉండవు కదా! 2013లో అగస్టాల్యాండ్‌ ముఖ్యాధికారితో పాటు మరో దళారికి ఇటలీ ప్రభుత్వం అరెస్టు చేసింది. హెలికాప్టర్ల ఒప్పందం కోసం భారతీయ నేతలకు, అధికారులకు ఇబ్బడిముబ్బడిగా లంచాలు అందించారన్నది వీరి మీద మోపబడిన అభియోగం. కేవలం అభియోగం మోపడమే కాదు. వారిద్దరికీ కారాగార శిక్షను కూడా విధించి పారేసింది.   మరి మన దగ్గరో! లంచం ఇచ్చినందుకే ఇటలీ కోర్టులు ఇంత దూకుడుగా వ్యవహరిస్తే మనం ఇంకెంత దూకుడుగా ఉండాలి. కానీ రక్షణ విషయంలో కూడా కక్కుర్తి పడి లంచం తీసుకున్న మన నేతల మీద ఈగ వాలే ప్రమాదం కూడా లేకుండా పోయింది. అగస్టా ల్యాండ్ కుంభకోణం బయటపడిన వెంటనే ఆ సంస్థతో ఒప్పందాలన్నీ రద్దు చేసేశాం అని అప్పడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ చెబుతోంది. కానీ ఆపాటికే 300 కోట్లకి పైగా సొమ్ములు చేతులు మారాయన్నది విస్పష్టం. పైగా దళారుల మాటలు, ఉత్తరాల ప్రకారం అప్పటి రక్షణ శాఖకు చెందిన అధికారులే కాదు... మంత్రులు, కార్యదర్శులు, సలహాదారులు... ఇలా అధికారంలో ఉన్న అంచెలన్నింటికీ లంచాలు ముట్టినట్లు తెలుస్తోంది. పైగా ఒకానొక ఉత్తరంలో సోనియా పేరు కూడా రావడం గమనార్హం! కానీ ఎప్పటిలాగే ఈ కేసులో విచారణ నత్తనడక నడుస్తోంది. కనీసం ప్రాథమిక అభియోగాలను సైతం స్పష్టంగా నమోదు చేయలేని నిస్సహాయత నెలకొని ఉంది.   అధికారపక్ష వ్యూహం! అగస్టా విషయంలో అధికార పక్షం తీరు కూడా ఆశ్చర్యంగా ఉంది. అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తున్నా నిమ్మళంగా ఉన్న బీజేపీ అకస్మాత్తుగా ఇప్పుడు అగస్టా కుంభకోణాన్ని తలకెత్తుకుంది. జేఎన్‌యూ విశ్వవిద్యాలయం, ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన, కరువు... వంటి సమస్యల సుడిగుండంలో ఉన్న బీజేపీకి అగస్టా కుంభకోణం ఓ సంజీవనిలా దొరికింది. సుబ్రమణ్య స్వామిని రాజ్యసభకు ఎన్నుకోవడం వెనుక కూడా అగస్టా వంటి కుంభకోణాలను తిరగతోడటమే లక్ష్యంగా కనిపిస్తోంది. ఇలాంటి విషయాలలో నిప్పుని నిర్భయంగా రాజేసే సుబ్రమణ్య స్వామి సహజంగానే నిన్న రాజ్యసభలో అగస్టా కుంభకోణాన్ని, అందుకు జోడింపుగా సోనియా పేరునీ ప్రస్తావించారు. దాంతో ఒక్కసారిగా కాంగ్రెస్‌ కుంపటిలా మారిపోయింది.   అసలు పని! అగస్టా విషయంలో తన పేరుని ప్రస్తావించడం మీద సోనియా తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రభుత్వం ఈ ఆరోపణలను నిరూపించాలంటూ సవాలు చేశారు. నిజంగా ప్రభుత్వం చేయాల్సిన పని కూడా ఇదే! లంచాలు ఇచ్చినందుకే ఇటలీలో కొందరు జైళ్లో కూర్చుంటే, ఆ లంచాలు ఎవరెవరికీ ఏ స్థాయిలో చేరాయో నిగ్గు తేల్చడం ప్రభుత్వ బాధ్యత. అలా కాకుండా ఎన్నికలప్పుడో, ప్రతివిమర్శలు చేయడానికో ఈ ఆరోపణలు వినియోగించుకోవాలనుకుంటే అంతకంటే దురదృష్టం మరోటి ఉండదు. ఇలాంటి కుంభకోణాల విషయంలో చూసీచూడనట్లు ఊరుకుంటే సాధారణ ప్రజల నమ్మకం ఎలాగూ సన్నగిల్లుతుంది... కానీ సాక్షాత్తూ రక్షణశాఖలోనే ఇలాంటి కుంభకోణాలు బయటపడుతుండే మన సైనికుల నైతిక స్థైర్యం ఏమైపోవాలి. దేశం లోపల మనం తిట్టుకున్నా కొట్టుకున్నా, మన స్వేచ్ఛ కోసం తమ ప్రాణాలను బలిపెట్టే వారి ధైర్యం ఏమైపోవాలి. అలనాటి బోఫోర్సులాగా ఇది కూడా నిదానంగా సద్దుమణిగిపోతుందిలే అని నిర్లిప్తంగా ఊరుకుండిపోవాలేమో!

