ఫలితాలు జగన్‌కే అనుకూలం
posted on Mar 27, 2011 @ 11:25AM
హైదరాబాద్: కడప ఉపఎన్నికల్లో గెలుపు అవకాశాలు పూర్తిగా యువనేత వైఎస్.జగన్మోహన్ రెడ్డికే ఉన్నాయని రాష్ట్ర రవాణా శాఖామంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. దీనిపై ఆయన మాట్లాడుతూ తనకు తెలిసినంత వరకు ఫలితాలు జగన్‌కే అనుకూలంగా ఉంటాయన్నారు. న్యాయంగా, సాంప్రదాయబద్ధంగా చూసినా ఆయనే గెలుస్తారన్నారు. ముఖ్యంగా, పులివెందుల, కడప స్థానాల్లో వైఎస్ కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా ఎవరూ నామినేషన్లు దాఖలు చేస్తారని తాను భావించడం లేదన్నారు. నామినేషన్లు పడకపోవడమేంటి, కాంగ్రెస్ తరపున కూడా వేయరా ఏమని ప్రశ్నిస్తే.. తాను అంత లోతుగా మాట్లాడటం లేదని, ఆపై మీరే ఆలోచన చేసుకోవాలన్నారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ వర్గం అభ్యర్థులను ప్రత్యర్థులుగా భావించక పోవడం వల్లే ఆ పార్టీకి మూడు సీట్లు వచ్చాయన్నారు. ఓవైపు జగన్ పార్టీ పెట్టి కాంగ్రెస్‌ను ఓడించేందుకు సిద్ధమవుతుంటే, మా వాళ్లేమో ఆయన మళ్లీ కాంగ్రెస్‌లోకి వస్తారని చెపుతున్నారన్నారు. అందువల్ల జగన్‌ను ఎక్కడా.. ఎవరూ కూడా ప్రత్యర్థిగా చూడటం లేదన్నారు. విజయనగరం జిల్లాలో జగన్ ఓదార్పు యాత్రకు జనం బాగానే వస్తారని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. ‘‘ఏ నాయకుడొచ్చినా చూడటానికి అన్ని పార్టీల వాళ్లూ వెళ్లడం మా జిల్లాలో సంప్రదాయం. జగన్ పార్టీలోకి మా జిల్లా కాంగ్రెస్ నేతలెవరూ వెళ్లరు’’ అన్నారు.