తెలంగాణలో ‘సమైక్యాంధ్ర’
posted on Mar 27, 2011 9:21AM
విశాఖపట్నం: తెలంగాణ ప్రాంత ప్రజల సమస్యలు, మనోభావాలు తెలుసుకునేందుకు ఏప్రిల్ 10న సమైక్యాంధ్ర యూనివర్శిటీల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బస్సుయాత్ర నిర్వహిస్తున్నట్టు కమిటీ రాష్ట్ర వ్యవస్థాపక కన్వీనర్ ఆరేటి మహేష్ తెలిపారు. శ్రీకృష్ణ కమిటీ నివేదించిన రహస్య నివేదికను బహిర్గతపర్చాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో, బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ విధి విధానాలపై తెలంగాణ రాజకీయ నేతలు వ్యక్తం చేసిన అసంతృప్తి, మీడియా మొత్తం సమైక్యాంధ్రకే అనుకూలంగా ఉందన్న తెలంగాణవాదులు అభిప్రాయాల నేపథ్యంలో ఈ యాత్ర నిర్వహించదలచినట్టు పేర్కొన్నారు. వారి సంస్కృతిని గౌరవిస్తూ నిర్వహించే కార్యక్రమానికి మేధావులు, విద్యార్థులు, పరిశోధకులు హాజరవుతారన్నారు. తెలంగాణవాదం నిజంగా ప్రజల్లో ఉందా? లేదా అమాయక తెలంగాణ ప్రజలను మోసం చేసే ఉద్యమంగా కొనసాగుతుందా? కలిసి ఉంటే, విడిపోతే వచ్చే లాభ నష్టాలు ఏమిటి? అనేది మీడియా సమక్షంలో బహిరంగ ప్రస్థావన ఉంటుందన్నారు. పర్యటనలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కెసిఆర్, కోదండరాం, గద్దర్‌లను కలుస్తామన్నారు. ఈ యాత్ర తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగానే ఉంటుందన్నారు. ఎటువంటి ఉద్రిక్తతలకు తావు లేకుండా శాంతియుతంగా నిర్వహిస్తామన్నారు. బస్సుయాత్రను అనుమతించాలంటూ గవర్నర్, రాష్ట్ర హోంమంత్రికి వినతిపత్రం సమర్పించామన్నారు. అయితే, అనుమతి ఇవ్వకున్నా బస్సుయాత్ర కొనసాగుతుందన్నారు.