రాజ్యసభలో కనిపించని పెద్దలు

  పార్లమెంటు వ్యవస్థలో రాజ్యసభకు ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. వివిధ రాష్ట్రాల శాసనసభ్యుల అభిమతాలను, దేశంలోని మేధావుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునే అవకాశం రాజ్యసభ వల్లే దక్కుతుంది. బహుశా అందుకేనేమో ఈ సభకు పెద్దల సభ అన్న పేరు కూడా వచ్చింది. కానీ ఈ పెద్దల సభను కొన్ని పార్టీలు, ఆ పార్టీల ద్వారా ఎన్నుకోబడిన కొందరు నేతలు దుర్వినియోగం చేసే తీరు చూస్తే బాధ కలుగక మానదు. వారి ప్రవర్తన కేవలం రాజ్యసభకే కాదు, ప్రజాస్వామ్యానికే అవమానంగా తోస్తుంది.   అధికారాల విషయంలో రాజ్యసభ లోక్‌సభకు ఏమాత్రం తీసిపోదు. ద్రవ్య బిల్లు మీద తప్ప మిగతా బిల్లుల మీద రాజ్యసభ తన అభ్యంతరాలను స్పష్టంగా తెలియచేసి, వాటిని తిరస్కరించవచ్చు. కీలక సమస్యల మీద చర్చలు జరపి, ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయవచ్చు. ఇక సదుపాయాల విషయంలోనూ రాజ్యసభ సభ్యులకు ఏమాత్రం లోటు లేదు. ఒకో రాజ్యసభ సభ్యుని మీదా ప్రభుత్వం నెలకు 2.7 లక్షలకు పైగానే ఖర్చు చేస్తుందని ఓ అంచనా! దీన్ని మరింత పెంచాలన్న ప్రతిపాదనలు ప్రస్తుతం ఆర్థిక శాఖ వద్ద ఉన్నాయి. కానీ నిన్న రాజ్యసభలో రేగిన ఓ వివాదం సభ మీద ఉన్నా ఆరోపణలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. ఇంతకీ నిన్న ఏం జరిగిందంటే...   రాజ్యసభ ఉపసభాపతి పీ.జే.కురియన్‌ మిథున్ చక్రవర్తికి సంబంధించిన ఒక ఉత్తరాన్ని చదివి వినిపించారు. తనకు ఆరోగ్యం బాగోలేని కారణంగా సభ ప్రస్తుత సమావేశాలకు హాజరు కాలేకపోతున్నానన్నది ఆ ఉత్తరంలోని సారాంశం. కానీ మిథున్‌ ప్రతి సమావేశానికీ ఇలాంటి ఉత్తరాన్ని ఒకదాన్ని పంపి చేతులు దులిపేసుకోవడమే ఆశ్చర్యం. నిజానికి మిథున్‌ చక్రవర్తి శుభ్రంగానే ఉన్నారని ప్రపంచం మొత్తానికీ తెలుసు. అటు బెంగాలీ టీవీ కార్యక్రమాలలోనూ, ఇటు బాలీవుడ్‌ సినిమా షూటింగులలోనూ మిథున్‌ నిరభ్యంతరంగా పాల్గొంటున్నారు. కానీ పాపం రాజ్యసభకు రావాలంటే ఆయనకు అనారోగ్యం వస్తోంది. గత రెండు సంవత్సరాలలో మిథున్ కేవలం మూడంటే మూడు రోజులు రాజ్యసభకు వచ్చారంటే, సభ పట్ల ఆయన నిర్లక్ష్యం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.   మిథున్ తీరుకు సహజంగానే తోటి సభ్యులకు ఒళ్లుమండిపోయింది. ఏళ్లతరబడి ఎన్నో త్యాగాలు చేసి, ప్రజల కోసం పోరాడి, లాఠీ దెబ్బలు సైతం చవిచూసి... కొందరు ఈ స్థాయికి వస్తారనీ, అలాంటి పదవిని ఇలా కించపరచడం సబబు కాదని జనతాదళ్‌కు చెందిన త్యాగీ విరుచుకుపడ్డారు. వివిధ రాజకీయ పార్టీలు తమ తరఫున ఎవరినన్నా రాజ్యసభకు పంపేటప్పుడు, వాళ్లు ఆ పదవికి ఎంతవరకు న్యాయం చేయగలుగుతారో ఆలోచించుకోవాలంటూ చురకలంటించారు. అనారోగ్య కారణాలతో మాటిమాటికీ సభకు గైర్హాజరు కావడం, తన సదుపాయాలను దుర్వినియోగం చేయడమే అంటూ సమాజ్‌వాదీ పార్టీకి చెందిన అగర్వాల్ కూడా మండిపడ్డారు. మిథున్‌ని రాజ్యసభకు ఎన్నుకొన్న తృణమూల్‌ కూడా అతణ్ని గట్టిగా సమర్థించలేకపోయింది.   నిజానికి ఈ సమస్య కేవలం మిథున్ చక్రవర్తిది మాత్రమే కాదు. ఇలాంటి చక్రవర్తులెందరో రాజ్యాంగం అందించిన సుఖాలను అనుభవిస్తేనే, తమ మీద ఎన్నో ఆకాంక్షలు పెట్టుకున్న సాధారణ ప్రజలను వెక్కిరిస్తున్నారు. అందుకు తొలుత బాధ్యత వహించాల్సింది సదరు రాజకీయ పార్టీలు. ఒక నేతను రాజ్యసభకు పంపితే అతను ప్రజల పక్షాన గొంతు వినిపించగలుగుతాడా లేదా అన్న విషయాన్ని చాలా పార్టీలు గమనిస్తున్నట్లే కనిపించదు. పైగా అలాంటి ఆరోపణలు వచ్చినా కూడా చూసీచూడనట్లు మళ్లీ అదే మనిషిని రాజ్యసభకు పంపిన సందర్భాలు కోకొల్లలు. అసంతృప్తితో రగిలేవారు, పారిశ్రామికవేత్తలు, వృద్ధతరం నేతలు, పలుకుబడి ఉన్నావారు, ఎన్నికలలో గెలుపొందలేనివారు... ఇలా రాజ్యసభకు ఎన్నుకునేందుకు రకరకాల వ్యక్తులను వివిధ పార్టీలు పరిశీలిస్తుంటాయి.   ఇక రాష్ట్రపతి నేరుగా నామినేట్‌ చేసే సభ్యులది కూడా ఇదే పరిస్థితి. వివిధ రంగాలలో ప్రతిభావంతులైన 12 మందిని కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు రాష్ట్రపతి రాజ్యసభకు పంపుతారు. ఈ 12 మంది విషయంలో కూడా అధికారంలో ఉన్న పార్టీలు తమ రాజకీయాలను ప్రదర్శిస్తూ ఉంటాయి. కేవలం ప్రతిభావంతుడనే కాకుండా, తమకు అనుకూలంగా ఉన్నవారికే అవి ప్రాధాన్యతను ఇస్తూ ఉంటాయి. అదీ కాకుంటే ఏదో ఒక మతాన్నో, ఒక ప్రాంతాన్నో బుజ్జగించేందుకు ప్రయత్నిస్తూ ఉంటాయి. సభలో కూడా వారు తమకు అనుకూలంగా ప్రవర్తించాలని ఆశిస్తూ ఉంటాయి. అంతేకానీ వాళ్లు ప్రజల గొంతుకను బలంగా వినిపించగలరా, చర్చల్లో నిష్పక్షమైన వాదనను వినిపించగలరా అని ఆలోచించవు. అందుకనే అలా నామినేట్ అయిన సభ్యులు కూడా తరచూ విమర్శల పాలవుతూ ఉంటారు. రేఖ, సచిన్‌ టెండూల్కర్‌, లతా మంగేష్కర్‌ వంటి వ్యక్తులు సమాజానికి వన్నె తెచ్చారేమో కానీ... రాజ్యసభ పరువు మాత్రం తీశారన్నది కొందరి వాదన.   సభకు హాజరు కాకపోవడం; హాజరైనా ప్రశ్నలు వేయడం కానీ, చర్చల్లో నోరు మెదపడం కానీ చేయకపోవడం నిజంగా ఆ పదవికే అవమానకరం. అంత మాత్రాన రాజ్యసభ సభ్యులందరూ ఇలాగే ఉన్నారని ఆవేదన చెందనక్కర్లేదు. అరుణ్‌ జైట్లీ, వెంకయ్య నాయుడు, గులాం నబీ ఆజాద్‌, సీతారాం ఏచూరి వంటి ఉద్దండులెందరో ఇప్పటికీ రాజ్యసభకు వన్నె తెస్తూనే ఉన్నారు. అదే సమయంలో మిథున్ చక్రవర్తి మొదలు విజయ్‌ మాల్యా వరకు రాజ్యసభ పరువు తీసేందుకు వెనుకాడనివారూ ఉన్నారు. అందుకే మిథున్‌ చక్రవర్తి మీద నిన్న జరిగిన చర్చ సందర్భంగా... రాజ్యసభకు సభ్యులను ఎన్నుకొనేటప్పుడు, వివిధ పార్టీలు తమకంటూ ఓ ప్రవర్తనా నియమావళిని ఏర్పరుచుకోవాలని సభ్యులు సూచించారు. తాము సభకు ఎన్నుకొనే మనిషి సమర్థుడేనా? అతను సభకు తరచూ హాజరు కాగలడా? హజరై ప్రజల గొంతుని వినిపించగలడా?... వంటి అంశాలను సదరు నియమావళి ద్వారా పరిశీలించాలని ఆశించారు. మరి ఆ సూచన పార్టీల చెవికెక్కుతుందో లేదో వేచి చూడాల్సిందే!

