మొహాలీ మ్యాచ్‌కు పాక్ ప్రధాని!
posted on Mar 27, 2011 @ 10:57AM
ఇస్లామాబాద్: భారత ప్రధాని మన్మోహన్ క్రికెట్ దౌత్యం ఫలించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మొహాలీలో ఈ నెల 30న జరిగే భారత్-పాక్ క్రికెట్ వరల్డ్‌కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌ను తిలకించేందుకు రావాలని మన్మోహన్ పంపిన ఆహ్వానానికి ప్రధాని గిలానీ అంగీకరించవచ్చని సంకేతాలు వచ్చాయి. ఉజ్బెకిస్థాన్ పర్యటనలో ఉన్న గిలానీకి ఈ ఆహ్వానం గురించి అధికారులు తెలపగా ఆయన చిర్నవ్వు చిందించారని సమాచారం. మొహాలీకి వెళ్లే అంశంపై ఆయన తమ అధికారులతో చర్చించారని పాక్ మీడియా కథనం. మ్యాచ్ సమయంలో ఇద్దరు ప్రధానులు అనధికారికంగా కలుసుకుంటారని మ్యాచ్ అనంతరం ఇద్దరూ తిరిగి అధికారికంగా భేటీ అవుతారాని, ఇరు దెసల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరుపుతారని పాక్ మీడియా పేర్కొంది.
కాగా, మొహాలీ మ్యాచ్‌కు మన్మోహన్ హాజరుకావద్దని జనతాపార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం స్వామి సూచించారు. ప్రధాని రాక భారత ఆటగాళ్లపై ఒత్తిడిని పెంచుతుందని చెన్నైలో అన్నారు. ముంబై దాడులకు పాక్ కారణమని భావిస్తున్న నేపథ్యంలో అక్కడి నేతలను మ్యాచ్ వీక్షించేందుకు రావాలంటూ సందేశం పంపడం.. నాటి దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన భారత జవాన్ల ప్రాణత్యాగాన్ని అవమానించడమేనన్నారు.