తెలంగాణ పోరాట యోధుడు కన్నుమూత
posted on Mar 27, 2011 @ 11:04AM
నల్లగొండ: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సీపీఐ సీనియర్ నేత బొమ్మగాని ధర్మభిక్షం శనివారం కన్నుమూశారు. ఇటీవల ఇంట్లో జారి పడటంతో ఆయన తొంటి ఎముకకు దెబ్బతగిలింది. హైదరాబాద్‌లోని కామినేని ఆసుపత్రిలో ఫిబ్రవరి 11న శస్త్రచికిత్స జరిపారు. తర్వాత తేరుకున్నప్పటికీ వూపిరితిత్తుల సమస్య జఠిలం కావటంతో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందారు. ఆయన వయసు 89 ఏళ్లు. నల్గొండ జిల్లా మునుగోడు మండలం వూకొండి గ్రామంలో గీతకార్మికుల ఇంట 15 ఫిబ్రవరి 1922న ధర్మభిక్షం జన్మించారు. వారి కుటుంబం సూర్యాపేటలో స్థిరపడింది. ధర్మభిక్షం విద్యార్థి దశలోనే జాతీయ భావాలు అలవరుచుకున్నారు. సామాజిక రుగ్మతలపై పోరాడటం కోసం తన సహ విద్యార్థులకు శిక్షణనివ్వటానికి విరాళాలు సేకరించి ఒక వసతిగృహం ఏర్పాటు చేశారు. కమ్యూనిస్టుపార్టీ పట్ల ఆకర్షితులైన ధర్మభిక్షం 1942లో సీపీఐలో చేరారు. పార్టీలో పని చేస్తూనే పాత్రికేయునిగా తెలంగాణలోని నాటి ప్రముఖ పత్రికలైన మీజాన్, రయ్యత్, గోల్కొండల్లో పని చేశారు. నిజాంపై సాయుధపోరాటం మొదలైన తర్వాత తుపాకి చేతబట్టి యుద్ధరంగంలోకి దిగారు. సాయుధపోరాటాన్ని విస్తరింపజేశారు. ఈ క్రమంలో ఐదేళ్లకుపైగా జైలుశిక్షను అనుభవించారు. హైదరాబాద్ రాష్ట్రం భారత్‌లో విలీనమైన తర్వాత 1952లో జరిగిన ఎన్నికల్లో సూర్యాపేట నుంచి అసెంబ్లీకి ఎన్నికై భారీ మెజార్టీతో గెలిచారు. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం అనంతరం 1957, 1962లలో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1991, 96లలో నల్గొండ స్థానం నుంచి వరుసగా రెండుసార్లు ఎంపీగా గెలిచారు.