వీసా కోసం... చైనా ముందు ఓడిన భారత్‌

  మౌలానా మసూద్‌ అజార్‌! ఈ మనిషి గురించి పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు. మన దేశం మీద నరనరానా విషాన్ని నింపుకుని దాన్ని వెళ్లగక్కేందుకు కాచుకు కూర్చున్న తీవ్రవాది. అతనికి సకల సౌకర్యాలూ కల్పించే పాకిస్తాన్‌ వ్యూహం గురించి వేరే తిట్టుకోవాల్సిన పని లేదు. కానీ అలాంటి తీవ్రవాదిని చైనా కూడా వెనకేసుకు రావడం... అదీ ఐక్యరాజ్య సమితిలాంటి చోట అతణ్ని సమర్థించేందుకు తన వీటో అధికారాన్ని ఉపయోగించడం, మనకి శరాఘాతం. ఈ దెబ్బతో చైనా మంత్ర, తంత్రాల వెనుక ఉన్న దురుద్దేశాలు మనకి స్పష్టంగా తెలిసిపోయాయి. ఇలాంటి సమయంలో చైనాను దెబ్బకి దెబ్బ తీసేందుకు మన దేశానికి ఒక మంచి రాజకీయ అస్త్రం దొరికింది. దాని పేరే డోల్కన్‌ ఈసా! కానీ చైనా ఒత్తిడి మేరకు ఆ అస్త్రాన్ని ఉపసంహరించుకుని నవ్వులపాలైపోయింది.   డోల్కన్‌ ఈసా! విగర్‌ అనే ఓ జాతికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుడు. డోల్కన్‌ గురించి చెప్పుకునే ముందు విగర్‌ జాతి గురించి చెప్పుకోవాలి. టర్కీ ప్రాంతానికి చెందిన ఈ ముస్లింలు ఒకప్పుడు చైనాకి వాయువ్య దిశలో ‘ఈస్ట్‌ తుర్కిస్తాన్‌’ పేరుతో హాయిగా ఉండేవారు. వారికి తమదైన భాష, సంస్కృతి, జీవనశైలి ఉండేవి. అలాంటి ఈస్ట్‌ తుర్కిస్తాన్‌ మీద 1876లో చైనాని పాలకులు దాడి చేశారు. ఎనిమిదేళ్లపాటు రక్తాన్ని ఏరులై పారించిన ఈ పోరాటం తరువాత చైనా ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. కొత్తగా ఆక్రమించుకున్న ప్రాంతానికి ‘షిన్‌జాంగ్‌’ అన్న పేరుని పెట్టింది చైనా. షిన్‌జాంగ్‌ అంటే కొత్త ప్రాంతం అని అర్థం. ఈ కొత్త ప్రాంతాన్ని నిదానంగా తనకు అనుకూలంగా మార్చుకోవడం మొదలుపెట్టింది చైనా. ఇక 1912లో చైనాలో కమ్యూనిస్టు విప్లవం జరిగిన తరువాత, విగర్ల పరిస్థితి దారుణంగా తయారైంది.   షిన్‌జాంగ్‌లో విగర్ల సంఖ్య ఇప్పటికీ చాలా గణనీయంగానే ఉంది. అధికారిక లెక్కల ప్రకారమే వీరి సంఖ్య కోటికి పైగా ఉంటుంది. ఇక అనధికారికంగా వీళ్ల జనాభా అక్కడ కోటిన్నరకు పైగానే ఉంటుందని అంచనా. ఇక్కడ నివసించే విగర్లు తమ సంస్కృతిని కాపాడుకునే అవకాశం ఇవ్వాలనీ, స్థానిక పాలనలో తమకి తగిని ప్రాధాన్యం ఉండాలని కోరుకుంటున్నారు. కానీ విగర్ల కోరిక వినిపించిన ప్రతిసారీ చైనా చాలా తీవ్రంగా విరుచుకుపడుతూ వస్తోంది. ప్రస్తుతానికైతే అక్కడ విగర్ల పరిస్థితి చాలా దయనీయం. ఒకప్పుడు తమ రాజ్యం అనుకున్న చోటే వాళ్లు అధికారిక బానిసలుగా బతుకుతున్నారు. షిన్‌జాంగ్‌ ప్రాంతంలో ఏవైనా ప్రభుత్వ ప్రాజెక్టులు కట్టాలంటే వాటికి విగర్లు ఉచితంగా శ్రమదానం చేయాల్సి ఉంటుంది. స్థానిక విద్యాలయలలో నుంచి వారి మాతృభాషను ఎప్పుడోనే నిషేధించి పారేశారు. ఇస్లాం సంప్రదాయాన్ని అనుసరించే విగర్లు దేముడికి కూడా తమ గోడు చెప్పుకునే అవకాశం లేదు. ఎందుకంటే ప్రభుత్వం వారి మసీదులని సైతం మూయించి పారేసింది. ఇదేమని అడిగిన వాడు మర్నాటికి కనిపించడు. అదృష్టం బాగుంటే జైళ్లలో తేల్తారు. అదీ లేదంటే ఉరికంబాన్ని ఎక్కేస్తారు. ఒకోసారి ఎప్పటికీ కనిపించకుండా పోతారు! ఒకవైపు విగర్లను అణగతొక్కుతూనే మరోవైపు నిదానంగా స్థానిక జనాభాలో వారి ప్రాబల్యం తగ్గేలా చర్యలు తీసుకుంది చైనా. అందుకే ఒకప్పుడు పదిశాతంలోపు ఉన్న హాన్‌ వర్గం సంఖ్య ఇప్పుడు 40 శాతానికి పైగా పెరిగిపోయింది. ఇలా విగర్ల బలాన్ని, బలగాన్ని, సంస్కృతిని నిర్దాక్షిణ్యంగా అణచివేస్తూ వచ్చింది చైనా!   ఇప్పుడు డోల్కన్‌ ఈసా విషయానికి వద్దాము. షిన్‌జాంగ్‌లోనే పుట్టి పెరిగిన డోల్కన్ 90వ దశకంలో తన వర్గం తరఫున గట్టిగా గొంతుకను వినిపించడం మొదలుపెట్టాడు. విగర్లందరినీ ఏకం చేసి వారి నిరసనల సెగను ప్రభుత్వానికి తగిలేలా కృష్టి చేశాడు. అందువల్ల సహజంగానే అతను చైనా ప్రభుత్వ కోపానికి గురైయ్యాడు. ప్రభుత్వాధికారులు డోల్కన్ వెంటపడటంతో, అతను యూరప్‌కు పారిపోయాడు. యూరప్‌లో శరణార్థిగా తిరుగుతున్న డోల్కన్‌కి జర్మనీ దేశం 2006లో పౌరసత్వాన్ని అందించింది. ప్రస్తుతం డోల్కన్‌ జర్మనీ నుంచే విగర్ల సంక్షేమానికి కృషి చేస్తున్నాడు. ‘వరల్డ్‌ విగర్‌ కాంగ్రెస్‌’కు కార్యదర్శిగా బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. డోల్కన్‌వంటి వారే లేకపోతే అసలు విగర్లు అనే జాతివారు ఉన్నారన్న విషయాన్ని ప్రపంచం మర్చిపోయే అవకాశం ఉంది. చైనా కర్కశ రక్కసి నిబంధనల కింద వారి జాతి అంతరించిపోయే ప్రమాదం ఉంది.   ప్రస్తుతానికి డోల్కన్‌ ఈసా గురించీ, విగర్ల గురించీ చెప్పుకోవాల్సిన సందర్భం ఒకటి వచ్చింది. డోల్కన్‌ తమ దేశం నుంచి పారిపోయిన తరువాత చైనా అతని మీద తీవ్రవాదిగా ముద్ర వేసింది. ప్రపంచవ్యాప్తంగా రెడ్‌కార్నర్‌ నోటీసుని జారీ చేసింది. కానీ ఆ నోటీసుని తోసిరాజని ఇండియా డోల్కన్‌కు గతవారం వీసాను మంజూరు చేసింది. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు డోల్కన్‌ ఈ వీసాను ఉపయోగించుకోనున్నాడు. ఈ చర్య సమజంగానే చైనా ఆగ్రహానికి కారణమైంది. కానీ మసూద్‌ అజార్‌ను చైనా వెనకేసుకు వచ్చినందుకు, ఇండియా మంచి గుణపాఠం చెప్పిందంటూ భారతీయులు సంతోషించారు. నెత్తిన మొట్టికాయ వేసినా కూడా అతి సాత్వికంగా స్పందించే ఇండియా, కాలాన్ని బట్టి లౌక్యాన్ని నేర్చుకుంటోందని మురిసిపోయారు. కానీ ఇంతలో మన దేశం తీసుకున్న ఓ నిర్ణయం పౌరులని నిశ్చేష్టుల్ని చేసింది. డోల్కన్‌ వీసాను వారం తిరక్కుండానే రద్దు చేసి పారేసింది ప్రభుత్వం. ఇండియా ఇలా ప్రవర్తిస్తుందని తాను ఊహించనే లేదంటూ డోల్కన్‌ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఇటు తమకు భయపడి ఇండియా వీసాను రద్దు చేసిందనుకుంటూ చైనా నవ్వుకుంది. దేశ ప్రజల దృష్టిలో కూడా మన విదేశాంగ శాఖ వెన్ను లేనిదిగా మిగిలిపోయింది.   మసూద్‌ అజార్‌ను మీరెందుకు వెనకేసుకు వచ్చారని అడిగితే, చైనా నుంచి ఒక్క జవాబుని కూడా రాబట్టలేని మన ప్రభుత్వం.... చైనా ఆగ్రహానికి భయపడి ఇలాంటి చర్య తీసుకోవడం దురదృష్టకరం. ఇంతగా వణికిపోయే విదేశాంగం మొదట్లోనే ఆచితూచి స్పందిస్తే సరిపోయేది. కానీ తన చర్యను తనే వెనక్కి తీసుకుని ఇప్పుడు అందరి ముందూ నవ్వులపాలైపోయింది. అయినా ఇలాంటి తప్పటడుగులు మనకేమీ కొత్త కాదు. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర్నుంచీ ఇలాంటి పొరపాట్లు చాలానే చేస్తూ వచ్చాము. అందుకు ప్రతిఫలంగా చావుదెబ్బలు తింటూనే వచ్చాము. కశ్మీర్‌ మీద మనం వేసిన కుప్పిగంతుల కారణంగానే ఇప్పటికీ అక్కడ కుంపట్లు రగులుతూనే ఉన్నాయి. కాకపోతే గత ప్రభుత్వాలకంటే భిన్నంగా ప్రవర్తిస్తామంటూ బోర విరుచునే ప్రస్తుత నేతలు ఇలాంటి చేతలకు పాల్పడటం చాలా చిత్రంగా ఉంది. ఏది ఏమైనా ఈ దౌత్య యుద్ధంలో చైనానే గెలిచింది! భారత్‌ బిక్కమొగం వేసుకుని ఉండిపోయింది.  

న్యాయదేవత కంట కన్నీరు

ఆయన సాక్షాత్తూ దేశ న్యాయవ్యవస్థను నడిపించే నాయకుడు..దేశ ప్రథమ న్యాయాధికారి.. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి అలాంటి వ్యక్తి కంటతడి పెట్టాడు. మంచుపర్వతంలా మీద పడుతున్న కేసుల భారాన్ని మోయలేక, అన్నింటికి న్యాయవ్యవస్థదే తప్పు అంటుంటే తట్టుకోలేక దేశప్రధాని సహా అన్ని రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్యమంత్రుల సంయుక్త సమావేశంలో తన సహచర న్యాయమూర్తుల సమక్షంలో దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ కంటతడిపెట్టారు.  ఢిల్లీలో పెండింగ్ కేసులు సత్వర పరిష్కారంపై చర్చించేందుకు అన్ని రాష్ట్రాల సీఎంలు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సమావేశం జరిగింది. దీనికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం సీజేఐ ప్రసంగించారు..భారత న్యాయవ్యవస్థపై పడుతున్న పెనుభారం, జడ్జిల నియామకాల్లో జాప్యం, కనీస మౌళిక వసతులు తదితర అంశాలపై మాట్లాడుతుండగా ఆయన గొంతు మూగబోయింది. ఉబికి వస్తున్న కన్నీళ్లను అదిమిపెట్టుకుంటూ..గొంతు పెగలక కొద్దిసేపు సీజే మౌనం వహించారు. ప్రపంచంలో ఏ న్యాయవ్యవస్థతో పోల్చినా భారత న్యాయమూర్తుల పనితీరు గర్వపడేలా ఉంటుందని అయినా న్యాయవ్యవస్థపైనే విమర్శలు వస్తుంటాయంటూ ఆయన భావోద్వేగాన్ని ఆపుకోలేక ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా మూడుసార్లు కన్నీటిని చేతి రుమాలుతో తుడుచుకున్నారు.    మున్సిఫ్ కోర్టు జడ్జీ నుంచి సుప్రీంకోర్టు జడ్జి వరకు ఏటా సగటున 2,600 కేసులను పరిష్కరిస్తున్నారు. అదే అమెరికాలో జడ్జీలు ఏటా సగటున పరిష్కరిస్తున్నది 81 కేసులే. మేమూ మనుషులమే మా సామర్థ్యానికి పరిమితి ఉంది. దేశంలోని 24 హైకోర్టుల్లో 1044 మంది జడ్జీలు ఉండాలి కానీ 600 మంది మాత్రమే ఉన్నారు అంటే 43 శాతం పోస్టులు ఖాళీ. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు, కర్ణాటక, బొంబాయి, గౌహతి, పాట్నా, పంజాబ్, హరియాణా, రాజస్థాన్ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులు లేరు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తులే కొనసాగుతున్నారు. 1987లో ప్రతి 10 లక్షల మంది జనాభాకు 10 మందిగా ఉన్న జడ్జీల సంఖ్యను 50కి పెంచాలని లా కమిషన్ సిఫార్సు చేసింది. 2002లో సుప్రీంకోర్టు, అనంతరం ప్రణబ్ ముఖర్జీ సారథ్యంలోని పార్లమెంటరీ కమిటీ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది కాని నాటి ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు. ఫలితంగా నేటికీ దేశంలో ప్రతి 10 లక్షల మంది ప్రజలకు 15 మంది జడ్జీలే ఉన్నారని సీజే వాపోయారు.   జడ్జీల నియామకాలకు సంబంధించి కొలిజీయం వ్యవస్థపై సుప్రీంకోర్టు, హైకోర్టుల మధ్య ఆదిపత్య పోరు నడుస్తోంది. ఈ క్రమంలో గత ఏడాది ఏప్రిల్ 13 నుంచి అక్టోబర్ 16 మధ్య సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో జడ్జీల నియామకాలు పూర్తిగా ఆగిపోయాయి. దేశంలోని అన్ని హైకోర్టుల్లో కలిపి 38.68 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కిందిస్థాయి కోర్టుల్లో 3 కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉండగా వీటికి అదనంగా ఐదు కోట్ల కేసులు కొత్తగా దాఖలవుతున్నాయి. దేశంలో జైళ్లు నిండిపోతున్నాయి ప్రస్తుతం ఖైదీలతో జైళ్లు పొంగిపోర్లుతున్నాయి. జైళ్లలో ఉన్న వారిలో మూడింట రెండొంతులు విచారణ ఖైదీలే వారికి ఎంత శిక్ష పడుతుందో అంతకంటే ఎక్కువగా విచారణ ఖైదీగానే శిక్ష అనుభవించడం న్యాయవ్యవస్థ సిగ్గుపడాల్సిన అంశం. దేశంలో ఇప్పటికీ 30 శాతం మంది పేదలు న్యాయస్థానాలను ఆశ్రయించటం ఒక కలగానే ఉంది కాబట్టి న్యాయమూర్తుల నియామకాలు పెంచాలి. అవసరమైతే రిటైర్డు న్యాయమూర్తులతో ఉదయం రాత్రిపూట న్యాయస్థానాలు తెరవాలి.    ఎఫ్‌డీఐ, మేక్‌ ఇన్ ఇండియా అని చెప్తుంటారు..దాంతో పాటు ఇండియాకు ఇంకా న్యాయమూర్తులు కూడా చాలా అవసరం అంటూ గద్గద స్వరంతో ప్రధానిని ఉద్దేశిస్తూ సీజేఐ అన్నారు. దాంతో పాటు ప్రధాని మోడీ చర్యలను కూడా సున్నితంగా విమర్శించారు. వాణిజ్య కోర్టుల ఏర్పాటు కొత్త సీసాలో పాత సారాలా ఉందన్నారు. వాణిజ్య కోర్టులకు ప్రత్యేక భవనాలు నిర్మించకుండా, న్యాయమూర్తులను నియమించకుండా ఇప్పుడు ఉన్న కోర్టులకే బోర్డులు మార్చి ఉన్న జడ్జీలనే అటు మళ్లించారని చురకలంటించారు. కార్పోరేట్ వ్యక్తి కూడా జేబు దొంగతో భుజం భుజం రాసుకుని కోర్టు ముందు హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దీని ఉద్దేశ్యం ఇది కాదని కార్పోరేట్లకు తగిన స్థాయి మౌలిక వసతులు, వాతావరణం కోర్టుల్లో ఉండాలన్నారు లేకుంటే భారత ఆర్థిక ప్రగతి కూడా కుంటుపడుతుందన్నారు. ప్రధాని మోడీ న్యాయవాది కాదని ఆయనకు న్యాయవ్యవస్థ గురించి పూర్తిగా తెలియకపోవచ్చు.    సీజేఐ ఠాకూర్ అవేదనపై ప్రధాని నరేంద్ర మోడీ తక్షణం స్పందించారు. 1987 నుంచి ఎంతోకాలం గడచిపోయినందున ఈ విషయంలో సీజేఐ బాధను అర్థం చేసుకోగలను. రాజ్యాంగపరమైన అడ్డంకులు తలెత్తకుంటే మంత్రులు, సీనియర్ జడ్జీలు అంతర్గతంగా సమావేశమై ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవచ్చు అంటూ ప్రధాని ప్రతిపాదించారు. మరి ప్రధాన న్యాయమూర్తి కన్నీరైనా న్యాయవ్యవస్థను ప్రక్షాళన దిశగా నడిపిస్తుందేమో వేచి చూడాలి.   

IPL Vs కోర్టులు

  భారతదేశంలో క్రికెట్‌ బంతిని బీసీసీఐ శాసిస్తుందన్న విషయం రహస్యమేమీ కాదు. ప్రపంచంలోనే అతి ఖరీదైన క్రికెట్‌ సమాఖ్యగా పేరొందిన బీసీసీఐ ఆటలకు ఎదురులేకుండా పోతోందన్న విమర్శలు తరచూ వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అలాంటి బీసీసీఐని భారతీయ కోర్టులు బంతిలా ఆడుకోవడమే ఇప్పటి వార్త. ఈ విషయాన్ని బీసీసీఐ జీర్ణించుకోలేకపోవడం సహజమే!   ఐపీఎల్‌ చరిత్ర మొదటి నుంచీ వివాదాస్పదంగానే సాగింది. ప్రపంచవ్యాప్తంగా టి-20 క్రికెట్‌కు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని ‘జీ ఎంటర్‌టైన్‌మెంట్‌’ సంస్థ 2007లో ICL అనే టోర్నమెంటుని ఆరంభించింది. దేశంలో జరిగే ముఖ్యమైన క్రికెట్‌ ఘట్టాలన్నీ తన కనుసన్నలలో జరగాలని ఆశించే బీసీసీఐ, ICL మీద నానారకాల నిబంధనలూ విధించి అది మూతపడేలా చేసింది. ఆ తరువాత తానే 2008లో IPL పేరిట ఒక టి-20 టోర్నమెంటుని ప్రారంభించింది. అసలు ఐపీఎల్‌ కోసం ఆటగాళ్లను వేలం వేసే విధానమే తీవ్రమైన విమర్శలకు దారి తీసింది. దానికి తోడు ఐపీఎల్‌ ఆటగాళ్లను గెలుపుగుర్రాలుగా వాడుకుంటూ, వారితో విపరీతంగా ఆడించడం మొదలుపెట్టింది బీసీసీఐ. దాంతో అసలైన అంతర్జాతీయ ఆటలు ఆడే సమయానికి వారు తీవ్రంగా అలసిపోవడమో, గాయాల పాలవడమో జరిగేది. ఐపీఎల్‌ ఫార్మాటుకి అలవాటుపడిన ఆటగాళ్లు వన్‌డే, టెస్ట్‌ మ్యాచ్‌ తదితర ఫార్మాట్లకు పనికిరాకుండా పోతున్నారన్నది అతి పెద్ద విమర్శ. వీటికి తోడు ఫ్రాంచైజీలకు సంబంధించిన గొడవలు, క్రికెట్‌ బెట్టింగ్‌ కుంభకోణాలు ఎలాగూ ఐపీఎల్‌ను వెన్నంటే ఉన్నాయి.   తనకున్న అధికార, ధనబలంతో ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగలనని ధీమాగా ఉండే బీసీసీఐకి ఈసారి కోర్టులు చుక్కలు చూపిస్తున్నాయి. గత నెల ఐపీఎల్‌ మ్యాచ్‌ల కోసం బీసీసీఐ లక్షలాది లీటర్ల నీటిని వృథా చేస్తోందంటూ బొంబాయి హైకోర్టులో ఓ ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఈ కేసుని విచారిస్తూ బొంబాయి హైకోర్టు, బీసీసీఐని దులిపి పారేసింది. ఓ పక్క మహారాష్ట్ర కనీవినీ ఎరుగని కరువుతో అల్లాడిపోతుంటే మీరు మ్యాచ్‌లను ఎలా నిర్వహిస్తారంటూ ప్రశ్నించింది. ఈ సందర్భంగా హైకోర్టు బీసీసీఐ మీద తీవ్రమైన విమర్శలు చేసింది. ఇలా నీటిని వృథా చేయడం తీవ్రమైన నేరమనీ, బీసీసీఐకి నీటి సరఫరాని నిలిపివేస్తే కానీ నీటి విలువ వారికి తెలిసిరాదంటూ దుయ్యబట్టింది. ‘మీకు ప్రజల కంటే క్రికెట్‌ మ్యాచ్‌లే ఎక్కువైపోయాయా’ అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చురకలంటించింది. మే 1 తరువాత మహారాష్ట్రలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు నిర్వహించడానికి వీల్లేదంటూ తీర్పునిచ్చింది.   బొంబాయి హైకోర్టు దుయ్యపట్టి వదిలిపెట్టినా, బీసీసీఐ తగిన జాగ్రత్తలు తీసుకుందా అంటే అదీ లేదు! కరువు విషయంలో మహారాష్ట్రకంటే దారుణమైన స్థితిలో ఉన్న రాజస్థాన్‌కు సదరు మ్యాచ్‌లను తరలించింది. దీంతో ఒళ్లుమండిన రాజస్థాన్ వాసులు కూడా నీటి వృథాకు సంబంధించి హైకోర్టులో ఓ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ కేసుని స్వీకరిస్తూ రాజస్థాన్‌ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు చూస్తే అక్కడ కూడా బీసీసీఐ పప్పులు ఉడికేట్లు కనిపించడం లేదు. తమకు ఎదురులేదని బోరవిరుచుకు తిరిగే బీసీసీఐకి, కోర్టు తీర్పులు సయించడం లేదు. అందుకే బీసీసీఐ కార్యదర్శి అనురాగ్‌ ఠాకూర్‌ నిన్న చాలా తీవ్రమైన వ్యాఖ్యలతో న్యాయవ్యవస్థ మీద విరుచుకుపడ్డారు. ప్రజాహితవ్యాజ్యాలకు బీసీసీఐ లక్ష్యంగా మారిపోయిందనీ, వీటివల్ల బోర్డుకి అపారమైన నష్టం చేకూరుతోందని అన్నారు. మ్యాచ్‌లను మాటిమాటికీ తరలించడం వల్ల ఆటగాల్ల దగ్గర నుంచి, ప్రసార సాధనాల వరకు అన్నింటినీ రవాణా చేసేందుకు అయ్యే ఖర్చు తడిసి మోపెడవుతోందని ఆగ్రహించారు. అందుకే ఇక నుంచి విదేశాలలో ఐపీఎల్‌ను నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తామని పెర్కొన్నారు. పనిలో పనిగా అనురాగ్‌ ఠాకూర్‌ ఈ నష్టాలు మాజీ ఆటగాళ్లకు అందించే పెన్షన్ల మీద ప్రభావం చూపుతాయని కూడా అన్నారు.   అనురాగ్‌ ఠాకూర్‌ మాటలలో ఆవేదన కంటే బెదిరింపే ఎక్కువగా కనిపిస్తోంది. సాధారణంగా బీసీసీఐ ప్రవర్తన ఇలాగే ఉంటుంది! నిజంగా బీసీసీఐ కోపంలో న్యాయం ఉందా? మహారాష్ట్రలో కరువుకి అనేక కారణాలు ఉన్నాయి. విచక్షణా రహితంగా చెరకుని పండించడం, ఎడాపెడా బోర్లను తవ్వేయడం, వర్షపు నీటిని ఒడిసిపట్టుకునే ప్రయత్నం చేయకపోవడం... వంటి మానవ తప్పిదాలకు తోడు మూడేళ్లుగా విఫలమవుతున్నా వర్షపాతం కూడా అక్కడి కరువుకి కారణం అయ్యింది. అయితే అలాంటి పరిస్థితుల్లో దాదాపు 80 లక్షల లీటర్ల నీటిని ఉపయోగించి బీసీసీఐ, మ్యాచ్‌లను ఎందుకు నిర్వహిస్తోంది అన్నదే అసలు ప్రశ్న. పోనీ అక్కడి నుంచి మ్యాచ్‌లను తరలించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడన్నా, కొత్త వేదికలలో నీటి లభ్యత గురించి ఆలోచించిందా అంటే అదీ లేదు! పోయి పోయి ఎడారి ప్రాంతమైన రాజస్థాన్‌లో మ్యాచ్‌ను నిర్వహిస్తానంటే అక్కడి ప్రజలకు ఒళ్లు మండదా! ఇంతా చేసి ఈసారి ఐపీఎల్‌ మ్యాచ్‌లకు ఆదరణ అంతంత మాత్రంగానే ఉందన్న వార్తలు వినవస్తున్నాయి. ఐపీఎల్‌ మ్యాచ్‌ షెడ్యూల్‌ను సాగదీసి, వాటి గురించి అతిగా ప్రచారం చేయడం వల్ల ప్రజల్లో ఐపీఎల్‌ అంటే విరక్తి పుట్టిందన్న వాదనలు వినవస్తున్నాయి. వీటికి తోడు ఈసారి దేశవ్యాప్తంగా ఎండలు మండిపోవడంతో స్టేడియంలు వెలవెలబోతున్న దృశ్యాల టీవీల్లో కనిపిస్తున్నాయి. ఇంతజరుగుతున్నా బీసీసీఐ తన ధోరణిని మార్చుకుంటుందని ఆశించలేం. తన తప్పుని సరిదిద్దుకుంటుందని ఊహించలేం! ఎందుకంటే బీసీసీఐ ఏ పని చేసినా దాని వెనుక నూటికి నూరు శాతం ఆర్థిక కోణం ఉంటుందనే అపవాదు ఉండనే ఉంది కదా!   మండు వేసవిలో మ్యాచ్‌లను నిర్వహించినా, ఆ మ్యాచ్‌లకు ముంబైను వేదికగా చేసినా... ఇలా ఏ పని చేసినా దాని వెనుక ప్రజాకర్షణ, ప్రసార హక్కులే బీసీసీఐ నిర్ణయాలను నియంత్రిస్తాయి. వేసవిలో ఆడటం వల్ల ఆటగాళ్లు నీరసించిపోతారని హెచ్చరించినా, సదరు రాష్ట్రాల్లో కరువు తాండవిస్తోందని తెలిసినా బీసీసీఐ పెద్దగా పట్టించుకోదు. కావాలంటే డబ్బు పడేస్తాం అని కూడా అంటుంది. కానీ ఈసారి డబ్బుతోనో అధికారంతోనో పని జరిగేట్లు కనిపించడం లేదు. మహారాష్ట్ర కరువు నిధికి 5 కోట్లు అందిస్తామంటూ బీసీసీఐ చేసిన సూచనను బొంబాయి హైకోర్టు అంతగా పట్టించుకోలేదు. బొంబాయి హైకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా ఇప్పుడు బీసీసీఐ సుప్రీం కోర్టు తలుపులు తడుతోంది. మరి అక్కడి నుంచి ఎలాంటి వార్తలు వినిపిస్తాయో చూడాలి!  

ఉత్తరాఖండ్‌ తీర్పు కేంద్రానికి ఓ హెచ్చరిక!

  ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాన్ని కేంద్రం రద్దు చేస్తూ విధించిన రాష్ట్రపతి పాలన మీద, అక్కడి హైకోర్టు సుస్పష్టంగా తన తీర్పుని అందించింది. ఈ కేసుని స్వీకరించిన ఉత్తరాఖండ్‌ హైకోర్టు ఆది నుంచీ కూడా కేంద్ర ప్రభుత్వానికి చురకలు వేస్తూనే రావడంతో, కేంద్ర ప్రభుత్వానికి దిమ్మతిరిగే తీర్పు ఏదో వెలువడనుందని మొదటి నుంచీ కూడా సందేహాలు కలుగుతూ వచ్చాయి. అదే నిజమైంది!   పూర్వాపరాలు: ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 36 మంది సభ్యుల బలం ఉండగా, బీజేపీకి 28 మంది సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్‌ బలగంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి విజయ్‌బహుగుణ కొన్నాళ్లుగా అసంతృప్తితో రగులుతూ వచ్చారు. రోజులు గడిచే కొద్దీ తనకు తోడుగా మరో ఎనిమిది మందిని కలుపుకుని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు బహుగుణ. మార్చి 18 నాటికి ఈ తిరుగుబాటు తారస్థాయికి చేరుకుని, వీరంతా బీజేపీలోకి చేరేదాకా వచ్చింది. దాంతో ప్రభుత్వం మైనారటీలో పడిపోయిందంటూ కేంద్రం అక్కడ రాష్ట్రపతి పాలనను విధించింది. అయితే ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో మర్నాడు బలనిరూపణ జరగాల్సి ఉండగా ఆదరాబాదరాగా మార్చి 27నే అక్కడ రాష్ట్రపతి పాలనను విధించడం దేశం యావత్తునీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషయమై హరీశ్‌ రావత్‌ ఉత్తరాఖండ్‌ హైకోర్టుని ఆశ్రయించారు.   హరీశ్‌ రావత్‌ పిటీషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం ఆది నుంచీ కూడా కేంద్రానికి మొట్టికాయలు వేస్తూనే వచ్చింది. మరొక్క రోజులో బలనిరూపణ జరగాల్సి ఉండగా ఇంత ఆదరాబాదరాగా రాష్ట్రపతి పాలనను ఎందుకు విధించారంటూ మొదట్లోనే దుయ్యబట్టింది. హైకోర్టు ముందు కేంద్రానికి చెందిన మహామహా న్యాయవాదుల వాదనలు సైతం చిన్నబోయాయి. రాష్ట్రపతి అంగీకారంతోనే ఈ నిర్ణయం జరిగిందన్న వాదననూ కోర్టు సమర్థించలేదు. రాష్ట్రపతి కూడా ఒకోసారి తీవ్రమైన తప్పిదం చేసే అవకాశం ఉందంటూ, దేశ ప్రథమ పౌరుడికి కూడా చురకలద్దింది. ఒకదాని తరువాత ఒకటిగా న్యాయస్థానం సంధిస్తున్న ప్రశ్నలకు ఒక దశలో న్యాయవాదులు బిత్తరపోయారు. స్పీకరు ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తున్నారన్నది కేంద్రం చేసిన అభియోగాలలో ఒకటి! కానీ హరీశ్‌ రావత్ తరఫున న్యాయవాది ఆయన నిష్పక్షపాతంగానే వ్యవహరించారంటూ తగిన కారణాలు చూపడంతో, కేంద్ర న్యాయవాదులు ఒకదశలో క్షమాపణ చెప్పవలసి వచ్చింది.   హైకోర్టు చిట్టచివరకు ఘాటైన పదజాలంతో రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ తిర్పునిచ్చింది. ముందు రాష్ట్రపతి పాలనను విధించి, ఉన్న ప్రభుత్వాన్ని కూల్చడం, ఆ తరువాత మరో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని ఇవ్వడం ఏంటని న్యాయమూర్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ఇలాంటి ప్రభుత్వాలను కూల్చివేయడం సమాఖ్య స్ఫూర్తికే విరుద్ధమంటూ విరుచుకుపడ్డారు. ఇదే కనుక జరిగితే సగటు ఓటరు ప్రజాస్వామ్యం పట్ల తన నమ్మకాన్ని కోల్పోతాడంటూ హెచ్చరించారు. ఈ నెల 29న ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో బలనిరూపణ చేసుకునే అవకాశాన్ని అక్కడి ముఖ్యమంత్రికి కల్పించింది న్యాయస్థానం. ఇక తిరుగుబాటు ఎమ్మెల్యేలని కూడా న్యాయస్థానం వదిలిపెట్టలేదు. వారు చేసిన పనికి శిక్షను అనుభవించాల్సిందే అంటూ హెచ్చరించింది. వారు ఓటింగ్‌లో పాల్గొనేందుకు అర్హులా కాదా ఈ నెల 28న నిర్ణయిస్తామని తేల్చి చెప్పింది. మొత్తంగా రాష్ట్ర రాజకీయాలలో కేంద్రం వేలు పెట్టకుండా ఉండాల్సిందంటూ కోర్టు పదేపదే అభిప్రాయపడింది.   హైకోర్టు నిర్ణయం మీద సహజంగానే అక్కడి ప్రభుత్వం హర్షం వ్యక్తం చేయగా, కేంద్ర సుప్రీం కోర్టు తలుపులను తట్టేందుకు సిద్ధపడింది. బహుశా అక్కడ కూడా కేంద్రానికి చుక్కెదురు కావచ్చు. ఇదే కనుక జరిగితే రాష్ట్రపతి పాలనను తమకు ఇష్టం వచ్చిన రీతిలో ఉపయోగించుకోవచ్చుననే దురుద్దేశాలను న్యాయవ్యవస్థ అడ్డుకున్నట్లే. ఇప్పటికే 1994లో వెలువడిన ఎస్‌.ఆర్‌.బొమ్మై తీర్పులో రాష్ట్రపతి పాలను సంబంధించి సుప్రీం కోర్టు పలు కీలకమైన సూచనలు వెలువరించింది. అసెంబ్లీలో బలనిరూపణ చేసుకునే అవకాశాన్ని కల్పించాలనీ, కేంద్రం ముందుగా రాష్ట్ర ప్రభుత్వ వాదన వినాలనీ... ఇలా కొన్ని జాగ్రత్తలను అందించింది. కానీ ఉత్తరాఖండ్‌లో తగిన బలం ఉన్న బీజేపీ తన పార్టీని గద్దెనెక్కించేందుకు కేంద్రం ఇవన్నీ పెడచెవిన పెట్టినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఇలాంటి యుక్తిని ప్రయోగించి అరుణాచల్‌ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దింపగలిగింది కేంద్రం. అందుకు భారీగా అపవాదుని మూటగట్టుకుంది కూడా!   అరుణాచల్‌ సంక్షోభం అలా ముగిసిందో లేదో ఇప్పుడు ఉత్తరాఖండ్‌ మీద 356 అధికరణాన్ని (రాష్ట్రపతి పాలన) ప్రయోగించింది. ఇక్కడ కాంగ్రెస్‌ను గద్దె దింపాక, మణిపూర్‌లో కూడా మరో సంక్షోభాన్ని సృష్టించేందుకు కొందరు పెద్దలు సిద్ధంగా ఉన్న సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్రంలో ఉన్న పార్టీ, రాష్ట్రపతి పాలనను ఇలా తనకు అనుకూలంగా మార్చుకోవడం కొత్తేమీ కాదు. అందుకే ఉత్తరాఖండ్‌ సంక్షోభం మీద హైకోర్టు వ్యాఖ్యానిస్తూ, కాంగ్రెస్‌ చరిత్ర కూడా ఏమంత ఘనంగా లేదంటూ వ్యాఖ్యానించింది. స్వాతంత్రానంతరం 40 ఏళ్లలో దాదాపు 100 సార్లు రాష్ట్రపతి పాలనను విధించిన ఘన చరిత్ర కాంగ్రెస్‌ది అంటూ దెప్పిపొడిచింది. కానీ కాంగ్రెస్‌ విధానాలకు, తత్వానికి విరుద్ధంగా గద్దెనెక్కిన మోదీ ప్రభుత్వం కూడా అదే పోకడ పోవడమే ఇప్పుడు దేశప్రజలను బాధిస్తున్న విషయం. అణచివేతలోనూ, అధికార దుర్వినియోగంలోనూ... కాంగ్రెస్‌, బీజేపీలకు పెద్దగా తేడా లేదని తేలితే కనుక ఇక ఓటర్లు న్యాయం కోసం ఎటు చూడాలి!   అదృష్టం ఏమిటంటే ఇప్పుడు కోర్టులు తమ తీర్పుల విషయంలో చాలా నిక్కచ్చిగా, దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. అవసరమైతే రాష్ట్రపతిని సైతం తప్పుపడతామంటూ, ప్రజాస్వామ్యానికి దన్నుగా నిలుస్తున్నాయి. కాబట్టి పార్టీలు విఫలమైనా న్యాయవ్యవస్థ ఇంకా విఫలం కాలేదన్న సంతోషం మాత్రం సగటు జీవికి కలుగక తప్పదు. మరో వైపు ఈ తీర్పు తరువాతైనా కేంద్రం మరింత జాగరూకతతో వ్యవహరిస్తుందని ఆశించవచ్చు. ఇప్పటికే అసహనం, జాతీయవాదం, ఆర్థిక నేరాలు వంటి సమస్యలతో అట్టుకుతున్న దేశంలో... ప్రభుత్వం వేసే ప్రతి అడుగునీ ప్రజలు తీక్షణంగా గమనిస్తున్నారన్న విషయాన్ని బీజేపీ గ్రహించి తీరవలసి ఉంది. లేకపోతే రాక రాక వచ్చిన అధికారాన్ని చేజేతులా చేజార్చుకోవడం మాట అటుంచి, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదన్న అపప్రధతో మోదీ తన పాలనను ముగించాల్సి వస్తుంది.